దేవుని వాక్యము సత్యము
“సత్యమందు వారిని ప్రతిష్ఠచేయుము; నీ వాక్యమే సత్యము.—యోహాను 17:17.
1. హెబ్రీ గాయకుడు బైబిలునెట్లు దృష్టించెను, అయితే ఈనాడు అనేకమంది దానినెట్లు దృష్టించుచున్నారు?
“నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైయున్నది.” (కీర్తన 119:105) అని హెబ్రీ గాయకుడు చెప్పెను. ఈనాడు కేవలము కొద్దిమంది మాత్రమే దేవుని వాక్యముయెడల అటువంటి గౌరవమును కలిగియున్నారు. ఈ 20వ శతాబ్దములో దేవుని వాక్యము వ్రాతపూర్వకముగా పరిశుద్ధ బైబిలు రూపమున ఉనికియందున్నది. చరిత్రలో మరేయితర గ్రంథముకంటెను యిది ఎక్కువ భాషలలోనికి అనువదింపబడి అందింపబడియున్నది. అయినను, అనేకమంది దానిని తమ పాదములకు దీపముగా అంగీకరించుటకు నిరాకరించుచున్నారు. క్రైస్తవులమని చెప్పుకొనువారు సహితము, తమ త్రోవకు వెలుగుగా బైబిలుకు బదులు ఎక్కువగా, తమ స్వంత ఆలోచనలను అనుసరించుటకు యిష్టపడుచున్నారు.—2 తిమోతి 3:5.
2, 3. యెహోవా సాక్షులు బైబిలునెట్లు దృష్టింతురు, మరియు వారికి యిది ఎలాంటి ప్రయోజనములను తెచ్చెను?
2 దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో యెహోవా సాక్షులమైన మనము కీర్తనల రచయితతో ఏకీభవింతుము. మనకు, బైబిలు దేవుడనుగ్రహించిన మార్గదర్శినియైయున్నది. “దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, ప్రయోజనకరమైయున్నదని” మనమెరిగియున్నాము. (2 తిమోతి 3:16) ఈనాటి అనేకమందివలె, నైతికత్వము మరియు ప్రవర్తనా విషయములమీద మనము ప్రయోగములు చేయకోరము. సరియైనదేదో మనకు తెలుసు ఎందుకంటే బైబిలు దానిని మనకు చెప్పుచున్నది.
3 ఇది మనకు గొప్ప ప్రయోజనములను తెచ్చినది. మనము యెహోవాను తెలుసుకొనియున్నాము, మరియు మానవజాతియెడల, మానవునియెడల ఆయన అద్భుత సంకల్పములనుగూర్చి మనము నేర్చుకొన్నాము, కాబట్టి మనకు మన కుటుంబములకు తేజోవంతమైన భవిష్యత్తు సాధ్యమను నమ్మకమును మనము కలిగియున్నాము. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది! దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి” అని చెప్పిన కీర్తనల రచయితతో మనము హృదయపూర్తిగా అంగీకరింతుము.—కీర్తన 119:97, 98.
ప్రవర్తనద్వారా సాక్ష్యమిచ్చుట
4. బైబిలును దేవుని వాక్యమని గుర్తించుట మనమీద ఏ బాధ్యతనుంచుచున్నది?
4 కాబట్టి, “నీ వాక్యము సత్యమని” తండ్రిని ఉద్దేశించి యేసు పలికిన మాటలతో అంగీకరించు ప్రతికారణము మనకు కలదు. (యోహాను 17:17) అయితే ఈ వాస్తవమును గుర్తించుట మనమీద ఒక బాధ్యతనుంచుచున్నది. దేవుని వాక్యము సత్యమని యితరులు తెలుసుకొనునట్లు మనము వారికి సహాయపడవలెను. ఈ విధముగా వారును మనమనుభవించు ఆశీర్వాదములను అనుభవించ సాధ్యమగును. ఆ విధముగా మనమెట్లు వారికి సహాయపడగలము? అందు ఒక సంగతి యేమనగా, మన ప్రతిదిన జీవితములో బైబిలు సూత్రములను అన్వయించ ప్రతి ప్రయత్నమును మనము తప్పక చేయవలెను. ఆ విధముగా, బైబిలు మార్గము నిజముగా శ్రేష్ఠమైన మార్గమని సహృదయులు చూచెదరు.
5. మన ప్రవర్తనద్వారా సాక్ష్యమిచ్చుటనుగూర్చి పేతురు ఏ సలహానిచ్చెను?
5 అవిశ్వాసులైన భర్తలుగల క్రైస్తవస్త్రీలకు పేతురు యిచ్చిన సలహానందు యిదే విషయము కలదు. ఆయన వారికీలాగు చెప్పెను: “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, . . . వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 3:1) అలాగే, “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండుడి,” అని ఆయన చెప్పినప్పుడుకూడ, దానివెనుక క్రైస్తవులందరికి—స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు—అదే సూత్రము కలదు.—1 పేతురు 2:12; 3:16.
బైబిలుయొక్క ఉన్నత జ్ఞానము
6. యితరులు బైబిలును ప్రశంసించుటకు మనము సహాయము చేయవలెననుటను చూచుటకు పేతురు మనకెట్టి సహాయము చేయుచున్నాడు?
6 యింకను, యిక్కడ పేతురు చెప్పినట్లు చేసినట్లయిన క్రైస్తవులు యితరులు బైబిలును ప్రశంసించుటకు సహాయము చేసినవారు కాగలరు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి.” (1 పేతురు 3:15) క్రైస్తవ పరిచారకులు బైబిలు పక్షముగా వాదించి, అది దేవుని వాక్యమని యితరులకు వివరించగలవారై యుండవలెను. దానిని వారెట్లు చేయగలరు?
7. బైబిలును గూర్చిన ఏ వాస్తవము అది దేవుని వాక్యమని ప్రదర్శించుచున్నది?
7 పట్టుదల కొరకైన మంచి కారణహేతువునొకదానిని సామెతల గ్రంథమందు మనము కనుగొనవచ్చును. అక్కడ మనమిట్లు చదువుదుము: “నా కుమారుడా, నీవు నా మాటలనంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గినయెడల . . . , దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.” (సామెతలు 2:1-6) దేవుని స్వంత జ్ఞానమును మనము బైబిలు పుటలయందు కనుగొనవచ్చును. నిష్కపటియైన వ్యక్తి ఆ లోతైన జ్ఞానమును చూచినప్పుడు, బైబిలు కేవలము మనుష్య వాక్యము కాదని అతడు తప్పక గ్రహించును.
8, 9. ధనార్జన విషయములో సమతూక దృష్టిని కలిగియుండుమని బైబిలిచ్చిన ఉపదేశము సరియైనదేనని ఎట్లు చూపబడినది?
8 కొన్ని ఉదాహరణలను విచారింపుము. ఈనాడు జీవితమందలి విజయము సాధారణముగా ఆర్ధికస్తొమతతో కొలవబడుచున్నది. ఒకడు ఎంత ఎక్కువ సంపాదిస్తే, అతడంత కృతార్థుడని భావించబడుచున్నది. అయితే, బైబిలు వస్తుసంపదమీద ఎక్కువ ధ్యానమిచ్చుటకు వ్యతిరేకముగా హెచ్చరించుచున్నది. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాసెను: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హాని కరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:9, 10; మత్తయి 6:24 పోల్చుము.
9 ఈ హెచ్చరిక ఎంతసరియో అనుభవము చూపుచున్నది. ఒక క్లినికల్ సైకాలజిస్టు యిలా వ్రాయుచున్నాడు: “నెం. 1గా తయారగుట మరియు ధనవంతుడగుట నీలో అంతా సాధించానను సంతృప్తిని, నిష్కల్మషముగా గౌరవింపబడుచున్నానను లేక ప్రేమింపబడుచున్నానను భావనను కల్గించదు.” అవును, ధనార్జన కొరకు తమ యావత్‌శక్తిని ధారపోయు వారు చివరకు తరచుగా విషాద భావనలతో, విసుగుతోయుండుట జరుగుచున్నది. ధనవిలువను ఒక ప్రక్క గుర్తించుచునే లేఖనములు మరింత ప్రాముఖ్యమైన దానిని సూచించుచున్నవి: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దానిపొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.”—ప్రసంగి 7:12.
10. మన సహవాసములను పరీక్షించుకొనుమని చెప్పిన బైబిలు ఉపదేశమును మనమెందుకు లక్ష్యపెట్టవలెను?
10 అటువంటి సూత్రములను అనేకము బైబిలు కలిగియున్నది. మరొక సూత్రమేమనగా: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) అనుభవమందు యిదికూడ సత్యమని నిరూపించబడినది. సహవాసుల వత్తిడి అనేకమంది యవనస్థులను త్రాగుబోతుతనమునకు, మాదకద్రవ్యములను ఉపయోగించుటకు, లైంగిక దుర్నీతికి నడిపించినది. దుర్భాషలాడు వారితో కలిసితిరుగువారు కొంతకాలమైన పిదప చివరకు తామును అటువంటి చెడుమాటలనే మాట్లాడుచున్నట్లు తమనుతాము కనుగొందురు. ‘ప్రతివారు చేయుచున్నందున,’ అనేకమంది యాజమాన్యపు వస్తువులను దొంగిలింతురు. నిజముగా, బైబిలుకూడ చెప్పినట్లు: “చెడుసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.
11. బంగారు సూత్రమును అనుసరించుటలోని జ్ఞానమును ఒక సైకలాజికల్ అధ్యయనము ఎట్లు చూపించినది?
11 ఉపదేశములలోకెల్లా ప్రఖ్యాతమైనదని చెప్పబడిన బంగారు సూత్రము బైబిలునందు కలదు: “కావున, మనుష్యులు మీకు ఏమిచేయవలెనని మీరు కోరుదురో, ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) మానవజాతి ఈ నియమమును పాటించినయెడల లోకము స్పష్టముగా ఒకమంచి ప్రదేశమైయుండును. సాధారణముగా ప్రజలు ఈ నియమమును పాటించకపోయినను, మీరు వ్యక్తిగతముగా దానిని పాటించుట శ్రేష్ఠము. ఎందుకు? ఎందుకనగా, మనము యితరులయెడల శ్రద్ధను కలిగియుండి వారి విషయమై జాగ్రత్తను చూపుటకు చేయబడితిమి. (అపొ.కార్యములు 20:35) యితరులకు తాము సహాయము చేసినప్పుడు ప్రజలెట్లు ప్రతిస్పందించిరో కనుగొనుటకు అమెరికాలో జరుపబడిన సైకలాజికల్ అధ్యయనమొకటి చివరకు యిట్లు తేల్చిచెప్పినది: “దీనినిబట్టి, తమయెడల శ్రద్ధను చూపించుకొను మానవనైజమందు యితరులయెడల శ్రద్ధను చూపించుటయు అంతే పెద్ద భాగముగా ఉన్నట్లుగా కన్పించుచున్నది.”—మత్తయి 22:39.
బైబిలు ఉపదేశము—బహు జ్ఞానవంతము
12. బైబిలును ఉన్నతముచేయు ఒక సంగతి ఏమైయున్నది?
12 ఈనాడు బైబిలేతర సలహామూలములు కోకొల్లలు. వార్తాపత్రికలు సలహాల కాలమ్‌లను ప్రచురించుచున్నవి, పుస్తక బాండాగారములలో స్వయం-సహాయక పుస్తకములు విస్తారముగా ఉండును. అంతేకాకుండా, మానసిక శాస్త్రవేత్తలు, వృత్తిరీత్యా సలహాలిచ్చువారు, వివిధ రంగములలో సలహాలిచ్చువారును కలరు. అయితే బైబిలు కనీసము మూడు విషయములయందు బహు ఉన్నతమై యున్నది. మొదట, దాని సలహా అన్ని సమయములలో ప్రయోజనకరమైయున్నది. అది ఎన్నటికిని కేవలము సిద్ధాంతము కాదు, మరియు అది ఎన్నడును మనకు హానికరముగా పనిచేయదు. బైబిలు సలహాను పాటించు ఎవరైనను, “నీవిచ్చు జ్ఞాపికలు బహుగా నమ్మదగినవిగా నిరూపించబడెను” అని దేవునికి తానుచేసిన ప్రార్థనయందు తెల్పిన కీర్తనల రచయితతో అంగీకరించవలసియుందురు.—కీర్తన 93:5 NW.
13. మానవ జ్ఞానమూలములకంటే బైబిలుచాలా ఉన్నతమైనదని ఏమి చూపించుచున్నది?
13 రెండవది, బైబిలు సమయ పరీక్షయందు నిలువబడినది. (1 పేతురు 1:25; యెషయా 40:8) మానవమూలముగా వచ్చు ఉపదేశము బహుగా మారునదై యుండును, ఒక సంవత్సరములో ఆడంబరముగా ఉన్నది మరుసటి సంవత్సరములో తరచుగా విమర్శింపబడును. అయితే బైబిలు పూర్తిచేయబడి యిప్పటికి దాదాపు 2,000 సంవత్సరములు పూర్తికావస్తున్నను, లభ్యమగు ఉపదేశములలో దానియందలి ఉపదేశము బహు ఉన్నతమైనది మరియు దాని మాటలు విశ్వవ్యాప్తముగా అన్వయించగలవై యున్నవి. మనము ఆఫ్రికా, ఆసియా, ఉత్తరదక్షిణ అమెరికా ఖండములు, ఐరోపా లేక సముద్ర ద్వీపములయందు ఎక్కడ జీవించినను అవి అంతే సమానతతో ప్రభావము చూపును.
14. ఏ విధముగా దేవునివాక్య ఉపదేశము సర్వశ్రేష్ఠమైయుండును?
14 చివరగా, బైబిలు ఉపదేశ విశాలత అసమానమైనది. ఒక బైబిలు సామెత యిట్లు చెప్పుచున్నది: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు,” అలాగే మనమే నిర్ణయము తీసుకున్నను లేక సమస్యను ఎదుర్కొన్నను ఫరవాలేదు, దానిని పరిష్కరించుకొనుటకు సహాయపడు జ్ఞానము బైబిలునందు కలదు. (సామెతలు 2:6) పిల్లలు, కౌమారులు, తలిదండ్రులు, వృద్ధులు, ఉద్యోగులు, యజమానులు, అధికారమందలి వారు యిలా అందరు బైబిలు జ్ఞానము తమకు అన్వయించుటను కనుగొనవచ్చును. (సామెతలు 4:11) యేసు మరియు ఆయన అపొస్తలుల కాలమందు తెలియని పరిస్థితులను సహితము మనమెదుర్కొనినను, పనిచేయగల సలహాను బైబిలిచ్చుచున్నది. ఉదాహరణకు, మొదటి శతాబ్దములో మధ్యప్రాచ్యమందు పొగాకు త్రాగుట తెలియకుండెను. ఈనాడు అది బహుగా కలదు. అయినను, “దేనిచేతను లోపరచు [లేక ఆధీనపరచు] కొనబడుటను” తప్పించుకొనుడి మరియు “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి” పరిశుభ్రపరచుకొనుడి అను బైబిలు ఉపదేశమును గైకొను వారెవరైనను, బానిసగాచేయు మరియు ఆరోగ్యమును నాశనముచేయు ఈ అలవాటును విసర్జింతురు.—1 కొరింథీయులు 6:12; 2 కొరింథీయులు 7:1.
మన దీర్ఘ-కాల శ్రేయస్సుకొరకు
15. బైబిలు పాతబడిపోయినదని అనేకులు ఎందుకు చెప్పుదురు?
15 నిజమే, బైబిలు ఈ 20వ శతాబ్దమునకు పనికిరాదని, పాతబడిపోయినదని అనేకమంది అందురు. అయితే, వారు వినగోరినదానిని బైబిలు చెప్పకుండుట అందుకు ఒక కారణము కావచ్చును. లేఖన ఉపదేశమును గైకొనుట మన దీర్ఘ-కాల శ్రేయస్సుకొరకు పనిచేయును, అయితే దానికి—తక్షణానందమును వెదకుటకు ప్రోత్సహించు లోకములో జనసమ్మతముకాని లక్షణములగు—ఓపిక, క్రమశిక్షణ, మరియు స్వయం-నిరాకరణ కావలెను.—సామెతలు 1:1-3.
16, 17. లైంగికనీతి విషయములో ఏ ఉన్నతమైన కట్టడలను బైబిలు ఉంచుచున్నది, మరియు అవి ఆధునిక కాలములలో ఎట్లు అలక్ష్యము చేయబడుచున్నవి?
16 లైంగిక దుర్నీతినే తీసుకొండి. దీనికి సంబంధించిన లేఖన కట్టడలు చాలా కఠినముగా ఉండును. లైంగిక సన్నిహితత్వమునకు కేవలము వివాహమందే స్థానము కలదు, అలాగే వివాహమునకు వెలుపట అటువంటి సన్నిహితత్వము నిషేధింపబడినది. మనమిలా చదువుదుము: “జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషసంయోగులైనను, . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:9, 10) అంతేకాకుండా, క్రైస్తవులు ఏకపత్నీవ్రతులై యుండవలెనని, భార్యకు ఒక భర్త మాత్రమేనని బైబిలు చెప్పుచున్నది. (1 తిమోతి 3:2) విడాకులు పుచ్చుకొనుటను లేక విడిపోవుటను అనుమతించు విపరీత పరిస్థితులున్నను, సాధారణముగా వివాహము యావత్ జీవితకాల బంధమని బైబిలు చెప్పుచున్నది. యేసు తానుగా యిట్లు చెప్పెను: “సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ‘యిందునిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు,’ . . . కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదు.”—మత్తయి 19:4-6, 9; 1 కొరింథీయులు 7:12-16.
17 ఈ నియమములను ఈనాడు బహుగా అలక్ష్యము చేయుట జరుగుచున్నది. లైంగిక చెడుప్రవర్తనను ఎవరును పట్టించుకొనుటలేదు. కలిసితిరుగు యౌవనులమధ్య లైంగిక సంబంధములు సాధారణమన్నట్లు చూడబడుచున్నవి. వివాహిత ప్రయోజనము లేకుండానే కలిసి జీవించుట అంగీకరించబడుచున్నది. వివాహిత దంపతులలో ఎవరో ఒకరు అక్రమసంబంధము కలిగియుండుట అసాధారణమేమియు కాదు. ఈ ఆధునిక లోకములో విడాకులు తీసుకొనుట బహు విస్తారముగా యున్నది. అయితే సడలించబడిన ఈ నియమములు సంతోషమును తీసుకురాలేదు, అయితే నైతిక నియమములను కఠినముగా నొక్కిచెప్పిన బైబిలు చివరకు నిజమని వాటి చెడు ఫలితములు నిరూపించినవి.
18, 19. నైతిక విషయమైన యెహోవా కట్టడలను విస్తారముగా అలక్ష్యము చేయుటవలన ఏ ఫలితము కలిగినది?
18 లేడీస్ హోమ్ జర్నల్ యిట్లు చెప్పినది: “అరవై మరియు డెబ్బయవ దశాబ్దముల కాలములో ఎక్కువ ప్రాముఖ్యతనివ్వబడిన లైంగికత శాశ్వతకాల మానవ సంతోషమునివ్వలేదు అయితే అది బహు గంభీరమైన మానవ దుఃఖమును తెచ్చినది.” ఇక్కడ చెప్పబడిన “మానవ దుఃఖమునందు” తలిదండ్రుల విడాకులద్వారా గాయపడిన పిల్లలు, బహుగా భావోద్రేక వ్యధకు గురియైన పెద్దలు, అలాగే తలిదండ్రులలో కేవలము ఒకరేగల కుటుంబములు పెరుగుట, ఇంకా పసితనముపోని బాలికలు తల్లులగుట చేరియున్నది. అంతేకాకుండా, దానిమూలముగా జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, క్లామిడియా, మరియు ఎయిడ్స్‌వంటి సుఖవ్యాధులు ప్రభలమైపోయినవి.
19 దీనియంతటి దృష్ట్యా సోషయాలజీ పండితుడొకాయన యిలా వ్రాసెను: “మనపౌరుల అవసరతలకు మరియు వారి స్వేచ్ఛాహక్కుకు: రోగమునుండి స్వేచ్ఛ, కోరని గర్భధారణలనుండి స్వేచ్ఛకు, బహుగా ప్రత్యుత్తరమిచ్చు ఒక పద్ధతిగా వివాహపూర్వ సౌఖ్యమునకు దూరముగా ఉండుటను ప్రోత్సహించుట ప్రయోజనకరమా కాదాయని చూచుటకు కావల్సినంతగా మనము బహుశ ఎదిగియున్నాము.” బైబిలు సరియైన విధముగా యిట్లు చెప్పుచున్నది. “గర్విష్ఠులనైనను త్రోవవిడిచి అబద్ధములతట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.” (కీర్తన 40:4) బైబిలును నిరాకరించుచు సడలింపుగల లైంగిక నియమావళి సంతోషమును తెచ్చునని చెప్పువారి అబద్ధములద్వారా బైబిలు జ్ఞానమును నమ్ముకొనువారు మోసగింపబడరు. బైబిలు జ్ఞానయుక్తమైన కట్టడలు కఠినమైనవైనను, అవి శ్రేష్ఠమైనవైయున్నవి.
జీవితమందలి కష్టమైన సమస్యలు
20. తమ జీవితములలో తీవ్ర దారిద్యమును అనుభవించవలసిన వారికి ఏ బైబిలు సూత్రములు సహాయపడునని నిరూపించబడినది?
20 జీవితమందు మనమెదుర్కొను కష్టమైన సమస్యలతో సహితము వ్యవహరించుటకు బైబిలు జ్ఞానము మనకు సహాయము చేయును. ఉదాహరణకు, అనేక దేశములలో బహు తీవ్రమైన దారిద్య్రమందు జీవించుచున్న క్రైస్తవులు కలరు. అయినను వారు ఆ బీదరికమును తాళుకుంటూ యింకను సంతోషమును కలిగియున్నారు. ఎట్లు? ప్రేరేపిత దేవుని వాక్యమును అనుసరించుటద్వారా. వారు ఓదార్పుకరమైన కీర్తన 55:22 లోని మాటలను గంభీరముగా తీసుకొందురు: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.” సహించుటకు కావల్సిన బలము కొరకు వారు దేవునిపై ఆధారపడుదురు. ఆ పిమ్మట వారు బైబిలు సూత్రములను అన్వయింపజేయుచు పొగత్రాగుట, త్రాగుబోతుతనమువంటి హానికరమైన, వ్యర్థమైన అలవాట్లను విసర్జింతురు. బైబిలు సిఫారసు చేయుచున్నట్లుగా వారు కష్టించి పనిచేయుదురు, అలా సోమరులు లేక ఆశలు వదులుకున్న వారు విఫలమగుచుండగా వీరు తమ కుటుంబములను పోషించగలవారిగా కనుగొనబడిరి. (సామెతలు 6:6-11; 10:26) యింకను, వారు ఈ బైబిలు హెచ్చరికను లక్ష్యపెట్టుదురు: “దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.” (కీర్తన 37:1) జూదమాడరు లేక మాదక ద్రవ్యములు అమ్ముటవంటి నేరములకు వారు పాల్పడరు. ఇవి వాటిని చేయువారి సమస్యలకు తక్షణ “పరిష్కారమును” చూపవచ్చును, అయితే దీర్ఘ-కాల ఫలము మాత్రము బహుచేదుగా ఉండును.
21, 22. (ఎ) ఒక క్రైస్తవ స్త్రీ బైబిలునుండి ఎట్లు ఓదార్పును మరియు సహాయమును పొందినది? (బి) బైబిలునుగూర్చిన మరి ఏ వాస్తవము అది దేవుని వాక్యమని మనము గ్రహించుటకు సహాయము చేయును?
21 అతి బీదరికమందున్న వారికి నిజముగా బైబిలును అనుసరించుట సహాయపడునా? అవును, అలా అని అనేక అనుభవములు నిరూపించుచున్నవి. ఆసియాలోగల ఒక క్రైస్తవ విధవరాలు యిలా వ్రాయుచున్నది: “దారిద్య్రరేఖకు నేను సమీపముగా జీవించుచున్నను, నాకు ఎలాంటి ఆయాసము లేక అసంతోషము లేదు. అనుకూల దృష్టిని కలిగియుండునట్లు బైబిలు సత్యములు నాకు సంతృప్తినిచ్చుచున్నవి.” యేసు చెప్పిన ఒక ప్రముఖ వాగ్ధానము తన విషయములో నెరవేరెనని ఆమె చెప్పుచున్నది. యేసు యిట్లనెను: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నిరు మీకనుగ్రహింప బడును.” (మత్తయి 6:33) దేవుని సేవను తన జీవితములో ముందుంచుట ద్వారా, అన్ని సమయములలో ఏదో ఒక రకముగా తన జీవితావసర వస్తువులను తాను పొందుచున్నానని ఆమె సాక్ష్యమిచ్చుచున్నది. ఆమె క్రైస్తవసేవ ఆమెకు ఘనతను, మరియు దారిద్యమును సహించునట్లు చేయు ఒక జీవితగురిని యిచ్చుచున్నది.
22 అవును, బైబిలులోగల లోతైన జ్ఞానము అది నిజముగా దేవుని వాక్యమని చూపించుచున్నది. పూర్తిగా మానవులద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ పుస్తకముకూడ యిలా జీవితమందలి వివిధ ఆకృతులను తాకుచు, ఎంతోలోతుగా అర్థము చేసుకుంటూ ఎక్కడా పొరపాటుపడని విధముగా ఉండజాలదు. బైబిలుకు దైవమూలము కలదని ప్రదర్శించు మరొక వాస్తవము కూడ కలదు. ప్రజలను మరింత శ్రేష్ఠముగా మార్చుశక్తి దానికున్నది. దీనిని మనము తర్వాతి శీర్షికలో చర్చిద్దాము. (w90 4/1)
మీరు వివరించగలరా?
◻ బైబిలును దేవుని వాక్యమని అంగీకరించుటద్వారా ఏ విధముగా యెహోవా సాక్షులు ఆశీర్వదించబడిరి?
◻ దేవునివాక్య విశ్వాసులుగా మనకే బాధ్యత కలదు, మరియు ఈ బాధ్యతను నెరవేర్చుటలో మన ప్రవర్తన మనకెట్లు సహాయము చేయును?
◻ మానవ సలహాకంటే బైబిలు జ్ఞానయుక్త ఉపదేశమును ఏది ఉన్నతము చేయుచున్నది?
◻ బైబిలు జ్ఞానముయొక్క లోతును చూపించు ఉదాహరణలు కొన్ని ఏమైయున్నవి?