కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/15 పేజీలు 10-15
  • మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివాహం యొక్క శాశ్వతత్వం
  • శిరసత్వం మరియు లోబడడం
  • సంభాషణ—వివాహానికి జీవాన్ని కాపాడే రక్తము వంటిది
  • అనంగీకారాలతో వ్యవహరించడం
  • ఒకరి యెడల ఒకరు నమ్మకంగా ఉండండి
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుడు జతపరచినవారిని వేరుచేయకూడదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటూ, మీ బంధాన్ని బలపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/15 పేజీలు 10-15

మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి

“దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.”—మత్తయి 19:6.

1. ఈనాడు నిజ క్రైస్తవుల మధ్య వివాహం విజయవంతం కావడానికి ఆధారం ఏమిటి?

యెహోవా ప్రజలలోని వేలాదిమంది నేడు సంతృప్తికరమైన, దృఢమైన వివాహ జీవితాలను అనుభవిస్తున్నారు. అయితే, అలాంటి విస్తృత విజయం యాదృచ్ఛికమైనది కాదు. భాగస్వాము లిరువురూ (1) వివాహ బంధాన్ని గూర్చిన దేవుని దృష్టిని గౌరవించినప్పుడు, (2) ఆయన వాక్య సూత్రాలకు అనుగుణ్యంగా జీవించడానికి కృషి చేసినప్పుడు క్రైస్తవ వివాహాలు వర్ధిల్లుతాయి. అసలు దేవుడే వివాహ ఏర్పాటును ప్రారంభించాడు. ‘భూమిమీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో’ ఆ తండ్రి ఆయనే. (ఎఫెసీయులు 3:14, 15) వివాహాన్ని విజయవంతం చేయాలంటే ఏమి అవసరమో యెహోవాకు తెలుసు కాబట్టి, ఆయన నడిపింపును అనుసరించడం ద్వారా మనం మేలు పొందగలము.—యెషయా 48:17.

2. వివాహంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో విఫలమైతే ఏ ఫలితాలు ఉంటాయి?

2 దానికి భిన్నంగా, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో విఫలమైతే, అది వివాహ విచ్ఛిన్నానికి దారితీయవచ్చు. అమెరికాలో నేడు వివాహం చేసుకుంటున్న వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది చివరికి విడాకులు తీసుకుంటున్నారని కొంతమంది నిపుణులు విశ్వసిస్తున్నారు. క్రైస్తవులు కూడా ఈ “అపాయకరమైన కాల” ఒత్తిడులకు, బాధలకు అతీతులుకారు. (2 తిమోతి 3:1) ఆర్థిక ఉద్రిక్తతలు, ఉద్యోగ స్థలంలోని ఒత్తిడులు ఏ వివాహంపైనైనా తమ హానికరమైన ప్రభావాన్ని చూపించగలవు. కొంతమంది క్రైస్తవులు కూడా తమ జతలు బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో విఫలం కావడాన్నిబట్టి ఎంతో నిరుత్సాహం చెందారు. ఒక క్రైస్తవ భార్య ఇలా చెబుతుంది, “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, కాని ఇరవై ఏళ్లుగా నా వివాహం సమస్యలతో కొనసాగుతుంది. నా భర్త స్వార్థపరుడు, ఏ విధమైన మార్పులు చేసుకోవడం అతనికి ఇష్టంలేదు. నేను ముట్టడించబడినట్లు భావిస్తున్నాను.” అనేకమంది క్రైస్తవ భర్తలు లేక భార్యలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపర్చారు. తప్పు ఎక్కడ దొర్లుతుంది? ఒక వివాహం తీవ్ర స్తబ్దతతోనైనా లేక భీకరమైన వైరుధ్యంతోనైనా కొట్టుకొనిపోకుండా ఏది నివారించగలదు?

వివాహం యొక్క శాశ్వతత్వం

3, 4. (ఎ) వివాహ విషయంలో దేవుని ప్రమాణం ఏమిటి? (బి) వివాహం యొక్క శాశ్వత ఏర్పాటు ఎందుకు న్యాయమైనది, ప్రయోజనకరమైనది?

3 ఎంతో శ్రేష్ఠమైన పరిస్థితుల్లో కూడా, వివాహం అంటే అసంపూర్ణ వ్యక్తుల కలయికయే. (ద్వితీయోపదేశకాండము 32:5) అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “అట్టివారికి [వివాహం చేసుకునే వారికి] శరీరసంబంధమైన శ్రమలు కలుగును.” (1 కొరింథీయులు 7:28) కొన్ని విపరీత పరిస్థితులు విడిపోడానికి లేక విడాకులు తీసుకోడానికి కూడా దారితీయవచ్చు. (మత్తయి 19:9; 1 కొరింథీయులు 7:12-15) అయినా, ఎక్కువ సందర్భాల్లో, క్రైస్తవులు పౌలు ఇచ్చిన ఈ సలహాను అన్వయించుకుంటారు: “భార్య భర్తను ఎడబాయకూడదు . . . , భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.” (1 కొరింథీయులు 7:10, 11) వాస్తవానికి, వివాహం శాశ్వత బంధంగా ఉండాలని ఏర్పాటు చేయబడింది, అందుకే యేసుక్రీస్తు యిలా చెప్పాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”—మత్తయి 19:6.

4 విరోధమైన లేక ప్రేమలేని వివాహంలో చిక్కుకొనబడినట్లు భావించేవారికి, యెహోవా ప్రమాణాలు కఠినమైనవిగా, కారణరహితమైనవిగా అనిపించవచ్చు. కాని అలా కాదు, సమస్య ప్రారంభమవుతున్నట్లుగా కనబడినప్పుడే తమ బాధ్యతల నుండి తప్పుకోడానికి బదులు, తమ సమస్యలను ఎదుర్కొని, వాటి పరిష్కారాన్ని వెదకడానికి ఒక దైవిక జంటను శాశ్వత వివాహ బంధం కదిలిస్తుంది. ఇరవై ఏళ్లకుపైగా వివాహితుడైయున్న ఒక వ్యక్తి దానిని ఇలా చెబుతున్నాడు: “సమస్యలతో కూడిన సమయాలను మీరు తప్పించుకోలేరు. మీరు ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేరు. అప్పుడే ఒప్పందానికి కట్టుబడి ఉండటం నిజంగా ప్రాముఖ్యము.” నిజానికి, క్రైస్తవ వివాహ దంపతులు, వివాహ మూలకర్తయైన యెహోవా దేవుని యెడల ప్రాధమికంగా బాధ్యత కలిగివున్నట్లు భావిస్తారు.—ప్రసంగి 5:4 పోల్చండి.

శిరసత్వం మరియు లోబడడం

5. భార్యలకు, భర్తలకు పౌలు యిచ్చిన కొన్ని సలహాలు ఏమిటి?

5 కాబట్టి, సమస్యలు తలెత్తినప్పుడు, అది తప్పించుకొనే సమయం కాదుగాని, దేవుని వాక్య ఉపదేశాన్ని శ్రేష్ఠమైనరీతిలో అన్వయించుకొనే సమయమై ఉంది. ఉదాహరణకు, ఎఫెసీయులు 5:22-25, 28, 29 నందు కనుగొనబడే పౌలు మాటలను పరిశీలించండి: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.”

6. లోకసంబంధ పురుషుల నుండి క్రైస్తవ భర్తలు ఎలా భిన్నంగా ఉండాలి?

6 పురుషులు తరచూ భర్తగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ భార్యలపై పెత్తనం చెలాయించారు. (ఆదికాండము 3:16) అయినా, క్రైస్తవ భర్తలను ఈ లోక సంబంధ పురుషులకు భిన్నంగా తమ భార్యల ఉనికిని గూర్చిన ప్రతి విషయాన్ని అదుపు చేసే క్రూరులవలె గాక క్రీస్తు వలె ఉండమని పౌలు కోరాడు. కచ్చితంగా, యేసుక్రీస్తు ఎన్నడూ కఠినంగా ఉండలేదు లేక అధికారం చెలాయించలేదు. ఆయన తన అనుచరులను గౌరవమర్యాదలతో చూశాడు, ఇంకా యిలా అన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి”.—మత్తయి 11:28, 29.

7. ఒక భార్య లౌకిక ఉద్యోగం చేయవలసి వచ్చినప్పుడు ఆమె భర్త ఆమెను ఎలా సన్మానించగలడు?

7 తన భార్యను బలహీనమైన ఘటముగా క్రైస్తవ భర్త సన్మానిస్తాడు. (1 పేతురు 3:7) ఉదాహరణకు, ఒకవేళ ఆమె లౌకిక ఉద్యోగం చేయవలసి ఉందనుకోండి. వీలైనంత సహాయకరంగా, అర్థం చేసుకునేవాడిగా ఉండడం ద్వారా ఆయన దీన్ని పరిగణలోకి తీసుకుంటాడు. విడాకులు తీసుకోడానికి స్త్రీలు చూపే ఒక ప్రముఖ కారణం ఏమిటంటే తమ భర్తలు పిల్లలను లేక ఇంటిని నిర్లక్ష్యం చేయడమే. కాబట్టి, యావత్‌ కుటుంబ ప్రయోజనార్థమై అర్థవంతమైన మార్గాల్లో ఇంటి వద్ద ఆమెకు సహాయం చేయటానికి ఒక క్రైస్తవ భర్త ప్రయత్నిస్తాడు.

8. లోబడడం క్రైస్తవ భార్యలకు దేనిని అప్పగించింది?

8 క్రైస్తవ భార్యలు గౌరవించబడుతున్నప్పుడు అది వారిని తమ భర్తలకు సులభంగా లోబడేలా చేస్తుంది. అయితే నికృష్ట బానిసత్వమని దీని భావం కాదు. భార్య బానిస కాదుగాని, పురుషునికి తగినదని సూచించే “సాటియైన సహాయకారి” (“కౌంటర్‌పార్ట్‌,” అధఃస్సూచి (NW) అని దేవుడు తెలియజేసాడు. (ఆదికాండము 2:18) మలాకీ 2:14 నందు భార్య పురుషుని “తోటి” దానిగా (భాగస్వామిగా) చెప్పబడింది. అలాగే, బైబిలు కాలాల్లో భార్యలు చెప్పుకోదగినంత స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అనుభవించారు. “గుణవతియైన భార్యను” గూర్చి బైబిలు ఇలా తెలియజేస్తుంది: “ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును.” వాస్తవానికి, గృహసంబంధ వ్యవహారాలను చూసుకోవడం, ఆహార కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించడం, ఆస్తి వ్యవహారాలను సర్దుబాటు చేయడం, స్వల్ప వ్యాపారాన్ని నిర్వహించడం వంటి విషయాలు ఆమెకు అప్పగించబడ్డాయి.—సామెతలు 31:10-31.

9. (ఎ) బైబిలు కాలాల్లోని దైవ భయముగల స్త్రీలు నిజమైన విధేయతను ఎలా కనపర్చారు? (బి) నేడు క్రైస్తవ భార్య విధేయతగల దానిగా ఉండడానికి ఏది సహాయపడగలదు?

9 అంతేగాక, దేవునికి భయపడే భార్య తన భర్త అధికారాన్ని గుర్తిస్తుంది. ఉదాహరణకు, శారా కేవలం మర్యాదపూర్వక వాడుక చొప్పున గాక, తన యథార్థమైన విధేయతకు ప్రతిబింబంగా, “అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను.” (1 పేతురు 3:6; ఆదికాండము 18:12) తన భర్తతో గుడారములలో జీవించడానికి ఆమె ఊరు పట్టణంలోని అనుకూలమైన తన గృహాన్ని కూడ ఇష్టపూర్వకంగా విడిచిపెట్టింది. (హెబ్రీయులు 11:8, 9) అయితే లోబడడం అంటే ఒక భార్య, అవసరమైనప్పుడు బాధ్యతాయుతమైన చర్యగైకొన కూడదని భావంకాదు. సున్నతికి సంబంధించిన దేవుని ఆజ్ఞను అమలు చేయడంలో మోషే విఫలుడైనప్పుడు, ఆయన భార్య సిప్పోరా నిర్ణయాత్మకంగా ప్రవర్తించడం ద్వారా ఆపదను అడ్డగించింది. (నిర్గమకాండము 4:24-26) అపరిపూర్ణమైన పురుషుని ప్రీతిపర్చడంకంటే మరెంతో యిమిడివుంది. భార్యలు ‘ప్రభువునకువలె తమ సొంతపురుషులకు లోబడి’ ఉండాలి. (ఎఫెసీయులు 5:22) ఒక క్రైస్తవ భార్య దేవునితోగల తన సంబంధం దృష్ట్యా ఆలోచిస్తే, తన భర్త తనతో వ్యవహరించడంలో ఆయన అవసరమైన వాటిని చేయవలసి వచ్చినప్పుడు కూడా, దొర్లే చిన్న చిన్న పొరపాట్లను, కనబడే అయోగ్యతలను అంతగా పట్టించుకోకుండా ఉండడానికిది ఆమెకు సహాయం చేస్తుంది.

సంభాషణ—వివాహానికి జీవాన్ని కాపాడే రక్తము వంటిది

10. వివాహానికి సంభాషణ ఎంత ముఖ్యమైనది?

10 దంపతులు విడిపోవడానికి ఏకైక పెద్ద కారణమేమిటని అడిగినప్పుడు ఒక విడాకుల న్యాయవాది యిలా సమాధానమిచ్చాడు: “ఒకరితో ఒకరు యథార్థంగా మాట్లాడుకోలేకపోవడం, ఆంతరంగిక విషయాలను కూడా చెప్పుకుని ఒకరినొకరు తమ ఆంతరంగిక స్నేహితులుగా చూడకపోవడము.” అవును, పటిష్ఠమైన వివాహానికి సంభాషణ జీవాన్ని కాపాడే రక్తము వంటిది. బైబిలు చెప్పినట్లుగా, “సమాలోచన లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.” (సామెతలు 15:22 NW) స్నేహపూరిత, సన్నిహిత సంబంధాన్ని అనుభవించే భార్యాభర్తలు ‘ఆంతరంగిక స్నేహితులై’ వుండాలి. (సామెతలు 2:17) అయినా, చాలామంది దంపతులు సంభాషించడం కష్టంగానున్నట్లు కనుగొని, నాశనకరమైన ఆగ్రహం పెల్లుబుకే వరకు కోపాన్ని అలాగే కొనసాగిస్తారు. లేదా వివాహ దంపతులు ఒకరినుండి ఒకరు మానసికంగా దూరమౌతూ, సభ్యత అనే అందమైన ముసుగుచాటున తమ్మును తాము దాచుకొనవచ్చును.

11. భార్యాభర్తల మధ్య సంభాషణను ఎలా అభివృద్ధి చేసుకోగలరు?

11 స్త్రీ పురుషులు తరచూ భిన్నమైన సంభాషణా శైలి కలిగివుండడం సమస్యలో ఒక భాగంలా కనిపిస్తుంది. ఎక్కువమంది స్త్రీలు తమ భావాలను గూర్చి చర్చించడానికి ఇష్టపడతారు, అయితే పురుషులు మాత్రం సాధారణంగా వాస్తవాలను చర్చించడానికి ఆసక్తి చూపిస్తారు. సానుభూతి చూపించాలని, మానసికంగా మద్దతునివ్వాలని స్త్రీలు కోరుకుంటారు, కాని పురుషులు పరిష్కారాలు వెదకి, వాటిని అందించాలని కోరుకుంటారు. అయినప్పటికీ, దంపతులలోని ఇరువురూ ‘వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారును, కోపించుటకు నిదానించువారునై’ ఉండాలని నిశ్చయించుకుంటేనే మంచి సంభాషణకు అవకాశం ఉంటుంది. (యాకోబు 1:19) కళ్లలోకి చూస్తూ నిజంగా శ్రద్ధ చూపించండి. ఆలోచింపజేసే ప్రశ్నలతో ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోండి. (1 సమూయేలు 1:8; సామెతలు 20:5 పోల్చండి.) మీ జత ఒక సమస్య గురించి చెప్పినప్పుడు వెంటనే పరిష్కారాన్ని చూపించడానికి ప్రయత్నించే బదులు, విషయాలను పరిష్కరించడానికి పనిచేస్తూ, జాగ్రత్తగా వినండి. దైవిక నడిపింపును కోరుతూ, వినయంగా ఇద్దరూ కలిసి ప్రార్థించండి.—కీర్తన 65:2; రోమీయులు 12:12.

12. క్రైస్తవ దంపతులు ఎలా ఒకరికొరకు ఒకరు సమయాన్ని సంపాదించుకోగలరు?

12 జీవితపు ఒత్తిడులు, బాధలు వివాహ దంపతులు అర్థవంతమైన సంభాషణ కలిగివుండుటకు సమయం, శక్తి కొరవడేలా కొన్నిసార్లు చేస్తుండవచ్చు. అయినా, క్రైస్తవులు తమ వివాహాన్ని గౌరవప్రదంగా ఉంచుకుని, కళంకం కాకుండా దాన్ని కాపాడుకోవాలంటే, వారు ఒకరి కొకరు సన్నిహితంగా ఉండాలి. వారు తమ కలయికను ప్రశస్తమైందిగా, విలువైందిగా ఎంచి, దాని కొరకు ఒకరి కొరకు ఒకరు సమయాన్ని సంపాదించుకోవాలి. (కొలొస్సయులు 4:5ను పోల్చండి.) కొన్ని సందర్భాలలో మాట్లాడుకోడానికి సమయాన్ని సంపాదించడానికి కేవలం టి.వి.,ని కట్టేయడం మాత్రమే సరిపోతుంది. ఒక కప్పు కాఫీ లేక టీ క్రమంగా కలిసి త్రాగడం వివాహ భాగస్వాములు భావోద్రేకపరంగా సంభాషించుకోడానికి సహాయం చేస్తుంది. అలాంటి సందర్భాల్లో, వారు అనేక కుటుంబ విషయాల గురించి ‘పరస్పరం సంప్రదించుకోవచ్చు.’ (సామెతలు 13:10) ఒత్తిడికి నడిపే పెద్ద కారకాలు కాకముందే చిన్న చిన్న చీకాకులను గూర్చి, అపార్థాలను గూర్చి మాట్లాడే అలవాటు చేసుకోవడం ఎంత జ్ఞానయుక్తంగా ఉంటుంది!—మత్తయి 5:23, 24; ఎఫెసీయులు 4:26 పోల్చండి.

13. (ఎ) దాపరికం లేకుండుట, యథార్థంగా ఉండడం విషయంలో యేసు ఎలాంటి మాదిరి నుంచాడు? (బి) వివాహ దంపతులు ఒకరికొకరు సన్నిహిత మవ్వడానికి కొన్ని మార్గాలు ఏమిటి?

13 ఒక వ్యక్తి ఇలా ఒప్పుకుంటున్నాడు: “నా ఉద్దేశాలు వ్యక్తపర్చడం, నేనెలా భావిస్తున్నానో [నా భార్యకు] చెప్పడం తరచూ నాకు చాలా కష్టంగా ఉంటుంది.” అయినా, సన్నిహితత్వాన్ని పెంపొందించుకోడానికి మిమ్మును మీరు వెల్లడించుకోవడం కూడా ప్రాముఖ్యమైన కీలకము. తన పెండ్లి కుమార్తె తరగతి భవిష్యత్‌ సభ్యులతో యేసు ఎలా స్పష్టంగా, యథార్థంగా ఉన్నాడో గమనించండి. ఆయనిలా చెప్పాడు: “దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహాను 15:15) కాబట్టి మీ జతను మీ స్నేహితునిగా భావించండి. మీ భావాల ద్వారా మీ జతను విశ్వసించండి. సరళమైన, యథార్థమైన ‘అనురాగపూరిత భావాలను’ ఉత్పన్నము చేయుటకు ప్రయత్నించండి. (పరమగీతము 1:2) మనస్సు విప్పి మాట్లాడుకోవడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండవచ్చు, కాని వివాహ సహచరులిరువురూ తగిన ప్రయత్నం చేస్తే, తమ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోడానికి వారు ఎంతో చేయవచ్చు.

అనంగీకారాలతో వ్యవహరించడం

14, 15. కలహాన్ని ఎలా అరికట్టవచ్చు?

14 కొన్నిసార్లు నిజమైన అనంగీకారాలు తప్పకుండా ఏర్పడతాయి. కాని మీ ఇల్లు “కలహముతో కూడి యుండిన ఇంటి”గా దిగజారిపోనవసరం లేదు. (సామెతలు 17:1) పిల్లలు వినగలిగేటప్పుడు సున్నితమైన విషయాలు మాట్లాడకుండా ఉండడానికి జాగ్రత్తపడండి, మీ జత భావాల యెడల శ్రద్ధచూపించండి. తన గొడ్రాలితనాన్ని బట్టి రాహేలు బాధపడుతూ తనకు పిల్లలనివ్వమని యాకోబును అడిగినప్పుడు, ఆయన కోపంగా ఇలా స్పందించాడు: “నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా?” (ఆదికాండము 30:1, 2) గృహసంబంధ సమస్యలు తలెత్తినప్పుడు, సమస్యపై దాడి చేయండి కాని వ్యక్తిపై కాదు. ఒక వ్యక్తిగత చర్చ సమయంలో, ‘ఆలోచనారహితంగా మాట్లాడటాన్ని’ లేక ఒకరికొకరు అనవసరంగా అంతరాయాన్ని కల్గించుకోవడాన్ని నివారించండి.—సామెతలు 12:18.

15 నిజమే, మీ దృక్పథాన్ని గురించి మీకు బలమైన భావాలు ఉండవచ్చు, కాని వాటిని “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము” వంటివి లేకుండా వ్యక్తపర్చవచ్చు. (ఎఫెసీయులు 4:31) ఒక భర్త ఇలా చెబుతున్నాడు: “మీ సమస్యలను సాధారణ స్వరంతో చర్చించండి, చర్చల మధ్యలో ఒకరి స్వరం పెచ్చుపెరిగిపోతే, చర్చను ఆపండి. కొంతసేపటి తర్వాత దాన్ని ప్రస్తావించి, మళ్లీ మొదలుపెట్టండి.” సామెతలు 17:14 ఈ మంచి సలహా నిస్తున్నది: “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.” మీరిద్దరూ చల్లబడిన తర్వాత మళ్లీ విషయాల్ని చర్చించడానికి ప్రయత్నించండి.

ఒకరి యెడల ఒకరు నమ్మకంగా ఉండండి

16. జారత్వం ఎందుకంత గంభీరమైన విషయము?

16 హెబ్రీయులు 13:4 ఇలా తెలియజేస్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” జారత్వం దేవుని యెదుట పాపము. అది వివాహాన్ని నాశనం చేస్తుంది. (ఆదికాండము 39:9) ఒక వివాహ సలహాదారిణి ఇలా వ్రాస్తున్నది: “జారత్వం ఒకసారి బయటపడ్డ తర్వాత, అది ఒక పెద్ద తుఫానులా, గృహాలను నాశనం చేస్తూ, స్వాభిమానం మరియు నమ్మకాన్ని కూలదోస్తూ, పసివాళ్లకు హాని చేస్తూ, మొత్తం కుటుంబాన్ని ముంచేస్తుంది.” అది గర్భధారణకు లేక లైంగికపరంగా వచ్చే వ్యాధికి కూడా దారితీయవచ్చు.

17. జారత్వానికి సంబంధించిన కోరికలను ఎలా నివారించవచ్చు లేక నిరాకరించవచ్చు?

17 పుస్తకాలు, దూరదర్శిని, సినిమాలలో చిత్రీకరింపబడినట్లుగా లోకసంబంధమైన కలుషిత లైంగిక భావాలను జీర్ణించుకొనడం వల్ల, కొంతమంది వ్యభిచార సంబంధమైన కోరికలను పెంచుకుంటారు. (గలతీయులు 6:8) కేవలం లైంగిక సంబంధం యెడలవున్న కోరికవల్ల మాత్రమే కాదుగాని, ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నానని నిరూపించుకోడానికి లేక ఎక్కువగా ప్రేమించబడాలనే కోరికవల్ల వ్యభిచారం చేయడం జరుగుతుందని పరిశోధకులు చెబుతారు. (సామెతలు 7:18 పోల్చండి.) కారణం ఏదైనప్పటికీ, ఒక క్రైస్తవుడు అవినీతికరమైన ఊహలను విసర్జించాలి. మీ జతతో మీ భావాలను యథార్థంగా చర్చించండి. అవసరమైతే, సంఘ పెద్దల నుండి సహాయం కోరండి. అలా చేయడం పాపంలో పడిపోకుండా ఆపవచ్చు. అంతేగాక, వ్యతిరేక లింగ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తిని వివాహం చేసుకొని, మరో వ్యక్తిని మోహంతో చూడటం లేఖనాధార సూత్రాలకు విరుద్ధమైనది. (యోబు 31:1; మత్తయి 5:28) క్రైస్తవులు ప్రాముఖ్యంగా, తోటిపనివారితో భావావేశ సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి జాగ్రత్త కల్గివుండాలి. అలాంటి సంబంధాలను సద్భావంతోనైనా, సక్రమమైన రీతిలో ఉంచుకోండి.

18. తరచూ ఒక వివాహంలో లైంగికపరమైన సమస్యలకు మూలం ఏమిటి, వీటిని ఎలా పరిష్కరించుకోగలము?

18 ఒకరు తన జతతో స్నేహపూరితమైన, స్పష్టమైన సంబంధం కలిగివుండడం కూడా గొప్ప భద్రతగా ఉంటుంది. వివాహంలో లైంగిక సమస్యలు చాలా అరుదుగా శరీరసంబంధమైనవై ఉంటాయి, కాని సాధారణంగా అవి మంచి సంభాషణ లేకపోవడం వల్ల వచ్చిన ఫలితాలై ఉంటాయి. ఒక జంట దాపరికము లేని సంభాషణను కొనసాగిస్తూ, దాంపత్య కర్తవ్యాన్ని ఒక విధిగా కాకుండా ప్రేమను వ్యక్తపర్చేదానిగా నిర్వహిస్తే ఈ విధమైన సమస్యలు తక్కువగా ఉంటాయి.a అలాంటి మంచి పరిస్థితులలో, వివాహ బంధాన్ని బలపర్చడానికి సన్నిహిత సంబంధాలు తోడ్పడతాయి.—1 కొరింథీయులు 7:2-5; 10:24.

19. “పరిపూర్ణతకు అనుబంధమైన”ది ఏమిటి, అది వివాహంపై ఏ ప్రభావాన్ని చూపగలదు?

19 క్రైస్తవ సంఘంలో ప్రేమయే “పరిపూర్ణతకు అనుబంధమైన”ది. ప్రేమను అలవర్చుకోవడం ద్వారా దైవభక్తిగల ఒక వివాహపు జంట ‘ఒకరి నొకరు సహించుచు ఒకరి నొకరు క్షమించుకో’ గలుగుతారు. (కొలొస్సయులు 3:13, 14) సూత్రబద్ధమైన ప్రేమ ఇతరుల క్షేమాన్ని కోరుతుంది. (1 కొరింథీయులు 13:4-8) అలాంటి ప్రేమను వృద్ధిచేసుకోండి. అది మీ వివాహ బంధాన్ని పటిష్ఠపర్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. మీ వివాహ జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోండి. మీరు అలా చేస్తే, మీ వివాహం చిరకాల బంధంగా నిరూపించబడి, యెహోవా దేవునికి స్తుతిని, గౌరవాన్ని తెస్తుంది.

[అధస్సూచీలు]

a ఆగస్టు 1, 1993 కావలికోటలోని “సంభాషణ అంటే కేవలం మాట్లాడుకోవడమే కాదు” అనే శీర్షికలో ఈ విషయంలో జంటలు ఎలా సమస్యలను అధిగమించవచ్చో చూపబడింది.

మీరెలా సమాధానమిస్తారు?

◻ వివాహం ఎందుకు చిరకాలం నిలిచే బంధమై ఉండాలి?

◻ శిరసత్వం మరియు లోబడటం గురించి బైబిలు దృక్పథం ఏమిటి?

◻ వివాహిత దంపతులు సంభాషణను ఎలా వృద్ధి చేసుకోగలరు?

◻ దంపతులు అనంగీకారాలను క్రైస్తవ పద్ధతిలో ఎలా తీర్చుకోగలరు?

◻ వివాహ బంధాన్ని పటిష్ఠపర్చుకోడానికి ఏది సహాయపడుతుంది?

[12వ పేజీలోని చిత్రం]

భార్య లౌకిక ఉద్యోగం చేయవలసి వచ్చినప్పుడు, ఒక క్రైస్తవ భర్త ఆమెకు పనిభారం అధికం కాకుండా చూస్తాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి