అధ్యాయం 28
“భూమంతటా” సాక్ష్యం ఇవ్వడం
మొదటి శతాబ్దంలో యేసు అనుచరులు మొదలుపెట్టిన పనిని యెహోవాసాక్షులు కొనసాగిస్తున్నారు
1. తొలి క్రైస్తవులకు, ఇప్పుడు యెహోవాసాక్షులకు ఏ పోలికలు ఉన్నాయి?
ఉప్పొంగే ఉత్సాహంతో వాళ్లు ప్రకటించారు. వాళ్లు పవిత్రశక్తి సహాయాన్ని, నిర్దేశాన్ని వినయంగా తీసుకున్నారు. హింస వాళ్ల నోటికి తాళం వేయలేకపోయింది. అంతేకాదు వాళ్లకు దేవుని మెండైన దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ తొలి క్రైస్తవుల విషయంలో ఎంత నిజమో, ఇప్పుడున్న యెహోవాసాక్షుల విషయంలో కూడా అంతే నిజం.
2, 3. అపొస్తలుల కార్యాలు పుస్తకం ప్రత్యేకత ఏంటి?
2 బైబిల్లోని అపొస్తలుల కార్యాలు పుస్తకం ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగింది కదా! అందులో ఉన్న విషయాలు మీకు ఖచ్చితంగా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి, మీ విశ్వాసాన్ని బలపర్చి ఉంటాయి. ఈ పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, తొలి క్రైస్తవుల చరిత్ర గురించి చెప్పే పుస్తకాలు చాలా ఉన్నా, వాటిలో దేవుడు ప్రేరేపించి రాయించిన పుస్తకం మాత్రం ఇదొక్కటే.
3 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో మొత్తం 95 మంది వ్యక్తుల, 32 దేశాల, 54 నగరాల, 9 ద్వీపాల పేర్లు ఉన్నాయి. ఆసక్తికరంగా సాగే ఈ కథలో సామాన్య ప్రజలు, మత పిచ్చోళ్లు, గర్విష్ఠి రాజకీయవేత్తలు, హింసించే క్రూరులు ఉన్నారు. కానీ ఈ కథ, ముఖ్యంగా మొదటి శతాబ్దంలో ఉన్న మీ సహోదర సహోదరీల చుట్టూ తిరుగుతుంది. అందరిలాగే వాళ్లకూ సమస్యలు ఉన్నాయి, అయినా వాళ్లు ఉత్సాహంగా మంచివార్త ప్రకటించారు.
4. పాతకాలం నాటి నమ్మకమైన సాక్షులతో మనకు ఎలాంటి అనుబంధం ఉంది?
4 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో, ఉరకలేసే ఉత్సాహం చూపించిన పేతురు-పౌలు, ప్రియమైన వైద్యుడు లూకా, పెద్ద మనసున్న బర్నబా, ధైర్యవంతుడైన స్తెఫను, దయగల తబితా, ఆతిథ్య స్ఫూర్తి ఉన్న లూదియ, ఇంకా చాలామంది నమ్మకమైన సాక్షుల గురించి మనం చూశాం. అప్పటికి, ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా, వాళ్లతో మనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే, అప్పుడు వాళ్లు చేసినట్టే ఇప్పుడు మనం కూడా శిష్యుల్ని చేసే పనే చేస్తున్నాం. (మత్త. 28:19, 20) ఆ పని చేయడం మనకు దొరికిన గొప్ప గౌరవం!
“భూమంతటా . . . సాక్ష్యమిస్తారు.”—అపొస్తలుల కార్యాలు 1:8
5. యేసు అప్పగించిన పనిని ఆయన అనుచరులు ఎక్కడి నుండి మొదలుపెట్టారు?
5 యేసు తన అనుచరులకు అప్పగించిన పని గుర్తుందా? ఆయన ఇలా అన్నాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) ముందుగా, శిష్యులు పవిత్రశక్తి ఇచ్చిన బలంతో “యెరూషలేములో” ప్రకటించారు. (అపొ. 1:1–8:3) తర్వాత, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం వాళ్లు “యూదయ అంతటిలో, సమరయలో” సాక్ష్యం ఇచ్చారు. (అపొ. 8:4–13:3) ఆ తర్వాత, వాళ్లు మంచివార్తను “భూమంతటా” చాటి చెప్పడం మొదలుపెట్టారు.—అపొ. 13:4–28:31.
6, 7. ప్రకటించే విషయంలో తొలి క్రైస్తవులకు లేనిదేంటి, మనకు ఉన్నదేంటి?
6 మొదటి శతాబ్దంలోని మీ సహోదర సహోదరీల దగ్గర, పరిచర్యలో ఉపయోగించడానికి పూర్తి బైబిలు లేదు. పోనీ, ఆసక్తి చూపించిన వాళ్లకు ఇవ్వడానికి ప్రచురణలైనా ఉన్నాయా అంటే అవీ లేవు. క్రీస్తు శకం 41కి గానీ, వాళ్లకు మత్తయి సువార్త అందుబాటులోకి రాలేదు. అపొస్తలుల కార్యాలు పుస్తకం పూర్తవ్వడానికి ముందు, దాదాపు క్రీస్తు శకం 61 లో పౌలు కొన్ని ఉత్తరాలు రాశాడు. అయితే, యేసు శిష్యులుగా మారడానికి ముందు, యూదులు క్రమంగా సమాజమందిరానికి వెళ్లి, అక్కడ చదివే హీబ్రూ లేఖనాల్ని వినేవాళ్లు. (2 కొరిం. 3:14-16) కానీ వాళ్ల దగ్గర కూడా హీబ్రూ లేఖనాల సొంత కాపీలు లేవు. కాబట్టి వాళ్లు ఏవైతే శ్రద్ధగా విని గుర్తుంచుకున్నారో వాటినే పరిచర్యలో వాడాలి.
7 ఇప్పుడు మనందరి దగ్గర బైబిలు సొంత కాపీలు ఉన్నాయి, అలాగే బోలెడన్ని బైబిలు ప్రచురణలు ఉన్నాయి. అంతేకాదు మనం సుమారు 240 దేశాల్లో, ద్వీపాల్లో ఎన్నో భాషల్లో మంచివార్త ప్రకటిస్తూ శిష్యుల్ని చేస్తున్నాం.
పవిత్రశక్తి బలాన్నిచ్చింది
8, 9. (ఎ) పవిత్రశక్తి సహాయం వల్ల యేసు శిష్యులు ఏం చేయగలిగారు? (బి) పవిత్రశక్తి సహాయంతో నమ్మకమైన దాసుడు ఏం చేస్తున్నాడు?
8 యేసు తన శిష్యులకు పని అప్పగిస్తూ ఇలా అన్నాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు.” పవిత్రశక్తి లేదా దేవుని చురుకైన శక్తి నిర్దేశం కింద, యేసు అనుచరులు చివరికి భూమంతటా ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు. పవిత్రశక్తి సహాయంతో పేతురు, పౌలు రోగుల్ని బాగుచేశారు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టారు, చనిపోయినవాళ్లను సైతం లేపారు! అయితే, అంతకన్నా ప్రాముఖ్యమైన పని, అంటే ప్రకటనా పని చేయడానికి పవిత్రశక్తి వాళ్లకు బలాన్నిచ్చింది. దానివల్లే అపొస్తలులు, ఇతర శిష్యులు శాశ్వత జీవితానికి నడిపించే ఖచ్చితమైన జ్ఞానాన్ని అందరితో పంచుకోగలిగారు.—యోహా. 17:3.
9 క్రీస్తు శకం 33 పెంతెకొస్తు రోజున, యేసు శిష్యులు ‘పవిత్రశక్తి ఇచ్చిన సామర్థ్యం ప్రకారం వేర్వేరు భాషల్లో మాట్లాడారు.’ అలా వాళ్లు “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి” సాక్ష్యం ఇచ్చారు. (అపొ. 2:1-4, 11) ఇప్పుడు పవిత్రశక్తి మనకు అద్భుతరీతిలో వేర్వేరు భాషల్లో మాట్లాడేలా చేయట్లేదు గానీ, నమ్మకమైన దాసుడు ఎన్నో భాషల్లో బైబిలు ప్రచురణలు తయారుచేసేలా సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ప్రతీనెల కావలికోట, తేజరిల్లు! పత్రికలు ఎన్నో లక్షల కాపీలు ప్రింట్ అవుతున్నాయి. అంతేకాదు మన jw.org వెబ్‌సైట్‌లో బైబిలు ప్రచురణలు, వీడియోలు 1,000కి పైగా భాషల్లో ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనం అన్ని దేశాల, గోత్రాల, భాషల ప్రజలకు “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి” చెప్పగలుగుతున్నాం.—ప్రక. 7:9.
10. బైబిలు అనువాద పని 1989 నుండి ఎలా జరుగుతుంది?
10 నమ్మకమైన దాసుడు 1989 నుండి, కొత్త లోక అనువాదం బైబిల్ని చాలా భాషల్లో తయారు చేయడం మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే బైబిల్ని 200 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించారు, అలాగే కోట్ల కాపీల్ని ప్రింట్ చేశారు. ముందుముందు ఈ పనులు ఇంకా ముమ్మరంగా జరుగుతాయి. ఇవన్నీ దేవుడు, ఆయన పవిత్రశక్తి వల్లే సాధ్యమయ్యాయి.
11. మన ప్రచురణల్ని ఎలా అనువదిస్తున్నారు?
11 అనువాద పనిని 150 కన్నా ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో వేలమంది సహోదర సహోదరీలు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, మన సంస్థ తప్ప భూమ్మీద ఉన్న ఇంకే సంస్థ పవిత్రశక్తి చేత నడిపించబడట్లేదు. ఆ పవిత్రశక్తి వల్లే మనం యెహోవా దేవుని గురించి, రాజైన యేసు గురించి, పరలోకంలో స్థాపించబడిన రాజ్యం గురించి భూమంతటా “పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ” ఉన్నాం!—అపొ. 28:23.
12. పౌలు, ఇతర క్రైస్తవులు సాక్ష్యమిచ్చే పనిని ఎలా చేయగలిగారు?
12 పౌలు పిసిదియకు చెందిన అంతియొకయలో యూదులకు, అన్యజనులకు సాక్ష్యం ఇచ్చినప్పుడు “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లు విశ్వాసులయ్యారు. (అపొ. 13:48) అపొస్తలుల కార్యాలు పుస్తకం చివర్లో, పౌలు “ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ” ఉన్నాడని లూకా రాశాడు. (అపొ. 28:31) ఇంతకీ పౌలు ఎక్కడ ప్రకటిస్తున్నాడు? ఆయన ఏకంగా ప్రపంచ ఆధిపత్యానికి రాజధాని అయిన రోములో ప్రకటిస్తున్నాడు! తొలి క్రైస్తవులు ప్రసంగాల ద్వారా, లేదా వేరే విధాలుగా ప్రకటనా పనిలో చేయగలిగినదంతా చేశారు. పవిత్రశక్తి సహాయంతో, నిర్దేశంతోనే వాళ్లు అలా చేయగలిగారు.
హింసకు ఎదురు ఈదుతూ ముందుకు సాగారు
13. హింసలు వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థించాలి?
13 తొలి క్రైస్తవులకు హింసలు వచ్చినప్పుడు, వాళ్లు ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించారు. అప్పుడు ఏం జరిగింది? వాళ్లు పవిత్రశక్తితో నిండిపోయి, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. (అపొ. 4:18-31) మనం కూడా, హింసలు వచ్చినా ప్రకటిస్తూ ఉండడానికి కావల్సిన తెలివిని, బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాం. (యాకో. 1:2-8) పవిత్రశక్తి సహాయం, దేవుని దీవెన ఉండడం వల్లే మనం పరిచర్యను ఆపకుండా చేయగలుగుతున్నాం. తీవ్రమైన వ్యతిరేకత గానీ, క్రూరమైన హింస గానీ, ఇంకేదైనా గానీ ప్రకటనా పనిని అడ్డుకోలేదు. కాబట్టి మనకు హింసలు ఎదురైనప్పుడు పవిత్రశక్తి కోసం, మంచివార్త ప్రకటించే తెలివి కోసం, ధైర్యం కోసం తప్పకుండా ప్రార్థించాలి.—లూకా 11:13.
14, 15. (ఎ) “స్తెఫను చనిపోయిన తర్వాత వచ్చిన శ్రమ” వల్ల ఏం జరిగింది? (బి) సైబీరియాలో చాలామంది ఎలా సత్యం తెలుసుకున్నారు?
14 శత్రువుల చేతుల్లో చనిపోయే ముందు స్తెఫను ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. (అపొ. 6:5; 7:54-60) ఆ సమయంలో “తీవ్రమైన హింస” రావడం వల్ల, అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు. కానీ వాళ్లు ఎక్కడికి వెళ్లినా ప్రకటించడం మాత్రం ఆపలేదు. ఫిలిప్పు సమరయకు వెళ్లి ‘క్రీస్తు గురించి ప్రకటించాడు,’ దానివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. (అపొ. 8:1-8, 14, 15, 25) అంతేకాదు, “స్తెఫను చనిపోయిన తర్వాత వచ్చిన శ్రమ వల్ల చెల్లాచెదురైపోయిన వాళ్లు ఫేనీకే, కుప్ర, అంతియొకయ వరకూ వెళ్లారు. కానీ వాళ్లు యూదులకు మాత్రమే వాక్యాన్ని ప్రకటించారు. అయితే కుప్ర నుండి, కురేనే నుండి వచ్చిన కొంతమంది అంతియొకయలో ఉన్నారు. వాళ్లు గ్రీకు భాష మాట్లాడే ప్రజలతో మాట్లాడుతూ ప్రభువైన యేసు గురించిన మంచివార్త ప్రకటించడం మొదలుపెట్టారు.” (అపొ. 11:19, 20) ఒక విధంగా, హింస వల్ల మంచివార్త వేర్వేరు ప్రాంతాలకు చేరింది.
15 మన కాలంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది. 1950లలో, ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఉన్న వేలమంది యెహోవాసాక్షుల్ని బలవంతంగా సైబీరియాకు పంపించేశారు. అక్కడ వాళ్లు వేర్వేరు చోట్లకు చెదిరిపోవడం వల్ల, అంత పెద్ద దేశంలో మంచివార్త వ్యాప్తి చెందింది. మామూలుగా అయితే, అంతమంది సాక్షులు సొంత ఖర్చులతో మంచివార్త ప్రకటించడానికి 10,000 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లడం అయ్యేపని కాదు. కానీ, ప్రభుత్వమే వాళ్లను దేశం దాటించింది కాబట్టి వాళ్లు ఉచితంగా వెళ్లినట్టు అయ్యింది! ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “సైబీరియాలో మంచి మనసున్న వేలమంది ప్రజలు సత్యం తెలుసుకునేలా, ఒక విధంగా అధికారులే సహాయం చేసినట్టు అయ్యింది.”
యెహోవా మెండుగా దీవించాడు
16, 17. యెహోవా ప్రకటనా పనిని దీవించాడు అనడానికి అపొస్తలుల కార్యాలు పుస్తకంలో ఏ రుజువులు ఉన్నాయి?
16 తొలి క్రైస్తవుల్ని యెహోవా దీవించాడు అనడంలో సందేహమే లేదు. పౌలు అలాగే ఇతరులు నాటారు, నీళ్లు పోశారు, “కానీ పెరిగేలా చేసింది దేవుడే.” (1 కొరిం. 3:5, 6) అవును, యెహోవా వాళ్ల ప్రకటనా పనిని దీవించి దాన్ని పెరిగేలా చేశాడు అనడానికి, అపొస్తలుల కార్యాలు పుస్తకంలో చాలా రుజువులు ఉన్నాయి. ఉదాహరణకు, “దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది” అని బైబిలు చెప్తుంది. (అపొ. 6:7) ప్రకటనా పని ముందుకెళ్లే కొద్దీ “యూదయలో, గలిలయలో, సమరయలో ఉన్న సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది, బలపడుతూ వచ్చింది. శిష్యులు యెహోవా భయంలో నడుస్తూ, పవిత్రశక్తి ద్వారా కలిగే ఆదరణకు అనుగుణంగా జీవిస్తూ ఉండగా వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.”—అపొ. 9:31, అధస్సూచి.
17 సిరియాకు చెందిన అంతియొకయలో ధైర్యవంతులైన సాక్షులు అటు యూదులకు, ఇటు గ్రీకు భాష మాట్లాడే ప్రజలకు సత్యాన్ని ప్రకటించారు. దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా చెయ్యి వాళ్లకు [ఆ సాక్షులకు] తోడుగా ఉంది కాబట్టి చాలామంది విశ్వాసులై ప్రభువు వైపుకు తిరిగారు.” (అపొ. 11:21) ప్రకటనా పని ఇంకెంతగా ముందుకు సాగిందంటే, “యెహోవా వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది, చాలామంది విశ్వాసులయ్యారు” అని మనం చదువుతాం. (అపొ. 12:24) అన్యజనులకు ప్రకటించడంలో పౌలు అలాగే ఇతరులు దూసుకెళ్లడంతో, “యెహోవా వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.”—అపొ. 19:20.
18, 19. (ఎ) “యెహోవా చెయ్యి” మనకు తోడుగా ఉందని ఎలా చెప్పవచ్చు? (బి) యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తాడని చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.
18 “యెహోవా చెయ్యి” ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉందనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు చాలామంది విశ్వాసులు అవుతున్నారు, దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంతేకాదు మనం పౌలులా, ఇతర క్రైస్తవుల్లా వ్యతిరేకతను, ఆఖరికి తీవ్రమైన హింసను తట్టుకుని పరిచర్యను కొనసాగిస్తున్నాం. దేవుని సహాయం, ఆయన దీవెన ఉండడం వల్లే అలా చేయగలుగుతున్నాం. (అపొ. 14:19-21) యెహోవా దేవుడు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటాడు. ప్రతీ కష్టంలో, ఆయన ‘శాశ్వత బాహువులతో’ మనల్ని పట్టుకుంటాడు. (ద్వితీ. 33:27) యెహోవా తన గొప్ప పేరు కోసమైనా సరే, తన ప్రజల్ని విడిచిపెట్టడని గుర్తుంచుకుందాం.—1 సమూ. 12:22; కీర్త. 94:14.
19 ఒక ఉదాహరణ గమనించండి: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, సహోదరుడు హెరాల్డ్ ఆబ్ట్ పరిచర్య చేస్తున్నందుకు నాజీలు అతన్ని సాక్సెన్‌హ్యూసన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో వేశారు. 1942, మే నెలలో రహస్య పోలీసులు అతని ఇంటికి వెళ్లి, అతని భార్య ఎల్సాను అరెస్టు చేసి, వాళ్ల నెలల పాపను లాగేసుకున్నారు. ఎల్సాను వేర్వేరు కాన్సన్‌ట్రేషన్ క్యాంపులకు తిప్పారు. ఆమె ఇలా చెప్పింది: “ఇన్నేళ్లు జర్మనీ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో ఉండి నేను తెలుసుకున్న పాఠం ఏంటంటే, భరించలేనంత కష్టం వచ్చినప్పుడు యెహోవా పవిత్రశక్తి మనకు కొండంత బలాన్ని ఇస్తుంది! నేను అరెస్టు అవ్వడానికి ముందు, ఒక సహోదరి రాసిన ఉత్తరాన్ని చదివాను. కఠినమైన పరీక్ష వచ్చినప్పుడు, మనం ప్రశాంతంగా ఉండడానికి పవిత్రశక్తి సహాయం చేస్తుందని అందులో రాసివుంది. అది చదివినప్పుడు, ఆ సహోదరి కాస్త ఎక్కువ చేసి చెప్తుందని అనుకున్నాను. కానీ అది నా దాకా వచ్చినప్పుడే ఆ మాటలు ఎంత నిజమో అర్థమైంది. ఏ విషయమైనా మన దాకా రాకపోతే, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ నా జీవితంలో అది నిజంగా జరిగింది, నేను దాన్ని రుచి చూశాను.”
పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇస్తూ ఉండండి!
20. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా పౌలు ఏం చేశాడు? దాన్నుండి కొంతమంది సహోదర సహోదరీలు ఎలా ప్రోత్సాహం పొందవచ్చు?
20 పౌలు ఉత్సాహంగా “దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ . . . ఉన్నాడు” అనే మాటలతో అపొస్తలుల కార్యాలు పుస్తకం ముగుస్తుంది. (అపొ. 28:31) ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు కాబట్టి, రోములో ఇంటింటి పరిచర్య చేసే స్వేచ్ఛ ఆయనకు లేదు. అయినా తన దగ్గరికి వచ్చిన వాళ్లందరికీ ఆయన సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మన ప్రియమైన సహోదర సహోదరీల్లో కొంతమంది తమ వయసును బట్టి, అనారోగ్య సమస్యల్ని బట్టి ఇంటికి, మంచానికి, లేదా నర్సింగ్ హోమ్‌కే పరిమితం అయ్యారు. అయినా వాళ్లలో దేవుని మీద ప్రేమ, సాక్ష్యం ఇవ్వాలనే కోరిక మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. మనం వాళ్లకోసం ప్రార్థించవచ్చు. యెహోవా గురించి, ఆయన అద్భుతమైన సంకల్పాల గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులు వాళ్లను కలిసేలా చేయమని మన పరలోక తండ్రిని అడగవచ్చు.
21. ఇప్పుడు పరిచర్య చేయడం ఎందుకు అత్యవసరం?
21 మనలో చాలామందికి ఇంటింటి పరిచర్యలో, లేదా వేరే విధాలుగా శిష్యుల్ని చేసే పనిలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి రాజ్య సువార్తికులుగా మనలో ప్రతీ ఒక్కరం “భూమంతటా” సాక్ష్యమిచ్చే పనిలో మన వంతు కృషి చేద్దాం. ఈ పని ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే, క్రీస్తు ప్రత్యక్షతకు “సూచన” మన కళ్ల ముందే కనిపిస్తుంది. (మత్త. 24:3-14) ఎట్టి పరిస్థితుల్లో మనం సమయం పోనివ్వకూడదు. ఎందుకంటే, ఇప్పుడు “ప్రభువు సేవలో” చేయాల్సింది చాలా ఉంది.—1 కొరిం. 15:58.
22. యెహోవా రోజు కోసం ఎదురుచూస్తుండగా మనం ఏమని నిశ్చయించుకోవాలి?
22 “సంభ్రమాశ్చర్యాలు పుట్టించే యెహోవా మహారోజు” కోసం మనం ఎదురుచూస్తున్నాం. ఈలోపు మనం ధైర్యంగా, నమ్మకంగా సాక్ష్యమిస్తూ ఉండాలని నిశ్చయించుకుందాం. (యోవే. 2:31) “ఎంతో ఆసక్తితో వాక్యాన్ని” అంగీకరించిన బెరయ ప్రజల్లాంటి వాళ్లు మనకు ఇంకా చాలామంది దొరుకుతారు. (అపొ. 17:10, 11) కాబట్టి, “శభాష్, నమ్మకమైన మంచి దాసుడా!” అని యెహోవా చెప్పేంతవరకు, మనం సాక్ష్యం ఇస్తూనే ఉందాం. (మత్త. 25:23) ఇప్పుడు శిష్యుల్ని చేసే పనిలో ఉత్సాహంగా మన వంతు మనం చేస్తూ, యెహోవాకు నమ్మకంగా ఉందాం. అలా చేస్తే, దేవుని రాజ్యం గురించి “పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇచ్చామనే సంతృప్తితో చిరకాలం హాయిగా బ్రతికేస్తాం!