కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 9/8 పేజీలు 19-27
  • అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ప్రవచనమును నెరవేర్చుటకు
  • రాజ్యపనియొక్క విస్తరణ
  • క్రొత్త కార్యక్రమము అవసరతను తీర్చును
  • సేవచేయుటకు అర్హులగుట
  • భార్యల సహకారము
  • పనిచేసే ఆధికత్య కొరకు కృతజ్ఞత
  • పోతపోసి నిలబెట్టు నిర్మాణము
  • ఇంజనీరింగ్‌ కార్యాలయములు
  • ఇటీవలి నిర్మాణ ప్రాజెక్టులు
  • అవసరతను ఎదురుచూచుట
  • భవిష్యత్‌ అవసరతలను సంసిద్ధమగుట
  • విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు వారు సేవచేస్తున్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
    మన రాజ్య పరిచర్య—2006
  • రాజ్య విస్తరణయందు పాలుపంచుకొనుట
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 9/8 పేజీలు 19-27

అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా

ఈజిప్టు పిరమిడ్లు, చైనా సరిహద్దు గోడవంటి నిర్మాణాలను చూచి అనేకులు విస్మయమొందెదరు. నాలుగు వందల మీటర్ల ఎత్తున్న ఆధునిక ఆకాశ హర్మ్యాలు కూడా సంభ్రమాశ్చర్య పూరితమైనవే. అయినను, మరొక భవన నిర్మాణ కార్యక్రమ విశిష్టతలు కూడ అంతే ఆశ్చర్యకరమైనవి.

స్వచ్ఛంద సేవకులు ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్ది పెద్ద పెద్ద నిర్మాణములను చేపట్టుచున్నారు. ఈ స్వచ్ఛంద సేవకులలో అనేకులు భవనాలు నిర్మించబడుచున్న దేశములకు చెందినవారే. అయితే అదనపు సహాయము తరచు అవసరము గనుక రవాణా ఖర్చుల నిమిత్తము తమ స్వంత ద్రవ్యాన్ని లక్షలాది డాలర్లు వెచ్చించి యితర దేశాలనుండి పనివారు సుదూర ప్రాంతమందున్న నిర్మాణపు స్థలాలకు వస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవకులలో అనేకులు పని చేసేందుకు సెలవు తీసుకుంటున్నారు, మరికొందరు ఉద్యోగాలకు దీర్ఘకాల సెలవుపెట్టి త్యాగము చేస్తున్నారు. తద్వారా వారు చెప్పుకోదగినంత ఆదాయాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.

బ్రూక్లిన్‌, న్యూయార్క్‌ నందలి యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయము నుండి నిర్దేశించబడిన అంతర్జాతీయ స్వచ్ఛంద సేవక నిర్మాణ పథకము గుర్తింపదగిన ఈ సహాయ ప్రయత్నములో కనబడుచున్నది. నవంబరు 1985లో ఈ నిర్మాణ పథకము ప్రారంభమైనప్పటి నుండి 3,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు తమ స్వంత ఖర్చులు భరించి ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా మరి యితర ద్వీపాలలో 30 నిర్మాణ స్థలాలకు వెళ్ళారు.

ప్రస్తుతము దాదాపు 25 దేశాలలో 600 మంది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారు. వారిలో 400 కంటె ఎక్కువ మంది ఒక సంవత్సరము లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాల నియామకములను కల్గియున్నారు. వీరికి “అంతర్జాతీయ సేవకులని” పేరు పెట్టారు. మిగిలిన వారు రెండు వారముల నుండి మూడునెలల కాలము కొరకైన స్వల్ప-కాల నియామకములను కల్గియున్నారు.

ఈ పనివాళ్లంతా తమ నైపుణ్యములను, శ్రమ శక్తిని ఉచితంగా ఎందుకు ధారపోస్తున్నారు? ఇట్టి వ్యక్తిగత త్యాగాలు చేయుటలో అంతటి ప్రాముఖ్యత గలదని వారెందుకు పరిగణిస్తున్నారు?

బైబిలు ప్రవచనమును నెరవేర్చుటకు

అంతర్జాతీయ నిర్మాణపు కార్యక్రమమునకున్న అద్భుతమైన స్పందనకు కారణము ఒక ప్రశ్నకివ్వబడిన సమాధానమందు కనుగొందుము. పందొమ్మిది వందల సంవత్సరముల కంటె ముందు యేసుక్రీస్తు అపొస్తలులు ఆయనను ఇట్లడిగారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేమిటి?” ప్రపంచవ్యాప్త యుద్ధాలు, ఆహారకొరతలు, తెగుళ్లు, భూకంపముల వంటివాటిని వర్ణించిన పిదప, యేసు యిలా చెప్పెను: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:3, 14.

యేసు చెప్పిన ప్రవచనము నెరవేరుచున్న సమయమిదేనని ఈ స్వచ్ఛంద సేవకులు గ్రహించారు. కాబట్టి ఈ విధానమునకు అంతము రాకముందు రాజ్యప్రకటనను వృద్ధిచేయుటకు తాము చేయగల్గే దానినంతటిని చేయుటకు వారు సంతసించుచున్నారు. రాజ్య వర్తమానమును ముద్రించి, పంచిపెట్టగల్గే వసతి సౌకర్యాలను నిర్మించుటకు అట్టి వ్యక్తులు చేయుచున్న ప్రయత్నాలను నిర్దేశించుటకు ఈ అంతర్జాతీయ నిర్మాణ పథకము నెలకొల్పబడింది.

రాజ్యపనియొక్క విస్తరణ

దేవుని రాజ్యమే మానవులకు ఏకైక నిరీక్షణయని చూపించే ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! పత్రికలు యెహోవాసాక్షులు కలిగియున్న ముద్రణా వసతులలో గత సంవత్సరము 67,85,09,507 ప్రతులు ముద్రించబడినవి. అనగా మీరు చదువుచున్న పత్రికల వంటివి ప్రతి పనిదినమున ముద్రణా యంత్రముల నుండి 20 లక్షల కంటె ఎక్కువ ముద్రించబడుచున్నవి! అదనంగా, బైబిళ్లు, పుస్తకాలు, చిన్న పుస్తకాలు బ్రోషూర్లు కోట్లకొలది ముద్రించబడి పంచిపెట్టబడుచున్నవి.

వీటిలో అతి పెద్ద ముద్రణాలయాలు బ్రూక్లిన్‌ న్యూయార్క్‌ నందలి యెహోవాసాక్షుల అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమందును దాని సమీపాన న్యూయార్క్‌ వాల్‌కిల్‌ నందును ఉన్నవి. అయితే, 1950 మరియు 1960 దశాబ్దములలో అనేక ముద్రణాలయాలు అమెరికా వెలుపల కూడా నిర్మించబడినవి. ఆ విధంగా 1970 నాటికెల్లా జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, ఇంగ్లండ్‌, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్‌ల్యాండ్‌, ఫ్రాన్స్‌ నందు యెహోవాసాక్షులచే నడిపించబడుచున్న ముద్రణా వసతులలో ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!లు ఉత్పత్తి చేయబడినవి.

పిమ్మట, 1972, 73లలో ఈ పత్రికలు మరి ఆరు దేశాలలో యెహోవాసాక్షుల ముద్రణాలయములందు కూడా ఉత్పత్తి చేయబడడం ప్రారంభమైనవి, అవి: జపాన్‌, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, ఘానా, నైజీరియా, ఫిలిప్పైన్స్‌ దేశాలు. ఆ తదుపరి సంవత్సరములలో రాజ్యపని విస్తరించే కొలది, మరింత ఎక్కువ ముద్రణా సామర్థ్యము గల్గిన వాటితో కూడిన క్రొత్త బ్రాంచి కార్యాలయముల నిర్మాణములు మొదలైనవి. ఈ శరవేగ విస్తరణను వివరించేందుకు ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!ల కొరకు క్రొత్త ముద్రణా యంత్రములతో కూడిన బ్రాంచి సముదాయములు ఈ క్రింది తేదీల ప్రకారము ప్రతిష్టించబడినవని గమనించండి:

గ్రీస్‌, జనవరి 16, 1979; స్వీడన్‌, డిశంబరు 23, 1980; బ్రెజిల్‌, మార్చి 21, 1981; కెనడా, అక్టోబరు, 10, 1981; ఇటలీ, ఏప్రిల్‌ 24, 1982; రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మే 8, 1982, జపాన్‌, మే 15, 1982; ఆస్ట్రేలియా, మార్చి 19, 1983; డెన్మార్క్‌, మే 21, 1983; స్పెయిన్‌, అక్టోబరు 9, 1983; నెదర్లాండ్స్‌, అక్టోబరు 29, 1983; జర్మనీ, ఏప్రిల్‌ 21, 1984; ఇండియా, జనవరి 20, 1985; దక్షిణాఫ్రికా, మార్చి 21, 1987.

అంతేకాకుండా, క్రొత్త బ్రాంచి కార్యాలయములు లేదా పాతవాటికి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి ప్రతిష్టించిరి. అవి కోటె డి ఐవరీ, ఫిబ్రవరి 27, 1982; టాహిటి, ఏప్రిల్‌ 15, 1983; ఇంగ్లండ్‌, అక్టోబరు 2, 1983; ఫిన్‌ల్యాండ్‌, మే 5, 1984; నార్వే, మే 19, 1984; మార్టినిక్‌, ఆగస్టు 22, 1984; పెరూ, జనవరి 27, 1985; మెక్సికో, ఏప్రిల్‌ 13, 1985; వెనెజ్యులా, ఏప్రిల్‌ 21, 1985; మరియు ఫ్రాన్స్‌, మే 4, 1985.

కొన్ని బ్రాంచిల నిర్మాణపు పనిలో సాక్షులు కాని పనివారు జీతము కొరకు పనిచేసినను, దానిలో అధిక శాతం యెహోవాసాక్షులు తామంతటతామే ఆ పని చేశారు. వారిలో అనేకులు నిర్మాణపు వృత్తిలో నైపుణ్యము లేనివారైనను వేలాదిమంది తమ సేవలను స్వచ్ఛందముగా అందించారు.

యెహోవాసాక్షుల రాజ్య ప్రచారపు పని విస్తరించే కొలది, విస్తృత వసతులు అవసరమైనవి. ఇవన్నీ ఎక్కువ సామర్థ్యముతో ఎలా నిర్మించబడగలవు?

క్రొత్త కార్యక్రమము అవసరతను తీర్చును

ఈ అంతర్జాతీయ నిర్మాణపు పనియొక్క అసాధారణ అభివృద్ధితో సహకరించి, సంస్థీకరించుటకు, ప్రత్యేక స్వచ్ఛంద సేవకుల కార్యక్రమము రూపు దిద్దుకొని విస్తరించబడెను. “నిర్మాణ కార్యక్రమము సాగుచున్నప్పుడు, నిర్దిష్టమైన నిపుణులు కొన్ని సమయాలలోనే అవసరము వస్తారు” అని కార్యక్రమ పర్యవేక్షణాధికారులలో ఒకరు వివరించారు. “పునాది వేసేటప్పుడు పైకప్పువేసే వారి అవసరముండదు. గనుక, ఈ విషయాలను సమన్వయపర్చుటకు, బ్రూక్లిన్‌, న్యూయార్క్‌నందు అంతర్జాతీయ పనివారి కార్యాలయము నెలకొల్పబడింది.”

ఆ విధంగా, తగిన పనివారు కావలెనని అడిగిన వెంటనే, బ్రూక్లిన్‌ కార్యాలయము “వారిని పంపించే” ఏర్పాటు చేస్తుంది. ప్రపంచవ్యాప్త కార్యక్రమ పథకములలో నిర్మాణపు అవసరతలను తీర్చుటకు తగిన పనివాళ్లను పంపిస్తుంది. ఉదాహరణకు, 1968లో మెక్సికో బ్రాంచికి ఒక క్రొత్త నివాస భవన నిర్మాణము దాని తుది ఘట్టమునకు చేరుకొనగా తివాచీలు పరిచే నిపుణులకొరకు బ్రూక్లిన్‌ను అడిగారు. కొద్ది నిమిషాలలోనే, ఆ పని కొరకు స్వచ్ఛందంగా పనిచేయడానికి యిష్టపడుచున్న నలుగురు అనుభవజ్ఞులు కార్యాలయమునకు దొరికారు. 1989 జనవరిలో ఆ బ్రాంచి అదనపు నిర్మాణము ప్రతిష్టించబడే సమయానికి, తివాచీలు పరచబడినవి, అవి చాలా అందంగా ఉన్నవి.

సేవచేయుటకు అర్హులగుట

అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల పథకములో పాలుపంచుకొనుటకు, ఒక పనివాడు మొదట అర్హుడు కావాలి. ప్రతి స్వచ్ఛంద సేవకుడు సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొన్న యెహోవాసాక్షియై ఉండాలి. అమెరికాలోనైతే, స్వచ్ఛంద సేవకులు కాదల్చిన వారు న్యూయార్క్‌ నందలి యెహోవాసాక్షుల కేంద్రాలలో నొకదానియందు మొదట పనిచేయాల్సి ఉంటుంది. తద్వారా అతని పని అలవాట్ల, సామర్థ్యాలు అంచనా వేయుటకు అవకాశము లభిస్తుంది. ఆ పిమ్మట ఈ పథకమునకు దరఖాస్తు చేసికొనుమని అతనికి ఆహ్వానమివ్వబడును. ఈ భవిష్యత్‌ స్వచ్ఛంద సేవకుల భార్యలు తమ భర్తలతోపాటు పనిచేయడానికి న్యూయార్క్‌నకు ఆహ్వానింపబడక పోయినను, ఆ కార్యక్రమ పథకమునకు అర్హులు కావచ్చు, దరఖాస్తును పూర్తి చేయవచ్చును.

ఇతర దేశములందున్న యెహోవాసాక్షులు ఈ కార్యక్రమము నందు పాల్గొనుటకు తమ దేశమందున్న బ్రాంచి నుండి దరఖాస్తును పొంది దరఖాస్తు చేసికొనవచ్చును. బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయమందు అంతర్జాతీయ సేవకులను మరి యితర అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులను పర్యవేక్షిస్తున్న కార్యాలయమునకు ఈ దరఖాస్తు పంపబడును. అప్పుడు అతని నైపుణ్యము అవసరము వచ్చినపుడు ఆ దరఖాస్తు దారునికి తెలుపబడును.

భార్యల సహకారము

నిర్మాణపు పనివాళ్ల భార్యలు సర్వసాధారణంగా వృత్తి రీత్యా నిపుణత లేనివారైనను, ఇనుప చువ్వలను తీగెతో బిగించడం, పెంకులు అమర్చి, సున్నముతో నింపడం, ఇసుక నింపడం, రంగువేయడం వంటి పనులలో అనేకులకు తర్ఫీదు యివ్వబడింది. ఇతరులు అవసరమగు గృహ నిర్వాహక పనులను నిర్వహిస్తారు. ఆ విధంగా వారందురు ప్రపంచవ్యాప్త నిర్మాణ కేంద్రములందు పనిచేయడానికి చక్కగా దోహదపడు చున్నారు.

ప్యూర్టోరికో నందు క్రొత్త బ్రాంచి నిర్మాణములో పనిచేయుటకు తన భర్తతో పాటు వెళ్లిన ఒకామె యిటీవల బ్రూక్లిన్‌ ఆఫీసుకు యిలా వ్రాసింది: “ఒక నెల నియామకము కొరకు మేము జనవరి 1, 1991 ఇక్కడకు చేరాము. ఇనుప చువ్వలను తడికెలవలే కట్టిన సిబ్బందితో నేను పనిచేశాను. నేను యింతవరకు చేసిన పనిలో ఇది అత్యంత క్లిష్టమైనపని. ప్రధానంగా దినమంతా ఇనుప చువ్వలను వంచి పట్టుకారును, తీగెముక్కలను ఉపయోగించి వాటిని కలిపి కట్టాలి!

“మొదట్లో కొన్ని రోజులు నా తలపైనున్న హెల్మెట్‌ పడిపోతూ ఉండేది, పెద్ద సైజులో నున్న చేతి తొడుగులను తీగెలకు వేసి కట్టేస్తూ ఉండేదాన్ని. అయితే క్రమేపి వాటికి అలవాటు పడ్డాను. బొబ్బలను సంరక్షించుటకు ఐదు, ఆరు బాండ్‌ఎయిడ్‌లు ఉండేవి. భవన నమూనాలనుండి కొలతలను తీసుకొనడం సుద్దముక్కతో ఇనుప చువ్వలపై గీతలు గీయడం ప్రతి తడికె కొరకు ఇనుప చువ్వలను పరచుట నేర్చుకున్నాను. నిజంగా అది సంతృప్తిదాయకమైన పని. దానికితోడు నేను దైనందిన జీవితములో చేయు పనులు—శుభ్రముచేయుట, వంట, బట్టలు ఉతుకుట వంచి వాటిని పదేపదే చేయవలసి యుంటుంది. అయితే గోడలో పెట్టబోయే ఆ ఇనుప తడికెలు బ్రాంచి ఉండేంత కాలం నిలిచి ఉంటాయి. ఆ తలంపే నాకు పారితోషికం!

పనిచేసే ఆధికత్య కొరకు కృతజ్ఞత

ఈ అంతర్జాతీయ నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షకుడొకరు యిట్లనెను: “మీరు ఊహించగల్గే దానిలో ఇది అసమానమైన సంగతి. దూరప్రాంతాలలో పని జరిగే స్థలాలకు ప్రజలు తమ స్వంత ఖర్చులు భరించి తమ సెలవులు నుపయోగించి వెళ్తున్నారు. తాము సంవత్సరమంతా చేసే పనికన్నా ఎక్కువ కష్టమైన పనిని ఎక్కువ గంటలు అక్కడ పని చేయవలసి యుంటుంది. అటు తరువాత తాము తమ గృహాలకు చేరుకుని, అట్టి ఆధిక్యత నిచ్చినందుకు మాకు కృతజ్ఞత తెల్పుచు వ్రాస్తుంటారు!”

ఉదాహరణకు, ఇటీవల అందిన ఒక ఉత్తరములో యిలా ఉన్నది: “ఫిలిప్సైన్స్‌ బ్రాంచి నందు మూడునెలలు పనిచేయుటలో మేము అనుభవించిన అద్భుతమైన ఆధిక్యతకు మీకు కృతజ్ఞత తెల్పుటకు మేము ఈ ఉత్తరము వ్రాస్తున్నాము. ప్రతి పనిదినాంతమున మేము అనుకున్నట్లే భౌతికంగా చాలా అలసి పోయేవాళ్లము, కాని శ్రేష్టమైన మన సహవాసము వలన ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను. అచ్చట ఉన్న స్వచ్ఛంద సేవకులనేకులను పరిచయము చేసికొనుటయందు, సంతోషించాము, మరియు మేము కలిసి పనిచేసిన స్థానిక సాక్షుల మూలంగా ఎంతో ముగ్ధులమయ్యాము. నిజమే వారు మాకు ప్రియులై, మా కుటుంబ సభ్యులయ్యారు.”

ఈక్వెడార్‌ వెళ్లిన దంపతులు యిలా వ్రాశారు: “మేము నిరుపయోగమైన తిండి తినకుండా జీవించడం తక్కువ నీళ్లతో స్నానం చేయడం, చన్నీళ్లతోనే గడ్డం గీసుకొని స్నానం చేయటం నేర్చుకున్నాము. వ్యాపార ప్రకటనల వలన మా ఆలోచన ఎంతగా ప్రభావితమై యుండేదోనన్న తలంపే మాకు లేదు. పని జరిగే ప్రదేశమందు మాకున్న శ్రేష్టమైన దానిని అర్పించాము, అయితే మేము అర్పించిన దానికంటే ఎక్కువ పొంది తిరిగి వచ్చాము. మన ఈక్వెడార్‌ సహోదరులు అమెరికా స్థాయికి పోల్చితే, డబ్బు విషయములో పేదవారే కాని వారి ఆత్మీయత, ప్రచారపు పనికొరకు వారి అభినందన ఎన్నదగినది. ఈ ఆధిక్యత విషయములో మా భావాలను వర్ణించుటకు నిజంగా మాటలు చాలవు.”

పోతపోసి నిలబెట్టు నిర్మాణము

ఈ అంతర్జాతీయ నిర్మాణపు పనిలో పోతపోసి నిలువబెట్టే నిర్మాణ పద్ధతి అసాధారణమైనది. ఈ పద్ధతిలో నిర్మాణ ప్రదేశమందే పెద్ద కాంక్రీటు గోడలను పోతపోయడం ఉంది. ఇవి మూడు అంతస్తుల ఎత్తువరకు ఉండవచ్చును. వాటి బరువు 20 టన్నులు ఉంటుంది. ఈ చట్రాలను భవన నిర్మాణ స్థలములో నేలమీదగాని లేదా సమీపమున పోతపోసే స్లాబ్‌మీదగాని పోతపోస్తారు.

ఆరు లేక ఎనిమిది చట్రాలను ఒక దానిమీద ఒకటి పేర్చవచ్చును. సాధారణంగా ఏడు రోజుల తర్వాత పోతపోయబడిన గోడలు గట్టి పడిన తరువాత ఒక క్రేన్‌ వాటిని పైకి లేపి ఒకచోట పేర్చును. ఇప్పుడు బయటి గోడలకు లోపలి గోడలకు అలాగే అంతస్తుల భవనానికి ఉపయోగించదగు పోతగోడలు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు, ఫిలిప్పైన్స్‌నందు 11 అంతస్తుల బ్రాంచి భవనముకొరకు ఇటువంటి పోతగోడలు వందల కొలది వాడబడియున్నవి. ముందుగా పోతపోసిన ఈ నునుపైన గోడలకు కేవలం రంగు మాత్రమే పూయవలసి ఉంటుంది.

ఈ విధమైన నిర్మాణ పద్ధతి వలన కేవలము సమయమును ఆదాచేయుట మాత్రమేకాక, నిపుణులైన తక్కువ పనివారిని సమర్థవంతముగా వాడుకొనవచ్చును. ఇంగ్లాండు నందు యెహోవాసాక్షుల క్రొత్త ఫ్యాక్టరీ నిర్మాణమునుగూర్చి కాంక్రీట్‌ అనే వ్యాపారరంగ ప్రచురణ యిట్లన్నది: “భవన నిర్మాణ పద్ధతిలో ఈ సూక్ష్మ విధానము మూలంగా పోతపోసి నిలువబెట్టే నిర్మాణము ముఖ్యంగా వారి అవసరతలకు తగినదే. . . . కాలము, ఖర్చు ఆదా చేయుట ఎల్లవేళల ఈ పద్ధతియొక్క ప్రధాన లక్ష్యము.”

పోతపోసి నిలబెట్టే నిర్మాణమునుగూర్చి ఆ పత్రిక ఇంకా ఇట్లనుచున్నది: “పర్యవేక్షణ పెద్దంత అవసరము లేకుండా స్థానిక పనివారితోనే పెద్ద పెద్ద గోడలను (అడ్డ దూలములను లేదా ఇతరమైన వాటిని మోయగల సామర్థ్యము గలవి) కొద్ది సమయములోనే నిర్మించగల ఆ సామర్థ్యం పని వేగంగా, తక్కువ ఖర్చుతో చేయుటకు దోహదపడుచున్నది.” కాబట్టి, నూతన నిర్మాణ పద్ధతి ఈ సులభమైన, నైపుణ్యతగల నిర్మాణ విధానమును ఉపయోగించుట ఎంత సరియైయున్నది!

ఇంజనీరింగ్‌ కార్యాలయములు

అంతర్జాతీయ నిర్మాణ కార్యక్రమమునకు, బ్రూక్లిన్‌ న్యూయార్క్‌ నందలి యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయమందున్న పెద్ద ఇంజనీరింగ్‌ కార్యాలయము నుండి ఉత్తర్వులు జారీచేయబడును. అచ్చట, వందలాది ఇంజనీర్లు, నిర్మాణ నమూనాలు గీయువారు, నమూనా తయారు చేయువారు వీరంతా ప్రధానకార్యాలయ సిబ్బంది సభ్యులుగా భవన నిర్మాణ నమూనాలను తయారుచేస్తారు. పెరుగుచున్న పని భారమునకు తోడ్పడు నిమిత్తము, జపాన్‌, ఆస్ట్రేలియా, యూరప్‌ నందు ఇటీవల ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కార్యాలయములు నెలకొల్పబడినవి.

నమూనాలను తయారుచేయుటకు 1987లో CAD (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌) పరిచయం చేయబడినది. ఈ CAD స్టేషన్‌ అనేక పరికరములతో కూడినదైయుంటుంది. వీటన్నింటిని ఉపయోగించుట మూలంగా, డ్రాఫ్టింగ్‌ బోర్డుపై చేతితో గీసే బదులు కంప్యూటర్‌ పైనే తయారుచేయుట సాధ్యమగుచున్నది. ప్రస్తుతము బ్రూక్లిన్‌లోను మరి యితర బ్రాంచిలలో 65 కంటె ఎక్కువ CAD స్టేషన్లు ఉపయోగములోనున్నవి.

నమూనా చిత్రములను కంప్యూటర్లలో భద్రపర్చి నిలువ చేయవచ్చును గనుక అంతకుముందున్న ప్రాజెక్టుల నుండి డిజైన్లను తీసుకుని ప్రస్తుతము గీయుచున్న నమూనాలలో పొందుపర్చవచ్చును. ఇది ఉత్పత్తికి, డిజైన్లు మరియు నిర్మాణములయొక్క ప్రామాణికత్వమునకు దోహదము చేయును.

ఇటీవలి నిర్మాణ ప్రాజెక్టులు

బ్రూక్లిన్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయ పరిమాణము విస్తరించే కొలది, పనికొరకు స్వచ్ఛంద సేవకులను సంస్థీకరించే తలంపుకూడా విస్తరించింది. ఈ కార్యక్రమము 1985లో పనామా నందు క్రొత్త బ్రాంచి నిర్మిస్తున్నప్పుడు సహాయము చేసేందుకు, ఇతర దేశముల నుండి పనివారు వచ్చినప్పటి నుండి ప్రారంభమైనదని చెప్పవచ్చును. పెరూలో బ్రాంచికి పెద్ద విస్తరణ చేయవలసి వచ్చినప్పుడు అది మరింత వృద్ధి అయ్యింది. ఈ కార్యక్రమము నిజంగా, కోస్టారికా, నైజీరియాలలో బ్రాంచీలు నిర్మిస్తున్నప్పుడు సమకూర్చబడుట ప్రారంభమైంది. వెనువెంటనే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుచున్న నిర్మాణములకు సహాయ పడేందుకు ముఖ్యమైన వ్యక్తులు పంపబడుచుండిరి.

ఈ అంతర్జాతీయ సేవకులు, యితర స్వచ్ఛంద సేవకులు అనేక క్రొత్త బ్రాంచీలు, పాతవాటికి అదనపు నిర్మాణములు చేసి సహాయపడ్డారు. వాటిలో అనేకము 1986 తొలిభాగమున ప్రారంభమై ముగించబడినవి. గత ఐదు సంవత్సరాలు లేక ఆపైన ప్రాజెక్టులు పనామా, కోస్టారికా, చిలీ, మెక్సికో, న్యూజీలాండ్‌, హయిటి, లైబీరియా, ఆస్ట్రియా, ఈక్వెడార్‌, పాపువా న్యూ గినియా, గయానా, ఘానా, హవాయ్‌, పోర్చుగల్‌, హాంగ్‌కాంగ్‌, సైప్రస్‌, పెరూ, ఎల్‌ సాల్వెడార్‌, మారిషస్‌, జపాన్‌, హోండూరాస్‌, గ్వాటిమాల, నైజీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూ కలిడోనియా, ఫిజి, ఫిలిఫ్పైన్‌ మరియు గ్రీస్‌లలో పూర్తిగావించబడి ప్రతిష్టించబడినవి.

వీటిలో అనేకము అతి పెద్ద నిర్మాణ ప్రాజెక్టులు, నైజీరియాలో 140 ఎకరాల విస్తీర్ణములో ఒక చిన్న పట్టణము నిర్మించబడినది. దానిలో 450 అడుగుల పొడవు 225 అడుగుల వెడల్పుగల ఒక ఫ్యాక్టరీ, 400 మందికి వసతి గృహములు, ఒక కార్యాలయము, ఒక గ్యారేజి, మరి యితర భవనములు నిర్మించబడినవి. అమెరికా నుండి పంపబడిన నిర్మాణపు సామాగ్రియే 347 సామాగ్రి రవాణా పెట్టెల నిండా సరిపోతుంది, ఒకవేళ వాటిని ఒకదాని వెనక ఒకటి పెడితే వాటి పొడవు 3.5 కిలోమీటర్లకు విస్తరిస్తుంది!

కొన్నిసార్లు ఈ నిర్మాణపు ప్రాజెక్టులకు మత నాయకుల వ్యతిరేకత కూడ ఉండేది. మార్చి 1989లో గ్రీసునందు మత నాయకులు, వ్యతిరేకించు జనాలను 40 బస్సుల నిండా తీసుకొచ్చి ధ్వజమెత్తారు, కాని నిర్మించుటకు సాక్షులకున్న చట్టపరమైన హక్కును పోలీసువారు బలపర్చారు, ఈ వ్యతిరేకత నీరు గారిపోయింది. ఈ క్రొత్త బ్రాంచిలో ఒక క్రొత్త ఫ్యాక్టరీ, 170 మంది కంటె ఎక్కువమందికి సరిపోయే 22 వసతి భవనములు ఈ వసంత ఋతువులోనే పూర్తి గావించబడి ప్రతిష్టంచబడినవి.

ఫ్రాన్సులో ఈర్వెక్స్‌ బిషప్‌, జాక్‌ గియో, లూవియానందలి యెహోవాసాక్షుల ఒక పెద్ద క్రొత్త బ్రాంచికొరకైన పథకములను వ్యతిరేకించాడు. సాక్షుల బహిరంగ పరిచర్య “మానవుని హోదాను గౌరవించుట” లేదని అతడన్నాడు. అయినప్పటికిని, ఇతరులు బిషప్‌ పలికిన మాటలతో అంగీకరించరు. ప్రపంచవ్యాప్తముగా అనేక ప్రాంతాలలో తామెట్లు విస్తరణ చేయుచున్నామో, ఆలాగే యెహోవాసాక్షులును తమ వసతులను విస్తరింపజేసుకొను హక్కు కలిగియున్నారని వారు నమ్ముచున్నారు.

ప్రస్తుతము ఈ అంతర్జాతీయ నిర్మాణ స్వచ్ఛంద సేవకులు కొలంబియా, ప్యూర్టోరికో, జాంబియా, బ్రెజిల్‌, ఇంగ్లండ్‌, కెనడా, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెడార్‌, పోలెండ్‌, గ్వాడెలోప్‌, థాయ్‌లాండ్‌, లీవార్ట్‌ దీవులు, బహమాస్‌, వెస్ట్రన్‌ సమోవా, టాహిటి, సాలమన్‌ దీవులు, వెనిజ్యులా, కొరియా రిపబ్లిక్‌, దక్షిణాఫ్రికా, మరియు జర్మనీలలో బ్రాంచి ప్రాజెక్టులందు పని చేయుచున్నారు. ఫ్రాన్సు, స్పెయిన్‌, మెక్సికో, శ్రీలంక, తైవాన్‌, మరియు సురినామ్‌లలో క్రొత్త బ్రాంచీలు లేదా ప్రస్తుతమున్న వాటికి అదనపు నిర్మాణములకు సంబంధించిన యితర ప్రాజెక్టులు డ్రాయింగ్‌ బోర్డులమీద ఉన్నాయి.

అవసరతను ఎదురుచూచుట

జర్మన్‌ బ్రాంచిని 50 శాతం విస్తరింపజేయడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ 1988లో అనుమతించినప్పుడు, ఈ అదనపు నిర్మాణము చాలా పెద్దదని కొందరు పరిశీలకులు భావించారు. అయితే 1989-90లలో పోలెండ్‌, హంగేరి, తూర్పుజర్మనీ, రుమేనియాలందు యెహోవాసాక్షుల ప్రచారపుపని చట్టబద్ధము చేయబడింది లేదా నిరాటంకముగా కొనసాగుటకు అనుమతించబడింది. పోయిన సంవత్సరము 91, మార్చి 27వ తేదిన యెహోవాసాక్షులు ఒక మతసంబంధమైన సంస్థగా సోవియట్‌ యూనియన్‌చే గుర్తించబడ్డారు.

గత వేసవిలో 3,00,000 మంది తూర్పు ఐరోపా దేశ ప్రజలు యెహోవాసాక్షుల సమావేశములకు హాజరై, బైబిలు సాహిత్యములను పొందడానికి అపేక్షించిరి. 1991 బ్రిటానికా బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ యిలా గమనించింది. “పశ్చిమ జర్మనీలోని వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయము కేవలం రెండు నెలలలో, ఒక్క తూర్పు జర్మనీకే 1,15,000 బైబిళ్లను కలుపుకొని 275 టన్నుల బైబిలు ఆధారిత సాహిత్యములను పంపింది.” ఆ విధంగా విస్తరింపజేయడానికి అనుమతించిన ప్రతిభాగము జర్మనీ బ్రాంచికి అవసరమని, దానికది త్వరితంగా అవసరమని తేట తెల్లమయింది!

భవిష్యత్‌ అవసరతలను సంసిద్ధమగుట

దీనిబట్టి యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పుగా ‘అంతమునకు ముందు ఈ రాజ్యసువార్తను సకల జనములకు’ ప్రకటించుటకు గొప్ప ప్రయత్నము అవసరము. (మత్తయి 24:14) ప్రపంచవ్యాప్తముగా నిజమైన క్రైస్తవులు అట్టి ప్రయత్నము చేయుచున్నారు. రాజ్య వర్తమానము సకల దేశముల వారికి అందుబాటులో ఉండు నిమిత్తము వారు చేయగల్గిన దానినంతటిని చక్కని సంస్థీకరణా విధానములో చేయుచున్నారు. దీనిని సాధించుటకు, యెహోవాసాక్షులు బ్రూక్లిన్‌, న్యూయార్క్‌ నందలి ప్రపంచ ప్రధాన కార్యాలయమునందు బైబిలు సాహిత్యములను ముద్రించే తమ సామర్థ్యాన్ని విస్తృత పర్చుచున్నారు. మరో వెయ్యిమంది ప్రధాన కార్యాలయ సిబ్బంది కొరకు 90 సాండ్జ్‌ స్ట్రీట్‌ నందు 30 అంతస్తుల భవనముయొక్క నిర్మాణము యిప్పుడు కొనసాగుచున్నది, 1993లో అది పూర్తిగావించబడును.

అయితే, న్యూయార్క్‌ నగరమునకు 110 కిలోమీటర్ల దూరమున ప్యాటర్సన్‌, న్యూయార్క్‌ వద్ద అతి పెద్ద నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణములో నున్నది. ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఏప్రిల్‌ 7, 1991 యిలా నివేదించినది, “1996 నాటికి [యెహోవాసాక్షులు] దానిని పూర్తి చేసే సమయానికి 624 అపార్టుమెంట్లతో 2 నుండి 5 అంతస్తుల ఎత్తున్న 6 అపార్టుమెంట్లు, 450 కార్ల గ్యారేజి, 144 గదుల హోటలు, పెద్దవంటగది, 1,600 మంది ఒకేసారి భోజనము చేయగల భోజనశాల, ఒక ఆఫీసు భవనము, తరగతి గదుల భవనము మరి యితర అనేక సేవలందించే భవనాలను వారు కల్గియుంటారు.” ఈ అతి పెద్ద రాజ్య విద్యాకేంద్రమును నిర్మించుటకు వందలాది మంది స్వచ్ఛంద సేవకులు ఉచిత సేవలను అందిస్తున్నారు.

నిజంగా, భూమిమందలి సకల భాగములలోను అద్భుతమైన నిర్మాణ కార్యక్రమములు స్వచ్ఛంద సేవకులచే సమన్వయం చేయబడి నిర్వహించబడుచున్నవి. అంతర్జాతీయ నిర్మాణములో అది నిజంగా సరిక్రొత్త పంథాయే!

[21వ పేజీలోని చిత్రం]

ఇనుప చువ్వలను కట్టుట నిర్మాణపు పనిలో ఒక భాగము

[23వ పేజీలోని చిత్రాలు]

పోతపోసిన నిటారుగా నిలబెట్టు నిర్మాణములో, కాంక్రీటు బల్లలను ఒక దానిమీద ఒకటి పేర్చవచ్చును. అవి గట్టిపడిన తరువాత వాటి స్థానములలోనికి వాటిని ఎత్తవచ్చును

[24వ పేజీలోని చిత్రాలు]

పోలెండ్‌ కొరకు క్రొత్త బ్రాంచి సముదాయము బ్రూక్లిన్‌ నందు పునఃపరిశీలించబడుచున్నది. నిర్మాణ నమూనాలు కంప్యూటరు మీద తయారగుచున్నవి

[25వ పేజీలోని చిత్రాలు]

ప్యూర్టోరికో, జాంబియా, మరియు లీవర్ట్‌ దీవుల కొరకు పథకము వేయబడిన బ్రాంచి సముదాయాలు

[26వ పేజీలోని చిత్రం]

ఒక యూరోపియన్‌ దేశమందు నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి