పిల్లలకు తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలి?
తల్లిదండ్రులందరూ మానవ అవగాహనకు పూర్తిగా అందని అద్భుతమైన సంఘటన జరగడంలో పాలుపంచుకుంటారు. ఆ అద్భుతం జరగడానికి ఇద్దరూ దోహదపడతారు. దానివల్ల తల్లి గర్భంలో ఒక జీవం ఏర్పడి బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. అందుకే, బిడ్డ పుట్టినప్పుడు కొంతమంది “మనిషి పుట్టుక ఒక అద్భుతం” అని చెప్పుకుంటారంటే అందులో ఆశ్చర్యం లేదు.
తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను కనడంతో మొదలవుతుంది. చంటి పిల్లలకు అన్నీ తల్లిదండ్రులే చూసుకోవాలి. కానీ వాళ్లు ఎదిగేకొద్దీ, వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడంకన్నా ఇంకా ఎక్కువే చేయాలి. పిల్లలు మానసికంగా, భావోద్రేకపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్లకు సహాయం అవసరం.
పిల్లలు అన్నివిధాలా ఎదగాలంటే వాళ్లకు ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తున్నట్లు మాటల్లోనేకాదు చేతల్లో కూడా చూపించాలి. వాళ్లు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. జీవితంలో ఎలాంటి నైతిక సూత్రాల ప్రకారం నడుచుకోవాలో పిల్లలకు నేర్పించాలి. ఇవన్నీ పిల్లలకు పసిప్రాయం నుండే అవసరం. పిల్లలకు సరైన సమయంలో వీటిని అందించలేకపోతే గుండెకోత మిగిల్చే పరిస్థితులు తలెత్తవచ్చు, అలాంటివి జరుగుతున్నాయి కూడా.
అన్నిటికన్నా ఉత్తమమైన సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. బైబిలు నుండి ఇచ్చే ఉపదేశంవల్ల కలిగే ప్రయోజనాలు మరి దేనివల్లా కలుగవు. అలా ఉపదేశించినప్పుడు పిల్లలు, ఎవరో మనిషి చెప్పింది కాదుగానీ తమ సృష్టికర్త అయిన పరలోక తండ్రి చెప్పింది నేర్చుకుంటున్నామని అర్థంచేసుకుంటారు. దేవుని వాక్యం నుండి సలహాలు ఇచ్చినప్పుడు వాటికి సాటిలేని బలం చేకూరుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లల మనసుల్లో సరైన సూత్రాలు నాటడానికి ఎంతో కృషి చేయాలని బైబిలు వాళ్లను ప్రోత్సహిస్తోంది. అయితే, పిల్లలు ఎదిగేకొద్దీ వాళ్లతో ఎంతో ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడడం తల్లిదండ్రులకు తరచూ కష్టమనిపిస్తుంది. గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే ఈ పుస్తకం, అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడడానికి సహాయం చేసే ఉద్దేశంతో తయారుచేయబడింది. ఈ పుస్తకంలో మీరూ, మీ పిల్లలూ కలిసి చదువుకోవడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాలున్నాయి. అయితే, దానికన్నా ముఖ్యంగా, పిల్లలూ వాళ్లతో కలిసి దీన్ని చదివేవాళ్లూ చక్కగా మాట్లాడుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది.
ఈ పుస్తకం, పిల్లలు తమ అభిప్రాయాలను చెప్పేలా ప్రోత్సహిస్తుంది. దీనిలో సరైనచోట్ల ఎన్నో ప్రశ్నలున్నాయి. అలాంటి ప్రశ్నల తర్వాత ఒక అడ్డగీత (—) ఉంటుంది. పిల్లలు తమ అభిప్రాయాన్ని చెప్పేలా ప్రోత్సహించమని గుర్తుచేయడానికి ఆ అడ్డగీత ఇవ్వబడింది. ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి పిల్లలు ఇష్టపడతారు. అలా చేయకపోతే జరుగుతున్న చర్చలో పిల్లలు ఎక్కువసేపు ఆసక్తి చూపించలేరు. ఈ పుస్తకంలో “మీరు” అని బహువచనం ఉపయోగించబడినా, పిల్లల్లో ప్రతీ ఒక్కరూ చర్చలో పాల్గొనేలా, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఏకవచనాన్ని ఉపయోగించవచ్చు.
అంతకన్నా ముఖ్యంగా, ఈ ప్రశ్నల ద్వారా పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు పిల్లలు సరైన సమాధానాలు చెప్పలేకపోవచ్చు. అయితే, ప్రతీ ప్రశ్న తర్వాత ఉన్న సమాచారం పిల్లలు చక్కని ఆలోచనా తీరును వృద్ధిచేసుకోవడానికి వీలుగా రూపొందించబడింది.
ఈ పుస్తకంలో ఉన్న 230 కన్నా ఎక్కువ చిత్రాలు దీని ప్రత్యేక ఆకర్షణ. ఆ చిత్రాల్లో చాలావాటి ప్రక్కన పిల్లలు తాము చూసిన, చదివిన విషయాల గురించి తమ అభిప్రాయాన్ని చెప్పేలా ప్రోత్సహించే ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఆ చిత్రాలను పిల్లలతో కలిసి పరిశీలించండి. వాటిని ఉపయోగిస్తే ప్రతీ పాఠంలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు పిల్లల మనసుల్లో నాటుకునేలా చేయవచ్చు.
పిల్లలు చదవడం నేర్చుకున్నప్పుడు, మీకు వినబడేలా బయటకు చదవమని, తర్వాత మనసులో చదువుకోమని చెప్పండి. ఎంత ఎక్కువగా దాన్ని చదివితే అందులోని మంచి సలహాలు పిల్లల మనసుల్లో, హృదయాల్లో అంత ఎక్కువగా నాటుకుంటాయి. అయితే మీ మధ్య ప్రేమ, గౌరవం పెరగాలంటే ఈ పుస్తకాన్ని వాళ్లతో కలిసి చదవండి, క్రమంగా చదవండి.
కొన్ని సంవత్సరాల క్రితం కనీసం ఊహకైనా అందని రీతిలో పిల్లలు ఇప్పుడు లైంగిక దుర్నీతి గురించి, మంత్రతంత్రాల గురించి, నీచమైన ఇతర అలవాట్ల గురించి ఎన్నో మాధ్యమాల ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్లను కాపాడడం అవసరం, ఆ విషయంలో ఈ పుస్తకం సహాయం చేస్తుంది. ఇది అలాంటి విషయాల గురించి గౌరవప్రదంగా వివరిస్తున్నా వాటి గురించి సూటిగా మాట్లాడుతుంది. అయితే పిల్లలను మన పరలోక తండ్రి అయిన యెహోవా దేవుని వైపు నడిపించాలి. ఎందుకంటే, సమస్త వివేచనకు ఆయనే మూలం. గొప్ప బోధకుడైన యేసు ఎప్పుడూ ప్రజల్ని యెహోవా దేవునివైపు నడిపించాడు. మీరు, మీ కుటుంబం యెహోవాకు నచ్చే విధంగా జీవితాలను మలచుకుని నిరంతర ఆశీర్వాదాలు పొందడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.