కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 11/15 పేజీలు 29-31
  • ఆమె యెహోవా దయాప్రాప్తురాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె యెహోవా దయాప్రాప్తురాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అద్భుతమైన ఆమె ఆధిక్యత
  • ఆమె యోసేపు భార్య అవుతుంది
  • మరియకు యితర పిల్లలున్నారు
  • దేవునికి భయపడే తల్లి
  • యేసు శిష్యురాలిగా మరియ
  • నిత్యాధిక్యతలు
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలిని!’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ‘ఇదిగో! యెహోవా దాసురాలు!’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఆమె తీవ్రమైన వేదనను తట్టుకుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఆమె ‘వాటి గురించి ఆలోచించింది’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 11/15 పేజీలు 29-31

ఆమె యెహోవా దయాప్రాప్తురాలు

“దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడు.” ఎంత చక్కటి శుభ వచనం! అక్కడ మాట్లాడింది ఎవరోకాదు గబ్రియేలు దేవదూతే. హేలీ అనే వ్యక్తి కుమార్తెయైన మరియను, దీన హృదయురాలైన ఓ యౌవనస్థురాలిని ఆయన సంబోధించాడు. అది సా.శ.పూ. 3వ సంవత్సరం, ప్రదేశం నజరేతు పట్టణం.—లూకా 1:26-28.

మరియ, వడ్రంగి వాడైన యోసేపుకు ప్రధానం చేయబడింది. యూదా చట్టం మరియు ఆచారం ప్రకారం, ఆమె ఆయన భార్యగా ఎంచబడుతుంది. (మత్తయి 1:18) ఆమెలాగే అతను కూడా సామాజిక హోదాలో తక్కువవాడే. మరి దేవదూత ఆమెను దయాప్రాప్తురాలని ఎందుకు సంబోధించాడు?

అద్భుతమైన ఆమె ఆధిక్యత

గబ్రియేలు యింకా యిలా కూడా చెప్పాడు: “మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.”—లూకా 1:29-33.

ఆశ్చర్యంతోనూ విభ్రాంతితోనూ మరియ యిలా ప్రశ్నిస్తుంది: “నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగును.” గబ్రియేలు యిలా జవాబిస్తాడు: “పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” ఎలాంటి సందేహాలనైనా తీసివేసేందుకు ఆ దూత యింకా యిలా చెబుతాడు: “నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము; దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు.”—లూకా 1:34-37.

వెంటనే మరియ ఈ అద్భుతమైన సేవాధికత్యను అంగీకరిస్తుంది. ఇష్టపూర్వకంగా, అయితే సాత్వికంతో ఆమె యిలా ప్రత్యుత్తరమిస్తుంది: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” వెంటనే గబ్రియేలు వెళ్లిపోతాడు. యూదా పర్వత ప్రాంతంలోని పట్టణంలోకి మరియ త్వరగా వెళుతుంది. జెకర్యా, ఆయన భార్యయైన ఎలీసబెతుల యింటి వద్దకు చేరుకున్నప్పుడు, దూత వివరించిన పరిస్థితులనే ఆమె అక్కడ కనుగొంటుంది. మరియ హృదయం ఎంత ఆనందంతో నిండిపోతుందో! ఆమె యెహోవాను స్తుతించే మాటలను ఆమె పెదవులు మెండుగా పలికాయి.—లూకా 1:38-55

ఆమె యోసేపు భార్య అవుతుంది

ఒక కన్యక యేసు మానవ శరీరాన్ని అందించాలి, ఎందుకంటే అలాంటి పుట్టుకను గూర్చి ప్రవచించడం జరిగింది. (యెషయా 7:14; మత్తయి 1:22, 23) అయితే ప్రధానం చేయబడిన కన్యకే ఎందుకు అవసరమైంది? ఆ పిల్లవాడు రాజైన దావీదు సింహాసనాన్ని అధిష్టించేందుకు న్యాయ సమ్మతమైన హక్కునిచ్చే తండ్రి నివ్వడానికే. యోసేపు, మరియ యిద్దరూ యూదా గోత్రానికి చెందినవారు, రాజైన దావీదు వంశస్థులు. కనుక యేసు రాజ్య హక్కులు మరింత దృఢంగా స్థాపించబడతాయి. (మత్తయి 1:2-16; లూకా 3:23-33) అందుకనే, మరియ గర్భవతైనప్పటికీ ఆమెను తన ధర్మ పత్నిగా చేసుకునేందుకు వెనుకాడవద్దని దూత తర్వాత యోసేపుకు అభయాన్నిస్తాడు.—మత్తయి 1:19-25.a

అగస్టస్‌ కైసరు పన్నుకట్టాలని జారీ చేసిన ఉత్తరువు, యోసేపు మరియ బేత్లెహేముకు వెళ్లి నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తుంది. అయితే అక్కడ, ఆమె తన మొదటి కుమారునికి జన్మనిస్తుంది. కాపరులు ఆ పసిబిడ్డను చూసేందుకు వస్తారు, అంతేకాకుండ తమ తండ్రియైన యెహోవాకు వారు స్తుతులను చెల్లిస్తారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం 40 రోజుల రక్త శుద్ధీకరణ దినము తర్వాత తన పాప పరిహారార్థ బలిని అర్పించేందుకు మరియ యెరూషలేము ఆలయానికి వెళ్తుంది. (లేవీయకాండము 12:1-8; లూకా 2:22-24) అవును, ఆమె పాపరహితురాలిగా జన్మించలేదు గనుక పాపపు మచ్చనుండి స్వతంత్రురాలు కాదు, ఆమె సహజ అసంపూర్ణతలు బలుల ద్వారా పరిహరింపబడాల్సిన అవసరముంది.—కీర్తన 51:5.

మరియ యోసేపులు ఆలయం వద్ద ఉన్నప్పుడు, వృద్ధుడైన సుమెయోను మరియు వృద్ధ ప్రవక్త్రినియైన అన్న, దేవుని కుమారుని చూసే ఆధిక్యతను పొందుతారు. మరియ ముఖ్యావధానాన్ని పొందలేదు. (లూకా 2:25-38) ఆ తర్వాత, జ్ఞానులు యేసుకు సాగిలపడతారు గానీ ఆమెకు కాదు.—మత్తయి 2:1-12.

ఐగుప్తునకు పారిపోయి దుష్టుడైన హేరోదు మరణించేంతవరకూ అక్కడ ఉండి, యేసు తలిదండ్రులు తిరిగి వచ్చి, నజరేతు అనే ఒక చిన్న గ్రామంలో నివసించడం ప్రారంభిస్తారు. (మత్తయి 2:13-23; లూకా 2:39) అక్కడ దైవికమైన కుటుంబ పరిస్థితుల్లో యోసేపు మరియలు యేసును పెంచారు.

మరియకు యితర పిల్లలున్నారు

ఈ మధ్య కాలంలో, మరియ యోసేపులు యేసుకు స్వంత సోదర సోదరీలను అందిస్తారు. తన స్వగ్రామమైన నజరేతుకు యేసు పరిచర్య కొరకు వచ్చినప్పుడు, చిన్నతనంలో తనను ఎరిగి ఉన్నవారు ఆయన్ను గుర్తిస్తారు. “ఇతడు వడ్లవాని కుమారుడుకాడా?” అని వారు ప్రశ్నిస్తారు. “ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యుదాయనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే యున్నారు కారా?” (మత్తయి 13:55, 56) యేసుక్రీస్తు తోబుట్టువులైన సోదర సోదరీమణులని నజరేయులు ఎరిగిన ఆమె కుమారులు కుమార్తెలతోపాటు, యోసేపు మరియల కుటుంబాన్ని వారు సూచిస్తున్నారు.

ఈ సోదర సోదరీమణులు యేసు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కారు. వారు ఆయన శిష్యులూ కాదు, లేక ఆత్మీయ సహోదర సహోదరీలూ కాదు, ఎందుకంటే యోహాను 2:12 యిలా పేర్కొంటూ ఈ రెండు గుంపుల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూపుతోంది: “ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లిరి.” యెరూషలేములో సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు కేఫాను, లేక పేతురును చూసి యిలా అన్నాడు: “ఇతర అపొస్తలులనెవరినీ నేను చూడలేదు: ప్రభువు సోదరుడైన యాకోబును మాత్రమే చూశాను.” (గలతీయులు 1:19, ది జెరూషలేమ్‌ బైబిల్‌) అంతేకాకుండ, యోసేపు, “ఆమె [మరియ] కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను” అనే వాక్యం, యేసును పెంచిన తండ్రి ఆ తర్వాత ఆమెతో సంబంధాలను కల్గివుండి, ఆమె యితర పిల్లలకు తండ్రి అయ్యాడని సూచిస్తోంది. (మత్తయి 1:25) అందుకనే లూకా 2:7, యేసు ఆమెకు “తొలిచూలు కుమారుడని” పిలుస్తుంది.

దేవునికి భయపడే తల్లి

దేవునికి భయపడే తల్లిగా తన పిల్లలను నీతి యందు ఉపదేశించడంలో మరియ యోసేపుతో సహకరించింది. (సామెతలు 22:6) ఆమె లేఖనాలను పట్టుదలతో పఠించిందన్న విషయం, ఎలీసబెతు తనకు శుభవచనం పలికినప్పుడు ఆమె వ్యక్తపర్చిన ఆత్మీయతతో నిండిన మాటల ద్వారా వ్యక్తమౌతోంది. ఆ సమయంలో యేసు తల్లి హన్నా పాటలోని భావాన్ని వల్లిస్తుంది, అంతేకాకుండ కీర్తనలు, చరిత్ర, ప్రవచనార్థక రాతలూ మోషే రాసిన పుస్తకాలు వంటి వాటిలో తనకున్న జ్ఞానాన్ని వ్యక్తపరుస్తుంది. (ఆదికాండము 30:13; 1 సమూయేలు 2:1-10; సామెతలు 31:28: మలాకీ 3:12; లూకా 1:46-55) మరియ, ప్రవచనార్థక సంఘటనలనూ మాటలనూ కంఠోపాఠం చేసింది, తన హృదయంలో వాటిని దాచుకుంది, తన మనస్సులో వాటిని ధ్యానించుకుంది. కాబట్టి పిల్లవానిగా ఉన్న యేసుకు తలిదండ్రులందించే బోధలో భాగం వహించేందుకు ఆమె పూర్తిగా సంసిద్ధురాలైంది.—లూకా 2:19, 33.

బాగా నేర్పించబడిన 12 సంవత్సరాల యేసు, ఆలయంలోని జ్ఞానులను ఆశ్చర్యపర్చేంత లేఖనాల జ్ఞానాన్ని కనపరుస్తాడు. పస్కా సమయంలో తన తలిదండ్రుల దగ్గిరనుండి విడిపోయినందుకు తన తల్లి యిలా అంటుంది: “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి.” దానికి యేసు యిలా ప్రత్యుత్తరమిస్తాడు: “మీరేల నన్ను వెదకు చుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” ఈ జవాబుకున్న విశిష్టతను గ్రహించలేని మరియ వాటిని తన హృదయంలో భద్రపర్చుకుంటుంది. నజరేతుకు తిరిగివచ్చి, యేసు “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థి”ల్లుతూ ఉన్నాడు.—లూకా 2:42-52.

యేసు శిష్యురాలిగా మరియ

మరియ చివరికి యేసు సమర్పిత శిష్యురాలవ్వడం ఎంత సమంజసంగా ఉంది! ఆమె సాత్వికురాలు, దేవుడిచ్చిన అపూర్వమైన నియామకం ఆమెకు ఉన్నప్పటికీ నలుగురిలో గొప్పదాన్ని కావాలనే కోరిక ఆమెకు లేదు. మరియకు లేఖనాలు తెలుసు. దాన్ని మీరే పరిశీలిస్తే, ఆమె పరివేషంతో గానీ, “తల్లిగా, రాణి”గా సింహాసనంపై కూర్చునట్లుగానీ, క్రీస్తు మహిమలో నిండి ఉన్నట్లు గానీ ఎక్కడా వర్ణించబడలేనట్లు మీరు చూస్తారు. బదులుగా, ఆవిడ నలుగురికీ కనిపించే చోట కాకుండ, ఎక్కడో దూరాన కనిపిస్తుంది.—మత్తయి 13:53-56; యోహాను 2:12.

యేసు తన అనుచరుల మధ్య అన్ని విధాల మరియ ఆరాధన వంటి దాన్ని మొగ్గలోనే తుంచివేశాడు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతుండగా, “గుంపులోనుండి ఒక స్త్రీ యిలా అరిచింది, ‘నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవి! ‘బదులుగా’ ఆయన యిలా జవాబిచ్చాడు, ‘దేవునివాక్యము విని దాని గైకొనువాడు ధన్యుడు.’” (లూకా 11:27, 28, కాథోలిక్‌ బిబ్లికల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా వారు అనువదించిన ది న్యూ అమెరికన్‌ బైబిల్‌) ఒక వివాహం విందు వద్ద యేసు మరియతో యిలా చెప్పాడు: “అమ్మా, నాతో నీకేమి (పని)?” (యోహాను 2:4) ఇతర అనువాదాలు యిలా అంటున్నాయి: “ఆ విషయాన్ని నాకు వదిలేయి.” (వెయిమౌత్‌) “నాకు నేర్పించడానికి ప్రయత్నించవద్దు.” (ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌) అవును, యేసు తన తల్లిని గౌరవించాడు, అయితే ఆమెను ఆరాధించలేదు.

నిత్యాధిక్యతలు

మరియ ఎంతటి ఆధిక్యతలను అనుభవించింది! ఆమె యేసుకు జన్మనిచ్చింది. తర్వాత ఆమె తన చిన్న పిల్లవానికి తల్లిగా ఉండి, శిక్షణనిచ్చింది. చివరికి, క్రీస్తు శిష్యురాలుగాను, ఆత్మీయ సహోదరిగాను ఉండి ఆమె విశ్వాసాన్ని ప్రదిర్శించింది. మనం లేఖనాల్లో చివరిసారిగా చూస్తే, యెరూషలేము నందు మేడ గదిలో మరియ కనిపిస్తుంది. ఆమె యేసు అపొస్తలులతో తన యితర కుమారులతో, కొందరు నమ్మకమైన స్త్రీలతో ఉంది. వారందరూ యెహోవా ఆరాధికులే.—అపొస్తలుల కార్యములు 1:13, 14.

కొద్దికాలానికి, మరియ చనిపోయింది, ఆమె శరీరం తిరిగి మట్టి అయిపోయింది. తన ప్రియ కుమారుని తొలి అనుచరుల్లా, ఆత్మీయ ప్రాణిగా పరలోకంలో అమర్త్యమైన జీవితానికి దేవుడు తగిన కాలంలో పునరుత్థానం చేసేంతవరకు ఆమె మరణమందు నిద్రించింది. (1 కొరింథీయులు 15:44, 50; 2 తిమోతి 4:8) ఈ “దయాప్రాప్తురాలు” యెహోవా మరియు యేసుక్రీస్తు సన్నిధిలో యిప్పుడు ఎంత ఆనందంగా ఉందో!

[అధస్సూచీలు]

a మరియ కన్యక కాకపోతే, ఆమెను వివాహం చేసుకోవాలని ఎవరనుకుంటారు? అమ్మాయి కన్యకై ఉండాలనే విషయంపై యూదులకు గట్టి పట్టుదల ఉండేది.—ద్వితీయోపదేశకాండము 22:13-19; ఆదికాండము 38:24-26 పోల్చండి.

[31వ పేజీలోని చిత్రం]

యేసు తల్లిగా మరియ దయాప్రాప్తురాలయ్యింది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి