మనిషి, మృగము సమాధానముతో జీవించగల్గునా?
“మనిషి మృగము అన్యోన్యతగల నమ్మకముతోవుండే పరదైసు గడపదగ్గర నిలుచునివున్నానాయని అనిపించింది నాకు.” అలా జాయ్ ఆడంసన్, అనే ఆవిడ కీన్యాలోని ఊరా నది ఒడ్డున నీళ్లు త్రాగుటకై వచ్చిన వివిధ పక్షులను జంతువులను తిలకిస్తూ అన్నమాటలవి. అందులో మరో వింత గొలిపే దృశ్యమేమిటంటే ఆమెప్రక్కనే ఓ జంతువు ప్రశాంతముగా కూర్చోవడమే—ఒక పెద్ద ఆడుసింహము!
జాయ్ ఆడంసన్ వ్రాసిన బార్న్ ఫ్రీ అనే పుస్తకంద్వారా లక్షలాదిమంది తెలిసికోగల్గిన ఎల్సా అను పేరుగల ఈ ఆడుసింహమును గూర్చి ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? ఏమీలేదు, అదొక సాధారణమైన ఆడు సింహమే. అది మనుష్యులతో ప్రశాంతంగా జీవించడానికి నేర్చుకొన్నది, అదే దాని ప్రత్యేకత.
ఆ తర్వాత బార్న్ ఫ్రీ అనే సినిమా తీసినప్పుడు ఎల్సా మాదిరి నటించడానికి అనేక సాధువైన ఆడు సింహాలనుపయోగించారు. అందులో ఒకదాని పేరు మారా. మొదట్లో అది కొంచెం అనుమానాస్పదంగానే వున్నది గానీ ఆతర్వాత అది దగ్గరికి రానిచ్చేది, క్రొత్త మానవ స్నేహితులను దూరంగా ఉండనిచ్చేది కాదు. దాన్ని శాంతపరచుటకుగాను జాయ్ భర్త, జార్జి ఆడంసన్ తన గుడారాన్ని మారా ఆవరణ దగ్గరికి మార్చుకున్నాడు. చివరికి ఆడంసన్ తన గుడారాన్ని మారా ఆవరణలోనికి మార్చేశాడు. “ఆ తర్వాతి మూడు నెలల పాటు అది (నా గుడారం) లోనే రోజూ పడుకునేది సాధారణంగా నేలమీద చాచుకొని నా పడక ప్రక్కన, కొన్నిసార్లు పడకమీదే పడుకునేది. . .అది నా వ్యక్తిగత రక్షణ గూర్చి ఎన్నడూ ఎటువంటి భయం కల్గించలేదు,” అని అతడు బ్వానా గేమ్ అను తన పుస్తకంలో రాశాడు.
“మాకిష్టమైన ఆట ఏమంటే, నేను గడ్డివాములో దూరి వెల్లికలా పడుకోవడం. మారా, సింహము పొంచియున్నట్లే తన పొట్టను నేల వరకు ఆన్చి మెల్లగా అడుగులు వేస్తూ దొంగమాటుగా వచ్చి ఆఖరున ఒకసారి మెరుపులాగే ఒకే గెంతుతో నా మీదికి దూకేస్తుంది. తన పంజా యొక్క పదునైన గోళ్లు నన్ను తాకకుండా చాలా జాగ్రత్తపడేది, నాకే హాని చేయలేదు,” అని ఆడంసన్ గారు వ్రాశారు.
ఎల్సా పాత్ర ధరించిన మరొక ఆడుసింహము పేరు గర్ల్. సినిమా తీయడం పూర్తి అయిన తర్వాత గర్ల్ అను సింహాన్ని అడవిలోనికి వదలివేయగా అది అక్కడ రెండు కూనలను ఈనింది. ఆడంసన్ స్నేహితులిద్దరు దాని స్థావరాన్ని కనుక్కున్నారు. ఆడంసన్ ఇలా వ్రాశాడు: “అది ఈనిన స్థలానికి కొన్ని అడుగుల దూరం (షుమారు మీటరు) వెళ్లడానికి ఎంతో సాహసం చేసిన వీరిద్దరిని అది ఎంతో నమ్మకముతో మంచి స్వభావముతో దగ్గరకు రానిచ్చింది . . . గర్ల్ యొక్క స్వభావమెంత మెచ్చుకోదగినదంటే ఆ యిద్దరిలో (ఒకడు) దానికి అపరిచితుడే. ఆడంసన్ విషయానికి వస్తే అది తన కూనలను అతనిని తాకనిచ్చింది గానీ ఇతర సింహాలనైతే పారద్రోలింది.
ఒక కౄర సింహాన్ని సాధుచేయుట
ప్రతిసింహానికి లక్షణాలలో వ్యత్యాసమున్నది. ఇక్కడ జాయ్ ఆడంసన్ ఎల్సాను పెంచుతూవుండగా ఉత్తర రొడేషియా (ఇప్పుడు జాంబియ) లోని దక్షిణ ప్రాంతాన, నార్మన్ కార్ అను ఒక అటవీఅధికారి అలాగే రెండు మగ కూనలను పెంచుతున్నాడు. రెండింటిలో ఒకటి బిగ్‌బాయ్, చాలా స్నేహంగా వుండేది. ఇంకొకటి, లిటిల్‌బోయ్ అనేది చిరచిరలాడేది. రెండవదాన్ని గూర్చి రిటర్న్ టు ది వైల్డ్ అనే తన పుస్తకంలో కార్ ఇలా వ్రాశాడు:
“లిటిల్‌బోయ్ అనే కూన ఇటువంటి ఏదో ఒక లక్షణాల్లో వున్నపుడు దానిప్రక్కనే నేను చతికిలబడి కూర్చునేవాన్ని, అది నన్నుచూచి గుర్రు గుర్రు మనేది, దాని కున్న రెండు అంగుళముల గోళ్లతో ఎప్పుడైనా విసిరే అవకాశమున్నందున దానికి కొంచెం దూరంగానే కూర్చునేవాడిని. ఒక్కొక్క అంగుళం దగ్గరికి జరుగుతూ దానితో మృదువుగా మాట్లాడుతూ, బుజ్జగించే వాడిని; చివరకు దాన్ని తాకినపుడు అదింకా గుర్రు మంటూవుందిగానీ కొంచెం తక్కువ శబ్దంతో. జూలుతోవున్న దాని మెడచుట్టూ నాచెయ్యి వేసి ఎద మీద నిమిరినప్పుడు అది ఎంతో ఉప్పొంగి, బిగించుకుపోయిన తన కండరాలన్ని సడలించబడినవన్నట్లు విశ్రమిస్తుంది . . . తనను బుజ్జగించమన్నట్లు తన తలను నా ఒడిలో పెడుతుంది.”
కార్ పుస్తకానికి వ్రాసిన తొలిపలుకులలో ఆ దేశానికి గవర్నర్ జనరల్‌గా నున్న డల్హౌసీ యొక్క జమీందారు, కార్ విడిదిగృహము దగ్గర మైదానంలో విచ్చలవిడిగా తిరుగుతున్న రెండేండ్ల వయస్సుపైబడిన ఆ సింహములను కళ్లారా చూచిన ఒక సంఘటనను గూర్చి ఇలా తెలియజేస్తున్నాడు. కార్ ఈల వేయగా వాటి ప్రతిస్పందన ఇలా వుందని ఆ జమీందారు వివరిస్తున్నాడు: “వాటి యజమానుని ఈల విన్నవెంటనే అవి గంతులేసుకుంటూ వచ్చి వాటి విశాలమైన తలలను ఆయనకేసి రుద్దినవి, అప్పుడే వాటి అభినందనా గర్జనతో ఆనందాన్ని వెలిబుచ్చినవి. ఆయన యెడల వాటికున్న మక్కువ తక్కువ కానేలేదు.”
సింహాలకు మనుష్యులంటే సహజంగా భయమే, అందుకే అవి సాధారణంగా మనుష్యునికి కనబడకుండ తప్పించుకు తిరగాలని ప్రయత్నించును. సింహాలలోను మరియు ఇతర మృగాల్లోను వుండే ఈ స్వభావసిద్ధగుణమును గూర్చి బైబిలునందు స్పష్టముగా వర్ణించబడినది. (ఆదికాండము 9:2) వాటికి ఆ భయమే లేకపోతే మనిషి వాటికి అత్యంత సులభమైన ఆహారమైయుండేవాడు. అయినను కొన్ని మృగాలు మనిషిని—తినేవాటిగా తయారయినవి.
“నియమానికి మినహాయింపులు”
ఈ విషయంలో నిపుణుడైన రోజర్ కారాస్ ఇలా వివరిస్తున్నాడు: “పెద్దపులుల జాతులన్నింటిలోను దాదాపు కొన్ని మనిషినే ఆహారంగా వెదికే అసాధారణమైనవి ఉన్నట్లు కనబడుతుంది. అవి నియమానికి మినహాయింపులైయున్నవి . . . మనిషి సాధారణంగా [పెద్దపులులతో] మంచి సమాధానముతో జీవించగలడు.”
మనిషి వాహనములో కనబడకుండా కూర్చొనివుంటే చాలా జంతువులు పసికట్టలేవట. ఇందుచేతనే మానవులు సింహాలను అతిదగ్గరగా ఫోటోలు తీయగలుగుచున్నారు. “అయితే తలుపుతీశామంటే అపాయం కొనితెచ్చుకున్నట్లే, ఎందుకంటే మనిషి జాడను గుర్తుపట్టి అకస్మాత్తుగా కనబడినందుకు మరింత బెదురుతో వాటి రక్షణకొరకే అన్నట్లు అవి అతిసులభముగా దాడి చేయగలవు . . . మోటారు వాహనమునుండి దిగి అకస్మికముగా వాటికి కనబడేదానికంటే అడవిలో సింహాన్ని ముఖాముఖిగా ఎదుర్కోవడములోనే నిజానికి అపాయము తక్కువ,” అని మాబర్లీస్ మామల్స్ అఫ్ సదర్న్ ఆఫ్రికా అనే పుస్తకం హెచ్చరిస్తుంది.
చిరుతపులుల విషయమేమిటి?
మనిషిని—తినే చిరుతలు కూడా ఈ నియమ మినహాయింపులో చేరియున్నవి. జోనాతాన్ స్కాట్ తన ది లెపర్డ్ టేల్ అనే పుస్తకంలో ఇలా వివరిస్తున్నాడు: “చీరాకుచెందని, ఆరోగ్యవంతంగా వున్న చిరత బిడియంగల ప్రశాంతమైన ప్రాణి. మనిషికి బాగా భయపడే జంతువు. ఎదురెదురుగా కనబడితే సాధారణంగా అది అతి దగ్గర్లోవున్న పొదల మాటున దాక్కొనుటకే పరుగిడుతుంది.”
స్కాట్ కెన్యాలోని మాసాయి మారా గేమ్ రిజర్వ్‌ప్రాంతంలో తాను చువై అని పేరుపెట్టిన ఒక ఆడుచిరుత కదలికను అధ్యయనం చేయుటకే కొన్ని నెలలు గడిపాడు. చువై స్కాట్ మోటారు వాహనమునకు క్రమంగా అలవాటు పడింది, డార్క్ మరియు వైట్ అని పిలువబడిన దాని కూనలు ఒక సందర్భములో ఆయన కారు దగ్గరికి వచ్చి దాన్ని పరిశీలించినవి. చిరుత బాహ్యంగా ఉదాసీనముగా నున్నను దాని వెనుక వెచ్చని అనురాగం ఎంతో దాగివుందని స్కాట్ నమ్ముచున్నాడు.
ఇతరులు చిరుతలోని అంతరంగిక అనురాగ స్వభావాన్ని అనుభవించారు. ఉదాహరణకు, జాయ్ ఆడంసన్ తాను పెన్నీ అని పిలిచే ఒక ఆడ అనాధ చిరుత కూనను పెంచింది. అడవిలోనికి వదలిన తర్వాత అది గర్భందాల్చి కూనలను ఈనింది. తన మానవ స్నేహితులు దాని దగ్గరికి వచ్చినపుడు, అదివారికి కనబడి వారువచ్చి క్రొత్తగా ఈనిన కూనలను చూడండని బ్రతిమాలింది. స్థావరం దగ్గర ధీమతోవున్న తల్లి ప్రక్కన్నే కూర్చున్న ఆడంసన్ ఆ అందమైన దృశ్యాన్ని ఇలా వర్ణించింది: “కూనలు ముందు కాళ్లమధ్య కదలాడుచుండగా అది మా చేతులు నాకింది, అన్నీ ఎంతో ఉల్లాసంగావున్నవి. ఆఫ్రికా జంతువులన్నింటిలో చిరుతలు అత్యంత అపాయకరమైనవనీ, కూనలతోవున్న ఆడుచిరుత మరీ భయంకరమైనదని సర్వసాధారణ నమ్మకము.” అయితే పెన్నీతో ఆడంసన్‌కువున్న అనుభవాన్ని బట్టి చూస్తే “అటువంటి నమ్మకాలన్నీ ఒక అబద్ధపు పుట్ట” యని నిరూపించవచ్చునని ఆమె అన్నది.
హేరియట్ అని పేరుగల “మంచిస్వభావమున్న” మరో ఆడు చిరుత ఉత్తర ఇండియాలోని అర్జన్ సింగ్‌నకు అంతకంటె మంచి అనుభవాన్ని అందించింది. సింగ్ దీన్ని పసికందునుండి పెంచి, తనతోటకు ఆవలివైపుననున్న అడవిలో అది స్వయంగా వేటాడగల్గునట్లు శిక్షణనిచ్చాడు. శిక్షణలో భాగంగా చిరుత తనపై దాడి చేయవలెనంటూ దాన్ని వుసిగొల్పేవాడు. “నేను క్రిందికి వంగి దానిని దూకమన్నప్పుడు అది నాకెదురుగా వచ్చింది . . . గానీ నామీద దూకినపుడు మాత్రం నాతలమీదుగా ఎగిరి నా వీపుమీదుగా జారిపోయేది, నా వీపుమీద ఒక గీటు కూడా పడకుండ ఎంతో జాగ్రత్త పడేది.”
సింగ్‌గారి ఈలీ అనే కుక్కతో ఆ చిరుతపులి ఆడే ఆట పద్ధతే ఇంకా వింతగావుండేది. “[ఆ చిరుత] తన తుంటి మీద కూర్చొని కుక్కదాన్నికొడుతూ వుంటే ఇది కూడా గుద్దుతూవుంటుంది—గానీ ఎదురుగావున్నదాన్ని క్రింద పడవేయుటకు ప్రయత్నించలేదు. తన పెద్ద పెద్ద పంజాలు ఈలీ మెడచుట్టు, తల, శరీరం క్రిందివరకు అతిసున్నితంగా, మెత్తగా త్రిప్పుతూవుంటుంది.”
హేరియట్, ఆ ప్రక్కనే వున్న అడవికి ఇల్లు వదలిపోయిన తర్వాత మనిషి, కుక్క, చిరుతల మధ్యనున్న స్నేహబంధం కొనసాగింది. “చిరుతలను నమ్మకూడదని ఎవరైన అంటే, నేను ఆరుబయట పడుకొని నిద్రపోతున్నపుడు పరస్పర అభినందనలు తెలియజెప్పుకొనుటకు హేరియట్ మధ్యరాత్రి నా తోటలోనికి వచ్చి నన్ను అనేకసార్లు లేపిన అనేక సందర్భాలను జ్ఞాపకం చేసుకోవలసి వస్తుంది”, అని సింగ్ ముగిస్తున్నాడు.
చివరకు హేరియట్ రెండు కూనలను ఈనింది. వరదవల్ల దాని స్థావరం మునిగిపోయినప్పుడు ఆ చిరుత ఒక్కోకూనను ఒక్కసారి తననోట కరుచుకొని క్షేమంగావున్న సింగ్ ఇంటికి తెచ్చింది వరద తగ్గిపోయిన తర్వాత తిరిగి, అడవిలో క్రొత్త స్థావరంలో తన కూనలను ఒక్కొక్కదాన్ని చేరవేసింది.
ఆఫ్రికా ఏనుగు
ఆఫ్రికా ఏనుగును మచ్చిక చేసుకొనుటకది ఎంతో కౄరమైందని చెప్పబడింది. అయితే సత్యములు వాటికి భిన్నముగా ఉన్నవని పలువురు ప్రజలు రుజువుచేశారు. దానికోవుదాహరణము, మూడు ఆఫ్రికా ఏనుగులకు అమెరికాకు చెందిన రాండాల్ మూరె అనే వ్యక్తికి మధ్యనున్న అనురాగ బంధమే. ఈ ఏనుగులు, దక్షిణాఫ్రికాలోని క్రూగార్ నేషనల్ పార్క్‌లో పట్టుకొని వుంచిన ఏనుగుపిల్లల గుంపులోని భాగమే, అవి అమెరికాకు రవాణ చేయబడినవి. సకాలములో వాటికి సర్కస్‌లో పని చేయుటకు శిక్షణ ఇచ్చారు, అందులో అవి చక్కగా చేసినవి. వాటి యజమానుడు చనిపోగా ఆ మూడింటిని మూరెకు ఇచ్చారు, తిరిగి ఆఫ్రికాకు పంపించారు.
ఓవల్లా, దుర్గా అనే పేరుగల రెండు ఆడు ఏనుగులు 1982 లో బోపూతాట్స్వానా యొక్క పిలానెస్‌బర్గ్ రిజర్వ్‌లోనికి ప్రవేశపెట్టబడినవి. అపుడు ఆ పార్క్‌లో అనాథ ఏనుగు పిల్లలుండేవి, అవి దీనావస్థలో ఉన్నవిగనుక పెద్ద ఏనుగుల ఆలనాపాలన వాటికి అవసరమైంది. సర్కస్ శిక్షణపొందిన ఓవల్లా, దుర్గా ఈ పాత్ర నిర్వహించగలవా?
తన ఏనుగులు ఆ 14 అనాధ ఏనుగులను దగ్గరకు తీసుకున్నవని ఆ పార్కునకు ఇంకా అనాధ ఏనుగులను తరలించ వలెనని ఒక్క సంవత్సరం తర్వాత మూరెకు సమాచారమందినది. నాల్గు సంవత్సరముల తర్వాత తానే వాటిని స్వయంగా చూడాలని మూరె తిరిగి వచ్చాడు. సిలానెస్‌బర్గ్ పర్వతాల్లో వాటికొరకు చాలా కాలం వెదకవలసి వస్తుందేమోననుకున్న మూరె, తాను వచ్చిన వెంటనే ఓవల్లా, దుర్గాలను పెద్ద ఏనుగుల గుంపులో చూచి ఆశ్చర్యపడ్డాడు. “నా మొదటి ఆవేశమేమంటే, వాటి దగ్గరికి పరుగెత్తుకెళ్లి, వాటిని ఆలింగనము చేసికొని, గొప్పగా పొగడాలనుకున్నాను. ఆ ఆలోచనకు స్వస్తిచెప్పాను,” అని బ్యాక్ టు ఆకా అనే తన పుస్తకంలో అతడు వ్రాశాడు.
మొదట ఓవల్లా, దుర్గాలు వాటి పాత స్నేహితున్ని గుర్తించాలి. అవి తమ తొండములతో చాపిన చేయిని ముట్టి పరిశీలించాయి. “ఓవల్లా అయితే నామీదుగా తొండంపైకెత్తి తర్వాత ఆజ్ఞ ఇవ్వమన్నట్లు నిల్చుంది. మిగతావన్ని చుట్టుమూగి నిశ్చలంగా నిల్చున్నవి. నేను సమ్మతించాను. ‘ఓవల్లా . . . కాళ్లు తొండంపైకెత్తు!’ ఓవల్లా అన్నాడు. సర్కస్ రోజుల్లో వందనం చేసేపద్ధతిలో వెంటనే తన ముందరి పాదములను గాలిలోనికి ఎత్తి, తన తొండాన్ని ఆకాశంలో తిప్పింది. ఏనుగు ఎన్నటికి మర్చిపోదని మొదట చెప్పిందెవరు?
మూడు సంవత్సరముల తర్వాత అక్టోబర్ 1989 లో ఓవల్లా జ్ఞాపక శక్తికొరకు మరో పరీక్షపెట్టబడింది. ఏడు సంవత్సరముల క్రితం ఏనుగులను ఆపార్కులో ప్రవేశ పెట్టినపుడు అతడు చేయని ప్రయోగాన్ని మూరె చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓవల్లా అతని మాటవిని వంగి దాని వీపుమీద ఆయన్ని కూర్చోనిచ్చింది. అతడు 30 అడవి ఏనుగులమధ్య దానిపై కూర్చొని పోవుటచూచిన దూరదర్శని ప్రేక్షకులు ఆనందపరవశులయ్యారు. మేల్కొలుపు! తో ఇచ్చిన ఇంటర్వ్యూలో మూరె “దీన్ని నేను ప్రచారంకోసం చేయలేదుగానీ ఒక ఏనుగుకు ఎంతటి జ్ఞానము, అనురాగబంధమున్నదో తెలిసికొనగోరే కుతూహలముతోనే ఇలా చేశాను” అని అన్నాడు. పిలానెస్‌బర్గ్ పార్క్‌లోని అనాథలు ఓవల్లా, దుర్గాల జ్ఞానయుక్తమగు పరామర్శక్రింద వర్థిల్లినవి.
నిజమే, మనిషి మృగము మధ్య సహవాస సంఘటనలు ఈనాడు సర్వసాధారణమేమి కాదు; అందుకు ఎంతో వ్యయప్రయాసాలవసరం. సామాన్యుడు అడవికివెళ్లి సింహములను, చిరుతలను, ఏనుగులను సమీపించుటకు ప్రయత్నించుట నిజంగా బుద్ధిహీనతే అవుతుంది. అయితే ఈనాడు మానవులు కౄరమృగాలమధ్య అట్టి స్నేహం అరుదు గనుక భవిష్యత్ సంగతేమిటి? అట్టి పరిస్థితి ఉండునా? (g91 8/8)
[8వ పేజీలోని బాక్సు/చిత్రం]
సింహాలను సాధు చేయవచ్చును
“రండి, నన్ను నా సింహాలతోపాటు ఒక ఫోటో తీయండి,” అని దక్షిణాఫ్రికాలోని హార్ట్‌బీస్పూర్టడమ్ స్నేక్ అండ్ ఆనిమల్ పార్క్ డైరెక్టర్, జాక్ సీయులె అన్నాడు. వాటి రక్షణ వలయానికి బయటనుంచియే ఫోటోలు తీయనిస్తాడనే నిరీక్షణతో నేను వణకుతూనే ఆయన వెంట వెళ్లాను.
వాటి ఆవరణ పరిశుభ్రంగానేవుంది, చుట్టున్న చెట్లనుండి నీడ ఎంతో పడుతుంది. తమ శిక్షకుడు, ఒక సహాయకునితో ఆ ఆవరణలోనికి ప్రవేశించగానే తొమ్మిది బలమైన సింహాలు అతనిని గుర్తుపట్టినవి. సింహాలు స్నేహపూర్వకమైన గర్జనలు చేస్తూ, ఉల్లాసంగా అటుఇటు తిరిగినవి.
“లోపలికి రండి,” అన్నాడు జాక్, గానీ నేను విననట్టే నటించాను. “లోపలికిరండి,“ అని మరల పెద్దగా పిలిచాడాయన. సింహాల బారినుండి తమనుతాము కాపాడుకొనుటకు వారి దగ్గర వున్నదల్లా చిన్నకర్రలే! భయంతో నా గుండె వేగంగా కొట్టుకుంటుండగా ధైర్యంతెచ్చుకుని చివరకు లోపలికి వెళ్లాను. జాక్ ప్రేమతోవాటిని బుజ్జగిస్తూవుండగా త్వరత్వరగా ఫోటోలు తీశాను. మేమంతా క్షేమంగా బయటికి వచ్చినపుడు అబ్బ నేనెంత ఊపిరి పీల్చుకున్నానో! గానీ భయపడకుండ వుండవలసింది.
“మేము కర్రలతో లోపలికి వేళ్లే కారణమేమంటే, సింహాలు అనురాగంగలవి, అవి ప్రేమతో కొరికే అలవాటున్నవి. మా చేతులబదులు ఆ కర్రలను నములునట్లు వాటిని మేము పట్టుకుని వెళ్తాం,” అని జాక్ తర్వాత వివరించాడు. జాక్, అతని సింహాలు నమీబియాలోని ఇటోషా అనే నేషనల్ పార్క్ నుండి అప్పుడే తిరిగి వచ్చారు. అంతదూరం అడవిలోనికి ఎందుకతడు వాటిని తీసుకువెళ్లాడు? ఆయనిలా చెప్పాడు:
“నమీబియ అడవుల్లో పెరిగే సింహాల సంఖ్యను అదుపులో పెట్టుటకు శాస్త్రజ్ఞులు చేసేపనులను గూర్చి డాక్యుమెంటరీ ఫిలింతీయడానికి వాటినుపయోగించారు. గానీ సింహాలు పెరిగిన ఈచోటనే జీవించాలని కోరుకుంటున్నవి. నమీబియాలో అవి నా ట్రక్కును చూచినవెంటనే దాని దగ్గరకు వచ్చాయి. వాటిని ఇంటికి తీసుకొని రావడంలో ఏకష్టంలేదు.—ఉచితవ్యాసం.
[క్రెడిట్ లైను]
Courtesy Hartebeespoortdam Snake and Animal Park
[9వ పేజీలోని చిత్రం]
అఫ్రికా అడవిలో రాండాల్ మురె తన ఏనుగులతో