యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
త్రాగుడు నన్ను నిజంగా దానికి బానిసను చేస్తుందా?
జెరోమ్కు కేవలం ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు అదంతా మొదలైంది. “ఇంట్లో ఒక పార్టీ జరిగినప్పుడు మిగిలిపోయిన మద్యాన్ని నేను రుచి చూశాను, బాగా త్రాగాను, అప్పుడు నాకు కలిగిన భావన చాలా నచ్చింది,” అని అతను వివరిస్తున్నాడు. కొనడం, దాన్ని దాచిపెట్టి త్రాగడం జెరోమ్ రోజుపని. అయినను, “నాకు 17 సంవత్సరాల వయస్సు వచ్చేదాకా నాకో సమస్య ఉండేదని నాకు తెలియదు. ఇతరులు ఉదయం ఫలహారం తింటుంటే, నేను పావు లీటరు వోడ్కా త్రాగేవాడిని!” అని అతడు అంగీకరిస్తున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా యౌవనస్థులు మద్యాన్ని త్రాగడం, త్రాగుబోతులవ్వడం పెచ్చుపెరిగిపోతుంది. కేవలం అమెరికాలోనే, 13 నుండి 18 సంవత్సరాల వయస్సుగల వారిలో సగంమంది అనగా ఒక కోటికిపైగా—విద్యార్థులు గత సంవత్సరంలో ఒక్కసారైనా త్రాగారు. ఇంచుమించు ఎనిమిది లక్షల మంది వారంలో ఒకసారైనా త్రాగుతారు. నిజానికి, అమెరికాలోని యౌవనస్థులు ఒక సంవత్సరానికి ఇంచుమించు వంద కోట్లకుపైగా బీరు క్యానులు మరియు కర్బనామ్లవాయువుతో నింపబడిన ద్రాక్షారసం 30 కోట్ల సీసాలకుపైగా త్రాగుతారు!
మద్యపానం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.” (సామెతలు 20:1) అయినను, జెరోమ్వంటి లక్షలాది యౌవనస్థులు మద్యానికి బానిసలౌతున్నారు. మద్యం అతిగా సేవించడం వల్ల వచ్చే ప్రమాదాలేమిటి? నీవు దానికి బానిసవవుతున్నావని నీవెలా తెలిసికొనగలవు?
మద్యం, మద్యపాన వ్యసనం
మంచి రంగులతో కనబడే ద్రాక్షారసం లేక నురుగులు కారే బీర్లాంటి మద్యం, నిరపాయకరంగా కనిపించును. అయినను, రుచి, రూపం మోసకరంగా ఉండవచ్చు. మద్యం—ఒక శక్తివంతమైన మత్తుమందు.
మద్యం, కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేస్తూ, మెదడును ప్రభావితం చేసి మందగింప చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. పెద్దవారు దాన్ని కొద్ది మోతాదులో తీసుకుంటే, అది నిరపాయకరమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించవచ్చు. “ద్రాక్షారసము . . . నరుల హృదయమును సంతోషపెట్టును,” అని కీర్తనలు 104:15 చెప్పుచున్నది. అయినను, మద్యాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మత్తు కలిగిస్తుంది—ఆ స్థితిలో శారీరక, మానసిక నియంత్రణ గణనీయంగా తగ్గించబడుతుంది. జెరోమ్ వలె, ఒక వ్యక్తి దానికి బానిసై, త్రాగటానికి ఇష్టపడటంతో మొదలుపెట్టి దాని అవసరత కలగడం వరకు లేక దానికై తపించిపోయేంత స్థితికి దిగజారవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? మద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే శరీరం దాన్ని ఓర్చుకునే శక్తిని ఏర్పరచు కొనగలదు. అప్పుడు ఆ వ్యక్తి దాని అనుభూతిని పొందడానికి చాలా ఎక్కువ మోతాదులో త్రాగాల్సివస్తుంది. అయితే అతడు గ్రహించేలోగా, అతడు దానికి బానిసైపోతున్నాడు. ఒక వ్యక్తి ఒకసారి దానికి బానిసయితే, అతని జీవితం దుఃఖకరంగా మారుతుంది. ఇంచుమించు అమెరికాలోని యాభై లక్షల యౌవనులకు త్రాగుడు సమస్యవున్నది.
వారెందుకు త్రాగుతారు
అమెరికాలోని సగటు యౌవనుడు, 1930వ దశాబ్దంలో, తన మొదటి మద్యపానాన్ని 18 ఏళ్ల వయసులో రుచిచూశాడు. ఈనాడు, అతడు 13 ఏళ్లకు ముందే అలా చేస్తాడు. కొందరు ఇంకా చిన్న వయసుకే మొదలు పెడతారు. “నాకు ఆరేళ్ల వయసు, . . . నేను నా తాతయ్య గ్లాసులోంచి కొంత బీరు త్రాగాను. . . . నా బుద్ధిమందగించింది!” అని ఒక త్రాగుబోతై కోలుకుంటున్న కార్లోటా గుర్తుతెచ్చుకుంటుంది. నీవు ఎంత తొందరగా మొదలుపెడితే, నీవు బానిసవ్వడం అంత కచ్చితం.
ఈ విషయంలో, స్నేహితుల వత్తిడి కొంత ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు తలిదండ్రుల తప్పుకూడా కొంత ఉంటుంది. కొందరు అతిగా త్రాగడం, మద్యాన్ని భావోద్రేక ఆధారంగా ఉపయోగించడం, లేక తాము ఎంత మద్యంత్రాగినా తట్టుకొనగలమని గొప్పగా చెప్పుకోవడం వంటివి చేస్తారు. త్రాగుబోతుతనాన్ని గూర్చి ఒక కరపత్రిక ఇలా చెప్తుంది: “పెద్దయ్యాక త్రాగుబోతులయ్యే పిల్లలు చాలా మటుకు మద్యం త్రాగడం మామూలు విషయంగాను లేక అది భావోద్రేకమైనది కాదని భావించే కుటుంబాల నుండి వచ్చినవారే . . . , మద్యానికి ఆ కుటుంబాలలో స్థానం ఉంది.”a
దూరదర్శని కూడా యౌవనులపై బలమైన ప్రభావం కలిగి ఉంది. అమెరికాలోని సగటు యౌవనుడు రోజుకు 11 దృశ్యాల చొప్పున—18 ఏళ్ల వయసుకల్లా 75,000 త్రాగుడు దృశ్యాలు చూసి ఉంటాడు. దాని ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలను, అశ్లీలమైన మోడల్లు, రౌడీ పార్టీ సన్నివేశాలతో త్రాగుతూ ఉన్నట్టు, మద్యం ఆనందానికి ప్రేమకు మార్గం అనిపించేలా ఎంతో జాగ్రత్తగా నేర్పుగా చిత్రీకరిస్తారు. మద్యానికి పండ్లరసాల రుచిని ఆకట్టుకునే పేర్లను ఇస్తారు. వ్యాపార ప్రకటనలు తమ సంకల్పాన్ని నెరవేరుస్తాయి. ప్రతివారాంతం, 4,54,000 మంది అమెరికా యౌవనస్థులు మద్యపాన విందును చేసుకుంటారు. అమెరికా సర్జన్ జనరల్, వారిలో చాలామంది “ఇప్పటికే త్రాగుబోతులయ్యారు, మిగతావారు త్రాగుబోతులు అయ్యేమార్గంలో వుండవచ్చు” అనేటట్లు వారతనిని ప్రేరేపించారు.
కొందరు యౌవనులు ఆంతరంగిక వ్యధవలన త్రాగుతారు. కిమ్ తాను బీరు ఎందుకు అధికంగా త్రాగేది బయల్పరచింది: “మద్యం నా మానసిక స్థితిని మార్చి నా గురించి నేను మంచిగా భావించడానికి సహాయం చేసేది.” యువత సిగ్గుపడుతుంటే లేక తనను గూర్చి తనకే హీనమైన భావం కలిగి ఉంటే త్రాగడం మంచి పరిష్కారంలా కన్పించవచ్చు. ఇంకా కొందరు తలిదండ్రుల దురాగతం మరియు నిర్లక్ష్యం వంటి బాధాకరమైన జీవిత సత్యాలను మర్చిపోవడానికి త్రాగుతారు. ఏనా ఎందుకు త్రాగడం మొదలు పెట్టింది? “నాకు అవసరమైన అప్యాయత నాకెప్పుడూ దొరకలేదు” అని తానన్నది.
త్రాగుడు మొదలు పెట్టడానికి కారణమేమైనను, దాన్ని మొదలుపెడితే మాత్రం కొద్ది కాలానికి ఒక యౌవనస్థుడు తన త్రాగుడును అదుపు చేయడం చాలా కష్టమౌతుంది. అప్పటికే ఒక యౌవనస్థుడు మద్యపాన వ్యసనంగల వాడిగా మారిపోతాడు. నీవు త్రాగడం మొదలు పెట్టావా? “నీవు త్రాగుటకు మొదలుపెట్టినప్పటి నుండి” అను పేరుగల పరిశీలనా పట్టికను పరిశీలించుము. ఫలితాలు చాలా కనువిప్పు కలిగించేవిగా ఉండడం నీవు గమనిస్తావు.
మద్యం—యౌవనులకు ప్రమాదకరమైనది!
“ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారిని” బైబిలిట్లు హెచ్చరించు చున్నది “పిమ్మట అది . . . కట్లపామువలె కాటువేయును.” (సామెతలు 23:29-32) విషపూరితపాము యొక్క విషము ఒక మనిషికి నెమ్మదిగా మరియు బాధాకరంగా హానికలిగిస్తుంది లేక చంపుతుంది. (అపొస్తలుల కార్యములు 28:3, 6పోల్చుము.) అదే విధంగా, మద్యపానాన్ని చాలాకాలం వరకు విపరీతంగా సేవించడంవల్ల అది నిన్ను నెమ్మదిగా చంపవచ్చు. నీ గుండె, మెదడు, జఠరగ్రంథులు, మరియు కాలేయం వంటి ముఖ్య అవయవాలను అది పాడుచేయవచ్చు లేక నాశనం చేయవచ్చు. ముఖ్యంగా, వికసిస్తున్న యౌవన శరీరాలు మరియు మనసులు కొన్నిసార్లు మరల బాగుచేయలేనంత నష్టానికి గురికావచ్చును.
మద్యపాన దుర్వినియోగం నీ శరీరానికంటే నీ భావోద్రేకాలకు ఎక్కువ నష్టం కలుగజేయగలదు. త్రాగుడు తాత్కాలికంగా నీ ధైర్యాన్ని పెంచ వచ్చు. అదిచ్చే ధైర్యం చాలా స్వల్పం—మరియు దాని అనుభూతి త్వరగా అణగారిపోతుంది. ఇంతలో నీ మానసిక, భావోద్రేక వికాసం కుంటుబడుతుంది. నిగ్రహశక్తి కలిగి వాస్తవాన్ని ఎదుర్కొనుటకు బదులు, నీవు ఇంకోసారి త్రాగడానికి ఇష్టపడతావు. కానీ 11 నెలలు నిగ్రహంగా ఉండగలిగిన 18 సంవత్సరాల వయసుగల పీటర్ ఇలా చెప్తున్నాడు: “నా భావాలను ఎదుర్కొనే విషయంలో, ఇంతకు ముందు త్రాగుడు సహాయం చేసిన పరిస్థితులను ఎదుర్కొనుటకు క్రొత్త మార్గాలను నేను వెదకుటకు నేర్చుకుంటున్నాను. సామాజికంగాను భావోద్రేకంగాను నేనిప్పుడు పదమూడేళ్ల వయసుగల వాడను.”
త్రాగి వాహనాలు నడిపే ప్రమాదాలు కూడా ఉన్నవి. అమెరికాలో త్రాగుడుకు సంబంధించిన రహదారి మరణాలే ఎక్కువ మంది యౌవనుల ప్రాణాలు తీస్తున్నాయి. యౌవనస్థుల్లో మరణానికిగల ఇతర కారణాలలో— హత్యలు, ఆత్మహత్యలు, మరియు నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపుట వంటి త్రాగుడుకు సంబంధించిన క్రియలు చోటుచేసుకుంటున్నవి.
ఇంకనూ, అతిగా త్రాగుటవల్ల అది నీ కుటుంబ జీవితం, స్నేహం, పాఠశాలపని, మరియు ఆత్మీయతలపై వినాశనకరమైన ప్రభావాన్ని చూపగలదు. బైబిలు చెప్పే పద్ధతిదే: “ఎక్కువగా త్రాగే వాన్ని నాకు చూపండి, . . . తనను గూర్చి తాను బాధపడు వాన్ని, ఎప్పుడు సమస్యలు సృష్టిస్తూ, సణిగే వాన్ని, నేను నీకు చూపుతాను. వాని కళ్లు ఎర్రబడి ఉన్నాయి, వానికి అనవసరపు దెబ్బలు తగిలాయి . . . నీవు సముద్రం మీద ఉన్నట్లు, సముద్రానికి భయపడుతున్నట్లు, పైకెగిరిపడుతున్న ఓడ కొయ్యచివరన ఉండి ఊగుతున్నట్లు భావిప్తావు.” (సామెతలు 23:29-34, టుడేస్ ఇంగ్లీష్ వర్ష్న్) అందమైన దూరదర్శని వ్యాపారప్రకటనలలో యిలాంటి విషయాన్ని గురించి ఎన్నడూ చూపరు.
ఎందుకు మొదలుపెట్టాలి?
అందుకని అనేక దేశాలు యౌవనులు మద్యపానం సేవించకుండా నిర్భంధించాయి. ఒకవేళ నీవు క్రైస్తవునివైతే, “పై అధికారులకు లోబడియుండ వలెన”ని దేవుడు నీకాజ్ఞాపిస్తున్నాడు, గనుక ఆ చట్టానికి లోబడుటకు నీకు బలమైన కారణాలు కలవు. (రోమీయులు 13:1, 2) ఒకవేళ స్థానిక అలవాట్లనుబట్టి యౌవనులు మద్యము సేవించుట చట్టబద్ధమైనను, నీ జీవితంలో ఈ వయస్సులోనే మద్యపానం సేవించుటకు మొదలుపెట్టుట నీకు క్షేమమేనా? 1 కొరింథీయులు 6:12 చెప్పుచున్నట్లు “అన్నిటియందు స్వాతంత్ర్యము కలదు . . . ; గాని అన్నియు చేయదగినవి కావు.” మద్యపానాల వాడుకకు నీవు సిద్ధంగా ఉన్నావా?
నిజమే, మనోరంజకమైన ద్రాక్షారసాన్ని నీ స్నేహితుడు నీకందిస్తే అది ఎలా ఉంటుందో రుచిచూడాలన్న శోధనకలగవచ్చు. అయితే, ఒక శక్తివంతమైన వ్యసనకరమగు మద్యం నీకు అందించబడుతోందని గుర్తుంచుకో. బైబిలు కాలాలలో, దైవభక్తిగల యౌవనులైన దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు బబులోను అధికారులను ధైర్యంగా ఎదిరించగలిగారు మరియు అన్యుడైన బబులోను రాజుచేత నియమించబడిన అపవిత్రమైన ఆహారాన్ని మరియు ద్రాక్షారసాన్ని వారు నిరాకరించారు. నీవు కూడ వద్దని చెప్పుటకు ధైర్యం కలిగియుండ గలవు!—దానియేలు 1:3-17.
మద్యం సేవించడమే నీ కోరికైతే, తగిన వయసు వచ్చినపుడు మానసికంగా, భావోద్రేకంగా, శారీరకంగా, మరియు చట్టబద్ధంగా, దాన్ని సేవించగల స్థితిలో నీవు ఉంటావు. అయినను, నీవు మితంగా ఉంటూ దానికి బానిసకాకుండా జాగ్రత్తపడడం ఎంతైనా మంచిది. చాలామంది యౌవనులు ఇప్పటికే దానికి బానిసలయ్యారు, వారు కోలుకొనుటకు ఏమి చేయాలన్నది రాబోవు సంచిక చర్చిస్తుంది. (g93 1/8)
[అధస్సూచీలు]
a కొన్ని వర్గాలప్రజలలో యౌవనులు సాధారణంగా భోజనంతో పాటు మద్యాన్ని త్రాగడానికి అనుమతించ బడతారు. అయినప్పటికి, జనసమ్మతమైన అలవాట్లు తమ నిర్ణయాలకు దారిచూపుటను అనుమతించుటకు బదులు తమ పిల్లలకు ఏది మంచిది అను విషయంపై తలిదండ్రులే గంభీరంగా ఆలోచించడం వివేకమైన పని.
[24వ పేజీలోని బాక్సు]
నీవు త్రాగుటకు మొదలుపెట్టినప్పటి నుండి:
◻ నీకు వేర్వేరు లేక తక్కువ మంది స్నేహితులున్నారా?
◻ ఇంటివద్ద జీవితం కష్టంగా ఉందా?
◻ నీకు నిద్రపట్టడం లేదా? లేక నీవు వ్యాకులపడుతూ క్రుంగిపోయినట్లు భావిస్తున్నావా?
◻ నీవు ఇతరులతో కలిసి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడానికి నీకు మద్యం అవసరమా?
◻ త్రాగిన తరువాత నీలో నీవు అసంతోషంగా లేక నిరాశగా ఉంటున్నావా?
◻ నీవు త్రాగలేదని అబద్ధమాడతావా లేక ఆ విషయాన్ని దాచెదవా?
◻ త్రాగే నీ అలవాటు గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు నీకు మనస్తాపం కలుగుతుందా లేక కోపం వస్తుందా?
◻ నీవు మత్తుపానీయం సేవిస్తున్నందుకు ఎవరైనా నీకు సలహా ఇచ్చారా లేక నిన్ను ఎగతాళి చేశారా?
◻ బీరు లేక ద్రాక్షారసము ఘాటైన మద్యాలు కావు గనుక వాటిని నేను త్రాగినా పర్వాలేదు అని నీవు విశ్వసిస్తున్నావా?
◻ నీవు ఒకప్పుడు ఇష్టపడిన ఆటలు మరియు సరదాపనులలో ఆసక్తి తగ్గిపోవడం లేక వాటిని మానుకోవడం జరిగిందా?
ఒకవేళ నీవు రెండిటి కంటె ఎక్కువ ప్రశ్నలకు అవునను సమాధానం ఇచ్చినట్లైతే, నీకు గంభీరమైన త్రాగుడుసమస్య ఉందని అది చూపించవచ్చు. అట్లైతే, నీవు తక్షణమే సహాయం ఆర్ధించడం వివేకంగా ఉంటుంది.
మూలము: ది రిజెంట్ హాస్పిటల్, న్యూ యార్క్, ఎన్వై.
[23వ పేజీలోని చిత్రం]
అనేకమంది మద్యపాన వ్యసనపరులు చిన్నవయసులోనే త్రాగుడు సమస్యలను కలిగియున్నారు