యెహోవాను ఆనందముతో సేవించుట
“సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.”—కీర్తన 100:2
1, 2. (ఎ) జర్మని నందలి బెర్లిన్‌లో జాత్యంకారము ఎట్లు పొడుచుకొచ్చినది, అయితే “వెయ్యిసంవత్సరముల జర్మని పాలన” కొరకు తలపెట్టిన దండయాత్ర ఎట్లు ముగిసినది? (బి) ఒలంపియా స్టేడియంనందు 1936కు భిన్నమైన ఏ సంగతి 1990లో గమనించబడినది, మరియు అక్కడ సమావేశమైన అంతర్జాతీయ గుంపుయొక్క ఆనందము దేనియందు పాతుకు పోయినది?
అది బెర్లిన్‌లోని ఒలంపియా స్టేడియం నందలి దృశ్యము. ఏభైనాలుగు సంవత్సరముల క్రితము నాజి నిరంకుశుడైన అడాల్ఫ్ హిట్లర్ నల్లజాతి అమెరికా దేశస్థుడైన పరుగుపందెగాడు నాలుగు బంగారు పతకాలను గెలిచినప్పుడు అతనిని చీవాట్లుపెట్టగా ఆ మంచి స్టేడియం వివాదమునకు కేంద్రమాయెను. “ఆర్యజాతి గొప్పతనమును”a చాటుకున్న జాత్యహంకారముగల హిట్లరుకు నిజంగా అది ఒక ముష్టిదెబ్బయే! అయితే ప్రస్తుతము 1990 జూలై 26న నల్లవారు, తెల్లవారు, పసుపు రంగుగలవారు—64 దేశములనుండి ఒక ఐక్యమైన ప్రజగా మొత్తము 44,532 మంది—యెహోవాసాక్షుల “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు ఇచ్చట సమకూడిరి. ఆ గురువారము మాధ్యాహ్నము ఎంతటి ఆనందము పొంగి ప్రవహించెను! బాప్తిస్మపు ప్రసంగమైన తదుపరి 1,018 అభ్యర్థులు, ఆయన చిత్తమును చేయుటకై, యెహోవా దేవునికి తమ సమర్పణను స్థిరపరస్తు “జా!”, “జా!” అని రెండుమారులు కేకవేసిరి.
2 ఈ నూతన సాక్షులు బాప్తిస్మపు నీళ్లయొద్దకు వెళ్తూ స్టేడియంనుండి బయటకు వెళ్లుటకు 19 నిముషములు పట్టినది. ఆ నిముషములన్నిటిలో ఆ పెద్ద ఆవరణమంతా ఉరుములాంటి చప్పట్లధ్వనితో మారుమ్రోగెను. అనేక జాతులనుండి వచ్చి, లోకమును జయించు ఇట్టి విశ్వాసమును ప్రదర్శిస్తున్న ఈ వందలాదిమందిని ఆహ్వానించిన ఆ చప్పట్ల ధ్వని ఒలంపిక్ ఆటలలో గెలిచిన ఏ ఆటగాళ్లకు లభించలేదు. (1 యోహాను 5:3, 4) వారి ఆనందము క్రీస్తుద్వారా జరిగించబడు దేవునిరాజ్య పరిపాలన మానవజాతికి నిజముగా వెయ్యిసంవత్సరముల మహిమకర దీవెనలను తెచ్చునను నమ్మకమునందు స్థిరముగా పాతుకు పోయియున్నది.—హెబ్రీయులు 6:17, 18; ప్రకటన 20:6; 21:4, 5.
3. సమావేశమైనవారి నమ్మకమునుబట్టి ఏ సత్యము నెక్కిచూపబడినది, మరియు ఎట్లు?
3 అక్కడ జాతి లేక దేశ బేధములులేవు. ఎందుకనగా వారందరు దేవునివాక్యపు స్వచ్ఛమైన భాషను మాట్లాడుచున్నారు. మరియు వారు ఆవిధంగా పేతురు మాటలలోని సత్యమును నెక్కిచూపుచున్నారు. అవేమనగా: “దేవుడు పక్షపాతికాడని నేను నిజముగా గ్రహించి యున్నాను. ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యాలు 10:34, 35; జెఫన్యా 3:9.
4. సమావేశమునకు హాజరైనవారిలో ఎక్కువమంది ఏ పరిస్థితిలో విశ్వాసులయ్యారు, మరియు వారి ప్రార్థనలకు ఎట్లు జవాబు లభించినది?
4 బెర్లిన్ సమావేశమునందు సమకూడిన ఒక పెద్దభాగము నాజీకాలమందలి దీర్ఘకాల హింసాయుత సంవత్సరములలోను (1933-45) తదుపరి తూర్పుజర్మనీలో ప్రారంభమైన సామ్యవాద కాలములోను విశ్వాసులైనవారు. అచ్చట కేవలము 1990 మార్చి 14ననే యెహోవాసాక్షులపై చట్టరీత్యా నిషేధము ఎత్తివేయబడినది. కావున వారిలో ఎక్కువమంది “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యము నంగీకరించియున్నారు.” (1 థెస్సలొనీకయులు 1:6) ప్రస్తుతము యెహోవాను సేవించుటలో వారు ఎక్కువ స్వాతంత్ర్యమును గలవారై, తమ ఆనందమునకు అవధులు లేక ఉన్నారు.—యెషయా 51:11 ను పోల్చుము.
ఆనందమునకు సమయములు
5. ఎర్రసముద్రముయొద్ద యెహోవా దయచేసిన విడుదలను ఇశ్రాయేలీయులు ఎట్లు జరుపుకొనిరి?
5 తూర్పు ఐరోపా, ప్రస్తుతము ఆఫ్రికానందలి కొన్ని భాగములు మరియు ఆసియాలో సహోదరులకు కలిగిన విడుదలలు, యెహోవా ద్వారా గతకాలములలో కలిగిన విడుదలలను మనకు జ్ఞాపకమునకు తెచ్చుచున్నవి. ఎర్రసముద్రముయొద్ద యెహోవా బలమైన కార్యము, ఇశ్రాయేలీయులు కృతజ్ఞతతో పాడిన గీతము ఈ క్రింది మాటలలో ఎంతటి తారాస్థాయికి చేరినదో గుర్తుకు తెచ్చుకుందాము: “యెహోవా వేల్పులలో నీవంటివాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు.” (నిర్గమకాండము 15:11) ఈనాడు యెహోవా తన ప్రజలయెడల చేయుచున్న అద్భుత క్రియలనుబట్టి ఆనందించుటలో మనము కొనసాగమా? నిశ్చయముగా మనమును అంతే.
6. సా.శ.పూ. 537లో ఇశ్రాయేలీయులు ఆనందముతో వేసిన కేకనుండి మనమేమి నేర్చుకొనగలము?
6 సా.శ.పూ. 537లో ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి తమ దేశమునకు తిరిగితేబడినప్పుడు ఆనందము పొర్లి ప్రవహించెను. యెషయా ప్రవచించినట్లు యెహోవా జనాంగము ఇట్లు ప్రకటించగలిగెను: “ఇదిగో నా రక్షణకు కారణ భూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను.” ఎంతటి ఆనందము! ఆ ఆనందమును ఆ జనాంగము ఎట్లు వ్యక్తముచేయుదురు? యెషయా ఇంకను ఇట్లనుచున్నాడు: “ఆ దినమున మీరీలాగందురు—యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురముచేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవానుగూర్చి కీర్తనపాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను.” ఈనాడు విడుదలనొందబడిన యెహోవాసేవకులవలెనే “భూమియందంతంటను” ఆయన బలమైన కార్యములను తెలియజేయుటలో వారు “ఉత్సాహధ్వనిని” చేయగలిగిరి.—యెషయా 12:1-6.
యెహోవా పనిలో ఆనందము
7. 1919లోని ఏ విడుదలలు ఆనందమును కలుగ జేసినవి?
7 1919లో ఆయన వారికి అద్భుతమైన విడుదలను దయచేసినప్పుడు ఆధునిక కాలములలో యెహోవాసేవకులు ఆనందముతో కేకవేయుటకు మొదలిడిరి. తమపై మోపబడిన అబద్ధఆరోపణలమూలంగా తొమ్మిది నెలలు జైలులో వేయబడియున్న గవర్నింగ్ బాడీ సభ్యులు ఆ సంవత్సరము మార్చి 26న విడుదల చేయబడిరి. బ్రూక్లిన్ బేతేలుకు వారిని తిరిగి ఆహ్వానించుటలో ఎంతటి ఆనందోత్సాహము జరుపుకొనబడినది. అంతేగాక దానినిబట్టి ప్రపంచమంతటిని దేనిద్వారా తనవలలో చిక్కించుకొనియున్నదో ఆ మతవిధానమునుండి, అనగా మహాబబులోనునుండి ఆత్మీయముగా విడుదల పొందుటలోను అభిషక్త శేషమంతయు ఆనందించ గలిగిరి.—ప్రకటన 17:3-6; 18:2-5.
8. 1919 సీడర్ పాయింట్ సమావేశములో ఆశ్చర్యముగొలుపు దేని విడుదల ప్రకటించబడినది, మరియు ఏ పనికొరకు పిలుపు యివ్వబడినది?
8 1919యొక్క చారిత్రాత్మక అభివృద్ధికర సంఘటనలు సీడర్ పాయింట్, ఒహాయో, యు.యస్.ఏ., నందు సెప్టెంబరు 1-8 వరకు జరిగిన సమావేశములో ఉన్నత శిఖరమును చేరినవి. “కో-లేబరర్స్ డే,” అనబడిన ఆ సమావేశమందలి అయిదవదినమున వాచ్‌టవర్ సొసైటి ప్రెసిడెంట్, జె.యఫ్. రూథర్‌ఫర్డ్ 6,000 మంది ప్రేక్షకులనుద్దేశించి “రాజ్యమును ప్రకటించుట” అను ఉత్తేజకర ప్రసంగమునిచ్చెను. ప్రకటన 15:2 మరియు యెషయా 52:7 ను చర్చించిన తరువాత, గోల్డ్‌న్ ఏజ్ (ప్రస్తుతము అవేక్! అని పిలువబడు) అను పత్రిక రెండువారములకొకసారి ప్రత్యేకముగా ప్రాంతమందు పంచుటకై ప్రచురించబడునని చెప్పెను. ముగింపులో ఆయన ఇలా అన్నాడు: “ప్రభువునకు సంపూర్ణముగా సమర్పించుకున్నవారు, నిర్భయస్తులు, హృదయ శుద్ధిగలవారు, తమ పూర్ణమనస్సు, బలము, ఆత్మ మరియు ఉనికితో, యిష్టతతో అవకాశము లభించినంతవరకు ఈ పనిలో పాల్గొనుటకు ఆనందింతురు. మిమ్ములను ఆయన నిజమైన, నమ్మకమైన, నైపుణ్యవంతమైన రాయబారిగా చేయునట్లు ఆయనయొక్క మార్గదర్శకత్వము, మరియు నడిపింపుకొరకు ప్రభువును అడుగుము. తదుపరి మీ హృదయమందు ఆనందగీతముతో ఆయనను సేవించుటకు వెళ్లుడి.”
9, 10. ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికల ప్రచురణను యెహోవా ఎట్లు విస్తరింపజేసియున్నాడు?
9 ఆ “ఉత్సాహ గీతము” భూమియంతటికి వినబడినది! నిశ్చయముగా అనేక మంది మన పాఠకులు అవేక్! ప్రస్తుతము ప్రతిసంచిక 1,29,80,000 కాపీలతో, 64 భాషలలో ముద్రించబడునట్లు పెరుగుటలో వంతును కలిగియున్నారు. ఆసక్తిగలవారిని సత్యమునకు నడిపించుటలో బలమైన సాధనముగా అవేక్! దివాచ్‌టవర్‌కు జతగా పనిచేయుచున్నది. తూర్పుప్రాంతపు ఒక దేశములో ఒక పయినీరు సిస్టరు తన క్రమమమైన పత్రికామార్గములో తాను క్రొత్తపత్రికలను ఇచ్చుటకు వెళ్లినప్పుడెల్ల యింటివారొకరు యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికొరకు 7 డాలర్లకు (యు.యస్) సమానమైన డబ్బును చందాగా ఇస్తుండటంను చూసి ఆశ్చర్యపోయినది. నిశ్చయంగా ఇది రాజ్యపనికి మంచి మెప్పును చూపుటయైయున్నది.
10 ప్రస్తుతము దాని ప్రచురణయొక్క 112వ యేట ప్రవేశిస్తూ ది వాచ్‌టవర్ పత్రిక 111 భాషలలో 1,52,90,000 కాపీలు ప్రచురించబడుచున్నవి. వీటిలోని 59 సంచికలు ప్రపంచవ్యాప్తముగా ఒకే సమయములో ఒకే విషయములను కలిగియుంటున్నవి. నమ్మకమైన గృహనిర్వాహకునిగా అభిషేకించబడిన శేషము మెప్పుగల చదువరులకు తగినంత [ఆత్మీయ] ఆహారమును తగినవేళ అందించుటలో కొనసాగుచునే ఉన్నది. (లూకా 12:42) 1990లో, యెహోవాసాక్షులు ఈ రెండు పత్రికలకు కలిపి 29,68,309 క్రొత్త సబ్‌స్క్రిప్సన్‌లను అందించిరి. 1989 పై ఇది 22.7 శాతము అభివృద్ధి.
ఆనందము పొంగిపోవుట
11. (ఎ) 1922లో సీడార్ పాయింట్ ఒహాయో నందు దేవుని ప్రజలకు ఏ పిలుపు ఇవ్వబడినది? (బి) ఆ ఆనందపు కేక ఎట్లు విస్తరించినది?
11 1922 సెప్టెంబరులో సీడర్ పాయింట్ ఒహాయో నందు జరిగిన రెండవసమావేశమునకు 10,000 మందిగా దేవునిప్రజలు హాజరై 361 మంది బాప్తిస్మము తీసుకొనగా ఆనందము పొంగిపోయెను. సహోదరుడు రూథర్‌ఫర్డ్ మత్తయి 4:17 ను ఆధారముగా “పరలోకరాజ్యము సమీపించియున్నది” అను తన ప్రసంగమును ఇచ్చెను. దానిని ఆయన “యెహోవా దేవుడనియు, యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునైయున్నాడనియు లోకము తెలుసుకొనవలెను. ఇది దినములన్నిటిలో మహాదినము. ఇదిగో! రాజు పరిపాలించుచున్నాడు. మీరు ఆయన ప్రచారక సాధనములైయున్నారు. కావున రాజును ఆయన రాజ్యమును ప్రకటించుడి, ప్రకటించుడి, ప్రకటించుడి” అను మాటలతో ఉత్తేజపూర్వకంగా ముగింపునకు తీసుకెళ్లెను. ఆ సమావేశములో పెల్లుబికిన ఉత్సాహ ధ్వనిలో పాల్గొనినవారందరు 1989లో 66,00,000 మందిగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 1,210 సమావేశములలో హాజరైరి. వాటిలో మొత్తము 1,23,688 మంది బాప్తిస్మము పొందిరి.
12. (ఎ) ఏ సాటిలేని ఆనందమందు దేవుని ప్రజలు నేడు భాగము కలిగియున్నారు? (బి) “ఉన్నత అధికారులకు లోబడుతు”నే యెహోవాకు చేయు తమ సేవను వారు ఎట్లు సమతుల్యము చేయుదురు?
12 యెహోవాసాక్షులు తమకుగల స్వాతంత్ర్యమును కాపాడుకొందురు. అన్నిటికంటే ముఖ్యముగా యేసు మాటలయొక్క ఆధునిక దిననెరవేర్పునందు వారు ఆనందింతురు. అవేమనగా: “మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” అబద్ధమత మర్మములు, దాని మూఢనమ్మకములనుండి విడుదలపొందుట ఎంత ఆనందదాయకము! నిత్యజీవ ఉత్తరాపేక్షతో యెహోవాను ఆయన కుమారుని ఎరిగి వారితో జతపనివారముగా తయారగుట ఎంతటి మితిలేని ఆనందదాయకము. (యోహాను 8:32; 17:3; 1 కొరింథీయులు 3:9-11) క్రీస్తు ఆధ్వర్యమందలి యెహోవా రాజ్యపు మహిమగల నిరీక్షణను ప్రకటించుటకు వారికిగల స్వాతంత్ర్యమును తాము జీవిస్తున్న లోకమందలి ఉన్నతాధికారులు గౌరవించినప్పుడు దేవుని సేవకులు దానిని మెచ్చుకొందురు. దేవునివి దేవునికి చెల్లిస్తూనే వారు యిష్టపూర్వకముగా “కైసరువి కైసరుకు చెల్లింతురు”.—రోమీయులు 13:1-7; లూకా 20:25.
13. బాధనుండి విడిపించబడినప్పుడు యెహోవాసాక్షులు తమ ఆనందమును ఎట్లు వ్యక్తముచేసిరి?
13 ఏమైనను, దేవునియెడల తాము కలిగియున్న ఈ కర్తవ్యమును మానవ అధికారులు నిర్భందించ ప్రయత్నించిన యెహోవాసాక్షులు అపొస్తలులవలెనె “మేము మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెనుగదా” అని సమాధాన మిస్తారు. ఆ సందర్భములో అపొస్తలులను అధికారులు విడుదలచేసిన తరువాత “వారు సంతోషించుచు. . .వెళ్లిపోయిరి.” వారు ఆ సంతోషమును ఎట్లు వ్యక్తము చేసిరి? “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యాలు 5:27-32, 41, 42) ఆలాగే ఆధునిక దిన యెహోవాసాక్షులును వారి పరిచర్యను నెరవేర్చుచుండుటకు గొప్ప స్వాతంత్ర్యమును పొందినప్పుడు ఆనందించుదురు. యెహోవా మార్గమును తెరచిన అనేక దేశములలో యెహోవా నామమునకును, క్రీస్తు ఆధ్వర్యమందు రాబోవు రాజ్యమునకును గొప్పసాక్ష్యమునిచ్చుటద్వారా వారు అత్యానందమును వ్యక్తముచేయుదురు.—అపొ.కార్యములు 20:20, 21, 24; 23:11; 28:16, 23.
ఆనందముతో సహించుట
14. ఆత్మఫలమైయున్న ఈ ఆనందము డిక్షనరి నిర్వచించుదానికంటె ఎట్లు ఉన్నతమైనది?
14 క్రైస్తవులు అనుభవించు ఆ అమితమైన ఆనందమేమిటి? ఒలంపిక్ ఆటలలో గెలుపొందినవారు పొందే తాత్కాలిక ఆనందముకంటే అది ఎంతో లోతైనది మరియు శాశ్వతమైనది. అది “ఆయనను పరిపాలకునిగా లోబడునట్టి వారికి” దేవుడనుగ్రహించు దేవుని పరిశుద్దాత్మ ఫలమైయున్నది. (అపొ.కార్యములు 5:32) వెబ్‌స్టర్స్ డిక్షనరి ఆనందమును ఉత్సాహము కంటె ఎక్కువ లోతైనదిగాను, ఉల్లసముకంటే ఎక్కువ ప్రకాశమానమైనదిగాను మరియు ప్రదర్శనపూర్వకమైనదిగాను నిర్వచించుచున్నది. క్రైస్తవునికి ఆనందము ఇంకా విస్తారమైన భావమును కలిగియున్నది. అది మన విశ్వాసమునందు వేరుపారినదై శక్తివంతమైన మరియు బలమునిచ్చెడి లక్షణము. “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” (నెహెమ్యా 8:10) దేవుని ప్రజలు సాధకముచేయునట్టి యెహోవాయందలి ఆనందము శారీరక లేక లోకసంబంధమగు సౌఖ్యమునుండి పొందు పైపై ఉల్లసముకంటె ఎంతో మిన్నయైనది.—గలతీయులు 5:19-23.
15. (ఎ) నమ్మకస్థులైన క్రైస్తవుల అనుభవములో సహనము ఎట్లు ఆనందముతో కలిసియున్నది? (బి) ఆనందమును కాపాడుకొనుటలో బలకరమైన అభయమునిచ్చు కొన్ని లేఖనములను తెలుపుము.
15 ఉక్రేయిన్‌లోని మన సహోదరులను గమనించండి. 1950 దశకపు తొలి దశలో ‘ఉన్నతాధికారము’ వీరిలో వేలాదిమందిని సైబీరియాకు బహిష్కరించినప్పుడు వీరు గొప్పకష్టములననుభవించిరి. తరువాత అధికారము వారికి స్వాతంత్ర్యమునిచ్చినప్పుడు వారు ఎంతో కృతజ్ఞులయ్యారు, అయితే వారిలో అందరు తమ స్వంతదేశమునకు తిరిగిరాలేదు. ఎందుకు? ఎందుకనగా తూర్పుప్రాంతమున వారు శ్రమపడి చేసిన కష్టము వారికి యాకోబు 1:2-4 ను గుర్తుకు తెచ్చింది. అదేమనగా: “నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని యెంచుకొనుడి.” ఆ ఆనందదాయకమైన కోతపనిలో వారు ఇంకను సహించుటకు కోరుకున్నారు. ఇటీవల పోలెండులో జరిగిన యెహోవాసాక్షుల సమావేశములలో దూరపు తూర్పు ప్రాంతమునుండి దాదాపు పసిఫిక్ తీరప్రాంతపు తెగలనుండి సాక్షులను ఆహ్వానించుట ఎంత ఆనందదాయకముగా ఉండెను. ఈ ఫలమును ఉత్పత్తిచేయుటకు సహనము మరియు ఆనందము ఒకదానితో మరొకటికలసి కూడా నడిచినవి. నిజముగా, యెహోవా సేవలో సహించు మనమందరము ఆనందముతో ఇట్లు చెప్పగలము: “నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము.”—హబక్కూకు 3:18, 19; మత్తయి 5:11, 12.
16. మన ప్రాంతీయ పనిలో యిర్మీయా మరియు యోబుయొక్క శ్రేష్టమైన మాదిరులు మనలను ఎట్లు ప్రోత్సహించవలెను?
16 కఠినమైన వ్యతిరేకుల మధ్య సాక్ష్యమిచ్చునప్పుడును మనము మన ఆనందమునెట్లు కాపాడుకోగలము? అలాంటి పరిస్థితులలో దేవుని ప్రజలు ఎల్లప్పుడు ఆనందదాయకమైన మనోదృష్టిని కలిగియున్నారని గుర్తుంచుకొనుము. పరీక్షలో నున్నప్పుడు యిర్మీయా ఇట్లనెను: “నీ మాటలు నాకు దెరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీమాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీయా 15:16) యెహోవా నామమును పిలువబడి ఆ నామమునకు సాక్ష్యమిచ్చుట ఎంతటి ఆధిక్యత! పట్టుదలతో కూడిన మన వ్యక్తిగతపఠనము, క్రైస్తవకూటములలో పూర్తిగా పాల్గొనుట సత్యమునందు ఆనందించుటలో కొనసాగునట్లు మనలను తయారుచేయును. సేవాప్రాంతములో మనము ప్రవర్తించు తీరు మరియు రాజ్యసంబంధమైన చిరునవ్వులో మన ఆనందము కనిపించును. విపరీతమైన శోధనలోను యోబు తన శత్రువులనుగూర్చి ఇలా చెప్పగలిగెను: “వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నాముఖ ప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.” (యోబు 29:24) నమ్మకస్థుడైన యోబువలె మనమును వ్యతిరేకులు మనలను హేళనచేసినప్పుడు మనము తీసివేయబడినవారముగా భావించుకొననవసరములేదు. చిరునవ్వు నవ్వుచుండుము! మన ముఖము మన ఆనందమును ప్రతిబింబించి, వినగల చెవులుగలవారిని సంపాదించుకొనగలము.
17. ఆనందముతో కూడిన సహనము ఎట్లు ఫలమియ్యవచ్చును?
17 మనము మన సేవాప్రాంతమును పదేపదే చేయునప్పుడు మన సహనము మరియు ఆనందము నీతియుక్తమైన మనస్సుగలవారిని ప్రేరేపించి మనము కలిగియున్న మహిమగల నిరీక్షణను పరిశీలించునట్లు ప్రోత్సహించవచ్చును. అట్టివారితో క్రమముగా బైబిలు పఠనములను చేయుట ఎంతటి ఆనందదాయకము! అట్టివారు దేవునివాక్యముయొక్క ప్రశస్తమైన సత్యములను తమ హృదయములోకి తీసుకొని చివరకు యెహోవాసేవలో మనకు సహచరులైనప్పుడు ఎంతటి ఆనందమును కలిగియుందుము! తనదినములలోని నూతన విశ్వాసులతో పౌలు చెప్పగలిగినట్లు మనమును “ఏలయనగా మా నిరీక్షణయైనను, ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మనప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు” అని చెప్పగలుగుదుము. (1 థెస్సలొనీకయులు 2:19, 20) నిశ్చయముగా క్రొత్తవారిని దేవునివాక్యపు సత్యములోనికి నడిపి, వారు సమర్పించుకొని బాప్తిస్మముపొందిన యెహోవాసాక్షులగునట్లు సహాయముచేయుటలో తృప్తికరమైన ఆనందము కలదు.
కాపాడునట్టి ఆనందము
18. ఆధునిక దిన అనేక శోధనలను ఎదుర్కొనుటకు మనకేమి సహాయముచేయును?
18 మన అనుదిన జీవితములో మనము సహనము చూపవలసిన అనేక పరిస్థితులుండును. భౌతిక అనారోగ్యము, వ్యాకులత, ఆర్ధికసంబంధమగు కష్టము ఇందులో కొన్ని. అటువంటి శోధనలను ఎదుర్కొనగలుగునట్లు ఒక క్రైస్తవుడు ఆనందమునెట్లు కాపాడుకొనగలడు? నడిపింపు మరియు ఆదరణకొరకు దేవునివాక్యము యొద్దకు వెళ్లుటద్వారా దీనిని చేయవచ్చును. శోధనల సమయములో కీర్తనలను చదువుట లేక చదువుతుండగా వినుట ఎంతో విశ్రాంతిని కలుగజేయును. దావీదుయొక్క వివేకయుక్తమైన సలహాను గమనించుము: “నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నటికిని కదలనీయడు.” (కీర్తన 55:22) యెహోవా నిజముగా “ప్రార్థన ఆలకించువాడు.”—కీర్తన 65:2.
19. దావీదు మరియు పౌలువలె, మనము ఏ నమ్మకమును కలిగియుండవచ్చును?
19 సమస్యలను తట్టుకొనుటలో సులభముగా విఫలమగు మానవులమైన మనకు, యెహోవా సంస్థ దానియొక్క ప్రచురణలద్వారా, సంఘ పెద్దలద్వారా సహాయముచేయుటకు సిద్ధముగా ఉన్నది. దావీదు మనఃపూర్వకంగా ఇట్లు ఉపదేశించుచున్నాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును.” ఇంకను ఆయన “నేను చిన్నవాడనైయుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి యుండలేదు” అని చెప్పగలిగెను. క్రైస్తవ సంఘమునకు సంబంధముగా ఇట్లు గుర్తించుదుము: “యెహోవాయే నీతిమంతుల కాధారము. బాధకలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయము.” (కీర్తన 37:5, 25, 39) ఎల్లప్పుడు పౌలుయొక్క ఈ సలహాను అనుసరించుదము: “కావున మేము అధైర్యపడము. . .మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు.”—2 కొరింథీయులు 4:16-18.
20. విశ్వాసమను నేత్రముద్వారా మనము దేనిని చూడగలము, మరియు ఇది మనలను ఎట్లు ప్రేరేపించవలెను?
20 విశ్వాసమను మన నేత్రములద్వారా యెహోవాయొక్క నూతనవిధానము కేవలము మన ముందే ఉండుటను చూడగలము. పోల్చలేనట్టి ఎట్టి ఆనందము మరియు ఆశీర్వాదములు అక్కడ ఉండును! (కీర్తన 37:34; 72:1, 7; 145:16) ఆ మహిమగల కాలముకొరకు సిద్ధపడుచు కీర్తన 100:2 నందలి మాటలను గైకొందాము. “సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” (w91 1/1)
[అధస్సూచీలు]
a “ఆర్యజాతి గొప్పతనమును” గూర్చి “జర్మని సామ్రాజ్యమైన పరిశుద్ధ రోమను సామ్రాజ్యమును తిరిగి పునఃస్థాపించాలని అడాల్ఫ్ హిట్లరు అనుచుండగా తాను వినినట్లు” చెప్పిన జార్జిటౌన్ యూనివర్సిటి కేథలిక్ రాజప్రతినిధి మాటలను ది న్యూయార్కు టైమ్స్ ఫిబ్రవరి 17, 1940 ఎత్తివ్రాసినది. అయితే చరిత్రకారుడైన విలియం యల్. షిరెర్ తదుపరి ఫలితమును వివరించుచున్నాడు: “1933, జనవరి 30న ప్రారంభమైన నాజికాలమందలి ది థర్డ్ రైక్ అనబడు జర్మని సామ్రాజ్యము వెయ్యి సంవత్సరములుంటుందని హిట్లరు అతిశయించాడు. తరచు నాజి సంభాషణలలో అది ‘వెయ్యిసంవత్సరముల-జర్మని సామ్రాజ్యముగా’ సూచించబడినది. అయితే అది పన్నెండు సంవత్సరముల నాలుగు నెలలు నిలిచినది.”
పునఃసమీక్ష యందు:
◻ జాత్యంహకారముపై ఏ ఆనందదాయకమైన విజయము నేడు చూడబడుతుంది?
◻ దేవుని పురాతన ప్రజలు పాటపాడి ఆనందముతో కేకవేయుటకు ఏమి కారణమైనది?
◻ ఆధునిక కాలములలో నిజమైన ఆనందము ఎట్లు వృద్ధిచెందినది?
◻ సహనము మరియు ఆనందము ఎట్లు ఒకదాని ప్రక్కన మరొకటి కలసివెళ్లును?
◻ దేనిద్వారా మనము మన ఆనందమును కాపాడుకొనవచ్చును?