దేవునియందు మరియు క్రీస్తునందు విశ్వాసమును కాపాడుకొనుము
కెలెస్సయులనుండి ఉన్నతాంశములు
రక్షణకొరకు యెహోవా దేవునియందు మరియు యేసుక్రీస్తునందు విశ్వాసము ప్రాముఖ్యము. అయితే అటువంటి విశ్వాసమును కాపాడుకొనుట ఒక సవాలైయున్నది. ఈ విషయము ఆసియామైనరులోని ఎఫెసుకు తూర్పుగాయున్న కొలొస్సయి క్రైస్తవులకును వాస్తవమైయుండెను. ఎందుకు? అబద్ధబోధకులు రక్షణ సున్నతిపైన, ఒకరు తినుదానిపైన, కొన్ని ఆచరణలు ఆచరించుటపైన ఆధారపడియున్నదను భావముతోనుండిరి.
అందునుబట్టి కొలొస్సయిలోని క్రైస్తవుల ఆత్మీయ క్షేమమందు శ్రద్ధగలవాడై వారు దేవునియందును మరియు క్రీస్తునందును తమ విశ్వాసమును కాపాడుకొనవలెనని అపొస్తలుడైన పౌలు కోరెను. రోములో (దాదాపు సా.శ. 60-61లో) తన మొదటి చెర ముగింపుకొచ్చిన సమయానికి తప్పిదమైన దృక్పథములను ఎదిరించి విశ్వాసమును నిర్మింపజేయునట్లు వారికి పత్రిక వ్రాసెను. ఆయన ప్రేమగల మాటలనుండి మనమును ఎట్లు ప్రయోజనమును పొందగలమో చూద్దాము.
క్రీస్తు స్థానమును గుణగ్రహించుట
పౌలు తన పత్రిక ప్రారంభములో యేసు స్థానముయెడలగల మెప్పును ఉన్నతపరచెను. (కొలొస్సయులు 1:1–2:12) క్రీస్తునందు మరియు తమ తోటివిశ్వాసులయెడలగల ప్రేమనుగూర్చి కొలొస్సయులను ఆయన అభినందించెను. సంఘమునకు శిరస్సుగా, మృతులలోనుండి లేచినవారిలో మొదటివానిగా, మరియు మిగిలినవన్ని తనద్వారా సృష్టింపబడియుండుటనుబట్టి క్రీస్తుకుగల ప్రధానత్వమును పౌలు ప్రస్తావించెను. సమస్త జ్ఞానము, బుద్ధి ఆయనయందు గుప్తమైయున్న ఆయననుబట్టి దేవునితో సమాధానపరచబడుట సాధ్యము. అందునుబట్టి క్రైస్తవులు క్రీస్తునందు ఐక్యతగలవారై నడచుచు ఎవరును వారిని మానవ తత్వజ్ఞానముచేత ఈడ్చుకొనిపోకుండునట్లు చూచుకొనవలెను.
క్రీస్తుద్వారా దేవుడు ధర్మశాస్త్రమును తొలగించెను. (2:13-23) సాదృశ్యముగా అది యేసు మరణించిన కొయ్యకుమేకులతో కొట్టబడినది. ధర్మశాస్త్రము కోరినవి కేవలము “రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.” క్రీస్తుకు హత్తుకొనియుండుటద్వారా పరలోకమందు తమకుగల అమరత్వ జీవితపు బహుమానమును ఎవడును అపహరింపనివ్వరు.
దేవుని మరియు క్రీస్తును మెచ్చుకొనుట
తదుపరి నూతన స్వభావమును ధరించుకొని యేసుక్రీస్తుయొక్క అధికారమునకు లోబడియుండమని కొలొస్సయులను పౌలు కోరుచున్నాడు. (3:1-17) తమ మనస్సులను పైనున్నవాటియందు పెట్టుటద్వారా, జీవితములో ఆత్మీయవిషయములను వారు ముందుపెట్టినవారైయుందురు. దీనికి చెడు దక్పథములను మరియు భాషను తొలగించుకొనవలసియున్నది. జాలిగలమనస్సు, వినయము, మరియు సాత్వికము మున్నగు లక్షణములను ధరించుకొన్నట్లయిన వారు ఎంతగా ఆశీర్వాదింపబడినవారైయుందురు! ప్రతిదానిని యేసు నామమున చేయుచు ఆయన ద్వారా దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తున్నట్లయిన క్రీస్తు సమాధానము వారి హృదయములకు కావలియుండును.
దేవునియెడల మరియు క్రీస్తుయెడలగలమెప్పు అనునది ఒక క్రైస్తవుడు ఇతరులతో తాను కలిగియున్న సంబంధములపైనను ప్రభావమును కలిగియుండవలెను. (3:18–4:18) భార్యలు, భర్తలు, పిల్లలు, దాసులు, మరియు యజమానులు దేవునియందలి భయముచేతను మరియు క్రీస్తుయొక్క గుర్తింపునందును వారివారి విధులను నెరవేర్చవలెను. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండి జ్ఞానమునందు నడచుట ఎంత అవసరము!
పౌలు కొలొస్సయులకు వ్రాసిన పత్రిక మన జీవపు బహుమానమును పోగొట్టుకొనునట్లుచేయు అబద్ధబోధలను విసర్జించుటకు మనకు సహాయముచేయును. యెహోవాయొక్కయు మరియు ఆయన కుమారుని యొక్కయు అధికారమును గుర్తించుటనుగూర్చి పౌలు నొక్కితెలిపినది ఇతరులతో మనము వ్యవహరించు విధానమందు మనపై శ్రేష్టమైన ప్రభావమును కలిగియుండవలెను. మనము మనవిశ్వాసమును దేవునియందు మరియు క్రీస్తునందు కాపాడుకొనినట్లయిన విస్తారమైన ఆశీర్వాదములు నిశ్చయము. (w90 11 ⁄15)
[32వ పేజీలోని బాక్సు/చిత్రం]
లవెదికయులకు పత్రిక: “ఈ పత్రిక మీరు చదివించుకొనినతరువాత లవెదికయ వారి సంఘములోను చదివించుడి; లవెదికయకు వ్రాసిపంపిన పత్రికను మీరును చదివించుకొనుడి”. అని పౌలు కొలొస్సయులకు వ్రాసెను. (కొలొస్సయులు 4:16) ఈ లవెదికయ పశ్చిమ ఆసియామైనరు నందు ఒకధనవంతమైన పట్టణము. ఫిలదెల్ఫియ మరియు ఎఫెసు పట్టణముల రహదారులచే కలుపబడుచున్నది. పౌలు ఇచ్చట పరిచర్య చేయక పోయినప్పటికిని ఎఫెసులో చేసినపని లవెదికయవరకు చేరినట్లున్నది. కొంతమంది విద్వాంసులు అది ఎఫెసీయులకు వ్రాసినపత్రికయొక్క ప్రతిమాత్రమేయని నమ్ముచున్నను లవెదికయ క్రైస్తవులకు మాత్రము ఆయన పత్రికను పంపియున్నాడు. బహుశా దానియందు ఈనాడు మనకు అవసరమైన సమాచారము లేనందున, లేక ప్రేరేపితమైనవిగా అంగీకరించబడిన ఇతర పత్రికలందు అందలి సమాచారము పూర్తిగా అందించబడియున్నందుననో లవెదికయులకు వ్రాసిన పత్రిక బైబిలునందు కనుగొనబడుటలేదు.
[చిత్రం]
లవెదికయనందలి శిథిలాలు