లెసన్ 83
యేసు వేలమందికి ఆహారం పెట్టాడు
క్రీ.శ. 32లో పస్కా పండుగకు కొంచెం ముందు అపొస్తలులు చాలా ఊరుల్లో పరిచర్య చేసి వచ్చారు. వాళ్లు అలసిపోయి ఉన్నారు. అందుకే వాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి యేసు వాళ్లను పడవలో బేత్సయిదాకు తీసుకెళ్లాడు. కానీ ఆ పడవ ఒడ్డు దగ్గరికి రాగానే వేలమంది ప్రజలు వాళ్ల వెంట అక్కడకు వచ్చారని యేసు చూశాడు. అపొస్తలులతో ఒంటరిగా ఉండాలని యేసు అనుకున్నా ఆ ప్రజలను దయగా ఆహ్వానించాడు. వాళ్లలో జబ్బుతో ఉన్నవాళ్లని బాగుచేసి వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. రోజంతా యేసు వాళ్లకు దేవుని రాజ్యం గురించి నేర్పించాడు. సాయంత్రం అవ్వగానే అపొస్తలులు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘ప్రజలకు ఆకలి వేస్తుంటుంది. వాళ్లను వెళ్లనిస్తే ఏదైనా తినడానికి తెచ్చుకుంటారు.’
యేసు ఇలా చెప్పాడు: ‘వాళ్లు ఎందుకు వెళ్లడం? వాళ్లు తినడానికి ఇక్కడే ఏమైనా పెట్టండి.’ అపొస్తలులు ఇలా అడిగారు: ‘మేము వెళ్లి వాళ్ల కోసం రొట్టెలు కొనుక్కుని రామా?’ అపొస్తలుల్లో ఒకడైన ఫిలిప్పు ఇలా అన్నాడు: ‘మన దగ్గర చాలా డబ్బున్నా వీళ్లందరికీ సరిపోయే రొట్టెలు మనం కొనలేము.’
యేసు ఇలా అడిగాడు: ‘మన దగ్గర ఎంత ఆహారం ఉంది?’ అంద్రెయ ఇలా చెప్పాడు: ‘మన దగ్గర ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి. అవి అస్సలు సరిపోవు.’ యేసు వాళ్లతో ఇలా చెప్పాడు: ‘ఆ రొట్టెల్ని, చేపల్ని నా దగ్గరికి తీసుకురండి.’ ప్రజల్ని గడ్డి మీద గుంపులుగా అంటే ఒక్కో గుంపులో 50 మందిని, 100 మందిని కూర్చోమని యేసు చెప్పాడు. ఆయన ఆ రొట్టెల్ని, చేపల్ని తీసుకుని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన ఆ ఆహారాన్ని అపొస్తలులకు ఇచ్చాడు. వాళ్లు దానిని ప్రజలకు పెట్టారు. 5,000 మంది మగవాళ్లతో పాటు ఆడవాళ్లు, పిల్లలు అందరూ కడుపునిండా తిన్నారు. తర్వాత అపొస్తలులు మిగిలిపోయిన వాటిని పడేయకుండా పోగు చేశారు. 12 గంపలు నిండిపోయాయి. ఇది చాలా గొప్ప అద్భుతం కదా.
ప్రజలు ఎంత ఆశ్చర్యపోయారంటే వెంటనే వాళ్లు యేసును రాజుగా చేయాలనుకున్నారు. కానీ ఆయన రాజు అవ్వడానికి యెహోవా అనుకున్న సమయం ఇంకా రాలేదని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన ప్రజల్ని పంపించేసి అపొస్తలులను గలిలయ సముద్రం అవతలి వైపుకి వెళ్లమని చెప్పాడు. వాళ్లు పడవ ఎక్కారు, కానీ యేసు ఒక్కడే కొండపైకి వెళ్లాడు. ఎందుకు? ఎందుకంటే తన తండ్రికి ప్రార్థన చేయడానికి సమయం తీసుకోవాలనుకున్నాడు. యేసు ఎంత బిజీగా ఉన్నా ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సమయం తీసుకున్నాడు.
“పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి. మానవ కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు.”—యోహాను 6:27