కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 6/8 పేజీలు 14-16
  • క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఎలా క్షమిస్తాడు
  • యెహోవా ఎలా మర్చిపోతాడు
  • మనమెలా క్షమించి, మర్చిపోగలం
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవా క్షమిస్తున్నట్లు మీరు క్షమిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 6/8 పేజీలు 14-16

బైబిలు ఉద్దేశము

క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?

“నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.”—యిర్మీయా 31:34.

యిర్మీయా ప్రవక్త వ్రాసిన ఆ మాటలు యెహోవా కరుణనుగూర్చి ఎంతో గంభీరమైన విషయాన్ని బయల్పరుస్తున్నాయి: ఆయన క్షమించి, మర్చిపోతాడు. (యెషయా 43:25) బైబిలింకనూ ఇలా తెల్పుతుంది: “ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) గనుక క్రైస్తవులుగా మనము క్షమించే విషయంలో యెహోవాను అనుకరించాలి.

అయిననూ, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలొస్తాయి. యెహోవా క్షమిస్తే, ఆయన మనపాపాలను ఇకెన్నడూ నిజంగా జ్ఞాపకంచేసికోడా? మరి మనం క్షమిస్తే, మనమెన్నడు జ్ఞాపకం చేసుకోలేని భావంలో మర్చిపోవాలా? మనం జ్ఞాపకంచేసికోలేని రీతిలో మర్చిపోకపోతే మనం నిజంగా క్షమించనట్లేనా?

యెహోవా ఎలా క్షమిస్తాడు

క్షమించడంలో కోపం మానుకోవడం ఇమిడివుంది. యెహోవా క్షమించినప్పుడు, ఆయన పూర్తిగా క్షమిస్తాడు.a కీర్తనల రచయితయైన దావీదు ఇలా వ్రాశాడు: “[యెహోవా] ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారునియెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.”—కీర్తన 103:9, 12, 13.

దేవుని పూర్ణ క్షమాపణనుగూర్చి అపొస్తలుల కార్యములు 3:20లో ఇంకా ఇలా వివరించబడింది: “మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి.” ‘తుడిచివేయబడు’ అనే పదం “తీసివేయబడు, తొలగించబడు” అనే భావమిచ్చే గ్రీకు క్రియాపదం (ఎ·క్జా·లైʹఫొ) నుండి వచ్చింది. (ప్రకటన 7:17; 21:4 చూడండి.) ది న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూటెస్ట్‌మెంట్‌ థియోలజీ ఇలా వివరిస్తుంది: “ఇక్కడను మరితరచోట్లను క్రియాపదం వ్యక్తపరచిన భావం బహుశ మరల వ్రాయడానికి అనుకూలంగా మైనపు పలకను నునుపు చేయడమైవున్నది ([పోల్చండి] ‘పలకను శుభ్రంగా తుడిచివేయడం’).” మనం మనపాపముల నిమిత్తం పశ్చాత్తాపపడితే యెహోవా వాటిని శుభ్రంగా తుడిచివేస్తాడు. అంటే ఇక ఆయన మనపాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసికొనడని దాని భావమా? బైబిలునందున్న ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం.

రాజైన దావీదు బత్షెబతో వ్యభిచరించి, ఆ తర్వాత ఆమె భర్తను చంపించడం ద్వారా ఆ విషయాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించినప్పుడు, దావీదును గద్దించడానికి యెహోవా నాతానును ఆయనయొద్దకు పంపాడు. (2 సమూయేలు 11:1-17; 12:1-12) తత్ఫలితమేమిటి? దావీదు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడ్డాడు, యెహోవా ఆయనను క్షమించాడు. (2 సమూయేలు 12:13; కీర్తన 32:1-5) యెహోవా దావీదు పాపాలను మర్చిపోయాడా? మర్చిపోలేదు! బైబిలు రచయితలు గాదు, నాతాను అనువారు ఆ తర్వాత, దావీదు మరణానికి కొంచెం ముందు 2 వ సమూయేలు గ్రంథంలో (సుమారు సా.శ.పూ.1040లో పూర్తిచేయబడింది) ఈ సంఘటనను గూర్చి పూర్తిగా వ్రాశారు.

గనుక దావీదు పాపములను గూర్చిన చరిత్ర లేక జ్ఞాపకసమాచారము—మరియు ఆయన పశ్చాత్తాపము, యెహోవా ఆయనను క్షమించడం—ఈనాడు బైబిలు పాఠకుల ప్రయోజనార్ధం జ్ఞాపకంగా నిలిచివుంది. (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11) నిజానికి, “ప్రభువు వాక్యము (బైబిలునందున్నట్లుగా) ఎల్లప్పుడును నిలుచును,” గనుక దావీదు పాపములను గూర్చిన వృత్తాంతము ఎన్నటికి మరువబడదు!—1 పేతురు 1:24.

మరైతే, మనం మన పాపములను గూర్చి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఆ పాపపు పలకను పూర్తిగా తుడిచివేస్తాడని ఎలా చెప్పవచ్చు? “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను,” అని యెహోవా చెప్పిన మాటలను మనమెలా అర్ధం చేసుకోవచ్చు?—యిర్మీయా 31:34.

యెహోవా ఎలా మర్చిపోతాడు

“నేను జ్ఞాపకం చేసికొందును” (జా·ఖర్‌ʹ యొక్క ఒక రూపం) అని అనువదించబడిన హెబ్రీపద భావం, గతాన్ని మనస్సుకు తెచ్చుకొనుటని మాత్రమే కాదు. థియొలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ప్రకారం “ప్రస్తావించుట, ప్రకటించుట, వల్లించుట, చాటించుట, వేడుకొనుట, కొనియాడుట, నిందించుట, తప్పొప్పుకొనుట” అనే అర్ధాలు రావచ్చు. ది థియొలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ఇంకనూ ఇలా చెబుతోంది: “నిజానికి, తరచూ ఇది [జా·ఖర్‌ʹ] ఓ క్రియను సూచిస్తుంది లేక క్రియాపదాలకు సంబంధించివున్నట్లు కనిపిస్తుంది.” అలా, యెహోవా అవిధేయులైన తన ప్రజల “అక్రమమును జ్ఞాపకం చేసికొందును” అని అన్నప్పుడు వారు పశ్చాత్తాపపడనందుకు వారికి విరోధంగా చర్య తీసుకుంటాడని అర్ధం. (యిర్మీయా 14:10) “నేను . . . వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను,” అని యెహోవా తిరిగి అన్నప్పుడు ఆయన ఒకసారి మన పాపములను క్షమిస్తే, మరల నేరం మోపడానికి, తప్పుపట్టడానికి, లేక మనల్ని శిక్షించడానికి ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడని మనకాయన అభయమిస్తున్నాడు.

యెహోవా, తాను క్షమించి మర్చిపోయే విషయంలోని భావాన్నిగూర్చి యెహెజ్కేలు ప్రవక్తద్వారా ఇలా వివరించాడు. “దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.” (యెహెజ్కేలు 18:21,22; 33:14-16) అవును, పశ్చాత్తాపపడిన పాపిని యెహోవా క్షమిస్తే ఆయన ఆ పలకను శుభ్రంగా తుడిచి, ఆ పాపములనుబట్టి ఎప్పుడో భవిష్యత్‌లో మరల శిక్షించడనే భావంలో మర్చిపోతాడు.—రోమీయులు 4:7, 8.

అపరిపూర్ణులుగా మనం యెహోవావలె ఎన్నటికి పరిపూర్ణంగా క్షమించలేము; ఆయన తలంపులు, మార్గాలు మనకంటె ఎంతో ఉన్నతమైనవి. (యెషయా 55:8, 9) మరి ఇతరులు మనయెడల పాపంచేస్తే, మనమెంతవరకు కారణసహితంగా క్షమించి, మర్చిపోగలం?

మనమెలా క్షమించి, మర్చిపోగలం

“మీరును ఒకరినొకరు క్షమించుడి,” అని ఎఫెసీయులు 4:32 ఉద్బోధిస్తుంది. నిఘంటుకారుడైన డబ్ల్యు.ఇ. వైన్‌ ప్రకారం, ‘ఉచితంగా క్షమించుడి’ (ఖా·రిʹజొ·మాయ్‌) అని అనువదించబడిన గ్రీకుపదానికి “షరతులేకుండానే దయ చూపించడమని” అర్ధం. మనయెడల చేసిన తప్పులు స్వల్పమైనవైతే, క్షమించడానికి మనకు అంతకష్టమేమీ కాదు. మనం కూడ అపరిపూర్ణులమేనని జ్ఞాపకముంచుకోవడం ఇతరుల తప్పులను మనం క్షమించడాన్ని సాధ్యం చేస్తుంది. (కొలస్సయులు 3:13) మనం క్షమించినప్పుడు, మనం కోపాన్ని మానుకుంటాము, తప్పిదస్థునితో మనకున్న సంబంధం శాశ్వతంగా దెబ్బతినదు. కొంతకాలానికి అటువంటి చిన్నచిన్న తప్పులు జ్ఞాపకానికి రాకపోవచ్చు.

అయితే, ఇతరులు మనల్ని ఎంతో గాయపర్చే విధంగా గంభీరమైన పాపంచేస్తే అప్పుడేమిటి? అతి తీవ్రమైన సందర్భాల్లో అంటే రక్తసంబంధులే బలాత్కారం, మానభంగం మరియు హత్యాప్రయత్నంచేస్తే అప్పుడు క్షమించే విషయంలో వివిధ పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. నేరస్థుడు పాపాన్ని అంగీకరించకపోతే, పశ్చాత్తాపపడకపోతే మరియు క్షమాపణ కోరకపోతే ఇలా పరిగణలోనికి తీసుకోవడం తప్పనిసరౌతుంది.b (సామెతలు 28:13) యెహోవాకూడ పశ్చాత్తాపపడని, పాషాణులైన తప్పిదస్తులను క్షమించడు. (హెబ్రీయులు 6:4-6; 10:26) గాయం తీవ్రమైనదైతే, జరిగిన దాన్ని మన మనస్సులో నుండి పూర్తిగా తొలగించుకోవడంలో మనమెన్నటికి సఫలీకృతులమవ్వక పోవచ్చు. అయిననూ, రాబోవు నూతనలోకంలో “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు,” అన్న అభయంవల్ల మనం ఓదార్పు పొందగలం. (యెషయా 65:17; ప్రకటన 21:4) ఈనాడు మనం బాధపడుతున్నట్లు, ఆనాడు మనం జ్ఞాపకం చేసుకునేదేదైనా మనకు తీవ్రమైన బాధను లేక వేదనను కల్గించదు.

మరితర సందర్భాల్లో, మనం క్షమించకముందు బహుశ తప్పిదస్థునితో మాట్లాడడంద్వారా, పరిస్థితులను చక్కదిద్దడానికి ముందుకు రావలసిన అవసరముండవచ్చు. (ఎఫెసీయులు 4:26) ఈ విధంగా ఏవైనా అపోహలుంటే వాటిని తొలగించి, తగిన క్షమాపణలు చెప్పుకుని, క్షమించవచ్చు. మర్చిపోవడం సంగతేమిటి? జరిగినదాన్ని మనమెన్నటికి మన మనస్సుల్లోనుండి పూర్తిగా తీసివేసికోలేము గానీ, తప్పిదస్తునికి విరోధంగా దానిని మనస్సులో పెట్టుకోని రీతిగా లేక భవిష్యత్‌లో ఏనాడో ఒకనాడు దాన్ని మరల ప్రస్తావించని విధంగా మర్చిపోగలం. మనం దాన్నిగూర్చి వదరకుండా ఉంటాం లేక తప్పిదస్థున్ని పూర్తిగా తప్పించుకొని తిరగము. అయిననూ, తప్పిదస్థునితో మనసంబంధం మెరుగుపడడానికి కొంత సమయం పట్టవచ్చు మరియు మనం ముందున్నంత సన్నిహితంగా ఇప్పుడుండలేము.

ఓ ఉదాహరణ పరిశీలించండి: మంచినమ్మకస్థుడైన మిత్రునికి మీరు అతిరహస్యమైన ఒక విషయాన్ని చెప్తే, మిమ్మల్నెంతో కలవరపెట్టేలా లేక హానికల్గించేలా అతడా రహస్యాన్ని ఇతరులతో పొక్కాడని మీరు తర్వాత తెలుసుకుంటారనుకోండి. మీరతని దగ్గరికి వెళ్ళి ఆ విషయాలనుగూర్చి మాట్లాడినప్పుడు, అతడు ఎంతో బాధపడతాడు; అతడు తప్పొప్పుకొని, మిమ్మల్ని క్షమాపణ కోరతాడు. అతని యథార్ధతోకూడిన అభ్యర్థనను విన్నప్పుడు, అతన్ని క్షమించేందుకు మీ హృదయం ప్రేరేపించబడుతుంది. అయితే జరిగినదాన్ని మీరంత సులభంగా మర్చిపోతారా? బహుశ మర్చిపోలేరు; నిస్సందేహంగా, భవిష్యత్తులో అతనికి రహస్యాలు చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా మీరతన్ని క్షమిస్తారు; అతనితో మీరు ఆ విషయాన్ని మాటిమాటికి మాట్లాడరు. మీరు కోపాన్ని కడుపులో దాచుకోరు, లేక ఆ విషయాన్ని ఇతరులకు చెప్పరు. మీరతనితో ముందున్నంత సన్నిహితంగా ఉండాలనుకోరు, అయినా మీరతన్నింకా మీ క్రైస్తవ సహోదరునిగా ప్రేమిస్తారు.—సామెతలు 20:19 పోల్చండి.

అయితే, విషయాలను చక్కదిద్దాలని మీరు ప్రయత్నించినా తప్పిదస్తుడు తన తప్పొప్పుకొని క్షమాపణ అడక్కపోతే అప్పుడేమిటి? కోపంమానుకునే రీతిలో మీరు క్షమించగలరా? ఇతరులను క్షమించడమంటే వారు చేసినదాన్ని మన్నిస్తామని లేక దాని గాంభీర్యాన్ని తగ్గిస్తామని దాని భావం కాదు. ఆగ్రహమనేది మోయజాలనంత బరువుగలది; అది మన బుర్ర తినేసి, సమాధానం లేకుండా చేయగలదు. ఎన్నడూ రానటువంటి క్షమాపణకొరకు ఎదురుచూడటం మనకింకా విసుగు కల్గించవచ్చు. దాన్నిబట్టి తప్పిదస్థుడు మన భావాలను అదుపుచేయడాన్ని మనం అనుమతిస్తున్నాము. అందుచేత, వారి ప్రయోజనం కొరకేగాక, మనం ప్రశాంతంగా జీవించడానికి కూడ మనం ఇతరులను క్షమించాలి లేక కోపం మానుకోవాలి.

ఇతరులను క్షమించడం ఎప్పుడూ అంత సులభంకాదు. అయితే, నిజమైన పశ్చాత్తాపము కనబరిస్తే, మనం యెహోవా చూపే క్షమాపణను అనుకరించడానికి ప్రయత్నించగలం. ఆయన పశ్చాత్తాపపడిన తప్పిదస్తులను క్షమించినప్పుడు, ఇక కోపగించడు; ఆయన పలకను శుభ్రంగా తుడుస్తాడు, అంటే భవిష్యత్తులో మరలా ఆ పాపములను వారిమీద మోపకుండే రీతిలో మర్చిపోతాడు. మనం కూడ తప్పిదస్థుడు పశ్చాత్తాపపడితే కోపం విడిచిపెట్టేందుకు కృషిచేయాలి. అయినా, మనం క్షమించడానికి ఒప్పుకొనని పరిస్థితులు కొన్ని ఉండవచ్చు. పశ్చాత్తాపపడని తప్పిదస్తున్ని క్షమించాలని దురాగతానికి లేక అన్యాయానికి గురైన ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదు. (కీర్తన 139:21, 22 పోల్చండి.) అయితే అనేక సందర్భాల్లో, ఇతరులు మన ఎడల పాపంచేస్తే కోపం తీసివేసుకునే రీతిలో మనం క్షమించగలం, మరియు భవిష్యత్తులో ఎప్పుడో దాన్ని మన సహోదరునిపై మోపకుండా ఉండే భావంలో మర్చిపోగలం.

[అధస్సూచీలు]

a డిశంబరు 8, 1993, తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 18-19 పేజీల్లోని “బైబిలు ఉద్దేశము: దేవుని క్షమాపణ ఎంత పూర్ణంగా ఉంటుంది?” అనే శీర్షికను చూడండి.

b లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 1, పేజీ 862, ఇలా చెబుతుంది: “పశ్చాత్తాపం లేకుండా, బుద్ధిపూర్వకమైన, ఘోరమైన పాపానికి అలవాటుపడిన వారి పాపాలను క్రైస్తవులు క్షమించనక్కర్లేదు. అలాంటివారు దేవునికి శత్రువులౌతారు.”—న్యూయార్క్‌లోని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఇన్‌కార్పొరేటెడ్‌ ప్రచురించింది.

[14వ పేజీలోని చిత్రం]

యోసేపు, అతని సహోదరులు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి