వ్యక్తిగతంగా పఠించడంలో మీరు ఆనందిస్తారా?
దేవుని యొక్క ఏ యథార్థ సేవకుడైనా, బైబిలును వ్యక్తిగతంగా చదవడానికి, అధిక సమయాన్ని వెచ్చించడంలో ఆనందిస్తాడు. (కీర్తన 1:1, 2) అయినా, తమ సమయమూ శక్తిపై గల గొప్ప అవసరతను గుర్తిస్తూ అనేకులు తాము అనుకున్నట్లుగా వ్యక్తిగత పఠనం కొరకు సమయాన్ని, శక్తిని వెచ్చించడం చాలా కష్టంగా భావిస్తుంటారు.
అయినప్పటికి, దేవుని చురుకైన సేవకులుగా కొనసాగడానికి, దేవుని వాక్యపు సత్యాన్ని గూర్చిన కొత్త మరియు లోతైన విషయాలను కనుగొనడం ద్వారా అందరూ తమ సంతోషాన్ని శక్తిని నిత్యమూ నూతనపర్చుకోవాలి. సంవత్సరాల క్రితం మిమ్మల్ని చలింపజేసిన బైబిలు సత్యాలు యిప్పుడు మిమ్మల్ని అంతగా చలింపజేయకపోవచ్చు. కనుక, మనం ఆత్మీయంగా పురికొల్పబడుతూ ఉండడానికిగాను సత్యాన్ని గూర్చిన కొత్త జ్ఞానాన్ని పొందడానికి జాగ్రత్తతో ఎడతెగక ప్రయత్నం చేయడం మంచిది, అది ప్రాముఖ్యమైంది కూడా.
ప్రాచీనకాలమందలి విశ్వాసులైన వ్యక్తులు, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా పఠిస్తూ తమ్మును తాము ఆత్మీయంగాను బలంగాను ఎలా ఉంచుకోగల్గారు? యెహోవా ఆధునిక దిన సేవకులు కొందరు తమ పఠనాన్ని మరింత ఆనందదాయకంగానూ ఫలభరితంగానూ ఎలా చేసుకోగల్గుతున్నారు? తమ ప్రయత్నానికి వారు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందారు?
వ్యక్తిగత పఠనం ద్వారా వారు తమ శక్తిని పునఃనిర్మించుకున్నారు
యూదా రాజైన యోషీయాకు ‘మోషే స్వయంగా రాసిన యెహోవా ధర్మశాస్త్రముగల గ్రంథము’ చదివి వినిపించినప్పటి నుండి ఆయన విగ్రహారాధనకు వ్యతిరేక చర్యను మరెక్కువ ఆసక్తితో చేపట్టాడు. దేవుని వాక్యపు ఆ భాగాన్ని ఆయన మొదటి సారిగా పరిశీలించడంలేదనడంలో సందేహంలేదు; అయితే ఆ సమాచారాన్ని నేరుగా అసలైన చేతివ్రాత ప్రతినుండి చదవడం, తాను స్వచ్ఛమైన ఆరాధన కొరకు సాగించే సమరంలో అతన్ని పురికొల్పింది.—2 దినవృత్తాంతములు 34:14-19.
ప్రవక్తైన దానియేలు ‘యెరూషలేము పాడుగా ఉండవలసిన సంవత్సరములను,’ దాని నిజత్వాన్ని యిర్మీయా పుస్తకం నుండే కాకుండా యితర “గ్రంథముల” నుండి కూడా గ్రహించాడు. వాటిలో లేవీయకాండము (26:34, 35), యెషయా (44:26-28), హోషేయ (14:4-7), ఆమోసు (9:13-15) వంటివి కూడా బహుశా ఉండి ఉంటాయి. ఈ సమర్పిత వ్యక్తి బైబిలు పుస్తకాలను జాగ్రత్తగా చదివి ఓ నిర్ణయానికిరావడం, అతను శ్రద్ధతో ప్రార్థన ద్వారా దేవున్ని ఆశ్రయించడానికి నడిపింది. అతని యథార్థ విన్నపానికి, యెరూషలేము పట్టణమును గూర్చి అలాగే ఆయన ప్రజలను గూర్చి మరిన్ని ప్రకటనలూ హామీలూ జవాబులుగా వచ్చాయి.—దానియేలు, 9వ అధ్యాయం.
“యెహోవా దృష్టికి యథార్థముగా నడ”చిన యోషీయా, దేవుని దృష్టికి “బహు ప్రియు”డైన దానియేలు ఈనాడున్న మనకు ప్రాధమికంగా భిన్నంగా లేరు. (2 రాజులు 22:2; దానియేలు 9:23) తమ కాలంలో అందుబాటులో ఉన్న లేఖనాలను ఎంతో ఆసక్తితో పఠించడానికి చేసిన వారి వ్యక్తిగత ప్రయత్నాలు గొప్ప ఆత్మీయతకు నడిపాయి, అంతేకాకుండా దేవునితో వారు మరింత బలమైన సంబంధాన్ని అనుభవించడానికీ సహాయపడ్డాయి. కీర్తనల గ్రంథాన్ని రచించిన వారిలో ఒకడైన ఆసాపు, యెఫ్తా, నెహెమ్యా, స్తెఫను వంటి అనేక ప్రాచీన యెహోవా సేవకులను గూర్చి కూడా యిదే చెప్పవచ్చు. వీరందరూ తమ కాలంలో అందుబాటులో ఉన్న బైబిలు భాగాన్ని శ్రద్ధతో వ్యక్తిగతంగా పఠించారనడానికి యిదంతా రుజువునిచ్చింది.—న్యాయాధిపతులు 11:14-27; కీర్తన 79, 80; నెహెమ్యా 1:8-10; 8:9-12; 13:29-31; అపొస్తలుల కార్యములు 6:15–7:53.
పరిచర్య పురికొల్పునిచ్చేదిగా ఉండనివ్వండి
యెహోవాను అనేక సంవత్సరాలుగా సేవిస్తున్న సేవకులనేకులకు వ్యక్తిగత పఠనానికి సంబంధించిన ఓ క్రమ పట్టిక ఉంటుంది. తాము మెలకువగా ఉండడానికీ క్రైస్తవ బాధ్యతలను పూర్తిగా నిర్వహించడానికి యిది అవసరమని వారు కనుగొన్నారు. అయినప్పటికి పఠనాన్ని, నిర్లక్ష్యం చేయకూడని యితర విషయాలకు వ్యయం చేసే సమయమూ శక్తికి మధ్య సమతూకాన్ని కల్గియుండడం అన్ని వేళలా అంత సులభమేమీ కాదని వారిలో అనేకులు ఒప్పుకుంటున్నారు.
ఇంకనూ ప్రపంచ వ్యాప్తమైన రాజ్య ప్రచారపని ముమ్మరంగా జరుగుతున్న ఈ తరుణంలో, క్రైస్తవ పరిచర్యలోని అవసరతలతో వ్యవహరించడానికి శ్రద్ధతో చేసే వ్యక్తిగత పఠనం ద్వారా ఆత్మీయంగా మెలకువగా ఉండడం ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యమందలి కొత్త మరియు లోతైన జ్ఞానం వల్ల పులకరించినవారు నీతి విషయమై ఆకలిగల వ్యక్తుల హృదయాలను చేరగలరు. ఒకవ్యక్తి ఆత్మీయ చేపలు పట్టే పనిలో, ఆత్మీయ చేపలు ఎక్కువ దొరికే ప్రాంతంలో నియమించబడినా లేక సామాన్య విరుద్ధభావాలుగల్గి అనేక సార్లు పనిచేసిన ప్రాంతాల్లో పనిచేస్తున్నా యిది నిజమే.
క్రమంగా దేవుని వాక్యాన్ని భుజించండి
ఇతరులు చేసే పనులు మీరు మీ పఠన క్రమంలో ఎక్కువగా ఎలా ఆనందించాలో లేక మీరు మీ కుటుంబ పఠన సమయాన్ని మరింత ఫలభరితంగా ఎలా చేసుకోగలరో అనే వాటిని గూర్చి మీకో అభిప్రాయాన్ని యివ్వగలవు. దేవుని సేవకుడు తాను తప్పిపోకూడదని అనుకునే విషయాల్లో ఒకటి, బైబిలును క్రమంగా చదవడమే. అనేకులు, వారానికి కనీసం బైబిలులోని మూడు నుండి నాలుగు అధ్యాయాలు చదవడం తమ లక్ష్యంగా చేసుకున్నారు. మీరు బైబిలునంతా ఒక్క సంవత్సరంలోపు చదవాలనుకుంటున్నారా? అలా అయితే, మీరు బహుశ రోజుకు ఓ అరగంట చొప్పున, దాన్ని చదవడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి యిష్టపడతారు.
మీరు బైబిలును ఒకటికంటే ఎక్కువసార్లు చదివారా? తర్వాతి సారి ఓ కొత్త గమ్యాన్ని ఎందుకు కల్గివుండకూడదు? ఒక చిన్న మార్పుకొరకు ఓ స్త్రీ బైబిలు పుస్తకాలు రాయబడిన క్రమంలో చదివారు. ఆమె అంతకుముందు తప్పిపోయిన కాలక్రమపట్టికకు సంబంధించిన పూర్వాపరాలపై ఆధారపడిన చాలా వివరాలను కనుగొంది. మరో క్రైస్తవ స్త్రీ గత అయిదు సంవత్సరాలుగా, ప్రతిసారీ ఓ క్రొత్త దృష్టికోణంతో బైబిలును మొదటి నుండి చివరి వరకూ ఐదుసార్లు చదివారు. మొదటి సారి, ఆమె దాన్ని ఆదికాండము నుండి ప్రకటన వరకు చదివారు. రెండవసారి, ప్రతి అధ్యాయంలోని ముఖ్యాంశాలను ఒకటి లేక రెండు వాక్యాల్లో ఓ నోటు పుస్తకంలో వ్రాసుకున్నారు. మూడవ సంవత్సరం తర్వాత నుండి, ఆమె పెద్ద అచ్చులోవున్న రెఫెరెన్స్ ఎడిషన్ మొదలుపెట్టింది, మొదట అడ్డంగా ఉన్న సంబంధిత లేఖనాలను పరిశీలించి, తర్వాత అథఃస్సూచికినీ అలాగే అనుబంధ సమాచారానికి మరింత శ్రద్ధను కనపర్చింది. అయిదవసారి, భౌగోళిక విషయాన్ని గూర్చి తన గ్రహణ శక్తిని పెంచుకోడానికి ఆమె బైబిలు భౌగోళిక పటాలను ఉపయోగించింది. ఆమె యిలా చెబుతున్నారు: “నాకైతే, బైబిలును చదవడం భోజనం చేయడమంత విలువ గలదైంది.”
కొందరు ఆసక్తిగల బైబిలు విద్యార్థులు, తాము వ్యక్తిగతంగా పఠించేటప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యానాలను మార్జిన్లలో రాసుకోడానికి, ఆలోచనను రేకెత్తించే ఉపమానాలను లేక తాము తర్వాత పోల్చి చూసుకునేందుకుగాను యితర ప్రచురణల పేజీ నంబర్లలను రాసుకోడానికి ప్రయోజనకరమని కనుగొన్నారు. ఓ పూర్తికాల పరిచారకురాలు తాను ఆ నెలలో నేర్చుకున్న కొత్త విషయాలను పఠన ప్రతిలో ప్రతి నెలాఖరున రాయడాన్ని అహోభాగ్యంగా భావిస్తుంటారు. “నేను గడిపిన ఈ విలువైన గంటలను చూడడం, తర్వాతి నెలలో యితర గమ్యాలను నేను చేరుకోడానికి సహాయపడుతుంది,” అని ఆమె చెప్పింది.
చాతుర్యంగల కొన్ని యోచనలు
మీ పట్టిక ప్రతి దినం ప్రతి వారం చేయవలసిన విధులతో నిండివున్నట్లుగా, అంతేకాకుండా మీకున్న నియమిత సమయాన్ని మీరు మరింత చక్కగా ఉపయోగించుకోడానికి కొన్ని చిట్కాలు కూడా అవసరమని మీరు భావిస్తున్నారా? అలాగైనట్లైతే, మీరు చదవాలనుకున్నదాన్ని మీదగ్గర ఉంచుకోండి, మీ ఖాళీ సమయాలను ఉపయోగించుకోండి. ఇంటి వద్ద లేక మీరు సామాన్యంగా పఠించే చోట వీలున్నంత వరకూ పుస్తకాలనూ పఠనానికి అవసరమైన యితర వస్తువులనూ సులభంగా అందే రీతిలో పెట్టుకోండి. మీ పఠనా స్థలాన్ని అనుకూలంగా చేసుకోండి, అయితే మరీ నిద్ర పట్టేంత అనుకూలం కాకూడదు. మీరు ప్రసంగం యివ్వాల్సి ఉందా? వీలున్నంత త్వరగా ఆ సమాచారాన్ని చదవండి, తర్వాత మీరు విశ్రమిస్తున్నప్పుడో లేక వివిధ పనులు చేస్తున్నప్పుడో ఆలోచనలు మీ మనస్సుకు రానివ్వండి.
సమయాన్ని సరిగ్గా వినియోగించుకోడానికి పరస్సర ప్రయోజనార్థమై యితరులు మీకు సహాయం చేయగలరు. సులభంగా అర్థమయ్యే విషయాలను మీకు బిగ్గరగా చదివి వినిపించమని యితరులతో చెప్పవచ్చు, ఉదాహరణకు, మీరు రోజువారీ పనులు చేస్తున్నప్పుడు గానీ లేక మీ కొరకు చదువుతున్న ఆ దయగల వ్యక్తికి టీ అందించేటప్పుడుగాని దీన్ని చేయవచ్చు. నెమ్మది గల సమయంలో వ్యక్తిగత పఠనం జరుపుకోడానికి యింట్లో వారందరూ అంగీకరించే విషయమేమిటి? “యిటీవల మీరు వేటిని చదివి ఆనందించారు?” అని సంభాషణను ప్రారంభించడం ద్వారా మీ స్నేహితులు నేర్చుకున్న వాటిని మీరు కూడా కొన్నిసార్లు పొందగలరు.
మీ పఠనా కార్యక్రమానికి కొత్త ఆలోచనలను చేర్చే ఆసక్తి మీకు ఉందా? ఇతరులతో బైబిలు విషయాలను మాట్లాడడంలో యింత సమయాన్ని గడపాలనే లక్ష్యాన్ని అనేకులు కల్గివున్నట్లుగా మీరు కూడా ఆ విషయంలో ఓ లక్ష్యాన్ని కల్గివుండవచ్చు. ఓ పూర్తికాల (పయినీర్) ప్రచారకురాలు నెలకు కనీసం యిన్ని గంటలు చదవాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, పట్టికలో తాను నమోదు చేసుకునేటప్పుడు అది తన లక్ష్యానికి మెల్లగా చేరుకోవడం చూసి ఎంతో ఆనందిస్తుంది. ఇతరులు దూరదర్శనిని చూసే సమయాన్ని నియంత్రిస్తారు, అలా వారు పఠనం కొరకు సమయాన్ని పొందుతుంటారు. కొందరు, ఆత్మ ఫలాలు, బైబిలు పుస్తకాల పూర్వోత్తరాలు లేక బోధనాసామర్థ్యం వంటి పఠన ఆంశాలను కొంతకాలం వరకు చదవడానికి ఎన్నుకుంటారు. ఇశ్రాయేలీయుల రాజులకు, ప్రవక్తలకుa మధ్య ఉన్న లేక అపొస్తలుల కార్యాలకూ పౌలు రాసిన ఉత్తరాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని గూర్చిన కాలపట్టికలను తయారుచేయడంలో కొందరు ఆసక్తిని కల్గివుంటారు.
యౌవనులారా, మీకు బలమైన విశ్వాసం కావాలా? రాబోయే మీ స్కూల్ సెలవుల్లో లోతుగా పఠించడానికి మీరు ఓ ప్రచురణను ఎందుకు ఎన్నుకోకూడదు? బాప్తిస్మం పొందిన ఓ ఉన్నత పాఠశాల విద్యార్థిని వాచ్‌టవర్ సొసైటీ ప్రచురించిన మ్యాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అనే పుస్తకాన్ని ఎన్నుకుంది. ఒక్కో అధ్యాయమే చదువుతూ ఆమె ఓ నోటు పుస్తకంలో తాను నేర్చుకున్న వాటిని గూర్చి క్లుప్తమైన సారాంశాలను రాసుకుంది. అది సవాలుతో కూడింది అంతేకాదు ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది. అయినప్పటికీ, ఆమె ఆ పుస్తకాన్నంతటినీ పూర్తి చేసినప్పుడు, బైబిలు సమాచారం యొక్క సత్యసంధతకు ఆమె ఎంతగానో ముగ్ధురాలైంది.
నేర్చుకోడానికి ఎల్లప్పుడూ ఆతురతను కల్గివుండండి
యెహోవా ఆధునిక దిన సేవకులనేకులు యిప్పటికే “ప్రభువు కార్యాభివృద్ధియందు” ఎంతో చేయాల్సి ఉంది. (1 కొరింథీయులు 15:58) పునఃపరిశీలించిన పట్టిక ఉన్నప్పటికీ, యథార్థమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, మీరు అనుసరిస్తున్న వారపు పట్టికలో అంత పెద్దగా మార్పురాకపోవచ్చు. అయినా, సత్యాన్ని గూర్చిన లోతైన అవగాహనను పొందాలనే ఎడతెగని మీ ఆతురత, యెహోవా ఉద్దేశాలు ఏమిటి అనే విషయాల్లో మెలకువగా ఉండడమూ దానికి అనుగుణంగా నడవడమూ మీరు మీ పఠన అలవాట్లను మెరుగుపర్చుకోడానికి సహాయపడతాయి.
తమ పఠన అలవాట్లను మెరుగుపర్చుకున్న వారు పొందిన ప్రతిఫలాలను గూర్చి వినడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సత్యాన్ని గూర్చిన లోతైన అవగాహన యెడల అనుకూల దృక్పథాన్ని తాను కోల్పోతున్నట్లు గ్రహించిన ఒక క్రైస్తవ పురుషుడు, తన వ్యక్తిగత పఠనం కొరకు అధిక సమయాన్ని వెచ్చించడానికి గాను తన జీవితాన్ని వ్యవస్థీకరించుకున్నాడు. “మునుపు నాకు తెలియని ఆనందాన్ని అది నాకు తెచ్చిపెట్టింది,” అని ఆయన అంటున్నాడు. “బైబిలు యొక్క దైవిక గ్రంథకర్తృత్వంలో పెరిగే నమ్మకంతో, నిజమైన ఉత్సాహంతో నా విశ్వాసాన్ని గూర్చి నేను యితరులతో మాట్లాడగలనని కనుగొన్నాను. నాకు మంచి ఆహారం దొరుకుతోందనీ, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నానని, ప్రతి దినాంతాన నేను సంతృప్తిగా ఉన్నానని భావిస్తున్నాను.”
అనేక సంఘాలను సందర్శించే యెహోవాసాక్షుల ప్రయాణకాపరి, యితర ప్రయోజనాలను గూర్చి యీ విధంగా వివరిస్తున్నారు: “వ్యక్తిగత పఠనంలో పాటుపడేవారు సహజంగా తాము వ్యక్తపర్చే విధానంలో ఉత్సాహవంతంగాను స్పష్టంగాను ఉంటారు. వారు యితరులతో బాగా కలిసి జీవిస్తారు, యితరులు చేసే ప్రతికూల వ్యాఖ్యానాలకు వారు సులభంగా ప్రభావితంకారు. ప్రాంతీయ సేవలో, వారు సరళంగానూ అలాగే ప్రజల అవసరతలను చేరడానికి మెలకువగాను ఉంటారు.”
కొందరు తమ పఠన విధానాన్ని విశ్లేషించుకున్నప్పుడు తమ మనస్సులో ఉంచుకోవాలనుకునే విషయాన్ని ఆయన చెబుతున్నారు. “లేఖనాలను చర్చించే కూటాల్లో అనేకులు తమ వ్యాఖ్యానాలను నేరుగా అచ్చు ప్రతినుండి చదువడానికి మొగ్గుచూపుతారు. వారు మునుపు నేర్చుకున్న దానికి లేక తమ స్వంత జీవితాలకు, ఆ సమాచారానికి ఎలాంటి సంబంధం ఉందోనన్న విషయాలను ధ్యానించినట్లయితే వారు మరి ఎక్కువ ప్రయోజనం పొందగలరు.” మీరు ఈ విషయంలో వృద్ధి చెందగలరనుకుంటున్నారా?
ప్రవక్తయైన దానియేలు తన జీవితంలోని 90 సంవత్సరాల తర్వాత కూడా యెహోవా మార్గాలను పూర్తిగా అర్థంచేసుకున్నాడని భావించలేదు. తన తుది కాలంలో తాను పూర్తిగా అర్థంచేసుకోలేని ఒక విషయాన్ని గూర్చి ఆయన యిలా ప్రశ్నించాడు: “నా యేలినవాడా, వీటికి అంతమేమి?” (దానియేలు 12:8) నిస్సందేహంగా, దేవుని సత్యం విషయమై మార్పులేని ఈ ఆతురతే ఆయన తన సంఘటనాత్మక జీవితమంతటిలోనూ కల్గివుండిన గొప్ప యథార్థతకు మూలమైంది.—దానియేలు 7:8, 16, 19, 20.
యెహోవా సేవకుల్లో ప్రతి ఒక్కరూ ఆయన సాక్షులుగా దృఢంగా నిలవడానికి దానియేలు కల్గివుండిన అదే బాధ్యతను కల్గివున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మీయంగా బలంగా ఉంచుకోడానికి ఎల్లప్పుడూ ఆతురతను కల్గివుండండి. వారానికి, నెలకు, లేక సంవత్సరానికి సంబంధించిన మీ వ్యక్తిగత పఠన పట్టికకు ఒకటి రెండు కొత్త విషయాలను చేర్చడానికి ప్రయత్నించండి. మీరు చేసే ఏ చిన్న ప్రయత్నాన్నైనా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మీరు గ్రహించండి. అవును, మీరు వ్యక్తిగత బైబిలు పఠనంలోను మరియు అది తెచ్చే ఫలితాల్లోనూ ఆనందించండి.—కీర్తన 107:43.
[అధస్సూచీలు]
a As a basis for your enlarged study, you may like to use the chart found in Insight on the Scriptures, published by the Watchtower Bible and Tract Society of New York, Inc., Volume 1, pages 464-6.