కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 14 పేజీలు 141-156
  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చిన్నచిన్న అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడం
  • అవసరమైన లేఖనాధార సలహా ఇవ్వడం
  • పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం
  • కొన్నిరకాల ఘోరమైన తప్పుల్ని పరిష్కరించడం
  • ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తులతో వ్యవహరించడం
  • గద్దింపుకు సంబంధించిన ప్రకటన
  • ఒకవేళ బహిష్కరించాలని నిర్ణయిస్తే . . .
  • బహిష్కరణ గురించిన ప్రకటన
  • సహవాసం తెంచేసుకోవడం
  • తిరిగి చేర్చుకోవడం
  • తిరిగి చేర్చుకోవడానికి సంబంధించిన ప్రకటన
  • బాప్తిస్మం తీసుకున్న మైనరు పిల్లల కేసులు
  • బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు తప్పు చేస్తే . . .
  • శాంతియుతమైన, పవిత్రమైన ఆరాధనను యెహోవా దీవిస్తాడు
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పాపం చేసినవాళ్ల మీద పెద్దలు ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • సంఘం నుండి తొలగించబడిన వాళ్లకు పెద్దలు ఎలా సహాయం చేస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • పెద్దలు, నీతిననుసరించి తీర్పుతీర్చుదురు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 14 పేజీలు 141-156

14వ అధ్యాయం

సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం

బైబిలు ప్రవచన నెరవేర్పుగా, ప్రతీ సంవత్సరం వేలమంది ప్రజలు యెహోవా స్వచ్ఛారాధన మందిరానికి ప్రవాహంలా తరలి వస్తున్నారు. (మీకా 4:1, 2) మనం వాళ్లను ‘దేవుని సంఘంలోకి’ ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తాం. (అపొ. 20:28) మనతో కలిసి యెహోవాను సేవించే అవకాశం దొరికినందుకు, ఆధ్యాత్మిక పరదైసులోని పవిత్రమైన, శాంతికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నందుకు వాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు. సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడానికి దేవుని పవిత్రశక్తి, ఆయన వాక్యంలోని తెలివైన సలహాలు మనకు సహాయం చేస్తాయి.—కీర్త. 119:105; జెక. 4:6.

2 మనం బైబిలు సూత్రాల్ని పాటించడం ద్వారా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటాం. (కొలొ. 3:10) కాబట్టి మనం చిన్నచిన్న వివాదాలను, అభిప్రాయభేదాల్ని పట్టించుకోం. అంతేకాదు, విషయాల్ని మనం యెహోవా చూసినట్లు చూస్తాం, విభజనలు సృష్టించే ఈ లోక ప్రభావాల్ని తిప్పికొడతాం, మన అంతర్జాతీయ సహోదర బృందంతో ఐక్యంగా పనిచేస్తాం.—అపొ. 10:34, 35.

3 అయినప్పటికీ, అప్పుడప్పుడు సంఘ శాంతిపై, ఐక్యతపై ప్రభావం చూపించే పరిస్థితులు తలెత్తవచ్చు. దానికి కారణమేమిటి? చాలావరకు, బైబిలు సలహాల్ని పాటించకపోవడమే దానికి కారణం. అపరిపూర్ణత వల్ల వచ్చిన మానవ బలహీనతలతో మనం ఇప్పటికీ పోరాడాల్సి ఉంది. పైగా, మనలో పాపం లేనివాళ్లు ఎవ్వరూ లేరు. (1 యోహా. 1:10) కొన్నిసార్లు, ఒక వ్యక్తి వేసే తప్పటడుగు వల్ల సంఘ నైతిక లేదా ఆధ్యాత్మిక పవిత్రత పాడవ్వవచ్చు. అంతేకాదు మనం అనాలోచితంగా అన్న మాటలవల్ల లేదా చేసిన పనులవల్ల ఇతరుల్ని నొప్పించివుంటాం. లేదా మనమే ఇతరులు అన్నదానికి లేదా చేసినదానికి నొచ్చుకొనివుంటాం. (రోమా. 3:23) మరి అలాంటి పరిస్థితుల్లో విషయాలను సరిచేయడానికి మనం ఏమి చేయవచ్చు?

4 యెహోవా ఈ విషయాలన్నిటినీ ప్రేమతో పరిగణనలోకి తీసుకుంటున్నాడు. సమస్యలు తలెత్తినప్పుడు ఏమి చేయాలో ఆయన వాక్యం మనకు సలహాలు ఇస్తుంది. అంతేకాదు, వ్యక్తిగత సహాయం అందించడానికి ప్రేమగల ఆధ్యాత్మిక కాపరులైన సంఘ పెద్దలు అందుబాటులో ఉన్నారు. వాళ్లు ఇచ్చే లేఖనాధార సలహాల్ని పాటించడం ద్వారా, మనం ఇతరులతో మళ్లీ మంచి సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు, అలాగే యెహోవా దగ్గర మంచి పేరును కాపాడుకోవచ్చు. మనం చేసిన ఒక తప్పుకు పెద్దలు క్రమశిక్షణను లేదా గద్దింపును ఇచ్చినప్పుడు, ఆ దిద్దుబాటు మన పరలోక తండ్రికి మన మీదున్న ప్రేమకు నిదర్శనం అనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—సామె. 3:11, 12; హెబ్రీ. 12:6.

చిన్నచిన్న అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడం

5 కొన్నిసార్లు, సంఘంలోని సహోదరసహోదరీల మధ్య అభిప్రాయభేదాలు లేదా చిన్నచిన్న సమస్యలు తలెత్తవచ్చు. అలాంటప్పుడు, సహోదర ప్రేమతో వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. (ఎఫె. 4:26; ఫిలి. 2:2-4; కొలొ. 3:12-14) తోటి క్రైస్తవునితో మీకు ఏదైనా సమస్య వస్తే, అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ సలహాను పాటించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు: “ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి. ఎందుకంటే ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.” (1 పేతు. 4:8) బైబిలు ఇలా చెప్తుంది: “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.” (యాకో. 3:2) బంగారు సూత్రాన్ని పాటిస్తూ, ఇతరులు మనకు ఏమేమి చేయాలని మనం కోరుకుంటామో, వాళ్లకు అవన్నీ చేస్తే, మనం మామూలుగా చిన్నచిన్న పొరపాట్లను క్షమించి, మర్చిపోవచ్చు.—మత్త. 6:14, 15; 7:12.

6 మీ మాటలవల్ల లేదా పనులవల్ల ఎవరైనా నొచ్చుకున్నారని మీకు అనిపిస్తే, వాళ్లతో వెంటనే సమాధానపడడానికి మీరే చొరవ తీసుకోవాలి. అది యెహోవాతో మీకున్న సంబంధంపై కూడా ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకోండి. యేసు తన శిష్యులకు ఈ సలహా ఇచ్చాడు: “కాబట్టి, నువ్వు బలిపీఠం దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి ముందు నీ సహోదరునితో సమాధానపడు; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.” (మత్త. 5:23, 24) బహుశా ఒకరినొకరు అపార్థం చేసుకొని ఉండొచ్చు. విషయం అదే అయితే, దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి. సంఘంలోని వాళ్లందరూ అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం వల్ల చాలావరకు అపార్థాలు తలెత్తకుండా చూసుకోవచ్చు, అపరిపూర్ణతవల్ల తలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.

అవసరమైన లేఖనాధార సలహా ఇవ్వడం

7 కొన్నిసార్లు, ఓ వ్యక్తి ఆలోచనను సరిదిద్దడానికి అతనికి సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందని పర్యవేక్షకులు గుర్తించవచ్చు. అది అన్నిసార్లూ అంత తేలిక కాదు. అపొస్తలుడైన పౌలు గలతీయలోని క్రైస్తవులకు ఇలా రాశాడు: “సహోదరులారా, ఒక వ్యక్తి తెలియక తప్పటడుగు వేసినా సరే, పరిణతిగల మీరు సౌమ్యంగా అతన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి.”—గల. 6:1.

8 పర్యవేక్షకులు మందను చక్కగా కాయడం వల్ల, సంఘాన్ని ఎన్నో ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడవచ్చు; సంఘంలో పెద్దపెద్ద సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. యెషయా ద్వారా యెహోవా చేసిన ఈ వాగ్దానానికి తగినట్లుగా, పెద్దలు సంఘంలో సేవలు అందించడానికి కృషి చేస్తారు: “ప్రతీ ఒక్కరు గాలికి చాటైన చోటులా, తుఫాను నుండి దాక్కునే చోటులా, నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా, ఎండిపోయిన దేశంలో పెద్ద బండ నీడలా ఉంటారు.”—యెష. 32:2.

పద్ధతిగా నడుచుకోని వాళ్లకు గుర్తువేయడం

9 సంఘం మీద చెడు ప్రభావం చూపించగల కొంతమంది గురించి అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. ఆయనిలా రాశాడు: “పద్ధతిగా నడుచుకోని ప్రతీ సహోదరునికి, మా నుండి మీరు అందుకున్న నిర్దేశాల ప్రకారం నడుచుకోని ప్రతీ సహోదరునికి దూరంగా ఉండమని . . . మీకు నిర్దేశాలు ఇస్తున్నాం.” ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయనిలా రాశాడు: “ఎవరైనా మేము ఈ ఉత్తరంలో చెప్పిన మాటకు లోబడకపోతే, అతను సిగ్గుపడేలా అతనికి గుర్తువేసి అతనితో సహవాసం మానేయండి. అయితే అతన్ని శత్రువుగా చూడకండి, బదులుగా అతన్ని సహోదరుడిగా భావించి ఉపదేశిస్తూ ఉండండి.”—2 థెస్స. 3:6, 14, 15.

10 కొన్నిసార్లు, ఒక వ్యక్తి సంఘం నుండి వెలివేయబడేంత ఘోరమైన తప్పు చేయకపోయినప్పటికీ, క్రైస్తవుల్ని నిర్దేశించే దేవుని ప్రమాణాల పట్ల అసలేమాత్రం గౌరవం లేదని అతను చూపిస్తుండవచ్చు. వాటిలో విపరీతమైన సోమరితనం, ఇతరుల్ని విమర్శించడం, లేదా అపరిశుభ్రంగా ఉండడం లాంటివి ఉండవచ్చు. అతను “తనకు సంబంధంలేని విషయాల్లో” తలదూరుస్తుండవచ్చు. (2 థెస్స. 3:11) లేదా ఇతరుల నుండి వస్తుపరమైన లాభం పొందడానికి పన్నాగాలు వేసే వ్యక్తై ఉండవచ్చు లేదా క్రైస్తవులు అస్సలు చూడకూడని వినోదంలో మునిగిపోయి ఉండవచ్చు. అలాంటి పద్ధతిలేని ప్రవర్తన సంఘంపై చెడు ప్రభావం చూపించేంత గంభీరమైనది. అంతేకాదు, ఇతర సహోదరసహోదరీలు కూడా అతనిలాగే ప్రవర్తించే ప్రమాదం ఉంది.

11 పెద్దలు ముందుగా బైబిలు ఆధారిత సలహా ఇవ్వడం ద్వారా పద్ధతిగా నడుచుకోని వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఎన్నిసార్లు దిద్దుబాటును ఇచ్చినా అతను బైబిలు సూత్రాల్ని లెక్కచేయకపోతుంటే, పెద్దలు సంఘానికి ఒక హెచ్చరికా ప్రసంగాన్ని ఇవ్వాలని నిర్ణయించవచ్చు. అయితే, ఫలానా పరిస్థితి ఎంత గంభీరమైనది, అది ఇతరుల్ని ఎంతగా ఇబ్బంది పెడుతోంది అనేవి వివేచనతో పరిశీలించి హెచ్చరికా ప్రసంగం అవసరమో కాదో నిర్ణయిస్తారు. ప్రసంగీకుడు, పద్ధతిగా లేని ప్రవర్తన విషయంలో సరైన సలహా ఇస్తాడు, కానీ పద్ధతిగా నడుచుకోని వ్యక్తి పేరును ప్రస్తావించడు. దానివల్ల, ఆ ప్రసంగంలో ప్రస్తావించబడిన పరిస్థితి గురించి తెలిసినవాళ్లు అలాంటి వ్యక్తిని ఆటవిడుపుల వంటివాటిలో కలుపుకొని అనవసరంగా సహవాసం చేయరు. అయితే, వాళ్లు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో అతనితో సహవాసాన్ని కొనసాగిస్తూ, “అతన్ని సహోదరుడిగా భావించి ఉపదేశిస్తూ” ఉంటారు.

12 నమ్మకమైన క్రైస్తవులు అలా స్థిరంగా ఉండడంవల్ల, పద్ధతిగా నడుచుకోని వ్యక్తి తన పనుల విషయంలో సిగ్గుపడి, తన ప్రవర్తనను మార్చుకునేలా సహాయం చేసినవాళ్లు అవుతారు. అతని ప్రవర్తనలో మంచి మార్పు వచ్చిందని స్పష్టంగా కనిపించినప్పుడు, అతన్ని ఇక గుర్తు వేయబడిన వ్యక్తిగా పరిగణించాల్సిన అవసరం లేదు.

కొన్నిరకాల ఘోరమైన తప్పుల్ని పరిష్కరించడం

13 తప్పుల్ని పట్టించుకోకపోవడం, వాటిని క్షమించడం అంటే దానర్థం తప్పుల్ని చూసీచూడనట్లు వదిలేస్తామని లేదా వాటిని ఆమోదిస్తామని కాదు. అయితే, అన్ని తప్పులకూ కారణం వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత కాకపోవచ్చు; పెద్దపెద్ద తప్పుల్ని కూడా చూసీచూడనట్లు వదిలేయడం సరికాదు. (లేవీ. 19:17; కీర్త. 141:5) కొన్నిరకాల పాపాలు మిగతా పాపాల కన్నా చాలా గంభీరమైనవని ధర్మశాస్త్ర ఒప్పందం చెప్తుంది, క్రైస్తవ ఏర్పాటులో కూడా అది అంతే నిజం.—1 యోహా. 5:16, 17.

14 తోటి క్రైస్తవుల మధ్య తలెత్తగల గంభీరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఓ నిర్దిష్టమైన పద్ధతి గురించి యేసు చెప్పాడు. ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పాడో గమనించండి: “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, [1] నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి. అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే. కానీ అతను నీ మాట వినకపోతే, [2] నీతోపాటు ఒకరిద్దర్ని తీసుకెళ్లు. అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా ప్రతీ విషయం నిర్ధారించబడుతుంది. అతను వాళ్ల మాట వినకపోతే, [3] సంఘానికి ఆ విషయం తెలియజేయి. అతను సంఘం మాట కూడా వినకపోతే, అతన్ని నీకు అన్యజనుల్లో ఒకడిగా, పన్ను వసూలుచేసేవాడిగా ఉండనీ.”—మత్త. 18:15-17.

15 ఆ తర్వాత యేసు ఒక ఉపమానం చెప్పాడు, అది మత్తయి 18:23-35 వచనాల్లో నమోదు చేయబడింది. ఆ ఉపమానం బట్టి చూస్తే, మత్తయి 18:15-17 వచనాల్లో ఆయన చెప్పిన పాపాల్లో ఒకటి అప్పు తీర్చకపోవడం లేదా మోసం చేయడం వంటి ఆర్థిక లేదా ఆస్తిపాస్తులకు సంబంధించిందని అనిపిస్తుంది. లేదా అది ఒక వ్యక్తికున్న మంచి పేరును బాగా పాడు చేయడానికి అతని మీద లేనిపోనివి చెప్పడమనే పాపం గురించి అయ్యుండవచ్చు.

16 ఒకవేళ సంఘంలో ఎవరైనా మీ విషయంలో అలాంటి పాపం చేసినట్టు ఆధారాలు మీ దగ్గర ఉంటే, తొందరపడి పెద్దల దగ్గరికి వెళ్లకండి, మీ తరఫున మాట్లాడమని వాళ్లను అడగకండి. యేసు సలహా ఇచ్చినట్లు, మీ విషయంలో తప్పుచేసిన వ్యక్తితో మొదట వెళ్లి మాట్లాడండి. వేరేవాళ్లను అందులోకి లాగకుండా, మీ ఇద్దరి మధ్యే సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ‘ఒక్కసారి మాత్రమే వెళ్లి, అతని తప్పును తెలియజేయి’ అని యేసు చెప్పలేదని గుర్తుంచుకోండి. కాబట్టి, ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకోకుండా, క్షమాపణ అడగకుండా ఉంటే, అతణ్ణి మరోసారి కలవడం మంచిది. ఈ విధంగా, సమస్య మీ ఇద్దరి మధ్యే పరిష్కారమైపోతే, మీరు తన తప్పును ఇతరులకు చెప్పనందుకు, సంఘంలో తనకున్న మంచి పేరును పాడు చేయనందుకు, అతను ఖచ్చితంగా మీపట్ల కృతజ్ఞతతో ఉంటాడు. అలా మీరు మీ ‘సహోదరుణ్ణి సంపాదించుకుంటారు.’

17 ఒకవేళ, తప్పు చేసిన వ్యక్తి దాన్ని ఒప్పుకొని, క్షమాపణ అడిగి, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకుంటే, ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలి. ఆ తప్పు పెద్దదే అయినప్పటికీ అలాంటివాటిని ఇద్దరి వ్యక్తుల మధ్యే పరిష్కరించుకోవచ్చు.

18 ఒకవేళ “మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును” అతనికి తెలియజేసినా మీ సహోదరుణ్ణి సంపాదించుకోలేకపోతే, యేసు చెప్పినట్లుగా మీతోపాటు “ఒకరిద్దర్ని” తీసుకెళ్లి మీ సహోదరునితో మళ్లీ మాట్లాడవచ్చు. అయితే, మీతో వచ్చేవాళ్లకు కూడా ‘మీ సహోదరుణ్ణి సంపాదించుకోవాలనే’ లక్ష్యం ఉండాలి. వీలైతే, మీతో వచ్చేవాళ్లు ఆ తప్పుకు ప్రత్యక్ష సాక్షులై ఉండాలి. ఒకవేళ దానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోతే, మీరు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు సాక్ష్యంగా ఉండడానికి ఒకరిద్దరిని మీతో తీసుకెళ్లవచ్చు. బహుశా, తలెత్తిన సమస్యకు సంబంధించిన విషయంపై వాళ్లకు అనుభవం ఉండవచ్చు; అంతేకాదు, జరిగింది నిజంగా తప్పో కాదో నిర్ధారించే సామర్థ్యం వాళ్లకు ఉండవచ్చు. అలా సాక్షులుగా ఉండడానికి మీరు సంఘ పెద్దల్ని తీసుకెళ్తుంటే, వాళ్లు ఆ సందర్భంలో సంఘానికి ప్రాతినిధ్యం వహించరు. ఎందుకంటే, ఆ సమస్యను పరిష్కరించడానికి పెద్దల సభ వాళ్లను నియమించలేదు.

19 ఒకవేళ మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటే, అతనితో ఒంటరిగా మాట్లాడినా, లేదా ఒకరిద్దర్ని తీసుకెళ్లి మాట్లాడినా, సమస్య పరిష్కారం కాకపోతే, ఆ విషయం మిమ్మల్ని ఇంకా ఇబ్బందిపెడుతుంటే, అప్పుడు దాన్ని సంఘంలోని పర్యవేక్షకుల దృష్టికి తీసుకెళ్లాలి. సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడమే పర్యవేక్షకుల లక్ష్యమని గుర్తుంచుకోండి. మీరు విషయాన్ని పెద్దల దగ్గరకు తీసుకొచ్చాక, దాన్ని వాళ్లకు వదిలేసి, యెహోవాపై నమ్మకం ఉంచాలి. ఇతరుల ప్రవర్తన వల్ల మీరు తడబడకండి లేదా యెహోవా సేవలో మీ ఆనందాన్ని పోగొట్టుకోకండి.—కీర్త. 119:165.

20 మందను కాసే కాపరులు ఆ విషయాన్ని విచారణ చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి మీపట్ల నిజంగానే ఘోరమైన పాపం చేశాడని రుజువైతే, అతను పశ్చాత్తాపం చూపించకపోతే అలాగే సరైన నష్టపరిహారం చెల్లించకపోతే, పర్యవేక్షకులతో కూడిన ఓ కమిటీ, అతణ్ణి సంఘం నుండి బహిష్కరించాల్సి రావచ్చు. ఆ విధంగా వాళ్లు మందను అలాగే సంఘ పవిత్రతను కాపాడతారు.—మత్త. 18:17.

ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తులతో వ్యవహరించడం

21 కొన్నిరకాల ఘోరమైన తప్పులు అంటే లైంగిక పాపం, వ్యభిచారం, సలింగ సంయోగం, దైవదూషణ, మతభ్రష్టత్వం, విగ్రహారాధన అలాగే అలాంటి మరితర ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తులు, కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు. (1 కొరిం. 6:9, 10; గల. 5:19-21) అలాంటి ఘోరమైన పాపాలవల్ల సంఘ ఆధ్యాత్మిక, నైతిక పవిత్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి, వాటిని పెద్దల దృష్టికి తప్పకుండా తీసుకెళ్లాలి, పెద్దలు వాటి విషయంలో చర్యలు తీసుకుంటారు. (1 కొరిం. 5:6; యాకో. 5:14, 15) కొంతమంది తాము చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి లేదా ఇతరుల పాపం గురించి తమకు తెలిసింది చెప్పడానికి పెద్దల్ని సమీపించవచ్చు. (లేవీ. 5:1; యాకో. 5:16) సంఘంలో బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి చేసిన ఘోరమైన తప్పుల గురించి పెద్దలకు ఎలా తెలిసినప్పటికీ, ఆ విషయాన్ని ముందుగా ఇద్దరు పెద్దలు విచారణ చేస్తారు. ఆ విషయంలో వాస్తవం ఉందని తేలినప్పుడు, ఘోరమైన పాపం జరిగిందని చెప్పడానికి రుజువులు ఉన్నప్పుడు, ఆ విషయాన్ని పరిశీలించడం కోసం పెద్దల సభ, కనీసం ముగ్గురు పెద్దలున్న న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేస్తుంది.

22 పెద్దలు మందను శ్రద్ధగా కనిపెట్టుకొని ఉంటూ, ఆధ్యాత్మిక హాని కలిగించే ప్రతీదాని నుండి దాన్ని కాపాడడానికి కృషిచేస్తారు. అంతేకాదు తప్పు చేసినవాళ్లను గద్దించడానికి, వాళ్లు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా సహాయం చేయడానికి, పెద్దలు దేవుని వాక్యాన్ని నేర్పుగా ఉపయోగించడానికి కూడా కృషిచేస్తారు. (యూదా 21-23) ఇది, అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా ఉంది. ఆయనిలా రాశాడు: “దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తుయేసు . . . బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పుతీరుస్తాడు. . . . సంపూర్ణమైన ఓర్పుతో, బోధనాకళతో గద్దించు, గట్టిగా హెచ్చరించు, ప్రోత్సహించు.” (2 తిమో. 4:1, 2) అలా చేయడానికి చాలా సమయం పట్టొచ్చు, కానీ పెద్దలు కష్టపడి చేసే పనుల్లో అదొకటి. సంఘంలోని సహోదరసహోదరీలు పెద్దలు చేసే కృషిని విలువైనదిగా చూస్తూ, వాళ్లను “రెట్టింపు గౌరవానికి” అర్హులుగా ఎంచుతారు.—1 తిమో. 5:17.

23 ఓ వ్యక్తి తప్పు చేశాడని నిర్ధారణ అయిన ప్రతీ సందర్భంలో, అతన్ని ఆధ్యాత్మిక ఆరోగ్యానికి తిరిగి తీసుకురావడానికి పర్యవేక్షకులు ప్రధానంగా కృషిచేస్తారు. అతను నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, వాళ్లు అతనికి సహాయం చేయగలుగుతారు; ఏకాంతంగా గానీ, న్యాయవిచారణలో సాక్ష్యం చెప్పినవాళ్ల సమక్షంలో గానీ పెద్దలు ఇచ్చే గద్దింపు అతనికి ఒక క్రమశిక్షణలా పనిచేస్తుంది, చూసేవాళ్లలో అది ఆరోగ్యకరమైన భయాన్ని నింపుతుంది. (2 సమూ. 12:13; 1 తిమో. 5:20) న్యాయపరమైన గద్దింపు ఇవ్వబడిన ప్రతీఒక్కరిపై ఆంక్షలు విధించబడతాయి. అలా తప్పుచేసిన వ్యక్తి ఇకమీదట తన “పాదాల కోసం దారుల్ని చదును” చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది. (హెబ్రీ. 12:13) కొంతకాలానికి, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా కోలుకుంటున్నట్లు కనిపిస్తే, అతనికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తారు.

గద్దింపుకు సంబంధించిన ప్రకటన

24 తప్పు చేసిన ఓ వ్యక్తి పశ్చాత్తాపం చూపిస్తున్నాడని న్యాయవిచారణ కమిటీ నిర్ధారించిన తర్వాత, ఆ తప్పు గురించి సంఘంలో లేదా సమాజంలో తెలిసే అవకాశం ఉందనిపిస్తే, లేదా సంఘంలోనివాళ్లు పశ్చాత్తాపం చూపించిన వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనిపిస్తే, క్రైస్తవ జీవితం, పరిచర్య కూటంలో ఓ చిన్న ప్రకటన చేయబడుతుంది. ఆ ప్రకటన ఇలా చదవాలి, “సహోదరుడు/సహోదరి [ఆ వ్యక్తి పేరు] గద్దించబడ్డారు.”

ఒకవేళ బహిష్కరించాలని నిర్ణయిస్తే . . .

25 కొన్ని సందర్భాల్లో, తప్పు చేసిన వ్యక్తి తన పాపపు ప్రవర్తన విషయంలో మొండిగా మారిపోతాడు; అప్పుడు అతను పెద్దలు అందించే సహాయానికి స్పందించడు. అలాగే న్యాయవిచారణ జరుగుతున్న సమయంలో, “పశ్చాత్తాపానికి తగిన పనులు” సరిపడా అతనిలో కనిపించకపోవచ్చు. (అపొ. 26:20) మరి అప్పుడేంటి? అలాంటి సందర్భాల్లో, పశ్చాత్తాపం చూపించని తప్పిదస్థుణ్ణి సంఘం నుండి వెలివేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా, యెహోవా దేవుని పవిత్రమైన ప్రజలతో సహవసించకుండా అతన్ని దూరం పెడతాం. తప్పిదస్థుని చెడు ప్రభావం సంఘం నుండి తీసివేయబడుతుంది; ఆ విధంగా సంఘ నైతిక, ఆధ్యాత్మిక పవిత్రత అలాగే సంఘానికున్న మంచి పేరు కాపాడబడతాయి. (ద్వితీ. 21:20, 21; 22:23, 24) అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘంలోని ఓ వ్యక్తి చేసిన సిగ్గుకరమైన పని గురించి తెలుసుకున్నప్పుడు, ‘సంఘ స్ఫూర్తి కాపాడబడేలా అతన్ని సాతానుకు అప్పగించమని’ అక్కడి పెద్దలకు సలహా ఇచ్చాడు. (1 కొరిం. 5:5, 11-13) మొదటి శతాబ్దంలో, సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల బహిష్కరించబడిన ఇతరుల గురించి కూడా పౌలు తెలియజేశాడు.—1 తిమో. 1:20.

26 తప్పు చేసి పశ్చాత్తాపం చూపించని ఓ వ్యక్తిని బహిష్కరించాలని న్యాయనిర్ణయ కమిటీ నిర్ధారిస్తే, ఆ విషయాన్ని ఆ వ్యక్తికి తెలియజేయాలి. బహిష్కరించడానికి గల లేఖనాధార కారణాన్ని లేదా కారణాలను స్పష్టంగా చెప్పాలి. తీసుకున్న నిర్ణయం గురించి తప్పిదస్థునికి తెలియజేసిన తర్వాత, ఆ నిర్ణయంలో ఏదైనా గంభీరమైన తప్పు జరిగిందని అతనికి గట్టిగా అనిపించి, దానిగురించి అప్పీలు చేసుకోవాలని అతను కోరుకుంటే, ఆ అప్పీలును ఉత్తరం రూపంలో ఇవ్వమనీ, అప్పీలుకు కారణాల్ని స్పష్టంగా అందులో రాసి ఇవ్వాలనీ కమిటీ అతనికి చెప్తుంది. అప్పీలు చేసుకోవడం కోసం, కమిటీ నిర్ణయాన్ని అతనికి తెలియజేసిన రోజు నుండి ఏడు రోజుల గడువును ఇస్తారు. ఒకవేళ అతను అప్పీలు చేసుకుంటే, పెద్దల సభ ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి సంప్రదిస్తుంది. అప్పుడు, ప్రాంతీయ పర్యవేక్షకుడు అర్హులైన కొంతమంది పెద్దల్ని ఎంపిక చేసి, కేసును మళ్లీ వినడానికి అప్పీలు కమిటీగా వాళ్లను ఏర్పాటు చేస్తాడు. ఆ కమిటీలోని పెద్దలు, ఉత్తరం అందుకున్న వారంలోపే ఆ వ్యక్తి చేసుకునే అప్పీలును వినడానికి ప్రతీ ప్రయత్నం చేస్తారు. అప్పీలు చేసుకుంటే, బహిష్కరణకు సంబంధించిన ప్రకటన వాయిదా వేయబడుతుంది. ఈలోపు, ఆ తప్పిదస్థుడు వ్యాఖ్యానాలు చేయడంపై, కూటాల్లో ప్రార్థించడంపై, ప్రత్యేక సేవావకాశాలు పొందడంపై ఆంక్షలు విధించబడతాయి.

27 అప్పీలు చేసుకోవడం అనేది, తప్పు చేసిన వ్యక్తి తన వాదనకు సంబంధించి ఇంకేదైనా చెప్పుకోవడానికి దయతో చేయబడిన ఏర్పాటు. కాబట్టి, అప్పీలు కమిటీ ముందు తన వాదనను వినిపించుకునే సమయంలో ఉద్దేశపూర్వకంగా హాజరవ్వకపోతే, అతనితో మాట్లాడే ప్రయత్నాలు తగినన్ని చేసిన తర్వాత, అతని బహిష్కరణ గురించిన ప్రకటన చేస్తారు.

28 ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి అప్పీలు చేసుకోవడానికి ఇష్టపడకపోతే, పశ్చాత్తాపపడాల్సిన అవసరం గురించి న్యాయనిర్ణయ కమిటీ అతనికి వివరిస్తుంది. భవిష్యత్తులో అతను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అతనికి తెలియజేస్తుంది. అది సహాయకరంగా ఉంటుంది, దయతో కూడుకున్నది; అతను తన పద్ధతి మార్చుకొని యెహోవా సంస్థలోకి తిరిగి రావడానికి తగిన సమయంలో అర్హత సాధిస్తాడనే నమ్మకంతో కమిటీ ఆ పని చేయాలి.—2 కొరిం. 2:6, 7.

బహిష్కరణ గురించిన ప్రకటన

29 తప్పు చేసి పశ్చాత్తాపపడని ఒక వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించాల్సి వస్తే, ఇలా ఓ చిన్న ప్రకటన చేస్తారు: “[ఆ వ్యక్తి పేరు] ఇకపై యెహోవాసాక్షి కాదు.” ఆ ప్రకటన ఆ వ్యక్తితో సహవసించడం ఆపేయమని సంఘంలోని నమ్మకమైన సహోదరసహోదరీలను అప్రమత్తం చేస్తుంది.—1 కొరిం. 5:11.

సహవాసం తెంచేసుకోవడం

30 “సహవాసం తెంచేసుకోవడం” అంటే, బాప్తిస్మం తీసుకున్న ఒక వ్యక్తి తాను ఓ యెహోవాసాక్షిగా గుర్తించబడడానికి ఇష్టపడట్లేదని పేర్కొంటూ, ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ స్థానాన్ని నిరాకరించడం. లేదా క్రైస్తవ సంఘంలో తనకున్న స్థానాన్ని తన పనుల ద్వారా అంటే, బైబిలు బోధలకు విరుద్ధమైన ఉద్దేశాలు కలిగివుండి, యెహోవా దేవుని తీర్పుకు గురయ్యే సంస్థల్లో చేరడం ద్వారా తిరస్కరించవచ్చు.—యెష. 2:4; ప్రక. 19:17-21.

31 తన కాలంలో క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాళ్ల గురించి అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “వాళ్లు మన మధ్యే ఉండేవాళ్లు, కానీ మనల్ని వదిలి వెళ్లిపోయారు, వాళ్లు మనవాళ్లు కాదు. వాళ్లు మనవాళ్లయితే మనతోనే ఉండేవాళ్లు.”—1 యోహా. 2:19.

32 ఒక వ్యక్తి తనంతట తాను సహవాసం తెంచేసుకుంటే యెహోవా ముందు అతని పరిస్థితి, పరిచర్యలో భాగం వహించని నిష్క్రియుడైన క్రైస్తవుని పరిస్థితి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయకపోవడం వల్ల నిష్క్రియుడై ఉండొచ్చు. లేదా తన వ్యక్తిగత సమస్యల వల్ల లేదా హింస వల్ల, యెహోవా సేవలో ఉత్సాహాన్ని కోల్పోవడం వల్ల నిష్క్రియుడై ఉండవచ్చు. పెద్దలు, అలాగే సంఘంలోని ఇతరులు అలాంటివాళ్లకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని అందిస్తూనే ఉంటారు.—రోమా. 15:1; 1 థెస్స. 5:14; హెబ్రీ. 12:12.

33 దానికి భిన్నంగా, ఓ క్రైస్తవుడు తనంతట తాను సహవాసం తెంచేసుకున్నప్పుడు, ఆ విషయాన్ని సంఘానికి తెలియజేయడానికి ఇలా ఓ చిన్న ప్రకటన చేస్తారు: “[ఆ వ్యక్తి పేరు] ఇకపై యెహోవాసాక్షి కాదు.” బహిష్కరించబడిన వ్యక్తితో వ్యవహరించినట్లే ఆ వ్యక్తితో వ్యవహరించాలి.

తిరిగి చేర్చుకోవడం

34 బహిష్కరించబడిన వ్యక్తి లేదా సంఘంతో సహవాసం తెంచేసుకున్న వ్యక్తి, నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడనీ గత కొంతకాలంగా పాపపు ప్రవర్తనను మానుకున్నాడనీ స్పష్టంగా చూపిస్తే, అతణ్ణి సంఘంలోకి తిరిగి చేర్చుకోవచ్చు. అంతేకాదు, తాను యెహోవాతో మంచి సంబంధం కలిగివుండాలని కోరుకుంటున్నట్టు అతను చూపిస్తాడు. అయితే, ఆ వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడని నిరూపించుకోవడానికి, పెద్దలు జాగ్రత్తగా కొంత సమయాన్ని అంటే, పరిస్థితుల్ని బట్టి చాలా నెలలు, ఓ సంవత్సరం, లేదా అంతకన్నా ఎక్కువ కాలం అనుమతిస్తారు. సంఘంలోకి తిరిగి చేర్చుకోమని కోరుతూ రాసే ఉత్తరాన్ని పెద్దల సభ అందుకున్నప్పుడు, తిరిగి చేర్చుకునే కమిటీ అతనితో మాట్లాడుతుంది. అతను “పశ్చాత్తాపానికి తగిన పనులు” చేస్తున్నాడో లేదో ఆ కమిటీ పరిశీలించి, సంఘంలోకి తిరిగి చేర్చుకోవడానికి అతను ఆ సమయానికి అర్హుడో కాదో నిర్ణయిస్తుంది.—అపొ. 26:20.

35 ఒకవేళ సంఘంలోకి తిరిగి చేర్చుకోమని కోరుతున్న వ్యక్తి, వేరే సంఘంలో బహిష్కరించబడిన వ్యక్తయితే, స్థానికంగా తిరిగి చేర్చుకునే కమిటీ అతణ్ణి కలిసి, అతని విన్నపాన్ని పరిశీలిస్తుంది. ఈ కమిటీలోని సభ్యులు, అతను తిరిగి చేర్చుకోబడాలని నమ్మితే, వీళ్లు తమ సిఫారసును, అంతకుముందు అతని కేసు విషయంలో నిర్ణయం తీసుకున్న సంఘంలోని పెద్దల సభకు పంపిస్తారు. అప్పుడు ఆ రెండు కమిటీలు కలిసి పనిచేస్తూ, న్యాయమైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన అన్ని వాస్తవాలు సమకూరేలా చూసుకుంటాయి. అయితే, ఆ వ్యక్తిని సంఘంలోకి చేర్చుకోవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం, అంతకుముందు అతని కేసు విషయంలో తీర్పుతీర్చిన కమిటీయే తీసుకుంటుంది.

తిరిగి చేర్చుకోవడానికి సంబంధించిన ప్రకటన

36 బహిష్కరించబడిన వ్యక్తి లేదా సహవాసం తెంచేసుకున్న వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడనీ, అతణ్ణి సంఘంలోకి తీసుకోవచ్చనీ తిరిగి చేర్చుకునే కమిటీకి నమ్మకం కుదిరితే, అతని విషయంలో తీర్పుతీర్చిన పాత సంఘంలో అతను తిరిగి చేర్చుకోబడ్డాడనే ప్రకటన చేయబడుతుంది. ఒకవేళ అతను ప్రస్తుతం వేరే సంఘంలో ఉంటే, ఆ సంఘంలో కూడా ప్రకటన చేయబడుతుంది. ఆ ప్రకటన క్లుప్తంగా ఇలా ఉండాలి: “[ఆ వ్యక్తి పేరు] ఒక యెహోవాసాక్షిగా తిరిగి చేర్చుకోబడ్డారు.”

బాప్తిస్మం తీసుకున్న మైనరు పిల్లల కేసులు

37 బాప్తిస్మం తీసుకున్న మైనరు పిల్లలెవరైనా ఘోరమైన తప్పు చేస్తే, ఆ విషయాన్ని సంఘ పెద్దలకు తెలియజేయాలి. మైనరు పిల్లవాడి గంభీరమైన పాపాలకు సంబంధించిన కేసులతో పెద్దలు వ్యవహరిస్తున్నప్పుడు, ఆ పిల్లవాడి బాప్తిస్మం తీసుకున్న తల్లిదండ్రులు ఉండడం మంచిది. తమ పిల్లలపై అవసరమైన క్రమశిక్షణా చర్య తీసుకోకుండా తల్లిదండ్రులు వాళ్లను కాపాడే ప్రయత్నం చేయకుండా, న్యాయనిర్ణయ కమిటీతో సహకరించాలి. న్యాయనిర్ణయ కమిటీ, పెద్దవాళ్లతో వ్యవహరించినట్లే తప్పిదస్థుడిని గద్దించి, సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ, ఆ మైనరు పిల్లవాడు పశ్చాత్తాపం చూపించకపోతే, అతన్ని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోబడుతుంది.

బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు తప్పు చేస్తే . . .

38 ఒకవేళ బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులెవరైనా ఘోరమైన తప్పు చేస్తే ఏమి చేయాలి? వాళ్లు బాప్తిస్మం తీసుకున్న సాక్షులు కాదు కాబట్టి, వాళ్లను బహిష్కరించలేం. అయితే, వాళ్లు బైబిలు ప్రమాణాల్ని బహుశా పూర్తిగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు; తమ “పాదాల కోసం దారుల్ని చదును” చేసుకోవడానికి దయగల సలహా వాళ్లకు సహాయం చేయవచ్చు.—హెబ్రీ. 12:13.

39 ఒకవేళ బాప్తిస్మం తీసుకొనని తప్పిదస్థుణ్ణి ఇద్దరు పెద్దలు కలిసి అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించినా, అతను పశ్చాత్తాపం చూపించకపోతే, అతని గురించి సంఘానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అతని గురించి ఈ చిన్న ప్రకటన చేయాలి: “[ఆ వ్యక్తి పేరు] ఇకపై బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడిగా/ప్రచారకురాలిగా గుర్తించబడరు.” ఆ ప్రకటన తర్వాత, సంఘంలోనివాళ్లు అతణ్ణి లోక సంబంధమైన వ్యక్తిగా చూస్తారు. తప్పిదస్థుడు బహిష్కరించబడకపోయినా, సహోదరసహోదరీలు అతనితో ఏ విధంగానూ సహవాసం చేయకుండా జాగ్రత్తపడతారు. (1 కొరిం. 15:33) అతని క్షేత్రసేవా రిపోర్టులు స్వీకరించబడవు.

40 బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా తొలగించబడిన వ్యక్తి, కొంతకాలం తర్వాత తిరిగి ప్రచారకుడవ్వాలని కోరుకోవచ్చు. అలాంటప్పుడు, ఇద్దరు పెద్దలు అతణ్ణి కలిసి అతను ఎంతవరకు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాడో రూఢిపర్చుకోవాలి. ఒకవేళ అతను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడడానికి అర్హుడైతే, ఈ చిన్న ప్రకటన చేయాలి: “[ఆ వ్యక్తి పేరు] తిరిగి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడిగా/ప్రచారకురాలిగా గుర్తించబడతారు.”

శాంతియుతమైన, పవిత్రమైన ఆరాధనను యెహోవా దీవిస్తాడు

41 నేడు దేవుని సంఘంతో సహవసిస్తున్న ప్రతీఒక్కరూ, యెహోవా తన ప్రజలకు ఇస్తున్న ఆధ్యాత్మిక పరదైసును ఆనందించవచ్చు. మనకు ఆధ్యాత్మిక పచ్చికబయళ్లు మెండుగా ఉన్నాయి; సేదదీర్పునిచ్చే సత్యపు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, క్రీస్తు శిరస్సత్వం కింద యెహోవా చేసిన దైవిక ఏర్పాటు ద్వారా ఆయన కాపుదల కూడా మనకు ఉంది. (కీర్త. 23; యెష. 32:1, 2) ఈ అపాయకరమైన చివరి రోజుల్లో, ఆధ్యాత్మిక పరదైసులో ఉండడం సురక్షితంగా ఉన్నామనే భావననిస్తుంది.

సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం ద్వారా రాజ్య సత్యపు వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటాం

42 సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం ద్వారా రాజ్య సత్యపు వెలుగును ప్రకాశింపజేస్తూ ఉంటాం. (మత్త. 5:16; యాకో. 3:18) దేవుని ఆశీర్వాదంతో చాలామంది ప్రజలు యెహోవాను తెలుసుకొని, మనతో కలిసి ఆయన ఇష్టాన్ని చేస్తున్నారు. దీనికి మనమే సాక్ష్యం!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి