అధ్యాయం 9
“క్రీస్తు దేవుని శక్తి”
1-3. (ఎ) గలిలయ సముద్రం మీద శిష్యులు ఏ భయంకరమైన పరిస్థితిని చూశారు? యేసు ఏం చేశాడు? (బి) అపొస్తలుడైన పౌలు, “క్రీస్తు దేవుని శక్తి” అని అనడం ఎందుకు సరైనది?
శిష్యులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వాళ్లు గలిలయ సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక తుఫాను విరుచుకుపడింది. వాళ్లు ఈ గలిలయ సముద్రం మీద ఇంతకుముందు కూడా తుఫాన్లు చూసే ఉంటారు. ఎంతైనా వాళ్లలో కొంతమంది, అనుభవం ఉన్న జాలర్లు.a (మత్తయి 4:18, 19) కానీ ఈసారి వచ్చింది మాత్రం, భయంకరమైన “పెనుతుఫాను.” కొన్ని క్షణాల్లోనే అది సముద్రాన్ని మజ్జిగ చిలికినట్టు చిలికేసింది. వాళ్లు పడవను నడపడానికి నానా తంటాలు పడుతున్నారు, కానీ తుఫాను ముందు వాళ్ల ప్రయత్నాలు ఓడిపోయాయి. ఎగసిపడుతున్న అలలు ‘పడవను ఢీకొట్టడంతో’ పడవలోకి నీళ్లు వచ్చేశాయి. ఇంత గోలలో కూడా, యేసు పడవ వెనక భాగంలో నిద్రపోతున్నాడు. ఎందుకంటే, ఆ రోజంతా ఆయన ప్రజలకు బోధించి అలసిపోయాడు. అప్పుడు శిష్యులు ప్రాణ భయంతో “ప్రభువా, చనిపోయేలా ఉన్నాం! రక్షించు!” అని ఆయన్ని నిద్రలేపారు.—మార్కు 4:35-38; మత్తయి 8:23-25.
2 యేసుకు ఏమాత్రం భయం వేయలేదు. ఆయన గాలిని, సముద్రాన్ని “ష్! నిశ్శబ్దంగా ఉండు!” అని ధీమాగా గద్దించాడు. వెంటనే గాలి, సముద్రం ఆయనకు లోబడ్డాయి. అప్పటిదాకా అరిచి గీ పెట్టిన గాలి ఒక్కసారిగా నోరు మూసేసుకుంది, అప్పటిదాకా ఎగిరెగిరిపడిన అలలు కిక్కురుమనకుండా కూర్చున్నాయి. అంతా “చాలా ప్రశాంతంగా మారిపోయింది.” అప్పుడు తెలియని భయమేదో శిష్యుల్ని పట్టుకుంది. అల్లరి పిల్లాడిని సరిదిద్దినంత అవలీలగా యేసు గాలిని, సముద్రాన్ని గద్దించేసరికి, వాళ్లు ఒకరితో ఒకరు “అసలు ఈయన ఎవరు?” అని అనుకున్నారు.—మార్కు 4:39-41; మత్తయి 8:26, 27.
3 యేసు ఒక మామూలు మనిషి కాదు. యెహోవా శక్తి ఆయన మీద, ఆయన ద్వారా అసాధారణ రీతుల్లో పనిచేసింది. అందుకే దైవప్రేరణతో అపొస్తలుడైన పౌలు, “క్రీస్తు దేవుని శక్తి” అని సరిగ్గానే చెప్పాడు. (1 కొరింథీయులు 1:24) ఇంతకీ దేవుని శక్తి యేసులో ఏయే విధాలుగా కనిపిస్తుంది? దానివల్ల మనకేంటి ఉపయోగం?
దేవుని ఒక్కగానొక్క కుమారుడికి ఉన్న శక్తి
4, 5. (ఎ) యెహోవా తన ఒక్కగానొక్క కుమారుడికి ఏ శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు? (బి) సృష్టిని చేయడానికి తన కుమారుడికి సహాయంగా యెహోవా ఏం ఇచ్చాడు?
4 భూమ్మీదికి రాకముందు యేసుకు ఎంత శక్తి ఉండేదో ఆలోచించండి. యెహోవా తన సొంత “శాశ్వత శక్తిని” ఉపయోగించి, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సృష్టించుకున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. (రోమీయులు 1:20; కొలొస్సయులు 1:15) ఆ తర్వాత మిగతా సృష్టిని చేయడానికి యెహోవా తన కుమారుడికి అమితమైన శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. ఆ కుమారుడి గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అన్నీ ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు.”—యోహాను 1:3.
5 ఆ పని ఎంత పెద్దదో మనం ఎంత ఆలోచించినా అర్థం చేసుకోలేం. కోటానుకోట్ల శక్తివంతమైన దేవదూతల్ని, విశ్వాన్ని, అందులో కోటానుకోట్ల నక్షత్రవీధుల్ని, భూమిని, దానిమీద ఉన్న ప్రాణులన్నిటినీ చేయడానికి ఎంత శక్తి అవసరమౌతుందో ఒకసారి ఊహించండి. అవన్నీ చేయడానికి, దేవుని ఒక్కగానొక్క కుమారుడికి ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన పవిత్రశక్తి సహాయంగా ఉంది. యెహోవా మిగతా వాటన్నిటినీ సృష్టించడానికి తన కుమారుడిని ప్రధానశిల్పిగా ఉపయోగించుకున్నాడు. కుమారుడు కూడా ఆ పనిలో ఎంతో సంతోషించాడు.—సామెతలు 8:22-31.
6. యేసు చనిపోయి పునరుత్థానమైన తర్వాత యెహోవా ఆయనకు ఏ శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు?
6 యెహోవా తన ఒక్కగానొక్క కుమారుడికి ఇంకా ఎక్కువ శక్తిని, అధికారాన్ని ఇచ్చాడా? యేసు భూమ్మీద చనిపోయి పునరుత్థానమైన తర్వాత ఇలా అన్నాడు: “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.” (మత్తయి 28:18) అవును, ఈ విశ్వంలో ఎక్కడైనా తన శక్తిని ఉపయోగించే అధికారాన్ని, హక్కును యెహోవా యేసుకు ఇచ్చాడు. యేసు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.” కాబట్టి యెహోవాకు వ్యతిరేకంగా నిలబడే “ప్రభుత్వాలన్నిటినీ, సమస్తమైన అధికారాన్ని, శక్తిని,” అవి కనిపించేవైనా, కనిపించనివైనా వాటిని నిర్మూలించే శక్తి ఆయనకు ఉంది. (ప్రకటన 19:16; 1 కొరింథీయులు 15:24-26) యెహోవా “దేన్నీ వదిలిపెట్టకుండా అన్నిటినీ” యేసుకు లోబర్చాడు, ఒక్క తనను తప్ప.—హెబ్రీయులు 2:8; 1 కొరింథీయులు 15:27.
7. యెహోవా తన చేతుల్లో పెట్టిన శక్తిని యేసు ఎప్పుడూ తప్పుగా ఉపయోగించడని మనం ఎందుకు నమ్మవచ్చు?
7 యేసుకు ఇంత శక్తి ఉంది కదా, మరి ఆయన దాన్ని తప్పుగా ఉపయోగిస్తాడేమో అని మనం కంగారుపడాలా? అసలు ఆ భయమే అక్కర్లేదు! యేసుకు తన తండ్రి అంటే ప్రాణం, కాబట్టి ఆయన్ని బాధపెట్టే పనేదీ చేయడు. (యోహాను 8:29; 14:31) యెహోవాకు అంతులేని శక్తి ఉన్నా, దాన్ని ఆయన ఎప్పుడూ తప్పుగా ఉపయోగించడని యేసుకు బాగా తెలుసు. అంతేకాదు, “ఎవరి హృదయమైతే తనపట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించడానికి” యెహోవా ఎప్పుడూ వెతుకుతూ ఉంటాడని యేసు కళ్లారా చూశాడు. (2 దినవృత్తాంతాలు 16:9) నిజానికి, తన తండ్రిలాగే యేసుకు కూడా మనుషులంటే మహా ఇష్టం. కాబట్టి ఆయన ఎప్పుడూ తన శక్తిని మంచిగానే ఉపయోగిస్తాడని మనం నమ్మవచ్చు. (యోహాను 13:1) ఆ విషయాన్ని యేసు ఇప్పటికే రుజువు చేసేశాడు కూడా. ఇప్పుడు కాసేపు, భూమ్మీద ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి శక్తి ఉండేదో, దాన్ని ఆయన ఎలా వాడాడో చూద్దాం.
“ఆయన మాటలు . . . ఎంతో శక్తివంతంగా ఉండేవి”
8. పవిత్రశక్తితో అభిషేకించిన తర్వాత యెహోవా యేసుకు ఏ శక్తిని ఇచ్చాడు? ఆయన దాన్ని ఎలా ఉపయోగించాడు?
8 యేసు నజరేతులో పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఏ అద్భుతాలూ చేయలేదని తెలుస్తోంది. కానీ క్రీస్తు శకం 29 లో, ఆయన దాదాపు 30 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిస్థితి మారింది. (లూకా 3:21-23) బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు. ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు.” (అపొస్తలుల కార్యాలు 10:38) “ఆయన మంచిపనులు చేస్తూ” అనే మాటల్ని బట్టి, యేసు తన శక్తిని మంచిగా ఉపయోగించాడని అర్థమవ్వడం లేదా? ఆయన పవిత్రశక్తితో అభిషేకించబడిన తర్వాత, “చాలా ఆశ్చర్యకరమైన పనులు చేశాడు; ఆయన మాటలు కూడా ఎంతో శక్తివంతంగా ఉండేవి.”—లూకా 24:19.
9-11. (ఎ) యేసు చాలావరకు ఎక్కడ బోధించాడు? అందులో ఉన్న చిక్కు ఏంటి? (బి) ప్రజలు యేసు బోధించిన తీరు చూసి ఎందుకు ఆశ్చర్యపోయారు?
9 యేసు మాటలు ఎలా శక్తివంతంగా ఉండేవి? ఆయన చాలావరకు ఆరుబయట అంటే సరస్సు ఒడ్డున, కొండల పక్కన, వీధుల్లో, సంతల్లో బోధించేవాడు. (మార్కు 6:53-56; లూకా 5:1-3; 13:26) ఒకవేళ ఆయన చెప్పేది ఆసక్తిగా లేకపోతే, ప్రజలు అటునుండి అటే వెళ్లిపోయి ఉండేవాళ్లు. పైగా ఆ కాలంలో పుస్తకాలు లేవు కాబట్టి వినేవాళ్లు వాళ్ల మనసుల్లో, హృదయాల్లో ఆయన మాటల్ని దాచుకోవాలి. అలా ఉండాలంటే యేసు ఆసక్తికరంగా, తేలిగ్గా అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా బోధించాలి. అది యేసుకు పెద్ద విషయమేం కాదు. ఉదాహరణకు, ఆయన కొండ మీద ఇచ్చిన ప్రసంగాన్ని గమనించండి.
10 క్రీస్తు శకం 31 లో, ఒకరోజు ఉదయం చాలామంది ప్రజలు గలిలయ సముద్రానికి దగ్గర్లో ఒక కొండ మీద పోగయ్యారు. కొంతమంది 100-110 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూదయ, యెరూషలేము నుండి వస్తే, ఇంకొంతమంది ఉత్తరాన ఉన్న తూరు-సీదోనుల తీరప్రాంతం నుండి వచ్చారు. చాలామంది రోగులు యేసును ముట్టుకోవాలని ఆయన చుట్టూ చేరారు, యేసు వాళ్లందర్నీ బాగుచేశాడు. అందరూ బాగైన తర్వాత ఆయన బోధించడం మొదలుపెట్టాడు. (లూకా 6:17-19) కాసేపటికి ఆయన బోధించడం పూర్తైనప్పుడు, వాళ్లు విన్నవాటిని బట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకు?
11 ఆ కొండ మీద ప్రసంగాన్ని విన్న ఒకాయన, కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా రాశాడు: “ప్రజలు ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన . . . అధికారంగల వ్యక్తిలా బోధించాడు.” (మత్తయి 7:28, 29) అవును, ఆయన మాటలకున్న శక్తిని ప్రజలు ఫీల్ అవ్వగలిగేవాళ్లు. ఆయన దేవుని తరఫున మాట్లాడేవాడు, ప్రతీదీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే బోధించేవాడు. (యోహాను 7:16) ఆయన స్పష్టంగా, ఒప్పించేలా మాట్లాడేవాడు. ఆయన మాటలకు ఎవరూ వంక పెట్టలేకపోయేవాళ్లు. ఏదైనా ఒక సమస్యకు అసలైన కారణం అర్థం చేసుకునేలా, అలాగే ప్రజలు వాళ్లను వాళ్లు నిజాయితీగా పరిశీలించుకునేలా ఆయన మాట్లాడేవాడు. ఎలా సంతోషంగా ఉండాలో, ఎలా ప్రార్థించాలో, దేవుని రాజ్యాన్ని ఎలా వెదకాలో, అసలైన భవిష్యత్తుకు పునాది ఎలా వేసుకోవాలో ఆయన బోధించాడు. (మత్తయి 5:3–7:27) నీతి కోసం, సత్యం కోసం ఆకలిదప్పులతో ఉన్న వాళ్లకు ఆయన మాటలతో కడుపు నిండిపోయేది. అలాంటి వాళ్లు ‘ఇక తమకోసం తాము జీవించకుండా’ యేసు వెంట వెళ్లాలని, ప్రతీది వదిలేయడానికి కూడా సిద్ధపడ్డారు. (మత్తయి 16:24; లూకా 5:10, 11) యేసు మాటలకు ఎంత శక్తి ఉందో కదా!
“చాలా ఆశ్చర్యకరమైన పనులు చేశాడు”
12, 13. యేసు తన ‘పనుల్లో’ కూడా ఎలా సత్తా చాటాడు? ఆయన చేసిన అద్భుతాల్లో ఏ వెరైటీ కనిపిస్తుంది?
12 యేసు తన మాటల్లో సత్తా చాటడమే కాదు, “చాలా ఆశ్చర్యకరమైన పనులు” కూడా చేశాడు. (లూకా 24:19) సువార్త పుస్తకాలు, ఆయన చేసిన 30కి పైగా అద్భుతాల గురించి చెప్తున్నాయి. అవన్నీ ‘యెహోవా శక్తితోనే’ చేశాడు.b (లూకా 5:17) యేసు చేసిన అద్భుతాలు, వేలమంది జీవితాల్లో వెలుగును నింపాయి. ఉదాహరణకు, రెండు అద్భుతాల గురించి ఆలోచించండి. ఒకసారి ఆయన 5,000 మంది పురుషులు ఉన్న గుంపుకు ఆహారం పెట్టాడు. తర్వాత 4,000 మంది పురుషులు ఉన్న గుంపుకు పెట్టాడు. ఇంకా ఆడవాళ్లను, పిల్లల్ని కూడా కలుపుకుంటే, ఆ గుంపులో ఎన్నో వేలమంది ఉండి ఉంటారు!—మత్తయి 14:13-21; 15:32-38.
13 యేసు చేసిన అద్భుతాల్లో చాలా వెరైటీ ఉంది. ఆయనకు చెడ్డదూతల మీద అధికారం ఉంది కాబట్టి, వాళ్లను సునాయాసంగా వెళ్లగొట్టేశాడు. (లూకా 9:37-43) అలాగే, ఆయనకు ప్రకృతి మీద శక్తి ఉంది కాబట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. (యోహాను 2:1-11) ఆయన ఒకసారి “సముద్రం మీద నడుస్తూ” రావడం చూసి, శిష్యులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం ఊహించండి. (యోహాను 6:18, 19) అంతేకాదు ఆయనకు జబ్బుల్ని, అవయవ లోపాల్ని, ఎంతోకాలంగా పట్టిపీడిస్తున్న వ్యాధుల్ని, ప్రాణాంతకమైన రోగాల్ని బాగుచేసే శక్తి ఉంది. (మార్కు 3:1-5; యోహాను 4:46-54) ఆయన ప్రజల్ని బాగుచేసిన విధానంలో కూడా వెరైటీ ఉంది. కొంతమందిని దూరం నుండి బాగుచేస్తే, ఇంకొంతమందిని స్వయంగా ముట్టుకుని బాగుచేశాడు. (మత్తయి 8:2, 3, 5-13) కొంతమందిని చిటికెలో బాగుచేస్తే, ఇంకొంతమందిని మెల్లమెల్లగా బాగుచేశాడు.—మార్కు 8:22-25; లూకా 8:43, 44.
‘యేసు సముద్రం మీద నడిచి రావడం వాళ్లు చూశారు’
14. చనిపోయినవాళ్లను తిరిగిలేపే శక్తి ఉందని యేసు ఏ పరిస్థితుల్లో చూపించాడు?
14 అన్నిటికన్నా ముఖ్యంగా, యేసుకు చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించే శక్తి ఉంది. బైబిల్లో ఉన్న మూడు సందర్భాల్ని చూస్తే, యేసు ఒక 12 ఏళ్ల పాపను బ్రతికించి వాళ్ల అమ్మానాన్నల చేతుల్లో పెట్టాడు; విధవరాలైన తల్లికి తన ఒక్కగానొక్క కొడుకును తిరిగిచ్చాడు; ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఎంతో ఇష్టమైన సహోదరుణ్ణి తెచ్చి ఇచ్చాడు. (లూకా 7:11-15; 8:49-56; యోహాను 11:38-44) ఏ పరిస్థితీ ఆయన శక్తికి అడ్డుకట్ట వేయలేకపోయింది. 12 ఏళ్ల పాపను ఆమె చనిపోయిన కాసేపటికే, ఆమెను ఉంచిన మంచం మీదే యేసు తిరిగి బ్రతికించాడు. విధవరాలి కొడుకు విషయానికొస్తే, అతన్ని పాడెమీద నుండి లేపాడు. అంటే అతను చనిపోయిన రోజునే అతన్ని బ్రతికించాడు. లాజరునైతే, చనిపోయిన నాలుగు రోజుల తర్వాత సమాధిలో నుండి లేపాడు.
నిస్వార్థంగా, బాధ్యతగా, శ్రద్ధగా శక్తిని వాడాడు
15, 16. యేసు తన శక్తిని ఎప్పుడూ స్వార్థం కోసం వాడలేదు అనడానికి రుజువేంటి?
15 యేసుకున్న శక్తినే ఒక అపరిపూర్ణ నాయకుడి చేతిలో పెడితే, అతను దాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంది. కానీ యేసు ఏ పాపం చేయలేదు. (1 పేతురు 2:22) అపరిపూర్ణ మనుషులు స్వార్థంతో, అధికార దాహంతో, అత్యాశతో తమ శక్తిని తప్పుగా ఉపయోగించి వేరేవాళ్లను ఇబ్బందిపెడతారు. కానీ యేసు వాటి వాసన కూడా తగలనివ్వలేదు.
16 యేసు తన శక్తిని వేరేవాళ్ల కోసం వాడాడు తప్ప, తన స్వార్థం కోసం ఎప్పుడూ వాడుకోలేదు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నా ససేమిరా ఒప్పుకోలేదు. (మత్తయి 4:1-4) ఆయనకున్న అరకొర ఆస్తుల్ని చూస్తుంటే, ఆయన తన శక్తిని లక్షలు-కోట్లు సంపాదించుకోవడానికి వాడుకోలేదని అర్థమౌతుంది. (మత్తయి 8:20) ఆయనలో స్వార్థం రవ్వంత కూడా లేదని చెప్పడానికి ఆయన చేసిన అద్భుతాలు ఇంకో రుజువు. అద్భుతాలు చేసినప్పుడు, ఆయనలో నుండి కొంత శక్తి బయటికి వెళ్లేది. కేవలం ఒక్కరు బాగైనా, తనలో నుండి శక్తి బయటికి వెళ్లడం ఆయనకు తెలిసేది. (మార్కు 5:25-34) అయినా సరే, గుంపులుగుంపులుగా ప్రజలు బాగయ్యేలా తనను ముట్టుకోనిచ్చాడు. (లూకా 6:19) అసలు స్వార్థమే తెలియని మనసు కదా యేసుది!
17. యేసు తన శక్తిని బాధ్యతగా వాడాడు అని ఎందుకు చెప్పవచ్చు?
17 యేసు తన శక్తిని ఎలా పడితే అలా కాకుండా, బాధ్యతగా ఉపయోగించాడు. ఆయన నలుగురితో చప్పట్లు కొట్టించుకోవాలని గానీ, అందరి చూపూ తన మీదే పడాలని గానీ అద్భుతాలు చేయలేదు. (మత్తయి 4:5-7) హేరోదు ఊరికే సరదాకి యేసు చేసే అద్భుతాల్ని చూడాలనుకొని వాటిని చేయమన్నప్పుడు, యేసు దానికి ఒప్పుకోలేదు. (లూకా 23:8, 9) యేసు తను చేసిన పనుల గురించి డప్పు కొట్టుకోలేదు. చాలావరకు ఆయన ఎవరినైతే బాగుచేశాడో వాళ్లకు ఆ విషయాన్ని గుట్టుగా ఉంచమని చెప్పేవాడు. (మార్కు 5:43; 7:36) ఆ నోటా ఈ నోటా విన్న మాటల్ని బట్టి ప్రజలు తనమీద విశ్వాసం ఉంచాలని యేసు కోరుకోలేదు.—మత్తయి 12:15-19.
18-20. (ఎ) యేసు తన శక్తిని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించాడు? (బి) యేసు ఒక చెవిటివాణ్ణి బాగుచేసిన విధానం చూస్తుంటే మీకేం అనిపిస్తుంది?
18 యేసుకు చాలా శక్తి ఉంది. కానీ ఆయన వేరేవాళ్ల అవసరాల్ని, బాధల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు శక్తిని వాడే ఈ లోక నాయకుల్లా లేడు. ఆయనకు ప్రజల మీద చాలా శ్రద్ధ ఉంది. ఎవరైనా బాధపడడం చూస్తే చాలు, ఆయన తట్టుకోలేకపోయేవాడు. ఏం చేసైనా సరే వాళ్లను ఆ బాధలో నుండి బయటపడేయాలని కోరుకునేవాడు. (మత్తయి 14:14) వాళ్ల ఫీలింగ్స్‌ని, అవసరాల్ని ఆయన పట్టించుకునేవాడు. ఆ శ్రద్ధ వల్లే ఆయన తన శక్తిని ప్రేమగా ఉపయోగించాడు. అందుకు ఒక చక్కని ఉదాహరణ మార్కు 7:31-37 లో ఉంది.
19 ఆ లేఖనాల సందర్భం ఏంటంటే, జనాలు యేసును వెతికి ఆయన దగ్గరికి చాలామంది రోగుల్ని తీసుకొచ్చారు. ఆయన వాళ్లందర్నీ బాగుచేశాడు. (మత్తయి 15:29, 30) కాకపోతే, ప్రత్యేకించి ఒక వ్యక్తి మీద యేసు చూపు పడింది. అతను నత్తి ఉన్న చెవిటివాడు. అతనికి ఎంత భయంగా, బిడియంగా అనిపిస్తుందో యేసు అర్థం చేసుకుని ఉంటాడు. అందుకే అతని గురించి ఆలోచించి, యేసు అతన్ని జనం నుండి దూరంగా పక్కకు తీసుకెళ్లాడు. తర్వాత కొన్ని సైగలు చేసి, తను ఏం చేయబోతున్నాడో ఆ వ్యక్తికి చెప్పాడు. యేసు “అతని చెవుల్లో వేళ్లు పెట్టి, ఉమ్మివేసి, అతని నాలుకను ముట్టుకున్నాడు.”c (మార్కు 7:33) తర్వాత యేసు ప్రార్థన చేస్తున్నట్టుగా ఆకాశం వైపు చూసి, నిట్టూర్పు విడిచాడు. ‘నేను ఇప్పుడు చేయబోయేవన్నీ దేవుని శక్తితోనే’ అని యేసు ఆ పనుల ద్వారా చెప్పకనే చెప్పాడు. చివరిగా, యేసు “తెరుచుకో” అని అన్నాడు. (మార్కు 7:34) దాంతో అతనికి వినికిడి శక్తి తిరిగొచ్చింది, అతను మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
20 దేవుడు ఇచ్చిన శక్తితో ప్రజల్ని బాగు చేస్తున్నప్పుడు కూడా, యేసు వాళ్ల ఫీలింగ్స్‌ని ఎంతలా పట్టించుకున్నాడో ఆలోచిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! మనుషుల మీద ఇంతలా శ్రద్ధ చూపిస్తూ, వాళ్ల ఫీలింగ్స్‌ని పట్టించుకునే నాయకుడి చేతిలో యెహోవా తన రాజ్యాన్ని పెట్టాడు. అది తెలుసుకోవడం మనకు కొండంత బలాన్ని ఇవ్వట్లేదా?
రాబోయే వాటికి ఒక శాంపిల్
21, 22. (ఎ) యేసు చేసిన అద్భుతాలు దేనికి శాంపిల్‌లా ఉన్నాయి? (బి) యేసుకు ప్రకృతి శక్తుల మీద అధికారం ఉంది కాబట్టి ఆయన పరిపాలన ఎలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?
21 భూమ్మీద ఉన్నప్పుడు యేసు చేసిన అద్భుతాలు, భవిష్యత్తులో ఆయన పరిపాలనలో ఉండబోయే గొప్ప దీవెనలకు ఒక శాంపిల్ మాత్రమే. కొత్తలోకంలో, యేసు మళ్లీ ఒకసారి అద్భుతాలు చేస్తాడు. కాకపోతే ఈసారి భూవ్యాప్తంగా చేస్తాడు! ఆయన చేయబోయే కొన్ని అద్భుతమైన విషయాల్ని ఇప్పుడు చూద్దాం.
22 యేసు భూమిని, దాని వాతావరణాన్ని బాగుచేస్తాడు. ఒకసారి గుర్తుతెచ్చుకోండి, ఆయన తుఫానును ఆపడం ద్వారా ప్రకృతి శక్తుల మీద తనకు అధికారం ఉందని చూపించాడు. కాబట్టి ఆయన పరిపాలన కింద తుఫానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం లాంటి ప్రకృతి విపత్తుల ఊసే ఉండదు. యెహోవా యేసును ప్రధానశిల్పిగా ఉపయోగించుకుని భూమిని, దానిమీద ఉన్న ప్రాణులన్నిటినీ సృష్టించాడు. కాబట్టి యేసుకు భూమి గురించి అణువణువూ తెలుసు. దాని వనరుల్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన పరిపాలన కింద ఈ భూమంతా పరదైసుగా మారుతుంది.—లూకా 23:43.
23. రాజుగా యేసు మనుషుల అవసరాల్ని ఎలా తీరుస్తాడు?
23 భూమి సంగతి సరే, మరి మన అవసరాల సంగతేంటి? యేసు కేవలం కొన్ని రొట్టెలు చేపలతో వేలమందికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. దీన్నిబట్టి, ఆయన పరిపాలన కింద ఎవ్వరూ ఆకలితో అలమటించరు అని అర్థమౌతుంది. నిజానికి అప్పుడు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి, పస్తులకు ఇక గుడ్‌బై చెప్పాల్సిందే. (కీర్తన 72:16) ఆయనకు రోగాల్ని నయం చేసే శక్తి ఉంది కాబట్టి అప్పుడు రోగులు, గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, చేతులు లేనివాళ్లు, కుంటివాళ్లు పూర్తిగా-శాశ్వతంగా బాగౌతారు. (యెషయా 33:24; 35:5, 6) ఆయనకు చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తి కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆయన రాజుగా, తన తండ్రి జ్ఞాపకంలో ఉన్న కోట్లమందిని పునరుత్థానం చేస్తాడు.—యోహాను 5:28, 29.
24. యేసుకున్న శక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి? ఎందుకు?
24 యేసుకున్న శక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం ఒక విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. అదేంటంటే, యేసు అచ్చం తన తండ్రి చేసినట్టే చేస్తాడు. (యోహాను 14:9) యేసు తన శక్తిని ఎలా వాడాడో తెలుసుకుంటే, యెహోవా తన శక్తిని ఎలా వాడతాడో అర్థమైపోతుంది. ఉదాహరణకు, యేసు ఒక కుష్ఠురోగిని ఎంత ఆప్యాయంగా బాగుచేశాడో ఆలోచించండి. యేసు జాలిపడి అతన్ని ముట్టుకునిమరీ, “నాకు ఇష్టమే!” అంటూ ఆయన్ని బాగుచేశాడు. (మార్కు 1:40-42) ఇలాంటి ఉదాహరణల ద్వారా నిజానికి యెహోవా మనతో, ‘ఇదిగో, చూడండి నేను నా శక్తిని వాడేది ఇలానే!’ అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. మన సర్వశక్తిగల దేవుడు ఇంత ప్రేమగా తన శక్తిని ఉపయోగించడం చూస్తుంటే ఆయన్ని స్తుతించాలని, థ్యాంక్స్ చెప్పాలని మీకు అనిపించట్లేదా?
a గలిలయ సముద్రానికి తుఫానులు కొత్తేమీ కాదు, అవి తరచూ వస్తూనే ఉంటాయి. అది సముద్ర మట్టానికి (దాదాపు 700 అడుగుల) దిగువున ఉంది, కాబట్టి అక్కడ గాలి చుట్టుపక్కల ప్రాంతంలో కంటే కాస్త వెచ్చగా ఉండేది. దానివల్ల తరచూ వాతావరణంలో మార్పులు వస్తూ ఉండేవి. ఉత్తరాన ఉన్న హెర్మోను పర్వతం నుండి కింద యొర్దాను లోయకు బలమైన గాలులు వేగంగా వీచేవి. కాబట్టి ఒక్కక్షణం సముద్రం ప్రశాంతంగా ఉంటే, మరుక్షణమే అల్లకల్లోలంగా మారిపోయేది.
b ఇవే కాకుండా, సువార్త పుస్తకాలు కొన్నిసార్లు చాలా అద్భుతాల్ని కలిపి ఒకే అద్భుతంగా చెప్పాయి. ఉదాహరణకు, ఒక సందర్భంలో “నగర ప్రజలంతా” యేసును చూడడానికి వచ్చినప్పుడు, ఆయన “చాలామంది” రోగుల్ని బాగుచేశాడు.—మార్కు 1:32-34.
c అటు యూదులు, ఇటు అన్యులు ఉమ్మువేయడాన్ని బాగుచేయడానికి ఆధారంగా లేదా గుర్తుగా ఒప్పుకునేవాళ్లు. ఉమ్మును అలా వాడడం గురించి రబ్బీల పుస్తకాల్లో కూడా ఉంది. అయితే యేసు ఊరికే, ఆ వ్యక్తిని బాగు చేయబోతున్నానని చెప్పడం కోసమే ఉమ్ము వేసి ఉండవచ్చు. ఏదేమైనా ఆ ఉమ్ములో ఏం లేదు కానీ, యేసు దేవుని శక్తితోనో ఆ వ్యక్తిని బాగుచేశాడు.