జీవితమునకు ఇంకనూ చాలా ఉన్నది!
1. ఎందుకు ఎంతోమంది జీవితంలో అంత తక్కువ ఆనందాన్ని పొందుతున్నారు? (ప్రసంగి 1:14, 15; 2:17, 18)
శాంతి, సౌభాగ్యాలు, ఓ మంచి జీవితం! ఇవి ఎంత ప్రీతికరమైన విషయాలో గదా! అయితే మీరు మీ రోజులను ఎలా గడుపుతున్నారు? తమ కుటుంబాన్ని పోషించే పురుషులు, తమకు యిష్టంలేని ఉద్యోగాలు చేస్తుంటారు మరియు అనేకులు ఎడతెగక నిరుద్యోగ భయాన్ని ఎదుర్కొంటున్నారు. అనేకమంది గృహిణులకు చాకిరీ చేయవల్సివుంటుంది, ఏ రోజూ తగిన విశ్రాంతీ ఉండదూ పెద్దగా ఏ సంతృప్తీ మిగలదు. అనేకమంది యౌవనులు అలాంటి జీవిత ఉత్తరాపేక్షలోనే పెరుగుతారు. జీవితం సాఫీగా గడచిందని భావించే కొందరికి సహితం భవిష్యత్తు అనిశ్చయంగా ఉంది.
2. మానవజాతికి భవిష్యత్తు ఎలా కనిపిస్తోంది? (యెషయా 60:2)
2 వాస్తవానికి జీవితానికి ఉన్నది ఇది మాత్రమేనా? ప్రపంచంలో మీరు ఎక్కడచూసినా ఈ విధానం ఘోర సంకటంలో ఉన్నట్లుగా ఉంది. దానికి దాని ఇంధన కొరత, అదుపుతప్పిన ద్రవోల్బణం, ఆహారకొరతలూ మరియు వాతావరణ కాలుష్యం, విప్లవాలు ప్రచ్ఛన్న, ప్రత్యక్ష యుద్ధాలూ అణ్వాయుధాలను పేర్చుకోవడం, జాత్యంతరం సమస్యలూ మరియు మానవజాతినందలి అనేకుల మధ్య అసంతృప్తి అంతకంతకు ఎక్కువౌతున్నది. భూమిలో ఏ భాగమూ కూడా, మానవ జీవానికి మరియు మనుగడకూ ముప్పును తెచ్చే సమస్యలు లేకుండావున్న ప్రాంతం లేదు!
3. మనం భవిష్యత్తును గూర్చి ఎందుకు పట్టించుకోవాలి? (ప్రకటన 3:10)
3 ‘అది నాకు సంభవించనంతవకు దానిని ఎవరు పట్టించుకుంటారు?’ అనే దృక్పథం కొందరు ప్రజలకున్నట్లు కన్పిస్తోంది. కానీ వారు ఎంత అల్పదృష్టిగలవారో కదా! ఈ సమస్యలు ప్రతిఒక్కరి జీవితాన్ని తప్పక ప్రభావితం చేస్తాయన్నది కాదనలేని నిర్ధారిత విషయం.
4, 5. (ఎ) అధికశాతం మంది మానవులు ఏ దృక్పథాన్ని కల్గివున్నారు, మరి ఎందుకు? (బి) బైబిలునందు పరిష్కారం ఎందుకు ఉండగలదు? (2 తిమోతి 3:16, 17; రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11)
4 మానవ నాయకులు అంతర్జాతీయంగా ఆర్థిక, వైజ్ఞానిక మరియు రాజకీయ రంగాల్లో సాధ్యంకాగలవనే పరిష్కారాలను ప్రతిపాదించారు. అయితే ఇవన్నీ శూన్యమైనవిగానూ అసంతృప్తికరమైనవిగానూ నిరూపించబడలేదా? విముక్తి కొరకు ప్రతిపాదించిన యోజనలు కనీసం ‘చక్కగా ఆరంభించబడను కూడా లేదు.’ ఏ ప్రపంచ నాయకుడు కూడా యథార్థమైన దీర్ఘకాలిక పరిష్కారాలను అందించలేడు. తత్ఫలితంగా, మానవజాతిలోని అధికశాతం మంది జీవితంలో ఓ సంకల్పంలేకుండా ఉన్నట్లు ఉన్నారు; “రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము” అనే తేలికైన దృక్పథాన్ని కల్గివున్నారు.
5 చివర్న సూచించిన ఈ మాటలు బైబిలునందు 1 కొరింథీయులు 15:32a నందు కనిపిస్తాయి. అయితే అవి ఓ అనుకూలమైన దృక్పథాన్ని ప్రోత్సహించే సందర్భంలో చెప్పబడ్డాయి. మానవజాతి సమస్యలకు పరిష్కారం బైబిల్లో ఉండవచ్చంటారా? నిస్సందేహంగా, బైబిలును తిరస్కరించే అనేకమంది ప్రజలున్నారు. అయితే, లోక వ్యవహారాల అపాయకరమైన పరిస్థితి దృష్ట్యా, బైబిలును మరొకసారి పరిశీలించే సమయం ఇదే. ఎంతలేదన్నా, ఇది ఎంతో ప్రాచీన పుస్తకం, దానిలో కొన్ని భాగాలు 3,400 సంవత్సరాల క్రితం వ్రాయబడినవి. అది మానవజాతిలోని అన్ని తెగల ప్రజల గౌరవాన్ని పొందింది. ఇప్పుడున్న భాషల్లో అధికమొత్తంలోకి అనువదించబడింది మరియు మానవ చరిత్రలో ప్రాచుర్యాన్ని పొందిన ఇతర ప్రచురణల అందిపులన్నింటినీ దాని అందింపు మించిపోయింది. మరి అది జీవితమునకు ఇంకనూ చాలా ఉన్నదని చూపిస్తోందా?
జీవిత సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడం
6. బైబిలు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఎలా దృష్టిస్తుంది? (యాకోబు 1:27; 5:3-5)
6 కొందరు బైబిలు విమర్శకులు, క్రైస్తవమత సామ్రాజ్యం పేదలను దోచుకుందని మత దండయాత్రలు, క్రూర మత విచారణలు మత న్యాయ సభలూ మరియు ఈ ఇరవయ్యో శతాబ్దపు యుద్ధాల్లో ఎందరో అమాయకుల రక్తాన్ని చిందించిందని ఎత్తి చూపించారు. ‘ప్రజలు అలా ప్రవర్తించేందుకు బైబిలు కారణమైతే, దానిలోనుండి మాకు ఏమీ అవసరంలేదు’ అని వారు అంటారు. అయితే రక్తాపరాధులైన అలాంటి వ్యక్తులు బైబిలును క్రైస్తవేతర క్రియలకు ఒక సాకుగా మాత్రమే ఉపయోగించారు. బైబిలు తానే వారి క్రియలను గట్టిగా ఖండిస్తుంది మరియు క్రైస్తవులకు విరుద్ధమైన వారని చూపుతోంది. ఒక నిజమైన నైతిక జీవితాన్ని జీవించాలని బైబిలు చెబుతోంది.
7, 8. (ఎ) బైబిలు ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలదు? (మత్తయి 7:7) (బి) బైబిలు అనేకమంది వ్యక్తులకు ఎలా సహాయపడింది? (కీర్తన 119:105, 165)
7 ఇతర విమర్శకులు, బైబిలు విజ్ఞానశాస్త్ర సంబంధమైనది కాదని, పాతబడినదని మరియు అది కట్టుకథల పుస్తకమనీ చెబుతున్నారు. మరి అది నిజమేనా? మనిషి ఎక్కడనుండి వచ్చాడు? ప్రస్తుత పరిస్థితులకుగల భావమేమిటి? మానవజాతి భూమి మీదినుండి నాశనం చేయబడుతుందా? మానవజాతి కొరకు భవిష్యత్తు ఏమి కల్గివుంది? మన జీవితాన్ని ప్రభావితం చేసే అలాంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు ఒప్పింపజేసే జవాబులను కనుగొనాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.
8 వీటికీ మరియు ప్రజలు తరచూ అడిగే ఇతర అనేక ప్రశ్నలకు బైబిలు జవాబునిస్తుంది. కట్టుకథలతో వ్యవహరించకుండ బైబిలు వాస్తవాలతో వ్యవహరిస్తుంది. వాస్తవమేమిటంటే, ప్రపంచంలోని అన్ని భాగాల్లోని వ్యక్తులూ తమ జీవితాలు తమకు నిజమైను తృప్తినీ, సంతుష్టతనూ తెచ్చేలా జీవించేందుకు నడిపించింది. మీరు బైబిలును పరిశీలించినప్పుడు, అది మీ ప్రశ్నలకు జవాబునిస్తుందనీ మరియు మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని కనుగొనేందుకు మీకు ఆచరణాత్మకమైన సహాయాన్ని అందిస్తుందని మీరు కనుగొంటారు.
విశ్వం ఉనికిలోకి ఎలా వచ్చింది
9, 10. (ఎ) బైబిలు ప్రకారం, విశ్వం యొక్క పుట్టుక ఏమిటి? (యెషయా 45:12, 18) (బి) సృష్టిని గూర్చి విశ్వం తానుగా ఏమని సాక్ష్యమిస్తోంది? (హెబ్రీయులు 3:4)
9 జీవితమంటే అసలు ఏమిటని కనుగొనేందుకుగాను, జవాబు పొందాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో జీవం యొక్క ఆరంభమేమిటి, అనేది ఒకటి. మరో మాటలో చెప్పాలంటే, మనం ఎక్కడ నుండి వచ్చాము? మనం జీవించి ఉండడంలో ఉద్దేశమేమైనా ఉందా? “దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:1) ఆధునిక దిన ఆలోచనాకర్తలు ఇలా ప్రశ్నిస్తున్నారు: సర్వశక్తిగల దేవుడు, ఓ సృష్టికర్త అనేవాడు నిజంగా ఉన్నాడా? విశ్వం పరిణామ ఫలితమని అనేకమంది ప్రజలు అనుకుంటున్నారన్నది నిజంకాదా?
10 మీరెప్పుడైనా నక్షత్రశాల దర్శించారా? దర్శించినట్లయితే, ఆకాశాన్ని సరైన విధంగా గోళాకారపు కలశముపై చూపించేందుకు రూపొందించిన సంశ్లిష్టమైన పనితనాన్ని మరియు మన సూర్య కుటుంబపు కదలిక యొక్క సరైన విధానాన్ని చూసి మీరు నిస్సందేహంగా ఆశ్చర్యపోయివుండవచ్చు. ఎంత అమోఘమైన మానవ ఫోటోగ్రఫీ మరియు ఇంజినీరింగ్ నైపుణ్యత ఫలమోకదా అని మీరు అనుకుని ఉండవచ్చు. విశ్వాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించేందుకు అంత నిపుణతగల వ్యక్తులు అవసరమైనట్లయితే, అత్యద్భుతకరమైన విశ్వాన్నే నిర్మించేందుకు ఇంకా ఎంతో అధికమైన సమర్థవంతమైన జ్ఞానం అవసరమైవుంటుంది.
11. విద్యావంతులైన లౌకిక జ్ఞానులు కొందరు ఏమని అంగీకరించేందుకు బలవంతం చేయబడ్డారు? (రోమీయులు 1:20-23)
11 పందొమ్మిదవ శతాబ్దంలో, చార్ల్స్ డార్విన్ విశ్వం పరిణామ ఫలితమని చెప్పాడు. అయితే, వీటినన్నింటిని ఎవరూ సృజించలేదని మీరు కూడా అనుకుంటున్నారా? జీవితం ప్రమాదవశాత్తు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అనేకమంది జ్ఞానంగల వ్యక్తులు పరిణామ సిద్ధాంతం లోపంగలదని కనుగొన్నారు. ఉదాహరణకు ఆర్ల్నోల్డ్ టోన్‌బీ ఇలా పేర్కొన్నాడు:
“విశ్వం ఉనికిలోనికి తీసుకురాబడిన విధానంలో ప్రత్యామ్నాయ పద్ధతి యొక్క అనుకూల వృత్తాంతాన్ని డార్విన్ సిద్ధాంతం ఇచ్చిందని నేను అనుకోవడం లేదు.”
అంతెందుకు, డార్విన్ కూడా జీవిత మూలాన్ని చర్చించేటప్పుడు ఇలా ఒప్పుకున్నాడు:
“దేవుడు ఉనికిలో ఉన్నాడనే నమ్మకానికున్న మరో మూలకారణం, భావావేశాలతో కాదుగాని సహేతుకత్వంతో సంబంధం కల్గివుండటం నన్ను మూర్ఖున్ని చేస్తుంది . . . ఓ గ్రుడ్డి ఆకస్మిక సంఘటన లేదా అవసరత ఫలితంగా ఈ అనంత, అద్భుతమైన విశ్వం, ఆలాగే భూత భవిష్యత్ కాలాల్ని గూర్చి ఆలోచించగల మానవుని అపార సామర్థ్యం కలిగాయనే తలంపు లేక గ్రహింపు అత్యంత కష్టభరితం లేదా అసాధ్యమనే చెప్పాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు, నేను మొదటి కారణంవైపు బలవంతంగా చూడాల్సివస్తుందనే భావన కలుగుతోంది. అలా ఆలోచించేటప్పుడు, మూల కారకునివైపుకు నేను చూసేందుకు అది నన్ను బలవంతుణ్ణి చేస్తుంది.”
12. మనం వినయంగా ఏమని అంగీకరించాలి మరియు ఎందుకు? (అపొస్తలుల కార్యములు 14:15-17)
12 అవును, మహాగొప్ప మొదటి కారణం అంటే ఓ సృష్టికర్తయిన దేవుడు ఉన్నాడని సరళమైన తర్కన మనకు చెబుతుంది! మరి మానవుని అతి శక్తివంతమైన దుర్భిణులు ఆయన అద్భుతమైన విశ్వపు లోతుల్లోకి తొంగి చూడడం మాత్రమే ఆరంభించాయని మనం తెలుసుకున్నప్పుడు, మానవుని జ్ఞానము మరియు సామర్థ్యాలు, దేవుని అపారమైన జ్ఞానం మరియు శక్తివల్ల నిజంగా తగ్గించబడతాయన్న వాస్తవాన్ని మనం వినయంగా అంగీకరించాలి. మనం ఆనందభరితమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటే దేవున్ని మనం తెరమీదినుండి తొలగించలేము అన్న విషయాన్ని మనం చూడగలము. మన భూమితో సహా విశ్వాన్ని సృష్టించడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉండివుండవచ్చు. ఆయన గొప్ప సంకల్పాలను గూర్చి మనం ఎక్కువగా నేర్చుకొనుచుండగా, జీవితానికి ఇంకనూ చాలా ఉందని మనం అపేక్షించవచ్చు!
భూమి మీది జీవితం ఎలా ప్రారంభమైంది
13. దేవుని సృష్టిలో ఈ భూమి ఎందుకు విశేషమైనది? (కీర్తన 104:24)
13 విశాలమైన విశ్వంలోని ఈ చిన్న రేణువైన భూమివైపు ఇప్పుడు మన అవధానాన్ని నిలుపుదాము. ఈ భూమికి ప్రత్యేకమైన అందం ఉంది. అది రంగుతో రూపుదిద్దబడి, అద్భుతమైన రకరకాల జీవరాసులతో అలంకరింపబడివుంది. దానిలో జీవం ఉంది. చంద్రునిపైకి ప్రయాణించిన వ్యోమగాముల్లో ఒకరు దాన్ని ఇలా వర్ణించారు:
“విశ్వమంతటిలో, ఎటు ప్రక్క మేము చూసినా రంగున్నది ఒక్క భూమిమీద మాత్రమే. అక్కడ మేము సముద్రాల చక్కని నీలిరంగునూ, భూమిపై నీలిఎరుపు కలగలసిన రంగును, గోధుమ రంగును మరియు మేఘాల తెలుపును చూశాము. . . . ఆకాశమంతటిలో కనులవిందు కలిగించింది అది ఒక్కటే. ఇక్కడున్న ప్రజలు తమ వద్ద ఉన్నవేమిటో గ్రహించరు.”
విశాలమైన విశ్వంలో భూమి ఓ రత్నంలా మెరుస్తుందనడంలో ఏ సందేహమూ లేదు. అది వాస్తవానికి జీవంతో నిండివుంది. మరియు ఈ జీవమంతటిలోనూ ఓ సంకల్పం తప్పక ఉండివుండవచ్చు! ఈ సంకల్పమేమిటో మనం కనుగొనగలమేమో ఇప్పుడు చూద్దాము.
14. జీవం ఎక్కడనుండి వచ్చింది మరియు ఎలా? (కీర్తన 104:30, 31)
14 జీవం ఎక్కడనుండి వచ్చిందన్న విషయాన్ని కనుగొనడం అంత కష్టమైంది కాదు. ఓ బైబిలు రచయిత 3,000 సంవత్సరాల క్రితం ఇలా ప్రకటించినప్పుడు ఆ ఆధారాన్ని సూచించాడు:
“దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది . . . నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.”—కీర్తన 36:7, 9.
బైబిలును గట్టిగా విమర్శించేవారు జీవానికి మూలం దేవుడేనని అంగీకరిచాల్సివచ్చింది. మొదట జీవాన్ని “కొన్ని రూపాల్లోకి లేదా ఒకదానిలోకి సృష్టికర్తే ఊదాడని” పరిణామ సిద్ధాంతియైన డార్విన్ సహితం అంగీకరించాడు. అయితే దేవుడు “కొన్ని రూపాల్లోకి” జీవాన్ని ఊదగల్గినట్లయితే, వాటివాటి కాలంలో వందలకొలది సృష్టింపబడిన “జాతుల్లోకి” అదేవిధంగా ఎందుకు ఊదకూడదు? ఆయన సరిగ్గా అదే చేశాడని బైబిలు చెబుతోంది! ఆయన ప్రతి జీవిని “దాని దాని జాతి ప్రకారం” సృజించాడు. (ఆదికాండము 1:12, 21, 24, 25) మొదటి మానవున్ని దేవుడు సృష్టించడాన్ని ఈ మాటల్లో వర్ణించడం జరిగింది:
“దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.”—ఆదికాండము 2:7.
బైబిలు ప్రకారం, మానవ జీవితం కేవలం 6,000 సంవత్సరాల క్రితం—దేవుని ద్వారా నేరుగా సృష్టించబడడంవల్ల ఉనికిలోకి వచ్చింది. జీవితానికి ఇంకనూ చాలా ఉన్నదనే విషయాన్ని మెచ్చుకునేందుకు ఆ వాస్తవాన్ని మనం అర్థంచేసుకోవడం ప్రాముఖ్యం.
15. జీవం అకస్మాత్తుగా రాగలదా? (కీర్తన 100:3)
15 బైబిలులోని సృష్టి యొక్క సూటియైన సమాచార వృత్తాంతానికి భిన్నంగా ఉన్న పరిణామ సిద్ధాంతాల కొన్ని వివరణలు భ్రాంతికల్గించే కల్పనల్లా ఉంటాయి. ఉదాహరణకు, ఓ పరిణామ విజ్ఞానవేత్త ఇలా వ్రాస్తున్నాడు:
“ఒకనాడెప్పుడో, చాలా కాలంక్రితం, బహుశ రెండున్నర వందలకోట్ల సంవత్సరాల క్రితం, భయంకరమైన సూర్యుని క్రింద నవాసారముతో నిండిన మహా సముద్రంపైనున్న విషపూరితమైన వాతావరణంలో, ఏదోకలాగా దానివంటి వాటినే ఉనికిలోకి తీసుకురాగల రసాయనిక పరమాణువుల సేంద్రియజలం మధ్య ఓ న్యూక్లిక్ ఆసిడ్ పరమాణువు ప్రమాదవశాత్తు ఉనికిలోకి వచ్చింది—ఇక దానినుండి అన్ని వచ్చాయి!” (ఇటాలిక్కులు మేము పెట్టినవే)
అది మిమ్మల్ని ఒప్పిస్తుందా? పరిణామ సిద్ధాంతియైన లెకొమ్‌టే డ్యూ నోవే ఒక్క ప్రోటీన్ పరమాణువు అకస్మాత్తుగా దానంతటదే భూమియంతటి విస్తారమైన రసాయనిక సముద్రంలో, అనుకూలమైన పరిస్థితులందు ఉత్పత్తి చేసుకోగల్గడాన్ని లెక్కించాడు. అది, 10 వందల కోట్ల సంవత్సరాల్లో (అంటే 1 తర్వాత 243 సున్నాలు) మాత్రమే సంభవించే అవకాశముందని చెప్పాడు. అయినప్పటికీ, ఓ జీవకణం ఒకదానితో కాదు వందలకొలది ప్రోటీన్ పరమాణువులతో అలాగే సంశ్లిష్టమైన పదార్థాలతో తయారు చేయబడింది! నిశ్చయంగా జీవం అకస్మాత్తుగా రానేలేదు!
16. పరిణామ సిద్ధాంతాన్ని “కట్టుకథ” అని ఎందుకు అనవచ్చు? (1 తిమోతి 1:3, 4)
16 వాస్తవాలతో విరుద్ధమైన విషయాలు పరిణామ సిద్ధాంతలో చాలా ఉన్నాయి! ఉదాహరణకు, జీవించేవైన చెట్లు, జంతువులూ మానవునిలోని మార్పులేని జన్యునియమం ద్వారా ప్రతిదీ దాని దాని జాతి ప్రకారం మాత్రమే ఉత్పత్తికాగలదు. జాతు లందే మార్పు ఉండగలదు, వాటిని కుక్కల రకాల్లో మనం చూడగలము. అయితే కుక్క జాతి అన్ని సమయాల్లో కుక్కలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దాన్ని పిల్లులతో జతచేయలేము, లేక వేరే ఏ ఇతర జాతులతో జత చేయలేము. పరిణామ సైద్ధాంతులకు ఎంతో నిరుత్సాహం కల్గించేలా, బండరాళ్లలోని అవశేషాలు కూడా జాతుల మధ్య ఉండాలని ముందేచెప్పబడిన “లభ్యంకాని సంబంధాల్ని” అందివ్వలేకపోయాయి. మధ్య జాతులను కనుగొనడంలో విఫలంకావడం పరిణామ సైద్ధాంతులకు నిరుత్సాహకరమైంది. అంతేకాకుండ, “మ్యూటేషన్లు” లేక కణాల మార్పులు, ఇంచుమించు అన్నిసార్లు అపాయకరంగా ఉండి—పరిణామం చెప్పేదానికి విరుద్ధంగా—మానవజాతి విషయంలో ఎల్లప్పుడూ మోంగోలాయిడ్స్‌ను లేక ఇతర లోపంగల మానవులను ఉత్పత్తిచేస్తోంది. “కల్పన,” “తెలివిగా ఊహించుట” మరియు “విజ్ఞానశాస్త్రం అనే పేరు క్రింద దాగివున్న గొప్ప కట్టుకథ” వంటి పదాలతో కొందరు పేరుగాంచిన వైజ్ఞానికులు పరిణామాన్ని వర్ణించడంలో ఆశ్చర్యంలేదు.
17. జంతువులకంటే కూడా మానవుడు ఏ విధాల్లో మరి అద్భుతంగా సృష్టించబడ్డాడు? (ఆదికాండము 1:27, 28)
17 అయితే మానవుడు తానే ఓ “కల్పన” కాడు. అతను జీవిస్తున్నాడు. “దేవుని స్వరూపమందు” సృజించబడిన జ్ఞానయుక్తమైన నైతిక సృష్టిగా అతను జీవించడం మరియు మనస్సాక్షివల్ల నడిపించబడడం అతను అల్పమైన జీవ రాసులనుండి పూర్తిగా వేరుగా ఉన్నాడని చూపుతోంది. కనుక, ఊరికే జంతువుల్లా మనుగడ సాగించడంకంటే జీవితానికి ఇంకనూ చాలా ఉంది. మానవున్ని జంతువులనుండి ఓ పెద్ద అగాధం వేరుపరుస్తుంది. తన పిల్లలకు శిక్షణనిచ్చేందుకు సుమారు ఇరవై సంవత్సరాలను ఏ జంతువు గడుపుతుంది? మానవుడు మాత్రమే ప్రేమ, దయ, ముందుచూపు, నూతనకల్పనాశక్తి మరియు అందం, కళ మరియు సంగీతం ఎడల మెప్పును కల్గివుండగలడు. అంత గొప్పవాటిని అందుకున్నందుకు కృతజ్ఞతగా, జీవితాన్ని ప్రేమించే మానవులు “యెహోవా . . . నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి” పురాతనకాల రాజైన దావీదు పలికిన దానితో తప్పకచేరవద్దా?—కీర్తన 139:4, 14.
“పరిణామం” జీవితాలకు ఏమి చేసింది
18, 19. (ఎ) నైతిక విలువల్ని (కీర్తన 10: 3, 4) (బి) పరిపాలకుల దృక్పథాన్ని (1 యోహాను 3:15) పరిణామ సిద్ధాంతం ఎలా ప్రభావితం చేసింది?
18 పరిణామం ఎందుకు అంత త్వరగా అంతమంది వ్యక్తుల అంగీకారాన్ని పొందింది? ఒక కారణమేమిటంటే, ఒకవ్యక్తి దాన్ని అంగీకరించడం ఓ ఫ్యాషన్. అంతేకాకుండ, సృష్టికర్త లేక ఆయన నైతిక విషయాల ఎడల కర్తవ్య శుద్ధతలేని, తమకు ‘ఇచ్ఛవచ్చింది చేసే’ స్వతంత్ర లేక అనైతిక వ్యక్తులకు అది తప్పించుకునే దోవను కనుపర్చింది. ది ఔట్‌లైన్ ఆఫ్ హిస్టరీనందు హెచ్. జి. వెల్స్ పరిణామ సిద్ధాంతం ఎలా వృద్ధి చెందిందో వర్ణిస్తూ ఇలా చెప్పాడు: “పురాతన నైతిక కట్టడలకు మారుగా వేరేవాటిని . . . తెచ్చేందుకు అది నిర్మాణాత్మకమైన వేటినీ తీసుకురాలేదు. నిజమైన నైతిక పతనం సంభవించింది.” జీవితాన్ని విలువైందిగా యోగ్యమైందిగా చేసేందుకు అది కొంచెంకూడా దోహదపడలేదు.
19 చరిత్రకారుడైన వెల్స్, పరిణామ బోధ తదుపరి ఫలితాన్ని ఇలా చెబుతున్నాడు: “అధిక శాతంమంది ప్రజలు . . . జీవన పోరాటంవల్ల తాము జీవిస్తున్నామని నమ్ముతున్నారు. మరి అందులో బలముగలవారు కుయుక్తిగలవారు బలహీనులను అల్పులైన వారిని పడదోస్తారు. . . కనుక మానవుల్లోని బలమైన శునకాల్లాంటివారు బలిసినవారిగా, పెత్తనం చేసేవారిగా ఉండటం సరియే అన్నట్లు కన్పిస్తుంది. మానవ మూటలోని పెద్ద కుక్కలు హింసించి తమ ఆధీనం చేసుకోవడంలో తప్పులేదు.” ఆ విధంగా పరిణామం “క్రైస్తవమతసామ్రాజ్యం” క్రూరమైన యుద్ధాలు చేయడం విషయంలో స్వయం సమర్థనను అందించింది. ఎవల్యూషన్ అండ్ క్రిస్టియన్స్ అనే పుస్తకం 1914 నందు జరిగిన మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలోని విషాదకర సంఘటననూ మరియు నాజీ వాదపు దుష్ట పనులనూ డార్విన్ సిద్ధాంతమే కారణమని ఆరోపించింది. అదే విధంగా కమ్యూనిజమ్‌ను కూడా రేపేందుకు పరిణామసిద్ధాంతం తనవంతు బాధ్యతను వహించాలి. కార్ల్ మాక్స్, డార్విన్ రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్‌ను చదవడంవల్ల ఆనందించాడని చెప్పబడింది. అది దేవునికి “చావుదెబ్బనిచ్చినట్లు” వర్ణించబడింది. ఆయనింకా ఇట్లన్నాడు:
“డార్విన్ పుస్తకం నాకు చాలా ప్రాముఖ్యమైంది మరియు సామాజిక పోరాటంలో ఒక ఆధారంగా సహాయపడుతుంది.”
నేటివరకూ, పరిణామ సిద్ధాంత బోధయిన “యోగ్యతముల సార్థక జీవనం” ఆధారంగా కమ్యూనిస్టు సామ్యవాద దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలనే గమ్యం కల్గివున్నాయి. ఇతర దేశాలు మనగల్గేందుకు పోరాటంలో పాల్గొంటారు మరి దాని ఫలితం ఈ అణ్వస్త్ర యుగంలో అధిక ఆయుధాలను సమకూర్చుకోవడం జరుగుతుంది. మానవజాతి జీవితమంతా అపాయంలో ఉంది.
20. పరిణామ సిద్ధాంతంలోని నమ్మకం మీ స్వంత జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? (కొలొస్సయులు 2:8)
20 అది మీ స్వంత జీవితాన్ని ఎలా ప్రభావింతం చేస్తుంది? పరిణామ సిద్ధాంతంలో చిక్కుకుపోవడం మీకు వ్యక్తిగతంగా అపాయకరం కావచ్చు. పరిణామం నిజమైనదైతే, జీవితం ఉద్దేశరహితంగానూ అర్థరహితంగానూ ఉంటుంది. అది కేవలం జీవనానికి “ఎలుక పరుగును” పోలి ఉంటుంది మరియు మరణమొక్కటే దాని తుది పరిణామం. “యోగ్యతముల సార్థక జీవనం” నందు విశ్వాసముంచడం వల్ల పరిణామ సిద్ధాంతికుడు తన తోటి మానవుణ్ణి ప్రేమించేందుకు, నైతికంగా ఒక చక్కని జీవితాన్ని జీవించేందుకు లేక మృగాల నుండి వేరుగా మెసలుకునేందుకు ఏలాంటి ప్రేరణా ఉండదు. మానవజాతి మీద పరిణామం పూర్తి ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది జీవితం విషయంలో ఏ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. అయితే బైబిలు ఇవ్వగలదు.
జీవితం ఎందుకు ఇన్ని సమస్యలతో నిండివుంది?
21, 22. (ఎ) మానవుని ప్రస్తుత స్థితిని దేనితో పోల్చవచ్చు? (బి) ఏ “చిహ్నాని”కి ఆదాము విధేయుడు కావడంలో విఫలమయ్యాడు మరియు దాని ఫలితమేమిటి? (ఆదికాండము 2:15-17; 3:17-19)
21 ఓ చక్కని రహదారిపై ప్రయాణించే ఓ కుటుంబంతో పరిస్థితిని పోల్చవచ్చు. అది మనోహరమైన పరదైసుగుండా నడుస్తుంది. మంచి ప్రయాణానికి అంతా అనుకూలంగా ఉంది. కానీ, “అపాయం—ప్రవేశించకండి” అని బోర్డుపై వ్రాసివున్న ఓ విశాలమైన దారిని వారు చూస్తారు. కుతూహలం మరియు స్వతంత్ర భావం వారిని ఆవహిస్తుంది. వారు ఆ దారిన ప్రవేశించి, రహదారి నుండి ఎంతో దూరంగా వెళ్లిపోతారు. చివరికి, అక్కడ లోతైన లోయ ఉంది. ఇప్పుడు వారు అదుపు తప్పి ప్రయాణిస్తున్నారు. వారు తిరిగి రహదారిని చేరుకునేందుకు అసాధ్యమౌతుంది. బ్రేకులు పాడైపోయాయి. మరి దాన్ని అపే మార్గం లేదు. వారు కొండమీదినుండి త్వరత్వరగా క్రిందికి పడిపోతారు. చివరికి ఓ నిటారైన స్థలం మీదనుండి క్రిందపడి నాశనమైపోతారు.
22 మానవజాతి విషయం కూడా అలాగే ఉందని బైబిలు చూపుతోంది. ఏదెను వనంలో దేవుడు మానవునికి అట్టి “దారి చిహ్నాన్ని” పెట్టాడు: ‘మీరు ఈ వృక్షఫలమును తినకూడదు.’ ఆ మనిషి మరియు అతని భార్య ఆ చిన్న ఆజ్ఞకు విధేయులుకావడంద్వారా వారు దేవున్ని ప్రేమిస్తున్నామని వారు చూపవల్సిన అవసరముంది. కానీ వారలా చేయడంలో విఫలమయ్యారు. వారు బుద్ధిపూర్వకంగా రహదారినుండి ప్రక్కకు వెళ్లారు మరియు మరణం అలాగే దేవుని తీర్పుక్రింద నాశనానికి నడిపించే దారిన వారు ప్రవేశించారు. రోమీయులు 5:12 నందు మనమిలా చదువుతాం: “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” ఆవిధంగా, మనం అవిధేయులైన ఆదాము వారసులము గనుక, పరదైసునందు మానవ కుటుంబపు తలిదండ్రులు కల్గివుండిన పరిపూర్ణతనుండి తీసివేయబడినవారమై ఈ కోరదగని దారిలో మనమందరమూ నడవాల్సివచ్చింది. ఆధునిక కాలంలో ఈ దారి ఎంత ఎగుడు దిగుడుగానూ మరియు అప్రీతికరంగానూ తయారైందోకదా! అది విశాలమైన ఒకవైపుకే వెళ్లాల్సిన దారి, మరి రాజకీయ నాయకుల్లో లేక ఈ లోక జ్ఞానుల్లో ఏ వ్యక్తులూ వెనుకకు వెళ్లే మార్గాన్ని చూపించలేకపోతున్నారు. దానిలోని ప్రతి వ్యక్తికీ దాని పర్యవసానం మరణమే. మరియు పూర్తి మానవ ప్రపంచమంతటికి వినాశనం తప్పకుండా వస్తుంది.
23, 24. (ఎ) యోహాను 14:6 భావమేమిటి మరియు యేసు విషయంలో అది ఎలా సత్యం? (బి) అది మీరు రహదారికి మరలేలా మీకు ఎలా ప్రయోజనకరంకాగలదు? (యోహాను 3:16)
23 అయితే, ఇదిగోండి! ప్రక్క దారిపై కాస్త వెలుగు పడుతోంది, విశాలమైన దారినుండి తిరిగి రహదారికి నడిపించే ఇరుకైన దారి ఉంది. మొదటి చూపులో, అది చాలా ఇరుకుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దానిలోకి త్రిప్పడం కష్టమనిపిస్తుంది. విశాల మార్గంగుండా ఇప్పుడు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ప్రజల ఆ పెద్ద కుటుంబం కావాలనే ఈ ఇరుకుమార్గాన్ని పట్టించుకోలేదు. వారు అందరితోపాటే కలిసి వెళ్లేందుకే కోరుకుంటున్నారు. అధిక శాతంమంది ప్రజలు అనుకూలత కొరకు మరియు అది అందించే తాత్కాలిక ఆహ్లాదం కొరకు విశాలమైన దారినే వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. వారు ఇక ముందు వచ్చే అపాయానికి సంబంధించిన హెచ్చరికలను లక్ష్యపెట్టరు. అయితే, మెలకువతగల కొందరు వ్యక్తులు ఇరుకు మార్గానికి మరలుతారు. అది వారికి కొంత కష్టాన్నిస్తుంది మరియు వారు జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినప్పటికీ, సకాలంలో అది ప్రయాణించేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు చివరికి పునరుద్ధరించిన గొప్ప పరదైసుకు వారిని అది నడిపిస్తుంది. ఆనందకరమైన, శాంతియుతమైన పరదైసును తమ కన్నులతో చూసి ఆనందించడం వారికి ఎంత సంతోషదాయకంగా ఉంటుందో కదా!
24 మరలా బైబిలు చూపించినట్లుగా మానవ కుటుంబం విషయంకూడా అంతే. అధికశాతంమంది తమ స్వాతంత్ర్యాన్ని నొక్కి తెల్పుతూ నాశనానికి నడిపించే విశాలమైన దారిలో ప్రయాణించే గుంపుతో వెళ్లేవారికి తిరిగి వెళ్లే దారి తెరవబడింది. ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు దేవుని కుమారుడైన యేసు ఇలా చెబుతూ దీనికి వారి అవధానాన్ని మరల్చాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును.” (యోహాను 14:6) మానవకుటుంబం కొరకు తన ప్రాణాన్ని బలియిచ్చేంతగా, ఈ భూమ్మీద యేసు నమ్మకంగా దేవుని చిత్తాన్ని చేసినందున, దేవుడాయనను “జీవాధిపతిగా” నియమించాడు. ఆయన “సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట” కొరకు మరియు దేవుని సంకల్పాలను తెలియజేసేందుకు కూడా ఈ లోకంలోకి వచ్చాడు. (అపొస్తలుల కార్యములు 3:15; యోహాను 18:37) దేవుని భూ పరదైసులో ఆనందమయ జీవితాన్ని పూర్తిగా అనుభవించేందుకు నడిపించగల అందమైన రహదారిని మానవ కుటుంబ సభ్యులకు చూపించగల్గింది ఆయన మాత్రమే.
25. పరదైసు భూమిలోని జీవితం ఎందుకు ఎంతో ప్రీతిపాత్రమైంది? (ప్రకటన 21:3, 4)
25 అద్భుతంగా చేయబడిన మరియు పరిపూర్ణ ఆరోగ్యం ఆనందంలో నిరంతరం జీవించగల ఉత్తరాపేక్షగల భూమిలోకి సరిగ్గా నడిపించగల రహదారి గుండా మీరు ప్రయాణించేందుకు ఇష్టపడరా? అలాంటి జీవితానికి ఇంకనూ చాలా ఉందన్నది వాస్తవమే!
26. మీరు సత్యాన్ని నిజంగా నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యం? (యోహాను 8:31, 32)
26 దేవుని జీవాధిపతియందు విశ్వాసముంచడం ద్వారా మనం ఆ జీవానికి “దారిని” కనుగొంటాము. సంకల్పమున్నంత మట్టుకు మరియు ఈ నిరీక్షణ సంతృప్తికరంగానూ, భవిష్యత్తులోకి ఫలవంతంగా తీసుకువెళ్లినప్పుడు జీవించడం ఎంతో భిన్నంగా ఉంటుంది. మరియు మనం ఆ నిరీక్షణను ఎలా గ్రహించగలము? యేసు తానుగా తన తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా జవాబిస్తున్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) లేఖనాలను శ్రద్ధతో వెతకడం ద్వారా మనం సత్యాన్ని నేర్చుకోవచ్చు; మరియు దాన్ని ప్రతి దినం అన్వయించుకోవడం ద్వారా, మనం ఇప్పుడు నిజంగా జీవించేందుకు ప్రారంభించవచ్చు!
మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రపంచ పరిస్థితులు
27. ఏ పరిస్థితుల్లో మనం మనలను కనుగొనగలం? (2 తిమోతి 3:1)
27 లోకపరిస్థితులు దిగజారిపోతున్నాయన్నది ఒప్పుకోవల్సిన విషయమే. పెద్ద నగరాల్లో, పేదరికం మరియు నేరం పెరుగుతూనే ఉన్నాయి. మీరు ఎక్కడ జీవించినా, మీ ఆహారానికి, మీకు కావలసిన మాంసమునకు, మీరు అధిక మూల్యాన్నే చెల్లిస్తున్నారు మరియు కేవలం జీవించడమే విషవలయంగా ఉంది. అనేక ప్రాంతాల్లో అన్యాయం పట్టపగలు నృత్యమాడుతోంది. అధిక దౌర్జన్యం మరియు యుద్ధాలు ఏ సమయంలోనైనా విరుచుకుపడే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. మానవజాతి నాశనపు దారిలో చివరి స్థితికి చేరుతున్నట్లుగా ఉంది.
28. సమస్యలన్నిటి వెనుక ఎవరున్నారు మరి అతని ధ్యేయమేమిటి? (2 కొరింథీయులు 4:4)
28 వీటన్నింటి వెనుకనున్న శక్తి ఎవరు? అతడు ‘సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పమైన’ దుష్ట ఆత్మగానున్న వ్యక్తి. జనాంగాల దౌత్య వ్యవహారాలను తెరవెనుకనుండి అతడు ఆడిస్తున్నాడు. అయితే సాతాను అధికార స్థానంలో సామరస్యపూరితమైన, క్రీస్తు పరలోక రాజ్యము ద్వారా మానవజాతి కొరకు ప్రేమపూర్వక పరిపాలనను తెచ్చే సమయం ఆసన్నమైంది. అది జీవితాన్ని ప్రేమించేవారిని తిరిగి ఆనందంగా నిత్య జీవాన్ని నడిపే రహదారిపైకి తీసుకువచ్చే సమయం. అయితే ఖాళీచేసేందుకు సాతాను అంగీకరించడం లేదు. కనుక నేడు “భూమీ . . . మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:9, 12) మానవజాతిని వినాశనంలోకి పడద్రోయడమే అతని ధ్యేయం.
29. ఈ కాలంకొరకైన దేవుని సంకల్పమేమిటి? (కీర్తన 37:9-11)
29 దాని విషయంలో ఏ సందేహమూ లేదు! భూమిమీద మీరు ఎక్కడ చూసినా, ‘లోకమంతయు దుష్టుని యందున్నది’ అనేందుకు నిదర్శనముంది. (1 యోహాను 5:19) అయితే తన దుష్ట ఉద్దేశాలతో సాతాను సఫలం అయ్యేందుకు దేవుడు అనుమతించడు! నిజమే, ఈ లోక విధానపు నాశనం సమీపంలో ఉంది. అయితే ప్రజల ప్రాణాల్ని రక్షించాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. బైబిలునందు వ్రాయబడిన ప్రవచనాల ప్రకారం, ఆయన దీన్ని ఎలా చేస్తాడో చూపుతున్నాడు.
జీవితాలను కాపాడేందుకు బైబిలు ప్రవచనాలు ఎలా సహాయపడతాయి
30. మన కాలానికి సంబంధించిన బైబిలు ప్రవచనాలు నెరవేరుతాయనే నమ్మకాన్ని మనం ఎందుకు కల్గివుండగలం? (2 పేతురు 1:19-21; దానియేలు 9:24-27)
30 అనేక బైబిలు ప్రవచనాలు ఇప్పటికే ఆశ్చర్యకరమైన రీతిలో నెరవేరాయి. ఉదాహరణకు, ఈ భూమిమీద యేసు నడచిన వందల సంవత్సరాల ముందే ఈ ప్రవచనాలు తన ప్రకటన కార్యక్రమపు సరైన తేదీలను—సా.శ. 29 నుండి 33 వరకు—అలాగే తన జీవితం మరియు మరణం గూర్చిన అనేక వివరాలను అందించాయి. ఈ విషయాలన్నీ నెరవేరాయి. అంతేకాకుండ, యేసు తానంతట తానే కొన్ని విశేషమైన ప్రవచనాలను చెప్పాడు. వీటిలో ఒకటి “విధానాంతము”ను గూర్చినది. మొదటి శతాబ్దంలో, యూదా విధానమందు అది గణనీయంగా నెరవేరింది.
31, 32. సా.శ. 70 నందు జీవితాలను కాపాడేందుకు ప్రవచనం ఎలా సహాయపడింది? (లూకా 21:20-24)
31 మత్తయి 24:3, 15-22 ప్రకారం, యెరూషలేము “హేయవస్తువు” అయిన రోమా సామ్రాజ్య సేనలవల్ల ముట్టడించబడుతుందని యేసు సూచించాడు. ఇవి జరగడం క్రైస్తవులు చూసినప్పుడు, ‘కొండలకు పారిపోవడం’ ప్రారంభించాలని ఆయన చెప్పాడు. ముప్పైనాలుగు సంవత్సరాల తర్వాత ఈ సేనలు నిజంగా వచ్చినప్పుడు, వారు యేసు ప్రవచనంలో అనేక విషయాలను, “చుట్టుగట్టు కట్టి,” యెరూషలేము ఆలయపు పశ్చిమ ప్రాకరం వరకు చొచ్చుకొని, “పరిశుద్ధ” స్థలంలోకి సహితం ప్రవేశిస్తారనే ప్రవచనాలు నెరవేరాయి. (లూకా 19:43; మత్తయి 24:15) అయితే అసాధ్యమనిపించే ఈ పరిస్థితుల్లో క్రైస్తవులు ఆ నగరాన్ని ఎలా విడిచిపెట్టగలరు?
32 ఆకస్మాత్తుగా, కారణరహితంగా రోమా సైన్యం వెనుదిరిగింది! యేసు ఆజ్ఞానుసారంగా యొర్దాను నది ఆవలి వైపునున్న పర్వతాలకు క్రైస్తవులు ఇప్పుడు పారిపోగలరు. ఆ తర్వాత, సైన్యాధ్యక్షుడైన టైటస్ ఆధ్వర్యాన సా.శ. 70 నందు రోమా సైన్యం తిరిగివచ్చింది. యెరూషలేము మరియు దాని ఆలయం నేలమట్టం చేయబడ్డాయి. చరిత్రకారుడైన జోసిఫస్ ప్రకారం ముట్టడి, కరువు మరియు కత్తివాత వలన 11,00,000 మంది జాతీయవాదులైన యూదులు హతులయ్యారు. మరియు 97,000 మంది బానిసలుగా తీసుకెళ్లబడ్డారు. అయితే జీవం ఎడల నిజమైన ప్రేమ గలవారు బైబిలు ప్రవచనానికి విధేయులుకావడం ద్వారా తమ ప్రాణాలతో తప్పించుకున్నారు!
33. యూదా విధానపు చివరి దినాలకు నేటి ఏ పరిస్థితి సమాంతరంగా ఉంది? (లూకా 21:25, 26)
33 మొదటి శతాబ్దం ముందు చెప్పిన సంఘటనల్ని, సా.శ. 1914 నుండి ఉన్న తరంలో జరిగే ప్రపంచాన్ని కంపింపజేసే సంఘటనలకు మాదిరిగా యేసు ఉపయోగించాడు. నేడు కూడా జీవితాలు కాపాడబడవల్సిన అవసరముంది! నేడు మనం, సాతాను ఆధ్వర్యంలోనున్న యావత్ లోక విధానమైన ‘ఈ విధానాంతానికి’ చేరుకున్నాము. నిజంగా అలాగే ఉన్నాయని 1914 నుండి జరుగుతున్న సంఘటనలు ఎంత స్పష్టంగా నిరూపించాయోకదా! యేసు ప్రవచనపు నెరవేర్పులో చివరిగా, మొదటి ప్రపంచ యుద్ధంలోని రక్తతర్పణ సమయంలో ‘ఒక రాజ్యము మరొక రాజ్యముమీదికి లేచినప్పుడు’ ఆ సంవత్సరం “వేదనల ప్రారంభమును” చూసింది. ముందే చెప్పినట్లుగా దాని తర్వాత, “గొప్ప భూకంపములు . . . తెగుళ్లును కరవులును” వచ్చాయి. మొదటి దానికంటే ఎంతో ఘోరమైన రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది మరియు “అక్రమము విస్తరించుట” ఇప్పుడు భూమిని ముట్టడిస్తోంది. (మత్తయి 24:7-13; లూకా 21:10, 11) జనాంగాలన్నీ సంకటంలో ఉన్నాయి. పరిష్కార మార్గం వాటిలో ఎవరికీ తెలియదు.
34. జీవితాలను కాపాడేందుకు దేవుడు ఎట్టి చర్య తీసుకుంటాడు? (దానియేలు 2:44)
34 అయితే దేవునికి తెలుసు! భూమిపైనున్న స్వార్థపూరిత రాజ్యాలపై లేదా జనాంగాలపై తన తీర్పును గూర్చి మాట్లాడుతూ, తాను “ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు,” మరియు “అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును” అని దేవుడు ప్రకటిస్తున్నాడు. (దానియేలు 2:44) తర్వాత యేసు రాజ్య పరిపాలనను అంగీకరించిన వారందరిపైనా అది శాంతియుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. జీవాన్ని కోరే అట్టి ప్రజలందరికి సహాయపడేందుకు, నిజమైన క్రైస్తవులు యేసు చెప్పిన మరో గొప్ప ప్రవచనపు తర్వాతి భాగపు నెరవేర్పుగా నేడు జీవాన్ని కాపాడే పనిలో చేరివున్నారు, అక్కడ ఇలా ఉంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
35. (ఎ) అంతం ఎప్పుడు మరియు ఎలా వస్తుంది? (బి) ప్రవచనాన్ని లక్ష్యపెట్టడం మీకు ఎలా ప్రయోజనకరంగా ఉండవచ్చు? (లూకా 21:34-36)
35 “అంతం” ఎప్పుడు “వస్తుంది” అనే విషయంలో మనం ఎక్కువ ఆసక్తిని కల్గివున్నామన్నది నిజమే. ఎందుకంటే మన జీవితాలు ఇమిడి ఉన్నాయి! యోబు 24:1 నందు మనం ఇలా చదువుతాం: “ఆయనను ఎరిగినవారికి ఆ తేదీ తెలియకపోయినా, సర్వశక్తునికైతే ఆ నియామక దినం ఎంత మాత్రం మరుగైయుండలేదు.” (ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) అయితే అది సమీపంలోనే ఉండాలి! సా.శ. 1914 నందు ప్రారంభమైన “వేదనలను” చూసిన వ్యక్తులను గూర్చి యేసు ఇలా చెప్పాడు: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.” (మత్తయి 24:34) ‘వీటన్నింటిలో’ కుళ్లుపట్టిన నేటి సంస్థలో వినాశనం ఇమిడివుంది, అది సరిగ్గా యేసు వర్ణించినట్లేవుంది: “లోకారంభము నుండి ఇప్పటివరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.” (మత్తయి 24:21, 22) ‘మహా శ్రమలు’ తక్కువ చేయబడకపోయినట్లయితే, మానవజాతే భూమిమీద ఉండకుండా నాశనమైపోతుంది! అయితే, సంతోషకరంగా దేవున్ని ప్రేమించేవారు తమ ప్రాణాలతో బయటపడగలరు. “యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును, అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.” (కీర్తన 145:20) మీరు బైబిలు ప్రవచనాన్ని లక్ష్యపెట్టినట్లయితే, మీరు కూడా తప్పించుకుని జీవిస్తూ ఉండగలరు.
నిత్యజీవం కొరకు తప్పించుకునే మార్గం
36. మొదటి యోహాను 2:15-17 ను మీ దైనందిన జీవితంలో మీరు ఎలా అన్వయించుకుంటారు? (మార్కు 12:28-31)
36 తప్పించుకునే వారిలో మీరు ఉంటారా? నాశనానికి నడిపే విశాలమైన దారినుండి మీరు మరలుతారా లేదా అన్న విషయంపై అది ఆధారపడివుంది. జీవానికి నడిపించే దారిలోని సూచనలను మీరు లక్ష్యపెడుతున్నారా లేదా అన్న దానిపై అది ఆధారపడివుంటుంది. మీరు నిజంగా జీవించాలని కోరుకుంటున్నట్లయితే, అది మరీ కష్టతరమేమీ కాదు. దాని అర్థం దేవున్ని మరియు పొరుగువారిని ప్రేమించేందుకు నేర్చుకోవడం. మొదటి యోహాను 5:3 నందు పేర్కొన్నట్లుగా, “మనమాయన ఆజ్ఞలనుగైకొనుటయే ఆయనను ప్రేమించుట.” ఆయన మననుండి కోరే కొన్ని విషయాలను ఈ యోహాను పత్రికలో (మొదటి యోహాను 2:15-17) ముందు చెప్పాడు:
“ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”
‘మహా శ్రమల’ సమయంలోనూ మరియు పునరుద్ధరించబడిన పరదైసులోనూ దేవుని రక్షణ మరియు అనుగ్రహాన్ని పొందుతూ, నిత్యం సజీవులుగా ఉండాలంటే దేవుడు అసహ్యించుకునే వాటినుండి అంటే నైతికత, దురాశ, అవినీతి, అబద్ధాలూ దొంగతనం మరియు లోకంలోని పోట్లాటల నుండి మనం వేరుగా ఉండాలి. వీటిని చేయడం ద్వారా మనం ప్రస్తుతం కూడా మన జీవితాన్ని జీవన యోగ్యంగా చేసుకుంటాము.
37. (ఎ) మనమే విధంగా “లోక సంబంధులు” కాకుండా ఉండాలి? (యోహాను 15:17-19) (బి) దేవుని రాజ్యానికి మీరు మీ మద్దతును ఎలా చూపించగలరు? (మత్తయి 6:33)
37 తన శిష్యులను గూర్చి యేసు తానుగా ఇలా చెప్పాడు: “నేను లోక సంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) మన జీవితాల్లో మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి? దాని భావం ‘దుష్టుడైన’ సాతాను దేవునిగానూ అధికారిగానూ ఉండి వినాశనం వైపుకు పయనిస్తున్న ఈ లోక ఉద్దేశాలూ కార్యక్రమాల నుండి మనలను మనం వేరుపర్చుకోవాలి. మన ప్రతిదిన జీవితాల్లో, దేవుని పరిపాలనకు విరుద్ధమైన లోక కార్యక్రమాలనుండి మనం వేరుగా ఉండాలి. మత్తయి 24:3 మరియు 25:31 చూపించినట్లుగా “విధానాంత” సూచన, పరలోకంలో రాజ్యాధికారముతో యేసు ‘ప్రత్యక్షతకు’ సూచన అని కూడా చూపుతోంది. గనుక, 1914 నుండి, “ఈ లోక రాజ్యము మన ప్రభువు [దేవుని] రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగములవరకు ఏలును.” (ప్రకటన 11:15) ఆ రాజ్యానికి మద్దతునిచ్చేందుకు ఇదే సరైన సమయం! మన భవిష్యత్ జీవితం దేవుని రాజ్యంపై ఆధారపడివుంటుంది. కాబట్టి, మనం తెలిసితెలిసి యుద్ధాలకూ విప్లవాలకు, రాజకీయ ఉద్యమాలకు లేక మన కాలంలోని లౌకిక విధానాలకు మద్దతునివ్వలమా? తమ ఉద్దేశాల్లో ఇవి నిజంగానే విఫలమౌతాయి. దేవుని రాజ్యం మాత్రమే చేయగల దాన్ని చేస్తామని వారు చెప్పుకుంటున్నారు. విధానమంతా నాశనానికి వెళుతోంది. కనుక దానికి మాసికలు వేసే ప్రయత్నంలో ఎందుకు భాగం వహించాలి? బదులుగా, అసలు పరిష్కారమైన దేవుని రాజ్యానికి మనం హృదయపూర్వక మద్దతునిద్దాము!
38. నేటి పరిపాలకుల ఎడల మనం ఏ దృక్పథాన్ని కల్గివుండాలి? (లూకా 20:25)
38 అంటే మనం అరాచకం సృష్టించే వారిగా ఉండాలనా దాని భావం? కానే కాదు! ఎందుకంటే “దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు.” (1 కొరింథీయులు 14:33) ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నంతకాలం, వారి చట్టాలకు లోబడి, వారి పాలకులను గౌరవించాలని దేవుడు మననుండి అపేక్షిస్తున్నాడు. రోమీయులు 13:1 ఇలా చెబుతోంది: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను.” అంటే పన్నులు చెల్లించడం ద్వారా మరియు దేవుని నియమాలతో విరుద్ధమైనవి కానంతమట్టుకు వారి నియమాలనన్నింటిని పాటించడం ద్వారా “కైసరువి” (ప్రభుత్వానివి) చెల్లించాలి.—మార్కు 12:17.
39. మీరు పొరుగువారి ఎడల ప్రేమను ఎలా కనుపర్చగలరు? (1 కొరింథీయులు 13:4-7)
39 దేవుని ఎడల ప్రేమతో సహా, మనం మన పొరుగువారికి ప్రేమను కనుపర్చాలి. మన కుటుంబంలో చూపించడం కంటే శ్రేష్ఠంగా మనం ఇంకెక్కడ చూపించగలం! అయితే దీన్ని మనం ఎలా చేయగలం? దానికి బైబిలు, కొలొస్సయులు 3:18-21 నందు ఇలా జవాబు చెబుతోంది:
“భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”
ఓ ఐక్య కుటుంబాన్ని నిర్మించేందుకు నిజంగా ఓ చక్కని ఆధారం! కుటుంబంలోనే కాదు, ఇతరులతో మనకున్న సంబంధాలన్నింటిలో మనం “జాలిగలమనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము” వంటి లక్షణాలను అలవర్చుకోగలము. మరి ప్రాముఖ్యమైన విషయమేమిటి? “అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12, 14.
40. యెహోవాసాక్షులు ఎలాంటి ప్రజలు? (యోహాను 13:34, 35)
40 దేవుని మరియు పొరుగువాని ఎడల ఈ ప్రేమను నేడు తమ జీవితాల్లో నిజంగా అన్వయించుకున్న ప్రజల గుంపు ఉన్నదా అని మీరు ప్రశ్నించగలరు. అలాంటి గుంపు ఒకటి ఉంది. మీ చుట్టు ప్రక్కల ఓ రాజ్యమందిరం ఉంటే వారిని అక్కడ కనుగొంటారు. వారు లక్షలకొలది మందిగా ఒక అంతర్జాతీయ గుంపుగా ఉన్నారు. ఎక్కువభాగం, తమ పొరుగువారి పరిస్థితులకేమీ భిన్నంగా లేకుండ ఉన్న సాధారణ మనుష్యులే వారు మరియు తమ సమాజంలోని ఇతరులు చేసే దైనందిన ఉద్యోగాలనే వీరూ చేస్తున్నారు. అయితే, వారు తమ దేవున్నే మొదట ప్రేమిస్తారు. ఆయన చిత్తం భూమిమీద జరిగేందకు మరియు తమ జీవితాలను దానికి అనుగుణ్యంగా జీవించేందుకు వారు ఎదురుచూస్తారు. కనుక, బైబిలును పఠించడంలోనూ అనుదిన జీవితంలో దాని సూత్రాలను అన్వయించుటలోను మరియు తమ పొరుగువారికి దాని సమాచారాన్ని చెప్పడంలోను వారు చాలా ఆసక్తిగలవారు. వారు క్రైస్తవ యెహోవాసాక్షులు. మీ ప్రాంతమందలి రాజ్య మందిరాల్లో వారిని ఎందుకు కలవకూడదు? ఏ ఆచారం, చందాలు పట్టడం పెడసరపు లాంఛనాలూ అక్కడ లేవని మీరు కనుగొంటారు. బదులుగా, ఇప్పుడు కూడా జీవితంలో గొప్ప సంతృప్తిని పొందుతూ మరియు పరదైసు భూమిపై పరిపూర్ణ నిత్యజీవాన్ని పొందేందుకు ఎదురుచూసే సహృదయులైన ప్రజలు కనుగొంటారు.
41. పెద్ద సమస్యలను సాక్షులు ఎలా పరిష్కరించుకున్నారు? (అపొస్తలుల కార్యములు 10:34, 35)
41 ఈ నిరీక్షణను కల్గివుండి దాని ప్రకారం జీవించే ప్రజలతో మీరు సహవసించేందుకు ఇష్టపడరా? బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా జీవించడం వల్ల వచ్చిన ప్రపంచవ్యాప్త ఐక్యత వారిలో ఉంది. జనాంగములు పరిష్కరించడానికి శతాబ్దాలుగా పనిచేసిన యుద్ధం, జాతివైషమ్యం, దేశీయాభిమానం వంటి సమస్యల్ని వారు తమ మధ్య లేకుండా చేసుకున్నారు. వారు బైబిలు ప్రకారం జీవిస్తున్నారు కనుక, వారు దౌర్జన్యం, నేరం, అవినీతి అనైతికత వంటి సమస్యలు తమలో లేకుండా ఉన్నారు. వారు సామాజిక రుగ్మతలతో పీడించబడడం లేదు. తమలోని ఒకరు తీవ్రమైన తప్పిదం చేసినప్పటికీ, అది చాలా అరుదు అయినప్పటికీ, అతను పశ్చాత్తాపపడినప్పుడు ప్రేమపూర్వకంగా పునరుద్ధరించబడతాడు. దేవుడు, “యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించెను” అని తెలుసుకుని, సాంఘిక స్థానాన్నిబట్టి, తన విద్యనుబట్టి, లేక లేమినిబట్టి అతని జాతి లేక రంగునుబట్టి ఒక వ్యక్తియెడల తమ దృష్టిని ప్రభావితం చెందనివ్వరు.—అపొస్తలుల కార్యములు 17:26.
జీవితానికి ఇంకనూ చాలా ఎందుకు ఉంది?
42. జీవాన్ని ప్రేమించేవారికి ఏ భవిష్యత్తు వేచివుంది? (కీర్తన 72:1-8)
42 జీవితాన్ని ప్రేమించేవారికి మరియు తమ జీవితాలను రక్షించుకునేందుకు ఇప్పుడే పనిచేసే వారికి ఓ దివ్యమైన భవిష్యత్తు వేచివుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది? నేడు అనేక మానవ కుటుంబాలు అనుభవిస్తున్నట్లుగా, అది నిస్సారమైన జీవితం వంటిది కాదు. ‘మునుపటి సంగతులు’ అంటే ఈ విధానపు విషాదం, మరణం, వేదన—‘గతించినవైయుండును.’ కనుక, వాటి తర్వాత ఏమి వస్తాయి? దేవుడు తానే ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను.” (ప్రకటన 21:4, 5) నూతనలోక విధానంలో, పరలోక రాజైన యేసుక్రీస్తు, “నిత్యుడగు తండ్రిగా” పూర్తి మానవ కుటుంబంపై ప్రేమపూర్వకంగా పరిపాలిస్తాడు. “మితిలేని [ఆయన] రాజ్యానికి మరియు శాంతికి అంతము ఉండదు.” న్యాయము, నీతి ఆ రాజ్యపు పునాదులుగా ఉంటాయి. (యెషయా 9:6, 7, NW) ఆ పరిస్థితుల్లో జీవితం ఎంత సంతృప్తికరంగానూ ఆనందభరితంగానూ ఉంటుందో కదా! మన పొరుగువారి ఎడల ప్రేమతో భూమిపై దేవుని చిత్తం చేయడంలో దానికి ఓ సంకల్పం ఉంటుంది. దానికి ఉద్దేశముంటుంది, మన తోటి వ్యక్తుల ఎడల ప్రేమతో భూమిపైన దేవుని చిత్తాన్ని చేయడం. సమాధుల్లో ఉన్నవారు సహితం “ఆయన శబ్దమువిని” ఆ పరదైసు భూమిని అనుభవించేందుకు వస్తారని యేసు మనకు హామీనిస్తున్నాడు.—యోహాను 5:28, 29.
43. మీ జీవితాన్ని మీరెలా కాపాడుకోవచ్చు? (జెఫన్యా 2:2, 3)
43 ఈ “ప్రస్తుత దుష్టవిధానం” నాశనానికి వెళ్లే విశాలమైన దారిలో క్రిందికి జారిపడిపోతోంది. అయితే మీరు కూడా దానితోపాటు క్రిందికి పడిపోనక్కర్లేదు. దేవుని స్వంత ప్రజల సహవాసంతో అంటే, జీవాన్ని ప్రేమించేవారితో భూమ్మీది రక్తాపరాధంగల జనాంగాలను నాశనం చేసేందుకు దేవుడు వచ్చినప్పుడు మీరు మినహాయించబడతారు:
“నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవువెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.”—యెషయా 26:20, 21.
44. మీ ముందు నేడు ఏ చక్కని అవకాశముంది? (ద్వితీయోపదేశకాండము 30:19, 20)
44 కనుక, ఇప్పుడు బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా నిజమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించడం ద్వారా మీరు, “మహాశ్రమలను” సజీవంగా తప్పించుకుని, ఈ భూమిపై ఎన్నడూ మరణించకుండ ఉండడాన్ని ఎదురుచూసే ఆసక్తిగల దేవుని ప్రజల సమూహంతో కలిసి మీరు భాగం వహించగలరు. వాస్తవానికి, ఇప్పుడు జీవించివున్న “ఓ గొప్ప సమూహం” ఎన్నటికీ మరణించదు!
45. (ఎ) ఇప్పుడు మరియు భవిష్యత్తులో పనిచేసే విషయమేమిటి? (1 తిమోతి 6:11, 12) (బి) జీవితానికి ఇంకను చాలా ఉందని, దాన్ని మీరు మెచ్చుకుంటున్నారని మీరు ఎలా చూపించగలరు? (1 తిమోతి 6:17-19)
45 భూమి మీదంతటా జీవించివున్న తన సాక్షుల సంఘంలో ఇప్పుడు కూడా పనిచేయగల ఒకదాన్ని యెహోవా చేశాడు! అది మీకు కూడా పనిచేయగలదు! అది పరదైసు భూమిమీద చక్కగా పనిచేస్తుంది, అక్కడ చివరికి “సకలప్రాణులు” గొప్ప ప్రాణదాతయైన యెహోవా దేవున్ని స్తుతిస్తారు. (కీర్తన 150:6) నిజమే, జీవితానికి ఇంకనూ చాలా ఉంది!
REFERENCES
1. Intellectual Digest, December 1971, p. 59.
2. Charles Darwin: His Life, chapter 3, p. 66.
3. The Yomiuri, Tokyo, January 17, 1969.
4. Charles Darwin, Origin of Species, concluding sentence.
5. Isaac Asimov, The Wellsprings of Life, 1960, pp. 224, 225.
6. Lecomte du Noüy, Human Destiny, 1947, p. 34.
7. Prof. John N. Moore, Michigan State University, paper of December 27, 1971, p. 5.
8. Isaac Asimov, The Wellsprings of Life, 1960, p. 85.
9. M. S. Keringthan, The Globe and Mail, Toronto, November 26, 1970, p. 46.
10. H. G. Wells, The Outline of History, 3rd Edition, 1921, p. 956.
11. Ibid., p. 957.
12. Philip G. Fothergill, Evolution and Christians, 1961, p. 17.
13. Himmelfarb, Darwin and the Darwinian Revolution, p. 398.
14. J. D. Bernal, Marx and Science, 1952, p. 17.
[అధస్సూచీలు]
a ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు, పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తివ్రాయబడినవి లేఖనము ఎత్తివ్రాయబడినచోట NW అని చూపబడినట్లయిన, అది ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రిఫరెన్సులతో కూడిన దాని నుండి తర్జుమా చేయబడినదని సూచిస్తుంది.
[6వ పేజీలోని చిత్రం]
మన సూర్య కుటుంబపు నమూనాలను నిపుణతగల వైజ్ఞానికులు తయారు చేస్తున్నారు. విశాలమైన విశ్వాన్ని సృష్టించేందుకు అంతకంటే గొప్ప జ్ఞానం అవసరంలేదా?
[8వ పేజీలోని చిత్రం]
“ఆకాశమంతటిలోనూ చూసేందుకు ఎంతో అందంగా ఉందని” ఓ వ్యోమగామి భూమిని గూర్చి వివరించాడు. దానికి కారణం దానిలో జీవం ఉంది, దేవుడు దాన్ని సృష్టించాడు
[10వ పేజీలోని చిత్రాలు]
స్వజాతినిబట్టే మిశ్రితమైన ఎన్నోరకాల కుక్కలున్నాయి. అయితే పిల్లులవంటి మరో “జాతి” వాటితో అవి సంయోగం జరపలేవు
[11వ పేజీలోని చిత్రం]
The Seattle Times, November 21, 1971
The Washington Daily News, December 27, 1971
The Express, Easton, Pa., May 3, 1973
[12,13వ పేజీలోని చిత్రాలు]
మానవునికి జంతువులకు మధ్యనున్న పెద్ద అగాధానికి వంతెన కట్టడం అసాధ్యం. అవి వేరువేరుగా సృష్టించబడిన “జాతులు”
[15వ పేజీలోని చిత్రం]
మానవుడు దివ్యమైన పరదైసులో జీవించేందుకు సృష్టించబడ్డాడు. అయితే దాన్ని అతను అనుభవించడం అతని విధేయతపై ఆధారపడింది
[20వ పేజీలోని చిత్రం]
టైటస్ కమాను (రోము నందున్న) మీదవున్న ఈ కుడ్యచిత్రం సా.శ. 70 యెరూషలేము నాశనాన్ని ఓ చరిత్రగా నమోదుచేసింది
[21వ పేజీలోని చిత్రం]
బైబిలు ప్రవచనాన్ని లక్ష్యపెట్టడం మొదటి శతాబ్దపు క్రైస్తవుల ప్రాణాల్ని కాపాడింది. అలాగే అది నేడు మీ జీవితాలను కాపాడగలదు
[23వ పేజీలోని చిత్రం]
‘మొదటి ప్రపంచ యుద్ధం సంపూర్ణ యుద్ధ శతాబ్దాన్ని ప్రవేశపెట్టింది. . . . మునుపెన్నడూ ఇంతెక్కువగా అన్ని దేశాలు చేరలేదు. మునుపెన్నడూ మారణకాండ అంత విస్తారంగానూ అంత విచక్షణరహితంగానూ జరగలేదు.’—హెచ్. డబ్ల్యు. బాల్డవిన్ వ్రాసిన “మొదటి ప్రపంచ యుద్ధం.”
[23వ పేజీలోని చిత్రం]
సుమారు 40,00,00,000 మంది వ్యక్తులు తీవ్ర ఆహారకొరతను అనుభవిస్తున్నారని అంచనా
[29వ పేజీలోని చిత్రం]
దైవిక ప్రజల నూతన సమాజం నిజమైన జీవితాన్ని అనుభవిస్తుంది మరియు వారు నిత్యం దేవున్ని స్తుతిస్తారు