కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 15 పేజీలు 148-157
  • యేసు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తండ్రికి తగ్గ తనయుడు
  • “న్యాయమంటే ఏమిటో” యేసు స్పష్టం చేస్తాడు
  • న్యాయానికి నిలువెత్తు రూపం
  • మెస్సీయ రాజు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’
  • యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • జనాంగములన్నింటికి త్వరలోనే న్యాయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 15 పేజీలు 148-157
ఆలయంలో డబ్బు మార్చేవాళ్ల బల్లల్ని యేసు కిందపడేసి, బయటికి వెళ్లిపోమని ఆజ్ఞాపించాడు.

అధ్యాయం 15

యేసు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’

1, 2. యేసుకు ఎప్పుడు కోపం వచ్చింది? ఎందుకు?

యేసు కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. దానికి కారణం లేకపోలేదు. సౌమ్యుడైన యేసుకు కోపం వచ్చిందంటే, మనం ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు. (మత్తయి 21:5) అయితే, ఆయన అంత కోపంలో కూడా స్థిమితంగానే ఉన్నాడు. ఆయన కోపంలో న్యాయం ఉంది.a శాంతిని ప్రేమించే యేసుకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయన ఒక ఘోరమైన అన్యాయాన్ని చూశాడు.

2 యెరూషలేములోని ఆలయం అంటే యేసుకు చాలా ఇష్టం. ఎందుకంటే, ప్రపంచం మొత్తంలో తన పరలోక తండ్రికి ఆరాధన జరిగే ఒకేఒక్క పవిత్రమైన చోటు అది. ఎక్కడెక్కడో ఉన్న యూదులు చాలా దూరం ప్రయాణం చేసి, ఆరాధించడానికి ఇక్కడికి వచ్చేవాళ్లు. దేవునికి భయపడే అన్యజనులు కూడా ఆలయానికి వచ్చి, వాళ్లకు అనుమతి ఉండే ప్రాంగణంలో దేవుణ్ణి ఆరాధించేవాళ్లు. కానీ యేసు తన పరిచర్యను మొదలుపెట్టిన కొత్తలో, ఆలయంలోకి వెళ్లినప్పుడు ఒక ఘోరమైన విషయం చూశాడు. ఆ చోటు దేవునికి ఆరాధన చేసే మందిరంలా లేదు, ఒక సంతలా ఉంది! ఎక్కడ చూసినా వ్యాపారస్థులు, డబ్బులు మార్చేవాళ్లు కనిపిస్తున్నారు. ఇందులో అన్యాయం ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్లు దేవుని ఆలయానికి వస్తున్న ప్రజల్ని మోసం చేసి, వాళ్లను దోచుకుంటున్నారు. అదెలా?—యోహాను 2:14.

3, 4. యెహోవా ఇంట్లో ఏ నిలువు దోపిడి జరుగుతోంది? యేసు దాన్ని సరిచేయడానికి ఏం చేశాడు?

3 ఆలయ పన్ను కట్టాలంటే కేవలం ఒక రకమైన నాణాన్నే ఇవ్వాలని మతనాయకులు రూల్‌ పెట్టారు. ఆలయానికి వచ్చేవాళ్లు వాళ్ల డబ్బుల్ని మార్చుకుని, ఆ నాణేల్ని తీసుకోవాలి. కాబట్టి, డబ్బు మార్చేవాళ్లు తమ బల్లల్ని తీసుకుని ఏకంగా ఆలయంలోనే తిష్ఠ వేశారు. పైగా అలా మార్చడానికి అదనంగా డబ్బు వసూలు చేసేవాళ్లు. జంతువుల్ని అమ్మే వ్యాపారం కూడా కాసుల వర్షం కురిపించేది. అక్కడికి వచ్చేవాళ్లు జంతు బలి అర్పించాలనుకుంటే, జంతువుల్ని ఆ నగరంలో ఎక్కడైనా కొనవచ్చు. కానీ ఆలయ అధికారులు ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటూ వంకలు పెడతారు. అదే ఆలయంలో కొంటే మాత్రం, మారుమాట్లాడకుండా తీసుకుంటారు. గత్యంతరం లేక ప్రజలు అక్కడే కొనాల్సివచ్చేది, దాంతో అక్కడ రేట్లు బాగా పెంచేశారు.b ఇది వ్యాపారంలో మోసం చేయడం కాదు, అంతకు మించి. చెప్పాలంటే, అది నిలువు దోపిడి!

4 అంతటి అన్యాయాన్ని యేసు ఒక్క క్షణం కూడా చూస్తూ ఉండలేకపోయాడు. అది ఆయన సొంత తండ్రి ఇల్లు! యేసు తాళ్లతో ఒక కొరడా చేసి గొర్రెల్ని, పశువుల్ని ఆలయం నుండి వెళ్లగొట్టాడు. డబ్బు మార్చేవాళ్ల దగ్గరికి వెళ్లి, వాళ్ల బల్లల్ని కింద పడేశాడు. చలువరాతి నేల మీద ఆ చిల్లరంతా చెల్లాచెదురుగా పడడం ఊహించుకోండి! పావురాల్ని అమ్మేవాళ్లతో ఆయన గట్టిగా ఇలా అన్నాడు: “వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి!” (యోహాను 2:15, 16) ధైర్యవంతుడైన యేసుకు ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు.

“వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి!”

తండ్రికి తగ్గ తనయుడు

5-7. (ఎ) యేసు యెహోవాకున్న న్యాయాన్ని ఎలా ఒంటబట్టించుకున్నాడు? యేసు ఉదాహరణను పరిశీలించడం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) సాతాను అన్యాయంగా వేసిన నిందలకు యేసు ఎలా జవాబిచ్చాడు? ఆయన ఇంకా ఏం చేసి చూపిస్తాడు?

5 అయితే, ఆ వ్యాపారస్థులు మళ్లీ పోగయ్యారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, యేసు అదే అన్యాయాన్ని మళ్లీ సరిచేశాడు. ఈసారి, యెహోవా అన్న మాటల్నే ఎత్తిచెప్తూ, దేవుని ఇంటిని “దోపిడీదొంగల గుహగా” మార్చారని అన్నాడు. (యిర్మీయా 7:11; మత్తయి 21:13) అవును, వాళ్లు ప్రజల్ని నిలువునా దోచుకుంటూ దేవుని ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నప్పుడు, యేసుకు అచ్చం తన తండ్రికి అనిపించినట్టే అనిపించింది. అందులో ఆశ్చర్యం ఏమీలేదు! ఎందుకంటే, ఎన్నో కోట్ల సంవత్సరాలుగా యేసు తన పరలోక తండ్రి దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. దానివల్ల న్యాయం విషయంలో యెహోవాకున్న ఆలోచనే యేసు నరనరాల్లో ఇంకిపోయింది. ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కాబట్టి మనం యెహోవా న్యాయం గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ఉదాహరణను పరిశీలించాల్సిందే.—యోహాను 14:9, 10.

6 యెహోవాకు పరిపాలించడం రాదని, ఆయన అబద్ధికుడని సాతాను అన్యాయంగా నిందలు వేస్తున్నప్పుడు దేవుని ఒక్కగానొక్క కుమారుడైన యేసు అక్కడే ఉన్నాడు. అవి దారుణమైన నిందలు! ఆ తర్వాత, మనుషులందరూ ప్రేమతో కాదుగానీ స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తారని సాతాను అన్నప్పుడు కూడా యేసు విన్నాడు. ఆ తప్పుడు ఆరోపణలు విన్నప్పుడు కుమారుడి గుండె తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత, పరిస్థితిని చక్కదిద్దడానికి యెహోవా తననే ఉపయోగించుకుంటాడని తెలిసినప్పుడు, యేసు చాలా సంతోషించి ఉంటాడు! (2 కొరింథీయులు 1:20) ఇంతకీ యెహోవా దాన్ని ఎలా చేస్తాడు?

7 మనం 14వ అధ్యాయంలో చూసినట్టు, మనుషులెవరూ యెహోవాకు యథార్థంగా ఉండరని సాతాను వేసిన నిందకు యేసుక్రీస్తు ఘాటుగా, ధీటుగా సమాధానం ఇచ్చేశాడు. అలా యెహోవా పరిపాలన బాగోదు అనే అబద్ధంతో సహా, యెహోవా పవిత్రమైన పేరు మీద పడిన నిందలన్నిటినీ తీసేయడానికి యేసు బాట వేసుకున్నాడు. దేవుని ముఖ్య ప్రతినిధిగా యేసు, విశ్వమంతటా దేవుని న్యాయాన్ని స్థాపిస్తాడు. (అపొస్తలుల కార్యాలు 5:31) ఆయన భూమ్మీద ఉన్నప్పుడు కూడా అలాంటి న్యాయాన్ని చూపించాడు. యెహోవా యేసు గురించి ఇలా అన్నాడు: “ఈయన మీద నా పవిత్రశక్తిని ఉంచుతాను, ఈయన న్యాయమంటే ఏమిటో దేశాలకు స్పష్టం చేస్తాడు.” (మత్తయి 12:18) యేసు ఈ మాటల్ని ఎలా నిజం చేశాడు?

“న్యాయమంటే ఏమిటో” యేసు స్పష్టం చేస్తాడు

8-10. (ఎ) యూదా మతనాయకులు పెట్టిన నియమాలు యూదులుకాని వాళ్లను, ఆడవాళ్లను ఎలా చులకన చేశాయి? (బి) వాళ్లు విశ్రాంతి రోజు గురించిన నియమాన్ని ఎలా భారం చేశారు?

8 యేసు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, పాటించాడు. కానీ అప్పట్లో మతనాయకులు, ధర్మశాస్త్రాన్ని తమకు నచ్చినట్టు తిప్పేసి తప్పుగా చెప్పేవాళ్లు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మీరు . . . ధర్మశాస్త్రంలోని మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని, కరుణను, నమ్మకత్వాన్ని పట్టించుకోరు.” (మత్తయి 23:23) ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన వాళ్లే “న్యాయమంటే ఏమిటో” స్పష్టం చేయలేదు, అలా చేయకపోగా దాన్ని మరుగున పడేశారు. ఎలా? కొన్ని ఉదాహరణలు చూద్దాం.

9 చుట్టూ ఉన్న అన్య జనాంగాలకు దూరంగా ఉండమని యెహోవా తన ప్రజలకు చెప్పాడు. (1 రాజులు 11:1, 2) అయితే, కొంతమంది చాదస్తపు మతనాయకులు అతి చేస్తూ యూదులుకాని వాళ్లందరికీ దూరంగా ఉండాలని ప్రజలకు బోధించారు. ఎంత ఘోరమంటే, మిష్నాలో ఈ ఆజ్ఞ కూడా ఉంది: “జంతువుల్ని అన్యజనుల సత్రాల్లో వదలకూడదు, ఎందుకంటే వాళ్లు జంతువులతో లైంగిక సంబంధం పెట్టుకుంటారో ఏమో.” యూదులుకాని వాళ్లందరి మీద కట్టకట్టుకుని ఇలా పక్షపాతం చూపించడం మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమే కాక, చాలా అన్యాయం కూడా. (లేవీయకాండం 19:34) వాళ్లు పెట్టిన ఇంకొన్ని నియమాలు ఆడవాళ్లను చులకన చేశాయి. ఒక నియమం ఏంటంటే, భార్య తన భర్త పక్కన నడవకూడదు, ఆయన వెనకే నడవాలి. అలాగే మగవాళ్లు నలుగురిలో ఉన్నప్పుడు ఆడవాళ్లతో మాట్లాడకూడదు, ఆఖరికి తన భార్యతోనైనా మాట్లాడకూడదు. దాసులు, ఆడవాళ్లు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. ఇంకా విడ్డూరం ఏంటంటే, మగవాళ్లు దేవుడు తమను ఆడవాళ్లుగా పుట్టించనందుకు ప్రార్థనలో కృతజ్ఞతలు కూడా చెప్పేవాళ్లు.

10 మతనాయకులు ధర్మశాస్త్రాన్ని సమాధి చేసి, దానిమీద మనుషులు పుట్టించిన నియమాల్ని పేర్చుకుంటూ పోయారు. ఉదాహరణకు, విశ్రాంతి రోజు గురించే తీసుకుంటే, దేవుడు ఆ రోజున పని చేయకూడదని మాత్రమే చెప్పాడు. ఎందుకంటే వాళ్లు ఆ రోజును ఆరాధించడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించాలనుకున్నాడు. కానీ పరిసయ్యులు ఆ ఆజ్ఞను చాలా భారం చేశారు. వాళ్లు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, అసలు “పని” అంటే ఏమేం వస్తాయో వాళ్లే నిర్ణయించేశారు. కోత కోయడం, వేటాడడం లాంటి 39 వేర్వేరు పనులు “పని” కిందకే వస్తాయని చెప్పారు. దీనివల్ల పుట్టెడు ప్రశ్నలు వచ్చాయి. విశ్రాంతి రోజున ఒక దోమను చంపితే అది వేటాడడం కిందకు వస్తుందా? పొలం గట్టున వెళ్తూ గుప్పెడు ధాన్యం కోస్తే, అది కోత కోయడం కిందకు వస్తుందా? విశ్రాంతి రోజున ఎవరినైనా బాగుచేస్తే అది పని కిందకు వస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వాళ్లు ఇంకా కఠినమైన, నిర్దిష్టమైన నియమాలు పెట్టాల్సి వచ్చింది.

11, 12. పరిసయ్యుల సొంత నియమాలు తప్పని యేసు ఎలా చెప్పాడు?

11 ఇలాంటి వాతావరణంలో యేసు ప్రజలకు న్యాయమంటే ఏంటో ఎలా చూపిస్తాడు? ఆయన తన బోధల ద్వారా, తన జీవితం ద్వారా ఆ మతనాయకులకు ధైర్యంగా ఎదురెళ్లాడు. ముందుగా ఆయన బోధల్లో కొన్నిటిని చూద్దాం. కుప్పలుతెప్పలుగా మనుషులు పుట్టించిన నియమాల్ని ఆయన సూటిగా ఖండిస్తూ ఇలా అన్నాడు: “మీరు, తరతరాలుగా వస్తున్న మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగారుస్తున్నారు.”—మార్కు 7:13.

12 విశ్రాంతి రోజు నియమాన్ని, ఆ మాటకొస్తే ధర్మశాస్త్రానికున్న అసలు ఉద్దేశాన్ని పరిసయ్యులు తప్పుగా అర్థంచేసుకున్నారని యేసు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. మెస్సీయ “విశ్రాంతి రోజుకు ప్రభువు,” కాబట్టి ఆయనకు విశ్రాంతి రోజున మనుషుల్ని బాగుచేసే హక్కు ఉందని యేసు చెప్పాడు. (మత్తయి 12:8) ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి, యేసు అందరూ చూస్తుండగా విశ్రాంతి రోజున అద్భుతాలు చేశాడు. (లూకా 6:7-10) అది శాంపిల్‌ మాత్రమే, ఆయన వెయ్యేళ్ల పరిపాలనలో వాటిని భూవ్యాప్తంగా చేస్తాడు. ఆ వెయ్యేళ్ల పరిపాలన గొప్ప విశ్రాంతి రోజుగా ఉంటుంది. వందల సంవత్సరాలుగా పాపం, మరణం అనే బరువుల్ని మోసీమోసీ అలసిపోయిన నమ్మకమైన మనుషులందరికీ మొత్తానికి విశ్రాంతి దొరుకుతుంది.

13. యేసు పరిచర్య పూర్తయిన తర్వాత ఏ నియమం అమల్లోకి వచ్చింది? దానికి, ఇంతకుముందున్న మోషే ధర్మశాస్త్రానికి తేడా ఏంటి?

13 ఒక కొత్త నియమం ద్వారా కూడా యేసు న్యాయమంటే ఏంటో స్పష్టం చేశాడు. అదే “క్రీస్తు నియమం.” యేసు తన పరిచర్యను పూర్తి చేసిన తర్వాత అది అమల్లోకి వచ్చింది. (గలతీయులు 6:2) ఇంతకుముందున్న మోషే ధర్మశాస్త్రానికి, ఈ కొత్త నియమానికి ఉన్న తేడా ఏంటంటే, ఇది నియమాల మీద కాదుగానీ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే, ఇందులో కొన్ని సూటైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అందులో ఒకదాన్ని “కొత్త ఆజ్ఞ” అని యేసు అన్నాడు. అక్కడ ఆయన, “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి” అని తన అనుచరులందరికీ చెప్పాడు. (యోహాను 13:34, 35) అవును, నిస్వార్థమైన ప్రేమే ఈ “క్రీస్తు నియమాన్ని” పాటించే వాళ్లందరికీ బండగుర్తు.

న్యాయానికి నిలువెత్తు రూపం

14, 15. తన అధికారం ఎంతవరకో యేసుకు బాగా తెలుసని ఎలా చూపించాడు? అది మనకు ఎందుకు ఊరటనిస్తుంది?

14 యేసు, ప్రేమ గురించి చెప్పి ఊరుకోలేదు. ఆయన ‘క్రీస్తు నియమానికి’ తగ్గట్టు జీవించాడు. అది ఆయన జీవితంలో ఇమిడిపోయింది. న్యాయమంటే ఏంటో యేసు స్పష్టంగా చూపించిన మూడు విధానాల్ని ఇప్పుడు గమనిద్దాం.

15 మొదటిగా, యేసు పొరపాటున కూడా ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. మీరు గమనించే ఉంటారు, అన్యాయాలు ఎప్పుడు ఎక్కువౌతాయి? మనుషులు అహంకారంతో వాళ్లదికాని అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడే కదా. కానీ యేసు ఎప్పుడూ అలా చేయలేదు. ఒకసారి ఒకాయన యేసు దగ్గరికి వచ్చి, “బోధకుడా, మా నాన్న ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సహోదరునికి చెప్పు” అన్నాడు. అప్పుడు యేసు ఏం అన్నాడు? “మీ మీద న్యాయమూర్తిగా గానీ మీకు మధ్యవర్తిగా గానీ నన్ను ఎవరు నియమించారు?” అన్నాడు. (లూకా 12:13, 14) ఎంత బాగా చెప్పాడో కదా! భూమ్మీద ఎవ్వరికీ లేనంత తెలివి, బుద్ధి, దేవుడిచ్చిన అధికారం యేసుకు ఉన్నాయి; కానీ ప్రత్యేకంగా ఆ విషయంలో యెహోవా ఆయనకు అధికారం ఇవ్వలేదు కాబట్టి యేసు అందులో తలదూర్చలేదు. ఇప్పుడేకాదు, యేసు భూమ్మీదికి రాకముందు తన తండ్రితో కలిసి కోటానుకోట్ల సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఇంతే అణకువ చూపించాడు. (యూదా 9) ఏది న్యాయమో ఏది అన్యాయమో యెహోవాయే నిర్ణయిస్తాడని యేసు వినయంగా నమ్మాడు. ఆయనది ఎంత మంచి మనసో దీన్నిబట్టి అర్థమౌతుంది.

16, 17. (ఎ) యేసు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు న్యాయాన్ని ఎలా చూపించాడు? (బి) ఆయన న్యాయంలో కరుణ కొట్టొచ్చినట్టు ఎలా కనిపించింది?

16 రెండోదిగా, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం ద్వారా యేసు న్యాయమంటే ఏంటో చూపించాడు. ఆయన ప్రజలందర్నీ సమానంగా చూశాడు. ఆయన ఉన్నవాళ్లు-లేనివాళ్లు అనే తేడా లేకుండా అన్నిరకాల ప్రజలకు మంచివార్త ప్రకటించడానికి కృషి చేశాడు. కానీ పరిసయ్యులేమో పేదవాళ్లను, సామాన్యుల్ని చిన్నచూపు చూసేవాళ్లు. వాళ్లను అమర్యాదగా ఆమ్‌-హా-రెట్స్‌ అని పిలిచేవాళ్లు, దానికి “మట్టి మనుషులు” అని అర్థం. యేసు ధైర్యంగా ఈ అన్యాయాన్ని సరిచేశాడు. ఎలా అంటే ఆయన వాళ్లకు మంచివార్త చెప్పాడు, అంతెందుకు ఆయన వాళ్లతో కలిసి తిన్నాడు, వాళ్లకు ఆహారం పెట్టాడు, బాగుచేశాడు, ఏకంగా పునరుత్థానం కూడా చేశాడు. అలా “అన్నిరకాల ప్రజలు” రక్షించబడాలని కోరుకునే దేవుని న్యాయాన్ని ఆయన చూపించాడు.c—1 తిమోతి 2:4.

17 మూడోదిగా, యేసు న్యాయంలో కరుణ కొట్టొచ్చినట్టు కనిపించింది. యేసు తనే ఒక అడుగు ముందుకేసి పాపులకు సహాయం చేసేవాడు. (మత్తయి 9:11-13) నిస్సహాయులకు చేయి అందించడానికి పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు. ఉదాహరణకు, అన్యులెవ్వర్నీ నమ్మకూడదని ప్రజలకు నూరిపోస్తున్న మతనాయకులకు యేసు వత్తాసు పలకలేదు. ఆయన వచ్చింది ముఖ్యంగా యూదుల కోసమే అయినా, ఆయన కరిగిపోయి కొంతమంది అన్యులకు కూడా కరుణతో సహాయం చేశాడు, వాళ్లకు బోధించాడు. ఒక రోమా సైనికాధికారి చేయిచాపి సహాయం అడిగినప్పుడు, యేసు అతని సేవకుణ్ణి అద్భుతరీతిలో బాగుచేశాడు. అలాగే ఆ సైనికాధికారిని ఇలా మెచ్చుకున్నాడు: “ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లు ఎవ్వరూ నాకు కనిపించలేదు.”—మత్తయి 8:5-13.

18, 19. (ఎ) యేసు ఆడవాళ్లను ఎలా గౌరవించాడు? (బి) యేసు ఉదాహరణ మనకు ఏ విషయాన్ని చెప్తుంది?

18 అలాగే, ఆడవాళ్ల విషయంలో ఆ కాలంనాటి అభిప్రాయాల్ని యేసు సమర్థించలేదు. బదులుగా, ఏది సరైనదో దాన్నే ధైర్యంగా చేశాడు. అప్పట్లో, సమరయ స్త్రీలను అన్యజనుల్ని చూసినట్టే అపవిత్రమైన వాళ్లుగా చూసేవాళ్లు. అయినా, సుఖారు బావి దగ్గర సమరయ స్త్రీకి ప్రకటించడానికి యేసు వెనకడుగు వేయలేదు. నిజం చెప్పాలంటే, తానే వాగ్దాన మెస్సీయ అని యేసు మొట్టమొదటిసారి సూటిగా చెప్పింది ఆమెకే. (యోహాను 4:6, 25, 26) ఆడవాళ్లకు ధర్మశాస్త్రాన్ని బోధించకూడదని పరిసయ్యులు చెప్పేవాళ్లు, కానీ యేసు వాళ్లకు బోధించడానికి తన సమయాన్ని, శక్తిని ధారపోశాడు. (లూకా 10:38-42) అప్పట్లో ఆడవాళ్లు చెప్పే సాక్ష్యం చెల్లేది కాదు. కానీ పునరుత్థానమైన తనను చూసే బంగారు అవకాశాన్ని యేసు మొదట ఆడవాళ్లకే ఇచ్చాడు, అలా వాళ్లను గౌరవించాడు. అంతేకాదు, ఈ గొప్ప సంఘటన గురించి శిష్యుల్లోని మగవాళ్లకు సాక్ష్యం ఇవ్వమని యేసు వాళ్లకు చెప్పాడు!—మత్తయి 28:1-10.

19 అవును, యేసు న్యాయమంటే ఏంటో దేశాలకు స్పష్టం చేశాడు. చాలా సందర్భాల్లో అది ఆయన ప్రాణాల మీదికి వచ్చింది. అయినా ఆయన న్యాయంగానే ఉన్నాడు. యేసు ఉదాహరణ నుండి మనకు ఒక విషయం అర్థమౌతుంది. న్యాయాన్ని గెలిపించాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే, బైబిలు యేసును “యూదా గోత్రపు సింహం” అని సరిగ్గానే పిలుస్తుంది. (ప్రకటన 5:5) మనం ముందటి అధ్యాయంలో చూసినట్టు సింహం న్యాయానికి, ధైర్యానికి గుర్తుగా ఉంది. యేసు అతిత్వరలో ఇంకా గొప్ప న్యాయాన్ని తెస్తాడు, “భూమ్మీద న్యాయాన్ని” పూర్తిస్థాయిలో స్థాపిస్తాడు.—యెషయా 42:4.

మెస్సీయ రాజు ‘భూమ్మీద న్యాయాన్ని స్థాపిస్తాడు’

20, 21. మన కాలంలో మెస్సీయ రాజు భూమంతటా, అలాగే క్రైస్తవ సంఘంలో న్యాయాన్ని స్థాపించడానికి ఎలా కృషి చేస్తున్నాడు?

20 యేసు 1914 లో మెస్సీయ రాజు అయినప్పటి నుండి, ఆయన భూమ్మీద న్యాయాన్ని స్థాపించడానికి కృషిచేస్తూ ఉన్నాడు. అదెలా? మత్తయి 24:14 లో ఉన్న ప్రవచనం నెరవేరేలా ఆయన చూస్తున్నాడు. భూమ్మీద ఆయన అనుచరులు దేవుని రాజ్యం గురించి అన్నిదేశాల ప్రజలకు చెప్తున్నారు. వాళ్లు కూడా యేసులాగే చిన్న-పెద్ద, ఉన్నవాళ్లు-లేనివాళ్లు, ఆడ-మగ అనే తేడా లేకుండా మనుషులందరికీ న్యాయంగల దేవుడైన యెహోవా గురించి నేర్పిస్తున్నారు.

21 యేసు తాను శిరస్సుగా ఉన్న క్రైస్తవ సంఘంలో కూడా న్యాయాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్నాడు. ప్రవచనం ముందే చెప్పినట్టు, ఆయన “మనుషుల్లో వరాల్ని” ఇచ్చాడు. వాళ్లు ఎవరంటే, సంఘాన్ని ముందుండి నడిపించే నమ్మకమైన క్రైస్తవ పెద్దలు. (ఎఫెసీయులు 4:8-12) వాళ్లు దేవుని అమూల్యమైన గొర్రెల్ని కాస్తున్నప్పుడు, యేసులాగే న్యాయంగా ప్రవర్తిస్తారు. వాళ్లు స్థాయి, పలుకుబడి, డబ్బు పట్టించుకోకుండా దేవుని గొర్రెలందరితో న్యాయంగా ఉండాలన్నదే యేసు కోరిక. వాళ్లు ఆ విషయాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటారు.

22. ఈ రోజుల్లో పెచ్చుపెరిగిపోతున్న అన్యాయాల్ని చూసి యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఆయన తన కుమారుని ద్వారా వాటికి ఎలా ముగింపు పలకబోతున్నాడు?

22 అతిత్వరలో, యేసు తిరుగులేని విధంగా భూమ్మీద న్యాయాన్ని స్థాపించబోతున్నాడు. ఈ అవినీతి లోకంలో అన్యాయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతీ బిడ్డ ఆకలి చావుకు ఒక రకంగా అన్యాయమే కారణం. కొన్ని దేశాలు పిల్లల నోటి దగ్గరిది లాగేసి ఆ సమయాన్ని, డబ్బును జల్సాలకు, ఆయుధాలకు తగలేస్తున్నాయి. ఇలా వేర్వేరు రకాల అన్యాయాల వల్ల, ప్రతీ సంవత్సరం లక్షలమంది అనవసరంగా చనిపోతున్నారు. ఇదంతా చూసి యెహోవాకు న్యాయంగానే కోపం వస్తుంది. అందుకే ఆయన తన కుమారుణ్ణి నియమించి, ఒకేఒక్క యుద్ధంతో ఈ అన్యాయం అంతటికీ ముగింపు పలకబోతున్నాడు.—ప్రకటన 16:14, 16; 19:11-15.

23. హార్‌మెగిద్దోన్‌ తర్వాత, యేసుక్రీస్తు న్యాయాన్ని ఎలా శాశ్వతంగా స్థాపిస్తాడు?

23 అయితే, చెడ్డవాళ్లను నాశనం చేయగానే ఇక న్యాయం స్థాపించేశానని యెహోవా చేతులు దులిపేసుకోడు. బదులుగా, “శాంతికి అధిపతి” అయిన తన కుమారుణ్ణి రాజుగా పరిపాలించడానికి యెహోవా నియమించాడు. హార్‌మెగిద్దోన్‌ యుద్ధం తర్వాత, యేసు భూమంతటా శాంతిని స్థాపిస్తాడు, ‘న్యాయంగా’ పరిపాలిస్తాడు. (యెషయా 9:6, 7) అప్పుడు, ఎన్నో తలనొప్పులకు కారణమైన అన్యాయాలన్నిటినీ ఆయన సంతోషంగా మటుమాయం చేస్తాడు. ఇక ఎప్పటికీ యెహోవాకున్న పరిపూర్ణ న్యాయాన్ని ఆయన చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఇప్పుడే మనందరం యెహోవాలా న్యాయం చూపించడం చాలా ప్రాముఖ్యం. అదెలా చేయవచ్చో చూద్దాం.

a న్యాయమైన కోపం చూపించడంలో, యేసు అచ్చం యెహోవాలా ఉన్నాడు. యెహోవా చెడుతనమంతటి మీద “తన కోపాన్ని చూపించడానికి సిద్ధంగా” ఉంటాడు. (నహూము 1:2) ఉదాహరణకు, తన మొండి ప్రజలు తన ఇంటిని “దోపిడీదొంగల గుహలా” చేసినప్పుడు, ఆయన ఇలా అన్నాడు: “నా కోపం, నా ఉగ్రత ఈ స్థలం మీద కుమ్మరించబడుతుంది.”—యిర్మీయా 7:11, 20.

b మిష్నా ప్రకారం, కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయంలో పావురం ధరలు ఎక్కువైపోయాయని ప్రజలు ధర్నా చేశారు. దాంతో ఆ ధరను వెంటనే 99 శాతం తగ్గించేశారు! అంటే ఆలోచించండి, వాళ్లు ఎంత ఎక్కువ రేటుకు అమ్మేవాళ్లో. ఇంతకీ ఈ లాభసాటి వ్యాపారంలో, డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్లేది? ఆలయంలోని కొట్లు ప్రధానయాజకుడైన అన్న కుటుంబ సభ్యులవి. కాబట్టి ఆ డబ్బంతా వాళ్లకే వెళ్లేదని, అందుకే వాళ్లు అంత ధనవంతులని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు.—యోహాను 18:13.

c పరిసయ్యులు ధర్మశాస్త్రం తెలియని పేదవాళ్లను ‘శపించబడిన వాళ్లుగా’ చూసేవాళ్లు. (యోహాను 7:49) అలాంటివాళ్లకు బోధించకూడదని, వాళ్లతో వ్యాపారం చేయకూడదని, తినకూడదని, కనీసం వాళ్లతో కలిసి ప్రార్థన కూడా చేయకూడదని చెప్పేవాళ్లు. అలాంటివాళ్లకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం కన్నా, ఆమెను క్రూరమృగాలకు వదిలేయడం నయం అనేవాళ్లు. ఇలాంటివాళ్లు పునరుత్థానానికి కూడా పనికిరారని పరిసయ్యులు నమ్మేవాళ్లు.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • కీర్తన 45:1-7 మెస్సీయ రాజు పూర్తిస్థాయిలో న్యాయాన్ని స్థాపిస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

  • మత్తయి 12:19-21 ప్రవచనం చెప్పినట్టు, మెస్సీయ సామాన్య ప్రజలతో ఎలా ఉంటాడు?

  • మత్తయి 18:21-35 నిజమైన న్యాయంలో కరుణ కూడా ఉంటుందని యేసు ఎలా చెప్పాడు?

  • మార్కు 5:25-34 దేవుని న్యాయం ఒక వ్యక్తి పరిస్థితుల్ని కూడా ఆలోచిస్తుందని యేసు ఎలా చూపించాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి