కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/1 పేజీలు 9-14
  • దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయ్యాల బోధలు బయల్పర్చబడ్డాయి
  • ఈనాటి దయ్యాల బోధలు
  • దయ్యాల బోధలను గుర్తించుట
  • దైవిక బోధను హత్తుకొనియుండుట
  • యౌవనులారా—మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీ శత్రువు గురించి తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/1 పేజీలు 9-14

దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం

“కొందరు . . . ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురు.”—1 తిమోతి 4:1.

1. క్రైస్తవులు ఏ యుద్ధం మధ్యన ఉన్నారు?

మీరు మీ జీవితమంతా యుద్ధం జరిగే ప్రాంతంలోనే జీవించడాన్ని గురించి ఊహించండి. రాత్రివేళ తుపాకీ శబ్దాలు వినిపిస్తుంటే నిద్రపోయి, ఉదయాన్నే ఫిరంగి శబ్దాలు విని మేల్కొనడం ఎలా ఉంటుంది? విచారకరమైన విషయమేమంటే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అలాగే జీవిస్తున్నారు. ఆత్మీయభావంలో, క్రైస్తవులందరూ కూడా అలాగే జీవిస్తున్నారు. దాదాపు 6,000 సంవత్సరాలుగా కొనసాగుతూ మన దినాల్లో ఉధృతమైన ఒక గొప్ప యుద్ధం మధ్యన వారు జీవిస్తున్నారు. ఈ శతాబ్దాల పురాతన యుద్ధం ఏమిటి? సత్య అసత్యాల మధ్య, దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం. కనీసం అవతలి వైపువారి చర్యలకు సంబంధించియైనా—దాన్ని మానవజాతి చరిత్రలోకెల్లా అత్యంత కనికరంలేని, అత్యంత మరణకరమైన వివాదమని పిలవడం అతిశయోక్తి కాదు.

2. (ఎ) పౌలు చెప్పిన ప్రకారం, ఏ రెండు వర్గాలవారు ఒకరికి విరుద్ధంగా ఒకరున్నారు? (బి) “విశ్వాసం” అంటే పౌలు భావమేమిటి?

2 అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా వ్రాయడం ద్వారా ఈ వివాదం యొక్క యిరుప్రక్కలను గూర్చి తెలియజేశాడు: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1 తిమోతి 4:1) దయ్యాల బోధలు ప్రాముఖ్యంగా “కడవరి దినములలో” ప్రభావవంతంగా ఉంటాయన్న విషయాన్ని గమనించండి. పౌలు కాలంనాటి నుండి పరిశీలిస్తే, మనం అలాంటి కాలంలోనే జీవిస్తున్నాము. దయ్యాల బోధకు ఏది వ్యతిరేకంగా ఉందో కూడా పరిశీలించండి, అదే “విశ్వాసం.” ఇక్కడ, బైబిలులోగల దేవుని యొక్క దైవ ప్రేరేపిత ప్రకటనలపై ఆధారపడిన దైవిక బోధయే ఆ “విశ్వాసం.” అలాంటి విశ్వాసం జీవాన్నిస్తుంది. అది ఒక క్రైస్తవునికి దేవుని చిత్తాన్ని చేయటాన్ని బోధిస్తుంది. అది నిత్యజీవానికి నడిపే సత్యము.—యోహాను 3:16; 6:40.

3. (ఎ) సత్యానికి అబద్ధాలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు యుద్ధ క్షతగాత్రులకు ఏమి జరుగుతుంది? (బి) దయ్యాల బోధ వెనుకనున్న వారెవరు?

3 విశ్వాసం నుండి ఎవరైనా పడిపోతే వారు నిత్యజీవాన్ని పోగొట్టుకుంటారు. వారు యుద్ధంలో క్షతగాత్రులైనవారు. దయ్యాల బోధచే దారితప్పిపోవుటకు తమ్మును తాము అనుమతించినందుకు ఎంతటి దుఃఖకరమైన ఫలితం! (మత్తయి 24:24) అలా యుద్ధ క్షతగాత్రులం కాకుండా వ్యక్తిగతంగా మనం ఎలా తప్పించుకోవచ్చు? “దయ్యాల అధిపతి”యైన అపవాదియగు సాతాను చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే ఈ అబద్ధ బోధలను పూర్తిగా నిరాకరించడం ద్వారా మనం అలా చేయవచ్చు. (మత్తయి 12:24) ప్రవచనానుసారంగా, సాతాను “అబద్ధమునకు జనకుడు” గనుక సాతాను బోధలు అబద్ధాలు. (యోహాను 8:44) మన మొదటి తలిదండ్రులను తప్పుదారి పట్టించటానికి అతను ఎంత చాకచక్యంగా అబద్ధాలను ఉపయోగించాడో పరిశీలించండి.

దయ్యాల బోధలు బయల్పర్చబడ్డాయి

4, 5. సాతాను హవ్వకు ఏ అబద్ధం చెప్పాడు, అది ఎందుకంత చెడ్డది?

4 ఈ సంఘటనలు బైబిలులో ఆదికాండము 3:1-5 నందు వ్రాయబడి ఉన్నాయి. ఒక సర్పాన్ని ఉపయోగించి, సాతాను స్త్రీయైన హవ్వను సమీపించి ఇలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” ఆ ప్రశ్న హానికరమైనదిగా లేదు, కాని మరియొకసారి దాన్ని పరిశీలించండి. “ఇది నిజమా?” ‘దేవుడు ఎందుకలా చెప్పాడు?’ అనే భావం వినిపించేలా సాతాను ఆశ్చర్యపోయినట్లు అడిగాడు.

5 అమాయకత్వం వల్ల, హవ్వ విషయం అదే అని సూచించింది. ఈ విషయంలో, మంచి చెడుల తెలివినిచ్చు ఫలాన్ని తింటే చనిపోతారని దేవుడు ఆదాముతో చెప్పిన దైవిక బోధ ఆమెకు తెలుసు. (ఆదికాండము 2:16, 17) సాతాను ప్రశ్న స్పష్టంగా ఆమె ఆసక్తిని రేకెత్తించింది, కాబట్టి అతడు తన వాదనలోని ముఖ్య విషయానికి వస్తుండగా ఆమె విన్నది: ‘అందుకు సర్పము—మీరు చావనే చావరు, అని స్త్రీతో చెప్పెను.’ ఎంతటి దుష్ట ప్రేలాపన! సత్య దేవుడు, ప్రేమగల దేవుడు, సృష్టికర్తయైన యెహోవా తన మానవ పిల్లలతో అబద్ధమాడుతున్నాడని సాతాను నిందించాడు!—కీర్తన 31:5; 1 యోహాను 4:16; ప్రకటన 4:11.

6. సాతాను ఎలా యెహోవా మంచితనాన్ని, సర్వాధిపత్యాన్ని సవాలు చేశాడు?

6 కాని సాతాను అంతకంటే ఎక్కువే చెప్పాడు. అతడిలా కొనసాగించాడు: “ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” మన మొదటి తలిదండ్రులకు అంత పుష్కలంగా సమస్తము అనుగ్రహించిన యెహోవా దేవుడు, ఏదో అద్భుతమైనది వారికి లేకుండా చేస్తున్నాడని సాతాను చెప్పాడు. దేవతలవలె కాకుండా వారిని ఆపాలన్నది ఆయన ధ్యేయం అని చెప్పి సాతాను దేవుని మంచితనాన్ని సవాలు చేశాడు. అతడు స్వయం తృప్తిని, దేవుని ఆజ్ఞలను ఎరిగియుండి అలక్ష్యం చేయటాన్ని, అలా చేయడం లాభదాయకమని చెప్తూ ప్రోత్సహించాడు. నిజానికి, మానవుడు చేసిన దానిపై ఆంక్షలు పెట్టే హక్కు దేవునికి లేదని ఆరోపిస్తూ, దేవుని స్వంత సృష్టిపై ఆయన సర్వాధిపత్యాన్నే సాతాను సవాలు చేశాడు.

7. దయ్యాల బోధలు మొట్టమొదట విన్పించినదెప్పుడు, అవి ఈనాడు ఎలా అదేవిధంగా ఉన్నాయి?

7 సాతాను యొక్క ఆ మాటల ద్వారా, దయ్యాల బోధ వినిపించడం ప్రారంభమైంది. ఈ దుష్ట బోధలు ఇప్పటికీ అలాంటి దైవ విరుద్ధ సూత్రాలనే ప్రోత్సహిస్తున్నాయి. ఏదెను తోటలో చేసినట్లే సాతాను, ఇప్పటికీ తిరుగుబాటు చేసిన ఇతర ఆత్మీయ ప్రాణులతో చేరి, అనుసరించదగు కట్టడలను విధించడానికి దేవునికున్న హక్కును సవాలు చేస్తున్నాడు. అతడు ఇప్పటికీ యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలు చేస్తూ, మానవులు తమ పరలోక తండ్రికి అవిధేయులయ్యేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.—1 యోహాను 3:8, 10.

8. ఏదెనులో ఆదాము హవ్వలు ఏమి పోగొట్టుకున్నారు, కాని యెహోవా ఎలా నిజమని నిరూపించబడ్డాడు?

8 దైవిక బోధకు, దయ్యాల బోధకు మధ్య జరిగిన ఆ మొదటి పోరాటంలో, ఆదాము హవ్వ తప్పుడు నిర్ణయం చేసి, తమ నిత్యజీవ నిరీక్షణను పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:19) సమయం గడిచి వారి శరీరాలు కృశించి పోవడం మొదలయ్యాక అప్పుడు వారికి, పూర్వం ఏదెను తోటలో ఎవరు అబద్ధం చెప్పారో ఎవరు సత్యం చెప్పారో స్పష్టంగా తెలిసింది. అయినా, వారు శారీరకంగా చనిపోవడానికి వందల సంవత్సరాల క్రితమే, జీవానికి మూలమైన వారి సృష్టికర్త వారిని జీవించుటకు అనర్హులని తీర్పుతీర్చినప్పుడే సత్యానికి, అసత్యానికి మధ్య జరిగిన యుద్ధంలో వారు మొదటి క్షతగాత్రులయ్యారు. వారు ఆత్మీయ భావంలో మరణించినప్పుడు అది జరిగింది.—కీర్తన 36:9; ఎఫెసీయులు 2:1ని పోల్చండి.

ఈనాటి దయ్యాల బోధలు

9. శతాబ్దాలుగా దయ్యాల బోధలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?

9 ప్రకటన గ్రంథంలో వ్రాయబడివున్నట్లుగా, అపొస్తలుడైన యోహాను 1914లో ప్రారంభమైన “ప్రభువు దినము”లోకి ఆత్మచే కొనిపోబడ్డాడు. (ప్రకటన 1:10) ఆ సమయంలో సాతాను, అతని దయ్యాలు పరలోకం నుండి భూమిపైకి పడద్రోయబడ్డారు, మన గొప్ప సృష్టికర్తకు వ్యతిరేకియైన వీనికి అది పెద్ద పరాజయము. యెహోవా సేవకులకు వ్యతిరేకంగా అనునిత్యం నేరారోపణ చేస్తూ ఉండే అతని స్వరం ఇక పరలోకంలో వినిపించదు. (ప్రకటన 12:10) అయితే ఏదెను సంఘటనా కాలం నుండి భూమిపై దయ్యాల బోధలు ఎట్టి అభివృద్ధిని సాధించాయి? వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను.” (ప్రకటన 12:9) ప్రపంచమంతా సాతాను అబద్ధాలకు లొంగిపోయింది! కాబట్టి, సాతాను “ఈ లోకాధికారి” అని పిలువబడటంలో ఆశ్చర్యం లేదు!—యోహాను 12:31; 16:11.

10, 11. ఈనాడు సాతాను, అతని దయ్యాలు ఏ విధాలుగా చురుకుగా ఉన్నారు?

10 పరలోకం నుండి పడద్రోయబడిన తరువాత సాతాను తన అపజయాన్ని అంగీకరించాడా? ఎంతమాత్రం అంగీకరించలేదు! దైవిక బోధకు, దాన్ని హత్తుకొనియుండే వారికి వ్యతిరేకంగా పోరాడటానికే అతడు నిశ్చయించుకున్నాడు. పరలోకం నుండి పడద్రోయబడిన తరువాత కూడా సాతాను తన పోరాటాన్ని కొనసాగించాడు: “ఆ ఘటసర్పము [సాతాను] ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్లెను.”—ప్రకటన 12:17.

11 దేవుని సేవకులతో పోరాడటమే కాకుండా, సాతాను మానవజాతిని తన చేతిలో ఉంచుకోవాలని పోరాడుతూ ప్రపంచాన్నంతా తన ప్రచారంతో ముంచెత్తుతున్నాడు. ప్రభువు దినాన్ని గూర్చిన తన ప్రకటన దర్శనాల్లో ఒకదానిలో, అపొస్తలుడైన యోహాను మూడు క్రూర మృగాలను చూశాడు, అవి సూచనార్థకంగా సాతాను, అతని భూరాజకీయ సంస్థ, మన కాలంలోని ప్రపంచ ఆధిపత్యాన్ని సూచించాయి. ఈ మూడింటి నోళ్లలో నుండి, కప్పలు బయటికి వచ్చాయి. ఇవి దేన్ని సూచిస్తున్నాయి? యోహాను ఇలా వ్రాస్తున్నాడు: “అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లును.” (ప్రకటన 16:14) స్పష్టంగా, దయ్యాల బోధలు భూమిపై చురుకుగా ఉన్నాయి. సాతాను అతని దయ్యాలు ఇప్పటికీ దైవిక బోధకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, మెస్సీయ రాజైన యేసుక్రీస్తు వారిని బలవంతంగా ఆపే వరకు వాళ్లు అలాగే కొనసాగిస్తారు.—ప్రకటన 20:2.

దయ్యాల బోధలను గుర్తించుట

12. (ఎ) దయ్యాల బోధను ఎదిరించడం ఎందుకు సాధ్యము? (బి) దేవుని సేవకులతో తన పని సాధించుకోవడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు?

12 దైవ భయముగల మానవులు దయ్యాల బోధలను ఎదుర్కొనగలరా? వాస్తవానికి, రెండు కారణాలను బట్టి వారలా ఎదుర్కొనగలరు. మొదటిది, దైవిక బోధ ఎక్కువ శక్తివంతమైంది గనుక; రెండవది, వాటిని మనం ఎదుర్కొనగల్గేలా యెహోవా సాతాను వ్యూహాలను బహిర్గతం చేశాడు గనుక. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము.” (2 కొరింథీయులు 2:11) తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి సాతాను హింసను ఒక మార్గంగా ఉపయోగిస్తాడని మనకు తెలుసు. (2 తిమోతి 3:12) అంతకంటే కుటిలంగా, దేవున్ని సేవించే వారి మనస్సులను, హృదయాలను ప్రభావితం చేయటానికి అతడు ప్రయత్నిస్తాడు. అతడు హవ్వను తప్పుదారి పట్టించి, ఆమె హృదయంలో తప్పుడు కోరికలను నింపాడు. ఈనాడు కూడా అతడు అదే ప్రయత్నం చేస్తాడు. పౌలు కొరింథీయులకు ఇలా వ్రాశాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.” (2 కొరింథీయులు 11:3) సామాన్యంగా మానవజాతి ఆలోచనా విధానాన్ని అతడు ఎలా కలుషితం చేశాడో పరిశీలించండి.

13. ఏదెనుకాలంనాటి నుండి సాతాను మానవజాతికి ఏ అబద్ధాలు చెబుతూ వచ్చాడు?

13 యెహోవా అబద్ధం చెప్పాడని నిందిస్తూ, వారు తమ సృష్టికర్తకు అవిధేయత చూపిస్తే వారు దేవతలవలె ఉంటారని సాతాను హవ్వకు చెప్పాడు. మానవజాతి యొక్క నేటి పడిపోయిన పరిస్థితి, అబద్ధం చెప్పింది యెహోవా కాదు గాని సాతానని నిరూపిస్తుంది. మానవులు ఈనాడు దేవతలు కాదు! అయినా, సాతాను ఆ మొదటి అబద్ధం తరువాత అలాగే యితర అబద్ధాలు కొనసాగించాడు. అతడు మానవ ఆత్మ అమర్త్యమైనది, మరణం లేనిది అనే ఆలోచనను ప్రవేశపెట్టాడు. మరో విధంగా దేవతలు కాగలరను ఆశను అతడు మానవ జాతి యెదుట పెట్టాడు. తరువాత, ఆ అబద్ధ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని, అతడు నరకాగ్ని, పాపవిమోచన లోకం, అభిచారం, పూర్వీకుల ఆరాధన వంటి బోధలను పెంపొందించాడు. కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ ఈ అబద్ధాలకు బానిసలై ఉన్నారు.—ద్వితీయోపదేశకాండము 18:9-13.

14, 15. మరణం గూర్చి, మనిషి భవిష్యత్‌ నిరీక్షణ గూర్చి సత్యమేమిటి?

14 యెహోవా దేవుడు ఆదాముకు చెప్పింది నిజమే. ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అతడు మరణించాడు. (ఆదికాండము 5:5) ఆదాము, అతని తరువాతి వారు చనిపోయినప్పుడు, వారు చనిపోయిన ఆత్మలయ్యారు, అంటే స్పృహ లేకుండా, చలనం లేకుండా అయ్యారు. (ఆదికాండము 2:7; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందినందుకు మానవ ఆత్మలన్నీ మరణిస్తున్నాయి. (రోమీయులు 5:12) అయితే, పూర్వం ఏదెనులో, అపవాది కార్యాలను ఎదుర్కొనే సంతానం వస్తుందని యెహోవా వాగ్దానం చేశాడు. (ఆదికాండము 3:15) ఆ సంతానం దేవుని స్వంత, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు. యేసు పాపం లేకుండా మరణించాడు, మరణిస్తున్న స్థితినుండి మానవజాతిని కొనడానికి, బలి అర్పింపబడిన ఆయన జీవం విమోచన క్రయధనంగా పనిచేసింది. ఎవరైతే యేసు నందు విధేయతతో కూడిన విశ్వాసం ఉంచుతారో వారు, ఆదాము కోల్పోయిన నిత్యజీవాన్ని పొందే అవకాశాన్ని కలిగివుంటారు.—యోహాను 3:36; రోమీయులు 6:23; 1 తిమోతి 2:5, 6.

15 ఆత్మ మరణించదనే ఏదో అస్పష్టమైన ఆలోచన కాదు గాని, విమోచన క్రయధనమే మానవజాతి యొక్క నిజమైన నిరీక్షణ. ఇది దైవిక బోధ, ఇది సత్యము. ఇది యెహోవా యొక్క ప్రేమ, జ్ఞానముల అద్భుతమైన ప్రదర్శన కూడా. (యోహాను 3:16) ఈ సత్యాన్ని నేర్చుకుని, ఈ విషయాల్లో దయ్యాల బోధనుండి విడుదల చేయబడినందుకు మనమెంత కృతజ్ఞత కలిగివుండాలి!—యోహాను 8:32.

16. మానవులు తమ స్వంత జ్ఞానాన్ని అనుసరించినప్పుడు ఏ దీర్ఘకాల ఫలితాలు వచ్చాయి?

16 ఏదెను తోటలో సాతాను తన అబద్ధాల ద్వారా, ఆదాము హవ్వలను దేవుని నుండి స్వతంత్రంగా ఉండగోరి, తమ స్వంత జ్ఞానంపై ఆధారపడమని ప్రోత్సహించాడు. ఈనాడు, మనం దాని యొక్క దీర్ఘకాల ఫలితాలను అనగా నేరము, ఆర్థిక శ్రమలు, యుద్ధాలు, నేడు ప్రపంచంలో ఉన్న అత్యధిక అసమానతలలో చూడవచ్చు. బైబిలు ఇలా చెప్పడంలో ఆశ్చర్యంలేదు: “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే”! (1 కొరింథీయులు 3:19) అయినా, అనేకమంది మానవులు యెహోవా బోధలను వినుటకు బదులు మూర్ఖంగా బాధపడటానికే ఇష్టపడుతున్నారు. (కీర్తన 14:1-3; 107:17) దైవిక బోధను అంగీకరించిన క్రైస్తవులు అలాంటి ఉరిలో చిక్కుకొనరు.

17. “జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన” దేనిని సాతాను పెంపొందించాడు, దాని ఫలాలు ఏవి?

17 పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “ఓ తిమోతీ, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి.” (1 తిమోతి 6:20, 21) ఆ “జ్ఞానము” కూడా దయ్యాల బోధను సూచిస్తుంది. పౌలు దినాల్లో, అది, సంఘంలో కొంతమంది పెంపొందిస్తున్న మతభ్రష్ట ఆలోచనలను ఉద్దేశించి అయివుండవచ్చు. (2 తిమోతి 2:16-18) తరువాత, జ్ఞానమని అబద్ధంగా పిలువబడిన జ్ఞానార్జనావాదం, గ్రీకు తత్వం సంఘాన్ని కలుషితం చేశాయి. ఆ తర్వాత, ఈనాడు లోకంలో నాస్తికత్వం, అజ్ఞాతవాదం, పరిణామ సిద్ధాంతాలు, బైబిలు విమర్శ వంటివన్నీ, ఆధునిక మతభ్రష్టులచే పెంపొందింపబడుతున్న లేఖనరహిత ఉద్దేశాల వంటివైయుండి, అబద్ధంగా జ్ఞానమని పిలువబడుతున్న దానికి ఉదాహరణలు. సాతాను విధానాన్ని సూచించే దిగజారిపోతున్న నైతికత, అధికారం యెడల ఉన్న విస్తృత అగౌరవం, అపనమ్మకం, స్వార్థం వంటివాటిలో అబద్ధంగా జ్ఞానమని పిలువబడుతున్న దాని ఫలాలను చూడవచ్చు.

దైవిక బోధను హత్తుకొనియుండుట

18. ఈనాడు ఎవరు దైవిక బోధను వెదకుచున్నారు?

18 ఏదెను కాలం నాటి నుండి సాతాను భూమిని దయ్యాల బోధతో నింపుతున్నప్పటికీ, దైవిక బోధ కొరకు వెదుకుతున్న వారు కొంతమంది ఎప్పుడూ ఉన్నారు. అలాంటి వారు నేడు లక్షల సంఖ్యలో ఉన్నారు. యేసుతోపాటు పరలోక రాజ్యమందు పరిపాలన చేసే కచ్చితమైన నిరీక్షణ గల అభిషక్త క్రైస్తవులలోని శేషించిన వారు, ఆ రాజ్యము యొక్క భూప్రాంతాన్ని స్వతంత్రించుకొనే నిరీక్షణ గల పెరిగిపోతున్న గొప్ప సమూహపు వారైన “వేరే గొర్రెలు” వారిలో చేరివున్నారు. (మత్తయి 25:34; యోహాను 10:16; ప్రకటన 7:3, 9) “నీ పిల్లలందరు యెహోవా చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును,” అనే యెషయా మాటలు అన్వయింపబడే ఒకే ప్రపంచ వ్యాప్త సంస్థలోనికి వీరు నేడు పోగుచేయబడుతున్నారు.—యెషయా 54:13.

19. యెహోవాచే ఉపదేశింపబడటంలో ఏమి ఇమిడివుంది?

19 సిద్ధాంతాలు నేర్చుకోవడం ప్రాముఖ్యమైననూ, యెహోవాచేత ఉపదేశింపబడటం అంటే అలా సిద్ధాంతాలు నేర్చుకొనుట కంటే ఎంతో ఎక్కువే ఉంది. ఎలా జీవించాలో, దైవిక బోధను మన వ్యక్తిగత జీవితాలకు ఎలా అన్వయింప జేసుకోవాలో యెహోవా మనకు బోధిస్తాడు. ఉదాహరణకు, మనం మన చుట్టూ ప్రపంచంలో అధికంగా ఉన్న స్వార్థం, అవినీతి, స్వతంత్రతా భావం వంటివాటిని ఎదుర్కొంటాము. ఈ లోకంలో నిర్దాక్షిణ్యంగా ధనాన్ని వెంబడించడం మరణకరమని మనం గుర్తిస్తాం. (యాకోబు 5:1-3) అపొస్తలుడైన యోహాను మాటల్లో వ్యక్తపర్చబడిన దైవిక బోధను మనమెన్నడూ మరచిపోము: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.”—1 యోహాను 2:15.

20, 21. (ఎ) మానవులను గ్రుడ్డివారిని చేసే తన ప్రయత్నంలో సాతాను ఏమి ఉపయోగిస్తాడు? (బి) దైవిక బోధను హత్తుకొని యుండేవారికి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

20 దయ్యాల బోధ దాని బాధితులపై కలుగజేసే ప్రభావాన్ని, పౌలు కొరింథీయులకు వ్రాసిన మాటలలో చూడవచ్చు: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, [సాతాను] అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:4) ఈ విధంగా కూడా నిజ క్రైస్తవులకు గ్రుడ్డితనము కలుగజేయడం సాతాను కిష్టం. పూర్వం ఏదెనులో, దేవుని సేవకులలో ఒకరిని తప్పుదోవ పట్టించడానికి అతడు సర్పాన్ని ఉపయోగించాడు. నేడు, అతడు దౌర్జన్యపూరితమైన లేక అవినీతికరమైన చిత్రాలను, టివి కార్యక్రమాలను ఉపయోగిస్తున్నాడు. అతడు రేడియో, సాహిత్యం, సంగీతాలను కూడా స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. అతని చేతిలోవున్న శక్తివంతమైన ఆయుధం చెడు సాంగత్యము. (సామెతలు 4:14; 28:7; 29:3) అలాంటివన్నీ దయ్యాల బోధలని, పరికరాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

21 ఏదెనులో సాతాను పలికిన మాటలు అబద్ధాలైయుండెనని గుర్తుంచుకోండి; యెహోవా మాటలు నిజమని నిరూపించబడ్డాయి. ఆ తొలి దినాల నుండి, అదే పరిస్థితి కొనసాగుతున్నది. సాతాను ఎప్పుడూ అబద్ధికునిగానే నిరూపించబడ్డాడు, దైవిక బోధ అమోఘంగా నిజమైంది. (రోమీయులు 3:4) మనం దేవుని వాక్యానికి హత్తుకొని ఉంటే, సత్యానికి అసత్యానికి మధ్య జరిగే యుద్ధంలో మనం ఎప్పుడూ గెలిచేవైపే ఉండగలం. (2 కొరింథీయులు 10:4, 5) కాబట్టి మనం అన్ని విధములైన దయ్యాల బోధలను నిరాకరించడానికి తీర్మానించుకుందాము. ఆ విధంగా మనం సత్యానికి అబద్ధానికి మధ్య జరిగే యుద్ధం అయిపోయే సమయం వరకు సహనం కలిగి వుండగలము. సత్యం విజయాన్ని సాధిస్తుంది. సాతాను లేకుండా పోతాడు, కేవలం దైవిక బోధ మాత్రమే భూమిపై వినిపిస్తుంది.—యెషయా 11:9.

మీరు వివరించగలరా?

◻ మొదట దయ్యాల బోధలు ఎప్పుడు వినిపించాయి?

◻ సాతాను అతని దయ్యాలచే పెంపొందింపబడిన కొన్ని అబద్ధాలు ఏమిటి?

◻ ఈనాడు సాతాను ఏ యే విధాలుగా మరీ చురుకుగా ఉన్నాడు?

◻ దయ్యాల బోధలను పెంపొందింపజేయటానికి సాతాను ఏమి ఉపయోగిస్తాడు?

◻ దైవిక బోధను హత్తుకొని యుండే వారు ఏ ఆశీర్వాదాలను పొందుతారు?

[9వ పేజీలోని చిత్రం]

దయ్యాల బోధ మొదట ఏదెను తోటలో వినబడింది

[10వ పేజీలోని చిత్రం]

విమోచన క్రయధనం మరియు రాజ్యాన్ని గూర్చిన దైవిక బోధ మాత్రమే మానవజాతికి ఏకైక నిరీక్షణనిస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి