యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
“చాలా దూరం” అంటే ఎంతదూరం?
“హద్దుమీరటం వల్ల వచ్చే ప్రమాదాల గురించి దయచేసి మీరు ప్రజలను హెచ్చరించగలరా? . . . ‘సంపర్కానికి దారితీసే శారీరక క్రియల’న్నిటి గురించి చెప్పాలి, ఎందుకంటే అదే లైంగికతకు దారితీస్తుంది. నా ప్రశ్న ఏమంటే, లైంగిక సంబంధానికి ఉన్న ఆ హద్దు ఏమిటి?”
యౌవనస్థుల కొరకు ప్రచురించే ఒక పత్రికను ఒక అమ్మాయి అలా అడిగింది. అయితే బహుశ మీరు కూడా ఆ ప్రశ్న గురించి ఆలోచించి ఉండవచ్చు.
మీరు క్రైస్తవులైతే, 1 థెస్సలొనీకయులు 4:3-6 నందలి ఈ మాటలను గంభీరంగా తీసుకుంటారు: “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. . . . ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.”
అవివాహిత క్రైస్తవుల మధ్య లైంగిక సంపర్కం తప్పు అని మీరు గ్రహించినప్పటికీ, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, లేక స్త్రీపురుషులు ఒకరినొకరు స్పర్శించుకోవడం వంటివాటిని దేవుడెలా దృష్టిస్తాడు అని మీరు అనుకుంటుండవచ్చు.
పెరగటంలో ఒక భాగం?
ప్రథమంగా, లైంగిక దురుద్దేశంలేని సహేతుకమైన, స్వచ్ఛమైన మాటలలో అనురాగాన్ని వ్యక్తపరచే విషయాన్ని బైబిలు ఖండించడంలేదని మనస్సులో ఉంచుకోవడం మంచిది. ప్రాచీన క్రైస్తవులు ఒకరి యెడల ఒకరు తమ ప్రేమను చక్కగా ప్రదర్శించుకొనేవారు. వారు సాధారణంగా, “పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు” చేసుకునేవారు. (రోమీయులు 16:16; 1 కొరింథీయులు 16:20) క్రైస్తవులైన స్వలింగ వ్యక్తులు సహితం ముద్దు పెట్టుకొనేవారు, హత్తుకొనేవారు.—అపొస్తలుల కార్యములు 20:37ను పోల్చండి.
అనేక సాంప్రదాయాల్లో, ఒకరి యెడల అనురాగం చూపించడానికి ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవడం తగిన మార్గాలుగా ఇప్పటికీ పరిగణింపబడుతున్నాయి. అయితే, ఈనాడు అనేకమంది యౌవనస్థులు, యుక్తమైనదేమిటి అనే నిర్వచనాన్ని కూడ మీరిపోయే మార్గాల్లో తమ అనురాగాన్ని చూపిస్తున్నారు. అంతర్గత శరీర అవయవాలను ముట్టుకోవడం వంటి ఏదో ఒకవిధంగా స్పర్శించడంలో పాల్గొన్నట్లు ప్రశ్నించబడిన యౌవనులలో మూడొంతుల మంది చెప్పినట్లు ఒక అమెరికా పరిశోధన తెల్పింది. అనేకులు 14 సంవత్సరాల లేత వయస్సులోనే అలా చేయడం మొదలు పెట్టారు. మరో పరిశోధన కనుగొన్నట్లుగా, చివరికి లైంగిక పరాకాష్ఠదశకు చేరేంతగా 49 శాతం మంది ఆలింగనంలో పాల్గొన్నారు.
అలాంటి లైంగిక ప్రయోగం కేవలం ఎదగడంలో ఒక భాగమని కొంతమంది సమర్థిస్తారు. ది ఫామిలి హ్యాండ్‌బుక్ ఆఫ్ అడోలెసెన్స్ అనే పుస్తకం ప్రకారం: “నిజానికి, సాధారణ యౌవనులలో లైంగిక ఆట, అన్వేషణ సర్వసాధారణం.” కొంతమంది స్పర్శించడాన్ని సిఫారసు కూడా చేస్తారు. కాథెరిన్ బెర్‌ఖార్ట్ వ్రాసిన గ్రోయింగ్ ఇన్‌టు లవ్ అనే పుస్తకం ఇలా నొక్కిచెబుతుంది: “అది సంపర్కానికి ముందే ఆగుతుంది ఆదుర్దాలేకుండా స్పర్శించడాన్ని అనుభవించవచ్చు, అది లైంగిక శక్తి వెలువడటానికి అద్భుతమైన మార్గంగా పనిచేస్తుంది.”
అయితే ప్రశ్నేమిటంటే, అలాంటి ప్రవర్తనను దేవుడెలా దృష్టిస్తాడు?
ముద్దు దేనికి దారితీయగలదు?
మీరు మంచి “ఈడు”లో ఉన్నప్పుడు లైంగిక కోరికలు బలంగా ఉంటాయి. (1 కొరింథీయులు 7:36) కాబట్టి, స్త్రీపురుషులు పరస్పరం ముద్దు పెట్టుకోవడం లేక స్పర్శించటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉబలాటం ఉండడం చాలా సహజమే. అయితే ది ఫామిలి హ్యాండ్‌బుక్ ఆఫ్ అడోలెసెన్స్ ఇలా తెలియజేస్తుంది: “కొన్నిసార్లు మానసిక ఎదుగుదలకంటే లైంగిక సామర్థ్యం అనేక సంవత్సరాలు ముందే కలుగుతుంది.” వాస్తవానికి, ఒక ముద్దులో లేక స్పర్శించడంలో బలమైన ఊహానుభూతితో కూడిన భావాలను లేక లైంగిక కోరికలను రేకెత్తించే శక్తివుందంటే అనేకమంది యౌవనులు పూర్తిగా అంగీకరించరు.
కాబట్టి మీరు జ్ఞానయుక్తంగా, లైంగిక భావాలను రేకెత్తించే ప్రవర్తన కలిగివుండడంలోని ఫలితాలను గమనించాలి. మీరు వివాహం చేసుకోడానికి మరీ చిన్నవారైతే అప్పుడేమిటి మరి? అప్పుడు మిమ్మల్ని లైంగికంగా ప్రేరేపించే విధంగా ముద్దుపెట్టుకోవడం లేక మరేదైనా చేయడం ఎందుకు? ఇదంతా మీకు నిరాశను కలిగిస్తుంది. ఎందుకంటే, మోహానుభూతితో కూడిన భావాలకు ముగింపు లైంగిక సంపర్కమే గనుక ఒక నిజమైన క్రైస్తవునిగా నీకు ఆ అవకాశం లేదు. అలాంటి సంబంధాలు కేవలం వివాహబంధంలోనే యుక్తమైయున్నవని బైబిలు విశదపరుస్తుంది.—1 కొరింథీయులు 6:18.
మీ మోహానుభూతితో కూడిన క్రియ ద్వారా లైంగికంగా పురికొల్పబడే వ్యక్తిని గురించి కూడా పరిశీలించండి. మీరు వివాహం చేసుకునే స్థితిలోలేని వ్యక్తిని, లేక తగిన వివాహజత అని కూడా గంభీరంగా తలంచలేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం లేక స్పర్శించడం మోసకరమైంది, క్రూరమైంది కాదా? (సామెతలు 26:18, 19 పోల్చండి.) బైబిలిలా హెచ్చరిస్తుంది: “క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును.”—సామెతలు 11:17.
మోహానుభూతితో కూడిన స్పర్శ లేక ముద్దు బలమైన లైంగిక కోరికను రేకెత్తించగలదని ఒక బైబిలు విద్యార్థికి తెలియకుండా ఉండకూడదు. ఒక వేశ్యవల్ల ప్రలోభపెట్టబడిన ఒక యౌవనుని గురించి బైబిలు తెలియజేస్తుంది. అక్కడిలా చెప్పబడింది: “అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను.” (సామెతలు 7:13) సన్నిహితత్వం పెరిగే కొలది ఒక యౌవనుడు లేక యౌవనస్థురాలు లైంగికంగా ఎక్కువ పురికొల్పబడతారు. సూటిగా చెప్పాలంటే, శరీరం లైంగిక సంపర్కం కొరకు సిద్ధమౌతుంది.
ఒక జంట వివాహం చేసుకున్నట్లైతే, ఆనందంగాను, గౌరవపూర్వకంగాను వారు తమ కోరికలను తీర్చుకోవచ్చు. కాని అవివాహితులైన జంట కోరిక రేకెత్తించే లైంగిక ఆటలో పాల్గొంటే, తప్పకుండా సమస్యలు వస్తాయి. స్పర్శించడంలో పాల్గొన్న అనేకమంది యౌవనులు, వారి మాటల్లోనే చెప్పాలంటే, “అదుపు తప్పిపోయామని” బహిరంగంగా అంగీకరించినట్లు ఒక పరిశోధనలో, నాన్సీ వాన్ పెల్ట్ అనే రచయిత్రి తెల్పింది. గతంలో చేయనిదానికంటె యింకా హద్దుమీరడానికి వత్తిడి చేయబడిన ఒక యౌవనురాలు అందుకు నిదర్శనం. ఆమె లైంగిక సంపర్కంలో పాల్గొననప్పటికీ, ఒక అబ్బాయి తనను సన్నిహితంగా ముట్టుకోడానికి అనుమతించింది. ఆమె ఇలా చెబుతున్నది: “నాకిప్పుడు అసహ్యమనిపిస్తుంది.” ఆ అబ్బాయి తనను అలా చేయటానికి ఆమె అనుమతించడం నిజంగా తప్పా?
“హద్దు మీరడం” అంటే ఏమిటి?
కొంతమంది యౌవనులు, లైంగిక సంపర్కంలో పాల్గొననంత వరకు తాము హద్దు మీరిపోలేదని, తాము చేసేది నిజంగా తప్పుకాదని నమ్ముతారు. కాని బైబిలు మరో విధంగా చూపిస్తుంది. గలతీయులు 5:19-21లో అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము . . . ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.”
వ్యభిచారమంటే ఏమిటి? వ్యభిచారానికి ఆదిమ గ్రీకు పదం పోర్నియా. వివాహం కాకుండా తమ జననేంద్రియాలను ఉపయోగించి చేసే లైంగిక క్రియను అది సూచిస్తుంది. సెవెన్‌టీన్ అనే పత్రికలో ఉదహరించిన ఒక అమ్మాయి తన స్నేహితుడు వాగ్రూపమైన లైంగికతలో పాల్గొనేలా తనను వత్తిడి చేయడానికి అనుమతించింది. ఆమె ఇలా చెబుతుంది: “నేను నిజంగా తెలివి తక్కువదాన్ని, ఎందుకంటే నా స్నేహితులందరూ తమ మగ స్నేహితులతో అలాగే చేస్తున్నారని, నేను అలా చేయకపోతే అతన్ని కోల్పోతానని వారు అంటున్నారు.” అలాంటి లైంగిక దుర్నీతిలో చాలా ఎక్కువమంది యౌవనులు పాల్గొంటున్నారని పరిశోధన చూపిస్తుంది. అయితే, అలాంటి క్రియలు పోర్నియాకు (వ్యభిచారానికి) దారితీసి, దేవుని అనంగీకారాన్ని తెస్తాయి.
అపొస్తలుడైన పౌలు వ్యభిచారానికి “అపవిత్రతను” కూడా జత చేస్తున్నాడు. ఆదిమ గ్రీకు పదమైన అకాతార్‌సియా అనే మాట లేక క్రియ, ఏవిధమైన కల్మషమునైనా సూచిస్తుంది. ఒకరి చేతులు మరొకరి వస్త్రాల క్రింద ఉండటం, మరొకరి వస్త్రాలు తీసివేయటం, లేక రొమ్ముల వంటి మర్మావయవాలను స్పర్శించటం వంటి క్రియలను అనుమతించడం నిజంగా అపవిత్రమైనదే. ఎందుకంటే, రొమ్ములను స్పర్శించటం వివాహ జంటల ఆనందాలకు సంబంధించినదేనని బైబిలునందున్నది.—సామెతలు 5:18, 19; హోషేయ 2:2 పోల్చండి.
అయిననూ కొంతమంది యౌవనులు సిగ్గులేకుండా ఈ దైవిక కట్టడలను ధిక్కరిస్తారు. వారు ఉద్దేశపూర్వకంగా హద్దు మీరతారు, లేక వారు అత్యాశతో అపవిత్రమైన లైంగికత కొరకు అనేకమంది భాగస్వాములను వెతుక్కుంటారు. కాబట్టి వారు అపొస్తలుడైన పౌలు చెప్పిన “కాముకత్వము” అనే తప్పు చేసినవారవుతారు.
“కాముకత్వానికి” (అసెల్‌జియా) ఆదిమ గ్రీకు పదం యొక్క భావం ‘దౌర్జన్యపూరిత క్రియలు, అత్యాచారం, అమర్యాద, అదుపులేని కామోద్రేకము, దౌర్జన్యం’ అని అనేక రచనలు తెల్పుతున్నాయి. కాముకత్వం కలిగివుండే యౌవనులు పౌలు ఉదహరించిన అన్యజనులవలె ఉన్నారు. వారి “అంధకారమైన మనస్సునుబట్టి,” ఆ అన్యులు “సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.” (ఎఫెసీయులు 4:17-19) నిజంగా అలాంటి నిందకు గురికాకుండా ఉండడానికి మీరు ఇష్టపడతుండవచ్చు!
కాబట్టి, యెహోవా దృష్టి ప్రకారం, ఒకరు “హద్దు మీరడం” అంటే లైంగిక సంపర్కంలోనే పాల్గొన నక్కరలేదన్న సంగతిని గ్రహించండి. వివాహం చేసుకోవడానికి మీరు మరీ చిన్నవారైతే, మోహానుభూతితో స్పర్శించటం లేక ముద్దు పెట్టుకోవటం వంటివాటిలో పాల్గొనకూడదు. కలిసి తిరుగుతున్నవారు కూడా తమ అనురాగాన్ని ప్రదర్శించుకోవడంలో అపవిత్రమైపోకుండా జాగ్రత్తపడాలి. నిజమే, దైవిక కట్టడలకు తగినట్లుండడం అంత సుళువుకాదు. కాని దేవుడు యెషయా 48:17 నందు ఇలా చెబుతున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—గలతీయులు 5:16 కూడా చూడండి. (g93 10/22)
[13వ పేజీలోని చిత్రాలు]
మీరు అవివాహితులైతే, కోరికను రేకెత్తించే క్రియలో పాల్గొనడం నిరాశకు, అంతకంటే హీనమైనదానికి నడిపించవచ్చు