కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 8/1 పేజీలు 28-32
  • యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంతోషమునుగూర్చి ఒక భిన్నమైన దృక్కోణము
  • నిజమైన సంతోషమునకు ఆధారము
  • అస్థిరమైన సంతోష కారకములు
  • పూర్వం వివాహము లేకుండా సంతోషముగా యుండినవారు
  • అవివాహితులే గాని ఈనాడు సంతోషముగా ఉన్నవారు
  • అవివాహిత స్థితియొక్క ప్రయోజనములు
  • నిజమైన సంతోషము దేనిపై ఆధారపడును?
  • వివాహము మాత్రమే సంతోషమునకు కీలకమై యున్నదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నిజమైన సంతోషం ఎక్కడ కనుగొనబడగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 8/1 పేజీలు 28-32

యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము

“ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు.”—కీర్తన 146:5.

1, 2. సంతోషముయొక్క నిర్వచనమును గూర్చి ఏమి చెప్పబడినది, ఈనాడు అనేకమంది ప్రజలకు సంతోషమనగా దాని భావమేమి?

సంతోషమనగా నేమి? శబ్దకోశకారులు, తత్వవేత్తలు, వేదాంతులు దానిని నిర్వచించుటకు శతాబ్దములుగా ప్రయత్నించుచున్నారు. అయితే అందరు అంగీకరించ తగిన నిర్వచనమును వారు అందజేయలేక పోయిరి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా ఒప్పుకొనుచున్నది: “సంతోషము అనుమాట ఎంతకీ పట్టుదొరకని మాటయైయున్నది.” సంతోషము స్పష్టముగా, వారివారి జీవిత దృక్పధంపై ఆధారపడి, వివిధ ప్రజలకు వివిధ భావములను కలిగియున్నది.

2 అనేకమందికి సంతోషము అనేది మంచి ఆరోగ్యము, వస్తు సంపత్తి, ఆహ్లాదకరమైన సహచర్యము చుట్టూ పరిభ్రమిస్తుంది. అయినను, అటువంటి వాటన్నింటిని కలిగియుండి ఇంకను అసంతోషముగానున్న ప్రజలు కలరు. యెహోవా దేవునికి సమర్పించుకున్న స్త్రీపురుషులకు, సంతోషము విషయములో సాధారణముగా ఉన్న దృక్కోణమునకు భిన్నమైన భావమును బైబిలు అందిస్తుంది.

సంతోషమునుగూర్చి ఒక భిన్నమైన దృక్కోణము

3, 4. (ఎ) ఎవరు ధన్యులని యేసు ప్రకటించెను? (బి) యేసు ప్రస్తావించిన సంతోష కారకములనుగూర్చి ఏమి గమనించవచ్చును?

3 తన కొండమీది ప్రసంగములో యేసుక్రీస్తు సంతోషము అనేది మంచి ఆరోగ్యము, వస్తు సంపత్తివంటి వాటిపై ఆధారపడియుండునని చెప్పలేదు. “ఆత్మవిషయమై దీనులైనవారు” “నీతికొరకు ఆకలిదప్పులుగలవారు” నిజమైన సంతోషమును కలిగియున్నారని ఆయన ప్రకటించెను. నిజమైన సంతోషమునకు కావలసిన ఈ రెండు సంగతులకు విరోధభావమున్నట్లు కన్పించు యేసుచెప్పిన ఈ విషయముతో సంబంధమును కలిగియున్నది: “దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.” (మత్తయి 5:3-6) స్పష్టముగా, యేసు తాము ప్రేమించినవారు చనిపోయినట్లయిన ప్రజలు యాంత్రికముగా సంతోషము గలవారిగా యుందురని యేసు చెప్పుట లేదు. బదులుగా, ఆయన తమ పాపస్థితినిగూర్చి దాని పరిణామములనుగూర్చి దుఃఖపడువారిని గూర్చి మాట్లాడుచున్నాడు.

4 “నాశనమునకు లోనయిన దాస్యమునుండి విడిపింపబడు” నిరీక్షణపై ఆధారపడిన పాపమునుబట్టి మానవ సృష్టి మూల్గుచున్నదని అపొస్తలుడైన పౌలు చెప్పెను. (రోమీయులు 8:21, 22) క్రీస్తు విమోచన బలిద్వారా యెహోవా ఏర్పాటుచేసిన పాపపరిహారార్థ ఏర్పాటును అంగీకరించు ప్రజలు, దేవుని చిత్తముచేయు ప్రజలు నిజముగా ఓదార్చబడి ధన్యులు చేయబడుదురు. (రోమీయులు 4:6-8) కొండమీది ప్రసంగములో “సాత్వికులు,” “కనికరముగలవారు,” “హృదయశుద్ధిగలవారు,” “సమాధానపరచువారు” కూడ ధన్యులని యేసు ప్రకటించెను. హింసించబడిననూ అటువంటి దీనులు తమ సంతోషమును పోగొట్టుకొనరని ఆయన అభయమిచ్చెను. (మత్తయి 5:5-11) ఉన్నతిచేయబడిన ఈ సంతోషభరిత విషయములు గొప్పవారినేమి బీదవారినేమి ఒకే స్థానములో ఉంచునని గమనించుట ఆసక్తికరము.

నిజమైన సంతోషమునకు ఆధారము

5. దేవుని సమర్పిత సేవకుల సంతోషమునకు ఆధారమైనదేమి?

5 నిజమైన సంతోషమునకు మూలము వస్తుసంపద యందు లేదు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇట్లనెను: “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.” (సామెతలు 10:22) యెహోవా విశ్వ సార్వభౌమాధిపత్యమును గుర్తించు ప్రాణులకు, సంతోషము అనునది దేవుని ఆశీర్వాదముతో అవిచ్ఛిన్నముగా ముడిపడియున్నది. సమర్పించుకున్న వ్యక్తికి యెహోవా ఆశీర్వాదమున్నదని తలంచుచున్న యెడలను, నిజంగా ఉన్ననూ అతడు లేక ఆమె నిజంగా సంతోషభరితులే. బైబిలు ప్రకారము దృష్టించినట్లయిన, సంతోషమందు ఆత్మతృప్తి, సంతుష్టియను భావము, యెహోవా సేవను నిర్వర్తించుటయు ఇమిడియున్నవి.

6. యెహోవా ప్రజలు నిజముగా సంతోషముగా యుండవలెనంటె వారినుండి ఏమి అవసరము?

6 నిజమైన సంతోషము యెహోవా దేవునితోగల సరియైన సంబంధముపై ఆధారపడియుండును. అది దేవునియెడల ప్రేమ, ఆయనయెడల నమ్మకత్వములపై ఆధారపడియున్నది. యెహోవా సమర్పిత సేవకులు హృదయపూర్వకముగా పౌలు మాటలతో ఏకీభవింతురు: “మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు . . . మనము బ్రదికినను ప్రభువు (యెహోవా NW) కోసమే బ్రదుకుచున్నాము . . . మనము . . . ప్రభువువారమై (యెహోవా NW) యున్నాము.” (రోమీయులు 14:7, 8) కావున, యెహోవాకు విధేయులు కాకుండ, ఆనందముతో ఆయన చిత్తమునకు లోబడకుండ నిజమైన సంతోషమును సాధించుట అసాధ్యము. యేసు ఇట్లనెను: “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు.”—లూకా 11:28.

అస్థిరమైన సంతోష కారకములు

7, 8. (ఎ) సంతోష కారకములను ఎట్లు వర్గీకరించ వచ్చును? (బి) వివాహము, పిల్లలను కనుటనుగూర్చి ఏమి చెప్పవచ్చును?

7 ముందు ప్రస్తావించబడిన సంతోష కారకాలను “ప్రాథమికమైనవని” లేక “స్థిరమైనవని” చెప్పవచ్చును, ఎందుకంటె అవి అన్ని సమయములో యెహోవా సమర్పిత సేవకులకు విలువగలవై యున్నవి. అవికాకుండ, అస్థిరమైనవి అని పిలువబడునవి కలవు. ఒక సమయములో అవి సంతోషమును కలుగజేయవచ్చు, వేరొక సమయములో అవి కొద్ది సంతోషమును లేక అసలు సంతోషము లేకుండా చేయవచ్చును. పితరులకు, క్రైస్తవులకు ముందున్న కాలములలో వివాహము, పిల్లలను కనుట సంతోషమునకు అనివార్యమని తలంచుట జరిగేది. యాకోబును రాహేలు గట్టిగా అడిగిన విన్నపములో ఇది కన్పించును: “నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదను.” (ఆదికాండము 30:1) పిల్లలను కనుటయెడల ఆ దృక్పధము ఆ కాలమందలి యెహోవా సంకల్పములకు సరిపోయింది.—ఆదికాండము 13:14-16; 22:17.

8 తొలికాలములలో వివాహమును, పిల్లలను కనుటను దేవుని అనుగ్రహముగా యెహోవా ప్రజలు పరిగణించేవారు. అయితే, వారి చరిత్రయందలి విపత్కర సమయములలో ఇవి మరియు ఇతర పరిస్థితులతోపాటు దుఃఖము కలిసియుండేది. (కీర్తన 127, 128లను యిర్మీయా 6:12; 11:22; విలాపవాక్యములు 2:19; 4:4, 5లతో పోల్చుము.) కావున, వివాహము, పిల్లలను కనుట శాశ్వత సంతోష-కారకములు కావనుట స్పష్టము.

పూర్వం వివాహము లేకుండా సంతోషముగా యుండినవారు

9. యెఫ్తా కుమార్తె ప్రతియేటా ఎందుకు కొనియాడబడెను?

9 అనేకమంది దేవుని సేవకులు వివాహము లేకుండానే నిజమైన సంతోషమును కనుగొనిరి. తన తండ్రి ప్రమాణముయెడల గౌరవముతో, యెఫ్తాకుమార్తె అవివాహితురాలిగానే యుండెను. కొద్దికాలము ఆమె తన చెలికత్తెలతో కలిసి తన కన్యత్వము విషయమై విలపించెను. అయితే బహుశ “ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర” మధ్య యుండి యెహోవా మందిరములో పూర్తికాల సేవచేస్తూ ఆమె ఎంత ఆనందమును కలిగియుండెను! (నిర్గమకాండము 38:8) దీనికొరకు, ప్రతియేటా ఆమె కొనియాడబడెను.—న్యాయాధిపతులు 11:37-40.

10. యిర్మీయానుండి యెహోవా ఏమి కోరెను, దాని ఫలితముగా ఆయన అసంతోషకరమైన జీవితము గడిపినట్లు కన్పించుచున్నదా?

10 నాటకీయమైన కాలములలో యిర్మీయా జీవించినందున, ప్రవక్తయైన యిర్మీయా వివాహము చేసికొనకుండ పిల్లలను కనకుండ వుండవలెనని దేవుడు కోరెను. (ఆదికాండము 16:1-4) యిర్మీయా దేవుని మాటల సత్యసంధతను అనుభవపూర్వకముగా తెలిసికొనెను: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.” (యిర్మీయా 17:7) 40 సంవత్సరాలకు పైగాచేసిన తన ప్రవచనార్థక సేవయంతటిలో, యిర్మీయా అవివాహితునిగానే దేవునికి నమ్మకముగా సేవచేసెను. మనకు తెలిసినంత వరకు ఆయన ఎన్నడూ వివాహము చేసికొని పిల్లలను కనలేదు. అయినను ‘యెహోవా మంచితనమునుబట్టి ఉత్సహించిన’ నమ్మకమైన యూదుల శేషము వలెనే, యిర్మీయా సంతోషముగా ఉండెననుటను మీరెన్నడూ సందేహించలేరు.—యిర్మీయా 31:12.

11. వివాహపు జత లేకున్నను సంతోషముగా నుండిన యెహోవా నమ్మకమైన సేవకుల లేఖనానుసారమైన మాదిరులు కొన్ని ఏమైయున్నవి?

11 వివాహజత లేకుండానే అనేకమంది ఇతర ప్రజలు యెహోవాకు ఆనందముతో సేవచేశారు. వారు అవివాహితులు, విధవరాండ్రు, భార్యావియోగము నొందినవారు కావచ్చును. వారిలో ప్రవక్త్రి అన్న; బహుశ దొర్కా, లేక తబిత; అపొస్తలుడైన పౌలు; అందరికంటె గొప్పమాదిరిగాయున్న యేసుక్రీస్తు ఉన్నారు.

అవివాహితులే గాని ఈనాడు సంతోషముగా ఉన్నవారు

12. యెహోవాయొక్క సంతోషముగల, సమర్పిత సేవకులు కొంతమంది ఈనాడు దేనికి వీలుకల్పించుకొని యున్నారు, ఎందుకు?

12 ఈనాడు వివాహపు భాగస్వామి లేకుండానే వేలాదిమంది యెహోవా సాక్షులు నమ్మకముగా దేవునికి సేవచేయుచున్నారు. కొంతమంది యేసు ఆహ్వానమును అంగీకరించగల్గిరి: “[దైవానుగ్రహ ఒంటరితనము] కొరకు వీలుకల్గించు కొనగలవాడు, వీలుకల్గించు కొనవలెను.” వారు దీనిని “పరలోక రాజ్యము నిమిత్తము” చేశారు. (మత్తయి 19:11, 12) అనగా, వారు తమకు దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును మంచిగా ఉపయోగించి రాజ్యాసక్తులను ముందుకు తీసుకువెళ్లుటకు ఎక్కువ సమయాన్ని శక్తిని ధారపోశారు. వారిలోని అనేకులు పయినీర్లుగా, మిషనరీలుగా, లేక వాచ్‌టవర్‌ సొసైటి కేంద్ర కార్యాలయములో లేక దాని ఒకానొక బ్రాంచి కార్యాలయములోని బెతేలు కుటుంబ సభ్యులుగా సేవచేయుచున్నారు.

13. క్రైస్తవుడు ఒంటరిగానున్నను సంతోషముగా ఉండగలడని ఏ ఉదాహరణలు చూపుచున్నవి?

13 ప్రియమైన ఒక వృద్ధ సహోదరి “ఒంటరిగా, సంతోషకరమైన పయినీరుగా” అను శీర్షికపేరున, విస్పష్టమైన తన జీవితగాధను తెలియజేసినది. (ది వాచ్‌టవర్‌, మే 1, 1985, పుటలు 23-6) బెతేలు సేవలో 50 సంవత్సరములకు పైగా గడిపిన మరొక అవివాహిత సహోదరి ఇట్లు చెప్పెను: “నా జీవితము, నా పని విషయంలో నేను పూర్తిగా సంతృప్తి చెందియున్నాను. నేను బహుగా ప్రేమించు పనిలో నేను క్రితమెన్నటికంటె ఇప్పుడు ఎక్కువ పనిరద్దీని కలిగియున్నాను. నేనెంత మాత్రము విచారించుటలేదు. నేను మరలా దానినే నిశ్చయించుకొంటాను.”—ది వాచ్‌టవర్‌, జూన్‌ 15, 1982, పుట 15.

14, 15. (ఎ) అపొస్తలుడైన పౌలు ప్రకారము ఒంటరిగా ఉండుటకు ఏమి అవసరము? (బి) ఒంటరిగానున్న వ్యక్తి “బాగుగా” ఉండి, “ధన్యత” కలిగియున్నాడని పౌలు ఎందుకు చెప్పుచున్నాడు?

14 “నిశ్చయించుకొనుట” అను పదమును గమనించుము. పౌలు ఇట్లు వ్రాసెను: “ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన యిష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లిచేయనివాడు మరిబాగుగా ప్రవర్తించుచున్నాడు.” (1 కొరింథీయులు 7:37, 38) ఎందుకు “బాగుగా”? పౌలు ఇలా వివరించెను: “మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు . . . అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు . . . ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుదురు . . . మీరు యోగ్య ప్రవర్తనులై, తొందరేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.”—1 కొరింథీయులు 7:32-35.

15 ‘ప్రభువు గుర్తింపు సంపాదించు’ దృష్టితో “ప్రభువు సన్నిధానవర్తనులై” యుండుట సంతోషముతో ముడిపెట్టబడియున్నదా? స్పష్టముగా పౌలు అట్లే తలంచెను. ఒక క్రైస్తవ విధవరాలినిగూర్చి మాట్లాడుచు ఆయనిట్లనెను: “ఆమెకిష్టమైనవానిని పెండ్లిచేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 7:39, 40.

అవివాహిత స్థితియొక్క ప్రయోజనములు

16. అవివాహితులుగా ఉన్న కొంతమంది యెహోవాసాక్షులు అనుభవించిన కొన్ని ప్రయోజనములు ఏమైయున్నవి?

16 వ్యక్తిగత నిర్ణయాన్నిబట్టి లేక పరిస్థితుల వత్తిడినిబట్టి ఒక క్రైస్తవుడు ఒంటరిగా ఉన్నట్లయితే, అట్టి అవివాహిత స్థితి అనేక వ్యక్తిగత ప్రయోజనములను తెచ్చును. సాధారణముగా ఒంటరిగానున్న వ్యక్తులు దేవుని వాక్యమును పఠించుటకు, దానిని ధ్యానించుటకు ఎక్కువ సమయాన్ని కలిగియుందురు. ఈ పరిస్థితినుండి వారు లాభాన్ని తీసుకున్నట్లయిన, వారి ఆత్మీయత పెరుగును. తమ సమస్యలు పంచుకొనుటకు వివాహజత లేకపోవుటచే, వారు యెహోవాపై ఎక్కువ ఆధారపడుటకు, అన్ని విషయాలలో ఆయన నడిపింపును వెదకుటకు నేర్చుకొందురు. (కీర్తన 37:5) ఇది యెహోవాతో మరిదగ్గరి సంబంధము కలిగియుండుటకు సహాయపడును.

17, 18. (ఎ) అవివాహితులుగా ఉన్న యెహోవా సేవకులకు విస్తారమైన ఏ ప్రాంతీయ సేవా అవకాశములు ఉన్నవి? (బి) అవివాహితులైన కొంతమంది యెహోవా సేవకులు తమ సంతోషమును ఎట్లు వర్ణించిరి?

17 అవివాహిత క్రైస్తవులు యెహోవా స్తుతికొరకు ప్రాంతీయ సేవలో ఇంకా ఎక్కువ సేవచేయు అవకాశములను కలిగియుందురు. మినిస్టీరియల్‌ ట్రెయినింగ్‌ పాఠశాలలో ప్రస్తుతము ఇవ్వబడుచున్న ప్రత్యేక శిక్షణ కేవలము అవివాహిత సహోదరులకు లేక భార్యావియోగము పొందిన వారికే పరిమితము చేయబడినది. అవివాహిత సహోదరీలుకూడ దేవుని సేవలో ఆధిక్యతలను చేరుకొను అవకాశమును కలిగియున్నారు. ముందు ప్రస్తావించబడిన ఆ వృద్ధ సహోదరి ఒకానొక ఆఫ్రికా దేశములో సేవచేయుటకు స్వచ్ఛందముగా ముందుకు వచ్చింది. ఆమెనుగూర్చి చెప్పాలంటే, ఆమె “50 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగి ఒకవిధంగా సున్నితమైన స్త్రీగా” ఉండెను. నిషేధమున్న సమయములో ఇతర మిషనరీలంతా వెళ్లగొట్టబడినప్పుడు కూడ ఆమె అక్కడనే ఉండిపోయెను. ఆమె వయస్సు ఇప్పుడు 80 సంవత్సరాలైనను, ఆమె ఇంకను అక్కడ పయినీరుగానే సేవచేయుచున్నది. ఆమె సంతోషముగా ఉన్నదా? తన జీవితగాధలో ఆమె ఇట్లు వ్రాసింది: “పరిచర్యలో పనిరద్దీని కలిగియుండుటకు ఒంటరితనము అందించు మరింత స్వేచ్ఛను, చలనశీలతను నేను ఉపయోగించ గలిగితిని. . . . అనేక సంవత్సరాలుగా యెహోవాతో నాకున్న సంబంధము మరింత గాఢమైనది. ఒకానొక ఆఫ్రికా దేశములో అవివాహిత స్త్రీగా, నా రక్షణకర్తగా నేనాయనను చూశాను.”

18 దశాబ్దములుగా వాచ్‌టవర్‌ సొసైటి కేంద్ర కార్యాలయములో సేవచేసిన ఒక సహోదరుని మాటలుకూడ గమనార్హమై యున్నవి. వివాహ ఉత్తరాపేక్షలేకుండ పరలోక నిరీక్షణ కలిగియున్నను, ఆయన వివాహము చేసికొనక పోయినను ఆయన సంతోషముగా ఉన్నాడు. తన 79వ ఏట ఆయనిలా వ్రాశాడు: “ఆయన పరిశుద్ధ చిత్తమును నేను నిరాటంకముగా చేయవీలగునట్లు నేను ఆత్మీయముగా ఆలాగే శారీరకముగా ఆరోగ్యముతో, బలముతో ఉండుటకు నాకు సహాయము చేయుమని, జ్ఞానమిమ్మని నేను మన ప్రియమైన పరలోకపు తండ్రికి ప్రతిదినము ప్రార్థనలో వేడుకొందును. యెహోవా సేవలో గడచిన నలభై తొమ్మిది సంవత్సరముల కాలములో నేను నిజముగా సంతోషకరమైన, ఆశీర్వాదపూర్వకమైన జీవితాన్ని అనుభవించాను. యెహోవా అపారమైన కృపతో ఆయన మహిమా ఘనతల నిమిత్తము, ఆయన ప్రజల ఆశీర్వాదము నిమిత్తము సేవచేయుటకు నేను ఎదురుచూస్తున్నాను. . . . యెహోవా దయచేసిన ఆనందము నేను మంచి పోరాటము పోరాడునట్లు నాకు సహాయము చేయుచున్నది, కాగా నేను యెహోవా శత్రువులు ఎంతమాత్రము లేకుండాపోయి ఈ భూమంతయు ఆయన మహిమతో నింపబడు కాలము కొరకు ఎదురుచూచుచున్నాను.”—సంఖ్యాకాండము 14:21; నెహెమ్యా 8:10; ది వాచ్‌టవర్‌, నవంబరు 15, 1968, పుటలు 699-702.

నిజమైన సంతోషము దేనిపై ఆధారపడును?

19. ఎల్లప్పుడు మన సంతోషము దేనిపై ఆధారపడియుండును?

19 యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధము, ఆయన గుర్తింపు, ఆయన ఆశీర్వాదము—ఇవే మనకు శాశ్వతకాలము వరకు నిజమైన సంతోషమును తీసుకువచ్చు కారకములై యున్నవి. నిజమైన సంతోషమును ఉత్పత్తిచేయు దానిపై ఈ సరియైన దృక్కోణముతో, వివాహితులైన యెహోవా సేవకులు సహితము తమ జీవితములలో వివాహము మాత్రమే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి కాదను విషయమును గ్రహింతురు. వారు అపొస్తలుడైన పౌలు సలహాను లక్ష్యపెట్టుదురు: “సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును . . . ఉండవలెను.” (1 కొరింథీయులు 7:29) అంటే వారి భార్యలను నిర్లక్ష్యము చేయవలెనని దీని భావముకాదు. పరిణతి చెందిన క్రైస్తవ భర్తలు యెహోవా సేవకు ప్రథమ స్థానమిస్తారు, ఆలాగే దైవభక్తిగల, మద్దతునిచ్చు వారి భార్యలును చేయుదురు. వారిలో కొందరు తమ భర్తలకు సహచరులుగా పూర్తికాల సేవకూడ చేయుచున్నారు.—సామెతలు 31:10-12, 28; మత్తయి 6:33.

20. తమ వివాహ ఆధిక్యతల విషయములో అనేకమంది క్రైస్తవులు ఏ సరియైన దృక్పధమును కలిగియున్నారు?

20 వివాహితులైన సహోదరులగు ప్రయాణ కాపరులు, బెతేలు స్వచ్ఛంద సేవకులు, సంఘపెద్దలు—నిజానికి రాజ్యాసక్తులకు ప్రథమ స్థానమిచ్చే వివాహిత క్రైస్తవులందరు—‘లోకాన్ని అమితముగా అనుభవించరు’; వారు యెహోవా సేవకొరకైన తమ సమర్పిత జీవితములో వారి వివాహ ఆధిక్యతలు సరిపోవునట్లు పనిచేయుదురు. (1 కొరింథీయులు 7:31) అయినను, వారు సంతోషముగా ఉన్నారు. ఎందుకు? ఎందుకనగా వారి సంతోషమునకు మూలకారణము వారి వివాహము కాదుగాని యెహోవాకు వారు చేయుచున్న సేవయే. నమ్మకమైన అనేకమంది భార్యాభర్తలు—అవును, వారి పిల్లలుకూడ—సంగతులు ఈ విధముగా ఉన్నందుకు సంతోషముగా ఉన్నారు.

21, 22. (ఎ) యిర్మీయా 9:23, 24 ఆధారముగా, మనలను ఏది సంతోషముతో నింపవలెను? (బి) సామెతలు 3:13-18లో సంతోషముయొక్క ఏ కారకములు ప్రస్తావించబడినవి?

21 ప్రవక్తయైన యిర్మీయా ఈ విధముగా వ్రాసెను: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—యిర్మీయా 9:23, 24.

22 మనము వివాహితులమైనను, అవివాహితులమైనను, యెహోవాను గూర్చిన జ్ఞానము మరియు ఆయన చిత్తము చేయుచున్నందున ఆయన ఆశీర్వాదము మనకున్నదను ఒప్పుదల మన సంతోషమునకు మహాగొప్ప మూలాధారమై యుండవలెను. యెహోవా ఏ సంగతులయందు ఆనందించునో ఆ నిజమైన విలువల ప్రమాణముగా తయారగు వాటి పరిజ్ఞానమును కలిగియుండుటకు కూడ మనము సంతోషింతుము. ఎంతోమందిని వివాహమాడిన సొలొమోను రాజు సహితము సంతోషమునకు వివాహము మాత్రమే కీలకమని పరిగణించలేదు. ఆయనిట్లు చెప్పెను: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామెతలు 3:13-18.

23, 24. నూతన విధానములో నమ్మకమైన యెహోవా సేవకులందరు సంతోషముగా ఉండగలరని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?

23 మనలో వివాహితులైన వారందరు దైవచిత్తము చేయుటలో శాశ్వత ఆనందము కనుగొందురు గాక. ఎంపికద్వారా లేక పరిస్థితుల వత్తిడి కారణముగా అవివాహితులుగా ఉన్న మన ప్రియ సహోదర సహోదరీలందరు వారికున్న పరీక్షలన్నింటిని సహించి యెహోవాకు ఇప్పుడు, ఎల్లప్పుడు సేవచేయుటలో సంతోషమును తృప్తిని కనుగొందురు గాక. (లూకా 18:29, 30; 2 పేతురు 3:11-13) రానైయున్న దేవుని నూతన విధానములో “గ్రంథములు” విప్పబడును. (ప్రకటన 20:12) విధేయతగల మానవజాతి సంతోషమునకు దోహదపడు ఉత్తేజకరమైన క్రొత ఆజ్ఞలు, నియమాలను ఈ గ్రంథములు కలిగియుండును.

24 నిశ్చయముగా, మన “సంతోషముగల దేవుడు” మనకు సంపూర్ణ సంతోషము తేగల అద్భుతకరమైన మంచి సంగతులను మనకొరకు కలిగియున్నాడని మనము నిశ్చయత కలిగియుండగలము. (1 తిమోతి 1:11) దేవుడు ‘తన గుప్పిలిని విప్పి ప్రతిజీవి కోరికను తీర్చును.’ (కీర్తన 145:16) యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషమున్నది, అన్ని సమయాలలో ఉండుననుటలో ఆశ్చర్యమేమియు లేదు. (w92 5/15)

మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ యెహోవా సమర్పిత సేవకుల సంతోషమునకు ఏది ఆధారమై యున్నది?

◻ బైబిలు కాలములలో, యెహోవాయొక్క సంతోషముగల అవివాహిత సేవకులు కొంతమంది ఎవరైయుండిరి?

◻ ఒంటరితనమును పౌలు ఎందుకు సిఫారసుచేసెను, దీనిని సంతోషకరమైన జీవితముగా కొంతమంది క్రైస్తవులు ఎట్లు కనుగొనిరి?

◻ ఎల్లప్పుడు మన సంతోషము దేనిపై ఆధారపడి యుండును?

◻ నూతన విధానములో నమ్మకమైన సేవకులందరు సంతోషముగా ఉందురని మనమెందుకు నమ్మకము కలిగియుండ వలెను?

[29వ పేజీలోని చిత్రాలు]

అనేకమంది అవివాహిత సహోదరీలు సంతోషముతో పూర్తికాల సేవకురాండ్రుగా సేవచేయుచున్నారు

[31వ పేజీలోని చిత్రాలు]

యెహోవా కిష్టమైనపనులలో సేవచేయుట సంతోషమునకు ముఖ్యమైన మూలాధారము

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి