సౌభాగ్యం మీ విశ్వాసాన్ని పరీక్షించగలదు
సౌభాగ్యం ఒక యథార్థపరుని విశ్వాసాన్ని పరీక్షించగలదు. వస్తు సౌభాగ్యం కొరకుచేసే ప్రయత్నం విశ్వాసం కోల్పోవడానికి నడిపించగలదు. (1 తిమోతి 6:9, 10) అయితే సౌభాగ్యం మరోవిధంగా కూడా విశ్వాసాన్ని పరీక్షించగలదు. తాను బాధననుభవిస్తుండగా, అనేకమంది అనీతిపరులు వస్తుదాయకంగా వర్ధిల్లడం చూసినప్పుడు, ఒక యథార్థపరుడు తానుకూడా భక్తిహీన విధానం అవలంబించడానికి శోధింపబడవచ్చును. అంతెందుకు, ఇది యెహోవా సేవకుల్లో కొందరు యథార్థ జీవిత విలువను శంకించడానికి నడిపింది.
దావీదు రాజు ఇశ్రాయేలీయుల్ని పరిపాలిస్తున్న కాలంలో లేవీ గోత్రానికిచెందిన సంగీతకారుడగు ఆసాపుకు ఇదే సంభవించింది. ప్రజారాధనలో ఉపయోగింపబడిన కీర్తనల్ని ఆసాపు కూర్చాడు. హేమను, యెదూతూనులతో కలిసి, సంగీత వ్యాయిద్యములతో యెహోవా దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ప్రవచించాడు కూడా. (1 దినవృత్తాంతములు 25:1; 2 దినవృత్తాంతములు 29:30) ఆసాపుకు అంత ఆధిక్యత ఇవ్వబడిననూ, వస్తురూపకంగా దుష్టప్రజలు వర్ధిల్లడం ఆయన విశ్వాసానికి ఒక పరీక్షగా ఉండెనని 73వ కీర్తన చూపిస్తున్నది.
ఆసాపుయొక్క ప్రమాదకరమైన దృక్పథం
“ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను.” (కీర్తన 73:1, 2) యెహోవా ఇశ్రాయేలు జనాంగం యెడల దయగలవానిగా ఉన్నాడని ఈ మాటల ద్వారా ఆసాపు అంగీకరించాడు. ప్రత్యేకంగా ఆయన “శుద్ధహృదయులయెడల” అలావున్నాడు, ఎందుకంటే వారు దేవునియెడల ఏకభక్తి ప్రదర్శించాలని, ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపర్చాలని వారు కోరుకున్నారు. మనమా దృక్పథం కలిగివుంటే, దుష్టుల సౌభాగ్యం లేదా మరే పరిస్థితివలన బహుగా పరీక్షింపబడ్డా మనం యెహోవాను గూర్చి మంచిగా మాట్లాడుచు ఆయన్ని స్తుతిస్తాము.—కీర్తన 145:1, 2.
యెహోవా మంచితనమేమిటో ఆసాపుకు తెలిసిననూ, నీతిమార్గాన్నుండి ఆయన పాదాలు దాదాపు తొట్రిల్లాయి. అది సుదీర్ఘ నడకతో అలసినప్పుడు మంచులో పాదాలు జారినట్లుండెను. ఆయన విశ్వాసం ఎందుకంత బలహీనమయ్యింది? ఆయనిలా వివరిస్తున్నాడు: “భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.”—కీర్తన 73:3-5.
అనీతిపరుల వస్తు సౌభాగ్యాన్ని బట్టి ఆసాపు ఈర్ష్యపడ్డాడు. మోసపూరితంగా డబ్బు సంపాదించిననూ, వారు ప్రశాంతంగా జీవిస్తున్నట్లు కన్పిస్తున్నది. (కీర్తన 37:1 పోల్చండి.) దుష్టకార్యాలు చేసిననూ, బయటకు వారు భద్రంగానే జీవిస్తున్నట్లుంది. అంతెందుకు, వారు ఎలాంటి యాతన లేకుండా మరణిస్తున్నట్లు కన్పిస్తుంది! ఆత్మీయావసరతను లక్ష్యపెట్టకపోయిననూ వారు కొన్నిసార్లు ప్రశాంతంగా, ఇబ్బందిలేకుండా మరణిస్తున్నట్లు కన్పిస్తున్నది. (మత్తయి 5:3) మరోవైపున, దేవుని సేవకుల్లో కొంతమంది బాధతో రోగంతో మరణిస్తున్నారు, అయితే ఆయన వారిని సంరక్షిస్తాడు, పైగా వారికి అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణ కలదు.—కీర్తన 43:1-3; యోహాను 5:28, 29.
కొదువలేకుండా భోజనం చేయడానికి వారినడ్డగించే ఆరోగ్య సమస్యలు అనేకమంది దుష్టులకు లేవు. “వారు పుష్టిగా నున్నారు,” వారి బొజ్జ ముందుకొస్తుంది. అంతేకాకుండ, వారికి “ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు,” ఎందుకంటే ఇతర మానవులవలె వారు జీవితావసర విషయాల కొరకు అవస్థపడనవసరం లేదు. ‘ఇతరులకు పుట్టునట్లు దుష్టులకు తెగులు పుట్టదని’ ఆసాపు తేల్చిచెప్పాడు. ప్రత్యేకంగా వారు, సాతాను లోకమందు యెహోవా నీతికట్టడలకు హత్తుకొన్నందున భక్తిపరులు అనుభవించే పరీక్షలను వారు అనుభవింపరు.—1 యోహాను 5:19.
దుష్టులు వర్ధిల్లినందున, వారినిగూర్చి ఆసాపు యింకనూ యిలా చెబుతున్నాడు: “కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రమువలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును.”—కీర్తన 73:6-9.
కీడుచేయువారు గర్వమును “కంఠహారమువలె” ధరిస్తారు, వారి హింసాకృత్యాలు ఎంత అసంఖ్యాకంగా ఉన్నాయంటే, వాటిని వారొక ‘వస్త్రంవలె ధరించారు.’ తమ పద్ధతిచొప్పునే చేయడానికి తీర్మానించుకొన్నవారై వారు ఇతరులను గుడ్లురిమి చూస్తారు. దుష్టుల కన్నులు పోషణలేక క్షీణించిపోలేదు గాని, తిండిబోతుతనం వల్ల ‘క్రొవ్వెక్కి వారి కన్నులు ఉబ్బాయి.’ (సామెతలు 23:20) వారి కుతంత్రాల లక్ష్యసాధన, ‘వారి హృదయాలోచనల్ని మించిపోతుంది.’ తాముచేసే మోసాన్ని గూర్చి వారు గర్వంతో ‘ఉన్నతంగా’ మాట్లాడతారు. అంతెందుకు, ‘వారు తమ ముఖాన్ని ఆకాశానికి ఎత్తుచు, తమ నాలుకను భూసంచారం చేయిస్తారు.’ పరలోకంలోను, భూలోకంలోను ఎవరినీ గౌరవించక వారు దేవున్ని దూషిస్తూ, మానవులకు కీడుచేస్తారు.
కేవలం ఆసాపు మాత్రమే తాను చూసినవాటి ప్రభావం క్రిందికి రాలేదు. ఆయనిట్లన్నాడు: “వారి జనము వారిపక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును, మహోన్నతునికి తెలివియున్నదా? అని వారనుకొందురు.” (కీర్తన 73:10, 11) దుష్టులు వర్ధిల్లుతున్నట్లు కన్పిస్తున్నందున, దేవుని ప్రజల్లో కొంతమంది తప్పుడు దృక్పథాన్ని అలవర్చుకొని, ‘జరుగుతున్నది దేవునికి తెలియదు, ఆయన అక్రమకారులపై చర్య తీసుకోడని’ చెప్తూ తాముకూడ అక్రమకారుల స్థితికి చేరెదరని హెబ్రీ గ్రంథ భావమైయుండవచ్చు. మరోవైపున, ఏ హాని పొందకుండా దుష్టులు అక్రమాలు చేయడం యథార్థవంతులకు చేదుపానీయం సేవించినట్లయి యిట్లడగడానికి వారు పురికొల్పబడతారు: ‘దేవుడు వీటినెలా సహిస్తాడు? జరుగుతున్నదేమిటో ఆయన చూడ్డంలేదా?’
దుష్టులతో తన పరిస్థితుల్ని పోల్చుకుంటూ, ఆసాపు యిట్లన్నాడు: “ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.” (కీర్తన 73:12-14) యథార్థ జీవితం గడపడం వ్యర్థమని ఆసాపు తలంచాడు. దుష్టులు మోసం ద్వారా ‘ధనవృద్ధి చేసుకుంటూ’ వర్ధిల్లారు. వారు చేసే అతినీచ తప్పిదాలకు రావల్సిన శిక్షను తప్పించుకొంటున్నట్లు, ఆసాపుకు మాత్రం “దినమంతయు” అంటే మేల్కొన్న దగ్గరనుండి రాత్రి పడుకొనేంత వరకు తాను బాధపడుతున్నట్లు అన్పించింది. ప్రతి ఉదయం యెహోవా తనను సరిదిద్దుతున్నట్లు ఆయన భావించాడు. ఇది సబబుగా ఉన్నట్లు అన్పించనందున, ఆసాపు విశ్వాసం పరీక్షకు గురైంది.
తలంపులో మార్పు
చివరకు తన ఆలోచన తప్పని గ్రహించిన ఆసాపు యిలా చెప్పాడు: “ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడనగుదును. అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు, వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.”—కీర్తన 73:15-20.
ఆసాపు గొంతెత్తి ఫిర్యాదు చేయకపోవడం మంచిదైంది, ఎందుకంటే యెహోవాను సేవించడం వ్యర్థమని బహిరంగముగా చెప్పడం ఆరాధికులైన తన కుటుంబ సభ్యులను నిరుత్సాహపర్చేది లేదా వారి విశ్వాసాన్ని బలహీనపర్చేది. ఆసాపువలె మౌనంగా ఉండి ఆయన చేసినదే చేయుట ఎంత మేలు! యథార్థవంతులు బాధనొందుచుండగా దుష్టులు తప్పిదాలుచేసి తప్పించుకుంటునట్లు ఎందుకన్పిస్తుందో చూడ్డానికి ఆయన దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్లాడు. మౌనంగా యెహోవా ఆరాధికుల మధ్య ధ్యానించడానికి అక్కడి వాతావరణం ఆసాపుకు అనుకూలించగా, ఆయన ఆలోచనా సరళి సరిదిద్దబడింది. కాబట్టి, నేడు మనం చూసేదాన్నిబట్టి కలతచెందితే, మనల్ని ఒంటరివారిగా చేసుకోవడానికి బదులు మనం కూడ దేవుని ప్రజలతో సహవసించుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు వెదకాలి.—సామెతలు 18:1.
దుష్టులను దేవుడు “కాలుజారు చోట” ఉంచాడని ఆసాపు గ్రహించాడు. వారి జీవితాలు వస్తుసంపద చుట్టూ పరిభ్రమిస్తున్నందున, వారు అకస్మాత్తుగా నాశనమనుభవించే ప్రమాదంలో ఉన్నారు. వారు కనీసం వృద్ధాప్యమందైనా మరణిస్తారు, అప్పుడు వారు మోసంతో సంపాదించిన ధనం వారికి దీర్ఘకాల జీవితాన్ని ప్రసాదించలేదు. (కీర్తన 49:6-12) వారి సౌభాగ్యం త్వరగా చెదిరిపోయే కలలా ఉంటుంది. తామేది విత్తారో ఆ పంటను కోయడంతో వృద్ధాప్యం రాకముందే వారు న్యాయానికి పట్టుబడవచ్చు. (గలతీయులు 6:7) వారికి సహాయం చేయదగు అద్వితీయున్ని వారు ఉద్దేశపూర్వకంగా లక్ష్యపెట్టనందున, ఏ నిరీక్షణ లేక వారు నిస్సహాయులుగా విడిచిపెట్టబడతారు. యెహోవా వారిపై చర్య తీసుకొన్నప్పుడు, ఆయన వారి “బ్రదుకును” అనగా వారి డంబాన్ని, హోదాను తిరస్కారభావంతో దృష్టిస్తాడు.
మీ ప్రతిస్పందన విషయంలో జాగ్రత్తగా ఉండండి
తాను చూసిన వాటినిబట్టి అతిగా స్పందించని, ఆసాపు యిలా అంగీకరించాడు: “నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను, నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.”—కీర్తన 73:21-24.
దుష్టుల సౌభాగ్యాన్ని గూర్చి ఆలోచిస్తూ, యథార్థపరుల బాధల్ని తలపోయుట ఒకని హృదయాన్ని మత్సరపడునట్లు లేదా దుఃఖభరితం చేయగలదు. ఈ పరిస్థితినిబట్టి ఆసాపు అంతర్లీనంగా—అంటే తన అంతరింద్రియాల్లో వ్యాకులపడడం అతనికెంతో బాధను కల్గించింది. యెహోవా దృష్టినుండి చూస్తే ఆయన కేవలం మనోస్పందనల్నిబట్టి స్పందించె తెలివిలేని పశుప్రాయుడయ్యాడు. అయిననూ, ఆసాపు ‘తన కుడిచెయ్యి పట్టుకొని నడిపిన దేవుని యొద్దనే ఎల్లప్పుడు ఉన్నాడు.’ తలంపులందు మనం తప్పుచేసిననూ ఆసాపువలెనే యెహోవా సలహాకొరకు వెదకినట్లయిన, మనల్ని బలపర్చడానికి, నిర్దేశించడానికి దేవుడు మన చెయ్యిపట్టుకొని నడిపిస్తాడు. (యిర్మీయా 10:23 పోల్చండి.) కేవలం ఆయనిచ్చే సలహాను అన్వయించుట ద్వారానే మనం సంతోషకరమైన భవిష్యత్తులోనికి నడుపబడగలము. కొద్దికాలం మనం అణచివేతను అనుభవించవచ్చు, అయితే యెహోవా పరిస్థితిని తిరిగి మార్పుచేసి ‘మనల్ని మహిమకు నడిపిస్తాడు,’ లేదా ఘనపరుస్తాడు.
యెహోవామీద ఆధారపడే అవసరతను ప్రశంసిస్తూ ఆసాపు యింకనూ యిట్లన్నాడు: “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరిని నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”—కీర్తన 73:25-28.
ఆసాపుకువలెనే, నిజమైన భద్రతకు, ఓదార్పుకు మనం ఆధారపడగల వ్యక్తి యెహోవా తప్ప మరెవరూ లేరు. (2 కొరింథీయులు 1:3, 4) పరుల ఐహికసంపద యెడల లోభత్వం చూపే బదులు, దేవున్ని సేవించి పరలోకమందు మనం ధనం సమకూర్చుకుందాం. (మత్తయి 6:19, 20) యెహోవా యెదుట అంగీకృత స్థానం కలిగియుండుటే మనకు మహదానందకరం కావాలి. మన ఇంద్రియ పరిజ్ఞానం, హృదయం విఫలమైననూ మన దుర్దశలందునూ నిరీక్షణను, ధైర్యాన్ని పోగొట్టుకొనకుండా ఉండుటకు ఆయన మనల్ని బలపరచి మన హృదయాలకు స్థిరత్వాన్నిస్తాడు. యెహోవాతో సన్నిహితత్వం కలిగియుండుట అమూల్య సంపదై ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడం ఆయన్ని విడిచిన వారందరితోపాటు మనకూ వినాశనాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆసాపువలెనే మనం దేవునికి సమీపస్థులమై, మన చింతయావత్తు ఆయనపై మోపుదాము. (1 పేతురు 5:6, 7) ఇది మన ఆత్మీయ సంక్షేమాన్ని ప్రోత్సహించి, యెహోవా అద్భుతకార్యాల్ని గూర్చి ఇతరులకు చెప్పడానికి మనల్ని పురికొల్పుతుంది.
యెహోవా యెడల యథార్థంగా ఉండండి
తన స్వదేశమైన ఇశ్రాయేలునందు దుష్టులు వర్ధిల్లడాన్ని చూసినందున ఆసాపు కలతచెందాడు. యెహోవా యథార్థ సేవకుల మధ్య గొప్పలు చెప్పడం, అహంకారం, దౌర్జన్యం, ఎగతాళి, మోసం చేయడం వంటి దోషులు, తాము చేసేపనిని దేవుడు చూస్తాడనుటను నిరాకరించే “దుష్టులు” ఉండిరి. (కీర్తన 73:1-11) అదెంత మంచి హెచ్చరిక! యెహోవా దేవున్ని ప్రీతిపర్చడానికి మనం అహంకారం, దౌర్జన్యం, ఎగతాళి, మోసం చేయడం వంటి లక్షణాల్ని కనబర్చకూడదు. ఆసాపువలెనే యెహోవా యథార్థ సేవకులందరు ఆయన యథార్థ ఆరాధికులతో క్రమంగా కూడుకొనుట ద్వారా ‘దేవుని పరిశుద్ధ స్థలానికి రావాలి.’ తమకెన్ని బాధలున్నను, ఇతరులు తమను ఏమన్ననూ, ఏమిచేసిననూ యెహోవాను ప్రేమించువారందరు తమను సంరక్షించగల దేవునిపై ఆధారపడుతూ ‘ఆయనకు సమీపస్థులు’ కావాలి.—కీర్తన 73:12-28; 3 యోహాను 1-10.
నిజమే, దుష్టుల సౌభాగ్యం ఆసాపును పరీక్షించినట్లే మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చును. అయిననూ, మన జీవితాల్ని యెహోవా సేవపై కేంద్రీకరించినట్లయిన ఈ పరీక్షను మనం సహించగలము. ‘తన నామమును బట్టి చూపిన ప్రేమను, మనం చేసిన కార్యాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు’ గనుక యిలా చేయడాన్నిబట్టి మనకు ప్రతిఫలం లభిస్తుంది. (హెబ్రీయులు 6:10) మన ప్రతిఫలానికి పోలిస్తే మనకు కలిగే పరీక్షలు ‘క్షణమాత్రముండునంత చులకనైనవే.’ (2 కొరింథీయులు 4:17) తన యథార్థ సేవకులకు యెహోవా వాగ్దానంచేస్తున్న సంతోషదాయకమైన నిత్యజీవంతో పోలిస్తే 70 లేదా 80 సంవత్సరాల బాధకూడ కేవలం నిట్టూర్పు విడిచినట్టుగానే ఉంటుంది.—కీర్తన 90:9, 10.
దుష్టుల వస్తు సౌభాగ్యానికి భిన్నంగా నీతినిమిత్తము మనం పొందే శ్రమలు దేవుని పరిశుద్ధాత్మ ఫలమగు విశ్వాసాన్ని కనబర్చకుండా మనల్ని ఆటంకపరచకుందము. (గలతీయులు 5:22, 23; 1 పేతురు 3:13, 14) అక్రమకారులైనందున తరచు వర్ధిల్లే దుష్టులను మనం అనుకరిస్తే సాతాను ఆనందిస్తాడు. బదులుగా, యెహోవా నీతికట్టడలను విసర్జించే శోధనలను ఎదిరించడం ద్వారా మనమాయన నామానికి ఘనత తీసుకొద్దాం. (జెఫన్యా 2:3) దుష్టుల విజయాన్నిబట్టి మనం కృంగిపోకూడదు, ఎందుకంటె వారెంత చేసినా కేవలం వస్తు సౌభాగ్యం మాత్రమే సంపాదించగలరు. దానికేం విలువ ఉంటుంది? సర్వాధిపతియైన ప్రభువుగు యెహోవాయందు విశ్వాసముంచు వారనుభవించే ఆత్మీయ సౌభాగ్యానికి అది రవ్వంతైనా సాటిరాదు.