అధ్యాయం 23
“దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు”
1-3. చరిత్రలో వేరే ఎవ్వరి మరణం కన్నా, యేసు మరణమే ఎందుకు ప్రత్యేకమైనది?
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం వసంతకాలంలో ఒకరోజు, ఒక అమాయకుడిని విచారణ చేసి, చేయని నేరాలకు శిక్షించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంత అన్యాయంగా, క్రూరంగా ఒకర్ని చంపడం చరిత్రలో ఇదేం మొదటిసారి కాదు. బాధాకరంగా, ఇదే చివరిసారి కూడా కాదు. కానీ ఆయన మరణం వేరేవాళ్ల మరణం కన్నా చాలా ప్రత్యేకమైనది.
2 ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు చాలా వేదనను అనుభవించాడు. అప్పుడు ఆకాశంలో ఒక వింత జరిగింది. అది మధ్యాహ్నమే, కానీ ఉన్నట్టుండి ఏదో రాత్రి అయినట్టు చిమ్మచీకటి కమ్ముకుంది. ఒక చరిత్రకారుడు చెప్తున్నట్టు, “సూర్యకాంతి లేకుండా పోయింది.” (లూకా 23:44, 45) ఆయన చివరి శ్వాస విడిచేముందు, చరిత్రలో నిలిచిపోయే ఈ మాటలు అన్నాడు: “అంతా పూర్తయింది!” అవును, ఆయన అలా చనిపోవడం వల్ల ఒక మంచి పని పూర్తయింది. ఆయన తన ప్రాణాన్ని అర్పించి గొప్ప ప్రేమను చాటాడు. ఇంతవరకూ ఏ మనిషీ చేయని పెద్ద త్యాగం అది!—యోహాను 15:13; 19:30.
3 ఆయన ఎవరో కాదు యేసు. క్రీస్తు శకం 33 నీసాను 14న, యేసు ఎంత బాధపడి చనిపోయాడో చాలామందికి తెలుసు. కానీ, అది చూసి ఇంకొకరు యేసు కన్నా ఎక్కువ విలవిలలాడారనే ముఖ్యమైన విషయం వాళ్లకు తెలీదు. నిజానికి, ఆయన యేసు కన్నా గొప్ప త్యాగం చేశాడు. విశ్వంలో ఎవ్వరూ చేయలేని ఒక గొప్ప పనిని చేసి ఆయన తన ప్రేమను చాటాడు. ఇంతకీ ఆ పనేంటి? ఈ ప్రశ్నకు సమాధానం, యెహోవాకున్న లక్షణాలన్నిటిలో ముఖ్యమైనదాన్ని మనకు పరిచయం చేస్తుంది: అదే ప్రేమ.
అవధుల్లేని ప్రేమ చూపించారు
4. యేసు అలాంటి ఇలాంటి మనిషి కాదని రోమా సైనికాధికారికి ఎలా తెలిసొచ్చింది? ఆయన చివరికి ఏం ఒప్పుకున్నాడు?
4 యేసును చంపేస్తున్నప్పుడు అక్కడ అంతా చూసుకుంటున్న రోమా సైనికాధికారి, చిమ్మచీకటి కమ్ముకోవడాన్ని, తర్వాత ఒక పెద్ద భూకంపం రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇలా అన్నాడు: “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే.” (మత్తయి 27:54) అవును, యేసు అలాంటి ఇలాంటి మనిషి కాదు. ఆయన సర్వోన్నత దేవుని ఒక్కగానొక్క కుమారుడు! అలాంటి ఆయన్ని చంపడంలో ఈ సైనికాధికారి చేయి వేశాడు. ఇంతకీ ఈ కుమారుడంటే తండ్రికి ఎంత ఇష్టం ఉండేది?
5. యెహోవా, ఆయన కుమారుడు పరలోకంలో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారో అర్థం చేసుకోవడానికి ఏ ఉదాహరణ సహాయం చేస్తుంది?
5 యేసు “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 1:15) అంటే ఒక్కసారి ఆలోచించండి, యెహోవా కుమారుడు ఈ విశ్వం పుట్టకముందు నుండీ ఉన్నాడు. ఆ తండ్రీ కొడుకులు ఎంతకాలంగా కలిసి ఉన్నారు? కొంతమంది సైంటిస్టులు, ఈ విశ్వం పుట్టి 13 వందల కోట్ల సంవత్సరాలు అయిందని అంచనా వేస్తున్నారు. కనీసం ఆ సమయాన్ని ఊహించనైనా ఊహించుకోగలమా? ఈ విషయం మనకు అర్థం అవ్వడానికి సైంటిస్టులు ఒక నక్షత్రశాలలో 110 మీటర్ల పొడవాటి గీతను గీశారు. అక్కడికి వచ్చిన వాళ్లందరూ ఆ గీత మీద నడుస్తున్నప్పుడు, వాళ్లు వేసే ఒక్కో అడుగు విశ్వం వయసులో దాదాపు 7 కోట్ల 50 లక్షల సంవత్సరాలతో సమానం. ఆ గీత చివర్లో వెంట్రుక మందం అంత సన్నని గీటు ఉంది. ఆ చిన్న గీటు, మొత్తం మనుషుల చరిత్రతో సమానం! సైంటిస్టుల అంచనా కరెక్టే అనుకున్నా కూడా, యెహోవా కుమారుడు ఎంతకాలం నుండి ఉన్నాడో చెప్పడానికి ఆ మొత్తం గీత కూడా సరిపోదు! అన్ని సంవత్సరాలు ఆయన ఏం చేశాడు?
6. (ఎ) యేసు భూమ్మీదికి రాకముందు పరలోకంలో ఏం చేస్తూ ఉన్నాడు? (బి) యెహోవాకు, ఆయన కుమారుడికి ఎలాంటి అనుబంధం ఉంది?
6 ఆ కుమారుడు చాలా సంతోషంగా, తన తండ్రి పక్కన “ప్రధానశిల్పిగా” పనిచేశాడు. (సామెతలు 8:30) బైబిలు ఇలా చెప్తుంది: “[కుమారుడు] లేకుండా ఏదీ సృష్టించబడలేదు.” (యోహాను 1:3) కాబట్టి యెహోవా, ఆయన కుమారుడు కలిసి మిగతా వాటన్నిటినీ సృష్టించారు. అలా కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ల మధ్య ఎన్ని తియ్యటి జ్ఞాపకాలు, కమ్మటి అనుభూతులు ఉండి ఉంటాయో కదా! కన్నవాళ్లకు, పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ కన్నా మించింది లేదని చాలామంది ఒప్పుకుంటారు. పైగా, “ప్రేమ పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది.” (కొలొస్సయులు 3:14) అలాంటప్పుడు లెక్కపెట్టలేనన్ని సంవత్సరాలు అల్లుకున్న బంధం, ఇంకెంత గట్టిగా ఉంటుందో కదా! అది మనం ఊహించలేం కూడా. అవును యెహోవాకు, ఆయన కుమారుడికి మధ్య విడదీయరాని బంధం ఉంది.
7. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, యెహోవా మురిసిపోతూ ఏమన్నాడు?
7 అయినప్పటికీ, తన కుమారుడు ఒక శిశువుగా పుట్టేలా యెహోవా ఆయన్ని భూమ్మీదికి పంపించాడు. ఇన్నేళ్లు పక్కనే ఉన్న తన ముద్దుల కొడుకు, కొన్ని పదుల సంవత్సరాల పాటు తనకు దూరంగా ఉంటాడని తెలిసినా యెహోవా అలా పంపించాడు. యేసు ఒక పరిపూర్ణ మనిషిగా పెరిగి పెద్దవ్వడం, యెహోవా పరలోకం నుండి చాలా ఆసక్తితో చూశాడు. దాదాపు 30 ఏళ్లు వచ్చినప్పుడు యేసు బాప్తిస్మం తీసుకున్నాడు. అప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది? యెహోవాయే స్వయంగా పరలోకం నుండి ఇలా అన్నాడు: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” (మత్తయి 3:17) యేసు ప్రవచనాల్లో ఉన్నదున్నట్టు చేయడం, తను చెప్పిన ప్రతీది తూ.చ. తప్పకుండా పాటించడం చూసి ఆ తండ్రి ఎంత మురిసిపోయి ఉంటాడో కదా!—యోహాను 5:36; 17:4.
8, 9. (ఎ) క్రీస్తు శకం 33 నీసాను 14న, యేసు ఏమేం అనుభవించాడు? అది చూసి ఆయన పరలోక తండ్రికి ఎలా అనిపించింది? (బి) తన కుమారుడు బాధలుపడి చనిపోవడానికి యెహోవా ఎందుకు ఒప్పుకున్నాడు?
8 మరి, క్రీస్తు శకం 33 నీసాను 14న యెహోవాకు ఎలా అనిపించింది? నమ్మిన స్నేహితుడే యేసును పట్టించినప్పుడు, రాత్రిపూట ఒక పెద్ద గుంపు ఆయన్ని అరెస్టు చేసినప్పుడు యెహోవాకు ఎలా అనిపించి ఉంటుంది? స్నేహితులు ఆయన్ని వదిలేసినప్పుడు, అన్యాయంగా ఆయన్ని విచారణ చేసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, ఉమ్ము ఊసినప్పుడు, పిడికిళ్లతో గుద్దినప్పుడు, కొరడాలతో ఆయన వీపును చీల్చేసినప్పుడు యెహోవాకు ఎలా అనిపించి ఉంటుంది? ఆయన చేతులకు-కాళ్లకు మేకులు దిగగొట్టి చెక్క కొయ్యకు వేలాడదీసినప్పుడు, అది చూసి ప్రజలు ఆయన్ని ఎగతాళి చేసినప్పుడు, తన ముద్దుల కొడుకు నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపించి ఉంటుంది? యేసు తన చివరి శ్వాస తీసుకున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపించి ఉంటుంది? ఈ సృష్టిలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగనిది ఒకటి మొట్టమొదటిసారి జరగబోతుంది: యేసు ఇక ఉండడు. తన ప్రాణానికి ప్రాణమైన కుమారుడు ఇక లేడు అనే చేదు నిజాన్ని యెహోవా ఎలా దిగమింగుకుంటాడు?—మత్తయి 26:14-16, 46, 47, 56, 59, 67; 27:38-44, 46; యోహాను 19:1.
9 ఆ బాధను అక్షరాలతో వర్ణించలేం. యెహోవాకు ఫీలింగ్స్ ఉన్నాయి, కాబట్టి తన కుమారుడు చనిపోయినప్పుడు ఆయన ఎంత విలవిలలాడి ఉంటాడో మనం మాటల్లో చెప్పలేం. ఆయన బాధ ఎంత అంటే చెప్పలేం గానీ, ఎందుకు అంటే మాత్రం చెప్పగలం. ఇంతకీ, ఆయన అంత బాధను ఎందుకు భరించాడు? దానికి చక్కటి సమాధానం, యోహాను 3:16 లో ఉంది. ఇది ఎంత ముఖ్యమైనదంటే, మొత్తం సువార్త పుస్తకాల్ని కాచి వడపోస్తే ఈ లేఖనం! అక్కడ ఇలా ఉంది: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” కాబట్టి యెహోవా అంత బాధను దిగమింగుకోవడానికి కారణం, ప్రేమే. యెహోవా యేసును మనకు ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆయన్ని పంపించి బాధలుపడి చనిపోయేలా చేయడం ద్వారా, యెహోవా మన మీదున్న అవధుల్లేని ప్రేమను చూపించాడు.
“దేవుడు … తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు”
దేవుని ప్రేమంటే . . .
10. ప్రజలు ఏం లేకపోతే బ్రతకలేరు? “ప్రేమ” అనే పదాన్ని అతిగా వాడడం వల్ల ఏమైంది?
10 ఇంతకీ “ప్రేమ” అంటే ఏంటి? మనుషులకు ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటే చాలని చాలామంది అంటారు. వాళ్లు ఉయ్యాలలో పడిన క్షణం నుండి సమాధికి వెళ్లే రోజు వరకు, అనుక్షణం ప్రేమ కోసం తపిస్తారు, ఆ ప్రేమ నీడలో బ్రతకాలనుకుంటారు, అది లేకపోతే బెంగతో చనిపోతారు. అయినప్పటికీ, దాని అర్థాన్ని మాటల్లో చెప్పడం కష్టం. నిజమే, ప్రజలు ప్రేమ గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ మీద లెక్కలేనన్ని పుస్తకాలు, పాటలు, కవితలు ఉన్నాయి. కానీ, అవేవీ దాని అర్థాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాయి. పైగా ఆ పదాన్ని దేనికి పడితే దానికి వాడడం వల్ల, ప్రేమకు ఉన్న అసలు అర్థమే మరుగున పడిపోయింది.
11, 12. (ఎ) ప్రేమ గురించి మనం ఎక్కడ ఎక్కువగా నేర్చుకోవచ్చు? ఎందుకు? (బి) పాత గ్రీకు భాషలో “ప్రేమ” గురించి చెప్పడానికి ఏ నాలుగు పదాలు వాడేవాళ్లు? ఆ నాలుగిటిలో, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఎక్కువగా వాడిన పదం ఏంటి? (అధస్సూచి కూడా చూడండి.) (సి) బైబిల్లో అగాపే అంటే ఏంటి?
11 కానీ, బైబిలు ప్రేమకున్న అసలైన అర్థాన్ని చెప్తుంది. వైన్స్ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ ఇలా చెప్తుంది: “ప్రేమ, అది చేయించే పనుల్లో మాత్రమే కనిపిస్తుంది.” బైబిల్లో ఉన్న యెహోవా పనులు మనుషుల మీద ఆయనకున్న ప్రేమ, అనురాగం గురించి మనకు చాలానే చెప్తాయి. ఉదాహరణకు, యెహోవా ప్రేమతో చేసిన ఒక గొప్ప పని గురించి పైన చూశాం కదా. ప్రేమ గురించి చెప్పడానికి దానికి మించి ఏదైనా ఉంటుందా? యెహోవా తన ప్రేమను చాటిన ఇంకా చాలా ఉదాహరణల్ని తర్వాతి అధ్యాయాల్లో చూస్తాం. బైబిల్లో “ప్రేమ” అని అనువదించిన పదాల్ని పరిశీలిస్తే కూడా ప్రేమ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. పాత గ్రీకు భాషలో “ప్రేమ” గురించి చెప్పడానికి నాలుగు పదాలు ఉపయోగించేవాళ్లు.a వాటిలో, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఎక్కువగా వాడిన పదం అగాపే. ఒక బైబిలు డిక్షనరీ ఇలా చెప్తుంది: “ప్రేమను వర్ణించడానికి ఇంతకన్నా శక్తివంతమైన పదాన్ని మనం ఊహించలేం.” ఎందుకు?
12 బైబిల్లో ఉపయోగించిన అగాపే, తరచూ ఏది మంచి అనే సూత్రాన్ని బట్టి నడుస్తుంది. కాబట్టి ఇది కేవలం అవతలి వ్యక్తిని బట్టి హృదయంలో పుట్టే ఫీలింగ్ కాదు. బదులుగా అందరి మీద చూపించే ప్రేమ, అలాగే మనకు సహజంగా ప్రేమ కలగకపోయినా సరే, తెచ్చుకుని మరీ చూపించే ప్రేమ. అన్నిటికి మించి, ఇది బొత్తిగా స్వార్థమే లేని ప్రేమ. ఉదాహరణకు, యోహాను 3:16 మళ్లీ ఒకసారి చూడండి. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేంతగా ప్రేమించింది ఎవరిని? లోకాన్ని. ఎవరైతే విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందగలరో ఆ మనుషులే ఈ లోకం. వాళ్లలో, ఇప్పటికీ చెడ్డపనులు చేస్తున్న చాలామంది ఉన్నారు. అయితే, యెహోవా వాళ్లలో ప్రతీఒక్కర్ని నమ్మకమైన అబ్రాహామును ప్రేమించినట్టే ప్రేమించి, తన దగ్గరి స్నేహితుడిగా చూస్తాడా? (యాకోబు 2:23) లేదు, కానీ యెహోవా ప్రేమతో అందరి మీద మంచితనం చూపిస్తాడు. కొన్నిసార్లు అది ఆయనకు నష్టం కలిగించినా అలా చేస్తాడు. ప్రతీఒక్కరు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (2 పేతురు 3:9) ఇప్పటికే చాలామంది అలా చేస్తున్నారు కూడా. అలాంటి వాళ్లను ఆయన సంతోషంతో స్నేహితులుగా చేసుకుంటాడు.
13, 14. క్రైస్తవ ప్రేమలో తియ్యటి అనురాగం కూడా ఉంటుందని మనకెలా తెలుసు?
13 కానీ, కొంతమంది బైబిల్లో ఉన్న అగాపేని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా చప్పగా ఉంటుందని వాళ్లు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే, క్రైస్తవ ప్రేమలో చాలావరకు ఒక తియ్యటి అనురాగం ఉంటుంది. ఉదాహరణకు, “తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు” అని యోహాను రాసినప్పుడు, అగాపే అనే పదాన్ని ఉపయోగించాడు. మరి ఆ ప్రేమలో అనురాగం ఉంటుందా, ఉండదా? “తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు” అని యేసు చెప్పినప్పుడు ఫిలియో అనే పదాన్ని ఉపయోగించాడు. (యోహాను 3:35; 5:20) అవును, యెహోవా ప్రేమలో చాలావరకు తియ్యటి అనురాగం ఉంటుంది. అయితే, ఆయన కేవలం ఫీలింగ్స్‌ని బట్టి గుడ్డిగా ప్రేమ చూపించడు గానీ ఎప్పుడూ తెలివైన, న్యాయమైన తన సూత్రాలకు తగ్గట్టు ప్రేమ చూపిస్తాడు.
14 మనం ఇప్పటివరకు చూసినట్టు యెహోవాకున్న లక్షణాలన్నీ అద్భుతమైనవే, ఆకట్టుకునేవే. కానీ వాటిలో మనల్ని బాగా ఆకట్టుకునేది మాత్రం ప్రేమే. అది అయస్కాంతంలా మనల్ని ఆయన వైపుకు లాగుతుంది. సంతోషకరంగా, అదే ఆయన ముఖ్యమైన లక్షణం కూడా. అది మనకెలా తెలుసు?
“దేవుడు ప్రేమ”
15. యెహోవా ప్రేమ గురించి బైబిలు ఏం చెప్తుంది? అది ఎందుకు ప్రత్యేకమైనది? (అధస్సూచి కూడా చూడండి.)
15 బైబిలు యెహోవాకున్న మిగతా మూడు లక్షణాల గురించి చెప్పని ఒక విషయాన్ని, ఆయన ప్రేమ గురించి చెప్తుంది. దేవుడు శక్తి అని గానీ, దేవుడు న్యాయం అని గానీ, కనీసం దేవుడు తెలివి అని కూడా బైబిలు చెప్పట్లేదు. ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. వాటన్నిటికీ మూలం ఆయనే. అవి చూపించడంలో ఆయనకు సాటి, పోటీ ఎవ్వరూ లేరు. కానీ ఆయన నాలుగో లక్షణం గురించి మాత్రం బైబిలు ఇంకాస్త ఎక్కువే చెప్తుంది: “దేవుడు ప్రేమ.”b (1 యోహాను 4:8) దాని అర్థమేంటి?
16-18. (ఎ) “దేవుడు ప్రేమ” అని బైబిలు ఎందుకు చెప్తుంది? (బి) భూమ్మీద ఇన్ని ప్రాణులు ఉండగా, దేవుడు ప్రేమకు గుర్తుగా మనిషినే ఎందుకు వాడాడు?
16 “దేవుడు ప్రేమ.” ప్రేమంటే దేవుడు, దేవుడంటే ప్రేమ అని దానర్థం కాదు. దేవుడు కేవలం ఒక లక్షణంతో సమానం కాదు. ఆయన ప్రేమతో పాటు ఇంకా ఎన్నో గుణాలు, ఫీలింగ్స్ కలగలసిన వ్యక్తి. అయితే ఆయనలో అణువణువునా ప్రవహించేది ప్రేమే. ఒక రెఫరెన్సు పుస్తకం ఈ వచనం గురించి ఇలా చెప్తుంది: “దేవుని సారం లేదా నైజం ప్రేమ.” దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇలా అనుకోవచ్చు: దేవుడు ఏదైనా పని చేయడానికి ఆయనకు బలాన్నిచ్చేది శక్తి అయితే, ఆ పని ఎలా చేయాలో చెప్పేది ఆయన న్యాయం, తెలివి. కానీ అసలు ఆ పని చేసేలా ఆయన్ని కదిలించేది మాత్రం ప్రేమే. దేవుడు వేరే ఏ లక్షణం చూపించినా, అందులో ఖచ్చితంగా ప్రేమ ఉండి తీరుతుంది.
17 యెహోవా ప్రేమకు నిలువెత్తు రూపం అని మనం తరచూ అంటుంటాం. కాబట్టి ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే, మనం ఆయన గురించి నేర్చుకోవాలి. నిజమే, ఈ అందమైన లక్షణం యెహోవాలోనే కాదు మనుషులుగా మనలో కూడా ఉంది. ఇంతకీ అది మనలో ఎందుకుంది? సృష్టిని చేస్తున్నప్పుడు యెహోవా తన కుమారుడితో ఇలా అన్నాడు: “మన స్వరూపంలో, మనలా మనిషిని తయారుచేద్దాం.” (ఆదికాండం 1:26) ఈ భూమి మొత్తంలో, కేవలం మనుషులు మాత్రమే ప్రేమను చూపించగలరు, వాళ్ల పరలోక తండ్రిలా ఉండగలరు. గుర్తుచేసుకోండి, యెహోవా తన ముఖ్యమైన లక్షణాలకు గుర్తుగా కొన్ని జంతువుల్ని వాడాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమకి గుర్తుగా మాత్రం, భూమ్మీది ప్రాణుల్లో ఎంతో ఉన్నతమైన మనిషిని వాడాడు.—యెహెజ్కేలు 1:10.
18 మనం ఏ స్వార్థం లేకుండా సూత్రాల ఆధారంగా ప్రేమ చూపిస్తే, యెహోవాకున్న ముఖ్యమైన లక్షణాన్ని చూపిస్తున్నట్టే. అప్పుడు అచ్చం అపొస్తలుడైన యోహాను రాసినట్టే ఉంటుంది: “దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.” (1 యోహాను 4:19) ఇంతకీ యెహోవా మనల్ని మొదట ఎలా ప్రేమించాడు?
ప్రేమను పరిచయం చేసిందే యెహోవా
19. సృష్టిని చేయడానికి యెహోవాను కదిలించింది ప్రేమే అని ఎందుకు చెప్పవచ్చు?
19 ప్రేమ ఈనాటిది కాదు. సృష్టిని చేసేలా యెహోవాను కదిలించింది ప్రేమే. యెహోవా ఏదో ఒంటరిగా ఉన్నాడని, ఆయనకేదో తోడు కావాలని సృష్టిని చేయలేదు. ఆయన ఒక్కడే ఉండగలడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి వేరేవాళ్లు ఆయనకు తెచ్చిపెట్టేది ఏమీ లేదు. కానీ ప్రేమ ఎలాంటి లక్షణం అంటే, అది ఒక వ్యక్తికి ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకునేలా కదిలిస్తుంది. అలాగే యెహోవా కూడా ప్రేమతోనే మనుషులతో, దేవదూతలతో జీవాన్ని పంచుకోవాలనుకున్నాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు “దేవుని మొట్టమొదటి సృష్టి” అయ్యాడు. (ప్రకటన 3:14) యెహోవా ఆయన్ని ప్రధానశిల్పిగా ఉపయోగించుకుని ముందుగా దేవదూతల్ని, తర్వాత మిగతా వాటన్నిటినీ తయారుచేశాడు. (యోబు 38:4, 7; కొలొస్సయులు 1:16) యెహోవా ఈ శక్తివంతమైన దేవదూతలకు స్వేచ్ఛ, ఫీలింగ్స్, తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి, వాళ్లు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపిస్తూ స్నేహితులు అవ్వగలరు, అంతకన్నా ముఖ్యంగా యెహోవాకు దగ్గరవ్వగలరు. (2 కొరింథీయులు 3:17) అలా, దేవుడే వాళ్లను మొదట ప్రేమించాడు కాబట్టి వాళ్లు ఆయన్ని ప్రేమించారు.
20, 21. ఆదాముహవ్వలు యెహోవా ప్రేమలో ఎలా తడిసి ముద్దయ్యారు? అయినా వాళ్లు ఏం చేశారు?
20 మనుషుల విషయం కూడా అంతే. మొదటి నుండి ఆదాముహవ్వలు యెహోవా ప్రేమలో తడిసి ముద్దయ్యారు. వాళ్ల ఇల్లు అయిన ఏదెను తోటలో ఎటు చూసినా తండ్రి ప్రేమే కనిపించేది. బైబిలు ఏం చెప్తుందో గమనించండి: “యెహోవా దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తాను తయారుచేసిన మనిషిని అక్కడ ఉంచాడు.” (ఆదికాండం 2:8) మీరు ఎప్పుడైనా అందమైన తోటకు గానీ, పార్కుకి గానీ వెళ్లారా? అక్కడ మీకు ఏది బాగా నచ్చింది? ఆకుల చాటున దాగుడుమూతలు ఆడుతున్న సూర్యుడా? రకరకాల రంగులు అద్దుకున్న పువ్వులా? దూరం నుంచి వినిపిస్తున్న సెలయేర్ల గలగలలు, పక్షుల కిలకిలరావాలు, బుల్లి ప్రాణుల కిచకిచలా? చెట్లు, పండ్లు, పువ్వులు వెదజల్లే కమ్మటి సువాసనలా? మీ సమాధానం ఏదైనా, ఇప్పుడున్న ఏ పార్కూ ఏదెను తోట అందంతో పోటీపడలేదు. ఎందుకు?
21 ఆ తోటను చేసింది స్వయంగా యెహోవాయే! కాబట్టి అది ఎంత అందంగా ఉండి ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అందమైన ప్రతీ చెట్టు, రుచిగల ప్రతీ పండు అందులో ఉంది. ఆ తోట చాలా పెద్దగా ఉండేది, పుష్కలమైన నీళ్లతో అలాగే రకరకాల జంతువులతో కళకళలాడేది. ఆదాముహవ్వలకు చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక మంచి తోడు, నవ్వుతూ బ్రతకడానికి ఒక అందమైన జీవితం, అన్నీ ఉన్నాయి లేనిదంటూ ఏదీ లేదు. యెహోవాయే వాళ్లను మొదట ప్రేమించాడు కాబట్టి, వాళ్లు ఆయన్ని తిరిగి ప్రేమించడానికి గంపెడు కారణాలు ఉన్నాయి. అయినా వాళ్లు ఆయన్ని తిరిగి ప్రేమించలేకపోయారు. వాళ్లు ప్రేమగా పరలోక తండ్రికి లోబడి ఉండే బదులు, స్వార్థంగా ఆలోచించి ఆయనకు ఎదురుతిరిగారు.—ఆదికాండం, 2వ అధ్యాయం.
22. ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత, యెహోవా తన విశ్వసనీయ ప్రేమను ఎలా చూపించాడు?
22 అప్పుడు యెహోవా గుండె ముక్కలైపోయి ఉంటుంది కదా! ఇక మనుషుల్ని ప్రేమించనే ప్రేమించకూడదని ఆయన గుండెను రాయి చేసుకున్నాడా? లేదు! “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.” (కీర్తన 136:1) కాబట్టి, ఆయన వెంటనే ఆదాముహవ్వల పిల్లల్లో మంచి మనసున్న వాళ్లను విడిపించడానికి ప్రేమతో కొన్ని ఏర్పాట్లు చేశాడు. మనం ముందే చూసినట్టు, వాటిలో ఒకటి, తన ప్రియ కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చాడు. అది యెహోవాకు ఎంతో బాధ కలిగించినా, ఆయన మనమీద ప్రేమతో దాన్ని చేశాడు.—1 యోహాను 4:10.
23. యెహోవాను “సంతోషంగల దేవుడు” అని చెప్పడానికి ఒక కారణం ఏంటి? తర్వాతి అధ్యాయంలో మనం ఏ ముఖ్యమైన ప్రశ్నకు జవాబు చూస్తాం?
23 అవును, మనుషుల్ని ప్రేమించడానికి మొదటి నుండీ యెహోవాయే ఒక అడుగు ముందుకేశాడు. లెక్కలేనన్ని విధాలుగా ఆయనే “మొదట మనల్ని ప్రేమించాడు.” ప్రేమ ఎక్కడుంటే శాంతి, సంతోషం అక్కడ ఉంటాయి. అందుకే బైబిలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని చెప్తుంది. (1 తిమోతి 1:11) ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ‘యెహోవా నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా?’ ఈ ప్రశ్నకు జవాబు మనం తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a ఫిలియో అంటే “(ప్రాణ స్నేహితుడి మీద గానీ, అన్నదమ్ముల మీద గానీ ఉండే) అనురాగం లేదా ఇష్టం.” క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఆ పదం చాలాసార్లు కనిపిస్తుంది. స్టోర్‌గీ అంటే కుటుంబ సభ్యుల మీద ఉండే ప్రేమ. ఇలాంటి ప్రేమే చివరి రోజుల్లో కరువైపోతుందని 2 తిమోతి 3:3 చెప్తుంది. ఎరోస్ అంటే ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఉండే రొమాంటిక్ ప్రేమ. దీని గురించి బైబిల్లో ఉంది, కానీ క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అయితే లేదు.—సామెతలు 5:15-20.
b బైబిల్లో కొన్నిచోట్ల అలాంటి పోలికలున్నాయి. ఉదాహరణకు, “దేవుడు వెలుగు,” “దేవుడు దహించే అగ్ని.” (1 యోహాను 1:5; హెబ్రీయులు 12:29) అయితే అవి పోలికలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. యెహోవా వెలుగు లాంటి వాడు, ఎందుకంటే ఆయన పవిత్రుడు, యథార్థవంతుడు. ఆయనలో “చీకటి” అంటే అపవిత్రత లేదు. అలాగే, యెహోవాకున్న నాశనం చేసే శక్తిని బట్టి ఆయన్ని అగ్నితో పోల్చవచ్చు.