చదవడం మీద శ్రద్ధ వహించండి
మీరిప్పుడు చేస్తున్న పనిని జంతువులు చేయలేవు. మానవుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చదవడం నేర్చుకోలేదు. దానికి కారణం, వాళ్ళలో ఎక్కువ మందికి పాఠశాలకు వెళ్ళే అవకాశం దొరకలేదు, కొందరికి అవకాశం దొరికినా సక్రమంగా వెళ్ళలేదు. అయితే ముద్రిత సమాచారాన్ని చదవగల మీ సామర్థ్యం ద్వారా, మీరు మానసికంగా ఇతర దేశాలకు ప్రయాణించగలరు, మీ జీవితాలను సుసంపన్నం చేయగల వారిని కలుసుకోగలరు, జీవిత వ్యాకులతలను అధిగమించేందుకు మీకు సహాయపడే ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని మీరు పొందగలరు.
మీరు మీ పిల్లలకు చదివి వినిపించే విషయాలు వాళ్ళు తమ వ్యక్తిత్వాలను మలుచుకునేందుకు సహాయపడగలవు
ఒక యౌవనుడు పాఠశాల విద్య నుండి ఎంత ప్రయోజనం పొందగలడన్నది అతని చదివే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆయన ఉద్యోగం కోసం వెదుకుతున్నప్పుడు, ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలడు, తన జీవితావసరాల కోసం ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుంది అన్నవి అతని చదివే సామర్థ్యంపై ఆధారపడి ఉండవచ్చు. బాగా చదవగల గృహిణులు, తమ కుటుంబం కోసం మంచి పోషకాహారము, పారిశుద్ధ్యము, రోగనివారణ వంటి విషయాలను చక్కగా చూసుకోగలుగుతారు. మంచి చదువరులైన తల్లులు తమ పిల్లల మేధా వికాసంపై కూడా చాలా మంచి ప్రభావం చూపవచ్చు.
అయితే, చదవడం వల్ల మీకు చేకూరే అత్యంత గొప్ప ప్రయోజనం “దేవుని గూర్చిన విజ్ఞానము” పొందగలగడమే. (సామె. 2:5) మనం దేవునికి సేవ చేసే అనేక విధాల్లో చదివే సామర్థ్యం పాత్ర ఉంది. సంఘ కూటాల్లో లేఖనాలను, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడం జరుగుతుంది. మీరు క్షేత్ర సేవను ఎంత సమర్థవంతంగా చేయగలుగుతారన్నది మీరు చదివే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ కార్యకలాపాలకు సిద్ధపడడంలో చదవడం కూడా ఉంది. అందుకే, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల మీ చదివే అలవాట్లపై చాలా ఎక్కువగా ఆధారపడివుంటుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
భావాలను వ్యక్తం చేయగల బహిరంగ పాఠకుడిగా ఉండడమెలాగో నేర్చుకోండి
దేవుని మార్గాలను నేర్చుకొంటున్న వారిలో కొందరు చాలా తక్కువ చదువుకున్నారు. వారు తమ ఆధ్యాత్మిక అభివృద్ధిని మెరుగుపరుచుకునేందుకు వాళ్ళకు చదువు నేర్పవలసిన అవసరం ఉండవచ్చు. లేదా తమకున్న చదివే నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వారికి వ్యక్తిగత సహాయం అవసరం కావచ్చు. స్థానికంగా అవసరం ఉన్నప్పుడు సంఘాలు అక్షరాస్యతా తరగతులను సంస్థీకరించడానికి కృషి చేస్తాయి. ఈ ఏర్పాటు నుండి వేలాది మంది ప్రయోజనం పొందారు. కొన్ని సంఘాలు, చక్కగా చదవగల సామర్థ్యానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు అనుబంధంగా చదివే సామర్థ్యాన్ని మెరుగుపరిచే తరగతులను ఏర్పాటు చేశాయి. అలాంటి తరగతులు లేని చోట కూడా, ఒక వ్యక్తి ప్రతి రోజూ కొంచెం సమయం తీసుకొని గట్టిగా చదవడం ద్వారా దైవపరిపాలనా పాఠశాలకు క్రమంగా హాజరవ్వడం ద్వారా పాఠశాలలో పాల్గొనడం ద్వారా మంచి ప్రగతిని సాధించగలడు.
విచారకరంగా, ఇతర విషయాలతోపాటు కార్టూన్ పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు అనేకుల జీవితాల్లో చదివే అలవాటును ఒక మూలకు నెట్టేశాయి. టీవీ చూడడం, తక్కువగా చదవడం ఒక వ్యక్తికున్న చదివే నైపుణ్యాలూ ఆలోచనా శక్తీ స్పష్టంగా తర్కించగల సామర్థ్యమూ తన భావాలను వ్యక్తంచేయగల సామర్థ్యమూ పెరగకుండా అడ్డుపడతాయి.
మనం బైబిలును అర్థం చేసుకునేందుకు సహాయపడే ప్రచురణలను ‘నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందిస్తున్నాడు. ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విస్తృతమైన సమాచారము ఆ ప్రచురణల్లో కనిపిస్తుంది. (మత్త. 24:45; 1 కొరిం. 2:12,13) ఆ ప్రచురణలు, ప్రాముఖ్యమైన ప్రపంచ మార్పులను గురించిన, వాటి అర్థాలను గురించిన విజ్ఞానం విషయంలో మనం వెనకబడిపోకుండా చేస్తాయి, ప్రకృతి ప్రపంచం మనకు సుపరిచితమై ఉండేందుకు మనకు సహాయపడతాయి, మనలను వ్యాకులపరిచే సమస్యలను అధిగమించే మార్గాలను మనకు బోధిస్తాయి. అన్నిటికీ మించి, దేవునికి అంగీకారయోగ్యమైన విధంగా సేవచేయడమెలా, ఆయన ఆమోదాన్ని పొందడమెలా అన్నవాటిపై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తాయి. ఆ విధమైన ఆరోగ్యదాయకమైన చదవడం, మీరు ఆధ్యాత్మిక వ్యక్తిగా పరిణతి చెందేందుకు మీకు సహాయపడుతుంది.
నిజమే, చదివే సామర్థ్యమున్నంత మాత్రాన ప్రయోజనం చేకూరదు. ఈ నైపుణ్యాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. ఏమి తినాలన్నది మనమెలాగైతే ఎంపిక చేసుకుంటామో అలాగే ఏది చదవాలన్నది కూడా ఎంపిక చేసుకోవాలి. నిజమైన పోషణనివ్వని పదార్థాన్ని గానీ మనల్ని విషపూరితం కూడా చేయగల పదార్థాలను గానీ ఎందుకు తినాలి? అలాగే, యాదృచ్ఛికంగానే అయినా సరే మన మనస్సునూ హృదయాన్నీ కలుషితం చేయగల సమాచారాన్ని ఎందుకు చదవాలి? మనం ఏమి చదవాలో ఎంపిక చేసుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన ప్రమాణం బైబిలు సూత్రాల్లో ఉంది. మీరు ఏమి చదవాలో నిర్ణయించుకునే ముందు, ప్రసంగి 12:12,13; ఎఫెసీయులు 4:22-24; 5:3,4; ఫిలిప్పీయులు 4:8; కొలొస్సయులు 2:8; 1 యోహాను 2:15-17; 2 యోహాను 10 వంటి వచనాలను మనస్సులో ఉంచుకోండి.
సరైన ఉద్దేశంతో చదవండి
చదివేటప్పుడు సరైన ఉద్దేశం కలిగివుండడం యొక్క ప్రాముఖ్యత, సువార్త వృత్తాంతాలను పరిశీలించినప్పుడు స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ధర్మశాస్త్ర ప్రవీణులైన మతనాయకులు కపటోపాయంతో వేసిన ప్రశ్నలకు, యేసు లేఖనానుసారమైన జవాబులను ఇచ్చే ముందు, “దానిగూర్చి మీరు చదువలేదా?,” “మీరెన్నడును చదువలేదా?” వంటి ప్రశ్నలను అడగడం మత్తయి సువార్తలో మనం చూడవచ్చు. (మత్త. 12:3,5; 19:4,5; 21:16,42; 22:31) దీనినుండి మనం నేర్చుకునే ఒక పాఠమేమిటంటే, మన చదివే ఉద్దేశం సరైనది కాకపోతే, మనం తప్పుడు నిర్ధారణలకు రావచ్చు, లేదా అసలు భావాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. పరిసయ్యులు లేఖనాల ద్వారా నిత్యజీవం పొందవచ్చని అనుకున్నారు, దాని కోసమే వాటిని చదివేవారు. యేసు సూచించినట్లు, దేవుణ్ణి ప్రేమించకుండా, రక్షణనిచ్చేందుకు దేవుడు ఉపయోగించే మాధ్యమాన్ని అంగీకరించకుండా ఉండేవారికి ఆ ప్రతిఫలం అనుగ్రహించబడదు. (యోహా. 5:39-43) పరిసయ్యుల ఉద్దేశాలు స్వార్థపూరితమైనవి; కాబట్టి, వాళ్లు చేరుకున్న నిర్ధారణలు అనేకం తప్పుడువే.
యెహోవా దేవుని మీది ప్రేమే మనం ఆయన వాక్యాన్ని చదవడానికి అత్యంత స్వచ్ఛమైన ప్రేరకంగా ఉండాలి. అలాంటి ప్రేమ దేవుని చిత్తం గురించి నేర్చుకునేందుకు మనలను పురికొల్పుతుంది, ఎందుకంటే ప్రేమ “సత్యమునందు సంతోషించును.” (1 కొరిం. 13:6) చదవడాన్ని మనం గతంలో అంతగా ఆనందించకపోయినప్పటికీ, యెహోవాను మన “పూర్ణమనస్సుతో” ప్రేమించడం, మనం దేవుని గూర్చిన పరిజ్ఞానాన్ని ఆర్జించడానికి మనం మనస్సు పెట్టి కృషి చేసేందుకు మనలను కదిలిస్తుంది. (మత్త. 22:37) ప్రేమ ఆసక్తిని రేకెత్తిస్తుంది, ఆసక్తి నేర్చుకోవడానికి పురికొల్పుతుంది.
చదివే వేగాన్ని పరిగణలోకి తీసుకోండి
చదవడమూ పదాలను గుర్తించడమూ ఒకదానితో ఒకటి ముడిపడివుంటాయి. మీరిప్పుడు చదువుతుండగా కూడా పదాలను గుర్తిస్తున్నారు, వాటి అర్థాలను గుర్తుచేసుకుంటున్నారు. మీరు పదాలను గుర్తించే విస్తృతిని పెంచుకుంటే మీరు చదివే వేగాన్ని పెంచుకోగలుగుతారు. ఒక్కొక్క పదం చూసేందుకు ఆగే బదులు, ఒకేసారి కొన్ని పదాలను చూడడానికి ప్రయత్నించండి. మీరు ఈ సామర్థ్యాన్ని పెంచుకొనే కొద్దీ మీరు చదువుతున్నదాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని మీరు గ్రహిస్తారు.
కలిసి చదవడం కుటుంబ సభ్యులను మరింత సన్నిహితం చేస్తుంది
అయితే, మరింత లోతైన సమాచారాన్ని చదువుతున్నప్పుడు, మరొక పద్ధతిని పాటించడం ద్వారా మీరు చేసే ప్రయత్నాలకు మరిన్ని ఫలితాలను పొందవచ్చు. లేఖనాలను చదవడం గురించి యెహోవా యెహోషువకు ఉపదేశిస్తూ, “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించవలెను” అని చెప్పాడు. (యెహో. 1:8) ఒక వ్యక్తి ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన కంఠధ్వని తరచూ తగ్గుస్వరంలో వినిపిస్తుంది. కనుకనే, “ధ్యానించు” అని అనువదించబడిన హీబ్రూ మాట, “తగ్గుస్వరములో చదవాలి” అని కూడా కొన్ని భాషాంతరాల్లో అనువదించబడింది. (కీర్త. 63:4; 77:12; 143:5) ఒక వ్యక్తి ధ్యానిస్తున్నప్పుడు, లోతుగా ఆలోచిస్తాడు; గబగబా చదువుకుంటూ పోడు. చదువుతున్న దాన్ని గురించి ఆలోచిస్తూ చదివితే, దేవుని వాక్యం మన మనస్సులపైనా హృదయాలపైనా మరింత ఎక్కువ ప్రభావం చూపించడం సాధ్యమవుతుంది. బైబిలులో ప్రవచనమూ ఉపదేశమూ సామెతలూ కవిత్వమూ దైవిక తీర్పులను గురించిన ప్రకటనలూ యెహోవా సంకల్పం గురించిన వివరాలూ కావలసినన్ని నిజ జీవిత ఉదాహరణలూ ఉన్నాయి. ఇవన్నీ, యెహోవా మార్గాల్లో నడవాలనుకునేవారికి ఎంతో విలువైనవి. మనం బైబిలును చదివేటప్పుడు అది మన మనస్సుల్లోను హృదయాల్లోను నాటుకుపోయేలా చదవడం ఎంత ప్రయోజనకరము!
ఏకాగ్రత నిలపడం నేర్చుకోండి
మీ చదివే అలవాట్లు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి
మీరు చదువుతున్నప్పుడు, అక్కడ వర్ణించబడిన ఒక్కో సన్నివేశంలోను మీరు ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ పాత్రలను మీ మనోనేత్రాలతో చూడడానికి ప్రయత్నించండి, వారి జీవితాల్లో కలుగుతున్న అనుభవాల్లో మీరు కూడా ఉద్వేగపరంగా పాల్గొనండి. కొన్ని వృత్తాంతాలతో పోల్చితే, 1 సమూయేలు 17 వఅధ్యాయంలోని దావీదు, గొల్యాతుల వృత్తాంతం వంటిదాన్ని చదువుతున్నప్పుడు అలా ఊహించడం చాలా సులభం. అయితే, నిర్గమకాండములోను లేవీయకాండములోను మందస నిర్మాణాన్ని గురించిన వివరాలను గానీ యాజకత్వపు ఏర్పాటు వంటివాటిని గురించిన వివరాలను గానీ చదువుతున్నప్పుడు, మందస నిర్మాణ కొలతలనూ నిర్మాణానికి ఉపయోగించబడిన సామగ్రినీ మీరు మీ మనస్సులో చిత్రించుకుంటే, ధూప సుగంధాన్నీ వేయించిన ధాన్యముల ఘుమఘుమలనూ దహన బలులుగా అర్పించబడిన జంతువులనూ ఊహించుకుంటే, ఆ వివరాలు మరింత ఆసక్తికరంగా వాస్తవంగా అనిపిస్తాయి. యాజక సేవలను నిర్వర్తించడం ఎంత సంభ్రమాశ్చర్యాలను కలిగించే అనుభవమై ఉండివుంటుందో ఊహించి చూడండి! (లూకా 1:8-10) మీరు చదువుతున్నప్పుడు ఈ విధంగా ఇంద్రియాలనూ ఉద్వేగాలనూ చేర్చడం, మీరు చదువుతున్నదాని ప్రాముఖ్యతను గ్రహించేందుకు సహాయపడుతుంది, జ్ఞాపకముంచుకునేందుకు సహాయకరంగా కూడా ఉంటుంది.
అయితే, మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శ్రద్ధ నిలపకపోతే, మీ ఆలోచనలు వేరే ఎక్కడో ఉండవచ్చు. మీ కళ్ళు ఆ పేజీని చూస్తుండవచ్చు, కానీ మీ ఆలోచనలు వేరే ఎక్కడికో వెళ్తుండవచ్చు. మ్యూజిక్ పెట్టివుందా? టీవీ ఆన్ చేసి ఉందా? కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారా? అలాంటప్పుడు సాధ్యమైతే నిశ్శబ్దంగా ఉన్న స్థలంలో చదవడం మంచిది. అయితే, ధ్యానభంగం మనలో నుండే కలగవచ్చు. బహుశా మీరు పగలంతా అనేక పనుల్లో తలమునకలై ఉండవచ్చు. విచారకరమైన విషయమేమిటంటే, పగలు చేసిన పనులన్నీ మళ్ళీ మనస్సులోకి సులభంగా వస్తుంటాయి! నిజమే, పగలు జరిగిన వాటిని గురించి మరొకసారి ఆలోచించడం మంచిదే, కానీ ఆ పని చేయాల్సింది మీరు చదివేటప్పుడు మాత్రం కాదు. బహుశా మీరు ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టివుండవచ్చు, ప్రార్థనతోనే చదవనారంభించివుండవచ్చు. కానీ మీరు అలా చదువుతుండగా, మీ మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళడం మొదలుపెడుతుంది. మనస్సును దానిపై నిలపడానికి మళ్ళీ ప్రయత్నించండి. మీరు చదువుతున్న సమాచారంపై ఏకాగ్రతను నిలిపేందుకు మీ మనస్సుకు క్రమశిక్షణనివ్వండి. నెమ్మదిగా మీరు మెరుగుపడడాన్ని చూస్తారు.
మీకు అర్థంకాని పదం కనిపించినప్పుడు మీరు ఏమి చేస్తారు? పరిచయంలేని కొన్ని పదాలు, ఆ పాఠ్యభాగంలో నిర్వచించబడివుండవచ్చు లేదా చర్చించబడివుండవచ్చు. లేదంటే దాని అర్థాన్ని మీరు ఆ సందర్భాన్ని బట్టి గ్రహించగలుగుతుండవచ్చు. అలా అర్థం చేసుకొనే అవకాశం లేనట్లయితే, ఒక నిఘంటువు అందుబాటులో ఉంటే దాన్ని తెరిచి చూడండి, లేకపోతే ఆ పదానికి ఏదైనా గుర్తుపెట్టుకొని, దాని అర్థాన్ని తర్వాత ఎవరినైనా అడగవచ్చు. అలా చేయడం మీ పదసంపదను పెంచుతుంది, మీరు చదువుతున్నదాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది.
బహిరంగంగా చదవడం
బహిరంగంగా చదవడంలో శ్రద్ధ వహించండి
అపొస్తలుడైన పౌలు, చదవడంలో ఎల్లప్పుడు శ్రద్ధ చూపించమని తిమోతికి చెప్పినప్పుడు, ముఖ్యంగా ఇతరుల ప్రయోజనార్థం చదవడాన్ని సూచించాడు. (1 తిమో. 4:13) సమర్థవంతమైన రీతిలో బహిరంగంగా చదవడమంటే, ఆ పేజీలోని పదాలను గట్టిగా చదవడం కన్నా ఎక్కువే. పాఠకుడు, పదాల భావాన్ని అర్థం చేసుకొని, అవి తెలియజేస్తున్న ఆలోచనలను గ్రహించవలసిన అవసరం ఉంది. ఆయనలా చేసినప్పుడు మాత్రమే, అందులోని తలంపులను సరైనవిధంగా వ్యక్తం చేయగలుగుతాడు, ఉద్వేగాలను సరైన విధంగా తన స్వరంలో పలికించగలుగుతాడు. అయితే, అందుకు బాగా సిద్ధపడడమూ, అభ్యాసం చేయడమూ అవసరం. కాబట్టే, “బహిరంగంగా చదివి వినిపించడంలో . . . శ్రద్ధ వహించు” అని పౌలు ఉద్బోధించాడు. (ఇటాలిక్కులు మావి.) మీరు బహిరంగంగా చదవడంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకునేందుకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విలువైన శిక్షణను మీకిస్తుంది.
చదవడానికి సమయం కేటాయించండి
“శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు, తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామె. 21:5) చదవాలన్న మన కోరికను తీర్చుకునే విషయంలో కూడా అది ఎంత నిజం! మనం ‘లాభము’ పొందాలంటే, ఇతర కార్యకలాపాలు మన చదువును ప్రక్కకు నెట్టేయకుండా ఉండేలా మనం శ్రద్ధగా ప్లాన్ వేసుకోవలసిన అవసరముంది.
మీరు ఎప్పుడు చదువుతారు? మీరు ఉదయంపూట చదవడం ద్వారా ప్రయోజనం పొందుతారా? లేక దినంలోని తర్వాతి సమయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవగలుగుతారా? మీరు ప్రతి రోజూ కనీసం 15 నుండి 20 నిమిషాలు చదవడానికి కేటాయించగలిగితే, మీరెంత వరకు ప్రయోజనం పొందగలరో చూసి మీరే ఆశ్చర్యపోతారు. దానికి కీలకం క్రమంగా చదవడమే.
తన మహత్తరమైన సంకల్పాల గురించి ఒక పుస్తకంలో వ్రాయబడాలని యెహోవా ఎందుకు నిర్ణయించుకున్నాడు? ప్రజలు ఆయన లిఖిత వాక్యాన్ని పరిశీలించగలిగేందుకే. అది, యెహోవా చేసిన అద్భుతమైన కార్యాలను గురించి వారు ఆలోచించేందుకు, వాటిని తమ పిల్లలకు చెప్పేందుకు, దేవుని కార్యాలను జ్ఞాపకాల్లో భద్రంగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. (కీర్త. 78:5-7) ఈ విధంగా యెహోవా చూపిన ఔదార్యానికి మనం కృతజ్ఞతను వ్యక్తం చేయగల శ్రేష్ఠమైన మార్గం, జీవదాయకమైన ఆయన వాక్యాన్ని చదవడానికి శ్రద్ధ చూపడమే.