కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 1/1 పేజీలు 11-16
  • యెహోవా యందలి భయముతో నడచుకొనుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా యందలి భయముతో నడచుకొనుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంతము వరకు నమ్మకముగా ఉండుట
  • హింస సువార్తను విస్తరింపజేయును
  • హింసకుడు మార్చబడెను
  • అన్యులు విశ్వాసులైరి!
  • అన్య సంఘము స్థాపించబడెను
  • హింస వ్యర్థమాయెను
  • ‘స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • స్తెఫను రాళ్లతో కొట్టబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • “దేవునికి పక్షపాతం లేదు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 1/1 పేజీలు 11-16

యెహోవా యందలి భయముతో నడచుకొనుము

“యెహోవానందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు [సంఘము] విస్తరించుచుండెను.”—అపొ.కార్యములు 9:31 NW.

1, 2. (ఎ) క్రైస్తవ సంఘము సమాధాన కాలమున ప్రవేశించినప్పుడు ఏమి సంభవించెను? (బి) యెహోవా హింసను అనుమతించినను, ఆయన మరింకేమికూడ చేయును?

ఒక శిష్యునికి బహు తీవ్రమైన పరీక్ష ఎదురయినది. దేవుని యెడల అతడు తన యథార్థతను కాపాడుకొనునా? అవును, అతడు కాపాడుకొనెను! అతడు తన యజమానుని కొరకైన భయముతో, దేవునియందలి భక్తితో నడచుకొనెను, మరియు అతడు యెహోవా సాక్షిగా యథార్థముగా చనిపోవును.

2 ఆ దైవభయముగల యథార్థపరుడు “విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన” స్తెఫనుయై యుండెను. (అపొ.కార్యములు 6:5) అతని హత్య తర్వాత హింస బహుగా ప్రబలినను, ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయయందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను. అంతేకాకుండా, అది “యెహోవానందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.” (అపొ.కార్యములు 9:31) అపొస్తలుల కార్యములు 6 నుండి 12 వరకుగల అధ్యాయములలో చూపించబడినట్లుగా, యెహోవా సాక్షులుగా మనము సమాధానమును లేక హింసను, దేనిని అనుభవించినను, మనలను దేవుడు ఆశీర్వదించునను నమ్మకమును కలిగియుండగలము. మనము హింసింపబడినప్పుడు లేక హింసకారణముగా తాత్కాలికముగా ఆత్మీయముగా బోధించబడుటకు లేక దేవునికి మరింత చురుకైన సేవచేయుటకు అడ్డగింపబడినప్పుడు, ఆయనయందు పూజ్యనీయ భయముతో నడుచుకొందము.—ద్వితీయోపదేశకాండము 32:11, 12; 33:27.

అంతము వరకు నమ్మకముగా ఉండుట

3. యెరూషలేములో ఏ సమస్య అధిగమించబడెను, ఎట్లు?

3 సమాధానముగా ఉన్న కాలమందును సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, వాటిని తీర్చుకొనుటకు మంచి వ్యవస్థీకరణ సహాయముచేయును. (6:1-7) ప్రతిదిన ఆహార పంపకమందు హెబ్రీ మాట్లాడు యూదులకంటే, తమలోని విధవరాండ్రు నిర్లక్ష్యము చేయబడుచున్నారని యెరూషలేములోని గ్రీకు మాట్లాడు యూదులు ఫిర్యాదు చేసిరి. “ఈ పనిని” చేయుటకు అపొస్తలులు ఏడుగురు మనుష్యులను నియమించుటతో ఈ సమస్య పరిష్కారమయ్యెను. వారిలో సైఫను ఒకడు.

4. అబద్ధ ఆరోపణలకు స్తెఫను ఎట్లు ప్రతిస్పందించెను?

4 అయితే, త్వరలోనే దైవభక్తిగల స్తెఫనుకు పరీక్ష ఎదురయ్యెను. (6:8-15) కొందరువచ్చి స్తెఫనుతో తర్కించిరి. వీరిలో కొందరు “లిబెర్తీనులదనబడిన సమాజమునుండి” వచ్చిన వారైరి. వీరు బహుశ మొదట రోమన్లచే బంధింపబడి ఆపిమ్మట విడిచిపెట్టబడిన యూదులు లేక ఒకప్పుడు దాసులుగాయున్న యూదా మత ప్రవిష్టులైయుండవచ్చును. మాటలాడుటయందు స్తెఫను అగపరచిన జ్ఞానమును ఆత్మను ఎదిరింప శక్తిలేని వారిగా, అతని శత్రువులు అతని మహాసభయెదుటకు కొనిపోయిరి. అక్కడ అబద్దసాక్షులు యిట్లనిరి: ‘యేసు ఈ ఆలయమును నాశనముచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చుననుచున్నాడు.’ అయినను అతని వ్యతిరేకులు స్తెఫను తప్పిదస్థుడు కాదని, అయితే అతనికి దేవుని ప్రతినిధి తోడున్నాడనుటను నిశ్చయపరచుచు అతని ముఖము దేవదూత ముఖమువలె ఉండుటను వారు చూడగల్గిరి. వారు సాతానుకు తమను అప్పగించుకొనినందున కీడును ప్రదర్శించు వారి ముఖములకు అది ఎంతగా భిన్నమైయుండెను!

5. సాక్ష్యమిచ్చినప్పుడు ఏ అంశములను స్తెఫను ప్రస్తావించెను?

5 ప్రధానయాజకుడైన కయపద్వారా ప్రశ్నింపబడినప్పుడు స్తెఫను ఎంతో ధైర్యముగా సాక్ష్యమిచ్చెను. (7:1-53) అతని ఇశ్రాయేలీయుల చరిత్రయొక్క పునఃసమీక్ష, మెస్సీయా వచ్చినప్పుడు ధర్మశాస్త్రమును, ఆలయసేవలను ప్రక్కనబెట్టుటకు దేవుడు సంకల్పించెనని చూపించెను. విడుదలకు కారకునిగా ప్రతి యూదుడు గౌరవించునని చెప్పబడిన మోషేను ఇశ్రాయేలీయులు తిరస్కరించిరని, యిప్పుడుకూడ మరిగొప్పదైన విడుదలను తీసుకువచ్చు వానిని వారంగీకరించలేదని స్తెఫను మాట్లాడెను. హస్తకృతాలయములలో దేవుడు నివసింపడని చెప్పుటద్వారా, స్తెఫను ఆలయము దాని ఆరాధనా విధానము గతించిపోవునని చూపించెను. ఆయనకు తీర్పుతీర్చిన న్యాయాధిపతులు దేవునికి భయపడనివారును లేక ఆయన చిత్తమును తెలుసుకొన యిచ్ఛయించని వారునైయున్నందున స్తెఫను వారితో యిట్లనెను: ‘ముష్కరులారా, పరిశుద్ధాత్మను ఎల్లప్పుడు ఎదిరించువారలారా, మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి. వారు ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. మీరైతే ఆయనను యిప్పుడు అప్పగించి హత్యచేసియున్నారు.’

6. (ఎ) మరణమునకుముందు విశ్వాసమును బలపరచు ఎటువంటి అనుభవమును స్తెఫను కలిగియుండెను? (బి) “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని” స్తెఫను ఎందుకు సరిగా చెప్పగల్గెను?

6 స్తెఫను నిర్భయముగా చెప్పిన మాటలు అతని హత్యకు దారితీసెను. (7:54-60) యేసు మరణమందలి వారి దోషమును బహిర్గతము చేయుటతో న్యాయాధిపతులు బహుగా కోపించినవారైరి. ‘ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటను’ ఆయన చూసినప్పుడు స్తెఫను విశ్వాసము ఎంతగా బలపరచబడెను! తాను దేవుని చిత్తము చేసానను నమ్మకముతో స్తెఫను యిప్పుడు తన శత్రువులను ఎదుర్కొనగలడు. యెహోవా సాక్షులకు దర్శనములు కలుగపోయినను, హింసింపబడినప్పుడు వారును అదేవిధముగా దేవుడనుగ్రహించు నెమ్మదిని కలిగియుండగలరు. స్తెఫనును యెరూషలేము వెలుపలికి వెళ్లగొట్టి, అతని శత్రువులు అతనిపై రాళ్లురువ్వుచుండగా, ఆయనిట్లు ప్రార్థించెను: “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము.” యిది సరియే ఎందుకంటే యితరులను జీవమునకు లేపుటకు దేవుడు యేసునకు అధికారమునిచ్చెను. (యోహాను 5:26; 6:40; 11:25, 26) మోకాళ్లుని స్తెఫను బిగ్గరగా యిట్లు పలికెను: “యెహోవా, వారిమీద ఈ పాపము మోపకుము.” అలా ఆయన ఒక హతసాక్షిగా మరణమొందెను, అప్పటినుండి మరియు ఆధునిక కాలములలో సహితము యేసు అనుచరులు అనేకమంది అట్లే చేసిరి.

హింస సువార్తను విస్తరింపజేయును

7. హింస ఫలితముగా ఏమి కలిగెను?

7 నిజానికి, స్తెఫను మరణము ఫలితముగా సువార్త బహుగా విస్తరించెను. (8:1-4) హింస కారణముగా అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరు యూదయ సమరయ దేశములయందంతటను చెదిరిపోయిరి. స్తెఫను మరణమును సమ్మతించిన సౌలు, ఒక మృగమువలె యింటింటను జొచ్చి యేసు అనుచరులను చెరసాలలలో వేయించి సంఘమును పాడుచేసెను. చెదిరిపోయిన శిష్యులు ప్రకటించుటలో కొనసాగుచుండగా, హింసద్వారా రాజ్యప్రచారకులైన దైవజనులను ఆపుజేయుటకు వేసిన సాతాను పథకము భంగపడెను. ఈనాడు కూడ, తరచు హింస సువార్త వ్యాపకమునకు లేక రాజ్యప్రచార పనియెడల శ్రద్ధనిచ్చుటకు పిలుపునిచ్చినది.

8. (ఎ) సమరయలో జరిగింపబడిన ప్రచారపు పని ఫలితముగా ఏమి సంభవించెను? (బి) యేసు తనకిచ్చిన రెండవ తాళపుచెవిని పేతురు ఎట్లు ఉపయోగించెను?

8 సువార్తికుడైన ఫిలిప్పు “క్రీస్తును. . .ప్రకటించుటకు” సమరయకు వెళ్లెను. (8:5-25) సువార్త ప్రకటింపబడుచుండగా ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను, అపవిత్రాత్మలు వెళ్లగొట్టబడెను, మరియు అక్కడ అనేకులు స్వస్థపరచబడిరి. యెరూషలేములోని అపొస్తలులు సమరయకు పేతురు యోహానులను పంపగా, వారక్కడకు వచ్చి బాప్తిస్మము తీసుకొనిన వారిమీద తమ చేతులుంచి ప్రార్థించగా ఆ క్రొత్త శిష్యులు పరిశుద్ధాత్మను పొందిరి. క్రొత్తగా బాప్తిస్మము పొందిన, లోగడ గారడీచేయువాడైన సీమోను ఈ అధికారమును ద్రవ్యమిచ్చి కొనుటకు ప్రయత్నించెను, కాగా పేతురు అతనితో యిట్లనెను: ‘నీ వెండి నీతో కూడ నశించునుగాక. నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు.’ అలాగే ఆయన అతడు పశ్చాత్తాపపడి క్షమాపణ కొరకు యెహోవాను ప్రార్థించుమని చెప్పగా, అతడు తన పక్షముగా అపొస్తలులు ప్రార్థించవలసిందిగా వేడుకొనెను. యిది యెహోవాయందు భయభక్తులుగల వారందరు హృదయమును కాపాడుకొనుటలో దైవిక సహాయము కొరకు ప్రార్థించుటకు వారిని కదిలించవలెను. (సామెతలు 4:23) (ఈ సంఘటన మొదలుకొని “సైమోని” అనుమాట వాడుక లోనికి వచ్చినది, దీనికి “చర్చి ఉద్యోగమును లేక మతనాయక అధికారమును ద్రవ్యమిచ్చి కొనుట లేక అమ్ముట” అని భావము.) పేతురు యోహానులు సమరయలోని అనేక గ్రామములలో సువార్తను ప్రకటించిరి. ఆ విధముగా, యేసు తనకిచ్చిన రెండవ తాళపుచెవిని ఉపయోగించి పేతురు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అవకాశము మరియు జ్ఞానమను ద్వారమును తెరిచెను.—మత్తయి 16:19.

9. ఫిలిప్పు సాక్ష్యమిచ్చిన ఐతియొపీయుడు ఎవరు, మరియు ఆ మనుష్యుడు ఎందుకు బాప్తిస్మము పుచ్చుకొనగలవానిగా యుండెను?

9 దేవునిదూత ఫిలిప్పుకు ఒక క్రొత్తపనిని అప్పగించెను. (8:26-40) యెరూషలేమునుండి గాజాకు పోవు రహదారిమీద ఒక రథములో ఐతియొపీయుల రాణియగు కందాకేక్రింద కోశాధికారిగా పనిచేయుచున్న ఒక “నపుంసకుడు” ప్రయాణమై వెళ్లుచుండెను. యూదా సమాజములో ఉండనివ్వని విధముగా అతడు భౌతికముగా నపుంసకునిగా చేయబడినవాడు కాదు, అయితే సున్నతిపొందిన యూదామత ప్రవిష్టునిగా అతడు ఆరాధన కొరకు యెరూషలేముకు వెళ్లెను. (ద్వితీయోపదేశకాండము 23:1) ఈ నపుంసకుడు యెషయా గ్రంథమును చదువుచుండుటను ఫిలిప్పు కనుగొనెను. రథములోనికి ఆహ్వానించబడినవాడై, ఫిలిప్పు యెషయా ప్రవచనమును చర్చించి, “అతనికి యేసునుగూర్చిన సువార్తను ప్రకటించెను.” (యెషయా 53:7, 8) ఆ వెంటనే ఐతియొపీయుడు: “ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి?” అని అడిగెను. నిజానికి ఆటంకమేమియు లేదు, ఎందుకనగా అతడు దేవుని యెరిగియుండి యిప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచిన వాడాయెను. కాబట్టి అతనికి ఫిలిప్పు బాప్తిస్మమియ్యగా అతడు ఆనందముతో తనదారిన వెళ్లెను. నీవు బాప్తిస్మము పుచ్చుకొనుటకు ఏదైనా నిన్ను ఆటంకపరచుచున్నదా?

హింసకుడు మార్చబడెను

10, 11. దమస్కునకు వెళ్లుదారిలో మరియు ఆ తర్వాత కొద్దిసమయమునకే తార్సువాడైన సౌలుకు ఏమి సంభవించెను?

10 ఆ సమయములోనే, సౌలు చెరసాలలలో వేయించుట లేక చంపుట అనే బెదిరింపు క్రింద యేసు అనుచరులు తమ విశ్వాసమును త్యజించునట్లు చేయుటకు వెదకుచుండెను. (9:1-18 a) “ఆ మార్గమందున్న” లేక క్రీస్తు మాదిరిమీద ఆధారపడియున్న జీవనవిధానమునకు చెందిన పురుషులనైనను స్త్రీలనైనను బంధించి యెరూషలేమునకు తెచ్చుటకు అతనికి అధికారమునిచ్చుచు ప్రధానయాజకుడు (బహుశ కయప) దమస్కులోని సమాజములవారికి పత్రికలనిచ్చెను. దమస్కును అతడు సమీపించుచుండగా మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించి ఒక స్వరము అతని యిట్లడిగెను: “సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?” సౌలుతో ప్రయాణము చేసిన మనుష్యులు “ఆ స్వరము వినిరి గాని” అది ఏమి చెప్పెనో వారు అర్థము చేసుకొనలేదు. (అపొ.కార్యములు 22:6, 9 పోల్చుము.) మహిమ పరచబడిన యేసుయొక్క పాక్షికమైన ఆ ప్రత్యక్ష్యతే సౌలుకు అంధత్వమును కలుగజేసెను. అతనికి మరలా చూపును అనుగ్రహించుటకు దేవుడు శిష్యుడైన అననీయను ఉపయోగించెను.

11 బాప్తిస్మము తర్వాత ఈ పూర్వహింసకుడు, తానుగా యిప్పుడు హింసకు గురి ఆయెను. (9:18 b-25) దమస్కులోని యూదులు సౌలును చంపవలెనని చూసిరి. అయితే, రాత్రివేళ శిష్యులు, బహుశ తాళ్లతోగాని చెట్లవేర్లతోగాని అల్లిన ఒకపెద్ద గంపలాంటి దానిలోవుంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి. (2 కొరింథీయులు 11:32, 33) ఆ దించిన స్థలము బహుశ గోడనానుకొని కట్టిన ఒక శిష్యుని యింటి కిటికీ అయివుండవచ్చును. శత్రువుల బారినుండి తప్పించుకొని, ప్రచారపు పనిలో కొనసాగుట పిరికితనముతో చేసిన పని కానేకాదు.

12. (ఎ) యెరూషలేములో సౌలుకు ఏమి సంభవించెను? (బి) సంఘము ఆయనను ఎట్లు సాగనంపెను?

12 యెరూషలేములో, సౌలును తోటివిశ్వాసిగా అంగీకరించుటకు బర్నబా శిష్యులకు సహాయపడెను. (9:26-31) అక్కడకూడ ఆయనను చంపజూసిన గ్రీకు మాట్లాడు యూదులతో సౌలు నిర్భయముగా తర్కించెను. దీనిని తెలుసుకొని సహోదరులు ఆయనను కైసరయకు తోడుకొనివచ్చి కిలికియలోని తన స్వంత పట్టణమైన తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతట సంఘము ఆత్మీయముగా “క్షేమాభివృద్ధినొందుచు, సమాధానము కలిగియుండెను.” అది ‘యెహోవాయందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడచుకొనుచు విస్తరించుచుండెను.’ యెహోవా ఆశీర్వాదములను పొందవలెననినట్లయిన ఈనాటి సంఘములన్నింటికి యిది ఎంత శ్రేష్టమైన మాదిరియైయున్నది!

అన్యులు విశ్వాసులైరి!

13. లుద్ద మరియు యొప్పేలో ఎటువంటి అద్భుతములు చేయుటకు దేవుడు పేతురును బలపరచెను?

13 పేతురుకూడ బహుపనిరద్దీని కలిగియుండెను. (9:32-43) లుద్దలో (యిప్పడు లోడ్‌) షారోను మైదానప్రాంతమందు ఆయన పక్షవాయువుగల ఐనెయాను స్వస్థపరచెను. ఈ స్వస్థతాకార్యము అనేకమంది ప్రభువుతట్టు తిరుగుటకు కారణమాయెను. యొప్పేలో బహు ప్రియమైన శిష్యురాలగు తబితా (దొర్కా) రోగగ్రస్థురాలై మరణించెను. పేతురు అక్కడికి వచ్చినప్పుడు, విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు బహుశ వారు ధరించియున్న, దొర్కా కుట్టిన వస్త్రములను ఆయనకు చూపించిరి. ఆయన దొర్కాను సజీవురాలనుగా చేయగా, ఈ వార్త ఆ ప్రాంతమందంతటను తెలిసినప్పుడు అనేకులు విశ్వాసులైరి. పేతురు యొప్పేలో సముద్రతీరమున యిల్లుగల సీమోనను చర్మకారునియొద్ద గడిపెను. చర్మకారులు జంతుచర్మములను సముద్రములో నానబెట్టి వాటిమీది వెంట్రుకలను శుభ్రము చేయుటకు ముందు సున్నముతో వాటిని పదునుచేసెడివారు. అలా పనికివచ్చు తోలుగా తయారు చేయుటకు ముందు వాటికి వారు కొన్నిచెట్ల పసర్లుపూసి సిద్ధము చేసెడివారు.

14. (ఎ) కొర్నేలీ ఎవరైయుండెను? (బి) కొర్నేలీ ప్రార్థనల విషయములో ఏది నిజమైయుండెను?

14 ఆ సమయమున (సా.శ. 36), మరొకచోట గమనార్షమైన వృద్ధి మరొకటి జరిగెను. (10:1-8) వందమందిని ఆజ్ఞాపించు అధికారముగల రోమా శతాధిపతియైన కొర్నేలీ అను అన్యుడైన భక్తిపరుడొకడు కైసరయలో నివసించుచుండెను. రోమ్‌ పౌరులు మరియు ఇటలీనుండి యిష్టపూర్తిగా వచ్చిచేరినవారితో భర్తీచేయబడిన “ఇటలీ పటాలమునకు” అతడు అధికారియైయుండెను. కొర్నేలీ దైవ భయము గలవాడే అయినను, అతడు యూదామత ప్రవిష్టుడు కాదు. దర్శనమందు దూత అతనితో అతని ప్రార్థనలు “దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని” చెప్పెను. అప్పటికి కొర్నేలీ యెహోవాకు సమర్పించుకొనకపోయినను, ఆయన ప్రార్థనకు జవాబు లభించెను. అయితే దూత నిర్దేశించినట్లుగా, ఆయన పేతురును పిలువ మనుష్యులను పంపించెను.

15. సీమోను యింటి మిద్దెమీద పేతురు ప్రార్థించుచుండగా ఏమి జరిగెను?

15 ఈ సమయములోనే సీమోను యింటిలో మిద్దెమీద ప్రార్థన చేయుచుండగా పేతురుకు దర్శనము కలిగెను. (10:9-23) పరవశుడై ఆయన, సకల విధములైన అపవిత్రమైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశపక్షులతో నింపబడిన వెడల్పాటి రేకును పోలిన పాత్రయొకటి ఆకాశమునుండి దిగివచ్చుటను చూసెను. నీవు వాటిని చంపుకొని తినుమని ఆజ్ఞాపింపబడినప్పుడు, పేతురు అపవిత్రమైనది ఏదైనను ఎప్పుడైనను తినలేదని చెప్పెను. “దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమని అనవద్దు” అని ఆయనకు చెప్పబడెను. ఆ దర్శనము పేతురును కలవరపరచినను, ఆయన ఆత్మ నడిపింపును అనుసరించెను. ఆ విధముగా, ఆరుగురు యూదా సహోదరులు వెంటరాగా కొర్నేలీ పంపిన మనుష్యులతో కలిసి ఆయన బయలుదేరి వెళ్లెను.—అపొ.కార్యములు 11:12.

16, 17. (ఎ) కొర్నేలీ మరియు అతని యింట చేరియున్న వారితో పేతురు ఏమిచెప్పెను? (బి) పేతురు యింకను మాట్లాడుచుండగా ఏమి సంభవించెను?

16 యిప్పుడు మొదటి అన్యులు సువార్తను వినబోవుచుండిరి. (10:24-43) పేతురు అతని సహవాసులు కైసరయకు వచ్చినప్పుడు, కొర్నేలీ అతని బంధువులు, సన్నిహితులు వారికొరకు వేచియుండిరి. కొర్నేలీ పేతురు పాదములమీద పడగా, అపొస్తలుడు వినయముతో అటువంటి పూజ్యభావ చర్యను నివారించెను. మెస్సీయాగా యేసును యెహోవా ఎట్లు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనో మాట్లాడి, ఆయనయందు విశ్వాసముంచు ప్రతివారు పాపక్షమాపణ పొందుదురని వివరించెను.

17 యిప్పుడు యెహోవా తనవంతు కార్యమును చేసెను. (10:44-48) పేతురు యింకను మాట్లాడుచుండగా, దేవుడు విశ్వాసముంచిన ఆ అన్యులమీద పరిశుద్ధాత్మను కుమ్మరించెను. అప్పటికప్పుడు వారు దేవుని ఆత్మద్వారా జన్మించినవారిగా, అన్యభాషలలో మాట్లాడుతు, ఆయనను మహిమపరచుటకు ప్రేరేపింపబడిరి. కాబట్టి వారు సరియైన విధముగా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. ఆ విధముగా దైవభక్తిగల అన్యులు పరలోక రాజ్యమున ప్రవేశించు అవకాశమునకు జ్ఞానమునకు ద్వారమును తెరచుటకు పేతురు మూడవ తాళపుచెవిని ఉపయోగించినట్లాయెను.—మత్తయి 16:19.

18. అన్యులు “పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిరని” పేతురు వివరించినప్పుడు యూదామత సహోదరులు ఎట్లు ప్రతిస్పందించిరి?

18 ఆ తర్వాత, యెరూషలేములో సున్నతి మద్దతుదారులు పేతురుతో వాదము పెట్టుకొనిరి. (11:1-18) అన్యులు ఎట్లు “పరిశుద్ధాత్మయందు బాప్తిస్మము పొందిరో” ఆయన వివరించినప్పుడు, అతని యూదామత సహోదరులు శాంతించినవారై, “అట్లయితే, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని” చెప్పుచు దేవుని మహిమపరచిరి. అలాగే మనముకూడ దైవచిత్తము మనకు స్పష్టము చేయబడినప్పుడు దానిని అంగీకరించువారమై యుండవలెను.

అన్య సంఘము స్థాపించబడెను

19. శిష్యులు ఎట్లు క్రైస్తవులని పిలువబడిరి?

19 యిప్పుడు మొదటి అన్య సంఘము రూపొందించబడెను. (11:19-26) స్తెఫను విషయములో కలిగిన హింసనుబట్టి శిష్యులు చెదిరిపోయినప్పుడు, అశుద్ధ ఆరాధనకు, లైంగిక అవినీతికి గుర్తింపబడిన సిరియా, అంతియొకయకు కొందరు వెళ్లిరి. అక్కడ వారు గ్రీకు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటించుచుండగా, “యెహోవా హస్తము వారికి తోడైయుండెను,” గనుక అనేకులు విశ్వాసులైరి. అక్కడ బర్నబా మరియు సౌలు ఒకయేడాదిపాటు బోధించిరి, కాగా “మొట్టమొదట అంతియొకయలో దైవానుగ్రహమువలన శిష్యులు క్రైస్తవులనబడిరి.” ఆ విధముగా పిలువబడుటకు యెహోవా నిస్సందేహముగా నడిపింపునిచ్చెను, ఏలయనగా క్రిమాటిజో అను గ్రీకు పదమునకు “దైవానుగ్రహమను” భావము కలదు, అలాగే అది అన్నిసమయములలో దేవునినుండి కలుగుట సంబంధముగా లేఖనానుసారముగా ఉపయోగించబడెను.

20. అగబు ముందుగనే ఏమిచెప్పెను, దానికి అంతియొకయ సంఘము ఎట్లు ప్రతిస్పందించెను?

20 దైవభక్తిగల ప్రవక్తలును యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి. (11:27-30) వారిలో ఒకడైన అగబు “భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని,” సూచించెను. ఆ ప్రవచనము రోమా చక్రవర్తియైన క్లౌదియ పరిపాలనా కాలమందు నెరవేరెను (సా.శ. 41-54), కాగా ఈ “గొప్ప కరవును” గూర్చి చరిత్రకారుడైన జోసిఫస్‌ ప్రస్తావించెను. (జూయిష్‌ ఆంటిక్విటీస్‌, XX, 51 [ii, 5]; XX, 101 [v, 2]) ప్రేమచే కదిలింపబడినవారై, అంతియొకయ సంఘపువారు యూదయలోని అవసరతగల సహోదరులకు చందా పంపిరి.—యోహాను 13:35.

హింస వ్యర్థమాయెను

21. పేతురుకు వ్యతిరేకముగా హేరోదు అగ్రిప్ప I ఏ చర్య తీసుకొనెను, అయితే దాని ఫలితము ఏమాయెను?

21 యెరూషలేములో యెహోవాయందు భయముగలవారిని హేరోదు అగ్రిప్ప I హింసించుటకు ఆరంభించుటతో సమాధానముండిన కాలము అంతమాయెను. (12:1-11) హేరోదు యాకోబును ఖడ్గముతో చంపించెను, అపొస్తలులలో మొదటి హతసాక్షిగా బహుశ అతడు ఆయన తలను నరికించియుండవచ్చును. యిది యూదులకు యిష్టమైన కార్యమని చూసి హేరోదు పేతురును చెరసాలలో వేయించెను. యిద్దరు సైనికులు చెరొకవైపుగా అపొస్తలుడు సంకెళ్లతో బంధింపబడగా, తలుపు ఎదుట యిద్దరు కావలిగా ఉండిరి. పస్కా మరియు పులియని రొట్టెల పండుగ (నీసాను 14-21), తర్వాత ఆయనను సంహరించవలెనని హేరోదు పథకము వేసెను. అయితే తరచుగా మనవిషయములో జరుగుచున్నట్లుగానే, ఆయనకొరకు సంఘముచేసిన విజ్ఞాపనలకు సరియైన సమయమున జవాబివ్వబడెను. దేవునిదూత అద్భుతరీతిన అపొస్తలుని విడుదల గావించినప్పుడు యిది జరిగెను.

22. మార్కు తల్లియైన మరియ యింటికి పేతురు వెళ్లినప్పుడు అక్కడ ఏమి జరిగెను?

22 త్వరలోనే క్రైస్తవ కూటమునకు స్థలమైన (మార్కు తల్లియగు), మరియ యింటికి పేతురు చేరుకొనెను. (12:12-19) చీకటిలో, సేవకురాలైన రొదే పేతురు స్వరమును గుర్తించెను, అయితే ఆమె ఆయనను యింకను గడియవేసిన తలుపువెలుపలనే ఉంచెను. మొదట శిష్యులు పేతురుకు ప్రాతినిధ్యముగా అతని స్వరముతో మాట్లాడుటకు దేవుడు దేవదూతనొకరిని పంపెనని తలంచియుండవచ్చును. అయితే వారు వచ్చినది పేతురని తెలుసుకొన్న తర్వాత, ఆయన విడుదలనుగూర్చిన విషయమును యాకోబునకు యితర సహోదరులకు (బహుశ పెద్దలు) తెలియజేయుమని వారితో చెప్పెను. విచారణ జరిగినప్పుడు తనకుగాని వారికిగాని ఎలాంటి హాని కలుగకుండు నిమిత్తము ఆయన తాను వెళ్లు గమ్యమును చెప్పకుండ వారిని విడిచి అజ్ఞాతములోనికి వెళ్లిపోయెను. ఆయన కొరకైన హేరోదు అన్వేషణ నిష్ఫలమాయెను, కాగా అతడు కావలివాండ్రను శిక్షించెను, బహుశ సంహరించి యుండవచ్చును.

23. హేరోదు అగ్రిప్ప I పరిపాలన ఎట్లు అంతమయ్యెను, దీనినుండి మనమేమి నేర్చుకొనగలము?

23 సా.శ. 44లో 54 సంవత్సరముల వయస్సులో కైసరయలోని హేరోదు అగ్రిప్ప I పరిపాలన అకస్మాత్తుగా అంతమయ్యెను. (12:20-25) అతడు ఫేనీకేవాసులైన తూరీయులమీదను సీదోనీయులమీదను యుద్ధము చేయవలెనను తలంపును కలిగియుండగా, వారు అతని సేవకుడైన బ్లాస్తుకు లంచమిచ్చి సమాధానపడుటకు రాజును తాము కలుసుకొను ఏర్పాటు చేయుమని కోరిరి. “నియమింపబడిన దినమందు” (అది క్లౌదియ కైసరు గౌరవార్థము చేయబడు పండుగదినముకూడ), హేరోదు రాజవస్త్రములు ధరించి న్యాయపీఠముమీద ఆసీనుడై, ఉపన్యసించుటకు ఆరంభించెను. దానికి ప్రత్యుత్తరముగా ప్రేక్షకులు యిట్లు బిగ్గరగా కేకలు వేసిరి: “ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదు!” ఆ మరుక్షణమే “అతడు దేవుని మహిమపరచనందున” యెహోవా దూత అతని మొత్తెను. గనుక హేరోదు “పురుగులు పడి ప్రాణము విడిచెను.” అహంకారమును విసర్జించి, ఆయన ప్రజలుగా మనమేమి చేసినను, దానికొరకు ఆయనకు మహిమనిచ్చుచు యెహోవాయందు భయముతో ఎడతెగక నడచుటకు హెచ్చరికతో కూడిన ఈ ఉదాహరణ మనలను కదిలించును గాక.

24. విస్తరణనుగూర్చి తర్వాతి శీర్షిక ఏమి చూపించును?

24 హేరోదుద్వారా హింస కలిగినను, “యెహోవా వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.” వాస్తవానికి, తర్వాతి శీర్షిక చూపించునట్లు శిష్యులు మరింత విస్తరణను అపేక్షించగలవారై యుండిరి. ఎందుకు? ఎందుకనగా వారు “యెహోవా యందలి భయముతో నడుచుకొనిరి.” (w90 6/1)

మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ అప్పటినుండి అనేకమంది దేవుని సేవకులు చూపినట్లుగానే, స్తెఫను ఎట్లు తాను యెహోవాకు భయపడెనని చూపించెను?

◻ స్తెఫను మరణము రాజ్య-ప్రచారపు పనిమీద ఏలాంటి ప్రభావమును చూపెను, మరి దీనికి ఆధునిక-దిన సమాంతరమున్నదా?

◻ హింసకుడైన తార్సువాడగు సౌలు ఎట్లు యెహోవాకు భయపడువాడాయెను?

◻ అన్యులలోనుండి విశ్వాసులైన మొదటివారు ఎవరు?

◻ యెహోవాయందు భయముగలవారిని హింస ఆపుజేయదని అపొ.కార్యములు 12వ అధ్యాయము ఎట్లు చూపుచున్నది?

[12వ పేజీలోని చిత్రం]

ఆకాశమునుండి వెలుగుకమ్మి అందులోనుండి ఒక స్వరము యిట్లడిగెను: “సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి