అధ్యాయం 1
“ఇదిగో! ఈయనే మన దేవుడు!”
1, 2. (ఎ) మీరు దేవుణ్ణి ఏ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు? (బి) దేవుణ్ణి మోషే ఏం అడిగాడు?
దేవుడే స్వయంగా మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఊహించుకోగలరా? ఈ విశ్వంలోనే అత్యంత గొప్ప వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనే మీలో ఆశ్చర్యాన్ని, భయాన్ని పుట్టిస్తుంది కదా! మొదట్లో మీరు కాస్త తడబడినా, ఎలాగోలా కాసేపటికి మీరు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు చెప్పేది ఆయన వింటున్నాడు, దానికి ఆయన జవాబిస్తున్నాడు, ఏ ప్రశ్న అయినా అడిగేంత స్వేచ్ఛ ఆయన మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏ ప్రశ్న అడుగుతారు?
2 చాలాకాలం క్రితం, సరిగ్గా అలాంటి పరిస్థితే ఒకాయనకు వచ్చింది. ఆయన పేరు మోషే. ఆయన దేవుణ్ణి అడిగిన ప్రశ్న వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన తన గురించి గానీ, ముందుముందు తన జీవితం ఎలా ఉంటుందని గానీ, మనుషులు పడుతున్న బాధల గురించి గానీ అడగలేదు. బదులుగా, ఆయన దేవుని పేరు అడిగాడు. ఎప్పటినుండో దేవుని గురించి తెలిసినా ఆయన ఆ ప్రశ్న అడిగాడంటే, మీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఆయన ఆ ప్రశ్న అడగడంలో ఎంతో అర్థం దాగుంది. నిజానికి, మోషే అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. మనలో ప్రతీ ఒక్కరం ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి. ఎందుకంటే, మనం దేవునికి దగ్గరవ్వడానికి అది సహాయం చేస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఇంతకీ దేవుడు, మోషే ఏం మాట్లాడుకున్నారో చూద్దాం.
3, 4. దేవుడు మోషేతో మాట్లాడడానికి ముందు ఏం జరిగింది? వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు?
3 అప్పుడు మోషేకు 80 ఏళ్లు. అప్పటికే ఆయన ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని వదిలివచ్చేసి 40 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు మోషే తన మామ అయిన యిత్రో మందను కాస్తున్నప్పుడు, ఒక వింత సంఘటన చూశాడు. పచ్చగా ఉన్న కొండ మీద ఒక పొద ఎర్రగా, భగభగ మండుతూ కనిపించింది. అది అలా మండుతూనే ఉంది కానీ కాలిపోవడం లేదు. అది ఏంటా అని మోషే దాని దగ్గరికి వెళ్లినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి మాటలు వినబడ్డాయి. దాంతో మోషే గుండె జల్లుమంది. అక్కడ, దేవుడు ఒక దూత ద్వారా మోషేతో చాలాసేపు మాట్లాడాడు. మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు దేవుడు మోషేకు ఒక పని అప్పజెప్పాడు. అదేంటంటే, మోషే ఇప్పుడు ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాన్ని వదిలేసి, ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తుకు తిరిగెళ్లాలి.—నిర్గమకాండం 3:1-12.
4 కావాలనుకుంటే, మోషే దేవుణ్ణి ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. కానీ ఆయన ఏ ప్రశ్న అడగాలనుకున్నాడో గమనించండి: “ఒకవేళ నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్లి, ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు’ అని చెప్పినప్పుడు వాళ్లు, ‘ఆయన పేరేంటి?’ అని నన్ను అడిగితే నేను వాళ్లకు ఏం చెప్పాలి?”—నిర్గమకాండం 3:13.
5, 6. (ఎ) మోషే అడిగిన ప్రశ్న మనకు ఏ ముఖ్యమైన, సూటైన సత్యాన్ని నేర్పిస్తుంది? (బి) దేవుని పేరు విషయంలో ఏ దారుణం జరిగింది? (సి) దేవుడు మనకు తన పేరును చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి?
5 మొదటిగా, ఆ ప్రశ్న దేవునికి ఒక పేరు ఉందని చెప్తుంది. అదేం పెద్ద విషయం కాదులే అని ఆ సత్యాన్ని మనం పక్కన పెట్టకూడదు. కానీ చాలామంది అదే చేస్తున్నారు. చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరును తీసేసి, దానికి బదులు “ప్రభువు,” “దేవుడు” అనే బిరుదుల్ని పెట్టారు. మతం ముసుగులో జరిగిన బాధాకరమైన, దారుణమైన పనుల్లో అదొకటి. మామూలుగా, ఎవరినైనా కలిసినప్పుడు ముందుగా మనం ఏం అడుగుతాం? వాళ్ల పేరే కదా. దేవుని గురించి తెలుసుకోవడానికి కూడా అదే చేయాలి. ఆయనకు పేరు లేదని, ఎక్కడో దూరంగా ఉంటాడని, ఆయన అంతుచిక్కని మర్మం అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన కంటికి కనిపించకపోయినా, ఆయన ఒక నిజమైన వ్యక్తి. ఆయనకు ఒక పేరు ఉంది. అదే యెహోవా!
6 అంతేకాదు, దేవుడు తన పేరును చెప్పడం ద్వారా మనకు ఒక మంచి బహుమతి ఇస్తున్నాడు. అదేంటంటే, మనం తన గురించి తెలుసుకోవాలని, తనకు దగ్గరవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితంలో అంతకన్నా మంచి నిర్ణయం ఇంకొకటి ఉండదు. అయితే, యెహోవా తన పేరు చెప్పడమే కాకుండా, ఆ పేరు వెనకున్న వ్యక్తి గురించి కూడా చెప్పాడు.
దేవుని పేరుకు ఉన్న అర్థం
7. (ఎ) దేవుని పేరుకు ఏ అర్థం ఉందని చెప్పవచ్చు? (బి) మోషే దేవుని పేరు అడిగినప్పుడు, నిజానికి ఆయన ఏం అడుగుతున్నాడు?
7 స్వయంగా యెహోవాయే తన పేరు పెట్టుకున్నాడు. ఆ పేరుకు గొప్ప అర్థం ఉంది. బహుశా, “యెహోవా” అనే పేరుకు “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థం ఉంది. ఈ విశ్వమంతటిలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు, ఎందుకంటే అన్నిటినీ సృష్టించింది ఆయనే. అంతేకాదు, ఆయన అనుకున్నవన్నీ నెరవేరేలా చేస్తాడు, ఇంకా అపరిపూర్ణ మనుషుల్ని కూడా తాను ఎలా అనుకుంటే అలా అయ్యేలా చేయగలడు. ఇవన్నీ వింటుంటే ఒళ్లు పులకరించిపోతుంది కదా! అయితే, దేవుని పేరుకు ఇంకో అర్థం కూడా ఉంది. బహుశా, మోషే తెలుసుకోవాలి అనుకున్నది దాని గురించే అనుకుంటా. అప్పటికే ఆయనకు యెహోవాయే సృష్టికర్త అని తెలుసు, దేవుని పేరు కూడా తెలుసు. దేవుని పేరు ఆయనకు కొత్తేమీ కాదు, ఎందుకంటే ప్రజలు వందల సంవత్సరాలుగా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మోషే నిజానికి దేవుని పేరు కాదుగానీ, ఆ పేరు వెనకున్న వ్యక్తి గురించి అడుగుతున్నాడు. ఒక రకంగా మోషే ఇలా అంటున్నాడు: ‘నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో విశ్వాసం నింపడానికి, నువ్వు వాళ్లను ఖచ్చితంగా విడిపిస్తావని వాళ్లకు నమ్మకం కుదరడానికి నీ గురించి ఏం చెప్పమంటావ్?’
8, 9. (ఎ) మోషే అడిగిన ప్రశ్నకు యెహోవా ఎలా జవాబిచ్చాడు? ఆ మాటల్ని కొన్ని బైబిలు అనువాదాలు ఎలా తప్పుగా అనువదించాయి? (బి) “నేను ఎలా అవ్వాలని అనుకుంటే అలా అవుతాను” అనే మాటకు అర్థం ఏంటి?
8 మోషే అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, యెహోవా తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అది దేవుని పేరుకు ఉన్న అర్థాన్ని కూడా చెప్తుంది. “నేను ఎలా అవ్వాలని అనుకుంటే అలా అవుతాను” అని ఆయన మోషేతో అన్నాడు. (నిర్గమకాండం 3:14) చాలా బైబిలు అనువాదాలు ఆ వచనాన్ని, “నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను” అని అనువదించాయి. కానీ, జాగ్రత్తగా అనువదించిన బైబిళ్లలో చూస్తే, దేవుడు కేవలం తను ఉన్నానని చెప్పట్లేదు గానీ, తను మాటిచ్చినవి నెరవేర్చడానికి “ఎలా కావాలంటే అలా అవుతాను” అని మోషేకు అలాగే మనందరికీ చెప్తున్నాడు. జె. బి. రోథర్హామ్ అనువాదంలో ఆ వచనం ఇలా ఉంది: “నాకు నచ్చినట్టు నేను అవుతాను.” దాని గురించి ఒక హీబ్రూ భాషా పండితుడు ఏమని వివరిస్తున్నాడంటే, “పరిస్థితి ఏదైనా, అవసరం ఏదైనా . . . దేవుడు దానికి పరిష్కారం ‘అవుతాడు.’”
9 యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాలనుకున్నాడు? వాళ్ల ముందు కొండంత అడ్డంకి ఉన్నా, వాళ్లు కష్టాల ఊబిలో కూరుకుపోయినా యెహోవా వాళ్లను బానిసత్వం నుండి విడిపించి, వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లడానికి ఎలా కావాలంటే అలా అవుతాడు. నిజంగా ఆ పేరు వాళ్లలో ఎంతో నమ్మకాన్ని కలిగించి ఉంటుంది! ఇప్పుడు కూడా ఆ పేరు మనలో నమ్మకాన్ని కలిగిస్తుంది. (కీర్తన 9:10) ఎందుకు అలా చెప్పవచ్చు?
10, 11. యెహోవా అనే పేరు ఏ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది? ఉదాహరణతో చెప్పండి.
10 ఉదాహరణకు, పిల్లల ఆలనాపాలనా చూసుకునే తల్లిదండ్రులు, పరిస్థితులకు తగ్గట్టు ఎలా కావాలంటే అలా మారాల్సి ఉంటుంది. ఒక్క రోజులో వాళ్లు ఒక నర్సులా, వంట మనిషిలా, టీచర్లా, జడ్జిలా, మరెన్నో విధాలుగా మారాల్సి రావచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఇన్ని విధాలుగా మారాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పిల్లలకు దెబ్బ తగిలినా, తగాదా వచ్చినా, బొమ్మలు విరిగిపోయినా, వాటిని వెంటనే సరిచేస్తారన్న నమ్మకంతో అమ్మ దగ్గరికో, నాన్న దగ్గరకో వెళ్తారు. ఇంకా వాళ్ల చిట్టి బుర్రకు తట్టే ఏ ప్రశ్నకైనా వాళ్ల అమ్మానాన్నల దగ్గర సమాధానం ఉంటుందని వాళ్లు అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు వాటన్నిటికీ న్యాయం చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు.
11 యెహోవా కూడా ఒక ప్రేమగల తండ్రే. అయితే ఆయనకు, మానవ తల్లిదండ్రులకు ఉన్న తేడా ఏంటంటే, తన పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడానికి ఆయన అవ్వలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి యెహోవా అనే పేరు, ఆయనలాంటి గొప్ప తండ్రి ఇంకెవ్వరూ లేరని గుర్తుచేస్తుంది. (యాకోబు 1:17) మోషే అలాగే ఇతర నమ్మకమైన ఇశ్రాయేలీయులందరూ, యెహోవా తన పేరుకు తగ్గట్టు ప్రవర్తిస్తాడని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. యెహోవా ఓటమి తెలియని ఒక సైనికాధికారిగా, ప్రకృతిని శాసించే అధిపతిగా, సాటిలేని శాసనకర్తగా, న్యాయమూర్తిగా, శిల్పిగా, ఆహారాన్ని-నీటిని పుష్కలంగా ఇచ్చే వ్యక్తిగా, బట్టలు-చెప్పులు పాడైపోకుండా చూసుకునే వ్యక్తిగా, ఇంకా మరెన్నో విధాలుగా మారడాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు.
12. దేవుని పేరు విషయంలో ఫరోకు, మోషేకు ఏ తేడా ఉంది?
12 దేవుడు తన పేరు చెప్పాడు, ఆ పేరు వెనకున్న వ్యక్తి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. అలాగే తన గురించి చెప్పినవన్నీ నిజమని నిరూపించాడు. దేవుడు తన గురించి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన గురించి తెలుసుకోవాలని మనం కోరుకుంటున్నామా? మోషే అయితే దేవుని గురించి తెలుసుకోవాలని బలంగా కోరుకున్నాడు. దానికి తగ్గట్టే ఆయన తన జీవితంలో ప్రతీ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందుకే ఆయన తన పరలోక తండ్రికి బాగా దగ్గరయ్యాడు. (సంఖ్యాకాండం 12:6-8; హెబ్రీయులు 11:27) కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మోషే కాలంలో జీవించిన చాలామందికి ఆ కోరిక లేదు. మోషే దేవుని పేరు ప్రస్తావించినప్పుడు, పొగరుబోతు ఫరో “యెహోవా ఎవరు?” అని చులకనగా మాట్లాడాడు. (నిర్గమకాండం 5:2) ఫరో యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకోలేదు. బదులుగా, ఇశ్రాయేలు దేవుడు అంత ప్రాముఖ్యం కాదన్నట్టు కొట్టిపారేశాడు. ఇప్పుడు కూడా చాలామంది ప్రజలు అదే ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచన వాళ్ల కళ్లను కప్పేయడం వల్ల, యెహోవాయే సర్వోన్నత ప్రభువు అనే ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
సర్వోన్నత ప్రభువైన యెహోవా
13, 14. (ఎ) బైబిల్లో యెహోవాకు ఎందుకు అన్ని బిరుదులు ఉన్నాయి? అందులో కొన్ని ఏంటి? (14వ పేజీ బాక్సు చూడండి.) (బి) “సర్వోన్నత ప్రభువు” అని పిలవడానికి యెహోవా మాత్రమే ఎందుకు అర్హుడు?
13 యెహోవా పరిస్థితుల్ని బట్టి ఎలా కావాలనుకుంటే అలా అవ్వగలడు, అందుకే బైబిలు ఆయన్ని ఎన్నో బిరుదులతో పిలుస్తుంది. బిరుదులు ఎన్ని ఉన్నా, అవి ఆయన పేరుకు మాత్రం సాటిరావు. కాకపోతే, అవి ఆ పేరు వెనకున్న వ్యక్తి గురించి ఎంతో కొంత చెప్తాయి. ఉదాహరణకు, బైబిలు ఆయన్ని “సర్వోన్నత ప్రభువైన యెహోవా” అని పిలుస్తుంది. (2 సమూయేలు 7:22) బైబిల్లో వందలసార్లు కనిపించే ఆ బిరుదు, యెహోవాకున్న ఉన్నతమైన స్థానం గురించి చెప్తుంది. ఆయన ఒక్కడికే ఈ విశ్వాన్ని ఏలే హక్కు ఉంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
14 సృష్టికర్త అనే బిరుదుతో యెహోవాను తప్ప ఇంకెవ్వర్నీ పిలవలేం. ప్రకటన 4:11 ఇలా చెప్తుంది: “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.” ఈ మాటల్ని యెహోవాతో తప్ప ఇంకెవ్వరితోనూ అనలేం. విశ్వంలో ఉన్న ప్రతీదాన్ని యెహోవానే చేశాడు! యెహోవా సర్వోన్నత ప్రభువు, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి ఆయన మాత్రమే అర్హుడని చెప్పడంలో ఏ సందేహం లేదు.
15. బైబిలు యెహోవాను “యుగయుగాలకు రాజు” అని ఎందుకు పిలుస్తుంది?
15 యెహోవాకు మాత్రమే సరిపోయే ఇంకొక బిరుదు, “యుగయుగాలకు రాజు.” (1 తిమోతి 1:17; ప్రకటన 15:3) ఆ మాటకు అర్థమేంటి? దాన్ని అర్థం చేసుకోవడం మన చిట్టి మెదడుకు కొంచెం కష్టమే. కానీ యెహోవా అటు గతంలోనూ ఇటు భవిష్యత్తులోనూ యుగయుగాలు ఉన్నాడు, ఉంటాడు. కీర్తన 90:2, అధస్సూచి ఇలా చెప్తుంది: “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు నువ్వే దేవుడివి.” కాబట్టి యెహోవాకు ఆరంభం లేదు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఆయన్ని “మహా వృద్ధుడు” అని పిలవడం సరైనదే, ఎందుకంటే ఈ విశ్వంలో ఎవ్వరూ, ఏదీ ఉనికిలోకి రాకముందే ఆయన శాశ్వతకాలం నుండి ఉన్నాడు! (దానియేలు 7:9, 13, 22) సర్వోన్నత ప్రభువుగా ఆయన హక్కును ఎవరైనా ప్రశ్నించగలరా?
16, 17. (ఎ) మనం యెహోవాను ఎందుకు చూడలేం? మనం దానికి ఎందుకు ఆశ్చర్యపోం? (బి) మనం చూసే వాటికన్నా, ముట్టుకునే వాటికన్నా యెహోవా ఎంతో నిజమైనవాడని ఎందుకు చెప్పవచ్చు?
16 కానీ, ఫరోలాగే కొంతమంది ఆ హక్కును ప్రశ్నిస్తారు. దానికి ఒక కారణం ఏంటంటే, అపరిపూర్ణ మనుషులు వాళ్ల కళ్లతో చూసిందే నమ్ముతారు. సర్వోన్నత ప్రభువును మనం చూడలేం. ఆయన పరలోకంలో ఉండే అదృశ్య వ్యక్తి. (యోహాను 4:24) అంతేకాదు, ఏ మనిషైనా యెహోవా ముందు నిలబడాల్సి వస్తే, అతను చనిపోతాడు. యెహోవాయే స్వయంగా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఎందుకంటే ఏ మనిషీ నన్ను చూసి బ్రతకలేడు.”—నిర్గమకాండం 33:20; యోహాను 1:18.
17 ఆ విషయం మనకు అంత ఆశ్చర్యం కలిగించదు. మోషే యెహోవా మహిమలో కొంచెం మాత్రమే చూశాడు. అది కూడా నేరుగా కాదు గానీ, దేవుని ప్రతినిధిగా వచ్చిన ఒక దేవదూత ద్వారా చూసి ఉండవచ్చు. అప్పుడు ఏమైంది? మోషే ముఖం కాసేపు “కాంతులు విరజిమ్మింది.” ఇశ్రాయేలీయులు మోషే ముఖం చూడడానికి కూడా భయపడ్డారు. (నిర్గమకాండం 33:21-23; 34:5-7, 29, 30) కాబట్టి, సర్వోన్నత ప్రభువుకున్న పూర్తి మహిమను ఏ మనిషీ చూడలేడని ఖచ్చితంగా చెప్పవచ్చు! మనం ఆయన్ని ముట్టుకోలేం, చూడలేం. అంతమాత్రాన ఆయన లేడనా? కాదు. ఉదాహరణకు గాలి, రేడియో తరంగాలు, ఆలోచనలు వంటివాటిని మనం కంటితో చూడలేం, ముట్టుకోలేం. అయినా అవి ఉన్నాయని నమ్ముతాం. వీటన్నిటికి మించి యెహోవా దేవుడు శాశ్వతమైనవాడు. కాలం మారినా, కోట్ల సంవత్సరాలు గడిచినా ఆయన చెక్కుచెదరకుండా అలానే ఉంటాడు! ఆ మాటకొస్తే, ఈ భౌతిక ప్రపంచంలో మనం చూడగలిగే వాటికన్నా, ముట్టుకోగలిగే వాటికన్నా ఆయన ఎంతో నిజమైనవాడు. ఎందుకంటే, భౌతికమైనవి కాలంతోపాటు కనుమరుగైపోతాయి, పాడైపోతాయి. (మత్తయి 6:19) మరి యెహోవాను ఒక రూపం గానీ, ఫీలింగ్స్ గానీ లేని ఒక శక్తిలా చూడాలా? దాని గురించి ఇప్పుడు చూద్దాం.
అద్భుతమైన లక్షణాలు ఉన్న దేవుడు
18. యెహెజ్కేలు ఏ దర్శనాన్ని చూశాడు? యెహోవా చుట్టూ ఉన్న “జీవుల” నాలుగు ముఖాలు వేటికి గుర్తుగా ఉన్నాయి?
18 మనం దేవుణ్ణి చూడలేకపోయినా, మనకు పరలోకాన్ని చూపించి దేవుని గురించి అర్థం చేసుకోవడానికి సహాయం చేసే ఆసక్తికరమైన లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ, యెహెజ్కేలు ఒకటో అధ్యాయం. యెహెజ్కేలుకు ఒక దర్శనంలో పెద్ద రథం కనిపించింది. అది దేవుని సంస్థలోని పరలోక భాగాన్ని సూచిస్తుంది. యెహోవా చుట్టూ ఉన్న బలమైన దేవదూతల్ని చూసి యెహెజ్కేలు ఎంతో ఆశ్చర్యపోయాడు. (యెహెజ్కేలు 1:4-10) ఆ “జీవులు” యెహోవాకు చాలా దగ్గరగా పనిచేస్తాయి. వాటి ముఖాలు, అవి సేవిస్తున్న దేవుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనకు చెప్తాయి. ప్రతీ జీవికి నాలుగు ముఖాలు ఉన్నాయి: ఎద్దు, సింహం, గద్ద, మనిషి. అవి యెహోవా దేవుని అమోఘమైన వ్యక్తిత్వానికి పునాదిగా ఉన్న నాలుగు లక్షణాలకు గుర్తుగా ఉన్నాయి.—ప్రకటన 4:6-8, 10.
19. (ఎ) ఎద్దు (బి) సింహం (సి) గద్ద (డి) మనిషి ముఖాలు ఏ లక్షణాలకు గుర్తుగా ఉన్నాయి?
19 ఎద్దు చాలా బలమైన జంతువు కాబట్టి బైబిల్లో ఎద్దు తరచూ శక్తిని సూచిస్తుంది. మరోవైపు సింహం న్యాయానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే, నిజమైన న్యాయానికి ఎంతో ధైర్యం కావాలి. ధైర్యానికి మారుపేరైన సింహం, న్యాయానికి చక్కగా సరిపోతుంది. ఇక గద్ద అనగానే మనకు గుర్తుకొచ్చేది చురుకైన కంటిచూపు. అది ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచిన్న వస్తువుల్ని కూడా స్పష్టంగా చూడగలదు. కాబట్టి గద్ద ముఖం దేవుని ముందుచూపును, తెలివిని సూచిస్తుంది. మరి మనిషి ముఖం సంగతేంటి? దేవుడు తన స్వరూపంలో మనిషిని తయారుచేశాడు. దేవుని లక్షణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనదాన్ని మనుషులు మాత్రమే చూపించగలరు, అదే ప్రేమ. (ఆదికాండం 1:26) యెహోవాకున్న శక్తి, న్యాయం, తెలివి, ప్రేమ గురించి బైబిలు పదేపదే చెప్తుంది. దాన్నిబట్టి, ఆ నాలుగిటిని దేవుని ముఖ్యమైన లక్షణాలుగా చెప్పవచ్చు.
20. యెహోవా మారిపోయాడేమో అని మనం కంగారుపడాలా? ఎందుకు?
20 బైబిల్లో దేవుని గురించి చెప్పిన విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితంవి కాబట్టి, ఇప్పుడు ఆయన మారిపోయాడేమో అని మనం కంగారుపడాలా? లేదు, దేవుని వ్యక్తిత్వం ఎప్పటికీ మారదు. ఆయనే స్వయంగా ఇలా చెప్తున్నాడు: “నేను యెహోవాను; నేను మార్పులేనివాణ్ణి.” (మలాకీ 3:6) ఆయన ఇష్టమొచ్చినట్టు మారిపోడు కానీ, ప్రతీ సందర్భంలో పరిస్థితికి తగ్గట్టు మారుతూ ఒక మంచి తండ్రిలా నిరూపించుకుంటాడు. ఆ సందర్భానికి ఏ లక్షణం అవసరమో దాన్నే ఆయన చూపిస్తాడు. దేవుని లక్షణాలన్నిటిలో చాలా ముఖ్యమైనది, ప్రేమ. ఆయన చేసే ప్రతీ దాంట్లో అది కనిపిస్తుంది. ఆయన శక్తినైనా, న్యాయాన్నైనా, తెలివినైనా చూపించేది ప్రేమతోనే. నిజానికి దేవుని గురించి, ప్రేమ గురించి బైబిలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తుంది. అదేంటంటే, “దేవుడు ప్రేమ.” (1 యోహాను 4:8) ఇక్కడ దేవునికి ప్రేమ ఉందని, లేదా దేవుడు ప్రేమగల వాడని చెప్పట్లేదు గానీ దేవుడే ప్రేమ అని చెప్తుంది. ఆయనలో అణువణువునా ఉన్న ఈ ప్రేమే, ఆయన్ని ఏం చేయడానికైనా కదిలిస్తుంది.
“ఇదిగో! ఈయనే మన దేవుడు!”
21. యెహోవా లక్షణాల గురించి ఎక్కువ తెలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?
21 మీరు ఎప్పుడైనా, ఒక చిన్న పిల్లాడు తన ఫ్రెండ్‌కి “ఇదిగో, మా డాడీ” అని సంతోషంగా, గొప్పగా చెప్పడం చూశారా? మనం కూడా మన తండ్రైన యెహోవా విషయంలో అలానే గర్వపడతాం. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేవుణ్ణి సేవించే నమ్మకమైన ప్రజలు, “ఇదిగో! ఈయనే మన దేవుడు!” అని సంతోషంగా చెప్పే ఒక కాలం గురించి బైబిలు ముందే చెప్పింది. (యెషయా 25:8, 9) మనం దేవుని లక్షణాల గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ, ఆయన కన్నా గొప్ప తండ్రి ఇంకెవ్వరూ లేరని బాగా అర్థం చేసుకుంటాం.
22, 23. మన పరలోక తండ్రి గురించి బైబిలు ఏం చెప్తుంది? మనం తనకు దగ్గరవ్వాలనే కోరిక ఆయనకు ఉందని మనకెలా తెలుసు?
22 దేవునికి ఏ ఫీలింగ్స్ లేవని, ఆయనకు మనుషులంటే పట్టింపు లేదని, ఎవరికీ అందనంత దూరంలో ఉంటాడని కొంతమంది చెప్తుంటారు. అలాంటి దేవునికి దగ్గరవ్వాలని ఎవరైనా అనుకుంటారా? బైబిలు మన పరలోక తండ్రి గురించి అలా చెప్పట్లేదు కానీ, ఆయన “సంతోషంగల దేవుడు” అని చెప్తుంది. (1 తిమోతి 1:11) ఆయనకు అటు బలమైన, ఇటు సున్నితమైన ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకసారి తమ మంచి కోసం ఇచ్చిన నియమాల్ని ప్రజలు లెక్క చేయనప్పుడు, యెహోవా “హృదయంలో నొచ్చుకున్నాడు.” (ఆదికాండం 6:6; కీర్తన 78:41) కానీ మనం తెలివిని సంపాదించి ఆయన వాక్యం ప్రకారం జీవిస్తే, ఆయన ‘హృదయాన్ని సంతోషపెడతాం.’—సామెతలు 27:11.
23 మనం తనకు దగ్గరవ్వాలని మన తండ్రి కోరుకుంటున్నాడు. మనం ఆయన కోసం “వెతికి, తడవులాడి, తనను కనుక్కోవాలని” బైబిలు ప్రోత్సహిస్తుంది. నిజానికి, “ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొస్తలుల కార్యాలు 17:27) ఇంతకీ మట్టి మనుషులమైన మనం, విశ్వంలోనే సర్వోన్నతమైన ప్రభువుకు దగ్గరవ్వడం ఎలా సాధ్యం?