‘నేను బాప్తిస్మము పొందవలెనా?’
జీవితంలో మనం చేయవలసిన నిర్ణయాలలోకెల్లా, ‘నేను బాప్తిస్మము పొందవలెనా?’ అనుదానికంటే ప్రాముఖ్యమైనది బహుశ మరొకటి ఉండదు. అది ఎందుకంత ప్రాముఖ్యమైనది? ఎందుకంటే ఈ ప్రశ్న విషయంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవన విధానంపై మాత్రమే కాక మన నిత్య సంక్షేమంపై సూటియైన ప్రభావాన్ని కలిగియుండును.
నీవు ఈ నిర్ణయాన్ని చేసికొనవలసి యున్నావా? బహుశ నీవు కొంతకాలంగా యెహోవాసాక్షులతో బైబిలును పఠిస్తూ ఉండవచ్చును. లేదా నీ బాల్యంనుండే నీ తలిదండ్రులు నీకు లేఖనాల్ని బోధిస్తూ ఉండవచ్చు. నీవేంచేయాలో నిర్ణయించుకునే స్థితికి నీవిప్పుడు వచ్చియుండవచ్చు. నీవు సరియైన నిర్ణయం చేసికోవడానికి, బాప్తిస్మమందు ఏమి ఇమిడియున్నది, బాప్తిస్మం ఎవరు పొందాలో నీవు అర్థం చేసుకోవాలి.
బాప్తిస్మమందు ఏమి ఇమిడియున్నది
వివాహము వలెనే, బాప్తిస్మము కూడా ఒక బంధాన్ని ముడివేసే ఆచరణయై యుంది. వివాహ విషయమైతే, జతపర్చబడే స్త్రీపురుషులు అప్పటికే సన్నిహిత సంబంధ మేర్పరచుకొని యుంటారు. వారింతకు ముందు ఏకాంతమందు ఒప్పుకున్న దానిని ఇప్పుడు నిజమైన వివాహ బంధమందు ప్రవేశిస్తున్నారని వివాహ ఉత్సవం అందరికి బయల్పరుస్తుంది. ఆ దంపతులు అనుభవించగల ఆధిక్యతలకు అవకాశమిచ్చుటయే గాకుండ వారు తమ జీవితంలో కలిసి జీవించాలనే బాధ్యతను కూడ అది తీసుకు వస్తుంది.
బాప్తిస్మము విషయంలోను అంతే. మనము బైబిలును పఠించేకొలది, యెహోవా మనకొరకు చేసిన ప్రేమగల సంగతులను గూర్చి మనం నేర్చుకుంటాము. ఆయన మనకు జీవమును, దానిని పోషించుకొనుటకు కావలసిన సమస్తము నిచ్చుటయే కాకుండా, పాపభరిత మానవజాతి తనతో మంచి బంధమేర్పరచుకొని పరదైసు భూమిలో నిత్యజీవము సంపాదించుటకు మార్గం తెరచులాగున ఆయన తన అద్వితీయ కుమారుని కూడ అనుగ్రహించాడు. దీనంతటిని గూర్చి మనమాలోచించినప్పుడు, క్రియాశీలకముగా ఉండుటకు మనము పురికొల్పబడుట లేదా?
మనమేమి చేయగలము? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకిలా ఉపదేశించాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) అవును, యేసుక్రీస్తు తండ్రియగు యెహోవా చిత్తం చేయుటలో ఆయన మాదిరి ననుసరిస్తూ, మనమాయన శిష్యులుగా తయారు కాగలం. అయితే అలా చేయుటకు, ‘మనలను మనం ఉపేక్షించుకోవాలి,’ అనగా మనం మన చిత్తంకన్నా దేవుని చిత్తాన్ని ముందుంచుటకు స్వచ్ఛందంగా తీర్మానించుకొనుట అవసరం; దీనియందు ఆయన చిత్తం చేయుటకు మన జీవితాన్ని అర్పించుట, లేదా సమర్పించుట యిమిడియున్నది. ఈ వ్యక్తిగత, స్వచ్ఛంద తీర్మానాన్ని తెలియపర్చుటకు ఒక బహిరంగ ఆచరణ జరుపబడును. దేవునికి మన సమర్పణను సూచనార్థకముగా అందరికి బహిరంగపరచు ఆచరణే ఈ నీటి బాప్తిస్మము.
ఎవరు బాప్తిస్మం పొందాలి?
‘మీరు వెళ్లి సమస్త జనుల ప్రజలను శిష్యులనుగా చేసి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము పేరిట బాప్తిస్మమిచ్చుచు, తాను వారికి ఏయే సంగతులను ఆజ్ఞాపించెనో వాటన్నింటిని వారు పాటించవలెనని వారికి బోధించుడని’ యేసుక్రీస్తు తన శిష్యులకు ఉపదేశించాడు. (మత్తయి 28:19, 20) స్పష్టముగా, బాప్తిస్మము పొందువారు మనస్సు, హృదయము విషయంలో కొంతమేరకు పరిణతి పొందినవారై యుండవలెను. దేవుని వాక్యమును వ్యక్తిగతముగా పఠించుట ద్వారా, వారు తమ గత జీవిత విధానము నుండి ‘మారుమనస్సునొంది తిరుగు’ అవసరతను గుణగ్రహించారు. (అపొ. కార్యములు 3:19) ఆ పిమ్మట, వారు యేసుక్రీస్తు శిష్యులై ఆయనచేసిన సువార్త పనిని చేపట్టు అవసరతను గుర్తించారు. ఇదంతయు బాప్తిస్మం పొందుటకు ముందు జరిగింది.
నీ ఆత్మీయ వికాసమందు నీవు ఈ స్థాయికి ఎదిగావా? దేవుని సేవించాలని నీవు కోరుచున్నావా? అట్లయిన, అపొ. కార్యములు 8వ అధ్యాయమందు వ్రాయబడిన ఐతియోపీయుడైన నపుంసకుని బైబిలు వృత్తాంతమును ప్రార్థనాపూర్వకముగా ఆలోచించుము. ఈ వ్యక్తికి మెస్సీయ అయిన యేసును గూర్చిన ప్రవచనములు వివరించబడినప్పుడు, ఆయన తన మనస్సును, హృదయాన్ని పరిశోధించుకొని, ఆ పిమ్మట ఇట్లడిగాడు: “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి?” నిజానికి ఆయనను ఆటంకపర్చినదేదియు లేదు; కావున ఆయన బాప్తిస్మము పొందెను.—అపొ. కార్యములు 8:26-38.
నేడును అనేకమంది ఆ ప్రశ్ననే అనగా “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి?” అని అడుగుచున్నారు. తత్ఫలితంగా 1991లో క్రొత్తగా సమర్పించుకున్న 3,00,945 మంది బాప్తిస్మం పొందారు. యెహోవా ప్రజలందరికి ఇది ఎంతో ఆనందాన్ని తెచ్చింది, కాగా సహృదయులైన ఇతరులు అభివృద్ధినొంది బాప్తిస్మము కొరకు అర్హతలు సంపాదించులాగున సహాయము చేయుటకు సంఘములలోని పెద్దలు సంసిద్ధంగా ఉన్నారు.
అయితే మీ సంఘములోని పెద్దలు నీవు కొంతకాలం వేచియుండాలని సూచించవచ్చు. లేదా, నీవు పిల్లవాడివైతే, నీ తలిదండ్రులు నిన్ను వేచియుండుమని అడుగవచ్చు. అప్పుడేమి? నిరుత్సాహపడకుము. సర్వోన్నతునితో వ్యక్తిగత సంబంధమందు ప్రవేశించుట గంభీరమైన విషయమని గుర్తుంచుకొనుము. ఉన్నత ప్రమాణాలకు అర్హులై వాటిని కాపాడు కోవాలి. కాబట్టి ఇవ్వబడిన సలహాలు విని హృదయపూర్వకంగా వాటిని అన్వయించుము. ఇవ్వబడిన కారణాలను నీవు పూర్తిగా అర్థం చేసికోలేకపోతే, సిగ్గుపడవద్దు, ఎటువంటి సిద్ధపాటు చేసికొనవలెనో నీవు నిజంగా అర్థం చేసికొనువరకు ప్రశ్నలడుగుము.
మరోవైపున, అదొక పెద్ద నిర్ణయమని చెబుతూ కొంతమంది బాప్తిస్మము తీసుకోవడానికి వెనుదీయవచ్చును. వారిలో నీవునూ ఒకడవైయున్నావా? సమర్పణ, బాప్తిస్మమును జాప్యం చేయడానికి నీకు కచ్చితమైన కారణాలు ఉండవచ్చు. అయితే నీవు అర్హుడవైయుండి కూడా వెనుదీస్తున్నట్లయిన, నిన్నునీవు ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘బాప్తిస్మం తీసికోవడానికి నన్ను ఆటంకపరచునదేమి?’ ప్రార్థనాపూర్వకంగా నీ పరిస్థితిని విశ్లేషించుకొని, తనతో వ్యక్తిగత సంబంధంలోనికి ప్రవేశించుమని యెహోవా యిచ్చే ఆహ్వానానికి ప్రత్యుత్తరమిచ్చుటకు నీవు జాప్యం చేయదగిన నిజమైన కారణమున్నదా చూడుము.
‘నాదింకా చిన్నవయస్సే’
నీది చిన్నవయస్సైతే, ‘నాదింకా చిన్నవయస్సే’ గదా అని నీవనుకోవచ్చు. పిల్లలు విధేయులై తమ క్రైస్తవ తలిదండ్రుల మాటవింటూ, తమ సామర్థ్యం కొలది లేఖనములను అన్వయిస్తున్నంత కాలము, యెహోవా వారిని “పరిశుద్ధులుగా” దృష్టిస్తున్నాడనే నమ్మకాన్ని వారు కలిగియుండవచ్చు. నిజానికి, నీతిమంతులైన తలిదండ్రులకుండే దైవానుగ్రహం వారిపై ఆధారపడిన పిల్లలకు వర్తించునని బైబిలు మనకుపదేశిస్తున్నది. (1 కొరింథీయులు 7:14) ఏమైనను, ఈ విధంగా ఆధారపడే కాలమెంత అనే విషయంలో వయోపరిమితిని బైబిలు ఇవ్వడంలేదు. కాబట్టి, క్రైస్తవ యౌవనులు ‘నేను బాప్తిస్మము పొందవలెనా?’ అను ప్రశ్నను గంభీరముగా ఆలోచించుట ప్రాముఖ్యము.
‘నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని’ యౌవనులను బైబిలు ప్రోత్సహిస్తున్నది. (ప్రసంగి 12:1) ఈ విషయంలో బాలుడైన సమూయేలు మాదిరి మనకున్నది. బాలునిగా “అతడు . . . యెహోవాకు పరిచర్యచేయు చుండెను.” తన అమ్మ, అవ్వ తనకు బోధించిన సత్యాన్ని చిన్నతనం నుండే హృదయానికి తీసికొనిన తిమోతి మాదిరి కూడా మనకున్నది.—1 సమూయేలు 2:18; 2 తిమోతి 1:5; 3:14, 15.
అదేవిధంగా ఈనాడు, అనేకమంది యౌవనులు యెహోవాకు తమ జీవితాల్ని సమర్పించుకున్నారు. బాప్తిస్మము పొందాలనే తన తీర్మానానికి సేవాకూటమందలి ఒక భాగం సహాయపడిందని పదిహేను సంవత్సరాల ఆకిఫ్యూస చెప్పాడు. అయూమి తను పది సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొందింది. యెహోవాను తాను నిజంగా ప్రేమించినందున, ఆయనను సేవించాలని కోరింది. ఆమెకిప్పుడు 13 సంవత్సరాలు, ఈ మధ్యే 12 సంవత్సరాల వయస్సుగల ఆమె బైబిలు విద్యార్థినికూడ యెహోవాను ప్రేమించి బాప్తిస్మము పొందిన అనుభవాన్ని పొందింది. అయూమి తమ్ముడు హికారు కూడ పది సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొందాడు. “నేను చాలా చిన్న వాడనని కొందరంటారు, కాని నేనెలా భావించానో యెహోవాకు తెలుసు. నాకున్న సమస్తంతో ఆయనను సేవించుటకు నాజీవితాన్ని సమర్పించుకోవాలని నేను నిర్ణయించుకున్నప్పుడే బాప్తిస్మము పొందాలని నేను తీర్మానించుకున్నాను” అని అతడంటున్నాడు.
తలిదండ్రుల మాదిరికూడా ప్రాముఖ్యమే, ఎందుకో మనం ఒక యౌవన సహోదరి అనుభవం నుండి చూడవచ్చును. తనతోను, తన తమ్ముడు చెల్లాయితోను, వాళ్లమ్మ బైబిలును పఠించకుండా వాళ్ల నాన్న ఆటంకపరచాడు. అతడు వారినికొట్టి, వారి పుస్తకాలను తగులబెట్టేవాడు. అయితే తల్లి సహనము, విశ్వాసమునుబట్టి, ఆ పిల్లలు యెహోవా దేవుని సేవించు ప్రాముఖ్యతను చూడగల్గారు. ఈ యౌవన బాలిక తన 13వ ఏట బాప్తిస్మము పొందగా, ఆమె తమ్ముడు చెల్లి, ఆమె మాదిరి ననుసరించారు.
‘నేను బహు వృద్ధుడనే’
కీర్తనల రచయిత యిలా అన్నాడు: “వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక.” (కీర్తన 148:12, 13) అవును, వృద్ధులు సహితం యెహోవా పక్షం వహించు అవసరతను గుర్తించాలి. అయితే, కొంతమంది వృద్ధులు మార్పులు చేసికొనుటకు నిరాకరించవచ్చు. “మీరు తాతకు దగ్గులు నేర్పించలేరని” వారు భావిస్తారు. కానీ, “నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని” యెహోవా విశ్వాసియైన అబ్రాహాముతో చెప్పినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలని గుర్తుతెచ్చుకోండి. (అపొ. కార్యములు 7:3; ఆదికాండము 12:1, 4) “నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొనిపోవలెను” అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలు. (నిర్గమకాండము 3:10) తనయెడల ప్రేమ ప్రదర్శించి తనకు సమర్పించుకొమ్మని వీరిని, మరి ఇతరులను యెహోవా అడిగినప్పుడు వారు తమ జీవితాల్లో బాగా స్థిరపడినవారిగా ఉండిరి. యెహోవా పిలుపుకు ప్రత్యుత్తరమిచ్చుటలో వారు వెనుదీయలేదు.
మరి నేటి మాటేమిటి? బైబిలు పఠించడం ప్రారంభించడానికి ముందు షిజూమూ 78 సంవత్సరాలు బౌద్ధమతస్థునిగా ఉండెను. స్వంత కుటుంబస్థులే ఆయనను వ్యతిరేకించారు, తన స్వంత యింటిలో పఠించడానికి సహితం వారు అనుమతించలేదు. కేవలం ఒక సంవత్సరం తర్వాత, ఆయన తనను యెహోవాకు సమర్పించుకునే అవసరతను చూసి, బాప్తిస్మము పొందాడు. ఆయనెందుకు మార్పుచేసుకున్నాడు? ఆయనిలా అంటున్నాడు: “చాలా సంవత్సరాలుగా నేను అబద్ధమతంచే మోసగింపబడ్డాను, ఇప్పుడైతే నిత్యము యెహోవా నుండి ఎడతెగక సత్యాన్ని పొందుటకు ఇచ్ఛయిస్తున్నాను.”
‘అదిప్పుడు మిమ్మును రక్షించుచున్నది’
కాలం పరుగిడుచున్నది. నీతోసహా అందరి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. యెహోవాకు సమర్పించుకొని, సూచనార్థకముగా దానిని నీటి బాప్తిస్మము పొందుటద్వారా చూపించే విషయాన్ని నీవు గంభీరముగా ఆలోచించుట అత్యవసరము. అపొస్తలుడైన పేతురు దీనిని ఇలాచెప్పుట ద్వారా నొక్కితెల్పుచున్నాడు: “బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది.” ఆయనింకా ఇలా వివరించాడు: బాప్తిస్మము “శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని” (బాప్తిస్మమునకు అర్హుడు కాకమునుపే ఒక వ్యక్తి అప్పటికే అలా చేశాడు) “దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.”—1 పేతురు 3:21.
యెహోవా కట్టడలకు తగిన అర్హత సంపాదించినవాడై, బాప్తిస్మము పొందిన శిష్యుడు నిర్మలమైన మనస్సాక్షిని స్వతంత్రించుకొంటాడు. యెహోవాను సేవించుటలో ఎడతెగక శ్రేష్ఠమైన రీతిలో తనవంతు చేయుటద్వారా, అతడు మనశ్శాంతిని, తృప్తిని అనుభవిస్తాడు. (యాకోబు 1:25) అన్నింటికంటె మిన్నగా, రానైయున్న నూతన విధానంలో యెహోవా దయచేయు అనంతమైన ఆశీర్వాదముల కొరకు దృఢనమ్మకముతో అతడు ఎదురుచూడగలడు. ‘నేను బాప్తిస్మము పొందవలెనా?’ అనే ప్రశ్నకు క్రియాత్మకముగా నీవు ప్రత్యుత్తరమిచ్చుటనుబట్టి నీకును దానిలో భాగముండును గాక. (w92 10/1)
[25వ పేజీలోని చిత్రం]
బాలునిగా, సమూయేలు యెహోవా యెదుట పరిచర్య చేశాడు
[26వ పేజీలోని చిత్రం]
యెహోవాచే ఆజ్ఞాపింపబడినప్పుడు మోషే 80 ఏండ్లవాడు
[27వ పేజీలోని చిత్రాలు]
నేడు బాప్తిస్మము పొందిన వృద్ధులు బాలురు కూడ దేవుని నూతన విధానంలో అనంత ఆశీర్వాదముల కొరకు ఎదురుచూడ గలరు