8
మంచివాళ్లతో స్నేహం చేసిన యోషీయా
సరైనది చేయడం కష్టమని మీరనుకుంటున్నారా?— చాలామంది అలా అనుకుంటారు. యోషీయా అనే అబ్బాయికి సరైనది చేయడం చాలా కష్టమయ్యిందని బైబిలు చెబుతోంది. కానీ, మంచి స్నేహితులు అతనికి సహాయం చేశారు. యోషీయా గురించి, అతని స్నేహితుల గురించి ఇప్పుడు ఇంకాస్త తెలుసుకుందాం.
యోషీయావాళ్ల నాన్న ఆమోను యూదాకు రాజు. అతను చాలా చెడ్డోడు, విగ్రహాలను ఆరాధించేవాడు. అతను చనిపోయాక, యోషీయా రాజయ్యాడు. కానీ అప్పుడు యోషీయాకు ఎనిమిదేళ్లే! అతను కూడా వాళ్ల నాన్నలాగే చెడ్డోడా?— కానేకాదు!
విగ్రహాలను ఆరాధించవద్దని జెఫన్యా ప్రజల్ని హెచ్చరించాడు
యెహోవా ఆజ్ఞల్ని పాటించాలనే కోరిక అతనికి చిన్నప్పటి నుండే ఉంది. అందుకే యెహోవాను ప్రేమించే వాళ్లతోనే స్నేహం చేశాడు. సరైనది చేయడానికి ఆ స్నేహితులు యోషీయాకు సహాయం చేశారు. ఇంతకీ వాళ్లలో కొందరు ఎవరు?
ఒక స్నేహితుని పేరు జెఫన్యా. ఈయన ఒక ప్రవక్త. విగ్రహాలను ఆరాధిస్తే దేవుడు శిక్షిస్తాడని ఆయన యూదా ప్రజల్ని హెచ్చరించాడు. యోషీయా ఆ హెచ్చరికను లక్ష్యపెట్టాడు, విగ్రహాల జోలికి పోకుండా యెహోవాను ఆరాధించాడు.
ఇంకో స్నేహితుని పేరు యిర్మీయా. ఆయనది, యోషీయాది దాదాపు ఒకే వయసు. వాళ్లు పెరిగింది దగ్గరిదగ్గరి ప్రాంతాల్లోనే. వాళ్లిద్దరు ఎంత మంచి స్నేహితులంటే, యోషీయా చనిపోయినప్పుడు ఆయనను తలచుకొని బాధపడుతూ యిర్మీయా ఓ ప్రత్యేకమైన పాట రాశాడు. సరైనది చేయడానికి, యెహోవాకు లోబడడానికి యిర్మీయా, యోషీయా ఒకరికొకరు సాయం చేసుకున్నారు.
సరైనది చేయడానికి యోషీయా, యిర్మీయా ఒకరికొకరు సాయం చేసుకున్నారు
యోషీయా నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— యోషీయా చిన్నప్పటినుండే సరైనది చేయాలనుకున్నాడు. యెహోవాను ప్రేమించే వాళ్లతోనే స్నేహం చేయాలన్న విషయం అతనికి తెలుసు. మీరు కూడా యెహోవాను ప్రేమించే వాళ్లతోనే స్నేహం చేయండి, సరైనది చేయడానికి సహాయం చేసేవాళ్లతోనే స్నేహం చేయండి!
మీ బైబిల్లో చదవండి
2 దినవృత్తాంతములు 33:21-25; 34:1,2; 35:25