కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be పేజీ 272-పేజీ 281 పేరా 4
  • మనం ప్రకటించాల్సిన సందేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ప్రకటించాల్సిన సందేశం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను”
  • ‘యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుట’
  • “ఈ రాజ్యసువార్త”
  • భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు
    భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు
  • మనం ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘ఎన్నటికీ నాశనముకాని’ రాజ్యము
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • దేవుని రాజ్యం పరిపాలిస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be పేజీ 272-పేజీ 281 పేరా 4

మనం ప్రకటించాల్సిన సందేశం

“నేనే దేవుడను మీరే నాకు సాక్షులు” అంటూ యెహోవా మనకొక బాధ్యతను అప్పగించాడు, ఒక గొప్ప ఆధిక్యతనూ ఇచ్చాడు. (యెష. 43:12) మనం కేవలం విశ్వాసులం మాత్రమే కాదు, సాక్షులం కూడా; దైవ ప్రేరేపిత వాక్యంలోని కీలకమైన సత్యాలకు బహిరంగంగా సాక్ష్యమిచ్చే సాక్షులం.

మన కాలంలో వినిపించాల్సిన ఏ సందేశాన్ని యెహోవా మనకు ఇచ్చాడు? యెహోవా దేవునిపై, యేసుక్రీస్తుపై, మెస్సీయా రాజ్యంపై అవధానాన్ని కేంద్రీకరింపజేసేదే ఆ సందేశం.

“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను”

క్రైస్తవ యుగానికి ఎంతో కాలం పూర్వం యెహోవా, “జనములన్నియు” తమను తాము ఆశీర్వదించుకునే ఏర్పాట్ల గురించి విశ్వసనీయుడైన అబ్రాహాముకు చెప్పాడు. (ఆది. 22:18) మానవులందరికీ ఉన్న ఒక ప్రాథమిక ఆవశ్యకత గురించి వ్రాసేలా కూడా ఆయన సొలొమోనును ప్రేరేపించాడు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసం. 12:13) కానీ అన్ని జనాంగముల ప్రజలు ఈ విషయాల గురించి ఎలా తెలుసుకుంటారు?

దేవుని వాక్యాన్ని నమ్మినవారు అన్ని కాలాల్లోనూ ఎంతో కొంత మంది ఉన్నప్పటికీ, అన్ని జనాంగాలనూ సువార్తతో నిజంగా చేరుకునే పెద్ద ఎత్తున జరిగే భౌగోళిక సాక్ష్యపు పని మాత్రం ‘ప్రభువు దినము’కే పరిమితమని బైబిలు చూపిస్తోంది. ఆ ప్రభువు దినం 1914లో ప్రారంభమైంది. (ప్రక. 1:10) ఆ కాలం గురించి ప్రవచిస్తూ, “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” ఒక కీలకమైన ప్రకటన చేయబడుతుందని ప్రకటన 14:6, 7 చెబుతోంది. వారు ఇలా ఉద్బోధించబడతారు: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” ఈ సందేశం వినిపించాలన్నది దేవుని చిత్తము. ఆ పనిలో భాగం వహించే ఆధిక్యత మనది.

‘సత్య దేవుడు.’ “మీరు . . . నాకు సాక్షులు” అని యెహోవా ప్రకటించినప్పుడు, ఆ సందర్భంలో దైవత్వపు వివాదం గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. (యెష. 43:10) అక్కడ ప్రకటించాల్సిన సందేశం, ప్రజలకు ఒక మతం ఉండాలనో లేదా ఒక దేవుణ్ణి నమ్ముకోవాలనో కాదు. బదులుగా, భూమ్యాకాశముల సృష్టికర్త మాత్రమే సత్య దేవుడని తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. (యెష. 45:5, 18, 21, 22; యోహా. 17:3) కేవలం సత్య దేవుడు మాత్రమే నమ్మదగిన రీతిలో భవిష్యత్తు గురించి చెప్పగలడు. గతంలో యెహోవా వాక్యం నెరవేరడం, భవిష్యత్తు కోసం ఆయన వాగ్దానం చేసిన సమస్తం సత్యమవుతుందని నమ్మడానికి గట్టి ఆధారాన్నిస్తోందని చెప్పడం మన ఆధిక్యత.—యెహో. 23:14; యెష. 55:10, 11.

నిజమే, మనం సాక్ష్యమిచ్చే అనేకులు ఇతర దేవుళ్ళను ఆరాధిస్తారు లేదా ఎవర్నీ ఆరాధించడం లేదని చెప్పుకుంటారు. వారు మనం చెప్పేది కొంచెం వినేలా చేయడానికి ఇద్దరికీ ఆసక్తివున్న విషయాలతో ప్రారంభించాల్సిన అవసరం ఉండవచ్చు. అపొస్తలుల కార్యములు 17:22-31 లో నివేదించబడిన ఉదాహరణ నుండి మనం ప్రయోజనం పొందవచ్చును. అపొస్తలుడైన పౌలు యుక్తిని ప్రదర్శించినా, భూమ్యాకాశములకు సృష్టికర్త అయిన దేవునికి ప్రజలందరూ జవాబుదారులని మాత్రం ఆయన స్పష్టంగా పేర్కొన్నాడని గమనించండి.

దేవుని నామాన్ని తెలియజేయడం. సత్య దేవుని నామాన్ని చెప్పకుండా ఉండవద్దు. యెహోవా తన నామాన్ని ప్రేమిస్తాడు. (నిర్గ. 3:15; యెష. 42:8) ప్రజలు ఆ నామాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన మహిమాన్విత నామం బైబిలులో 7,000 సార్లకు పైగా కనబడేలా చేశాడు. ప్రజలకు దానిని తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది.—ద్వితీ. 4:35.

మొత్తం మానవాళి భావి నిరీక్షణలు, వారు యెహోవాను తెలుసుకొని విశ్వాసంతో ఆయనకు ప్రార్థించడంపై ఆధారపడివున్నాయి. (యోవే. 2:32; మలా. 3:16; 2 థెస్స. 1:6-8) అయితే ప్రజల్లో అత్యధికులకు యెహోవా ఎవరో తెలీదు. అలాంటి ప్రజల్లో బైబిలులోని దేవుణ్ణే ఆరాధిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి దగ్గర బైబిలు ఉన్నా దాన్ని వారు చదువుతున్నా, దేవుని వ్యక్తిగత నామమేమిటో వారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అనేక ఆధునిక అనువాదాలు దానిని తొలగించాయి. కొందరికైతే యెహోవా అనే పేరును ఉపయోగించవద్దని వారి మత నాయకులు చెప్పడం మూలంగానే ఆ పేరు గురించి తెలిసింది.

మనం ప్రజలకు దేవుని పేరును ఎలా తెలియజేయవచ్చు? దాన్ని వారికి బైబిలులో నుండే చూపించడం కన్నా సమర్థమైన మార్గమేదీ లేదు—సాధ్యమైతే వారి సొంత బైబిలులోనే చూపించవచ్చు. కొన్ని అనువాదాల్లో ఆ పేరు వేలసార్లు కనబడుతుంది. మరికొన్నింట్లో అది కేవలం కీర్తన 83:18 లో లేదా నిర్గమకాండము 6:3-6 లో కనబడవచ్చు, లేదా నిర్గమకాండము 3:14, 15 లేక 6:3 వచనాల్లోని అధస్సూచిలో కనబడవచ్చు. మూలభాషలోని గ్రంథంలో దేవుని నామం ఉన్నచోట్ల అనేక అనువాదాలు, “ప్రభువు” “దేవుడు” వంటి ప్రత్యామ్నాయ వ్యక్తీకరణలను ప్రత్యేకమైన సైజులో ఉపయోగించాయి. దేవుని వ్యక్తిగత నామం పూర్తిగా తొలగించిన ఆధునిక అనువాదాలు ఉన్న చోట్ల మీరు అంతకన్నా పాత అనువాదాలను చూపించి ఏమి జరిగిందో ప్రజలకు చూపించవచ్చు. కొన్ని దేశాల్లో మీరు ప్రార్థనాగీతాల్లో దేవుని నామం ఉన్నట్లు లేదా ప్రభుత్వ కట్టడాలపై అది చెక్కబడినట్లు చూపించవచ్చు.

ఇతర దేవుళ్ళను ఆరాధించేవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా యిర్మీయా 10:10-13 వచనాలు నూతనలోక అనువాదంలో ఎంతో సమర్థంగా ఉపయోగించవచ్చు. ఆ వచనాలు దేవుని పేరును మాత్రమే కాక ఆయనెవరో కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

క్రైస్తవమత సామ్రాజ్యం చేస్తున్నట్లుగా యెహోవా అనే పేరును “దేవుడు” “ప్రభువు” అనే బిరుదుల మాటున మరుగుపరచకండి. అయితే దీనర్థం, ప్రతి సంభాషణ ప్రారంభంలో ఆ నామం ఉపయోగించి తీరాల్సిందేనని కాదు. కొందరు ప్రజలు దురభిమానం మూలంగా చర్చనే ఆపేయవచ్చు. కానీ సంభాషణకు ఒక ఆధారాన్ని స్థాపించిన తర్వాత మాత్రం దేవుని నామాన్ని ఉపయోగించకుండా ఉండవద్దు.

బైబిలులో, “ప్రభువు” “దేవుడు” వంటి పదాల సందర్భాలన్నీ కలిపితే వచ్చే సంఖ్యకన్నా దేవుని వ్యక్తిగత నామం కనబడే సందర్భాల సంఖ్య ఎక్కువగా ఉందన్నది గమనార్హం. అలాగని బైబిలు రచయితలు ప్రతి వాక్యంలో దేవుని పేరును ప్రయోగించడానికి ప్రయత్నించారని కాదు. వారు సహజంగా, స్వేచ్ఛగా, గౌరవభావంతో దాన్ని ఉపయోగించారు. మనం అనుకరించడానికి అది మంచి మాదిరి.

ఆ నామము ధరించిన వ్యక్తి. దేవునికి ఒక వ్యక్తిగత నామం ఉన్నదన్న విషయమే గమనార్హమైనదైనప్పటికీ అది ప్రారంభం మాత్రమే.

ప్రజలు యెహోవాను ప్రేమించడానికీ విశ్వాసంతో ఆయనకు ప్రార్థించడానికీ ఆయనెలాంటి దేవుడో వారికి తెలియాలి. సీనాయి పర్వతంపై యెహోవా తన నామాన్ని మోషేకు తెలియపరిచినప్పుడు ఆయన కేవలం “యెహోవా” అన్న పదాన్ని ఉచ్చరించడం మాత్రమే చేయలేదు. ఆయన తన అత్యుత్కృష్టమైన కొన్ని లక్షణాలవైపు అవధానాన్ని ఆకర్షించాడు. (నిర్గ. 34:6, 7) అది మనం అనుకరించడానికి ఒక మాదిరి.

మీరు కొత్తగా ఆసక్తి చూపిస్తున్న వారికి సాక్ష్యమిస్తున్నా, సంఘంలో ప్రసంగాలిస్తున్నా, రాజ్యాశీర్వాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాగ్దానాలు చేసే దేవుని గురించి అవేమి సూచిస్తున్నాయో చూపించండి. ఆయన ఆజ్ఞల గురించి చెబుతున్నప్పుడు అవి ప్రతిఫలిస్తున్న జ్ఞానాన్ని ప్రేమను నొక్కిచెప్పండి. దేవుడు కోరేవి మనపై ఒక భారాన్ని మోపడం లేదని, బదులుగా అవి మనకు ప్రయోజనకరంగా ఉండడానికే రూపొందించబడ్డాయని స్పష్టం చేయండి. (యెష. 48:17, 18; మీకా 6:8) యెహోవా శక్తికి వ్యక్తీకరణగా ఉన్నదేదైనా ఆయన వ్యక్తిత్వం గురించీ ఆయన ప్రమాణాల గురించీ ఆయన సంకల్పాల గురించీ ఎంతో కొంత ఎలా వెల్లడిచేస్తోందో చూపించండి. యెహోవా తన లక్షణాలను ప్రదర్శించే విధానంలో సమతుల్యత ఎలా వ్యక్తమవుతోందో ఎత్తిచూపండి. మీరు యెహోవా గురించిన మీ సొంత భావాలను వ్యక్తపరచడం ప్రజలు విననీయండి. యెహోవా పట్ల మీకున్న ప్రేమ ఇతరుల్లోనూ అలాంటి ప్రేమను పురికొల్పడానికి దోహదపడుతుంది.

మన కాలం కోసమైన అత్యవసర సందేశం, ప్రజలందరూ దేవునికి భయపడాలని ఉద్బోధిస్తోంది. మనం చెప్పేదాని ద్వారా అలాంటి దైవిక భయాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. ఈ భయం ఆరోగ్యకరమైన భయం, యెహోవా అంటే ఆశ్చర్యంతో కూడిన భయం, అది ఆయనపట్ల పూజ్యభావంతో కూడిన భక్తి. (కీర్త. 89:7) అందులో యెహోవా సర్వోన్నత న్యాయాధిపతి అనీ, మన భవిష్యత్‌ జీవిత ఉత్తరాపేక్షలు మనం ఆయన ఆమోదాన్ని పొందడంపై ఉంటాయనీ తెలుసుకోవడం కూడా ఉంది. (లూకా 12:5; రోమా. 14:11, 12) కాబట్టి అలాంటి భయం ఆయన పట్ల ప్రగాఢమైన ప్రేమతోనూ, దాని ఫలితంగా ఆయనను ప్రీతిపరచాలన్న ప్రగాఢమైన కోరికతోనూ ముడిపడివుంది. (ద్వితీ. 10:12, 13) దైవిక భయం మనం చెడును ద్వేషించేలా, దేవుని ఆజ్ఞలకు విధేయులయ్యేలా, ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించేలా కూడా మనల్ని కదిలిస్తుంది. (ద్వితీ. 5:29; 1 దిన. 28:9; సామె. 8:13) అది, మనం లోకంలోని విషయాలను ప్రేమిస్తూనే దేవునికి సేవచేయడానికి ప్రయత్నించడం నుండి మనల్ని కాపాడుతుంది.—1 యోహా. 2:15-17.

దేవుని నామము—“బలమైన దుర్గము.” యెహోవాను నిజంగా తెలుసుకునే ప్రజలు గొప్ప రక్షణను పొందుతారు. దానికి కారణం వారు కేవలం దేవుని పేరును ఉపయోగించడం మూలంగానో లేదా ఆయన లక్షణాల్లో కొన్నింటిని అప్పజెప్పగలగడం మూలంగానో కాదు. దానికి కారణం వారు యెహోవాలోనే తమ నమ్మకాన్ని ఉంచడం. అలాంటి వారి గురించి సామెతలు 18:10 ఇలా చెబుతోంది: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.”

యెహోవాపై నమ్మకముంచమని ఇతరులను ఉద్బోధించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. (కీర్త. 37:3; సామె. 3:5, 6) అలాంటి నమ్మకం యెహోవాపైనా ఆయన వాగ్దానాలపైనా విశ్వాసాన్ని చూపిస్తుంది. (హెబ్రీ. 11:6) యెహోవా విశ్వసర్వాధిపతి అని తమకు తెలుసు కాబట్టే వారు ‘ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థన’ చేసినప్పుడూ, ఆయన మార్గాలను ప్రేమించినప్పుడూ, నిజమైన రక్షణ ఆయన నుండి మాత్రమే వస్తుందని పూర్తిగా నమ్మినప్పుడూ ప్రజలు రక్షించబడతారని దేవుని వాక్యం మనకు హామీనిస్తోంది. (రోమా. 10:13, 14) మీరు ఇతరులకు బోధిస్తుండగా వారు జీవితంలోని ప్రతి అంశంలో అలాంటి విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి వారికి సహాయం చేయండి.

చాలామంది వెల్లువలా ముంచెత్తే వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతుంటారు. వారికి పరిష్కార మార్గం కానరాకపోవచ్చు. యెహోవా మార్గాలను నేర్చుకొమ్మని, ఆయనపై నమ్మకం ఉంచమని, తాము నేర్చుకునేవాటిని అన్వయించుకొమ్మని వారిని ఉద్బోధించండి. (కీర్త. 25:5) దేవుని సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించమని, ఆయనిచ్చే ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపమని వారిని ప్రోత్సహించండి. (ఫిలి. 4:6, 7) కేవలం బైబిలులో కొన్ని వ్యాఖ్యానాలు చదవడం ద్వారా కాక, తమ సొంత జీవితాల్లో ఆయన వాగ్దానాల నెరవేర్పును అనుభవించడం ద్వారా వారు యెహోవాను తెలుసుకున్నప్పుడు, యెహోవా అనే నామము దేనికి ప్రతీకగా ఉందో దాన్ని నిజంగా గ్రహించడం వలన లభించే భద్రతను వారు అనుభవించడం ప్రారంభిస్తారు.—కీర్త. 34:8; యిర్మీ. 17:7, 8.

సత్య దేవుడైన యెహోవాకు భయపడడంలోని, ఆయన ఆజ్ఞలను శిరసావహించడంలోని జ్ఞానాన్ని అర్థంచేసుకొని దాన్ని ఉన్నతంగా ఎంచడానికి ప్రజలకు సహాయపడే ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి.

‘యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుట’

తన పునరుత్థానానికి తర్వాతా తను పరలోకం వెళ్ళడానికి ముందూ యేసుక్రీస్తు ఇలా చెబుతూ తన శిష్యులకు నిర్దేశకాలిచ్చాడు: ‘మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు.’ (అపొ. 1:8) మన కాలంలోని విశ్వసనీయులైన దేవుని సేవకులు, “యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు” ఉన్నవారని వర్ణించబడ్డారు. (ప్రక. 12:17) అలా సాక్ష్యమివ్వడానికి మీరెంతగా పాటుపడుతున్నారు?

తాము యేసును నమ్ముకుంటున్నామని నిజాయితీగా చెప్పే అనేకులకు ఆయన మానవపూర్వ ఉనికిని గురించి ఏమాత్రం తెలీదు. ఆయన భూమిమీద ఉన్నప్పుడు నిజంగానే మానవుడిగా ఉన్నాడని వారు గ్రహించరు. ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడంటే అది వారి అవగాహనకు అందదు. దేవుని సంకల్పాల నెరవేర్పులో ఆయన పాత్ర గురించి వారికి తెలిసింది చాలా తక్కువ. ఆయన ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో వారికి తెలియదు, భవిష్యత్తులో ఆయన చేయనున్న పనులు తమ జీవితాలనెలా ప్రభావితం చేస్తాయో వారు గ్రహించరు. యెహోవాసాక్షులు యేసుక్రీస్తును నమ్మరని కూడా వారు భావిస్తుండవచ్చు. ఈ విషయాలను గురించిన సత్యాలను తెలియజేయడానికి కృషిచేసే ఆధిక్యత మనకున్నది.

ఇంకా ఇతర ప్రజలు బైబిలులో వర్ణించబడినట్లుగా యేసు వంటి ఒక వ్యక్తి ఒకప్పుడు నిజంగా జీవించాడని నమ్మరు. కొందరు యేసు ఒక మహనీయుడని మాత్రం దృష్టిస్తారు. చాలామంది ఆయన దేవుని కుమారుడన్న తలంపునే తిరస్కరిస్తారు. ఇలాంటి ప్రజల మధ్య ‘యేసునుగూర్చి సాక్ష్యమివ్వడానికి’ ఎంతో కృషి, పట్టుదల, నేర్పు అవసరం.

మీ శ్రోతల దృక్కోణం ఎలా ఉన్నా, వారు నిత్యజీవం కోసం దేవుడు చేసిన ఏర్పాట్లను వినియోగించుకోవాలనుకుంటే యేసుక్రీస్తు గురించిన పరిజ్ఞానాన్ని వారు పొందాలి. (యోహా. 17:3) స్పష్టంగా వ్యక్తం చేయబడిన దేవుని చిత్తం, జీవించివున్న ప్రతి ఒక్కరూ ‘యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని’ ఆయన అధికారానికి లోబడాలన్నదే. (ఫిలి. 2:9-11) కాబట్టి, బలమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్న లేదా ఎంతో దురభిమానము ఉన్న ప్రజలను కలుసుకున్నప్పుడు మనమా విషయాన్ని చర్చించకుండా ఉండలేము. కొన్ని సందర్భాల్లో మనం యేసుక్రీస్తు గురించి తొలి సందర్శనాల్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాము, మరికొన్ని సందర్భాల్లో మన శ్రోతలు ఆయన గురించి సరైన విధానంలో ఆలోచించడం ప్రారంభించడానికి దోహదపడేలా మనం వివేచనాపూర్వకంగా వ్యాఖ్యానాలు చేయాల్సివుండవచ్చు. మున్ముందు చేసే సందర్శనాల్లో ఈ విషయం గురించి అదనపు అంశాలను కూడా పరిచయం చేయడానికి కొన్ని మార్గాలను ఆలోచించవలసి రావచ్చు. అయితే, ఒక వ్యక్తితో గృహ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించేంత వరకు ఈ విషయాన్ని గురించి సమస్తమూ చర్చించడం సాధ్యంకాకపోవచ్చు.—1 తిమో. 2:3-7.

దేవుని సంకల్పంలో యేసు కీలకమైన పాత్ర. యేసే “మార్గము” గనుక, ‘ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు’ గనుక యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచకుండా దేవునితో ఆమోదయోగ్యమైన అనుబంధంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రజలు అర్థంచేసుకోవడానికి మనం వారికి సహాయం చేయాలి. (యోహా. 14:6) యెహోవా తన జ్యేష్ఠపుత్రునికి నియమించిన కీలకమైన పాత్రను గుర్తిస్తేనే గాని ఒక వ్యక్తి బైబిలును అర్థం చేసుకోవడం సాధ్యంకాదు. ఎందుకని? ఎందుకంటే యెహోవా ఈ కుమారుణ్ణి తన సంకల్పాలన్నింటి నెరవేర్పులో కీలకమైన వ్యక్తిగా చేశాడు. (కొలొ. 1:17-20) ఇదే వాస్తవం చుట్టూ బైబిలు ప్రవచనాలు పరిభ్రమిస్తాయి. (ప్రక. 19:10) సాతాను లేవదీసిన తిరుగుబాటు మూలంగా, ఆదాము చేసిన పాపం మూలంగా తలెత్తిన సమస్యలన్నింటికీ పరిష్కారం యేసుక్రీస్తు ద్వారానే లభిస్తుంది.—హెబ్రీ. 2:5-9, 14, 15.

క్రీస్తు పాత్రను అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి, మానవులు ఘోరమైన పరిస్థితిలో ఉన్నారనీ దానిలోనుండి వారు తమకు తాముగా స్వతంత్రులు కాలేరనీ గుర్తించాల్సిన అవసరం ఉంది. మనందరం పాపంలో జన్మించాము. ఇది మనల్ని మన జీవితకాలంలో అనేక రకాలుగా ప్రభావితం చేయవచ్చు. అయితే, ఎంతోకాలం గడవకముందే అది మరణానికి నడిపిస్తుంది. (రోమా. 3:23; 5:12) మీరు సాక్ష్యమిస్తున్న వ్యక్తితో ఆ వాస్తవంపై తర్కించండి. ఆ తర్వాత, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా దానిమీద విశ్వాసం ఉంచేవారెవరైనా సరే పాపం నుండి మరణం నుండి విడుదల పొందగలిగే అవకాశాన్ని యెహోవా ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశాడని చూపించండి. (మార్కు 10:45; హెబ్రీ. 2:9) దాని ఫలితంగా పరిపూర్ణతతో నిత్యజీవాన్ని అనుభవించే మార్గం వారికి తెరువబడుతుంది. (యోహా. 3:16, 36) మరే మార్గంలోనూ అది సాధ్యం కాదు. (అపొ. 4:12) ఒక బోధకుడిగా, వ్యక్తిగతంగానైనా లేక సంఘంలోనైనా, ఈ వాస్తవాలను ఊరికే పేర్కొనకండి. మన విమోచకుడిగా క్రీస్తు కలిగివున్న పాత్ర విషయంలో మీ శ్రోతల్లో కృతజ్ఞతాభావాన్ని ప్రేమపూర్వకంగా, ఓర్పుగా పురికొల్పండి. ఈ ఏర్పాటు పట్ల కృతజ్ఞత కలిగివుండడం ఒక వ్యక్తి జీవితంలోని వైఖరిపై, ప్రవర్తనపై, లక్ష్యాలపై గొప్ప ప్రభావం చూపిస్తుంది.—2 కొరిం. 5:14, 15.

నిజమే, యేసు తన జీవితాన్ని కేవలం ఒక్కసారే బలిగా అర్పించాడు. (హెబ్రీ. 9:28) అయితే, ఇప్పుడాయన ప్రధాన యాజకుడిగా క్రియాత్మకంగా సేవచేస్తున్నాడు. దానర్థం ఏమిటో గ్రహించేందుకు ఇతరులకు సహాయపడండి. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల నిర్దయ మూలంగా ఒత్తిళ్ళను, నిరాశలను, బాధలను, లేదా సమస్యలను అనుభవిస్తున్నారా? యేసు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ అనుభవించాడు. మనం ఎలా భావిస్తున్నామో ఆయనకు తెలుసు. అపరిపూర్ణత మూలంగా మనకు దేవుని కరుణ అవసరమని మనం భావిస్తున్నామా? యేసు బలి ఆధారంగా మనం క్షమాపణ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే యేసు మన పక్షాన ‘తండ్రివద్ద ఉత్తరవాదిగా’ పనిచేస్తాడు. ఆయన వాత్సల్యంతో ‘మనకొరకు విజ్ఞాపనము’ చేస్తాడు. (1 యోహా. 2:1, 2; రోమా. 8:34) యేసు బలి ఆధారంగాను, ప్రధాన యాజకుడిగా ఆయన సేవల ఆధారంగాను మనం సరైన సమయంలో సహాయం పొందడం కోసం యెహోవా యొక్క “కృపాసనమునొద్దకు” వెళ్ళడం సాధ్యమవుతోంది. (హెబ్రీ. 4:15, 16) మనం అపరిపూర్ణులమైనా, ప్రధాన యాజకుడిగా యేసు అందించే సహాయం ద్వారా దేవునికి శుద్ధ మనస్సాక్షితో సేవ చేయగలుగుతాము.—హెబ్రీ. 9:13, 14.

దీనికి తోడు యేసు దేవునిచే నియమించబడిన క్రైస్తవ సంఘ శిరస్సుగా ఎంతో అధికారాన్ని ఉపయోగిస్తాడు. (మత్త. 28:18; ఎఫె. 1:22, 23) ఆ హోదాలో ఆయన దేవుని చిత్తానికి అనుగుణంగా అవసరమైన నడిపింపును అందిస్తాడు. మీరు ఇతరులకు బోధించేటప్పుడు, ఏ మానవుడో కాదు గానీ యేసుక్రీస్తే సంఘానికి శిరస్సు అని వారు గ్రహించేలా సహాయపడండి. (మత్త. 23:10) మీరు మొదటిసారి ఆసక్తిగలవారిని కలిసింది మొదలుకొని, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే సాహిత్యాల సహాయంతో మనం బైబిలును అధ్యయనం చేసే స్థానిక సంఘంలోని కూటాలకు హాజరుకమ్మని వారిని ఆహ్వానించండి. ‘దాసుడు’ ఎవరో వివరించడం మాత్రమే కాక యజమాని ఎవరో కూడా వివరించండి, అలా వారు యేసు శిరస్సత్వాన్ని గురించి తెలుసుకుంటారు. (మత్త. 24:45-47) వారిని పెద్దలకు పరిచయం చేయండి, వారు చేరుకోవలసిన లేఖనాధారిత అర్హతలను వివరించండి. (1 తిమో. 3:1-7; తీతు 1:5-9) సంఘమనేది పెద్దలకు చెందినది కాదుగానీ వారు, మనం యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచేందుకు సహాయపడతారని వివరించండి. (అపొ. 20:28; ఎఫె. 4:16; 1 పేతు. 5:2, 3) క్రీస్తు శిరస్సత్వం క్రింద పనిచేస్తున్న సంస్థీకృత, ప్రపంచవ్యాప్త సమాజం ఒకటి ఉన్నదని ఆసక్తిగల ఈ ప్రజలు గ్రహించేలా సహాయపడండి.

యేసు తన మరణానికి కొద్దిగా ముందు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు “ప్రభువు పేరట వచ్చు రాజు” అంటూ ఆయనను స్తుతించారని సువార్తల నుండి మనకు తెలుస్తోంది. (లూకా 19:38) ప్రజలు బైబిలును మరింత లోతుగా అధ్యయనం చేస్తుండగా, ఇప్పుడు యెహోవా సమస్త జనాంగముల ప్రజలను ప్రభావితం చేసే విధంగా యేసుకు పరిపాలనాధికారం అప్పజెప్పబడిందని వారు నేర్చుకుంటారు. (దాని. 7:13, 14) మీరు సంఘంలో ప్రసంగాలు ఇస్తున్నప్పుడు లేదా అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు, యేసు పరిపాలన మనందరి విషయంలో ఎలాంటి అర్థాన్ని కలిగివుండాలో గ్రహించి దానిపట్ల కృతజ్ఞులై ఉండేలా ప్రజలకు సహాయపడండి.

యేసుక్రీస్తు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడని మనం నిజంగా నమ్ముతున్నామో లేదో, ఆయన పరిపాలనకు మనం మనఃపూర్వకంగా లోబడుతున్నామో లేదో మన జీవన విధానం చూపిస్తుందని నొక్కిచెప్పండి. యేసు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన తన అనుచరులకు చేయమని అప్పగించిన పనివైపుకు దృష్టిని మళ్ళించండి. (మత్త. 24:14; 28:18-20) ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన యేసు, జీవిత ప్రాధాన్యతల గురించి ఏమన్నాడో చర్చించండి. (యెష. 9:6, 7; మత్త. 6:19-34) సమాధానకర్తయగు అధిపతి తన అనుచరులు చూపించాలని చెప్పిన స్ఫూర్తి వైపుకు దృష్టిని మళ్ళించండి. (మత్త. 20:25-27; యోహా. 13:35) ఇతరులు చేయాల్సినంత చేస్తున్నారో లేదో తీర్పుతీర్చే బాధ్యతను మీమీద వేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి, బదులుగా క్రీస్తు రాజత్వానికి లోబడే విషయంలో వారి చర్యలు ఏమి సూచిస్తున్నాయో ఆలోచించమని వారిని ప్రోత్సహించండి. మీరు కూడా అలా లోబడాల్సిన అవసరం ఉందని మీరు గుర్తిస్తున్నట్లు చెప్పండి.

క్రీస్తును పునాదిగా చేసుకోవడం. బైబిలు, యేసుక్రీస్తును పునాదిగా చేసుకుని నిర్మించే ఒక కట్టడంతో క్రైస్తవ శిష్యుణ్ణి చేసే పనిని పోలుస్తోంది. (1 కొరిం. 3:10-15) దాన్ని సాధించేందుకు, యేసును గురించి బైబిలు వర్ణిస్తున్న విధంగా ఆయనను తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేయండి. వారు మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు తలంచకుండా జాగ్రత్త పడండి. (1 కొరిం. 3:4-7) వారి అవధానాన్ని యేసుక్రీస్తు వైపు నిర్దేశించండి.

పునాది గట్టిగా పడితే, క్రీస్తు తన “అడుగుజాడలయందు నడుచుకొనునట్లు” తమ కోసం ఒక మాదిరి ఉంచాడని విద్యార్థులు అర్థం చేసుకుంటారు. (1 పేతు. 2:21) ఇక దానిపై కట్టడాన్ని నిర్మించేందుకుగాను, సువార్తలను ఏదో సత్యవంతమైన చరిత్రగా కాక అనుసరించాల్సిన మాదిరివున్న చరిత్రగా చదివేందుకు విద్యార్థులను ప్రోత్సహించండి. యేసులో విలక్షణంగా ఉన్న వైఖరులను లక్షణాలను హృదయంలోకి స్వీకరించడానికి వారికి సహాయపడండి. యేసు తన తండ్రి గురించి ఎలా భావించాడో, శోధనలతో శ్రమలతో ఎలా వ్యవహరించాడో, దేవునికి ఆయనెలా లోబడ్డాడో, వివిధ పరిస్థితుల్లో మనుష్యులతో ఎలా వ్యవహరించాడో గమనించమని వారిని ప్రోత్సహించండి. యేసు తన జీవితమంతటిలో ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడో నొక్కిచెప్పండి. అప్పుడు, జీవితంలో నిర్ణయాలు తీసుకోవలసివచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు విద్యార్థి తనను తాను ఇలా ప్రశ్నించుకుంటాడు: ‘ఈ పరిస్థితిలో యేసు ఏమి చేసివుండేవాడు? నేను అనుసరిస్తున్న మార్గం ఆయన నాకోసం చేసినదాని పట్ల సరైన కృతజ్ఞతాభావాన్ని చూపిస్తోందా?’

సంఘంలో మాట్లాడుతున్నప్పుడు, మీ సహోదరులకు యేసుపై విశ్వాసం అప్పటికే ఉంది కాబట్టి మళ్ళీ ఆయనవైపుకు ప్రత్యేక అవధానాన్ని మళ్ళించాల్సిన అవసరం లేదనే నిర్ధారణకు రాకండి. ఆ విశ్వాసాన్ని మరింత నిర్మించినట్లైతే మీరేం చెబుతారన్నదానికి విలువవుంటుంది. మీరు కూటాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని సంఘ శిరస్సుగా యేసు పాత్రతో అనుసంధానం చేయండి. క్షేత్ర పరిచర్య గురించి చర్చిస్తున్నప్పుడు, యేసు తన పరిచర్యను చేసేటప్పుడు ఆయన చూపించిన స్ఫూర్తి వైపుకు దృష్టిని మళ్ళించండి, తర్వాత ప్రజలను కాపాడి నూతన లోకంలోకి తీసుకువెళ్ళడానికి వారిని సిద్ధంచేయడానికి ఒక రాజుగా క్రీస్తు ఏమి చేస్తున్నాడన్నదాని వెలుగులో పరిచర్యను చర్చించండి.

యేసు గురించి కేవలం ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం మాత్రమే సరిపోదని స్పష్టంగా కనిపిస్తోంది. నిజమైన క్రైస్తవులుగా అవ్వాలంటే ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచాలి, ఆయన్ను నిజంగా ప్రేమించాలి. అలాంటి ప్రేమ విశ్వసనీయమైన విధేయతను ప్రేరేపిస్తుంది. (యోహా. 14:15, 21) అది ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లోను విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు, జీవితకాలమంతా క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకునేందుకు, “వేరుపారి స్థిరపడి” ఉన్న పరిణతిచెందిన క్రైస్తవులుగా తమను తాము రుజువు చేసుకునేందుకు దోహదపడుతుంది. (ఎఫె. 3:15-18) అలాంటి జీవన మార్గం యేసుక్రీస్తుకు దేవుడూ తండ్రీ అయిన యెహోవాకు మహిమను తెస్తుంది.

“ఈ రాజ్యసువార్త”

యేసు తన ప్రత్యక్షతకు, ఈ విధానాంతానికి సూచన గురించిన వివరాలను చెబుతూ ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్త. 24:14.

అంత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆ సందేశం ఏమిటి? అది, “నీ రాజ్యము వచ్చుగాక” అని దేవునికి ప్రార్థించమని యేసు మనకు ఏ రాజ్యం గురించైతే నేర్పించాడో ఆ రాజ్యాన్ని గురించిన సందేశమే. (మత్త. 6:9-10) ప్రకటన 11:15 వ వచనం దాన్ని ‘మన ప్రభువు [యెహోవా] రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము’ అని వర్ణిస్తోంది, ఎందుకంటే రాజ్యం చేసే అధికారం యెహోవా నుండే వస్తుంది, రాజుగా ఆ అధికారం క్రీస్తుకు అప్పగించబడింది. అయితే, మన కాలంలో ప్రకటించబడుతుందని యేసు చెప్పిన సందేశం మొదటి శతాబ్దంలో ఆయన అనుచరులు ప్రకటించిన దానికన్నా ఎంతో విస్తృతమైనదని గమనించండి. వారైతే “దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని” ప్రజలకు చెప్పారు. (లూకా 10:9) ఎందుకంటే రాజుగా అభిషేకించబడే వ్యక్తి అయిన యేసు అప్పట్లో వారి మధ్య ఉన్నాడు. కానీ మత్తయి 24:14​లో నమోదు చేయబడినట్లుగా, దేవుని సంకల్ప నెరవేర్పులో మరో ప్రాముఖ్యమైన సంఘటన గురించి ప్రపంచవ్యాప్త ప్రకటన జరుగుతుందని యేసు ప్రవచించాడు.

ఆ అభివృద్ధిని గురించి ప్రవక్తయైన దానియేలుకు ఒక దర్శనం ఇవ్వబడింది. “మనుష్యకుమారుని పోలిన యొకడు,” అంటే యేసుక్రీస్తు, ‘మహావృద్ధుడి నుండి,’ అంటే యెహోవా నుండి “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” పొందడాన్ని దానియేలు చూశాడు. (దాని. 7:13, 14) విశ్వ ప్రాముఖ్యం కలిగిన ఆ సంఘటన పరలోకంలో 1914లో జరిగింది. ఆ తర్వాత సాతాను వానితోటి దయ్యాలు భూమ్మీదికి పడద్రోయబడ్డారు. (ప్రక. 12:7-10) ఈ పాత విధానం దాని అంత్యదినాల్లోకి ప్రవేశించింది. కానీ అది పూర్తిగా తొలగించబడక ముందే, యెహోవా మెస్సీయా రాజు ఇప్పుడు పరలోకపు సింహాసనం నుండి పరిపాలిస్తున్నాడని ఒక భౌగోళిక ప్రకటన చేయబడుతోంది. అన్నిచోట్లా ప్రజలకు ప్రకటించబడుతోంది. “మానవుల రాజ్యముపైన” పరిపాలన చేస్తున్న సర్వోన్నతుడి పట్ల తమ వైఖరిని వారి ప్రతిస్పందన తెలియజేస్తుంది.—దాని. 4:32.

నిజమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది​—⁠చాలా చాలా ఉంది! మనం “నీ రాజ్యము వచ్చుగాక” అని ఇంకా ప్రార్థిస్తున్నాము, కానీ దేవుని రాజ్య స్థాపన ఇంకా ఎప్పుడో భవిష్యత్తులో ఉందన్న తలంపుతో కాదు. బదులుగా, దానియేలు 2:44 మరియు ప్రకటన 21:2-4 వంటి ప్రవచనాలను నెరవేర్చడానికి పరలోక రాజ్యం నిర్ణాయకమైన విధానంలో చర్య తీసుకుంటుందన్న ఉద్దేశంతో మనం ప్రార్థిస్తున్నాము. ఆ రాజ్యం, దేవుణ్ణి తమ తోటిమానవులను ప్రేమించే ప్రజలతో నిండివున్న ఒక పరదైసుగా భూమిని మార్చేస్తుంది. “ఈ రాజ్యసువార్త” గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ భవిష్యత్‌ ఆశీర్వాదాలవైపు చూపిస్తున్నాము. అంతేకాదు, యెహోవా ఇప్పటికే ఆ రాజ్యంపై పూర్తి పరిపాలనాధికారాన్ని తన కుమారుని భుజస్కంధాలపై మోపాడని కూడా పూర్తి నమ్మకంతో తెలియజేస్తున్నాము. మీరు రాజ్యం గురించి సాక్ష్యమిచ్చేటప్పుడు ఈ సువార్తను నొక్కిచెబుతున్నారా?

రాజ్యాన్ని వివరించడం. దేవుని రాజ్యాన్ని ప్రటించాలన్న మన నియామకాన్ని మనమెలా నెరవేర్చవచ్చు? నిర్దిష్ట విషయాలపై సంభాషణలు ప్రారంభించడం ద్వారా మనం ఆసక్తిని రేకెత్తించవచ్చు, కానీ మన సందేశం దేవుని రాజ్యాన్ని గురించేనన్నది మన సంభాషణలో త్వరగా స్పష్టం కావాలి.

ఈ పనిలో, రాజ్యాన్ని గురించి చెబుతున్న లేఖనాలను చదవడం లేదా ఎత్తిచెప్పడం ఒక ప్రాముఖ్యమైన అంశం. మీరు రాజ్యాన్ని గురించి పేర్కొనేటప్పుడు మీరు మాట్లాడుతున్న వ్యక్తి అదేమిటో అర్థంచేసుకున్నాడని నిర్ధారించుకోండి. అందుకు దేవుని రాజ్యం ఒక ప్రభుత్వమని చెప్పడం మాత్రమే సరిపోకపోవచ్చు. అదృశ్యంగా ఉండే ఒక ప్రభుత్వం గురించి ఆలోచించడం కొందరికి కష్టం కావచ్చు. వారితో మీరు అనేక విధాల్లో తర్కించవచ్చు. ఉదాహరణకు, గురుత్వాకర్షణ శక్తి అదృశ్యమైనదే, కానీ అది మన జీవితాల్లో ఒక శక్తివంతమైన ప్రభావాన్ని కలిగివుంటుంది. గురుత్వాకర్షణ శక్తి నియమాలను ఏర్పరచిన వ్యక్తిని మనం చూడలేము, కానీ ఆయనకు మహా శక్తి ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బైబిలు ఆయనను ‘సకల యుగములకు రాజు’ అని పిలుస్తోంది. (1 తిమో. 1:17) ఉదాహరణకు, ఏదైనా ఒక పెద్ద దేశంలో చాలా మంది ప్రజలు దేశ రాజధానిని చూసివుండరని లేదా తమ పరిపాలకుడ్ని స్వయంగా చూసివుండరని మీరు చెప్పవచ్చు. ఆ విషయాలు వారు వార్తా నివేదికల ద్వారా తెలుసుకుంటారు. అదే విధంగా, 2,200 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురించబడిన బైబిలు దేవుని రాజ్యం గురించి చెబుతోంది; రాజ్యాధికారం ఎవరికి అప్పజెప్పబడిందో, ఆ రాజ్యం ఏమి చేస్తోందో అది మనకు తెలియజేస్తోంది. మరే ఇతర పత్రిక కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించబడుతున్న కావలికోట, దాని ముఖచిత్రంపై పేర్కొనబడినట్లు కేవలం “దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తోంది.”

రాజ్యం అంటే ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడేందుకు, ప్రభుత్వాల నుండి వారు కోరే కొన్ని విషయాలను మీరు పేర్కొనవచ్చు: ఆర్థిక భద్రత, శాంతి, నేర రహిత పరిస్థితి, అన్ని జాతులవారి పట్ల నిష్పాక్షిక విధానం, విద్య, ఆరోగ్య సంరక్షణ. కేవలం దేవుని రాజ్యం ద్వారా మాత్రమే ఇవీ, మానవజాతికున్న ఇతర మంచి కోరికలూ నెరవేరతాయని చూపించండి.—కీర్త. 145:16.

యేసుక్రీస్తు రాజుగా పరిపాలించే రాజ్యంలోని ప్రజలుగా ఉండాలన్న కోరికను వారిలో కలిగించడానికి కృషిచేయండి. తాను పరలోకపు రాజు అయిన తర్వాత ఏమి చేస్తాడో చూపించడానికి ఆయన ఇంతకుముందు చేసిన అద్భుతాల గురించి చెప్పండి. ఆయన ప్రదర్శించిన మనోహరమైన లక్షణాల గురించి తరచుగా మాట్లాడండి. (మత్త. 8:2, 3; 11:28-30) ఆయన మన కోసం తన జీవితాన్ని అర్పించాడని, ఆ తర్వాత దేవుడాయనను పరలోకంలో అమర్త్య జీవితానికి పునరుత్థానం చేశాడని వివరించండి. ఆయన రాజుగా పరిపాలించేది అక్కడినుండే.—అపొ. 2:29-35.

దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకం నుండి పరిపాలిస్తోందని నొక్కిచెప్పండి. అయితే, ప్రజల్లో అత్యధికులు దేవుని రాజ్యంలో తామనుభవిస్తామని ఎదురుచూసే పరిస్థితులకు రుజువుగా ఉండే పరిస్థితులేవీ వారు ప్రస్తుతం అనుభవించడం లేదని మీరు గుర్తించండి. ఆ విషయాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పి, యేసుక్రీస్తు చెప్పిన మాటలు అందుకు రుజువుగా ఉన్నాయని వారికి తెలుసేమో అడగండి. మత్తయి 24వ అధ్యాయం, మార్కు 13వ అధ్యాయం, లేదా లూకా 21వ అధ్యాయాలలో ఉన్న సంయుక్త సూచనలో కొన్ని భాగాలను నొక్కిచెప్పండి. ఆ తర్వాత, క్రీస్తు పరలోకంలో సింహాసనాసీనుడు కావడం భూమిపై అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి ఎందుకు దారితీస్తుందో ప్రశ్నించండి. వారి అవధానాన్ని ప్రకటన 12:7-10, 12 వైపు ఆకర్షింపజేయండి.

దేవుని రాజ్యం ఏమి చేస్తోందో రుజువుపరచడానికి నిజమైన ఉదాహరణగా మత్తయి 24:14 చదవండి, తర్వాత ప్రస్తుతం జరుగుతున్న భౌగోళిక బైబిలు విద్యా కార్యక్రమం గురించి వర్ణించండి. (యెష. 54:13) యెహోవాసాక్షులు ప్రయోజనం పొందుతున్న అనేక పాఠశాలల గురించి ప్రజలకు చెప్పండి; అవన్నీ బైబిలుపైనే ఆధారపడివుంటాయి, అవన్నీ ఉచితంగానే నిర్వహించబడతాయి. మన ఇంటింటి పరిచర్యతోపాటు మనం బైబిలు గురించి 230 కంటే ఎక్కువ దేశాల్లో విడివిడిగాను కుటుంబాలుగాను ప్రజల గృహాల్లోనే ఉచితంగా ఉపదేశాన్ని అందిస్తున్నామని వివరించండి. తన ప్రజలకు మాత్రమే కాక భూమ్మీద ప్రజలందరికీ అలాంటి విస్తృతమైన విద్యా కార్యక్రమాన్ని అందజేసే స్థితిలో ఏ మానవ ప్రభుత్వం ఉంది? రాజ్యమందిరానికి, యెహోవాసాక్షుల సభలకు సమావేశాలకు రమ్మని, అలాంటి విద్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో రుజువులను చూడమని ప్రజలను ఆహ్వానించండి.—యెష. 2:2-4; 32:1, 17; యోహా. 13:35.

కానీ తన సొంత జీవితం ఎలా ప్రభావితమవుతోందో గృహస్థుడు గ్రహిస్తాడా? మీ సందర్శనం ఉద్దేశం, దేవుని రాజ్యంలో ప్రజలుగా జీవితాన్ని ఎంపిక చేసుకునే అవకాశం అందరికీ అందుబాటులో ఉందని వారితో చర్చించడానికేనని ఔచిత్యంతో మీరు తెలియజేయవచ్చు. ఆ జీవితం ఎలా సాధ్యమవుతుంది? దేవుడు కోరే వాటిని నేర్చుకోవడం ద్వారా, వాటికి అనుగుణంగా నేడు జీవించడం ద్వారా.—ద్వితీ. 30:19, 20; ప్రక. 22:17.

ఇతరులు రాజ్యాన్ని మొదట ఉంచేందుకు సహాయం చేయడం. ఒక వ్యక్తి రాజ్య సందేశాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఆయన తీసుకోవలసిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఆయన తన సొంత జీవితంలో దేవుని రాజ్యానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తాడు? “మీరు . . . రాజ్యమును . . . మొదట వెదకుడి” అని యేసు తన శిష్యులను ఉద్బోధించాడు. (మత్త. 6:33) తోటి క్రైస్తవులు అలా చేసేందుకు మనం వారికెలా సహాయపడవచ్చు? మనమే చక్కని మాదిరిని ఉంచడం ద్వారా, అందుబాటులో ఉన్న అవకాశాలను గురించి చర్చించడం ద్వారా. కొన్నిసార్లు, అందుబాటులో ఉన్న కొన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారేమో అడగడం ద్వారా, ఇతరులు ఏమి చేస్తున్నారో చూపించే అనుభవాలను పంచుకోవడం ద్వారా. యెహోవాపట్ల అవతలి వ్యక్తికున్న ప్రేమను మరింత గాఢం చేసే విధంగా బైబిలు వృత్తాంతాలను చర్చించడం ద్వారా. రాజ్యం వాస్తవమన్న విషయాన్ని నొక్కిచెప్పడం ద్వారా. రాజ్య ప్రకటనా పని నిజానికి ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పడం ద్వారా. తరచు, ప్రజలు ఏమి చేయాల్సిన అవసరం ఉందో వారికి చెప్పడం ద్వారా కాక, అది చేయాలన్న కోరికను పురికొల్పడం ద్వారా అత్యధికమైన మేలు చేకూరుతుంది.

నిస్సందేహంగా మనందరం ప్రకటించాల్సిన కీలకమైన సందేశం ప్రధానంగా యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి, రాజ్యం గురించే. ఈ విషయాల గురించిన కీలకమైన సత్యాలు మన బహిరంగ సాక్ష్యపు పనిలోను, మన సంఘాల్లోను, మన వ్యక్తిగత జీవితాల్లోను ప్రస్ఫుటంగా వ్యక్తం కావాలి. మనమలా చేసినప్పుడు మన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి మనం నిజంగా ప్రయోజనం పొందుతున్నామని స్పష్టమవుతుంది.

ప్రజలందరు వినవలసిన విషయాలు . . .

  • యెహోవా భూమ్యాకాశములకు సృష్టికర్త.

  • యెహోవాయే ఏకైక సత్య దేవుడు.

  • యెహోవా అత్యుత్కృష్టమైన ప్రేమ, అత్యున్నతమైన జ్ఞానం, అసమానమైన న్యాయం, అపరిమితమైన శక్తి గల దేవుడు.

  • మనం చేసే పనుల విషయమై యెహోవాకు జవాబుచెప్పాలి.

యెహోవాకు మనం చేసే ఆరాధన . . .

  • ఆయనపట్ల ప్రేమచే పురికొల్పబడాలి.

  • సంపూర్ణమైన హృదయంలో నుండి రావాలి, ఈ లోకంలోని విషయాలను ప్రేమించే హృదయం నుంచి కాదు.

  • ఆయనతో ఆమోదయోగ్యమైన అనుబంధం మనకు ఎంత అమూల్యమైనదో రుజువునివ్వాలి.

ఈ విషయాలను ప్రజలు అర్థంచేసుకునేందుకు సహాయపడండి . . .

  • దేవునితో ఒక ఆమోదయోగ్యమైన అనుబంధం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం.

  • పాపము, మరణముల నుండి విమోచన కేవలం యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం.

  • యేసును ప్రభువని ఒప్పుకోవడమే దేవుని చిత్తము, ఆయనను కేవలం ప్రభువు అని పిలవడం మాత్రమే కాక ఆయన ఆజ్ఞలకు విధేయులు కావడం కూడా అవసరం.

  • యేసుక్రీస్తు గురించి బైబిలు చెప్పేది సత్యం, కానీ క్రైస్తవమత సామ్రాజ్యం చెప్పేది వాస్తవాలను వక్రీకరించడమే.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:

  • సంఘానికి శిరస్సుగా నియుక్తుడైన యేసుక్రీస్తు పాత్రను నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాననడానికి రుజువునిస్తున్నానా?

  • క్రీస్తు అర్పించిన బలి పట్ల కృతజ్ఞతాభావం నా జీవితంలో గట్టి ప్రేరకంగా ఉందా?

  • నా చర్యలు, వైఖరులు దేవుని కుమారుడు ఉంచిన మాదిరికి మరింత అనుగుణంగా ఉండేలా నేనెలా చేయగలను?

ప్రజలు వినాల్సిన విషయాలు . . .

  • దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకం నుండి పరిపాలిస్తోంది, త్వరలోనే మానవ పరిపాలన స్థానంలోకి అది వస్తుంది.

  • దేవుణ్ణి, తమ తోటిమానవులను ప్రేమించే ప్రజలతో నిండివున్న ఒక పరదైసుగా రాజ్యం ఈ భూమిని మార్చేస్తుంది.

  • రాజ్యం ద్వారా మాత్రమే మానవజాతికున్న ఇతర మంచి కోరికలన్నీ నెరవేరతాయి.

  • మనమిప్పుడు ఏమి చేస్తామన్న దాని ద్వారా మనం దేవుని రాజ్యం క్రింద ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నామో లేదో చూపిస్తాము.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:

  • నా జీవిత విధానం నేను రాజ్యాన్ని మొదట వెదుకుతున్నానని చూపిస్తోందా?

  • మొదట వెదకడాన్ని మరింత సంపూర్ణంగా చేయడానికి నేను చేసుకోవలసిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

  • దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలన్న కోరికను ఇతరుల్లో పురికొల్పేందుకు నేనేమి చేయగలను?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి