యెహోవా ఆత్మ ఆయన ప్రజలను నడిపిస్తున్నది
“దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.”—కీర్తన 143:10.
1, 2. యెహోవా యథార్థ సేవకుల కృంగుదలకు ఏది కారణము కావచ్చును?
‘ఎంతో కృంగినట్లు నాకనిపిస్తుంది! ఓదార్పు నాకెక్కడ లభిస్తుంది? దేవుడు నన్ను విడిచిపెట్టాడా? అలా మీరెప్పుడైనా భావిస్తారా? అట్లయితే, అలా భావించేది మీరొక్కరే కాదు. యెహోవా యథార్థ సేవకులు ఉత్తేజకరమైన ఆత్మీయ పరదైసులో నివసిస్తున్నను, మానవులను సర్వసామాన్యముగా కృంగదీయు సమస్యలను, పరీక్షలను, శోధనలను కొన్నిసార్లు ఎదుర్కొందురు.—1 కొరింథీయులు 10:13.
2 ఎక్కువ కాలము నిలిచియున్న పరీక్ష లేదా మరొక కారణము వలన బహుశ మీరు బహుగా కృంగి యుండవచ్చును. మీరు ప్రేమించిన వ్యక్తి మరణించినందున మీరు బహుగా దుఃఖపడుచు ఒంటరితనము ననుభవిస్తుండ వచ్చును. లేక మీ ప్రియ స్నేహితుడు జబ్బుపడినందున హృదయములో మీరెంతో బాధపడుతుండవచ్చును. అటువంటి పరిస్థితులు మీ ఆనందాన్ని, సమాధానాన్ని దోచుకోవచ్చును, చివరకు వాటి మూలంగా మీ విశ్వాసానికే ముప్పువాటిల్ల వచ్చును. అలాంటప్పుడు మీరేమి చేయాలి?
దేవుని, ఆయన ఆత్మకొరకు అడుగుము
3. సమాధానము, సంతోషమువంటి లక్షణాలనుండి ఏదైనా నిన్ను దోచుకొనుచున్నట్లయిన, ఏమిచేయుట జ్ఞానయుక్తం?
3 మీ సమాధానాన్ని, ఆనందాన్ని, లేదా మరొక దైవిక లక్షణాన్ని ఏదైనా దోచుకొనుచున్నట్లయిన, దేవుని పరిశుద్ధాత్మ లేక చురకైన శక్తి కొరకు ప్రార్థించుట జ్ఞానయుక్తం. ఎందుకు? ఎందుకనగా ఒక క్రైస్తవుడు సమస్యలను, శ్రమలను, శోధనల నెదుర్కొనుటకు సహాయం చేయగల మంచి ఫలాలను యెహోవా ఆత్మ ఉత్పన్నం చేయును. “శరీర కార్యములను” గూర్చి హెచ్చరించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.”—గలతీయులు 5:19-23.
4. ఏదైన శ్రమను, శోధనను ఎదుర్కొనినప్పుడు, విశేషముగా దాని నిమిత్తమే ప్రార్థించుట ఎందుకు యుక్తం?
4 మీరెదుర్కొనుచున్న పరీక్ష కారణంగా, మీరు మీ సాత్వికమును, లేక సాధుత్వమును పోగొట్టుకొను ప్రమాదములో ఉన్నారని గ్రహించవచ్చును. అలాంటప్పుడు ప్రత్యేకముగా ఆత్మఫలమైన సాత్వికము కొరకు యెహోవా దేవునికి ప్రార్థించుము. మీరొకవేళ ఏదైనా శోధననెదుర్కొన్నట్లయిన, మీకు ప్రత్యేకముగా ఆత్మఫలమైన ఆశానిగ్రహము అవసరము. ఆ శోధననెదుర్కొనుటకు, సాతానునుండి తప్పించబడుటకు, మరియు ఆ శ్రమను సహించుటకు కావలసిన జ్ఞానము కొరకు దైవిక సహాయము నిమిత్తము ప్రార్థించుట కూడా సరియే.—మత్తయి 6:13; యాకోబు 1:5, 6.
5. ఆత్మయొక్క ఏ ఫలం కొరకు నీవు ప్రార్థించవలెనో తెలియనంతగా కృంగదీయు పరిస్థితున్నట్లయిన, ఏమిచేయవచ్చును?
5 అయితే కొన్నిసార్లు, పరిస్థితులు ఎంత కృంగదీయునవిగా లేదా గందరగోళముగా ఉండునంటే, ఏ ఆత్మ ఫలము మీకు అవసరమో మీకు తెలియకపోవచ్చును. నిజానికి సంతోషము, సమాధానము, సాత్వికము, ఆలాగే ఇతర దైవిక లక్షణాలు ప్రమాదములో పడవచ్చు. అప్పుడేమి? పరిశుద్ధాత్మ కొరకు దేవుని అడిగి, అది నీలో అవసరమైన ఫలాలను వృద్ధిచేయుటకు ఎందుకు అనుమతించకూడదు? అవసరమైన ఫలాలు బహుశ ప్రేమ లేదా సంతోషము లేదా సమ్మిళిత పరచబడిన ఆత్మ ఫలాలే కావచ్చును. దేవుడు తన ప్రజలను నడిపించుటకు తన ఆత్మను ఉపయోగించుచున్నాడు గనుక, దాని నడిపింపుకు లోబడుటకు సహాయము చేయుమని కూడ ఆయనను ప్రార్థించుము.
సహాయము చేయుటకు యెహోవా ఇష్టపడుచున్నాడు
6. ఎడతెగక ప్రార్థనచేయు అవసరత విషయంలో యేసు ఎట్లు తన అనుచరులను ఎలా ప్రభావితం చేశాడు?
6 ప్రార్థననుగూర్చి మాకు ఉపదేశించుమని యేసుక్రీస్తు శిష్యులు ఆయనను అడిగినప్పుడు, దేవుని ఆత్మకొరకు ప్రార్థించుడని కూడా ఆయన కొంత ఉద్బోధించాడు. వారు ఎడతెగక ప్రార్థించునట్లు వారిని పురికొల్పుటకు రూపింపబడిన ఒక దృష్టాంతమును యేసు మొదట ఉపయోగించుచు ఇట్లనెను: “మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్థరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి—స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల అతడు లోపలనే యుండి—నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును.”—లూకా 11:5-8.
7. లూకా 11:11-13లోని యేసు మాటల సారాంశమేమి, దేవుని గూర్చి, ఆయన ఆత్మను గూర్చి అవి మనకే అభయమిస్తున్నవి?
7 తన నమ్మకమైన సమర్పిత సేవకులలో ప్రతియొక్కరికి సహాయపడుటకు యెహోవా ఇష్టపడుచున్నాడు. ఆయన వారి విన్నపములు ఆలకించును. అయితే యేసు ఉద్బోధించినట్లుగా అటువంటి వ్యక్తి ‘ఎడతెగక అడిగినట్లయిన’ ఇది అతని హృదయపూర్వక కోరికను సూచిస్తూ, అతని విశ్వాసమును ప్రదర్శించును. (లూకా 11:9, 10) క్రీస్తు ఇంకను ఇట్లనెను: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:11-13) స్వాస్థ్యముగా లభించిన పాపము వలన ఎంతోకొంత చెడుతనముగల భూసంబంధమైన తండ్రి తన పిల్లవానికి మంచి సంగతులనిచ్చుచుండగా, తన యథార్థ సేవకులలో ఎవరైనను వినయముతో తన పరిశుద్ధాత్మ కొరకు అడిగినట్లయిన మన పరలోకపు తండ్రి నిశ్చయముగా వారికి దానిననుగ్రహించును.
8. కీర్తన 143:10 దావీదుకు, యేసుకు, దేవుని ఆధునిక దిన సేవకులకెట్లు అన్వయించును?
8 దేవుని పరిశుద్ధాత్మనుండి ప్రయోజనము పొందుటకు, మనము దావీదు వలెనే దాని నడిపింపునుబట్టి నడుచుకొనుటకు ఇష్టపడువారమై యుండాలి. ఆయనిట్లు ప్రార్థించాడు: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము; దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.” (కీర్తన 143:10) ఇశ్రాయేలీయుల రాజైన సౌలు వెలివేసిన దావీదు తన కార్యవిధానము సరియైనదిగా ఉండునట్లు తనను నడిపించుటకు దేవుని ఆత్మను కోరుకొనెను. యుక్త సమయంలో దేవుని చిత్తామేమిటో తెలిసికొనుటకు ఉపయోగించు యాజకుల ఏఫోదుతో అబ్యాతారు అక్కడకు వచ్చెను. దేవుని యాజక ప్రతినిధిగా, అబ్యాతారు యెహోవాను ప్రీతిపరచుటకు దావీదు తీసికోవలసిన చర్యయేమిటో ఉపదేశించాడు. (1 సమూయేలు 22:17-23:12; 30:6-8) దావీదు వలెనే, యేసు కూడ యెహోవా ఆత్మచే నడిపించబడెను, ఆలాగే ఒక తరగతిగా క్రీస్తు అభిషక్తులైన అనుచరుల విషయములోను ఇది నిజమై యున్నది. ఆ 1918-19లో వారు మానవ సమాజము తమను వెలివేసారన్నట్లున్న స్థానములో ఉండిరి, వారు మతసంబంధమైన శత్రువులు వారిని నాశనము చేయగలమని తలంచారు. తమ కార్యహీనత స్థితి నుండి బయటపడు మార్గము కొరకు అభిషక్తులు ప్రార్థించారు, కాగా 1919లో దేవుడు వారి ప్రార్థనలనాలకించి, వారిని విడుదలచేసి వారు మరలా తన సేవలో చురుకుగా పనిచేయునట్లు చేశాడు. (కీర్తన 143:7-9) నిశ్చయముగా యెహోవా ఆత్మ నేటివరకూ సహాయము చేయుచున్నట్లే, ఆనాటి ఆయన ప్రజలను నడిపించెను.
ఆత్మ ఎలా సహాయం చేస్తుంది
9. (ఎ) పరిశుద్ధాత్మ ఎట్లు ఒక “ఆదరణకర్తగా” పనిచేయును? (బి) పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదని మనకెలా తెలియును? (అథస్సూచి చూడుము.)
9 యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను “ఆదరణకర్త” అని పిలిచాడు. ఉదాహరణకు, ఆయన తన శిష్యులతో ఇట్లన్నాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము దానిని చూడదు, దానిని ఎరుగదు గనుక దానిని పొందనేరదు; మీరు దానిని ఎరుగుదురు. అది మీతో కూడ నివసించును, మీలో ఉండును.” ఇతర విషయాలతోపాటు, ఆ “ఆదరణకర్త” బోధకునిగా ఉండును, ఎందుకంటే క్రీస్తు ఇలా వాగ్దానము చేశాడు: “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును.” ఆ ఆత్మ క్రీస్తును గూర్చి కూడ సాక్ష్యమిచ్చును, ఆయన తన శిష్యులకిట్లు అభయమిచ్చాడు: “నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.”—యోహాను 14:16, 17, 26; 15: 26; 16:7, NW.a
10. ఏ యే విధములుగా పరిశుద్ధాత్మ ఒక సహాయకునిగా నిరూపించబడెను?
10 వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను యేసు తన అనుచరులపై సా.శ. 33లో పెంతెకొస్తునాడు పరలోకమునుండి కుమ్మరించాడు. (అపొ. కార్యములు 1:4, 5; 2:1-11) ఆదరణకర్తగా, ఆత్మ దేవుని చిత్తాన్నిగూర్చి, సంకల్పాన్నిగూర్చి వారికి మరింత అవగాహననిచ్చి, ఆయన ప్రవచన వాక్యాన్ని వారికి బయల్పరచింది. (1 కొరింథీయులు 2:10-16; కొలొస్సయులు 1:9, 10; హెబ్రీయులు 9:8-10) భూవ్యాప్తముగా సాక్ష్యమిచ్చుటకు ఆ ఆదరణకర్త యేసు శిష్యులను శక్తిమంతులనుగా చేసెను. (లూకా 24:49; అపొ. కార్యములు 1:8; ఎఫెసీయులు 3:5, 6) నేడును, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా దేవుడు చేసిన ఆత్మీయ ఏర్పాట్లకు సమర్పించుకున్న క్రైస్తవుడు తననుతాను లభ్యపరచుకొన్నట్లయిన, జ్ఞానమందు అభివృద్ధినొందుటకు పరిశుద్ధాత్మ అతనికి సహాయము చేయగలదు. (మత్తయి 24:45-47) యెహోవా సేవకులలో ఒకనిగా సాక్ష్యమిచ్చుటకు కావలసిన ధైర్యాన్ని, బలాన్ని సమకూర్చుట ద్వారా దేవుని ఆత్మ సహాయం చేయగలదు. (మత్తయి 10:19, 20; అపొ. కార్యములు 4:29-31) అయితే, పరిశుద్ధాత్మ ఇతరత్రా కూడా దేవుని ప్రజలకు సహాయం చేయును.
“ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో”
11. ఒకానొక పరీక్ష భరించలేనంత పెద్దదిగా కన్పించినట్లయితే, ఒక క్రైస్తవుడు ఏమి చేయవలెను?
11 భరించలేనంత పెద్దదిగా కన్పించు పరీక్షచే ఒక క్రైస్తవుడు అలుముకొబడినట్లయిన, అతడేమి చేయవలెను? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి, దాని పనిని అది చేయడానికి అనుమతించాలి. పౌలు ఇట్లన్నాడు: “ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.”—రోమీయులు 8:26, 27.
12, 13. (ఎ) ప్రత్యేకముగా పరీక్షా పరిస్థితులలో చేయబడు ప్రార్థనలకు రోమీయులు 8:26, 27 ఎట్లు అన్వయించును? (బి) ఆసియా ప్రాంతములో తీవ్ర శ్రమననుభవించినప్పుడు పౌలు, అతని సహవాసులు ఏమిచేశారు?
12 దేవుని ఆత్మ ఎవరి కొరకు విజ్ఞాపనము చేయునో ఆ పరిశుద్ధులు, పరలోక నిరీక్షణగల యేసు అభిషక్త అనుచరులై యున్నారు. అయితే నీకు పరలోక పిలుపున్నను లేదా భూనిరీక్షణ యున్నను, క్రైస్తవునిగా నీవు దేవుని పరిశుద్ధాత్మ సహాయమును కలిగియుండగలవు. యెహోవా కొన్నిసార్లు ఒక విశేషమైన ప్రార్థనకు నేరుగా జవాబిచ్చును. అయితే కొన్ని సమయాలలో, నీవెంతగా కృంగియుందువంటే, నీ భావాలను మాటలలో పెట్టలేక కేవలము ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో యెహోవాకు మొరపెట్టు వాడవై యుండవచ్చును. నిజానికి, నీ కొరకు శ్రేష్ఠమైనదేదో నీకు తెలియకపోవచ్చు, పైగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించనట్లయిన నీవు అడగరాని విషయాన్నికూడా అడుగవచ్చును. ఆయన చిత్తం నెరవేర్చబడాలని నీవు కోరుతున్నట్లు దేవునికి తెలుసు, ఆలాగే నీకు నిజముగా కావల్సినదేదో ఆయన ఎరిగియున్నాడు. అంతేకాకుండా, పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమందు అనేక ప్రార్థనలు వ్రాయబడియుండునట్లు ఆయన చేశాడు, కాగా ఈ ప్రార్థనలు పరీక్షా సమయాలకు సంబంధించనవై యున్నవి. (2 తిమోతి 3:16, 17; 2 పేతురు 1:21) కావున, ఆయన సేవకులలో ఒకనిగా నీవు చెప్పాలనుకున్న మాటలను, అటువంటి ప్రేరేపిత ప్రార్థనలలో వ్యక్తం చేయబడిన కొన్ని భావాలుగా చూసి, తదనుగుణ్యముగా నీవు చేసిన ప్రార్థనలకు యెహోవా జవాబివ్వగలడు.
13 ఆసియా ప్రాంతములో శ్రమననుభవించుచుండగా దాని విషయమై ఏమని ప్రార్థించాలో బహుశ పౌలుకు, ఆయన సహవాసులకు తెలియక ఉండవచ్చు. ‘శక్తికిమించిన తీవ్రమైన వత్తిడి కలిగినప్పుడు, వారు తమకు మరణశిక్ష కలిగెనని తమలోతామనుకొనిరి.’ అయితే వారు ఇతరుల ప్రార్థనలను అర్ధించి, మరణస్థితి నుండి లేపగల దేవుని యందు నమ్మిక యుంచిరి, కాగా ఆయన వారిని ఆదుకొనెను. (2 కొరింథీయులు 1:8-11) కాబట్టి యెహోవా దేవుడు తన నమ్మకమైన సేవకుల ప్రార్థనల నాలకించి తదనుగుణ్యముగా చర్య తీసుకొనుననుట ఎంత ఓదార్పుకరం!
14. ఒక పరీక్ష కొంతకాలము వరకు కొనసాగుటకు యెహోవా అనుమతించినట్లయిన తత్ఫలితముగా ఏ మేలు జరుగును?
14 దేవుని ప్రజలు ఒక సంస్థగా తరచు పరీక్షల నెదుర్కొనుచున్నారు. ముందే గమనించినట్లుగా, వారు మొదటి ప్రపంచ యుద్ధ కాలమందు హింసించబడిరి. తమ స్థానమును గూర్చి వారు స్పష్టమైన అవగాహన లేక, అందునుబట్టి దేని కొరకు ప్రార్థించవలెనో కచ్చితంగా వారికి తెలియక పోయినను, యెహోవా వాక్యము ప్రవచనార్థక ప్రార్థనలను కలిగియున్నందున ఆయన వారికి జవాబిచ్చెను. (కీర్తన 69, 102, 126; యెషయా 12 అధ్యాయము) కానీ ఒక పరీక్ష కొంతకాలము వరకు కొనసాగునట్లు యెహోవా అనుమతించినట్లయిన అప్పుడేమి? ఇది సాక్ష్యమిచ్చుటకు, కొందరు సత్యమును హత్తుకొనుటకు, ప్రార్థించుట ద్వారా సహోదర ప్రేమ చూపుటకు, లేకపోతే బాధపడుతున్న తోటి విశ్వాసులకు సహాయం చేయుటకు దోహదపడవచ్చును. (యోహాను 13:34, 35; 2 కొరింథీయులు 1:11) యెహోవా తన ప్రజలను తన పరిశుద్ధాత్మ మూలముగా నడిపించునని, వారికొరకు శ్రేష్ఠమైనదే చేయునని, అన్ని సమయాలలో తన పరిశుద్ధనామమును ఘనపరచు, ప్రతిష్ఠపరచు విధముగానే విషయములను జరిగించునని గుర్తుంచుకొనుము.—నిర్గమకాండము 9:16; మత్తయి 6:9.
ఆత్మనెన్నటికిని దుఃఖపరచకుము
15. తమ పక్షముగా ఏమిచేయుటకు క్రైస్తవులు యెహోవా ఆత్మపై ఆధారపడగలరు?
15 కాబట్టి, నీవొక యెహోవా సేవకుడవైతే, పరీక్షలు కలిగినప్పుడు, ఇతర సమయాలలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుము. ఆ పిమ్మట నిశ్చయముగా దాని నడిపింపును అనుసరించుము, ఎందుకంటే పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.” (ఎఫెసీయులు 4:30) నమ్మకమైన అభిషక్త క్రైస్తవులకు దేవుని ఆత్మ ఒక ముద్రగా లేక లభించనైయున్న అమర్త్యమైన పరలోక జీవానికి ‘ఒక సంచకరువుగా’ ఉండెను, ఉన్నది. (2 కొరింథీయులు 1:22; రోమీయులు 8:15; 1 కొరింథీయులు 15:50-57; ప్రకటన 2:10) అభిషక్తులైన క్రైస్తవులు భూనిరీక్షణ గలవారు తమ పక్షముగా యెహోవా ఆత్మ ఎంతో చేయగలదని నమ్మిక యుంచగలరు. వారిని అది నమ్మకత్వముగల జీవనమునకు నడుపగలదు మరియు దేవుని అనంగీకారమునకు, పరిశుద్ధాత్మను పొగొట్టుకొనుటకు, నిత్యజీవమును సంపాదించలేకపోవుటకు నడుపు పాపభరిత క్రియలను విసర్జించుటకు వారికి సహాయం చేయగలదు.—గలతీయులు 5:19-21.
16, 17. ఒక క్రైస్తవుడు ఆత్మనెట్లు దుఃఖపరచ వచ్చును?
16 ఒక క్రైస్తవుడు తెలిసో, తెలియకో పరిశుద్ధాత్మనెట్లు దుఃఖపరచవచ్చును? యెహోవా సంఘములో ఐక్యతను పెంపొందించుటకు, బాధ్యతగల మనుష్యులను నియమించుటకు యెహోవా తన ఆత్మను ఉపయోగించుచున్నాడు. కాబట్టి, సంఘ సభ్యుడొకరు నియమిత పెద్దలకు వ్యతిరేకముగా సణిగినట్లయిన, అబద్ధపు వ్యర్థమైన మాటలు వగైరా వ్యాప్తిచేస్తున్నట్లయిన, సమాధానము, ఐక్యతలయెడల దేవుని ఆత్మయిచ్చు నడిపింపులను అతడు అనుసరించనివాడై యుండును. సాధారణ రీతిలో అతడు ఆత్మను దుఃఖపరచువాడై యుండును.—1 కొరింథీయులు 1:10; 3:1-4, 16, 17; 1 థెస్సలొనీకయులు 5:12, 13; యూదా 16.
17 ఎఫెసులోని క్రైస్తవులకు వ్రాస్తూ, పౌలు అబద్ధము, కోపమును మనస్సులో ఉంచుకొనుట, దొంగతనము, అయుక్త సంభాషణ, జారత్వమందు అమితముగా శ్రద్ధచూపుట, సిగ్గుమాలిన ప్రవర్తన, బూతులను గూర్చి హెచ్చరించాడు. అటువంటి వాటియెడల మొగ్గుచూపుటకు ఒక క్రైస్తవుడు తననుతాను అనుమతించుకొనినట్లయిన, అతడు ఆత్మ ప్రేరిత బైబిలు సలహాకు విరుద్ధముగా పోవువాడై యుండును. (ఎఫెసీయులు 4:17-29; 5:1-5) అవును, ఆ విధముగా కూడ అతడు కొంతమేరకు దేవుని ఆత్మను దుఃఖపరచినవాడై యుండును.
18. దేవుని ఆత్మ ప్రేరేపిత వాక్య సలహాను అలక్ష్యముచేయ నారంభించిన ఏ క్రైస్తవునికైనను ఏమి సంభవించగలదు?
18 నిజానికి, యెహోవా ఆత్మ ప్రేరేపిత వాక్య సలహాను అలక్ష్యము చేయుటకు ఆరంభించు ఏ క్రైస్తవుడైనను ఉద్దేశ పూర్వకముగా పాపముచేసి, దైవానుగ్రహమును పోగొట్టుకొనునట్లు చేయగల స్వభావాలను లేదా లక్షణాలను వృద్ధి చేసికొన మొదలుపెట్టవచ్చును. ప్రస్తుతము అతడు పాపము నభ్యసించకపోతున్నను అతడు ఆ దిశవైపు వెళ్తున్నవాడు కాగలడు. ఆత్మ నడిపింపుకు వ్యతిరేకముగాపోవు అటువంటి క్రైస్తవుడు దానిని దుఃఖపరచువాడై యుండును. ఆ విధముగా అతడు పరిశుద్ధాత్మకు మూలమైన యెహోవాను సహితము ఎదిరించుచు, ఆయనను దుఃఖపరచువాడై యుండును. దేవుని ప్రేమించువాడు అలా చేయుటకు ఎన్నటికిని కోరుకోడు!
పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక ప్రార్థించుము
19. యెహోవా ప్రజలు ప్రత్యేకముగా నేడెందుకు ఆత్మ అవసరమును కలిగియున్నారు?
19 నీవు యెహోవా సేవకుడవై యున్నట్లయిన, ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక ప్రార్థించుము. వ్యవహరించుటకు ఎంతో కష్టముగానున్న అపాయకరమగు ఈ “అంత్యదినములలో” ప్రత్యేకముగా, క్రైస్తవులకు దేవుని ఆత్మ సహాయం ఎంతైనా అవసరం. (2 తిమోతి 3:1-5) పరలోకము నుండి పడద్రోయబడిన అపవాది, అతని దయ్యములు ఇప్పుడు భూపరిధిలోనే ఉండి యెహోవా సంస్థను పాడుచేయవలెనని చూస్తున్నారు. కావున, క్రితమెన్నటికంటె ఎక్కువగా ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించుటకు, లేదా నిర్దేశించుటకు మరియు ఉపద్రవములను, హింసను సహించునట్లు వారిని బలపరచుటకు ఆయన పరిశుద్ధాత్మ అవసరము.—ప్రకటన 12:7-12.
20, 21. యెహోవా వాక్యము, ఆత్మ, సంస్థయొక్క నడిపింపును ఎందుకు అనురించవలెను?
20 తన పరిశుద్ధాత్మ మూలముగా యెహోవా దేవుడు దయచేయుచున్న సహాయము యెడల అన్నిసమయాలలో ప్రశంస చూపుము. ఆయన ఆత్మ ప్రేరిత వాక్యమగు బైబిలు నడిపింపుననుసరించుము. దేవుని ఆత్మచే నడిపించబడు భూసంస్థతో పూర్తిగా సహకరించము. పరిశుద్ధాత్మను దుఃఖపరచునట్లుచేయు లేఖనరహిత విధానమువైపు మరలిపోవుటకు నిన్ను నీవు ఎన్నటికిని అనుమతించుకోవద్దు, ఎందుకంటే చివరకిది నీనుండి పరిశుద్ధాత్మ వైదొలగునట్లుచేసి, నీ ఆత్మీయ వినాశనమునకు నడిపించగలదు.—కీర్తన 51:11.
21 యెహోవా ఆత్మచే నడిపింపబడుటే ఆయనను ప్రీతిపరచుటకు, సమాధానముతో ఆనందకరమైన జీవితము ననుభవించుటకున్న ఏకైక మార్గము. యేసు పరిశుద్ధాత్మను “సహాయకుడు” లేదా “ఆదరణకర్త” అని పిలిచాడని కూడ గుర్తించుకొనుము. (యోహాను 14:6, అథస్సూచి) దాని మూలముగా, దేవుడు క్రైస్తవులను ఓదార్చి, పరీక్షల నెదుర్కొనుటకు వారని బలపరుస్తున్నాడు. (2 కొరింథీయులు 1:3, 4) సువార్త ప్రకటించుకు యెహోవా ప్రజలను శక్తిమంతులనుచేసి, చక్కని సాక్ష్యమిచ్చుటకు కావలసిన అంశాలను గుర్తుతెచ్చుకొనుటకు ఆత్మ వారికి సహాయం చేస్తుంది. (లూకా 12:11, 12; యోహాను 14:25, 26; అపొ. కార్యములు 1:4-8; 5:32) ప్రార్థన మరియు ఆత్మ నడిపింపు మూలముగా, క్రైస్తవులు పరలోక జ్ఞానముతో విశ్వాస పరీక్షల నెదుర్కొనగలరు. కాబట్టి వారు జీవిత పరిస్థితులన్నింటిలో, ఎడతెగక దేవుని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తారు. తత్ఫలితముగా, యెహోవా ఆత్మ ఆయన ప్రజలను నడిపిస్తున్నది.
[అధస్సూచీలు]
a “ఆదరణకర్త” యని వ్యక్తీకరించబడినను, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికాదు. ఎందుకనగా ఆత్మకు అక్కడ గ్రీకు నపుంసక సర్వనామము (దానిని లేక అది అని తర్జుమా చేయబడెను) అన్వయింపబడినది. ఇదే ప్రకారం వ్యక్తిగా పేర్కొనబడిన జ్ఞానమునకు హెబ్రీ స్త్రీలింగ సర్వనామములు అన్వయింపబడినవి. (సామెతలు 1:20-33; 8:1-36) అంతేకాకుండా, పరుశుద్ధాత్మ “కుమ్మరింపబడెను.” ఒక వ్యక్తి అలా కుమ్మరింపబడుట జరుగదు.—అపొ. కార్యములు 2:33.
నీ జవాబులేమై యున్నవి?
◻ యెహోవా పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రార్థించవలెను?
◻ పరిశుద్ధాత్మ ఎట్లు ఒక సహాయకునిగా ఉన్నది?
◻ ఆత్మను దుఃఖపరచుట అనగా దానిభావమేమి, అలా చేయకుండుటకను మనమెట్లు తప్పించుకొనగలము?
◻ పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ఎడతెగక ప్రార్థించవలెను మరియు దాని నడిపింపును అనుసరించవలెను?
[15వ పేజీలోని చిత్రం]
ప్రేమగల తండ్రి తన కుమారునికి మంచి యీవులనిచ్చునట్లు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు తన సేవకులకు యెహోవా దానినిచ్చును
[17వ పేజీలోని చిత్రం]
ప్రార్థనాపూర్వకముగా ఉండే క్రైస్తవుల విషయమై దేవుని ఆత్మ ఎట్లు విన్నపము చేయునో నీకు తెలుసా?