యెహోవాయొక్క ముఖ్య ప్రతినిధియగు, కుమారుని ఘనపరచుము
“కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.”—యోహాను 5:23.
1. త్రిత్వమందలి క్రైస్తవమత సామ్రాజ్యపు నమ్మకము యేసును ఎట్లు అవమానపరచునదై యున్నది?
ఈనాడు క్రైస్తవమత సామ్రాజ్యములోని అనేకమంది యేసుక్రీస్తును ఘనపరచుచున్నామని చెప్పుకొందురు, కానీ వారు దానికి పూర్తి విరుద్ధమైన దానిని చేతురు. ఎట్లు? ఎట్లనగా, అనేకులు యేసు సర్వశక్తిగల దేవుడని, ఆ దేవుడే, సమస్తమునకు సృష్టికర్తయని, భూమిపైకివచ్చి జీవించెనని మరియు మానవునిగా మరణించెనని చెప్పుదురు. ఈ విధముగా చెప్పుట క్రైస్తవమత సామ్రాజ్యపు ప్రాథమిక బోధయగు త్రిత్వముతో పూర్తిగా కలిసిపోయినది. కానీ ఒకవేళ త్రిత్వము అబద్ధమైనట్లయిన, వాస్తవమందు యేసు దేవునికి క్రిందివానిగా ఆయనకంటే తక్కువవాడయినట్లయిన, దేవునితో ఆయనకున్న సంబంధపు ఈ అసత్యవర్ణన యేసును అసంతోషిని చేయదా? అవును, ఆయన అటువంటి అసత్యవర్ణనను తనకు మరియు తాను బోధించిన యావత్తుకు ఒక అవమానముగా పరిగణించును.
2. యేసు దేవునికంటే తక్కువవాడును మరియు క్రిందివాడును అని లేఖనములు స్పష్టముగా ఎట్లు చూపుచున్నవి?
2 సత్యమేమనగా, యేసు తాను దేవుడనని ఎన్నడును చెప్పలేదు గానీ, తాను “దేవుని కుమారుడనని” ఆయన పదేపదే మాట్లాడెను. ఆయన శత్రువులు సహితము దీనిని అంగీకరించారు. (యోహాను 10:36; 19:7) తండ్రిని ఉన్నతపరచుటలో, తనను ఆయనకంటే తక్కువవానిగా చేసికొనుటలో యేసు ఎప్పుడును మనస్సు గలవాడై ఉండెను. ఆయనిట్లు ఒప్పుకొనెను: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. నా అంతట నేనే ఏమియు చేయలేను. . . . నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను.” మరలా ఆయనిట్లు చెప్పెను: “నేను ఆయన యొద్దనుండి [ప్రతినిధిగా NW] వచ్చితిని; ఆయన నన్ను పంపెను.” ఆయన ఇంకను ఇట్లనెను: “నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను.” (యోహాను 5:19, 30; 7:28, 29; 8:42) యేసు ఎన్నడునూ తాను దేవుడనని లేక ఆయనతో తాను సమానుడనని సూచించలేదు. కావున అటువంటి దానిని బోధించుట యేసును అవమానపరచును.
కొందరు యేసును అవమానపరచు ఇతర విధములు
3. (ఎ) యేసు విషయములో దేనిని నిరాకరించుటద్వారా క్రైస్తవమత సామ్రాజ్యములోని కొందరు ఆయనను అవమానపరచుదురు? (బి) తన మానవపూర్వ ఉనికి విషయములో యేసు ఎటువంటి సాక్ష్యమిచ్చెను?
3 ఆశ్చర్యపరచే విధంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలో ఈనాడు యేసుకు మానవపూర్వ ఉనికియే లేదనిచెప్పుట ద్వారా ఆయనను అవమానపరచు వారుకూడా కొంతమంది ఉన్నారు. అయితే, కేవలము యేసు అక్షరార్థముగా పరలోకమునుండి భూమిపైకి వచ్చెనని గుణగ్రహించుట ద్వారా మాత్రమే మనము సరియైన రీతిలో ఆయనను ఘనపరచ నారంభించగలము. తనకు మానవ పూర్వ ఉనికి కలదని తానుగా యేసు పదేపదే చెప్పెను. “పరలోకమునుండి దిగివచ్చిన వాడు, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని ఆయన చెప్పెను. ఆ తర్వాత ఆయనింకా ఏమనెనంటె, “పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే . . . ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?” ఇంకనూ: “మీరు క్రిందివారు, నేను పైనుండువాడను. . . . అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని ఆయననెను. (యోహాను 3:13; 6:51, 62; 8:23, 58) తాను అప్పగింపబడబోవు రాత్రి తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలోకూడా యేసు తన మానవపూర్వ ఉనికిని సూచించెను.—యోహాను 17:5.
4. (ఎ) ఇంకా ఎటువంటి రీతిలో అనేకులు యేసును అవమానపరచుదురు? (బి) యేసు నిజముగా జీవించెనని స్థిరపరచుటకు ఏ సాక్ష్యము సరిపోవలెను, మరియు ఎందుకు?
4 క్రైస్తవమత సామ్రాజ్యమందలి కొందరైతే యేసు చరిత్రాత్మక వ్యక్తికాదని, మానవునిగా ఆయన అసలెన్నడు జీవించలేదనికూడా అతిగా వాదింతురు. ఆయన నిజముగా జీవించియుండనట్లయిన, ఆయనను ఎందుకు మరియు ఎట్లు ఘనపరచవలెనని చర్చించుటలో అర్థమే ఉండదు. అయినను లేఖనములలో సమృద్ధిగా భద్రపరచబడిన ప్రత్యక్షసాక్షుల సాక్ష్యం సందేహానికి తావులేకుండా యేసు నిజముగా భూమిపై జీవించెనని స్థిరపరచుటకు కావలసినంత రుజువై యుండవలెను. (యోహాను 21:25) తొలి క్రైస్తవులు తమ ప్రాణములకు మరియు స్వేచ్ఛకు ముప్పువాటిల్లినను తరచు యేసును గూర్చి బోధించినందున ఇది ప్రత్యేకముగా నిజమైయున్నది. (అపొ. కార్యములు 12:1-4; ప్రకటన 1:9) ఏమైనను, ఆయననుగూర్చి ఆయన అనుచరులు వ్రాసినది కాకుండా, మరొక విధముగా యేసు ఉనికి చూపెట్టబడగలదా?
5, 6. లేఖనములు కాకుండా, ఏ చారిత్రక సాక్ష్యము యేసుక్రీస్తు యొక్క నిజమైన ఉనికిని చూపించుచున్నది?
5 ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానిక (1987) ఇట్లనుచున్నది: “ప్రాచీన కాలములలో క్రైస్తవత్వమును వ్యతిరేకించిన వారు సహితము యేసు చరిత్రను ఎన్నడూ సందేహించలేదని వివిధ వ్యక్తులు వ్రాసిన వృత్తాంతములు నిరూపించుచున్నవి.” వివిధ వ్యక్తులు వ్రాసిన ఈ వృత్తాంతాలలో కొన్ని ఏమిటి? యూదామత విద్వాంసుడైన జోసెఫ్ క్లాసెనర్ ప్రకారము, తొలి యూదుల ధర్మనియమ వ్రాతల సాక్ష్యము కలదు. (జీసస్ ఆఫ్ నజరేత్, పుట 20) మొదటి శతాబ్దపు యూదామత చరిత్రకారుడైన జోసీఫస్ సాక్ష్యము కూడా కలదు. ఉదాహరణకు, ఆయన యాకోబును రాళ్లతో కొట్టుటను వివరించుచు, ఆయనను “క్రీస్తు అని పిలువబడిన యేసు సోదరునిగా” గుర్తించెను.—జూయిష్ ఆంటిక్విటీస్, XX, [ix, 1].
6 దానికితోడు, తొలి రోమా చరిత్రకారులు మరియు ప్రత్యేకముగా బహుగా గౌరవింపబడిన టాసిటస్ సాక్ష్యముకూడా కలదు. ఆయన రెండవ శతాబ్దపు తొలికాలములో “ప్రజలచే క్రైస్తవులని పిలువబడిన వారి హేయకృత్యముల నిమిత్తమై ద్వేషింపబడిన ఒక తరగతిని” గూర్చి వ్రాసెను. “ఎవరినుండి [క్రైస్తవులను] పేరు ఉద్భవించెనో ఆ క్రిస్టస్ [క్రీస్తు], టైబేరియస్ పాలనలో మా ఒకానొక రాజప్రతినిధి చేతిలో తీవ్రమైన శిక్షననుభవించెను.” (ది ఆన్నల్స్, XV, XLIV) యేసు ఒక చరిత్రాత్మక వ్యక్తి అనుటకుగల సాక్ష్యము దృష్టించుటకు విస్తారముగా ఉన్నది, 18వ శతాబ్దపు ఫ్రెంచ్ తత్వజ్ఞాన నీతిబోధకుడైన, జీన్-జాక్వెస్ రౌసీ ఇట్లు సాక్ష్యమిచ్చెను: “ఎవరునూ సందేహించుటకు పూనుకొనని సోక్రటీస్ చరిత్రయు, యేసుక్రీస్తు చరిత్రయంత చక్కగా ధృవీకరింపబడలేదు.”
కుమారుని ఘనపరచుటకు గల కారణములు
7. (ఎ) ఏ లేఖన సాక్ష్యము మనము యేసుక్రీస్తును ఘనపరచుటకు బాధ్యులను చేయుచున్నది? (బి) యెహోవా తన కుమారుని ఇంకా ఎట్లు ఘనపరచెను?
7 ఇప్పుడు మనము యేసుక్రీస్తును ఘనపరచు విషయానికి వస్తున్నాము. ఆయన అనుచరులు ఆయనను ఘనపరచు బాధ్యతను కలిగియున్నారను విషయమును యోహాను 5:22, 23 నందలి ఆయన మాటలలో చూడవచ్చును: “తండ్రి యెవనికిని తీర్పుతీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” క్రీస్తు పునరుత్థానమైన దగ్గరనుండి, యెహోవా తన కుమారుని మరియెక్కువ ఘనపరచి, ఆయన ‘మరణము పొందినందున ఆయనను మహిమాఘనతలతో కిరీటము ధరింపజేసెను.’ (హెబ్రీయులు 2:9; 1 పేతురు 3:22) ప్రాథమికముగా, ఆయన ఎవరైయున్నారో దానినిబట్టి మరియు ఆయనచేసిన దానినిబట్టి మనము యేసును ఘనపరచు కారణములను కలిగియున్నాము.
8. యేసుక్రీస్తును గూర్చిన ఏ తిరుగులేని వాస్తవములను బట్టి ఆయన ఘనత నొందనర్హుడు?
8 యేసుక్రీస్తు ఘనత నొందనర్హుడు ఎందుకనగా, లోగోస్, లేక వాక్యముగా సమాచారమందించుటలో యెహోవాకు ఆయన అతి శ్రేష్ఠుడు. “వాక్యము” అను బిరుదు యేసు భూమికి రాకముందు ఆలాగే ఆయన పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు ఆయనకు అన్వయించునని లేఖనముల నుండి స్పష్టమగుచున్నది. (యోహాను 1:1; ప్రకటన 19:13) ప్రకటన 3:14లో ఆయన తననుగూర్చి “దేవుని సృష్టికి ఆదియునైనవాడు” అని మాట్లాడుచున్నాడు. ఆయన ‘సమస్త సృష్టికి ఆదిసంభూతుడే’ కాకుండా ‘అద్వితీయ జనితైక కుమారునిగా’ ఆయన మాత్రమే యెహోవా దేవునిచే సూటిగా సృష్టింపబడెను. (కొలొస్సయులు 1:15; యోహాను 3:16) దానికితోడు, “సమస్తమును ఆయన మూలముగా [ద్వారా NW] కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను 1:3) కావున, ఆదికాండము 1:26లో, “మన స్వరూపమందు మన పోలికెచొప్పున నరులను చేయుదము” అని దేవుడు చెప్పుటను మనము చదివినప్పుడు, “మన” అను ఆ మాటలో లోగోస్, లేక వాక్యము చేరియున్నాడు. యేసు తన మానవపూర్వ ఉనికిలో సృష్టియందు యెహోవా దేవునితో భాగమువహించు అద్భుతమైన ఆధిక్యతను కలిగియున్నాడను వాస్తవము, నిశ్చయముగా ఆయనను గొప్ప ఘనతకు అర్హుని చేయుచున్నది.
9. యేసే ప్రధానదూతయైన మిఖాయేలు అని మనమెట్లు తేల్చిచెప్పగలము, మరియు మోషేయొక్క శరీరము సంబంధముగా మిఖాయేలు యెహోవాను ఎట్లు ఘనపరచెను?
9 యేసుక్రీస్తు ఇంకా ఘనత నొందనర్హుడు ఎందుకనగా ఆయన యెహోవాయొక్క ముఖ్యదూత, లేక ప్రధానదూతయై యున్నాడు. దేని ఆధారముగా మనమా నిర్ణయానికి వత్తుము? “ప్రధాన” అను ముందు పదమునకు “ముఖ్యమైన” లేక “ప్రముఖమైన” అని అర్థము. ఇది కేవలము ఒకేఒక ప్రధానదూత ఉన్నాడని భావమిచ్చుచున్నది. పునరుత్థానుడైన యేసు క్రీస్తును సూచిస్తూ దేవుని వాక్యము మాట్లాడుదానిని మనమిట్లు చదువుదుము: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.” (1 థెస్సలొనీకయులు 4:16) యూదా 9లో మనము చదువునట్లుగా, ఈ ప్రధానదూతకు ఒక పేరు కలదు: “ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక—ప్రభువు [యెహోవా NW] నిన్ను గద్దించును గాక అనెను.” యెహోవాను అధిగమించి అపవాదిపై తీర్పుతీర్చుటకు సాహసించకుండుట ద్వారా యేసు తన పరలోకపు తండ్రిని ఘనపరచెను.
10. (ఎ) దేవుని రాజ్యము పక్షముగా పోరాడుటలో మిఖాయేలు ఎట్లు నాయకత్వం తీసికొనును? (బి) ఇశ్రాయేలు జనాంగము సంబంధముగా మిఖాయేలు ఏ పాత్ర వహించెను?
10 సాతాను అతని దయ్యముల సమూహములను పరలోకములో లేకుండా శుభ్రముచేయుటలో నాయకత్వము తీసికొనుచు, ప్రధానదూతయగు మిఖాయేలు దేవుని రాజ్యము పక్షముగా పోరాడును. (ప్రకటన 12:7-10) ‘ఆయన దేవుని ప్రజల పక్షమున నిలుచును’ అని ప్రవక్తయైన దానియేలు చెప్పుచున్నాడు. (దానియేలు 12:1) కాబట్టి, మిఖాయేలు “ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడచిన దేవదూత” మరియు తన ప్రజలను వాగ్దాన దేశమునకు నడిపించుటకు దేవుడు ఉపయోగించిన వాడునైయున్నాడు. “ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయనమాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు, . . . నా నామము ఆయనకున్నది” అని దేవుడు ఆజ్ఞాపించెను. (నిర్గమకాండము 14:19; 23:20, 21) నిస్సందేహముగా యెహోవాయొక్క ప్రధానదూత దేవుని విశిష్టనామ ప్రజల విషయమై గొప్పశ్రద్ధ తీసికొనెను. ప్రవక్తయైన దానియేలును ఓదార్చుటకు పంపిన దూతను మార్గమున ఒక బలిష్టమైన దయ్యము అడ్డుకొనినప్పుడు ఆయన సరియైన రీతిలో అతని సహాయమునకు వచ్చెను. (దానియేలు 10:13) కావున, సెన్హెరీబుకు చెందిన 1,85,000 మంది యుద్ధశూరులను హతమార్చిన దూత ఎవరో కాదుగాని ప్రధానదూతయగు మిఖాయేలే అనుట కారణయుక్తమై యుండును.—యెషయా 37:36.
11. భూమిపై ఏ జీవిత విధానమును వెంటాడినందుకు యేసు మన ఘనత నొందనర్హుడు?
11 ఆయన ఎవరను దానినిబట్టి మాత్రమే యేసుక్రీస్తు ఘనపరచబడుటకు పాత్రుడు కాదుగాని ఆయనచేసిన దానినిబట్టియు ఆయన మన ఘనత పొందనర్హుడై యున్నాడు. ఉదాహరణకు, ఆయన మాత్రమే పరిపూర్ణ జీవముతో మానవునిగా జీవించెను. ఆదాముహవ్వలు పరిపూర్ణముగా చేయబడిరి, అయితే వారి పరిపూర్ణత కొద్దికాలమే ఉండెను. అయితే, శోధనలు లేక హింసల రూపమున చేయగలిగిన యావత్తు అపవాది ఆయనపై చేసిననూ, యేసుక్రీస్తు ‘నిర్దోషిగా, నిష్కల్మషునిగా, పాపులలో చేరక ప్రత్యేకముగా’ నిలిచియుండెను. దానియంతటిలో “ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.” కావున ఆయన సరియైన రీతిలో తన మతవ్యతిరేకులను, “నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?” అని సవాలు చేయగల్గెను. వారిలో ఏ ఒక్కరునూ అట్లు చేయలేకపోయిరి! (హెబ్రీయులు 7:26; 1 పేతురు 2:22; యోహాను 8:46) మరియు ఆయన పాపరహితముగా, యథార్థముగా ఉన్నందున, యేసు తన పరలోక తండ్రి హక్కుగల విశ్వసార్వభౌమాధిపతియని ఆయనను మహిమపరచి, అపవాదిని నీచమైన, ఘోరమైన అబద్ధికునిగా నిరూపించెను.—సామెతలు 27:11.
12. (ఎ) యేసు ఎటువంటి పురుషుడు, మరియు ఆయన ఇతరుల పక్షముగా ఏమిచేసెను మరియు బాధననుభవించెను? (బి) ఆయన చేసిన దానినిబట్టి, ఆయన అనుభవించిన బాధనుబట్టి యేసు మన ఘనత నొందనర్హుడని మీరెందుకు చెప్పుదురు?
12 పరిపూర్ణునిగా మరియు పాపరహిత జీవితమును జీవించినందుకు మాత్రమేగాక, మంచివాడు, నిస్వార్థపరుడు, స్వయంత్యాగ పురుషుడైనందున యేసుక్రీస్తు మన ఘనత నొందనర్హుడై యున్నాడు. (రోమీయులు 5:7 పోల్చుము.) ఆయన అలయక ప్రజల ఆత్మీయ మరియు భౌతిక అవసరతల నిమిత్తము పరిచర్య చేసెను. తన తండ్రి గృహము యెడల ఆయనెంతటి ఆసక్తిని ప్రదర్శించెను, మరియు తన శిష్యులతో వ్యవహరించునప్పుడు ఆయనెంతటి ఓపికను ప్రదర్శించెను! గెత్సేమనే వనములో ఆయనకు కలిగిన కఠినపరీక్షను గూర్చి, బైబిలిట్లు చెప్పుచున్నది: “ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థనచేయగా ఆయన చెమట, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” అవును, ఆయన “మహారోదనముతోను కన్నీళ్లతోను, . . . ప్రార్థనలను యాచనలను సమర్పించెను.” (లూకా 22:44; హెబ్రీయులు 5:7) ఆయనకు కలుగు కఠినపరీక్షను గూర్చి యెషయా 53:3-7లో ప్రవక్తయైన యెషయా ఎంత ఖచ్ఛితముగా ప్రవచించెను!
13. తన పరలోకపు తండ్రిని ఘనపరచుటలో యేసు మనకొరకు ఏ శ్రేష్ఠమైన మాదిరినుంచెను?
13 తన పరలోకపు తండ్రిని ఘనపరచుటలో మనకొరకు శ్రేష్ఠమైన మాదిరినుంచినందుకు కూడా యేసు మన ఘనత నొందనర్హుడు. “నా తండ్రిని ఘనపరచువాడను” అని ఆయన సరిగా చెప్పగల్గెను. (యోహాను 8:49) అన్ని సమయాలలో ఆయన తన మాటలు మరియు క్రియలద్వారా యెహోవా దేవునికి ఘనత తెచ్చెను. ఆ విధముగా, ఆయన ఒక మనుష్యుని స్వస్థపరచినప్పుడు ప్రజలు యేసును మహిమపరచలేదు గాని, “దేవుని మహిమపరచిరి” అని బైబిలు వృత్తాంతము చెప్పుచున్నది. (మార్కు 2:12) కావున, తన భూపరిచర్య అంతమున, యేసు తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలో, “చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని” అని సరిగా చెప్పగల్గెను.—యోహాను 17:4.
ఆయన మనకొరకేమి చేసెను
14. మన ఘనతకు అర్హుని చేసిన యేసు మరణము మనకొరకు ఏమి నెరవేర్చెను?
14 మన కొరకు సమస్తమును నెరవేర్చినందుకు యేసుక్రీస్తు ఎంతగొప్పగా మన ఘనత నొందనర్హుడై యున్నాడు! మనము యెహోవా దేవునితో తిరిగి సమాధానము కలిగియుండులాగున ఆయన మన పాపముల కొరకు మరణించెను. తననుగూర్చి యేసు ఇట్లు చెప్పెను: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్తయి 20:28) ఆ విధముగా ఆయన మరణము మానవులైన మనకొరకు రాజ్యము నెరవేర్చు సమస్తమును, అనగా ఆయన పెండ్లికుమార్తెగా తయారగు 1,44,000 మందికి పరలోకములో అమర్త్యమైన జీవమును, పరీక్షలయందు విశ్వాసమును, విధేయతను నిరూపించుకొనిన ఇతర లక్షలాదిమందికి పరదైసు భూమిపై నిత్యజీవమును సాధ్యపరచును.—కీర్తన 37:29; ప్రకటన 14:1-3; 21:3, 4.
15. యేసు తన తండ్రి వ్యక్తిత్వమును మనకు వెల్లడిచేసెననుటకు ఒక ఉదాహరణ ఏమి?
15 గొప్ప బోధకునిగా, తన తండ్రి చిత్తమును, వ్యక్తిత్వమును పరిపూర్ణముగా మనకు బయల్పరచినందుకు కూడా యేసుక్రీస్తు మన ఘనత నొందనర్హుడై యున్నాడు. ఉదాహరణకు, తన కొండమీది ప్రసంగములో, మంచివారికిని చెడ్డవారికిని ఒకేరీతిలో సూర్యరశ్మిని, వర్షమును దయచేయుచున్న తన తండ్రి విశాలహృదయమును సూచించి, ఆ పిమ్మట ఆయనిట్లనెను: “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా” ఉండవలెను.—మత్తయి 5:44-48.
16. యేసును ఘనతకు పాత్రుని చేసిన విధానమును అపొస్తలుడైన పౌలు ఎట్లు సంక్షిప్తపరచెను?
16 ఘనత నొందనర్హతగల యేసు నడతను అపొస్తలుడైన పౌలు చక్కగా సంక్షేపపరచెను. ఆయనిట్లు వ్రాసెను: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు [చేజిక్కించుకొనుటకు ఎలాంటి తలంపునివ్వలేదు NW] గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ [హింసాకొయ్యపై NW] మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.”—ఫిలిప్పీయులు 2:5-8.
కుమారుని మనమెట్లు ఘనపరచగలము
17, 18. మనము ఏయే విధములుగా యేసుక్రీస్తుకు ఘనత తీసుకురాగలము?
17 యేసుక్రీస్తు నిస్సందేహముగా మన ఘనత నొందనర్హుడు గనుక, మనమీ ప్రశ్నకు వస్తున్నాము: “మనమెట్లు కుమారుని ఘనపరచగలము? ఆయన విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచుటద్వారా మనమట్లు చేయుదుము, మరియు మనము అవసరమైన చర్యలగు పశ్చాత్తాపము, పరివర్తన, సమర్పణ మరియు బాప్తిస్మములను తీసికొనుటద్వారా ఆ విశ్వాసమును నిరూపింతుము. యేసు నామమున ప్రార్థనలో యెహోవా నొద్దకు వచ్చుటద్వారా, మనము యేసును ఘనపరచుదుము. ఆయన మాటలను లక్ష్యపెట్టినప్పుడు మనమింకను ఆయనను ఘనపరచుదుము: “ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ [హింసాకొయ్య NW] నెత్తుకొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) దేవుని రాజ్యమును ఆయన నీతిని ఎడతెగక వెదకమనిన ఆయన ఆదేశాలను మనము లక్ష్యపెట్టినప్పుడు మనము యేసుక్రీస్తును ఘనపరచుదుము, శిష్యులను చేయుపనిలో భాగము వహించుమనిన ఆయన ఆజ్ఞను లక్ష్యపెట్టినప్పుడు మనమాయనను ఘనపరచుదుము. తన నిజమైన అనుచరులు దేనిచే గుర్తింపబడుదురని ఆయనచెప్పెనో ఆ సహోదర ప్రేమను ప్రదర్శించుటద్వారా మనమింకనూ యేసును ఘనపరచుదుము.—మత్తయి 6:33; 28:19, 20; యోహాను 13:34, 35.
18 మనకొరకు ఆయన నామమును తీసికొని, మనలను మనము క్రైస్తవులమని పిలుచుకొనుచు, ఆపైన మన ప్రవర్తనద్వారా ఆ పేరుకు తగ్గట్టు జీవించుటద్వారా, మనము మరియెక్కువగా కుమారునికి ఘనతను తీసికొచ్చెదము. (అపొ. కార్యములు 11:26; 1 పేతురు 2:11, 12) మనము సన్నిహితముగా యేసు అడుగుజాడలలో నడువవలెనని అపొస్తలుడైన పేతురు చెప్పెను. (1 పేతురు 2:21) ఆ విధముగా మన ప్రవర్తన యంతటిలో ఆయనను అనుకరించుటద్వారా కూడా, మనమాయనను ఘనపరచగలము. మరి నిశ్చయముగా, సంవత్సరమున కొకసారి క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినమును ఆచరించినప్పుడు, మనమాయనకు ప్రత్యేకమైన ఘనతను ఇచ్చెదము.—1 కొరింథీయులు 11:23-26.
19, 20. (ఎ) తనను ఘనపరచినందుకు యేసు తన అనుచరులకు ప్రస్తుతమందు మరియు భవిష్యత్తులో ఏ ప్రతిఫలముల నిచ్చును? (బి) కుమారుని సంబంధముగా మనమే నమ్మకమును కలిగియుండగలము?
19 ఆయనను ఘనపరచు విధానమును అనుసరించినందుకు తన శిష్యులకు యేసు ఎటువంటి ప్రతిఫలముల నిచ్చును? ఆయనిట్లనెను: “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను, తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”—మార్కు 10:29, 30.
20 అంటే యేసు నిమిత్తము మనము త్యాగాలు చేసినట్లయిన, దానిననుసరించి మనము ప్రతిఫలము పొందునట్లు ఆయన చూచును. యేసు మనకిట్లు అభయమిచ్చుచున్నాడు: “మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.” (మత్తయి 10:32) కావున తనను ఘనపరచు వారిని పరలోకపు తండ్రి ఎట్లు ఘనపరచునో, కుమారుడు ఇతర విషయములలో చేసినట్లే, ఈ విషయములోను యెహోవా అద్వితీయ జనితైక కుమారుడు తన తండ్రిని అనుకరించునని మనము నమ్మకము కలిగియుండగలము. (w91 2/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ క్రైస్తవమత సామ్రాజ్యమందలి అనేకులు కుమారుని ఎట్లు అవమానపరచుదురు?
◻ తన మానవపూర్వ ఉనికి విషయములో యేసు ఏ సాక్ష్యమిచ్చెను?
◻ మనము యేసును ఘనపరచుటకుగల కొన్ని కారణములేమై యున్నవి?
◻ మనము యేసును ఘనపరచగల కొన్ని మార్గములేమైయున్నవి?
◻ యేసుక్రీస్తును ఘనపరచుట వలన ఏ ప్రయోజనములు కలుగును?