కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 4 పేజీలు 24-29
  • సంఘం ఎలా సంస్థీకరించబడింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంఘం ఎలా సంస్థీకరించబడింది?
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా పద్ధతిలో సంస్థీకరించడం
  • నేటి సంఘాలు అపొస్తలుల పద్ధతినే పాటిస్తున్నాయి
  • మతపరమైన కార్పొరేషన్ల పాత్ర
  • బ్రాంచి వ్యవస్థీకరణ విధానం
  • సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • సంఘం యెహోవాను స్తుతించును గాక
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మందను కాసే పర్యవేక్షకులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు?
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 4 పేజీలు 24-29

4వ అధ్యాయం

సంఘం ఎలా సంస్థీకరించబడింది?

అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో దేవుని గురించి ఒక ముఖ్యమైన సత్యాన్ని చెప్పాడు. ఆయనిలా రాశాడు: “దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు.” సంఘ కూటాల గురించి ఆయన ఇంకా మాట్లాడుతూ అదే అధ్యాయంలో ఇలా అన్నాడు: “అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం జరగనివ్వండి.”—1 కొరిం. 14:33, 40.

2 ఆ ఉత్తరం మొదట్లోనే, కొరింథు సంఘంలో ఉన్న అభిప్రాయభేదాల విషయంలో అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. వాళ్లు “ఒకే మాట మీద ఉండాలి” అనీ, “ఒకే మనసుతో, ఒకే ఆలోచనాతీరుతో పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉండాలి” అనీ ఆయన ప్రోత్సహించాడు. (1 కొరిం. 1:10, 11) ఆ తర్వాత, సంఘ ఐక్యత పై ప్రభావం చూపించే వివిధ అంశాల విషయంలో కూడా ఆయన సలహా ఇచ్చాడు. మానవ శరీరాన్ని ఉదాహరణగా ఉపయోగించి, క్రైస్తవులు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవడం ఎంత అవసరమో చూపించాడు. క్రైస్తవ సంఘంలో తమ స్థానం ఏదైనా, అందరూ ఒకరిమీద ఒకరు ప్రేమతో శ్రద్ధ చూపించుకోవాలని ఆయన ప్రోత్సహించాడు. (1 కొరిం. 12:12-26) సంఘంలోని వాళ్లమధ్య అలాంటి చక్కని సహకారం ఉంటే సంఘం ఓ క్రమపద్ధతిలో సంస్థీకరించబడి ఉందని అర్థం.

3 అయితే క్రైస్తవ సంఘం ఎలా సంస్థీకరించబడాలి? ఎవరు సంస్థీకరిస్తారు? దాని రూపురేఖలు ఎలా ఉంటాయి? నియమిత స్థానాల్లో ఎవరు సేవచేస్తారు? ఈ విషయంలో బైబిలు నిర్దేశమేంటో పరిశీలిస్తే, వాటికి స్పష్టమైన జవాబులు తెలుసుకుంటాం.—1 కొరిం. 4:6.

దైవపరిపాలనా పద్ధతిలో సంస్థీకరించడం

4 సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవ సంఘం స్థాపించబడింది. మొదటి శతాబ్దంలోని ఆ సంఘం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ సంఘం, దైవపరిపాలనా పద్ధతిలో అంటే దేవుని (గ్రీకులో థియోస్‌) పరిపాలనా (క్రాటోస్‌) కింద సంస్థీకరించబడింది. థియోస్‌, క్రాటోస్‌ అనే ఆ రెండు గ్రీకు పదాల్ని 1 పేతురు 5:10, 11 లో “దేవుడు,” “బలం” అని అనువదించారు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యెరూషలేములో జరిగిన సంఘటన గురించి ప్రేరేపిత లేఖనాలు చెప్తున్న దాన్నిబట్టి, అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని దేవుడే స్థాపించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. (అపొ. 2:1-47) అది దేవుని భవనం, వాళ్లు ఆయన ఇంటివాళ్లు. (1 కొరిం. 3:9; ఎఫె. 2:19) మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంస్థీకరణా విధానాన్ని, కార్యనిర్వహణా పద్ధతిని నేడు క్రైస్తవ సంఘం పాటిస్తుంది.

మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంస్థీకరణా విధానాన్ని, కార్యనిర్వహణా పద్ధతిని నేడు క్రైస్తవ సంఘం పాటిస్తుంది.

5 తొలి క్రైస్తవ సంఘం దాదాపు 120 మంది శిష్యులతో ఆరంభమైంది. యోవేలు 2:28, 29 లోని మాటల నెరవేర్పుగా యెహోవా మొదట వాళ్లమీద పవిత్రశక్తి కుమ్మరించాడు. (అపొ. 2:16-18) అదే రోజున దాదాపు మరో 3,000 మంది నీటి బాప్తిస్మం తీసుకుని, పవిత్రశక్తి చేత అభిషేకించబడినవాళ్ల సంఘంలో భాగమయ్యారు. వాళ్లు క్రీస్తు గురించిన వాక్యాన్ని హత్తుకొని, “అపొస్తలులు బోధించేవాటిని పట్టుదలతో నేర్చుకుంటూ” ఉన్నారు. ఆ తర్వాత, “రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.”—అపొ. 2: 41, 42, 47.

6 ఆ సంఘం ఎంతగా వృద్ధి చెందిందంటే, శిష్యులు యెరూషలేమును తమ బోధతో నింపేశారని యూదుల ప్రధానయాజకుడు ఫిర్యాదు చేశాడు. కొత్తగా శిష్యులైన వాళ్లలో చాలామంది యూదా యాజకులు కూడా ఉన్నారు, వాళ్లు సంఘంలో భాగమయ్యారు.—అపొ. 5:27, 28; 6:7.

7 యేసు ఇలా చెప్పాడు: “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) ఎలాగంటే, స్తెఫను చనిపోయిన తర్వాత యెరూషలేములో తీవ్రమైన హింస చెలరేగడంతో అక్కడ నివసిస్తున్న శిష్యులు యూదయ, సమరయ అంతటా చెదరిపోయారు. కానీ వాళ్లెక్కడికి వెళ్లినా మంచివార్త ప్రకటించడం, ఎక్కువమందిని శిష్యుల్ని చేయడం మాత్రం మానలేదు. కొత్తగా శిష్యులైన వాళ్లలో కొంతమంది సమరయులు కూడా ఉన్నారు. (అపొ. 8:1-13) శిష్యులు ఆ తర్వాత కొంతకాలానికి, సున్నతి పొందని అన్యులకు అంటే యూదులుకాని వాళ్లకు కూడా మంచివార్తను విజయవంతంగా ప్రకటించారు. (అపొ. 10:1-48) ఈ ప్రకటనా పనంతటివల్ల ఎంతోమంది శిష్యులయ్యారు, యెరూషలేము బయట కొత్త సంఘాలు ఏర్పడ్డాయి.—అపొ. 11:19-21; 14:21-23.

8 అలా కొత్తగా ఏర్పడిన ప్రతీ సంఘం దైవపరిపాలనా పద్ధతిలో అంటే దేవుని పద్ధతిలో సంస్థీకరించబడడానికి, పనిచేయడానికి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? దేవుని పవిత్రశక్తి సహాయంతో, ఉపకాపరులు మందను కాసే ఏర్పాటు జరిగింది. పౌలు, బర్నబా మొదటి మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు, వాళ్లు సందర్శించిన సంఘాల్లో పెద్దల్ని నియమించారు. (అపొ. 14:23) పౌలు ఎఫెసు సంఘంలోని పెద్దలతో జరిపిన కూటం గురించి బైబిలు రచయితయైన లూకా రాశాడు. పౌలు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు మీ విషయంలో, అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి. దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.” (అపొ. 20:17, 28) వాళ్లు లేఖన అర్హతల్ని సంపాదించుకున్నారు కాబట్టే సంఘ పెద్దలు అవ్వడానికి అర్హులయ్యారు. (1 తిమో. 3:1-7) క్రేతులో ఉన్న సంఘాల్లో పెద్దల్ని నియమించే అధికారాన్ని పౌలు తోటి పనివాడైన తీతు పొందాడు.—తీతు 1:5.

9 మొదటి శతాబ్దంలో సంఘాల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. విస్తరిస్తున్న అంతర్జాతీయ క్రైస్తవ సంఘానికి అపొస్తలులు, యెరూషలేములో ఉన్న పెద్దలు ముఖ్య పర్యవేక్షకులుగా కొనసాగారు. వాళ్లు పరిపాలక సభగా పనిచేశారు.

10 అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ, క్రైస్తవ సంఘం, దేవుని పవిత్రశక్తి నడిపింపు కింద పనిచేయడంవల్ల యేసుక్రీస్తు శిరస్సత్వానికి లోబడుతూ ఐక్యతను కాపాడుకోగలదని వివరించాడు. వినయంగా ఉంటూ, “పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను” కాపాడుకుంటూ ఉండమని ఆ సంఘంలోని క్రైస్తవుల్ని పౌలు ప్రోత్సహించాడు. (ఎఫె. 4:1-6) ఆ తర్వాత ఆయన కీర్తన 68:18 లోని మాటల్ని ఎత్తి చెప్పాడు. అలాగే యెహోవా చేసిన ఏర్పాటుకు ఆ మాటల్ని అన్వయిస్తూ ఆధ్యాత్మిక అర్హతలున్న పురుషులు సంఘంలో అపొస్తలులుగా, ప్రవక్తలుగా, మంచివార్త ప్రచారకులుగా, కాపరులుగా, బోధకులుగా సేవ చేస్తారని చెప్పాడు. వాళ్లు యెహోవా ఇచ్చిన “వరాలు.” ఎందుకంటే దేవుడు ఇష్టపడే విధంగా సంఘమంతా ఆధ్యాత్మిక పరిణతి సాధించడానికి వాళ్లు సహాయం చేస్తారు.—ఎఫె. 4:7-16.

నేటి సంఘాలు అపొస్తలుల పద్ధతినే పాటిస్తున్నాయి

11 అపొస్తలుల కాలంలో ఉన్నలాంటి సంస్థీకరణ పద్ధతినే నేడున్న యెహోవాసాక్షుల సంఘాలన్నీ పాటిస్తున్నాయి. ఈ సంఘాలన్నీ ప్రపంచవ్యాప్త ఐక్య సంఘంగా రూపొందాయి, పవిత్రశక్తి చేత అభిషేకించబడిన క్రైస్తవులు దానికి కేంద్రంగా ఉన్నారు. (జెక. 8:23) ఇదంతా యేసుక్రీస్తు సాధ్యం చేశాడు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆయన ‘ఈ వ్యవస్థ ముగింపు వరకు ఎప్పుడూ’ తన అభిషిక్త శిష్యులకు తోడుగా ఉన్నాడు. విస్తరిస్తున్న సంఘాల్లోకి వచ్చే ప్రజలు దేవుని గురించిన మంచివార్తను హత్తుకుంటున్నారు, యెహోవాకు తమ జీవితాల్ని పూర్తిగా సమర్పించుకుని, యేసు శిష్యులుగా బాప్తిస్మం తీసుకుంటున్నారు. (మత్త. 28:19, 20; మార్కు 1:14; అపొ. 2:41) అభిషిక్త క్రైస్తవులు అలాగే “వేరే గొర్రెలు” ఉన్న మంద అంతటికీ, “మంచి కాపరి” అయిన యేసుక్రీస్తే శిరస్సని వాళ్లు గుర్తిస్తారు. (యోహా. 10:14,16; ఎఫె. 1:22, 23) ఆ ‘ఒక్క మంద’ క్రీస్తు శిరస్సత్వాన్ని నమ్మకంగా గుర్తించి, ఆయన నియమించిన “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అనే సంస్థీకృత మాధ్యమానికి లోబడుతూ ఐక్యతను కాపాడుకుంటుంది. ఆ మాధ్యమం మీద మనం పూర్తి నమ్మకం ఉంచుదాం!—మత్త. 24:45.

మతపరమైన కార్పొరేషన్ల పాత్ర

12 తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి, అంతం రాకముందే రాజ్య సువార్తను ప్రకటించడానికి కొన్ని కార్పొరేషన్లు స్థాపించబడ్డాయి. ఈ చట్టపరమైన కార్పొరేషన్లకు చాలా దేశాల్లో గుర్తింపు ఉంది, ప్రభుత్వాలు వాటికి సహకరిస్తాయి. ఆ కార్పొరేషన్లు ప్రపంచవ్యాప్తంగా మంచివార్త ప్రకటించడానికి దోహదపడతాయి.

బ్రాంచి వ్యవస్థీకరణ విధానం

13 ఏదైనా ఒక బ్రాంచి కార్యాలయం స్థాపించబడినప్పుడు, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది పెద్దలు ఉన్న ఒక బ్రాంచి కమిటీ నియమించబడుతుంది. అది బ్రాంచి పరిధిలోకి వచ్చే దేశంలో లేదా దేశాల్లో జరిగే పనిని పర్యవేక్షిస్తుంది. దాంట్లో ఒకవ్యక్తి బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవ చేస్తాడు.

14 ప్రతీ బ్రాంచి పరిధిలో ఉన్న స్థానిక సంఘాలు సర్క్యూట్లుగా విభజించబడతాయి. ప్రాంతం, భాష, బ్రాంచి పరిధిలో ఉన్న సంఘాల సంఖ్యను బట్టి ఆ సర్క్యూట్‌ల పరిమాణం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో సర్క్యూట్‌లోని సంఘాలతో కలిసి సేవ చేయడానికి ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు నియమించబడతాడు. ప్రాంతీయ పర్యవేక్షకుడు తన విధుల్ని ఎలా నిర్వర్తించాలో బ్రాంచి కార్యాలయం నిర్దేశిస్తుంది.

15 అందరి ప్రయోజనం కోసం సంస్థ చేసిన ఏర్పాట్లను సంఘాలు గుర్తిస్తాయి. బ్రాంచీల్లో, సర్క్యూట్లలో, సంఘాల్లో జరుగుతున్న పనిని పర్యవేక్షించే పెద్దల నియామకాన్ని సంఘాలు స్వీకరిస్తాయి. అంతేకాదు, అవి తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం కోసం నమ్మకమైన, బుద్ధిగల దాసుని మీద ఆధారపడతాయి. నేడు ఆ నమ్మకమైన దాసుడు కూడా క్రీస్తు శిరస్సత్వానికి ఖచ్చితంగా లోబడుతూ, బైబిలు సూత్రాలకు కట్టుబడివుంటూ, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం పనిచేస్తాడు. మనందరం ఐక్యంగా పనిచేస్తే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు పొందిన ఈ ఫలితాల్నే మనమూ పొందుతాం: “సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.”—అపొ. 16:5.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి