కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 21 పేజీలు 209-218
  • యేసు “దేవుని తెలివిని” వెల్లడిచేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు “దేవుని తెలివిని” వెల్లడిచేశాడు
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన ఏం బోధించాడు?
  • ఆయన ఎలా బోధించాడు?
  • ఆయన ఎలా జీవించి చూపించాడు?
  • “వచ్చి నన్ను వెంబడించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • “క్రీస్తు మనస్సు”ను తెలుసుకోవటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 21 పేజీలు 209-218
ఒక పెద్ద గుంపుకు బోధిస్తున్న యేసు.

అధ్యాయం 21

యేసు “దేవుని తెలివిని” వెల్లడిచేశాడు

1-3. యేసు సొంత ఊరివాళ్లు ఆయన బోధ విని ఏమన్నారు? వాళ్లు ఏ విషయాన్ని గుర్తించలేదు?

ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సమాజమందిరంలో, యువకుడైన యేసు వాళ్ల ముందు నిలబడి బోధిస్తున్నాడు. వాళ్లకు ఆయనేమీ కొత్త కాదు. ఆయన వాళ్ల కళ్లముందు అదే ఊరిలో పెరిగాడు, కొన్ని సంవత్సరాలుగా అక్కడే వడ్రంగిగా పనిచేశాడు. బహుశా వాళ్లలో కొంతమందికి ఇళ్లు కట్టడంలో యేసు సహాయం చేసి ఉంటాడు. ఇంకొంతమంది యేసు స్వయంగా తన చేతులతో చేసిన నాగళ్లను, కాడిని వాళ్ల పొలాల్లో వాడుతూ ఉండవచ్చు.a మరి ఒకప్పటి వడ్రంగి చెప్పే మాటల్ని వాళ్లు ఎలా తీసుకుంటారు?

2 యేసు మాటలు విన్న చాలామంది, ‘ఇతనికి ఈ తెలివి ఎక్కడి నుండి వచ్చింది?’ అని ఆశ్చర్యపోయారు. కానీ వాళ్లు “ఇతను వడ్రంగే కదా? మరియ కుమారుడే కదా?” అని కూడా అన్నారు. (మత్తయి 13:54-58; మార్కు 6:1-3) బాధాకరంగా, యేసు ఊరివాళ్లు ఇలా అనుకున్నారు: ‘ఇతను మనలా మామూలు వడ్రంగే.’ ఆయన మాటల్లో ఎంత తెలివి ఉన్నా, వాళ్లు ఆయన్ని ఒప్పుకోలేదు. ఆ తెలివి ఆయనకు ఎక్కడి నుండి వచ్చిందో వాళ్లు గుర్తించలేదు.

3 ఇంతకీ, యేసుకు ఆ తెలివి ఎక్కడి నుండి వచ్చింది? “నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వ్యక్తిదే” అని యేసు అన్నాడు. (యోహాను 7:16) యేసు “దేవుని తెలివిని . . . వెల్లడిచేశాడు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరింథీయులు 1:30) యెహోవా తెలివి, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ తెలిసింది. ఆయన ఆ లక్షణాన్ని ఎంత బాగా చూపించాడంటే యేసు ఇలా అనగలిగాడు: “నేను, తండ్రి ఒక్కటే.” (యోహాను 10:30) యేసు “దేవుని తెలివిని” చూపించిన మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

ఆయన ఏం బోధించాడు?

4. (ఎ) యేసు దేని గురించి ప్రకటించాడు? అది ఎందుకు చాలా ముఖ్యమైనది? (బి) యేసు ఇచ్చే సలహాలు ఎప్పటికీ పనికొస్తాయని, వాటిని వినేవాళ్లకు మంచి చేస్తాయని ఎందుకు చెప్పవచ్చు?

4 మొదటిగా, యేసు ఏం బోధించాడో చూద్దాం. యేసు “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించాడు. (లూకా 4:43) అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, యెహోవా పేరు పవిత్రపర్చబడి ఆయనే నీతిగల పరిపాలకుడు అని నిరూపించాలన్నా, మనుషులందరూ శాశ్వత ఆశీర్వాదాలు పొందాలన్నా దేవుని రాజ్యం రావాల్సిందే. యేసు బోధల్లో, రోజువారీ ఉపయోగపడే తెలివైన సలహాలు కూడా ఉన్నాయి. బైబిలు ముందే చెప్పినట్టు, ఆయన “అద్భుతమైన సలహాదారుడు” అని నిరూపించుకున్నాడు. (యెషయా 9:6) ఆయన సలహాలు ఎందుకు అద్భుతంగా ఉండేవి? ఎందుకంటే, ఆయనకు దేవుని వాక్యం మీద, దేవుని ఇష్టం మీద పూర్తి అవగాహన ఉంది, మనుషుల స్వభావం మీద మంచి పట్టు ఉంది, ఇంకా మనుషుల మీద గుండెల నిండా ప్రేమ ఉంది. కాబట్టి ఆయన సలహాలు ఎప్పటికీ పనికొస్తాయి, దాన్ని వినేవాళ్లకు మంచి చేస్తాయి. యేసు “శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు” చెప్పాడు. అవును, వాటిని పాటిస్తే అవి శాశ్వత జీవితాన్ని ఇస్తాయి.—యోహాను 6:68.

5. యేసు కొండమీది ప్రసంగంలో ఏ విషయాల గురించి చెప్పాడు?

5 యేసుకున్న సాటిలేని తెలివికి, కొండమీది ప్రసంగం ఒక తిరుగులేని ఉదాహరణ. ఈ ప్రసంగాన్ని మత్తయి 5:3–7:27 వరకు చూస్తాం. ఈ ప్రసంగం ఇవ్వడానికి కేవలం 20 నిమిషాలు పట్టి ఉంటుంది అంతే. కానీ అందులోని సలహాలు కాలంతో కరిగిపోవు. ఆ రోజుల్లో అవి ఎంత ఉపయోగపడేవో, ఈ రోజుల్లో కూడా అంతే ఉపయోగపడతాయి. యేసు, ఆ ప్రసంగంలో మనం ఇతరులతో ఎలా మంచిగా ఉండాలి (5:23-26, 38-42; 7:1-5, 12), పవిత్రంగా ఎలా ఉండాలి (5:27-32), సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలి (6:19-24; 7:24-27) లాంటి చాలా అంశాల గురించి మాట్లాడాడు. అయితే ఆయన తెలివి గురించి చెప్పి ఊరుకోలేదు. బదులుగా దాని ప్రకారం జీవించడం ఎందుకు మంచిదో కారణాలు వివరిస్తూ, ఉదాహరణలు చెప్తూ, రుజువులతో సహా చూపించాడు.

6-8. (ఎ) ఆందోళన పడకుండా ఉండడానికి యేసు ఏ మంచి కారణాల్ని చెప్పాడు? (బి) యేసు ఇచ్చిన సలహాలు పరలోకం నుండి వచ్చిన తెలివికి రుజువు అని ఎలా చెప్పవచ్చు?

6 ఉదాహరణకు, యేసు మన రోజువారీ అవసరాల గురించి ఆందోళన పడొద్దని మత్తయి 6వ అధ్యాయంలో తెలివైన సలహా ఇచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి వేసుకోవాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి.” (25వ వచనం) ఆహారం, బట్టలు మన కనీస అవసరాలు కాబట్టి మనం వాటి గురించి కంగారుపడడం సహజమే. కానీ యేసు అలాంటి వాటి గురించి, “ఆందోళన పడడం మానేయండి” అని చెప్తున్నాడు.b ఎందుకు?

7 మనం ఎందుకు ఆందోళన పడకూడదో యేసు మంచి కారణాలే చెప్పాడు. యెహోవాయే మనకు ప్రాణాన్ని, శరీరాన్ని ఇచ్చాడు. అలాంటప్పుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారాన్ని, ఆ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టల్ని ఆయన ఇవ్వలేడా? (25వ వచనం) పక్షులకు ఆహారాన్ని పెడుతూ, పువ్వులకు అందాన్ని తొడుగుతున్న దేవుడు తన ఆరాధకుల్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో కదా! (26, 28-30 వచనాలు) అవును, అతిగా ఆందోళన పడడంలో ఎలాంటి అర్థంలేదు. దానివల్ల మన ఆయుష్షును ఒక్క మూరైనా పెంచుకోలేం.c (27వ వచనం) మనం ఆందోళన పడకుండా ఎలా ఉండవచ్చు? యేసు ఈ సలహా ఇచ్చాడు: దేవుని ఆరాధనకు మన జీవితంలో మొదటిస్థానం ఇస్తూ ఉండాలి. ఎవరైతే అలా ఇస్తారో, వాళ్లకు అవసరమైన “వాటన్నిటినీ” పరలోక తండ్రి ఇస్తాడని నమ్మకంతో ఉండవచ్చు. (33వ వచనం) చివరికి, యేసు మనకు బాగా ఉపయోగపడే ఈ సలహాను ఇచ్చాడు: ఏ రోజు గురించి ఆరోజే ఆలోచించండి. రేపటి ఆందోళన కూడా తెచ్చి ఈ రోజే వేసుకోవడం ఎందుకు? (34వ వచనం) పైగా మనం అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అని భయపడిన విషయాలు ఎప్పటికీ జరగకపోవచ్చు. వాటి గురించి కంగారు ఎందుకు? ఆ తెలివైన సలహాను పాటించినప్పుడు మనం లేనిపోని తలనొప్పుల్ని, ఒత్తిడిని తప్పించుకోగలుగుతాం.

8 నిజంగా, యేసు ఇచ్చిన సలహా దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఎంత బాగా ఉపయోగపడిందో, ఇప్పటికీ అంతే బాగా ఉపయోగపడుతుంది. పరలోకం నుండి వచ్చిన తెలివికి ఇది ఒక రుజువు కాదా? మనుషులు ఇచ్చే మంచి సలహాలు కూడా పాతవైపోతాయి, మారిపోతాయి, లేదా వాటి స్థానంలో వేరే కొత్తవి వస్తాయి. కానీ యేసు బోధల విషయానికొస్తే, వేల సంవత్సరాలైనా వాటి విలువ తగ్గలేదు. దీంట్లో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఈ అద్భుతమైన సలహాదారుడు ‘దేవుని మాటలే మాట్లాడాడు.’—యోహాను 3:34.

ఆయన ఎలా బోధించాడు?

9. కొంతమంది సైనికులు యేసు బోధ గురించి ఏం చెప్పారు? వాళ్లు ఎక్కువ చేసి చెప్పట్లేదని ఎందుకు చెప్పవచ్చు?

9 రెండోదిగా, యేసు బోధించిన విధానంలో దేవుని తెలివి కనిపిస్తుంది. ఒక సందర్భంలో, కొంతమంది సైనికులు యేసును బంధించడానికి వెళ్లారు. కానీ వాళ్లు వట్టిచేతులతో తిరిగొచ్చి ఇలా అన్నారు: “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు.” (యోహాను 7:45, 46) వాళ్లేమీ ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఇప్పటివరకు జీవించిన మనుషులందరిలో, యేసు మాత్రమే “పై నుండి” వచ్చాడు. కాబట్టి ఆయనకు సముద్రమంత జ్ఞానం, అనుభవం ఉన్నాయి. (యోహాను 8:23) నిజంగా యేసు బోధించినట్టు ఏ మనిషీ బోధించలేదు. ఈ తెలివైన బోధకుడు ఉపయోగించిన పద్ధతుల్లో రెండిటిని ఇప్పుడు చూద్దాం.

“ప్రజలు ఆయన బోధించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయారు”

10, 11. (ఎ) యేసు చెప్పిన ఉదాహరణలు చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోతాం? (బి) యేసు ఉదాహరణలతో పాటు ఇంకా ఏం చెప్పాడు? యేసు చెప్పిన చిన్న కథలు, ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి అనడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

10 యేసు మంచిమంచి ఉదాహరణలు చెప్పాడు. బైబిలు ఇలా చెప్తుంది: “యేసు . . . ఉదాహరణలతో ప్రజలకు బోధించాడు. నిజానికి, ఉదాహరణలు ఉపయోగించకుండా ఆయన వాళ్లతో ఏమీ మాట్లాడలేదు.” (మత్తయి 13:34) వాళ్లు రోజూ చూసేవాటిని ఉపయోగించి, యేసు లోతైన సత్యాల్ని చెప్పాడు. ఆ అద్భుతమైన తెలివిని చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. రైతులు విత్తనాలు నాటడం, ఆడవాళ్లు రొట్టెల కోసం పిండి కలపడం, పిల్లలు సంతలో ఆడుకోవడం, జాలర్లు వల లాగడం, గొర్రెల కాపరులు తప్పిపోయిన గొర్రె కోసం వెతకడం, ఇవన్నీ వాళ్లు రోజూ చూసేవే. లోతైన సత్యాల్ని, బాగా తెలిసిన విషయాలతో ముడిపెట్టి చెప్తే అవి వెంటనే అర్థమౌతాయి, బాగా గుర్తుండిపోతాయి.—మత్తయి 11:16-19; 13:3-8, 33, 47-50; 18:12-14.

11 నైతిక లేదా ఆధ్యాత్మిక సత్యాల్ని చెప్పడానికి యేసు చాలావరకు చిన్నచిన్న కథల్ని వాడాడు. చిన్నచిన్న కథలు తేలిగ్గా అర్థమౌతాయి, గుర్తుండిపోతాయి. అందుకే యేసు చెప్పిన కథలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. చాలా కథల్లో, యెహోవా గురించి చెప్తున్నప్పుడు యేసు మంచిమంచి పోలికల్ని ఉపయోగించాడు. వాటిని ఎవ్వరూ మర్చిపోలేరు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడి కథను, అలాగే ఆ కథలోని పాఠాన్ని ఎవరైనా మర్చిపోగలరా? ఒక వ్యక్తి తప్పుచేసి బయటికి వెళ్లిపోయినా, అతను నిజమైన పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా కనికరంతో అతన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు.—లూకా 15:11-32.

12. (ఎ) యేసు బోధిస్తున్నప్పుడు ప్రశ్నల్ని ఎలా ఉపయోగించాడు? (బి) యేసు తన అధికారాన్ని ప్రశ్నించిన వాళ్ల నోళ్లను ఎలా మూయించాడు?

12 యేసు తెలివిగా ప్రశ్నలు ఉపయోగించాడు. ప్రజలు సొంతగా ఒక ముగింపుకు రావడానికి, వాళ్ల ఉద్దేశాల్ని గమనించుకోవడానికి, లేదా వాళ్లు ఒక నిర్ణయం తీసుకోవడానికి యేసు ప్రశ్నల్ని ఉపయోగించాడు. (మత్తయి 12:24-30; 17:24-27; 22:41-46) మతనాయకులు వచ్చి, “ఈ అధికారం నీకు ఎవరిచ్చారు?” అని అడిగినప్పుడు, యేసు ఇలా అన్నాడు: “బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా, మనుషులా?” ఆ ప్రశ్నకు ఖంగుతిని వాళ్లల్లో వాళ్లు ఇలా మాట్లాడుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు. పోనీ తెగించి, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్పేద్దామా? అయితే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని ప్రజలంతా నమ్మారు కాబట్టి వాళ్లు ప్రజలకు భయపడ్డారు.” చివరికి వాళ్లు యేసుతో, “మాకు తెలీదు” అని చెప్పారు. (మార్కు 11:27-33; మత్తయి 21:23-27) చూశారా? యేసు ఒక చిన్ని ప్రశ్నతో వాళ్ల నోళ్లు మూయించాడు, వాళ్ల హృదయాల్లో గూడు కట్టుకున్న మోసాన్ని బయటపెట్టాడు.

13-15. పొరుగువాడైన సమరయుని కథలో యేసు తెలివి ఎలా కనిపిస్తుంది?

13 యేసు కొన్నిసార్లు ఈ రెండు పద్ధతుల్ని కలిపి వాడాడు. అంటే ఉదాహరణలు చెప్తూనే, అందులో ఆలోచనల్ని తట్టిలేపే ప్రశ్నలు కూడా వేశాడు. ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక యూదుడు యేసు దగ్గరికి వచ్చి, శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాణ్ణి ప్రేమించాలి అని మోషే ధర్మశాస్త్రంలో ఉన్న రెండు ఆజ్ఞల్ని చెప్పాడు. అయితే, తను నీతిమంతుడిని అని చూపించుకోవడానికి అతను, “ఇంతకీ నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు. యేసు దానికి జవాబుగా ఒక కథ చెప్పాడు. ఒక యూదుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు అతన్ని కొట్టి, కొనప్రాణంతో వదిలేసి వెళ్లిపోయారు. అయితే అటువైపుగా ఇద్దరు యూదులు అంటే మొదట ఒక యాజకుడు, తర్వాత ఒక లేవీయుడు వచ్చారు. ఆ ఇద్దరూ అతన్ని చూసీచూడనట్టు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత ఒక సమరయుడు అటువైపు వచ్చాడు. పడిపోయిన అతన్ని చూసి జాలిపడి, మృదువుగా అతని దెబ్బలకు కట్టుకట్టాడు. అతన్ని ప్రేమగా మోసుకెళ్లి, అతను బాగయ్యేంత వరకు ఒక సత్రంలో ఉంచాడు. ఈ కథ చివర్లో యేసు, తనను ప్రశ్న అడిగిన వ్యక్తిని “దొంగల చేతుల్లో పడిన వ్యక్తికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అయ్యాడని నీకు అనిపిస్తుంది?” అని అడిగాడు. దానికి, అతను “కరుణ చూపించిన వ్యక్తే” అని చెప్పక తప్పలేదు.—లూకా 10:25-37.

14 ఆ కథలో యేసు తెలివి ఎలా కనిపిస్తుంది? యేసు రోజుల్లో యూదులు, తమ ఆచారాల్ని పాటించేవాళ్లు మాత్రమే “పొరుగువాళ్లు” అనుకునేవాళ్లు. వాళ్ల దృష్టిలో, సమరయులు అసలు పొరుగువాళ్లు కానేకాదు. (యోహాను 4:9) ఒకవేళ యేసు, సమరయుడికే దెబ్బలు తగిలినట్టు, యూదుడే వచ్చి సహాయం చేసినట్టు కథ చెప్పివుంటే, వాళ్లలో ఉన్న ఆ పక్షపాతం పోయేదా? అందుకే, యేసు చాలా తెలివిగా సమరయుడే యూదుడికి ప్రేమతో సహాయం చేసినట్టు కథ అల్లాడు. కథ చివర్లో యేసు అడిగిన ప్రశ్న కూడా గమనించండి. ఆయన “పొరుగువాడు” అనే పదాన్ని ఒక కొత్త కోణంలో చూపించాడు. ధర్మశాస్త్రంలో ఆరితేరిన వ్యక్తి ఒకరకంగా ఇలా అడిగాడు: ‘నా ప్రేమను పొందే అర్హత ఉన్న పొరుగువాడు ఎవడు?’ కానీ యేసు ఇలా అడిగాడు: “ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అయ్యాడని నీకు అనిపిస్తుంది?” యేసు, సహాయం పొందిన వ్యక్తి మీద కాదు గానీ, సహాయం చేసిన ఆ సమరయుడి మీద దృష్టిపెట్టాడు. నిజమైన పొరుగువాడు ఎవరంటే, ఎదుటి వ్యక్తి నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రేమ చూపించడానికి ముందడుగు వేసేవాడే. ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి పద్ధతి ఉండదు.

15 ప్రజలు యేసు “బోధించిన తీరును చూసి” ఎందుకు ఆశ్చర్యపోయారో, ఆయనకు ఎందుకు దగ్గరయ్యారో మనకు అర్థమౌతుంది కదా. (మత్తయి 7:28, 29) ఒకసారైతే, “చాలామంది ప్రజలు” తినడానికి కూడా వెళ్లకుండా మూడురోజుల పాటు యేసు దగ్గరే ఉండిపోయారు!—మార్కు 8:1, 2.

ఆయన ఎలా జీవించి చూపించాడు?

16. దేవుని తెలివితో నడుస్తున్నానని యేసు ఎలా ‘చూపించాడు’?

16 మూడోదిగా, యేసు జీవించిన విధానంలో యెహోవా తెలివి కనిపిస్తుంది. తెలివి మనసులో ఉండేది కాదు, అది బయటికి పనుల్లో కనిపిస్తుంది. శిష్యుడైన యాకోబు ఇలా అడిగాడు: “మీలో తెలివి . . . ఉన్నవాళ్లు ఎవరు?” తర్వాత ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం ఇస్తూ, ‘వాళ్లు తమ మంచి ప్రవర్తన ద్వారా దాన్ని చూపించాలి’ అన్నాడు. (యాకోబు 3:13) యేసు తన ప్రవర్తన ద్వారా దేవుని తెలివితో నడుస్తున్నానని ‘చూపించాడు.’ యేసు తన జీవన విధానంలో, ఇతరులతో ప్రవర్తించే తీరులో ఈ తెలివిని ఎలా చూపించాడో ఇప్పుడు గమనిద్దాం.

17. యేసు తన జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేసుకున్నాడని ఎలా చెప్పవచ్చు?

17 కొంతమంది వివేచన లేకపోవడం వల్ల, అయితే మరీ జల్సాగా బ్రతుకుతారు, లేకపోతే అన్నీ వదిలేసి సన్యాసుల్లా జీవిస్తారు. మీరు అలాంటివాళ్లను చూసేవుంటారు. అవును, సమతుల్యంగా జీవించాలంటే తెలివి అవసరం. యేసుకు దేవుని తెలివి ఉంది కాబట్టి, తన జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేసుకున్నాడు. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్నే తన జీవితంలో ముందు ఉంచాడు. ఆయన మంచివార్త ప్రకటించడంలో చాలా బిజీగా ఉండేవాడు. ఆయన ఇలా అన్నాడు: “అందుకే కదా నేను వచ్చాను.” (మార్కు 1:38) ఆయనకు డబ్బు మీద, వస్తువుల మీద మనసు లేదు. ఆయనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవని తెలుస్తుంది. (మత్తయి 8:20) అలాగని, ఆయన ఒక సన్యాసిలా జీవించలేదు. తన తండ్రి “సంతోషంగల దేవుడు” కాబట్టి యేసు కూడా సంతోషంగా ఉండేవాడు, నలుగురికి సంతోషాన్ని పంచేవాడు. (1 తిమోతి 1:11; 6:15) ఆయన ఒక పెళ్లి విందుకు వెళ్లాడు. సాధారణంగా పెళ్లంటే సంగీతంతో, పాటలతో సందడిగా ఉంటుంది. ఈయన వెళ్లి వాళ్ల సంతోషాన్ని పాడుచేయలేదు కానీ, ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చాడు. ఎందుకంటే, ద్రాక్షారసం ‘మనిషి హృదయాన్ని సంతోషపెడుతుంది.’ (కీర్తన 104:15; యోహాను 2:1-11) ఎవరైనా భోజనానికి పిలిస్తే యేసు వెళ్లేవాడు, చాలాసార్లు అలా వెళ్లినప్పుడు వాళ్లకు బోధించేవాడు కూడా.—లూకా 10:38-42; 14:1-6.

18. శిష్యులతో ప్రవర్తించిన తీరులో యేసుకున్న గొప్ప తెలివి ఎలా కనిపిస్తుంది?

18 మనుషులతో ప్రవర్తించిన తీరులో కూడా యేసుకున్న గొప్ప తెలివి కనిపిస్తుంది. ఆయనకు మనుషుల నైజం తెలుసు కాబట్టి శిష్యుల ఆలోచనల్ని, ఉద్దేశాల్ని బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్లు అపరిపూర్ణులైనా, ఆయన వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని చూశాడు. యెహోవా ఆకర్షించుకున్న వీళ్లు, ముందుముందు ఏమేం సాధించగలరో యేసు ఆలోచించాడు. (యోహాను 6:44) వాళ్లలో లోపాలున్నా, వాళ్లను నమ్మడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆ నమ్మకంతోనే, వాళ్ల భుజాల మీద బరువైన బాధ్యతను పెట్టాడు. వాళ్లకు మంచివార్త ప్రకటించమని చెప్పాడు, అలాగే వాళ్లు ఆ పనిని ఖచ్చితంగా చేయగలరని నమ్మాడు. (మత్తయి 28:19, 20) ఆ శిష్యులు యేసు అప్పగించిన పనిని నమ్మకంగా చేశారని మనం అపొస్తలుల కార్యాలు పుస్తకంలో చదువుతాం. (అపొస్తలుల కార్యాలు 2:41, 42; 4:33; 5:27-32) నిజంగా, యేసు వాళ్లను నమ్మి ఎంత తెలివైన పని చేశాడో కదా.

19. యేసు “సౌమ్యుడిని, వినయస్థుడిని” అని ఎలా చూపించాడు?

19 మనం 20వ అధ్యాయంలో చూసినట్టు, బైబిలు వినయాన్ని అలాగే సౌమ్యతను తెలివితో ముడిపెడుతుంది. నిజమే వినయాన్ని, సౌమ్యతను చూపించడంలో యెహోవా తర్వాతే ఎవరైనా. మరైతే యేసు సంగతేంటి? యేసు తన శిష్యులతో ఎంత వినయంగా ఉన్నాడో తెలిస్తే, మనకు ఆశ్చర్యంతో మాటలు రావు. యేసు పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వాళ్లకంటే ఎక్కువే. కానీ ఆయన ఎప్పుడూ తన శిష్యుల్ని చిన్నచూపు చూడలేదు. వాళ్లు ఆయన కంటే తక్కువని, ఏ పనీ సరిగ్గా చేయలేరని అనిపించేలా ఆయన ప్రవర్తించలేదు. బదులుగా, ఆయన వాళ్ల పరిమితుల్ని అర్థం చేసుకున్నాడు, లోపాల్ని ఓపిగ్గా భరించాడు. (మార్కు 14:34-38; యోహాను 16:12) చిన్నపిల్లలు కూడా యేసు దగ్గరికి రావడం మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ఆయన ‘సౌమ్యుడు, వినయస్థుడు’ అని వాళ్లు గుర్తించారు కాబట్టే, వాళ్లకు ఆయనతో ఉండాలనిపించేది.—మత్తయి 11:29; మార్కు 10:13-16.

20. అన్యురాలైన ఒకామె విషయంలో యేసు ఎలా ఒక మెట్టు దిగాడు?

20 యేసు ఇంకో ముఖ్యమైన విధంగా కూడా యెహోవాలా వినయం చూపించాడు. కరుణ చూపించడానికి కారణం ఉన్నప్పుడు, ఆయన పట్టుబట్టకుండా ఒక మెట్టు దిగడానికి కూడా ఇష్టపడేవాడు. ఈ ఉదాహరణ గుర్తుచేసుకోండి, చెడ్డదూత పట్టడం వల్ల విపరీతంగా బాధపడుతున్న తన కూతుర్ని బాగుచేయమని అన్యురాలైన ఒకామె యేసును బ్రతిమాలింది. కానీ మొదట్లో, యేసు ఆమెకు సహాయం చేయనని మూడు విధాలుగా చెప్పాడు. ఒకటి, యేసు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. రెండు, ఆయన యూదుల కోసమే వచ్చాడు గానీ అన్యజనుల కోసం కాదని సూటిగా చెప్పాడు. మూడు, ఇదే విషయాన్ని ఆయన దయగా, ఉదాహరణ ద్వారా చెప్పాడు. అయినా, ఆమె పట్టువిడవకుండా అడుగుతూనే ఉంది. మరి యేసు ఏం చేశాడు? ఆమెకున్న గొప్ప విశ్వాసం చూసి, యేసు తను ఏదైతే చేయను అని చెప్పాడో సరిగ్గా అదే చేశాడు. ఆమె కూతుర్ని ఆయన బాగుచేశాడు. (మత్తయి 15:21-28) ఎంత వినయమో కదా! గుర్తుంచుకోండి, నిజమైన తెలివి ఉన్నచోటే వినయం పుడుతుంది.

21. మనం ఎందుకు యేసు లక్షణాల్ని, మాటల్ని, పనుల్ని అనుకరించడానికి ప్రయత్నించాలి?

21 ఈ భూమ్మీద జీవించిన వాళ్లందరిలో అత్యంత తెలివైనవాడు యేసే. ఆయన మాటలు, పనులు సువార్త పుస్తకాల్లో ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! గుర్తుంచుకోండి, యేసు తన తండ్రి లక్షణాల్ని వందకు వంద శాతం చూపించాడు. కాబట్టి యేసు లక్షణాల్ని, మాటల్ని, పనుల్ని అనుకరిస్తే, మనం పరలోకం నుండి వచ్చే తెలివిని చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టే. తర్వాతి అధ్యాయంలో, దేవుని తెలివిని మన జీవితంలో ఎలా చూపించవచ్చో చూస్తాం.

a బైబిలు కాలాల్లో ఇళ్లు కట్టడానికి, కుర్చీలు-బల్లలు లాంటివి తయారు చేయడానికి, పొలంలో వాడే పనిముట్లు చేయడానికి వడ్రంగుల్ని పనిలో పెట్టుకునేవాళ్లు. క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన జస్టిన్‌ మార్టిర్‌, యేసు గురించి ఇలా రాశాడు: “ఆయన భూమ్మీద ఉన్నప్పుడు వడ్రంగి పనిచేస్తూ నాగళ్లు, కాడి తయారుచేసేవాడు.”

b “ఆందోళన పడడం” అని అనువదించిన గ్రీకు పదానికి “మనసు పెట్టలేకపోవడం” అనే అర్థం ఉంది. మత్తయి 6:25 లో ఉన్న ఆ పదం, మన సంతోషం ఆవిరైపోయేంతగా, ఇక వేరే దేన్నీ ఆలోచించలేనంతగా కంగారుపడడం గురించి చెప్తుంది.

c నిజానికి అతిగా కంగారుపడడం వల్ల, ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, ఆయుష్షును తగ్గించే వేరే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పరిశోధనలో తెలుసుకున్నారు.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • సామెతలు 8:22-31 తెలివి గురించి ఉన్న ఈ లేఖనాలు, యెహోవా మొట్టమొదటి కుమారుడైన యేసుకు ఎలా సరిగ్గా సరిపోతాయి?

  • మత్తయి 13:10-15 యేసు చెప్పిన ఉదాహరణలు, ప్రజల ఉద్దేశాల్ని ఎలా బయటపెట్టాయి?

  • యోహాను 1:9-18 దేవుని తెలివిని యేసు మాత్రమే ఎందుకు వెల్లడి చేయగలడు?

  • యోహాను 13:2-5, 12-17 యేసు తన అపొస్తలులకు ఏం నేర్పించాడు? ఎలా నేర్పించాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి