కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/1 పేజీలు 21-26
  • యెహోవాసాక్షులు ఎందుకు మెలకువగా ఉంటారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు ఎందుకు మెలకువగా ఉంటారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మెలకువగా ఉండుటకు తొలి శిష్యులు ప్రయాసపడ్డారు
  • మెలకువ కలిగివుండుటకు విరమించుకొన్నవారు
  • వృద్ధియైన మెలకువతనం ఫలితాలు
  • వీరు మెలకువగా ఉన్నట్లు ఎలా నిరూపించుకొన్నారు
  • మీరు మెలకువ కలిగివుంటున్నారా?
  • రాజ్యం పరలోకంలో స్థాపించబడింది
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • “అప్రమత్తంగా ఉండండి”—తీర్పు తీర్చే గడియ వచ్చింది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవా తన ప్రజలను సేవ నిమిత్తం సమకూర్చి సంసిద్ధులను చేయుట
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/1 పేజీలు 21-26

యెహోవాసాక్షులు ఎందుకు మెలకువగా ఉంటారు

“కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.”—మత్తయి 24:42.

1. “మెలకువగా ఉండుడి” అనే హెచ్చరిక ఎవరికి వర్తిస్తుంది?

“మెలకువగా నుండుడి” అనే బైబిలు హెచ్చరిక దేవుని ప్రతి సేవకునికి—యౌవనస్థులైనా, పెద్దవారైనా, క్రొత్తగా బాప్తిస్మం తీసుకొన్నవారికైనా లేక ఎంతోకాలం సేవచేసిన వారికైనా—అందరికీ వర్తిస్తుంది! (మత్తయి 24:42) ఇది ఎందుకు ప్రాముఖ్యము?

2, 3. (ఎ) యేసు ఏ సూచనను స్పష్టంగా వర్ణించాడు, ప్రవచన నెరవేర్పు ఏమి చూపించింది? (బి) మత్తయి 24:42 నందు సూచించబడిన ఏ పరిస్థితి మన విశ్వాస యథార్థతను పరీక్షిస్తుంది, ఎలా?

2 భూమిపై తన పరిచర్య ముగింపుకు రాబోయే సమయంలో, రాజ్యాధికారంతో తాను అదృశ్యంగా ప్రత్యక్షమయ్యేదాని గూర్చిన సూచనను యేసు ప్రవచించాడు. (మత్తయి 24, 25 అధ్యాయాలు) తన రాజరిక ప్రత్యక్షత కాలాన్ని ఆయన స్పష్టంగా వివరించాడు. అంతేగాక ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్న సంఘటనలు ఆయన 1914లో రాజుగా ఆసీనుడయ్యాడని చూపిస్తున్నాయి. మన విశ్వాస వాస్తవికతను పరీక్షించే పరిస్థితిని కూడా ఆయన సూచించాడు. మహాశ్రమల కాలంలో ప్రస్తుత దుష్ట విధానాన్ని నాశనం చేయటానికి తాను తీర్పరిగా వెళ్లే సమయానికి సంబంధించి యేసు ఇలా చెప్పాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే యెరుగును గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” దానిని మనసులో ఉంచుకునే ఆయనిలా చెప్పాడు: “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.”—మత్తయి 24:36, 42.

3 మహాశ్రమలు ఏ రోజు ఏ గంటకు ప్రారంభమౌతాయో మనకు తెలియదు గనుక, మనం క్రైస్తవులమని చెప్పుకున్నట్లైతే, ప్రతి రోజు మనం నిజ క్రైస్తవులుగానే జీవించాలి. మహాశ్రమలు వచ్చినప్పుడు మీరు మీ జీవితాన్ని ఉపయోగించుకొనే విధానం ప్రభువు అంగీకారాన్ని పొందగలదా? లేదా ఒకవేళ మరణం మొదట సంభవిస్తే, మీ ప్రస్తుత జీవితాంతము వరకు యెహోవాను నమ్మకంగా సేవించినవారిగా ఆయన మిమ్మల్ని గుర్తుంచుకుంటాడా?—మత్తయి 24:13; ప్రకటన 2:10.

మెలకువగా ఉండుటకు తొలి శిష్యులు ప్రయాసపడ్డారు

4. ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండటంలో యేసు మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

4 ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండడంలో యేసుక్రీస్తు తానే అత్యుత్తమ మాదిరి నుంచాడు. ఆయన తన తండ్రికి తరచూ, తీవ్రముగా ప్రార్థించాడు. (లూకా 6:12; 22:42-44) శ్రమల నెదుర్కొనవలసి వచ్చినప్పుడు, ఎక్కువగా ఆయన లేఖనాల్లో ఉన్న నడిపింపుపై ఆధారపడ్డాడు. (మత్తయి 4:3-10; 26:52-54) యెహోవా ఆయనకు అప్పగించిన పని నుండి ఆయన తనను తాను పక్కకు తప్పిపోనివ్వలేదు. (లూకా 4:40-44; యోహాను 6:15) తమను తాము యేసు అనుచరులుగా దృష్టించుకొనేవారందరూ అలాగే మెలకువ కలిగివుండవద్దా?

5. (ఎ) ఆత్మీయ సమతుల్యాన్ని కాపాడుకోవడంలో యేసు అపొస్తలులు ఎందుకు సమస్యల నెదుర్కొన్నారు? (బి) తన పునరుత్థానం తర్వాత యేసు తన అపొస్తలులకు ఏ సహాయాన్నిచ్చాడు?

5 కొన్నిసార్లు, యేసు అపొస్తలులు కూడా తడబడ్డారు. అత్యాసక్తి, తప్పుడు అభిప్రాయాల ఫలితంగా, వారు నిరుత్సాహాల్ని ఎదుర్కొనవలసి వచ్చింది. (లూకా 19:11; అపొస్తలుల కార్యములు 1:6) వారు పూర్తిగా యెహోవాపై ఆధారపడటం నేర్చుకోకముందు, హఠాత్తుగా వారి నెదుర్కొన్న పరీక్షలు వారు అయోమయంలో పడిపోయేలా చేశాయి. అందుకే యేసు నిర్బంధించబడినప్పుడు ఆయన అపొస్తలులు పారిపోయారు. తర్వాత ఆ రాత్రి పేతురు భయంతో అనేకసార్లు క్రీస్తును ఎరుగనని కూడా చెప్పాడు. “మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి” అనే యేసు ఉపదేశాన్ని అపొస్తలులు ఇంకా గంభీరంగా తీసుకోలేదు. (మత్తయి 26:41, 55, 56, 69-75) పునరుత్థానమైన తర్వాత యేసు వారి విశ్వాసాన్ని బలపర్చటానికి లేఖనాలను ఉపయోగించాడు. (లూకా 24:44-48) వారికివ్వబడిన పరిచర్యను కొంతమంది రెండవ స్థానంలో ఉంచుతారని అనిపించినప్పుడు, అత్యంత ప్రాముఖ్యమైన పనిపై శ్రద్ధనుంచమని యేసు వారి ప్రేరణను బలపర్చాడు.—యోహాను 21:15-17.

6. ఏ రెండు ఉరుల గురించి మునుపు యేసు తన శిష్యులను హెచ్చరించాడు?

6 ఇంతకు ముందు, యేసు తన శిష్యులను వారు లోకసంబంధులై ఉండకూడదని హెచ్చరించాడు. (యోహాను 15:19) వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం వహించకుండా, సహోదరుల వలె కలిసి సేవ చేయాలని కూడా ఆయన వారికి హెచ్చరిక యిచ్చాడు. (మత్తయి 20:25-27; 23:8-12) వారు ఆయన ఉపదేశాన్ని గైకొన్నారా? ఆయన వారికిచ్చిన పనిని వారు ప్రాముఖ్యంగా ముందుంచారా?

7, 8. (ఎ) యేసు ఇచ్చిన సలహాను వారు గంభీరంగా తీసుకొన్నారని మొదటి శతాబ్దపు క్రైస్తవులు వ్రాసిన వృత్తాంతం ఎలా చూపిస్తున్నది? (బి) ఎల్లప్పుడూ ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండడం ఎందుకు ప్రాముఖ్యమైయుండెను?

7 అపొస్తలులు జీవించివున్నంత వరకు వారు సంఘాన్ని కాపాడారు. తొలి క్రైస్తవులు రోమా సామ్రాజ్య రాజకీయ విషయాల్లో పాల్గొనలేదని, వారు ఉన్నత మతనాయక వర్గాన్ని కూడా కలిగిలేరని చరిత్ర సాక్ష్యమిస్తున్నది. బదులుగా, వారు దేవుని రాజ్యాన్ని తీవ్రంగా ప్రకటించేవారైయుండిరి. మొదటి శతాబ్ద అంతానికి, వారు ఆసియా, ఐరోపా, ఉత్తరాఫ్రికాలలో శిష్యులను తయారుచేస్తూ, రోమా సామ్రాజ్యమంతటా సాక్ష్యమిచ్చారు.—కొలొస్సయులు 1:23.

8 అయినా, ప్రకటనపనిలో అలాంటి సాఫల్యాలు సాధించినందున ఆత్మీయంగా మరిక మెలకువ కలిగివుండవలసిన అవసరం లేదని దాని భావం కాదు. యేసు ప్రవచించిన రాకడ మరెంతో కాలం తర్వాత ఉంది. సంఘం సామాన్య శకము రెండవ శతాబ్దంలోకి ప్రవేశించగానే, క్రైస్తవుల ఆత్మీయతను ప్రమాదంలో పడవేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎలా?

మెలకువ కలిగివుండుటకు విరమించుకొన్నవారు

9, 10. (ఎ) అపొస్తలుల మరణం తర్వాత, అనేకమంది నామకార్థ క్రైస్తవులు మెలకువ కలిగిలేరని ఏ పరిణామాలు చూపించాయి? (బి) ఈ పేరాలో ఇవ్వబడిన ఏ లేఖనాలు నామకార్థ క్రైస్తవులు ఆత్మీయంగా దృఢంగా ఉండటానికి సహాయం చేసివుండేవి?

9 తాము ప్రకటిస్తున్నది ప్రపంచ ప్రజలకు మరింత అంగీకరించదగినదిగా ఉండేలా చేయటానికి సంఘంలోకి వచ్చిన కొంతమంది తమ నమ్మకాలను గ్రీకు వేదాంత సంబంధంగా వ్యక్తపర్చడం ప్రారంభించారు. క్రమంగా, త్రిత్వము, ఆత్మయొక్క అమరత్వము వంటి అన్య సిద్ధాంతాలు కళంకిత క్రైస్తవత్వంలో భాగమయ్యాయి. ఇది వెయ్యేండ్ల పరిపాలన నిరీక్షణను విడిచిపెట్టేలా చేసింది. ఎందుకు? ఆత్మ అమరత్వమందు విశ్వాసం ఏర్పరచుకొన్నవారు మానవ శరీరాన్ని తప్పించుకొనే ఆత్మ ఆత్మీయ సామ్రాజ్యంలో క్రీస్తు పరిపాలన ఆశీర్వాదాలను పొందగలదనే ముగింపుకు వచ్చారు. కాబట్టి రాజ్యాధికారంలో క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూడ వలసిన అవసరం లేదని వారు భావించారు.—గలతీయులు 5:7-9; కొలొస్సయులు 2:8; 1 థెస్సలొనీకయులు 5:21 పోల్చండి.

10 ఇతర అభివృద్ధులతో ఈ పరిస్థితి తీవ్రమైంది. క్రైస్తవ పెద్దలమని చెప్పుకొనేవారు తమ సంఘాలను తమకే పేరుప్రతిష్ఠలు సంపాదించుకోవటానికి ఒక సాధనంగా ఉపయోగించటం ప్రారంభించారు. వారు కుటిలంగా, తమ స్వంత అభిప్రాయాలకు, బోధలకు లేఖనాలతో సమానంగా లేక అంతకంటే ఎక్కువగా విలువను ఆపాదించుకొన్నారు. అవకాశం వచ్చినప్పుడు, ఈ మతభ్రష్ట చర్చీ కొన్నిసార్లు రాజకీయ ప్రభుత్వ ఆసక్తులను నెరవేర్చటానికి కూడా తనను తాను లభ్యపరచుకొన్నది.—అపొస్తలుల కార్యములు 20:30; 2 పేతురు 2:1, 3.

వృద్ధియైన మెలకువతనం ఫలితాలు

11, 12. ప్రొటెస్టంటు సంస్కరణము ఎందుకు సత్యారాధన పునఃస్థాపించబడటాన్ని సూచించదు?

11 రోమన్‌ కాథోలిక్‌ చర్చి శతాబ్దాలుగా దుర్వినియోగం చేసిన తర్వాత, కొంతమంది సంస్కర్తలు 16వ శతాబ్దంలో బహిరంగంగా మాట్లాడారు. కాని ఇది సత్యారాధన పునఃస్థాపనకు నడిపించలేదు. ఎందుకు?

12 రోమా అధికారం నుండి అనేక ప్రొటెస్టంటు గుంపులు విడుదల పొందినప్పటికీ, మతనాయకులు-సామాన్య ప్రజలు అను సిద్ధాంతం, త్రిత్వమందు విశ్వాసం, ఆత్మ అమరత్వం, మరణం తర్వాత నిత్య హింస వంటి ప్రాథమిక మతభ్రష్ట బోధలు, ఆచారాలను వారు తమ వెంట తీసుకువెళ్లారు. రోమను కాథోలిక్‌ చర్చిలా, వారు రాజకీయ వ్యక్తులతో సన్నిహిత సంబంధం కలిగివుండి, లోక సంబంధులై ఉండటాన్ని కొనసాగించారు. క్రీస్తు రాజుగా వస్తాడనే ఏ నిరీక్షణనైనా వారు నిరాకరించటం ప్రారంభించారు.

13. (ఎ) కొందరు నిజంగా దేవుని వాక్యాన్ని హత్తుకున్నారని ఏమి చూపిస్తున్నది? (బి) కొంతమంది నామకార్థ క్రైస్తవులకు 19వ శతాబ్దంలో ఏ సంఘటన ప్రత్యేక ఆసక్తి కలిగించేదైయుండెను? (సి) ఎందుకు అనేకులు నిరాశ చెందారు?

13 అయినా, అపొస్తలుల మరణం తర్వాత కోతకాలము వరకు నిజమైన రాజ్య వారసులు (ఆయన గోధుమలకు పోల్చినవారు) నకిలీ క్రైస్తవులతో (లేక గురుగులు) కూడా కలిసి పెరుగుతారని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 13:29, 30) బోధకుడు గోధుమలుగా దృష్టించిన వాళ్లందరినీ మనం నేడు కచ్చితంగా పట్టికవేసి చెప్పలేము. కాని 14, 15, 16వ శతాబ్దాలలో, బైబిలును సామాన్య మానవుని భాషలోకి తర్జుమా చేయటానికి తమ స్వంత జీవితాలను, స్వాతంత్ర్యాన్ని కూడా పణముగా పెట్టినవారు ఉన్నారన్నది గమనించదగిన విషయము. ఇతరులు బైబిలు దేవుని వాక్యమని అంగీకరించడమే కాకుండా త్రిత్వము లేఖనాధారమైంది కాదని కూడా అంగీకరించారు. ఆత్మ అమర్త్యమైందనే నమ్మకం, నరకాగ్నిలో హింసించటం దేవుని వాక్యంతో పూర్తిగా అనుగుణ్యంగా లేవని కొందరు వాటిని నిరాకరించారు. మరియు 19వ శతాబ్దంలో బైబిలును అధికంగా పఠించడం ద్వారా, అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, రష్యాలలోని గుంపులు క్రీస్తు తిరిగివచ్చే సమయం సమీపంలోనే ఉందన్న దృఢవిశ్వాసాన్ని వ్యక్తపర్చటం ప్రారంభించాయి. కాని వారి నిరీక్షణలనేకం నిరాశకు దారితీసాయి. ఎందుకు? లేఖనాలపై కంటే వారు ఎక్కువగా మనుష్యులపై ఆధారపడినందుకు చాలా మేరకు అలా జరిగింది.

వీరు మెలకువగా ఉన్నట్లు ఎలా నిరూపించుకొన్నారు

14. సి. టి. రస్సెల్‌ మరియు ఆయన సహచరులచే ప్రారంభించబడిన బైబిలు పఠన విధానాన్ని వివరించండి.

14 తర్వాత, 1870లో చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, ఆయన సహచరులు మరికొంతమంది పెన్సిల్వేనియా నందలి అల్లిగెనీలో బైబిలు పఠనం కొరకు ఒక గుంపుగా ఏర్పడ్డారు. వారు హత్తుకొన్న అనేక బైబిలు సత్యాలను కనుగొనుటలో వారే మొదటివారు కాదుగాని, వారు చదివేటప్పుడు, ఇవ్వబడిన ప్రశ్నపై అన్ని లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించటం ఒక అలవాటుగా చేసుకొన్నారు.a అప్పటికే వాళ్లు నమ్ముతున్నదానికి సరిపడే లేఖనాలను వెదకాలన్నది వారి ఉద్దేశం కాదుగాని, ఫలానా విషయాన్ని గురించి బైబిలులో చెప్పబడినదానంతటికి అనుగుణ్యంగా ఒక ముగింపుకు వచ్చామన్న నిశ్చయతను కలిగివుండాలన్నదే వారి ఉద్దేశం.

15. (ఎ) సహోదరుడు రస్సెల్‌ కాకుండా ఇతరులు ఏమి గుర్తించారు? (బి) వీరి నుండి బైబిలు విద్యార్థులను ఏది వేరుగా ఉంచింది?

15 వారికంటే ముందు కొంతమంది ఇతరులు కూడా క్రీస్తు ఒక ఆత్మగా, అదృశ్యంగా తిరిగి వస్తాడని గుర్తించారు. క్రీస్తు తిరిగి వచ్చేది భూమిని కాల్చివేసి మానవజాతి నంతటినీ తీసివేయటానికి కాదుగాని భూమి యందలి కుటుంబాలన్నిటిని ఆశీర్వదించడానికే అని కొందరు తెలుసుకొన్నారు. పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం అన్యరాజుల కాలముల ముగింపును సూచిస్తుందని గ్రహించినవారు కూడా కొందరున్నారు. అయితే సహోదరుడు రస్సెల్‌తో సాంగత్యము చేసిన బైబిలు విద్యార్థులకు, ఇవి కేవలం ఆధ్యాత్మిక చర్చ కొరకు ఉపయోగించే అంశాలుగానే ఉండలేదు. ఈ సత్యాల చుట్టూ వారు తమ జీవితాలను నిర్మించుకుని, ఆ శకంలో మునుపెన్నడూ జరగనంతటి శ్రేణిలో వాటిని అంతర్జాతీయంగా ప్రచారం చేశారు.

16. “మనం పరీక్షాసమయంలో ఉన్నాము” అని సహోదరుడు రస్సెల్‌ 1914వ సంవత్సరంలో ఎందుకు వ్రాశాడు?

16 అయినప్పటికీ, వారు ఇంకా మెలకువ కలిగివుండవలసిన అవసరం ఉంది. ఎందుకు? ఉదాహరణగా, 1914, బైబిలు ప్రవచనంచే సూచింపబడిందని వారికి తెలిసినప్పటికీ, ఆ సంవత్సరంలో కచ్చితంగా ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఇది వారికి ఒక పరీక్షగా ఉన్నది. నవంబరు 1, 1914 ది వాచ్‌టవర్‌లో సహోదరుడు రస్సెల్‌ ఇలా వ్రాశాడు: “మనం పరీక్షాకాలంలో ఉన్నామని గుర్తుంచుకొందాము. . . . ప్రభువును, ఆయన సత్యాన్ని విడిచిపెట్టి వెళ్లడానికి, ప్రభువు కొరకు త్యాగం చేయడానికి ఎవరికైనా ఏదైనా కారణం ఉన్నట్లయితే, ప్రభువు నందు ఆసక్తిని ప్రేరేపించింది దేవుని ప్రేమ కాక మరొకటై యుండాలి; బహుశా అది సమయం కొంచెమే ఉందనే నిరీక్షణ కావచ్చు; అలాంటి సమర్పణ కేవలం పరిమిత కాలానికి మాత్రమే చేసికొన్నదై ఉంటుంది.”

17. ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌, ఆయనలాంటి మరితరులు ఎలా ఆత్మీయ సమతుల్యాన్ని కాపాడుకోగలిగారు?

17 పూర్వం కొందరు యెహోవా సేవను విడిచిపెట్టారు. కాని ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌ అలా విడిచిపెట్టని వారిలో ఒకరు. సంవత్సరాల తర్వాత ఆయన నిష్కపటంగా ఇలా చెప్పాడు: “కొన్నిసార్లు కొన్ని తారీఖుల కొరకు మా నిరీక్షణలు లేఖనాలు చెప్పినదానికన్నా ఎక్కువగా ఉండేవి.” ఆత్మీయ సమతుల్యాన్ని కాపాడుకోడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయన చెప్పినట్లుగా, ఆయన ఇలా గుర్తించాడు: “ఆ నిరీక్షణలు నెరవేరనప్పుడు, అవి దేవుని సంకల్పాలను మార్చలేదు.” ఇంకా ఆయనిలా చెప్పాడు: “మనం మన పొరపాట్లను అంగీకరించి, మరింత జ్ఞానం కొరకు దేవుని వాక్యాన్ని పరిశీలించటంలో కొనసాగాలని నేను నేర్చుకున్నాను.”b ఆ తొలి బైబిలు విద్యార్థులు వినయంగా, దేవుని వాక్యం తమ దృక్కోణాన్ని సరిచేయుటను అంగీకరించారు.—2 తిమోతి 3:16, 17.

18. లోకసంబంధులు కాకుండా ఉండే విషయంలో క్రైస్తవ మెలకువ ఎలా ఫలవంతమైన ప్రయోజనాలను చేకూర్చింది?

18 ఆ తరువాతి సంవత్సరాల్లో, మెలకువ కలిగి వుండవలసిన వారి అవసరత తగ్గలేదు. క్రైస్తవులు లోకసంబంధులై ఉండకూడదని వారికి తెలుసు. (యోహాను 17:14; యాకోబు 4:4) దానికి అనుగుణ్యంగా, ఐక్యరాజ్య సమితి దేవుని రాజ్య రాజకీయ వ్యక్తీకరణ అని అంగీకరించటంలోవారు క్రైస్తవమత సామ్రాజ్యంతో కలవలేదు. కాని క్రైస్తవ తటస్థతను గూర్చిన అంశాన్ని 1939 వరకు వారు స్పష్టంగా చూడలేదు.—నవంబరు 1, 1939 ది వాచ్‌టవర్‌ చూడండి.

19. సంస్థ మెలకువ కలిగి ఉన్నందున సంఘ పర్యవేక్షణలో ఏ ప్రయోజనాలు కలిగాయి?

19 కేవలం సంఘంలో సువార్త చెప్పడాన్ని మాత్రమే వారి నుండి కోరవచ్చునని కొంతమంది ఎన్నుకొనబడిన పెద్దలు భావించినప్పటికీ, వారికి ఎన్నడూ ఒక మతనాయక వర్గం లేదు. అయినా, లేఖనాలకు అనుగుణ్యంగా ఉండాలనే అత్యాసక్తి కలిగి, లేఖనాల వెలుగులో పెద్దల పాత్రను సంస్థ పునఃపరిశీలించింది, ది వాచ్‌టవర్‌ శీర్షికల ద్వారా పదే పదే అలాగే చేసింది. లేఖనాలు సూచించిన దానికి అనుగుణ్యంగా సంస్థాపరమైన మార్పులు చేయబడ్డాయి.

20-22. ప్రవచించబడిన విశ్వవ్యాప్త రాజ్య ప్రకటన పనిని సాధించటానికి మొత్తం సంస్థ అంతా ఎలా అభివృద్ధికరంగా సిద్ధపడింది?

20 మన దినం కొరకు దేవుని వాక్యం సూచించిన పనిని పూర్తిగా నెరవేర్చటానికి మొత్తం సంస్థ అంతా ఎంతో సిద్ధపాటు చేసుకుంది. (యెషయా 61:1, 2) మన కాలంలో సువార్త ఎంత మేరకు ప్రకటింపబడవలసి ఉంది? యేసు ఇలా చెప్పాడు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:10) మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అది తరచూ అసాధ్యంలా అనిపించేది.

21 అయినా, సంఘ శిరస్సుగా క్రీస్తు నందు విశ్వాసముంచి, నమ్మకమును బుద్ధిమంతుడునగు దాసుడు ముందుకు వెళ్లాడు. (మత్తయి 24:45) చేయవలసిన పనిని వారు నమ్మకంగా, దృఢంగా యెహోవా ప్రజలకు తెలియజేశారు. ప్రాంతీయ పరిచర్యకు 1919 నుండి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది. అనేకులకు ఇంటింటికి వెళ్లి క్రొత్తవారితో మాట్లాడటం అంత సుళువుగా లేదు. (అపొస్తలుల కార్యములు 20:20) కాని “ధైర్యవంతులు ఆశీర్వదింపబడతారు (1919లో),” “మంచి ధైర్యము కలిగివుండండి (1921లో)” వంటి పఠన శీర్షికలు యెహోవా యందు విశ్వాసముంచి పని ప్రారంభించడానికి కొందరికి సహాయపడ్డాయి.

22 “రాజును అతని రాజ్యాన్ని ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అనే అభ్యర్థన 1922లో ఈ పనికి ఇవ్వదగిన ప్రాముఖ్యత నిచ్చుటకు కావలసిన ప్రేరణను యిచ్చింది. ఆ లేఖనాధార బాధ్యతను అంగీకరించని పెద్దలు 1927 నుండి తొలగించబడ్డారు. ఆ సమయంలో, సంస్థ యొక్క ప్రయాణ ప్రతినిధులు, యాత్రికులు ప్రాంతీయ సేవలో ఉన్న స్థానిక ప్రచారకులకు వ్యక్తిగత ఉపదేశాన్నివ్వటానికి సేవా డైరెక్టర్లుగా నియమించబడ్డారు. ప్రతి ఒక్కరూ పయినీరు సేవ చేయలేకపోయినా, అనేకమంది ఉదయాన్నే త్వరగా మొదలుపెట్టి, కేవలం ఒక సాండ్‌విచ్‌ తినటానికి కొద్దిసేపు ఆగి మళ్లీ మధ్యాహ్నం వరకు పరిచర్యలో పాల్గొంటూ, వారాంతాల్లో దినమంతా సేవకొరకు కేటాయించేవారు. అవి దైవపరిపాలనా అభివృద్ధి యొక్క విశేషమైన సమయాలైయుండెను, యెహోవా తన ప్రజలను ఎలా నడిపించేవాడో పునఃపరిశీలించడం ద్వారా మనం గొప్ప ప్రయోజనం పొందుతాము. ఆయన ఇప్పటికీ అలాగే చేస్తున్నాడు. స్థాపించబడిన రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించే పని ఆయన ఆశీర్వాదంతో, విజయవంతమైన ముగింపుకు తేబడుతుంది.

మీరు మెలకువ కలిగివుంటున్నారా?

23. క్రైస్తవ ప్రేమ, లోకం నుండి వేరైవుండటానికి సంబంధించి, మనం మెలకువ కలిగివున్నామని వ్యక్తిగతంగా మనమెలా చూపించవచ్చు?

23 మనం లోకంలో భాగమైవున్నట్లుగా మనల్ని గుర్తించే ఆచారాలు, దృక్పథాల ద్వారా మనం లోకంతోపాటు గతించిపోయే ప్రమాదములో ఉండకుండా యెహోవా నడిపింపుకు అనుగుణ్యంగా ఆయన సంస్థ స్పందిస్తూ, మనలను హెచ్చరించడంలో కొనసాగుతున్నది. (1 యోహాను 2:17) అయితే మనము యెహోవా నడిపింపుకు ప్రతిస్పందించడం ద్వారా వ్యక్తిగతంగా మెలకువ కలిగివుండవలసిన అవసరం ఉంది. జీవించడం, కలిసి పనిచేయడం గురించి కూడా యెహోవా మనకు ఉపదేశం ఇస్తున్నాడు. నిజంగా క్రైస్తవ ప్రేమ ఏమైయుందనే గుణగ్రహణలో పెరగటానికి ఆయన సంస్థ మనకు సహాయం చేసింది. (1 పేతురు 4:7, 8) మనం మెలకువ కలిగివుండాలంటే, మానవ అపరిపూర్ణత ఉన్నప్పటికీ, ఈ సలహాను అన్వయించుకోవటానికి నిశ్చయంగా ప్రయత్నించటం అవసరము.

24, 25. ఏ ప్రాముఖ్యమైన విధాల్లో, ఏ ఉత్తరాపేక్షను దృష్టిలో ఉంచుకుని మనం మెలకువ కలిగివుండాలి?

24 నిలకడగా, నమ్మకమును బుద్ధిమంతుడునగు దాసుడు మనకు ఇలా గుర్తుచేస్తున్నాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” (సామెతలు 3:5) “యెడతెగక ప్రార్థనచేయుడి.” (1 థెస్సలొనీకయులు 5:17) దేవుని వాక్యం ఆధారంగా మనం నిర్ణయాలు చేసుకోవటం, ఈ వాక్యాన్ని ‘మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై’ ఉండనివ్వటం, నేర్చుకోవాలని మనకు సలహా ఇవ్వబడింది. (కీర్తన 119:105) మన దినం కొరకు యేసు ప్రవచించిన పనియైన దేవుని రాజ్య సువార్తను ప్రకటించటాన్ని మన జీవితాల్లో ముందుంచుకోవటానికి మనం ప్రేమపూర్వకంగా ప్రోత్సహించబడుతున్నాము.—మత్తయి 24:14.

25 అవును, నమ్మకమును బుద్ధిమంతుడునగు దాసుడు నిజంగా మెలకువ కలిగివున్నాడు. వ్యక్తిగతంగా మనం కూడా మెలకువ కలిగివుండాలి. అలా చేసి, తీర్పు తీర్చటానికి మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన యెదుట నిలబడేవారిలో మనం ఒకరమై ఉందాము.—మత్తయి 24:30; లూకా 21:34-36.

[అధస్సూచీలు]

a ఫెయిత్‌ ఆన్‌ ది మార్చ్‌, ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌ వ్రాసినది, ప్రెంటైస్‌ హాల్‌, ఇన్‌కార్పొరేటెడ్‌, 1957, 19-22 పేజీలు.

b ఆగష్టు 15, 1966 ది వాచ్‌టవర్‌ 504-10 పేజీలను చూడండి.

పునఃసమీక్షలో

◻ మత్తయి 24:42 నందు చూపబడినట్లు, మనం ఎందుకు మెలకువ కలిగివుండాలి?

◻ యేసు, ఆయన మొదటి శతాబ్దపు అనుచరులు ఎలా ఆత్మీయ మెలకువను కాపాడుకొన్నారు?

◻ యెహోవా సేవకులు మెలకువ కలిగివున్నందున 1870 నుండి ఏ అభివృద్ధి జరిగింది?

◻ మనం వ్యక్తిగతంగా మెలకువ కలిగివుంటున్నామని ఏది చూపిస్తుంది?

[23వ పేజీలోని చిత్రాలు]

తన తండ్రి అప్పగించిన పనిని చేయడంలో యేసు పనిరద్దీని కలిగివుండెను. ఆయన యెడతెగక ప్రార్థించాడు కూడా

[24వ పేజీలోని చిత్రం]

చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ తన చివరి సంవత్సరాల్లో

[25వ పేజీలోని చిత్రం]

భూవ్యాప్తంగా 47,00,000 కంటే ఎక్కువమంది రాజ్య ప్రచారకులు చురుకుగా ఉన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి