35వ అధ్యాయం
మనం చనిపోయినా తిరిగి లేస్తాం!
మనం చనిపోతే మనల్ని పునరుత్థానం చేయాలని, అంటే మనల్ని తిరిగి బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడా?— దేవుడు అలా కోరుకుంటున్నాడని యోబు అనే మంచి వ్యక్తి అన్నాడు. అందుకే యోబు తాను చనిపోబోతున్నానని అనుకున్నప్పుడు దేవునితో, ‘నువ్వు పిలుస్తావు, నేను నీకు ప్రత్యుత్తరమిస్తాను’ అన్నాడు. యెహోవా దేవుడు తనను పునరుత్థానం చేయడానికి ఇష్టపడతాడని లేదా ఎంతో కోరుకుంటాడని యోబు అన్నాడు.—యోబు 14:14, 15.
యేసు అన్ని విషయాల్లో తన తండ్రియైన యెహోవా దేవునిలా ఉంటాడు. యేసు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ‘నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు’ అని ఒక కుష్ఠ రోగి యేసుతో అన్నప్పుడు ఆయన, ‘నాకు ఇష్టమే’ అని చెప్పాడు. అప్పుడు ఆయన ఆ కుష్ఠ రోగిని బాగుచేశాడు.—మార్కు 1:40-42.
యెహోవా చిన్నపిల్లలను ప్రేమిస్తున్నానని ఎలా చూపించాడు?
పిల్లలను ప్రేమించడం యేసు తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. చాలాకాలం క్రితం, రెండు వేర్వేరు సందర్భాల్లో యెహోవా దేవుడు తన సేవకులను ఉపయోగించి చిన్నపిల్లలను పునరుత్థానం చేశాడు. ఏలీయా, తనను బాగా చూసుకున్న ఒక స్త్రీ కుమారుణ్ణి పునరుత్థానం చేయమని యెహోవాను బ్రతిమాలుకున్నాడు. యెహోవా ఆయన అడిగింది చేశాడు. యెహోవా తన సేవకుడైన ఎలీషాను ఉపయోగించి కూడా ఒక చిన్నబాబును పునరుత్థానం చేశాడు.—1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37.
యెహోవా మనల్ని అంత ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం సంతోషంగా లేదా?— మనం బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన మన గురించి ఆలోచిస్తాడు. ఒకవేళ మనం చనిపోయినా ఆయన మనల్ని గుర్తుంచుకుంటాడు. తన తండ్రి ఆయనకు ఇష్టమైన వాళ్లు చనిపోయినా వాళ్లు బ్రతికేవున్నట్లు లెక్కిస్తాడని యేసు చెప్పాడు. (లూకా 20:37, 38) ‘మరణమైనా, జీవమైనా, ఉన్నవైనా, రాబోయేవైనా దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయలేవు’ అని బైబిలు చెప్తోంది.—రోమీయులు 8:38, 39.
యెహోవా చిన్నపిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటాడని యేసు భూమ్మీద ఉన్నప్పుడు చూపించాడు. యేసు సమయం తీసుకుని పిల్లలతో దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడేవాడని మీకు గుర్తుండేవుంటుంది. కానీ దేవుడు, చనిపోయిన చిన్నపిల్లలను తిరిగి బ్రతికించే శక్తిని యేసుకు ఇచ్చాడని మీకు తెలుసా?— యేసు 12 సంవత్సరాల ఒక అమ్మాయిని పునరుత్థానం చేశాడు. ఆ అమ్మాయి యాయీరు అనే ఒకాయన కూతురు. అదెలా జరిగిందో తెలుసుకుందాం.
యాయీరు, ఆయన భార్య, వాళ్ల ఒక్కగానొక్క కూతురు గలిలయ సముద్రం దగ్గర్లో ఉండేవాళ్లు. ఒకసారి ఆ అమ్మాయికి బాగా జబ్బుచేసింది. ఇక తన కూతురు చనిపోబోతుందని యాయీరుకు అర్థమైంది. అప్పుడు యాయీరుకు యేసు గురించి జ్ఞాపకం వచ్చింది, ఆయన ప్రజల జబ్బులను నయం చేయగల గొప్ప వ్యక్తి అని యాయీరు విన్నాడు. అందుకే, ఆయన యేసును వెతుక్కుంటూ వెళ్లాడు. అప్పుడు యేసు గలిలయ సముద్రం ఒడ్డున చాలామందికి బోధిస్తూ కనిపించాడు.
యాయీరు జనం మధ్యలో నుండి యేసు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లమీద పడ్డాడు. ‘నా కూతురు చనిపోయేలా ఉంది. దయచేసి మీరు వచ్చి ఆమెకు సహాయం చేస్తారా? మీరు రావాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను’ అని ఆయన యేసుతో అన్నాడు. యేసు వెంటనే యాయీరుతో వెళ్లాడు. గొప్ప బోధకుణ్ణి చూడడానికి వచ్చిన జనం కూడా ఆయన వెంట వెళ్లారు. కానీ వాళ్లు కొంతదూరం వెళ్లేసరికి యాయీరు ఇంటిదగ్గర నుండి వచ్చిన కొంతమంది యాయీరుతో, ‘నీ కుమార్తె చనిపోయింది! నువ్వు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టడం?’ అన్నారు.
వాళ్లు అలా అనడం యేసు విన్నాడు. ఒక్కగానొక్క కూతురు చనిపోయినందుకు యాయీరు ఎంత బాధపడుతున్నాడో యేసుకు తెలుసు. అందుకే ఆయన యాయీరుతో, ‘భయపడకు, దేవుని మీద నమ్మకం ఉంచు. నీ కూతురుకు ఏమీ కాదు’ అన్నాడు. వాళ్లు అలా నడుచుకుంటూ యాయీరు ఇంటికి వెళ్లారు. అక్కడ వాళ్ల స్నేహితులు ఏడుస్తున్నారు. తమ చిన్నారి స్నేహితురాలు చనిపోయినందుకు వాళ్లు బాధపడుతున్నారు. కానీ యేసు వాళ్లతో, ‘ఏడవొద్దు, ఆమె నిద్రపోతోందేగానీ చనిపోలేదు’ అన్నాడు.
యేసు అలా అన్నందుకు అక్కడున్నవాళ్లు నవ్వడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్లకు తెలుసు. అలాగైతే ఆ అమ్మాయి నిద్రపోతుందని యేసు ఎందుకు అన్నాడు?— ఆయన ప్రజలకు ఏమి బోధించాలనుకున్నాడు?— మరణం గాఢ నిద్రలాంటిదని వాళ్లు తెలుసుకోవాలనుకున్నాడు. నిద్రపోతున్నవాళ్లను లేపినంత సులువుగా, చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించడానికి దేవుడు తనకు శక్తినిచ్చాడని వాళ్లకు బోధించాలనుకున్నాడు.
యేసు యాయీరు కూతురును పునరుత్థానం చేయడం నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
యేసు తన అపొస్తలులైన పేతురును, యాకోబును, యోహానును అలాగే ఆ అమ్మాయివాళ్ల అమ్మానాన్నలను తప్ప మిగతావాళ్లందరినీ బయటకు పంపించాడు. అప్పుడు ఆయన ఆ అమ్మాయి ఉన్న దగ్గరకు వెళ్లాడు. యేసు ఆ అమ్మాయి చేయి పట్టుకుని, ‘చిన్నదానా, లెమ్ము!’ అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి లేచి నడవడం మొదలుపెట్టింది! ఆ అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలు ఆనందం పట్టలేకపోయారు.—మార్కు 5:21-24, 35-43; లూకా 8:40-42, 49-56.
ఒకసారి ఆలోచించండి. యేసు ఆ చిన్నమ్మాయిని తిరిగి బ్రతికించగలిగాడు కదా, మరి ఆయన వేరేవాళ్లను కూడా అలాగే బ్రతికించగలడా?— ఆయన నిజంగా అలాచేస్తాడని మీరు అనుకుంటున్నారా?— అవును, ఆయన చేస్తాడు. యేసే ఇలా అన్నాడు, ‘ఒక కాలం వస్తుంది; ఆ కాలంలో సమాధుల్లో ఉన్నవాళ్లంతా నా శబ్దం విని బయటకు వస్తారు.’—యోహాను 5:28, 29.
యేసు ప్రజలను పునరుత్థానం చేయాలని కోరుకుంటున్నాడా?— బైబిల్లోని మరో ఉదాహరణ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. నాయీను అనే ఒక ఊరి దగ్గర జరిగిన ఒక సంఘటన నుండి, ఎవరైనా చనిపోతే ఏడ్చేవాళ్లను చూసినప్పుడు యేసుకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవచ్చు.
నాయీను నుండి కొంతమంది ఒక శవాన్ని మోసుకువెళ్తున్నారు. ఆ గుంపులో చనిపోయిన అబ్బాయి తల్లి కూడా ఉంది. కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోయాడు, ఇప్పుడు ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఆమె ఎంత బాధలో ఉండివుంటుందో కదా! ఆమె కుమారుడి శవాన్ని ఊరి బయటకు తీసుకువెళ్తున్నప్పుడు నాయీను నుండి చాలామంది జనం వెంట వెళ్లారు. ఆమె బాగా ఏడుస్తోంది, అక్కడున్నవాళ్లు ఆమెను ఓదార్చలేకపోయారు.
ఆ రోజు యేసు, ఆయన శిష్యులు ఆ ఊరివైపు వస్తున్నారు. ఆ ఊరి ద్వారం దగ్గర, వాళ్లు ఆ స్త్రీ కుమారుణ్ణి పాతిపెట్టడానికి వెళ్తున్న గుంపును కలుసుకున్నారు. ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి యేసు ఆమె మీద కనికరపడ్డాడు. ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి యేసు దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు.
కాబట్టి యేసు మృదువుగానే అయినా ఆమెకు వినపడేంత గట్టిగా ఆమెతో, ‘ఏడవొద్దు’ అని అన్నాడు. ఆయన అలా అనడంతో అక్కడున్నవాళ్లంతా ఆసక్తిగా ఆయనవైపు చూశారు. యేసు శవం దగ్గరకు రావడంచూసి వాళ్లంతా ఆయనేం చేయబోతున్నాడో తెలీక ఆయనవైపు చూస్తూ ఉండిపోయారు. ‘చిన్నవాడా, లెమ్మని నీతో చెప్తున్నాను!’ అని యేసు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు! మాట్లాడడం మొదలుపెట్టాడు.—లూకా 7:11-17.
ఆ స్త్రీకి ఎలా అనిపించివుంటుందో ఊహించండి! మీకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయి తిరిగి బ్రతికితే మీకు ఎలా అనిపిస్తుంది?— యేసు ప్రజలను నిజంగా ప్రేమిస్తున్నాడనీ, వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడనీ దీనివల్ల తెలియడం లేదా?— దేవుని కొత్త లోకంలో తిరిగి బ్రతికి వచ్చేవాళ్లను ఆహ్వానించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి!—2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.
ఈ స్త్రీ ఒక్కగానొక్క కుమారుని పునరుత్థానం ఏమి చూపిస్తుంది?
అప్పుడు పునరుత్థానం చేయబడేవాళ్లలో మనకు తెలిసినవాళ్లు కూడా కొంతమంది ఉంటారు. వాళ్లలో పిల్లలు కూడా ఉంటారు. యేసు యాయీరు కూతురును పునరుత్థానం చేసినప్పుడు ఆ అమ్మాయివాళ్ల నాన్న ఆమెను గుర్తుపట్టినట్లు, మనం కూడా పునరుత్థానం చేయబడినవాళ్లను గుర్తుపట్టగలుగుతాం. వందల వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్లు కూడా తిరిగి బ్రతుకుతారు. వాళ్లు చాలాకాలం క్రితం జీవించినవాళ్లయినా దేవుడు వాళ్లను మర్చిపోడు.
యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారని తెలుసుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, అవునా?— మనం కొన్ని సంవత్సరాల వరకే కాదుగానీ ఎప్పటికీ జీవించివుండాలని వాళ్లు కోరుకుంటున్నారు!
చనిపోయిన వాళ్లకు ఉన్న చక్కని భవిష్యత్తు గురించి బైబిలు ఏంచెప్తుందో తెలుసుకోవడానికి, యెషయా 25:8; అపొస్తలుల కార్యములు 24:14, 15; 1 కొరింథీయులు 15:20-22 వచనాలు చదువుదాం.