23వ పాఠం
బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
క్రైస్తవులు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్పాడు. (మత్తయి 28:19, 20 చదవండి.) ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకోవాలంటే ముందుగా ఒక వ్యక్తి ఏం చేయాలి?
1. బాప్తిస్మం అంటే ఏంటి?
“బాప్తిస్మం” అనే మాట, “నీళ్లలో ముంచడం” అనే అర్థం ఉన్న గ్రీకు పదం నుండి వచ్చింది. యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన్ని యొర్దాను నదిలో ముంచాడు. అప్పుడు యేసు “నీళ్లలో నుండి” బయటికి వచ్చాడు. (మార్కు 1:9, 10) అదేవిధంగా, నిజ క్రైస్తవులకు కూడా నీళ్లలో పూర్తిగా ముంచడం ద్వారా బాప్తిస్మం ఇస్తారు.
2. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఏం తెలియజేస్తాడు?
ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తాను యెహోవా దేవునికి సమర్పించుకున్నానని తెలియజేస్తాడు. ఇంతకీ సమర్పించుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి బాప్తిస్మానికి ముందు వ్యక్తిగత ప్రార్థనలో, ఎల్లప్పుడూ యెహోవా సేవ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అంతేకాదు యెహోవాను మాత్రమే ఆరాధిస్తానని, ఆయన ఇష్టం చేయడానికే తన జీవితంలో మొదటి స్థానం ఇస్తానని మాటిస్తాడు. అతను “ఇక తన కోసం తాను జీవించకుండా” యేసు బోధల్ని, ఆదర్శాన్ని ‘అనుసరిస్తూ ఉండాలని’ నిర్ణయించుకుంటాడు. (మత్తయి 16:24) అలా అతను సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడం వల్ల యెహోవాకు, ఆయన్ని ఆరాధించేవాళ్లకు దగ్గరి స్నేహితుడు అవ్వగలుగుతాడు.
3. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఏం చేయాలి?
బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు యెహోవా గురించి నేర్చుకోవడం, ఆయన మీద విశ్వాసం పెంచుకోవడం ప్రాముఖ్యం. (హెబ్రీయులు 11:6 చదవండి.) అలా చేసే కొద్దీ మీకు యెహోవా మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు ఆయన గురించి వేరేవాళ్లకు చెప్పాలని, ఆయన ఆజ్ఞల్ని పాటించాలని మీరు కోరుకుంటారు. (2 తిమోతి 4:2; 1 యోహాను 5:3) ఒక వ్యక్తి ఎప్పుడైతే యెహోవాను “పూర్తిగా సంతోషపెట్టేలా” ఆయనకు నచ్చినట్టు జీవిస్తాడో, అప్పుడు అతను సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు.—కొలొస్సయులు 1:9, 10.a
ఎక్కువ తెలుసుకోండి
యేసు బాప్తిస్మం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో, బాప్తిస్మం అనే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో తెలుసుకోండి.
4. యేసు బాప్తిస్మం నుండి మనం నేర్చుకునే విషయాలు
యేసు బాప్తిస్మం గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవడానికి, మత్తయి 3:13-17 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసు పసిపిల్లవాడా?
యోహాను యేసుకు ఎలా బాప్తిస్మం ఇచ్చాడు? తలమీద నీళ్లు చిలకరించాడా లేక ఆయన్ని నీళ్లలో పూర్తిగా ముంచాడా?
యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుడు తనను ఏ పని కోసమైతే భూమ్మీదికి పంపించాడో ఆ పనిని మొదలుపెట్టాడు. లూకా 3:21-23; యోహాను 6:38 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, తన జీవితంలో ఏ పనికి మొదటి స్థానం ఇచ్చాడు?
5. బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు
సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి మీరు భయపడుతుండవచ్చు. అయితే మీరు యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన్ని బాగా తెలుసుకున్నప్పుడు మీలో భయం తగ్గి, ఆ ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అలా చేసిన కొంతమంది గురించి తెలుసుకోవడానికి వీడియో చూడండి.
యోహాను 17:3; యాకోబు 1:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా ఏం చేయాలి?
1. ఎల్లప్పుడూ యెహోవా సేవ చేయాలని కోరుకుంటున్నామని ప్రార్థనలో చెప్పడం ద్వారా మనం ఆయనకు సమర్పించుకుంటాం
2. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవునికి సమర్పించుకున్నామని అందరికీ తెలియజేస్తాం
6. బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా కుటుంబంలో ఒకరం అవుతాం
మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ప్రపంచమంతటా ఐక్యంగా ఉన్న కుటుంబంలో ఒకరం అవుతాం. వేర్వేరు దేశాల నుండి, జాతుల నుండి వచ్చినా మనందరికీ ఒకే నమ్మకాలు, ఒకే విలువలు ఉంటాయి. కీర్తన 25:14; 1 పేతురు 2:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ వచనాల ప్రకారం, బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
కొంతమంది ఇలా అంటారు: “నేను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా లేను.”
మీకు కూడా అలా అనిపించినా, బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడం ఎందుకు మంచిది?
ఒక్కమాటలో
క్రైస్తవులు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్పాడు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలంటే యెహోవా మీద విశ్వాసం పెంచుకోవాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి, తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి.
మీరేం నేర్చుకున్నారు?
బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి?
ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం తెలియజేస్తాడు?
సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఒక వ్యక్తి ఏం చేయాలి?
ఇవి కూడా చూడండి
బాప్తిస్మం అంటే ఏంటో, ఏం కాదో తెలుసుకోండి.
బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఒక వ్యక్తి ఏం చేయాలో వివరంగా తెలుసుకోండి.
“యెహోవా మీద ఉన్న ప్రేమ బాప్తిస్మానికి నడిపిస్తుంది” (కావలికోట, మార్చి 2020)
ఒకతను బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు బలంగా కోరుకున్నాడో తెలుసుకోండి.
“ఇదే సత్యమని నేను నమ్మకం కుదుర్చుకున్నాను” (కావలికోట ఆర్టికల్)
బాప్తిస్మం అనేది ఎందుకు ఒక మంచి లక్ష్యమో, దాన్ని మీరు ఎలా చేరుకోవచ్చో చదవండి.
“నేను బాప్తిస్మం తీసుకోవాలా?” (యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 2వ సంపుటిలోని ఆర్టికల్)
a ఒక వ్యక్తి ఇంతకుముందు వేరే మతంలో బాప్తిస్మం తీసుకున్నా, అతను మళ్లీ బాప్తిస్మం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే, ఆ మతం అతనికి బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధించలేదు.—అపొస్తలుల కార్యాలు 19:1-5 అలాగే 13వ పాఠం చూడండి.