5వ అధ్యాయం
‘ఈయన నా కుమారుడు’
పిల్లలు మంచి పనులు చేసినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది. తన కూతురు ఏదైనా చక్కగా చేసినప్పుడు, ‘నా కూతురు’ అని తండ్రి గర్వంగా చెప్పుకుంటాడు. లేదా తన కొడుకు మంచి పనులు చేస్తే, ‘నా కొడుకు’ అని తండ్రి సంతోషంగా చెప్పుకుంటాడు.
యేసు ఎప్పుడూ తన తండ్రికి ఇష్టమైన పనులే చేసేవాడు. అందుకే యేసు తండ్రి ఆయనను చూసి గర్వపడ్డాడు. ఒకరోజు యేసు తన ముగ్గురు శిష్యులతో ఉన్నప్పుడు ఆయన తండ్రి ఏమి చేశాడో గుర్తుందా?— అవును, ఆయన ఎక్కడో పరలోకం నుండి వాళ్లతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను.”—మత్తయి 17:5.
యేసు ఎప్పుడూ తన తండ్రికి నచ్చే పనులు చేయడానికి ఇష్టపడేవాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసుకు తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఒక పనిని చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు చేస్తే అది చాలా కష్టమనిపిస్తుంది. కానీ ఆ పనిని ఇష్టపడి చేస్తే అది సులభంగా ఉంటుంది.
యేసు భూమ్మీదకు రాకముందు కూడా తండ్రి ఏమి చెప్తే అది చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన తన తండ్రిని, అంటే యెహోవా దేవుణ్ణి చాలా ప్రేమించాడు. పరలోకంలో యేసు తన తండ్రి దగ్గర గొప్పస్థానంలో ఉండేవాడు. అప్పుడు దేవుడు ఆయనను ఒక ప్రత్యేకమైన పని చేయమన్నాడు. ఆ పని చేయాలంటే యేసు పరలోకం నుండి భూమ్మీదకు రావాలి. అలా రావడానికి ఆయన చిన్న పిల్లవాడిలా పుట్టాలి. ఆ పని చేయమని చెప్పింది యెహోవా కాబట్టి యేసు ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు.
గబ్రియేలు దూత మరియకు ఏమి చెప్పాడు?
యేసు భూమ్మీద ఒక చిన్న బాబులా పుట్టాడు. ఆయన తల్లి ఎవరో తెలుసా?— ఆమె పేరు మరియ. మరియతో మాట్లాడడానికి యెహోవా పరలోకం నుండి గబ్రియేలు అనే దేవదూతను పంపించాడు. గబ్రియేలు వచ్చి మరియతో, ఆమెకు ఒక బాబు పుడతాడని చెప్పాడు. ఆ బాబుకు యేసు అని పేరు పెట్టాలని కూడా చెప్పాడు. మరి ఆ బాబుకు తండ్రి ఎవరు?— యెహోవా దేవుడే ఆ బాబుకు తండ్రి అని ఆ దూత చెప్పాడు. అందుకే యేసును, దేవుని కుమారుడు అంటారు.
ఇది విన్నప్పుడు మరియకు ఎలా అనిపించి ఉంటుంది?— “యేసుకు తల్లి అవడం నాకు ఇష్టం లేదు” అని ఆమె అందా? లేదు, దేవుడు చెప్పింది చేయడానికి మరియ ఇష్టపడింది. పరలోకంలోవున్న దేవుని కుమారుడు భూమ్మీద పసిబిడ్డగా పుట్టాలి. అయితే యేసు మిగతా పిల్లల్లా పుట్టలేదు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా?—
దేవుడు మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలను చేసి, వాళ్లకు పిల్లల్ని కనే శక్తినిచ్చాడు. అందుకే స్త్రీపురుషులు భార్యాభర్తల్లా కలిసి జీవించినప్పుడు స్త్రీ కడుపులో బిడ్డ పెరగడం మొదలవుతుంది. దాన్ని అద్భుతం అంటారు. అది నిజమే కదా!
యేసు విషయంలో దేవుడు అంతకన్నా గొప్ప అద్భుతం చేశాడు. ఆయన పరలోకంలో ఉన్న తన కుమారుని జీవాన్ని మరియ గర్భంలో పెట్టాడు. దేవుడు అంతకుముందు గానీ, ఆ తర్వాత గానీ ఎప్పుడూ ఆ అద్భుతాన్ని చేయలేదు. ఈ అద్భుతం వల్ల, మిగతా పిల్లలు తల్లి గర్భంలో పెరిగినట్లే, యేసు మరియ గర్భంలో పెరిగాడు. ఆ తర్వాత మరియకు యోసేపుకు పెళ్లి అయింది.
యేసు పుట్టే సమయానికి మరియ, యోసేపు బేత్లెహేము పట్టణానికి వెళ్లారు. కానీ అప్పటికే అక్కడికి చాలామంది ప్రజలు వచ్చివున్నారు. అందువల్ల, మరియ, యోసేపు ఉండడానికి కనీసం ఒక్క గది కూడా దొరకలేదు, అందుకే వాళ్లు పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. అక్కడే యేసు పుట్టాడు. అప్పుడు ఆమె ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు, యేసును పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. పశువులకు మేతవేసే తొట్టిని పశువుల తొట్టి అంటారు.
యేసును పశువుల తొట్టిలో ఎందుకు పడుకోబెడుతున్నారు?
యేసు పుట్టిన రాత్రి ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. బేత్లెహేము దగ్గర్లో, కొంతమంది గొర్రెల కాపరులకు ఒక దేవదూత కనిపించాడు. యేసు గొప్ప వ్యక్తి అని ఆయన వాళ్లతో చెప్పాడు. ఆ దేవదూత వాళ్లతో, ‘ప్రజలందరికీ మహా సంతోషం కలిగించే సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. ప్రజలను రక్షించే రక్షకుడు నేడు పుట్టాడు’ అని కూడా చెప్పాడు.—లూకా 2:10, 11.
ఈ దేవదూతల్లో ఒకరు గొర్రెల కాపరులతో చెప్పిన మంచివార్త ఏమిటి?
బేత్లెహేముకు వెళ్లి, అక్కడ పశువుల తొట్టిలో పడుకోబెట్టిన యేసును చూడవచ్చని ఆ దేవదూత గొర్రెల కాపరులతో చెప్పాడు. వెంటనే, పరలోకంలోవున్న ఇతర దేవదూతలు కూడా ఈ దూతతో కలిసి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ‘దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమ్మీద సమాధానం కలగాలి’ అని ఆ దూతలు పాడారు.—లూకా 2:12-14.
ఆ దేవదూతలు వెళ్లిపోగానే గొర్రెల కాపరులు బేత్లెహేముకు వెళ్లి యేసును చూశారు. తాము విన్న మంచి విషయాలన్నీ యోసేపుకు, మరియకు చెప్పారు. యేసుకు తల్లి అవడానికి ఒప్పుకున్నందుకు మరియ ఎంత సంతోషించి ఉంటుందో కదా!
ఆ తర్వాత యోసేపుమరియలు యేసును తీసుకొని నజరేతు పట్టణానికి వెళ్లారు. యేసు అక్కడే పెరిగాడు. పెద్దవాడైన తర్వాత ప్రజలకు బోధించే గొప్ప పని చేయడం మొదలుపెట్టాడు. యెహోవా దేవుడు తన కుమారుణ్ణి భూమ్మీద చేయమని చెప్పిన పనుల్లో ఇదొకటి. యేసు, తన పరలోక తండ్రిని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన చెప్పిన పని చేయడానికి ఇష్టపడ్డాడు.
యేసు గొప్ప బోధకునిగా తన పని మొదలుపెట్టే ముందు, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వెళ్లి యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది! యేసు నీళ్లలో నుండి పైకి వస్తున్నప్పుడు, యెహోవా పరలోకం నుండి మాట్లాడుతూ, ‘ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను’ అన్నాడు. (మత్తయి 3:17) మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తే మీకు సంతోషం అనిపించదా?— యేసుకు కూడా అలాగే సంతోషం అనిపించివుంటుంది.
యేసు ఎప్పుడూ సరైనదే చేశాడు. ఆయన ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. తాను దేవుడినని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. యేసును, దేవుని కుమారుడు అని పిలుస్తారని గబ్రియేలు దూత మరియతో చెప్పాడు. తాను దేవుని కుమారుడినని యేసు స్వయంగా చెప్పాడు. తన తండ్రికన్నా తనకే ఎక్కువ తెలుసని యేసు ఎప్పుడూ చెప్పుకోలేదు. అయితే ఆయన, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని చెప్పాడు.—యోహాను 14:28.
పరలోకంలో ఉన్నప్పుడు కూడా యేసు తన తండ్రి చెప్పిన పనిని చేశాడు. ఆయన దేవుడు చెప్పిన పని చేస్తానని చెప్పి వేరే పని చేయలేదు. ఆయన తన తండ్రిని ప్రేమించాడు. అందుకే తన తండ్రి చెప్పిన మాట విన్నాడు. ఆ తర్వాత భూమ్మీదకు వచ్చినప్పుడు కూడా ఆయన తన తండ్రి చేయమని చెప్పి పంపిన పనినే చేశాడు. ఆయన దేవుడు చెప్పిన పని వదిలేసి వేరే పని చేస్తూ ఉండిపోలేదు. అందుకే యెహోవా దేవుడు తన కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు.
మనం కూడా యెహోవా ఇష్టపడేలా ఉండాలని అనుకుంటాం, అవునా?— అలాగైతే, మనం కూడా యేసులా దేవుడు చెప్పిన మాట వింటామని చూపించాలి. దేవుడు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. దేవుని మాట వింటున్నట్లు నటిస్తూ బైబిలు తప్పని చెప్తున్న వాటిని నమ్మవచ్చా, వాటిని చేయవచ్చా?— ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తే, ఆయనకు నచ్చేవిధంగా ఉండడానికి ఇష్టపడతాం.
యేసు గురించి మనం ఏమి తెలుసుకోవాలో, ఏమి నమ్మాలో వివరించే, మత్తయి 7:21-23; యోహాను 4:25, 26; 1 తిమోతి 2:5, 6 వచనాలను చదువుదాం.