మంచి ధైర్యముతో ఉండండి!
“ప్రభువు నాకు సహాయుడు . . . అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.”—హెబ్రీయులు 13:6.
1. సా.శ. మొదటి శతాబ్దంలో దేవుని సత్యాన్ని నేర్చుకున్నవారు ఎట్టి ధైర్యాన్ని ప్రదర్శించారు?
అది మన సామాన్యశకపు మొదటి శతాబ్దము. ఎంతోకాలంగా నిరీక్షించిన మెస్సీయ వచ్చాడు. ఆయన తన శిష్యులకు చక్కగా బోధించి, ప్రాముఖ్యమైన ప్రకటన పనిని మొదలుపెట్టాడు. అది ప్రజలు దేవుని రాజ్యసువార్త వినాల్సిన సమయమై ఉంది. కనుక, సత్యాన్ని నేర్చుకున్న పురుషులు, స్త్రీలు ధైర్యంగా ఆ అద్భుతమైన సమాచారాన్ని ప్రకటించారు.—మత్తయి 28:19, 20.
2. యెహోవాసాక్షులకు ఈనాడు ధైర్యం ఎందుకు అవసరము?
2 ఆ రోజుల్లో రాజ్యం స్థాపించబడలేదు. కాని రాజుగా నియమించబడిన యేసుక్రీస్తు, రాజ్యాధికారంలో తన భవిష్యత్ అదృశ్య ప్రత్యక్షతను గూర్చి ప్రవచించాడు. మహా యుద్ధాలు, కరవు, రోగాలు, భూకంపాలు, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటన వంటి వాటిచే అది గుర్తించబడుతుంది. (మత్తయి 24:3-14; లూకా 21:10, 11) మనం అనుభవించే హింసను, ఈ పరిస్థితులను ఎదుర్కొనుటకు యెహోవాసాక్షులుగా, మనకు ధైర్యం అవసరం. అందుకే సా.శ. మొదటి శతాబ్దపు ధైర్యవంతులైన రాజ్య ప్రచారకులను గూర్చిన బైబిలు వృత్తాంతాలను పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
క్రీస్తును అనుకరించుటకు ధైర్యం
3. ధైర్యానికి మంచి మాదిరిని ఎవరు అందజేస్తున్నారు, ఆయన గురించి హెబ్రీయులు 12:1-3 నందు ఏమి చెప్పబడింది?
3 ధైర్యం విషయంలో యేసు మంచి మాదిరిగా ఉన్నాడు. ధైర్యవంతులైన క్రైస్తవ కాలానికి ముందున్న యెహోవాసాక్షుల ‘గొప్ప సాక్షి సమూహము’ను గూర్చి ఉదహరించిన తరువాత, అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పడం ద్వారా యేసు వైపు దృష్టి సారించాడు: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.”—హెబ్రీయులు 12:1-3.
4. సాతానుచే శోధించబడినప్పుడు యేసు ఎలా ధైర్యాన్ని ప్రదర్శించాడు?
4 బాప్తిస్మము తీసుకుని, అరణ్యములో 40 దినాలు ధ్యానించి, ప్రార్థించి, ఉపవాసమున్న తరువాత, యేసు ధైర్యంగా సాతానును వ్యతిరేకించాడు. రాళ్లను రొట్టెలుగా మార్చుకొనుమని అపవాదిచే శోధించబడినను, వ్యక్తిగత కోరికను తీర్చుకొనుటకు ఒక అద్భుతం చేయడం తప్పు గనుక యేసు అందుకు నిరాకరించాడు. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.” దేవాలయ శిఖరము నుండి దూకమని సాతాను ఆయనను సవాలుచేసినప్పుడు, ఆత్మహత్య నుండి తనను రక్షించమని దేవుని శోధించుట పాపమైయుండేది గనుక యేసు దానికి నిరాకరించాడు. క్రీస్తు ఇలా చెప్పాడు: “ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నది.” ఒక్క “నమస్కారము” చేస్తే లోకరాజ్యాలన్నీ ఆయనకు ఇచ్చేస్తానని సాతాను అన్నాడు కాని, యేసు మతభ్రష్టత్వానికి పాల్పడి, పరీక్షింపబడినప్పుడు మానవులు దేవునికి నమ్మకంగా వుండలేరనే అపవాది నిందకు మద్దతు నివ్వలేదు. అందుకే యేసు ఇలా చెప్పాడు: “సాతానా, పొమ్ము—ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది.” దానికి ఆ శోధకుడు “కొంతకాలము ఆయనను విడిచిపోయెను.”—మత్తయి 4:1-11; లూకా 4:13.
5. శోధనను సహించుటకు మనకు ఏది సహాయం చేయగలదు?
5 యేసు యెహోవాకు విధేయుడై, సాతానును వ్యతిరేకించాడు. అలాగే మనం ‘దేవునికి లోబడియుండి, అపవాదిని ఎదిరిస్తే, అప్పుడు వాడు మనయొద్ద నుండి పారిపోవును.’ (యాకోబు 4:7) యేసువలే, మనమును లేఖనాలను అన్వయిస్తే శోధనలకు ధైర్యంగా నిలబడగలము, ఏదైనా పాపమును చేయడానికి శోధింపబడినప్పుడు బహుశ వాటిని ఉదహరించవచ్చు కూడా. దొంగతనం చేయాలని శోధింపబడినప్పుడు “దొంగిలకూడదు” అనే దేవుని ఆజ్ఞను మనకు మనం మళ్లీ మళ్లీ చెప్పుకుంటే, మనం ఆ శోధనకు లొంగిపోతామంటారా? ఇద్దరు క్రైస్తవులలో ఒక్కరైనా “వ్యభిచరింపకూడదు” అనే మాటలను ధైర్యంగా ఉదహరిస్తే వారు లైంగిక అవినీతికి పాల్పడుటకు లొంగిపోతారా?—రోమీయులు 13:8-10; నిర్గమకాండము 20:14, 15.
6. యేసు ఎలా ధైర్యవంతుడైన ప్రపంచ విజేతగా వుండెను?
6 ఈ లోకంచే ద్వేషించబడిన క్రైస్తవులుగా, మనం దాని స్ఫూర్తిని, పాపయుక్తమైన ప్రవర్తనను విసర్జించవచ్చు. యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.” (యోహాను 16:33) ఆయన దానివలె తయారుకాకుండా ఉండడం ద్వారా లోకాన్ని జయించాడు. జయించినవానిగా ఆయన మాదిరి, యథార్ధవంతమైన ఆయన నడవడికి లభించిన ప్రతిఫలం, లోకంనుండి వేరైయుండి దానిచే మలినం కాకుండా ఆయనను అనుకరించుటకు కావలసిన ధైర్యాన్ని మనలో నింపుతాయి.—యోహాను 17:16.
ప్రకటించుటలో కొనసాగుటకు ధైర్యం
7, 8. హింసవున్నప్పటికీ ప్రకటించుటలో కొనసాగుటకు మనకేది సహాయం చేస్తుంది?
7 హింసించబడినప్పటికీ ప్రకటించుటలో కొనసాగుటకు కావలసిన ధైర్యం కొరకు యేసు, ఆయన శిష్యులు దేవునిపై ఆధారపడ్డారు. క్రీస్తు హింసనెదుర్కొన్నప్పటికీ ధైర్యంగా తన పరిచర్యను నెరవేర్చాడు, సా.శ. 33 పెంతకొస్తు తరువాత, హింసించబడిన ఆయన అనుచరులు, యూదా మతనాయకులు వారిని ఆపుటకు ప్రయత్నించినా వారు సువార్త ప్రకటించడంలో కొనసాగారు. (అపొస్తలుల కార్యములు 4:18-20; 5:29) శిష్యులు ఇలా ప్రార్థించారు: “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” అప్పుడు ఏం జరిగింది? ఆ వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.”—అపొస్తలుల కార్యములు 4:24-31.
8 ఈనాడు అనేకమంది ప్రజలు సువార్త నంగీకరించడం లేదు గనుక, వారికి ప్రకటిస్తూనే ఉండాలంటే తరచూ ధైర్యం అవసరమవుతుంది. ప్రాముఖ్యంగా, హింసించబడినప్పుడు మంచి సాక్ష్యమిచ్చుటకు దేవుడిచ్చే ధైర్యం యెహోవా సేవకులకు అవసరమవుతుంది. (అపొస్తలుల కార్యములు 2:40; 20:24) యౌవనస్థుడు, తక్కువ అనుభవం గలవాడైన తనతోటి పనివానితో ధైర్యంగల రాజ్యప్రచారకుడైన పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.” (2 తిమోతి 1:7, 8) మనం ధైర్యం కొరకు ప్రార్థిస్తే, ప్రకటించడంలో కొనసాగ గల్గుతాము, హింస కూడా రాజ్యప్రచారకులుగా మనకున్న ఆనందాన్ని దోచుకొనలేదు.—మత్తయి 5:10-12.
యెహోవా పక్షాన ఉండుటకు ధైర్యం
9, 10. (ఎ) బాప్తిస్మం పొందిన క్రీస్తు అనుచరులగుటకు మొదటి శతాబ్దపు యూదులు, అన్యులు ఏం చేశారు? (బి) క్రైస్తవులగుటకు ధైర్యం ఎందుకు అవసరమైంది?
9 అనేకమంది మొదటి శతాబ్ద యూదులు, అన్యులు బాప్తిస్మం పొందిన క్రీస్తు అనుచరులగుటకు ధైర్యంగా లేఖనవిరుద్ధ సాంప్రదాయాలను వదిలిపెట్టారు. సా.శ. 33 పెంతకొస్తు తరువాత అనతికాలానికే, “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” (అపొస్తలుల కార్యములు 6:7) మతసంబంధమైన సంబంధాలను తెంచుకొని, యేసును మెస్సీయగా అంగీకరించే ధైర్యం ఆ యూదులకు ఉండింది.
10 సా.శ. 36 ప్రారంభంలో, అనేకమంది అన్యులు విశ్వాసులయ్యారు. కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు, ఇతర అన్యులు సువార్త విన్నప్పుడు, వారు వెంటనే అంగీకరించి, పరిశుద్ధాత్మను పొంది, “యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము” తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 10:1-48) ఫిలిప్పీలో ఒక అన్యుడైన చెరసాల నాయకుడు, అతని కుటుంబము త్వరగా క్రైస్తవత్వాన్ని స్వీకరించినప్పుడు, “వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” (అపొస్తలుల కార్యములు 16:25-34) క్రైస్తవులు హింసించబడే, పేరుగాంచని చిన్న వర్గంగా ఉన్నారు గనుక అలాంటి చర్యలు తీసుకొనుటకు ధైర్యం అవసరమైయుండెను. వారిప్పటికీ అలాగే వున్నారు. కాని మీరింకా దేవునికి సమర్పించుకొని యెహోవాసాక్షులలో ఒకరిగా బాప్తిస్మం తీసుకొనకుంటే, ఆ ధైర్యవంతమైన చర్య గైకొనుటకిది తగిన సమయం కాదా?
విభాగించబడిన గృహాలలో ధైర్యం
11. యునీకే, తిమోతి ధైర్యాన్ని గూర్చిన ఏ మంచి మాదిరులనుంచారు?
11 మతపరంగా విభాగించబడిన ఒక గృహంలో ధైర్యంతో కూడిన నమ్మకానికి యునీకే, ఆమె కుమారుడు తిమోతి మంచి మాదిరులుగా ఉన్నారు. యునీకే భర్త అన్యుడైనప్పటికీ, ఆమె తన కుమారునికి బాల్యం నుండే “పరిశుద్ధ లేఖనాలను” బోధించింది. (2 తిమోతి 3:14-17) ఆమె క్రైస్తవురాలైన తరువాత, ‘నిష్కపటమైన విశ్వాసమును’ ప్రదర్శించింది. (2 తిమోతి 1:5) అవిశ్వాసియైన తన భర్త శిరసత్వాన్ని గౌరవిస్తూనే తిమోతికి క్రైస్తవ బోధలు నేర్పుటకు ఆమెకు తగిన ధైర్యం ఉండింది. నిశ్చయంగా, సరిగా బోధింపబడిన ఆమె కుమారుడు మిషనరీ ప్రయాణాల్లో పౌలుతో పాటు వెళ్లుటకు ఎన్నుకొనబడడం ద్వారా ఆమె విశ్వాస ధైర్యాలకు తగిన ప్రతిఫలం లభించింది. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న క్రైస్తవ తలిదండ్రులను ఇది ఎంతగా ప్రోత్సహించగలదు!
12. తిమోతి ఎటువంటి వ్యక్తి అయ్యాడు, ఈనాడు ఎవరు ఆయనలా నిరూపించుకుంటున్నారు?
12 తిమోతి మతపరంగా విభాగించబడిన గృహంలో ఉన్నప్పటికీ, ఆయన ధైర్యంగా క్రైస్తవత్వాన్ని అంగీకరించి ఆత్మీయవ్యక్తిగా రూపొందాడు. ఆయన గురించి పౌలు ఇలా చెప్పగల్గాడు: “నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు [ఫిలిప్పీయుల యొద్దకు] పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్దలేడు. . . . అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.” (ఫిలిప్పీయులు 2:19-22) ఈనాడు, మతపరంగా విభాగించబడివున్న కుటుంబాల్లోని అనేకమంది అమ్మాయిలు, అబ్బాయిలు ధైర్యంగా నిజ క్రైస్తవత్వాన్ని హత్తుకొన్నారు. వారు తమను తాము తిమోతివలె నిరూపించుకుంటున్నారు, వారు యెహోవా సంస్థలో భాగమైవున్నందుకు మనమెంత సంతోషిస్తాము!
‘మన ప్రాణములను ఇచ్చుటకు తెగించే’ ధైర్యం
13. అకుల, ప్రిస్కిల్ల ఏవిధంగా ధైర్యాన్ని ప్రదర్శించారు?
13 అకుల అతని భార్య ప్రిస్కిల్ల (ప్రిస్కా), తమతోటి విశ్వాసి కొరకు ధైర్యంగా తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించుట ద్వారా మంచి మాదిరినుంచారు. వారు పౌలును తమ ఇంటిలో వుంచుకొని, డేరాలు కుట్టడంలో అతనితోపాటు కలిసి పనిచేశారు, కొరింథులో క్రొత్త సంఘాన్ని అభివృద్ధి చేయుటకు ఆయనకు సహాయం చేశారు. (అపొస్తలుల కార్యములు 18:1-4) వాళ్ల 15 సంవత్సరాల స్నేహంలో, వెల్లడికాని విధంగా వారు ఆయన కొరకు తమ ప్రాణాలను కూడా అపాయంలో పడవేసుకున్నారు. రోము నందలి క్రైస్తవులకు ఆయనిలా చెప్పినప్పుడు వారక్కడ ఉన్నారు: “క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి . . . నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘము వారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.”—రోమీయులు 16:3, 4.
14. పౌలు కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించుట ద్వారా అకుల, ప్రిస్కిల్ల ఏ ఆజ్ఞకు అనుగుణంగా ప్రవర్తించారు?
14 పౌలు కొరకు తమ ప్రాణాలను ఇచ్చుటకు తెగించుట ద్వారా అకుల మరియు ప్రిస్కిల్ల యేసు చెప్పిన ఈ మాటల కనుగుణంగా ప్రవర్తించారు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” (యోహాను 13:34) ఒక వ్యక్తి తనను ప్రేమించుకొన్నట్లే తన పొరుగువానిని ప్రేమించాలని చెప్పిన మోషే ధర్మశాస్త్రాన్ని మించినది గనుక ఈ ఆజ్ఞ “క్రొత్తదే.” (లేవీయకాండము 19:18) యేసు చేసినట్లు, ఇతరుల కొరకు తమ ప్రాణములను సహితం ఇవ్వగల్గే స్వయంత్యాగ ప్రేమను అది కోరుతుంది. సా.శ. రెండు, మూడు శతాబ్దాలకు చెందిన రచయితయైన టెర్టూలియన్ క్రైస్తవులను గూర్చి లోకప్రజల మాటలను ఉదహరిస్తూ ఇలా వ్రాశాడు: “వారు ఇలా చెబుతారు, ‘వారు ఒకరినొకరు ఎలా ప్రేమించుకొంటున్నారో . . . ఒకరి కొరకు ఒకరు ప్రాణము పెట్టుటకు ఎలా సిద్ధపడుతున్నారో చూడండి’” (అపాలజీ, 39వ అధ్యాయం, 7) ముఖ్యంగా హింస వచ్చినప్పుడు, తోటి విశ్వాసులు శత్రువుల చేతిలో క్రూరత్వానికి, మరణానికి గురికాకుండా నిరోధించుటకు మన ప్రాణాలను ఇచ్చుటకు ధైర్యంగా తెగించుట ద్వారా మనం సహోదర ప్రేమను ప్రదర్శించవలసిన బాధ్యత కలిగివుండవచ్చు.—1 యోహాను 3:16.
ధైర్యం ఆనందాన్ని తెస్తుంది
15, 16. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చూపబడినట్లు, ధైర్యాన్ని, ఆనందాన్ని ఎలా జతచేయవచ్చును?
15 శ్రమలున్నప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించడం ఆనందాన్ని కలిగిస్తుందనుటకు పౌలు, సీల నిదర్శనాన్నిస్తున్నారు. ఫిలిప్పు నగర న్యాయాధిపతి ఆజ్ఞతో, వారు బహిరంగంగా బెత్తములతో కొట్టబడి, చెరసాలలో వేయబడిరి. అయినా, వారు విచారంగా భయంతో కృంగిపోలేదు. వారి కష్టభరితమైన పరిస్థితులలో కూడా, వారు దేవుడిచ్చిన ధైర్యం కలిగి, విశ్వాసులైన క్రైస్తవులకు అదిచ్చే ఆనందాన్ని పొందారు.
16 మధ్యరాత్రిలో పౌలు, సీల ప్రార్థిస్తూ, కీర్తనలు పాడుతూ దేవున్ని స్తుతిస్తుండిరి. హఠాత్తుగా, పెద్ద భూకంపం చెరసాలను కదిలించివేసి, బంధకములు విడదీసి, తలుపులు తెరుచుకొనేలా చేసింది. భయపడిన చెరసాల నాయకునికి, అతని కుటుంబానికి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగా, వారు యెహోవా సేవకులుగా బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన కూడా “దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.” (అపొస్తలుల కార్యములు 16:16-34) ఇది పౌలు, సీలకు ఎంత ఆనందాన్ని కలిగించి యుండవచ్చు. ధైర్యాన్ని గూర్చిన లేఖనాధారమైన ఈ మాదిరిని, ఇతర మాదిరులను పరిశీలించడం ద్వారా మనమెలా యెహోవా సేవకులుగా ధైర్యంగా వుండగలము?
మంచి ధైర్యవంతులుగా కొనసాగండి
17. కీర్తన 27 నందు చూపబడినట్లు, యెహోవా కొరకు కనిపెట్టడం ఎలా ధైర్యానికి సంబంధించి వుంది?
17 యెహోవా యందు విశ్వాసముంచడం మనం ధైర్యంగా ఉండుటకు సహాయం చేస్తుంది. దావీదు ఇలా ఆలపించాడు: “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.” (కీర్తన 27:14) దావీదు తన జీవితంలో “ప్రాణదుర్గము”గా యెహోవాపై ఆధారపడెనని 27వ కీర్తన చూపిస్తుంది. (1వ వచనము) గతంలో దేవుడు తన శత్రువులతో వ్యవహరించాడో చూచినందున దావీదుకు ధైర్యంవచ్చింది. (2, 3 వచనాలు) యెహోవా ఆరాధనా కేంద్రం యెడల మెప్పు మరో కారణం. (4వ వచనము) యెహోవా సహాయం, భద్రత మరియు విడుదల యందు విశ్వాసముంచడం కూడా దావీదు ధైర్యాన్ని పెంచింది. (5-10 వచనాలు) యెహోవా నీతి యుక్తమైన మార్గాన్ని గూర్చిన సూత్రాల నిరంతర ఉపదేశం కూడా సహాయం చేసింది. (11వ వచనము) తన శత్రువుల నుండి తప్పించుటకు నమ్మకంతో కూడిన ప్రార్థన, దానికి విశ్వాస నిరీక్షణలు జతచేయబడి, దావీదు ధైర్యంగా ఉండుటకు సహాయం చేసాయి. (12-14 వచనాలు) ఆ విధాలుగా మనం కూడా మన ధైర్యాన్ని పెంపొందించుకొని, నిజంగా మనం “యెహోవాకొరకు కనిపెట్టుకొని యున్నామని” చూపించవచ్చు.
18. (ఎ) ధైర్యంగా ఉండుటకు తోటి యెహోవా సేవకులతో క్రమ సహవాసం కలిగివుండడం సహాయం చేస్తుందని ఏది చూపిస్తుంది? (బి) ధైర్యాన్ని పెంపొందించుటలో క్రైస్తవ కూటాలు ఏ పాత్ర వహిస్తాయి?
18 తోటి యెహోవా ఆరాధికులతో క్రమంగా సహవసించడం మనం ధైర్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. పౌలు కైసరును అర్థించి, రోముకు ప్రయాణిస్తున్నప్పుడు, తోటి విశ్వాసులు అతన్ని అప్పీయా సంతపేట, త్రిసత్రముల వద్ద కలిసారు. వృత్తాంతం ఇలా వివరిస్తుంది: “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:15) మనం క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరైతే, మనం పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అంగీకరించిన వారమౌతాము: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) ఒకరి నొకరు పురికొల్పుకొనుట అంటే భావమేమిటి? పురికొల్పడమంటే “ధైర్యంతో, స్ఫూర్తితో, లేక నిరీక్షణతో ప్రేరేపించడం” అని అర్థం. (వెబ్స్‌టర్స్ నైన్త్ న్యూ కాలెజ్యేట్ డిక్షనరి) ఇతర క్రైస్తవులను ధైర్యంతో ప్రేరేపించుటకు మనమెంతో చేయవచ్చు, వారి పురికొల్పు కూడా అలాగే మనలో ఈ లక్షణాన్ని పెంపొందిస్తుంది.
19. లేఖనాలు, క్రైస్తవ ప్రచురణలు మనం ధైర్యంగా నిలిచి ఉండడంతో ఎలా ముడిపెట్టబడ్డాయి?
19 ధైర్యంగా వుండాలంటే, మనం దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించి, దాని ఉపదేశాన్ని మన జీవితాల్లో అన్వయించాలి. (ద్వితీయోపదేశకాండము 31:9-12; యెహోషువ 1:8) మన క్రమ పఠనమందు లేఖనాధార క్రైస్తవ ప్రచురణలను కూడా చేర్చాలి, ఎందుకంటే విశ్వాస పరీక్షలను దేవుడిచ్చే ధైర్యంతో ఎదుర్కొనుటకు వాటిలో ఇవ్వబడిన సరైన ఉపదేశం మనకు సహాయం చేస్తుంది. బైబిలు వృత్తాంతాల నుండి, యెహోవా సేవకులు వివిధ సందర్భాల్లో ఎలా ధైర్యంగా ఉన్నారో మనం చూశాము. ఆ సమాచారం మనకెలా సహాయం చేస్తుందో మనకిప్పుడే తెలియకపోవచ్చు, కాని దేవుని వాక్యానికి శక్తి ఉంది గనుక, దాన్నుండి మనం నేర్చుకునేది మనకెప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. (హెబ్రీయులు 4:12) ఉదాహరణకు, మనుష్యుల భయం మన పరిచర్యపై ప్రభావం చూపడం మొదలుపెడితే, దైవభక్తిలేని వారికి దేవుని సమాచారాన్ని ప్రకటించుటకు హనోకు ఎలా ధైర్యాన్ని కలిగివుండెనో మనం గుర్తుచేసుకోవచ్చు.—యూదా 14, 15.
20. యెహోవా సేవకులముగా మనం ధైర్యంగా కొనసాగాలంటే ప్రార్థన ప్రాముఖ్యమని ఎందుకు చెప్పవచ్చు?
20 యెహోవా సేవకులుగా మనం ధైర్యంగా ఉండాలంటే, ప్రార్థనయందు పట్టుదల కలిగివుండాలి. (రోమీయులు 12:12) “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను” గనుక, యేసు ధైర్యంగా తన శ్రమలను సహించాడు. (హెబ్రీయులు 5:7) ప్రార్థనలో దేవునికి సన్నిహితంగా వుండడం ద్వారా, పునరుత్ధానములేని “రెండవ మరణము” పొందుటకు నిర్దేశించబడిన లోకసంబంధమైన పిరికివారివలె మనముండము. (ప్రకటన 21:8) దైవిక భద్రత, దేవుని నూతన లోకంలో జీవము ధైర్యవంతులైన తన సేవకులకు లభిస్తాయి.
21. యథార్థవంతులైన యెహోవాసాక్షులు ఎందుకు ధైర్యంగా ఉండగలరు?
21 దేవుని మద్దతు, ప్రపంచ విజేతగా యేసు చూపిన ధైర్యవంతమైన మాదిరి మనకున్నాయి గనుక, యెహోవా యథార్థ సేవకులముగా మనం విరోధులైన దయ్యాలకు మరియు మానవులకు భయపడ నవసరంలేదు. అలాగే యెహోవా ప్రజలతో ఆత్మీయంగా ప్రోత్సాహకరమైన సహవాసం మనం ధైర్యంగా ఉండుటకు సహాయం చేస్తుంది. లేఖనాలు, క్రైస్తవ ప్రచురణల ఉపదేశం, నడిపింపు కూడా మన ధైర్యాన్ని పెంపొందిస్తాయి. ప్రాచీనకాల దేవుని సేవకుల బైబిలు వృత్తాంతాలు మనం ఆయన మార్గాలలో ధైర్యంగా నడుచుటకు సహాయం చేస్తాయి. అందుకే ఈ అపాయకరమైన అంత్యదినాలలో, పరిశుద్ధ సేవయందు మనం ధైర్యంగా ముందుకు వెళ్దాము. అవును, యెహోవా ప్రజలందరు మంచి ధైర్యవంతులైవుండాలి!
మీరెలా జవాబిస్తారు?
◻ యేసు మాదిరి మనల్ని ఎలా ధైర్యంతో నింపగలదు?
◻ ప్రకటిస్తూ వుండుటకు యేసుకు, ఆయన శిష్యులకు ఏది ధైర్యాన్నిచ్చింది?
◻ యెహోవా పక్షాన ఉండడానికి యూదులకు, అన్యులకు ధైర్యమెందుకు అవసరమైయుండెను?
◻ యునీకే, తిమోతి ధైర్యానికి సంబంధించిన ఏ మాదిరులనుంచారు?
◻ హింస ఉన్నప్పటికీ ధైర్యం ఆనందాన్ని తేగలదనుటకు ఏ నిదర్శనం ఉంది?
[18వ పేజీలోని చిత్రం]
మనం లేఖనాలను అన్వయించి, వాటిని ఉదహరిస్తే మనం యేసువలే, శోధనను ఎదుర్కొనగలము