కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/1 పేజీలు 14-19
  • మీరు లౌకికాత్మను ఎదిరిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు లౌకికాత్మను ఎదిరిస్తున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ లౌకికాత్మను విసర్జించుట
  • “లౌకికాత్మ” యొక్క స్పష్టమైన సంగతులు
  • ఈ లౌకికాత్మను ఎలా ఎదుర్కోవాలి
  • ‘లౌకికాత్మను’ ఎదిరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • లౌకికాత్మను కాక దేవుని ఆత్మను పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • యౌవనస్థులారా—లోకాత్మను ఎదిరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/1 పేజీలు 14-19

మీరు లౌకికాత్మను ఎదిరిస్తున్నారా?

“మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”—1 కొరింథీయులు 2:12.

1, 2. భోపాల్‌, ఇండియాలో విషపూరిత వాయువుకు సంబంధించి ఏ దుర్ఘటన సంభవించింది, కాని అంతకంటే మరణకరమైన ఏ “వాయువు” ప్రపంచమంతటా పీల్చుకొనబడుతున్నది?

ఒక చల్లని డిశంబరు రాత్రి 1984లో, ఇండియా నందలి భోపాల్‌లో ఎంతో భయంకరమైన సంఘటన జరిగింది. ఆ పట్టణంలో ఒక రసాయనిక కర్మాగారం ఉంది, ఆ డిశంబరు రాత్రి, గ్యాసు నిలువ చేసే టాంకుల మూత ఒకటి సరిగా పనిచేయలేదు. హఠాత్తుగా, టన్నుల కొద్ది మెథిల్‌ ఐసోసైనైట్‌ వాయువు గాలిలో కలవడం మొదలైంది. ఇళ్లలోనికి, నిద్రిస్తున్న కుటుంబాల మీదికి ఈ మరణకరమైన వాయువు గాలిలో సుళ్లు తిరుగుతూ వచ్చింది. వేలాదిమంది చనిపోయారు, మరెంతోమంది అంగవికలులయ్యారు. అంతవరకు జరిగిన వాటిలో అదే చాలా ఘోరమైన పారిశ్రామిక దుర్ఘటన.

2 భోపాల్‌ గురించి విన్నప్పుడు ప్రజలు దుఃఖించారు. ఆ వాయువు అంత మరణకరమైనదైనప్పటికీ, ప్రపంచమంతటానున్న ప్రజలు ప్రతిరోజు పీల్చుకొనే “వాయువు” ద్వారా ఆత్మీయంగా చనిపోయేవారి కంటే అది తక్కువమందినే చంపింది. దాన్ని బైబిలు “లౌకికాత్మ” అని పిలుస్తున్నది. అది అపొస్తలుడైన పౌలు దేవుని నుండి వచ్చే ఆత్మకు విరుద్ధమైనదని చెప్పిన మరణకరమైన వాతావరణం, ఆయనిలా చెప్పాడు: “దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”—1 కొరింథీయులు 2:12.

3. “లౌకికాత్మ” అంటే ఏమిటి?

3 కచ్చితంగా “లౌకికాత్మ” అంటే ఏమిటి? ది న్యూ థేయర్స్‌ గ్రీక్‌ ఇంగ్లీష్‌ లెక్సికాన్‌ ఆఫ్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌ ప్రకారం, “ఆత్మ” (గ్రీకు, న్యూమా) అనే పదం యొక్క సామాన్య భావం ఏమిటంటే, “ఏ ప్రాణిలోనైనా నింపబడి, నడిపించే ప్రభావం లేక స్వభావం.” ఒక వ్యక్తి మంచి లేక చెడు ఆత్మను గాని, లేక స్వభావాన్ని గాని కలిగివుండవచ్చు. (కీర్తన 51:10; 2 తిమోతి 4:22) ఒక గుంపు ప్రజలు కూడా ఒక ఆత్మను, లేక ఒక విధమైన ప్రబల స్వభావాన్ని కలిగివుండవచ్చు. అపొస్తలుడైన పౌలు తన స్నేహితుడైన ఫిలేమోనుకు ఇలా వ్రాశాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక.” (ఫిలేమోను 25) అలాగే—కానీ చాలా భారీ ఎత్తున—సాధారణంగా ప్రపంచమంతటిపై ఒక ప్రధానమైన స్వభావం ఉంది, దాన్ని పౌలు “లౌకికాత్మ” అని సూచించాడు. విన్సెంట్‌ యొక్క వర్డ్‌ స్టడీస్‌ ఇన్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌ ప్రకారం, “పునరుద్ధరించలేని ప్రపంచాన్ని ప్రభావితం చేసే దుష్ట సూత్రమని ఈ పదానికి భావము.” అది ఈ ప్రపంచ ఆలోచనా విధానంలో వ్యాపించివుండి, ప్రజలు ప్రవర్తించే విధానాన్ని శక్తివంతంగా ప్రభావితం చేసే పాపయుక్తమైన ప్రవృత్తి.

4. లౌకికాత్మకు మూలం ఎవరు, ఈ ఆత్మ మానవులపై ఏ ప్రభావాన్ని కలిగివుంది?

4 ఈ ఆత్మ విషపూరితమైంది. ఎందుకు? ఎందుకంటె, అది “ఈ లోకాధికారి” అయిన సాతాను నుండి వస్తుంది గనుక. వాస్తవానికి, అతడు “వాయు మండల సంబంధమైన అధిపతి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి” అని పిలువబడ్డాడు. (యోహాను 12:31; ఎఫెసీయులు 2:2) ఈ “వాయువును” లేక “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని” తప్పించుకోవడం కష్టం. అది మానవ సమాజమంతటా ఉంది. దాన్ని మనం పీల్చుకుంటే, మనం దాని ఉద్దేశాలను, గమ్యాలను అన్వయించుకోవడం మొదలుపెడతాము. ‘శరీరానుసారంగా జీవించుటను’ అనగా మన పాపయుక్తమైన అపరిపూర్ణతకు అనుగుణ్యంగా జీవించుటను లౌకికాత్మ ప్రోత్సహిస్తుంది. అది మరణకరమైనది ఎందుకంటే, “మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు.”—రోమీయులు 8:13.

ఈ లౌకికాత్మను విసర్జించుట

5. భోపాల్‌ దుర్ఘటన జరిగినప్పుడు ఒక సాక్షి జ్ఞానయుక్తంగా ఎలా ప్రవర్తించాడు?

5 భోపాల్‌లో దుర్ఘటన సంభవించినప్పుడు, ఒక యెహోవాసాక్షి సైరన్‌ శబ్దానికి, విషవాయువు యొక్క చేదైన వాసనకు మేల్కొన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అతడు తన కుటుంబాన్ని లేపి వారిని వీధిలోకి తీసుకుని వచ్చాడు. గాలివాటును గమనించడానికి ఒక క్షణం ఆగి, గందరగోళంగావున్న జనాలను ప్రయాసపడి దాటి, అతడు తన కుటుంబాన్ని నగరం వెలుపల ఉన్న ఒక కొండమీదికి తీసుకుని వెళ్లాడు. అక్కడ వారు సమీపంలోని చెరువు నుండి వస్తున్న తాజా, పరిశుభ్రమైన గాలిని పీల్చుకో గల్గారు.

6. లౌకికాత్మను తప్పించుకొనుటకు మనం ఎక్కడికి వెళ్లవచ్చు?

6 ఈ లోక విషపూరిత “వాయువు” నుండి తప్పించుకొని ఆశ్రయం కొరకు మనం వెళ్లగల ఉన్నతమైన స్థలం ఏదైనా ఉందా? ఉందని బైబిలు చెబుతుంది. మన దినాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాశాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” (యెషయా 2:2 3) ఈ గ్రహంపై, ఈ లోకమందలి ఉక్కిరిబిక్కిరి చేసే విషపూరిత ఆత్మ లేని ప్రదేశం కేవలం స్వచ్ఛారాధన యొక్క ఉన్నత స్థలము, పైకెత్తబడిన “యెహోవా మందిర పర్వతము” మాత్రమే. అక్కడ విశ్వాసులైన క్రైస్తవుల మధ్య యెహోవా ఆత్మ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.

7. లౌకికాత్మ నుండి అనేకులు ఎలా రక్షించబడ్డారు?

7 భోపాల్‌లోని సాక్షి పొందినటువంటి ఉపశమనాన్నే మునుపు ఈ లౌకికాత్మను పీల్చుకున్నవారు పొందారు. ఈ లోక వాయువును లేక ఆత్మను పీల్చుకునే “అవిధేయులైన వారిని” గురించి మాట్లాడిన తరువాత, అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, . . . తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.” (ఎఫెసీయులు 2:3-5) ఈ విధానపు విషపూరిత వాయువును మాత్రమే పీల్చుకొనేవారు ఆత్మీయ భావంలో మృతులు. అయినా, కోట్లాదిమంది నేడు ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకొని, ఆత్మీయ ఉన్నత స్థలానికి వస్తున్నందుకు యెహోవాకు కృతజ్ఞతలు.

“లౌకికాత్మ” యొక్క స్పష్టమైన సంగతులు

8, 9. (ఎ) లౌకికాత్మకు వ్యతిరేకంగా మనం నిరంతర జాగరూకత కలిగివుండాలని ఏది చూపిస్తుంది? (బి) సాతాను ఆత్మ మనల్ని ఎలా కలుషితం చేయగలదు?

8 సాతాను యొక్క మరణకరమైన వాయువు ఇంకా మన చుట్టూ సుళ్లు తిరుగుతూనే ఉంది. ఒకవేళ ఆత్మీయంగా ఉక్కిరిబిక్కిరి అయిపోయేలా మనం మళ్లీ ఎన్నడు తిరిగి ప్రపంచంలోకి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. దీనికి నిరంతర జాగరూకత అవసరము. (లూకా 21:36; 1 కొరింథీయులు 16:13) ఉదాహరణకు, ఈ వాస్తవాన్ని పరిశీలించండి. నైతికతకు సంబంధించిన యెహోవా కట్టడలు క్రైస్తవులందరికీ బాగా తెలుసు, వారు లైంగిక దుర్నీతి, వ్యభిచారము, సలింగ సంయోగము వంటి అపవిత్రమైన అలవాట్లు అంగీకరింపదగినవని ఎన్నటికీ ఒప్పుకోరు. అయినప్పటికీ, ప్రతీ సంవత్సరం దాదాపు 40,000 మంది వ్యక్తులు యెహోవా సంస్థ నుండి బహిష్కరింప బడుతున్నారు. ఎందుకు? అనేక సందర్భాలలో ఈ అపవిత్రమైన అలవాట్ల వల్లనే అలా జరుగుతున్నది. అదెలా సంభవించగలదు?

9 మనమందరం అపరిపూర్ణులం గనుక. శరీరము బలహీనమైనది, మన హృదయాల్లో కలిగే చెడు కోరికలకు వ్యతిరేకంగా మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. (ప్రసంగి 7:20; యిర్మీయా 17:9) అయినా, ఈ చెడు కోరికలు లౌకికాత్మచే పురికొల్పబడతాయి. ఈ ప్రపంచంలోని అనేకులు అవినీతిలో తప్పేమీ కనుగొనరు, ఏదైనా చెల్లుతుంది అనే మానసిక భావన సాతాను విధానంలో భాగము. మనం అలాంటి ఆలోచనా విధానాన్ని అంగీకరిస్తే, మనం కూడా లోకంవలెనే ఆలోచించే బలమైన అవకాశం ఉంది. త్వరలోనే, అలాంటి అపవిత్రమైన తలంపులు ఘోరమైన పాపానికి నడిపే చెడు కోరికలను పెంపొందించవచ్చు. (యాకోబు 1:14, 15) మనం యెహోవా యొక్క స్వచ్ఛారాధన పర్వతం నుండి దారితప్పి సాతాను లోకపు కలుషితమైన దిగువ ప్రాంతాలలోకి వచ్చేసిన వారిగా ఉంటాము. ఇష్టపూర్వకంగా అక్కడే ఉండే వారెవ్వరూ నిత్యజీవాన్ని పొందలేరు.—ఎఫెసీయులు 5:3-5, 7.

10. సాతాను గాలి యొక్క ఒక స్పష్టమైన సంగతి ఏది, క్రైస్తవులు ఎందుకు దాన్ని విసర్జించాలి?

10 లౌకికాత్మ మన చుట్టూ ఉందన్నది సుస్పష్టము. ఉదాహరణకు, అనేకులు మర్యాదలేని, వ్యంగ్య దృక్పథంతో జీవితాన్ని గడుపుతున్నారు. అవినీతికరమైన లేక అనుచితమైన రాజకీయ నాయకులచే, దుర్నీతిపరులు, అత్యాశాపరులు అయిన మతనాయకులచే భ్రమ తొలగింపబడి, గంభీరమైన విషయాల గురించి కూడా వారు అగౌరవంగా మాట్లాడతారు. క్రైస్తవులు ఈ దృక్పధాన్ని ఎదిరిస్తారు. మనం ఆరోగ్యకరమైన హాస్యాన్ని కలిగివున్నప్పటికీ, సంఘంలోకి అగౌరవకరమైన వ్యంగ్య ఆత్మను తీసుకురాము. ఒక క్రైస్తవుని మాటల్లో యెహోవా భయము, హృదయ స్వచ్ఛత కనిపిస్తాయి. (యాకోబు 3:10, 11; సామెతలు 6:14ను పోల్చండి.) మనం పెద్దవారమైనా, చిన్నవారమైనా, మన సంభాషణ ‘ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మనం తెలిసికొనుటకై మన సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండవలెను.’—కొలొస్సయులు 4:6.

11. (ఎ) లౌకికాత్మ యొక్క రెండవ గుణం ఏది? (బి) ఈ గుణాన్ని ప్రతిబింబించే వారినుండి క్రైస్తవులు ఎందుకు వేరుగా ఉన్నారు?

11 ఈ లౌకికాత్మను ప్రతిబింబించే మరో సామాన్యమైన గుణం ద్వేషము. జాతివిభేదాలు, వ్యక్తిగత విభేదాలపై ఆధారపడిన ద్వేషాలు మరియు శత్రుత్వాలతో ప్రపంచం విభాగింపబడి ఉంది. దేవుని ఆత్మ పనిచేస్తున్న చోట ఎంతటి మేలైన విషయాలున్నాయి! అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు (యెహోవా, NW) చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”—రోమీయులు 12:17-21.

12. క్రైస్తవులు ఎందుకు ఐశ్వర్యాసక్తిని విసర్జిస్తారు?

12 ఈ లౌకికాత్మ ఐశ్వర్యాసక్తిని కూడా ప్రేరేపిస్తుంది. వాణిజ్య రంగముచే ప్రోత్సహింపబడి అనేకులు అధునాతన యంత్రసాధనం, అధునాతన ఫ్యాషన్‌, అధునాతన రకం కారు వంటి వాటితో పీడింపబడుతున్నారు. వారు “నేత్రాశ”కు బానిసలయ్యారు. (1 యోహాను 2:16) అనేకమంది జీవితంలో తమ విజయాన్ని తమ ఇంటి పరిమాణాన్ని బట్టి లేక తమ బ్యాంకు ఖాతాను బట్టి లెక్కకడతారు. యెహోవా స్వచ్ఛారాధన యొక్క ఉన్నత పర్వతంపై శుభ్రమైన ఆత్మీయ గాలిని పీల్చుకుంటున్న క్రైస్తవులు ఈ శోధనను ఎదిరిస్తారు. వస్తుసంబంధమైన వాటికొరకైన అధిక ప్రయాస హానికరమైందని వారికి తెలుసు. (1 తిమోతి 6:9, 10) యేసు తన శిష్యులకిలా గుర్తు చేశాడు: “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.”—లూకా 12:15.

13. ఈ లౌకికాత్మ యొక్క కొన్ని అదనపు స్పష్టమైన సంగతులు ఏవి?

13 ఈ ప్రపంచ అనారోగ్యకర “వాయువు” యొక్క ఇంకా ఇతర స్పష్టమైన సంగతులున్నాయి. ఒకటి తిరుగుబాటు స్వభావం. (2 తిమోతి 3:1-3) అనేకులు అధికారంతో సహకరించక పోవడాన్ని మీరు గమనించారా? మీ ఉద్యోగ స్థలంలో, ఎవరైనా నిజంగా గమనిస్తుంటే తప్ప పనిచేయక పోవడం లాంటి అలవాటు వ్యాపించియుండటం మీరు గమనించారా? పన్నులు ఎగవేయడం, పనిచేసే స్థలం నుండి దొంగిలించడం వంటివి చేసి కట్టడలను మీరిన ఎంతమంది వ్యక్తులు మీకు తెలుసు? మీరింకా పాఠశాలకు వెళ్లేవారైతే, ప్రతి సంవత్సరం విజయమొందేవారిని మీ తోటి విద్యార్థులు చిన్నచూపు చూడటం వల్ల, మీకు చేతనైనంత శ్రేష్ఠమైనది చేయడానికి మీరెప్పుడైనా నిరుత్సాహపడ్డారా? ఇవన్నీ క్రైస్తవులు ఎదుర్కొనవలసిన లౌకికాత్మ యొక్క స్పష్టమైన సంగతులు.

ఈ లౌకికాత్మను ఎలా ఎదుర్కోవాలి

14. క్రైస్తవులుకానివారి నుండి క్రైస్తవులు ఏ విధాలుగా వేరుగా ఉన్నారు?

14 మనం వాస్తవంగా ప్రపంచంలో జీవిస్తుండగా మనం ఎలా ఈ లౌకికాత్మను ఎదుర్కొనవచ్చు? భౌతికంగా మనం ఎక్కడున్నప్పటికీ, ఆత్మీయంగా మనం ఈ లోకసంబంధులం కాదని గుర్తుంచుకోవాలి. (యోహాను 17:15, 16) మన గమ్యాలు ఈ లోక గమ్యాలు కాదు. విషయాలను మనం దృష్టించడం వేరుగా ఉంటుంది. మనం ఆత్మీయ ప్రజలం, మనం “మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో” మాట్లాడటం, ఆలోచించడం చేస్తాము.—1 కొరింథీయులు 2:13.

15. మనమెలా లౌకికాత్మను ఎదుర్కొనవచ్చు?

15 ఒక వ్యక్తి తాను విషపూరితమైన వాయువుచే కలుషితమైన ప్రాంతంలో ఉన్నట్లు కనుగొన్నట్లైతే ఏమి చేయగలడు? శుభ్రమైన గాలి సరఫరాకు జతచేయబడివున్న గ్యాస్‌మాస్క్‌ ధరించాలి, లేక అతడు భౌతికంగా ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవాలి. సాతాను గాలిని తప్పించుకోవాలంటే ఈ పద్ధతులను ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు, మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగల లౌకికాత్మ నుండి మనల్ని మనం భౌతికంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా, మనం చెడు సహవాసాన్ని విసర్జించి, దౌర్జన్యం, అవినీతి, అభిచారం, తిరుగుబాటు, లేక మరితర శరీరకార్యాల్ని ప్రోత్సహించే ఏవిధమైన వినోదానికి మనల్ని మనం అనుమతించుకోము. (గలతీయులు 5:19-21) అయినా, మనం లోకంలో జీవిస్తున్నాము గనుక, వీటి ప్రభావానికి పూర్తిగా లోనుకాకుండా ఉండలేము. కాబట్టి మనం శుభ్రమైన గాలి సరఫరాను తీసుకుంటూ ఉంటే మనం జ్ఞానవంతంగా ప్రవర్తించినట్లే. క్రమంగా కూటాలకు హాజరు కావడం, వ్యక్తిగత పఠనం, క్రైస్తవ పరిచర్య, సహవాసం, ప్రార్థనల ద్వారా మనం మన ఆత్మీయ ఊపిరి తిత్తులను నింపుకోవచ్చు. ఈ విధంగా, ఏదైనా సాతాను గాలి మన ఆత్మీయ ఊపిరి తిత్తులలోకి ప్రవేశిస్తే, దాన్ని నిరాకరించడానికి దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది.—కీర్తన 17:1-3; సామెతలు 9:9; 13:20; 19:20; 22:17.

16. దేవుని ఆత్మ ఉందని మనమెలా రుజువు చేస్తాము?

16 ఈ లోకంలో భాగమైన వారి నుండి వేరుగా కనిపించే వ్యక్తిగా దేవుని ఆత్మ ఒక క్రైస్తవున్ని మార్చివేస్తుంది. (రోమీయులు 12:1, 2) పౌలు ఇలా చెప్పాడు: “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” (గలతీయులు 5:22, 23) దేవుని ఆత్మ ఒక క్రైస్తవుడు విషయాలను లోతుగా అర్థం చేసుకునేలా కూడ చేస్తుంది. పౌలు ఇలా చెప్పాడు: “దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.” (1 కొరింథీయులు 2:11) సాధారణంగా, “దేవుని సంగతులలో” విమోచనా బలి, యేసుక్రీస్తు క్రింద దేవుని రాజ్యము, నిత్య జీవనిరీక్షణ, ఈ దుష్ట లోక సత్వర నిర్మూలన వంటి సత్యాలు చేరివుంటాయి. దేవుని ఆత్మ సహాయంతో క్రైస్తవులకు ఈ విషయాలు సత్యమని తెలుసు, వాటిని వారు అంగీకరిస్తారు, ఇది జీవితం యెడల వారి దృక్పథాన్ని లోక ప్రజల దృక్పథం నుండి వేరుగా ఉంచుతుంది. రానైయున్న నిరంతర జీవితంలో ఆయనను సేవించాలనే ఉత్తరాపేక్షతో వారు ఇప్పుడు యెహోవాను సేవించడంలో సంతోషాన్ని కనుగొనుట యందు సంతృప్తి కలిగివున్నారు.

17. లౌకికాత్మను ఎదిరించడంలో ఎవరు అత్యున్నతమైన మాదిరి నుంచారు, ఎలా?

17 ఈ లౌకికాత్మను ఎదిరించే వారికి యేసు అత్యంత శ్రేష్ఠమైన మాదిరిగా ఉన్నాడు. యేసు బాప్తిస్మం తరువాత త్వరలోనే, సాతాను మూడు శోధనలను ఆయన ముందుంచడం ద్వారా యెహోవాను సేవించకుండా ఆయనను దూరం చేయాలని ప్రయత్నించాడు. (మత్తయి 4:1-11) చివరిదానిలో సాతానుకు కేవలం ఆరాధన చేస్తేనే మొత్తం ప్రపంచమంతటి పరిపాలనను యేసు పొందే అవకాశం వుంది. యేసు ఇలా తర్కించుకొని ఉండగలిగేవాడే: ‘నేను ఆరాధన చేస్తాను, అటు తరువాత ప్రపంచ పరిపాలన నా చేతికి వచ్చిన తరువాత, నేను పశ్చాత్తాపపడి యెహోవాను సేవించడానికి తిరిగి వస్తాను. ఇప్పుడు నజరేతులోని ఒక వడ్రంగి వానిగా కంటే నేను ప్రపంచ పరిపాలకునిగా మానవజాతికి ఎక్కువ మేలు చేసే స్థితిలో ఉంటానుకదా.’ యేసు ఆ విధంగా తర్కించుకోలేదు. యెహోవా తనకు ప్రపంచ పరిపాలనాధికారం ఇచ్చే వరకు ఆయన వేచివుండటానికి ఇష్టపడ్డాడు. (కీర్తన 2:8) ఆ సందర్భంలో, ఆయన జీవితంలోని ఇతర సందర్భములలో, సాతాను గాలి యొక్క విషపూరిత ప్రభావాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. అలా, ఆయన ఈ ఆత్మీయంగా కలుషితమైన ప్రపంచంపై విజయాన్ని సాధించాడు.—యోహాను 16:33.

18. మనం లౌకికాత్మను ఎదుర్కొనడం దేవునికి స్తుతిని ఎలా తెస్తుంది?

18 మనం యేసు అడుగుజాడలను దగ్గరగా అనుసరించాలని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 2:21) అంతకంటే శ్రేష్ఠమైన మరే మాదిరి మనకుండగలదు? ఈ అంత్యదినాలలో, లౌకికాత్మచే ప్రభావితం గావించబడి, మానవులు అంతకంతకూ లోతుగా భ్రష్టత్వంలోకి దిగిపోతున్నారు. అలాంటి లోకం మధ్యలో యెహోవా యొక్క ఉన్నత ఆరాధనా స్థలం స్వచ్ఛంగా, శుభ్రంగా నిలబడి ఉండటం ఎంతటి అద్భుతమైన సంగతి! (మీకా 4:1, 2) యెహోవాకు ఘనత, స్తుతి తెస్తూ, అంతటా వ్యాపించి ఉన్న లౌకికాత్మను ఎదుర్కొంటూ, దేవుని ఆరాధనా స్థలానికి లక్షలాదిమంది ప్రవాహం వలె వస్తున్నారంటే నిజంగా, దేవుని ఆత్మ శక్తి వారిలో ఉంది! (1 పేతురు 2:11, 12) యెహోవా యొక్క అభిషక్త రాజు ఈ దుష్టప్రపంచాన్ని నిర్మూలించి, అపవాదియగు సాతానును, అతని దయ్యాలను ఆగాధంలో పడవేసే వరకు మనమందరం ఆ ఉన్నత స్థలంలోనే నిలిచివుండటానికి తీర్మానించుకోవాలి. (ప్రకటన 19:19–20:3) అప్పుడు ఈ లౌకికాత్మ ఇక ఉండదు. అది ఎంతటి ఆశీర్వాదకరమైన సమయంగా ఉంటుందోకదా!

మీరు వివరించగలరా?

◻ లౌకికాత్మ అంటే ఏమిటి?

◻ ఆయా వ్యక్తులపై లౌకికాత్మ ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది?

◻ లౌకికాత్మ యొక్క కొన్ని స్పష్టమైన సంగతులు ఏవి, వాటిని మనమెలా విసర్జించవచ్చు?

◻ మనకు దేవుని ఆత్మ ఉందని మనమెలా చూపించవచ్చు?

◻ లౌకికాత్మను ఎదిరించేవారికి ఏ దీవెనలు వస్తాయి?

[16, 17వ పేజీలోని చిత్రం]

లౌకికాత్మ సాతాను నుండి వచ్చింది

లౌకికాత్మను విసర్జించటానికి, యెహోవా ఆరాధన యొక్క ఉన్నత స్థలానికి తరలిపొండి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి