మీరు యేసుకు ప్రార్థన చేయాలా?
యేసుకు ప్రార్థించడం సమంజసమేనని కొందరు ప్రజలు పరిగణిస్తున్నారు. జర్మనీలో, భోజనం చేసే ముందు చేతులు జోడించి యేసుకు కృతజ్ఞతలు చెల్లించాలని అనేకమంది తమ చిన్నతనంలో నేర్చుకున్నారు.
బైబిలు ప్రకారం, యేసు నిజంగా పరలోకంలో చాలా ఉన్నతమైన స్థానాన్ని కల్గివున్నాడు. అయితే, మనం ఆయనకు ప్రార్థించాలని దాని భావమా? యేసు యెడల ప్రేమతో ఆయనకు ప్రార్థించేవారిలో మీరూ ఒకరు కావచ్చు, అయితే అలాంటి ప్రార్థనలను గూర్చి యేసు తానుగా ఏమని భావిస్తాడు?
మొదట, అసలు ఈ ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమౌతాయి? ఎందుకంటే యెహోవా దేవుడు, “ప్రార్థన ఆలకించువాడు” అని బైబిలు అంటోంది. కనుక, ప్రాచీన కాలంలోని దేవుని సేవకులైన ఇశ్రాయేలీయుల వంటి వారు, కేవలం సర్వోన్నతుడైన యెహోవా దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలని తెలుసుకోవడం ఎంతమాత్రమూ ఆశ్చర్యకరం కాదు.—కీర్తన 5:1, 2; 65:2.
మానవులను పాప మరణముల నుండి విమోచించేందుకు దేవుని కుమారుడైన యేసు భూమ్మీదికి వచ్చినప్పుడు విషయాలు మారిపోయాయా? లేదు, అప్పుడు కూడా యెహోవాకే ప్రార్థించేవారు. భూమ్మీదున్నప్పుడు యేసు తానే స్వయంగా తన పరలోకపు తండ్రికి తరచూ ప్రార్థించాడు, అంతేకాకుండ యితరులు కూడా అలాగే చేయాలని నేర్పించాడు. ప్రపంచమంతటిలో పేరెన్నికగన్న ప్రార్థనల్లో ఒకటైన ప్రభువు ప్రార్థన లేక నా తండ్రి అని కొన్నిసార్లు పిలువబడే మాదిరి ప్రార్థనను గూర్చి ఒక్కసారి ఆలోచించండి. యేసు తనకు ప్రార్థించమని మనకు నేర్పలేదు; ఆయన మనకు ఈ మాదిరినుంచాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపర్చబడు గాక.”—మత్తయి 6:6, 9; 26:39, 42.
ప్రార్థన అంటే ఏమిటన్న విషయాన్ని మనం బాగా పరిశీలించడం ద్వారా మనం ఈ విషయాన్ని మరి విశదంగా చూద్దాము.
ప్రార్థన అంటే ఏమిటి?
ప్రతి ప్రార్థన ఒక విధమైన ఆరాధనే. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఈ విషయాన్ని యిలా అంటూ రూఢిపరుస్తుంది: “ప్రార్థన అంటే, ఒక వ్యక్తి దేవునికి భక్తిని, కృతజ్ఞతలనూ దోషాలను విన్నవించుకోవడం లేక యాచనలను అందించడమే.”
ఒక సందర్భంలో యేసు యిలా చెప్పాడు: ‘నీ దేవుడైన ప్రభువునకు మ్రోక్కి ఆయనను మాత్రము సేవింపవలెను—అని వ్రాయబడియున్నది.’ అంటే యెహోవాను మాత్రమే ఆరాధించి అలాగే ఆయనకే ప్రార్థించాలి అనే మూల సత్యాలకు యేసు హత్తుకుని ఉన్నాడు.—లూకా 4:8; 6:12.
మన ప్రార్థనలో యేసును అంగీకరించడం
మానవుల కొరకు విమోచన క్రయధన బలిగా యేసు మరణించాడు, దేవుడు ఆయనను పునరుత్థానం చేశాడు మరి ఆయన ఉన్నత స్థానానికి హెచ్చింపబడ్డాడు. మీరు ఊహించుకోగల్గినట్లుగా, యివన్నీ కూడా అంగీకృతమైన ప్రార్థనల విషయంలో మార్పును తప్పకుండా తెచ్చాయి. ఏ విధంగా?
అపొస్తలుడైన పౌలు, యేసు స్థానం ప్రార్థనపై చూపించే గొప్ప ప్రభావాన్ని ఈ విధంగా వివరించాడు: “పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.”—ఫిలిప్పీయులు 2:9-11.
“ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లు” అనే మాటలు మనం ఆయనకు ప్రార్థించాలనే అర్థాన్నిస్తున్నాయా? లేదు. అక్కడ ఉన్న గ్రీకు పదం “ఏ నామము క్రిందైతే తమ మోకాళ్లను వంచి ఐక్యమౌతారో ఆ నామాన్ని సూచిస్తోంది, దాని ఆధారంగా అందరూ ఐక్యంగా (πᾶν γόνυ) ఆరాధిస్తారు. యేసు పొందిన నామము మనమందరమూ ఆయనను ఐక్యతతో ఆరాధించేందుకు సహాయపడుతుంది.” (జి. బి. వైన్నర్ రాసిన ఎ గ్రామర్ ఆఫ్ ది ఇడియమ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్) వాస్తవానికి, ప్రార్థన అంగీకరించబడేందుకు దాన్ని “యేసునామమున” చేయడం అవసరము, అయితే, అది యెహోవా దేవునికే చేయబడుతుంది అంతేకాక అది ఆయన నామాన్ని ఘనపర్చేందుకు పనిచేస్తుంది. ఈ కారణంగా పౌలు యిలా అన్నాడు: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.”—ఫిలిప్పీయులు 4:6.
ఒక మార్గము ఒక గమ్యానికి ఎలా నడిపిస్తుందో అదే విధంగా యేసు సర్వోన్నతుడైన దేవునికి నడిపించే “మార్గము.” “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని యేసు తన అపొస్తలులకు నేర్పించాడు. (యోహాను 14:6) కాబట్టి, మన ప్రార్థనలను యేసు ద్వారా దేవునికే చేయాలి గానీ యేసుకే నేరుగా చేయకూడదు.a
‘అయితే, శిష్యుడైన స్తెఫను, అపొస్తలుడైన యోహాను పరలోకములోనున్న యేసుతో మాట్లాడారని బైబిలు నివేదిస్తోంది కదా’ అని కొందరు ప్రశ్నించవచ్చు. అది నిజమే. అయితే, ఈ సంఘటనల్లో ప్రార్థనలు లేవు, ఎందుకంటే స్తెఫనూ యోహాను యేసును దర్శనములో చూసి ఆయనతో నేరుగా మాట్లాడారు. (అపొస్తలుల కార్యములు 7:56, 59; ప్రకటన 1:17-19; 22:20) మామూలుగా దేవునితో మాట్లాడడమంటేనే ప్రార్థించడం కాదని జ్ఞాపకముంచుకోండి. ఆదాము హవ్వలు ఏదేను తోటలో పాపము చేసిన తర్వాత దేవుడు వారికి తీర్పు తీర్చినప్పుడు, తమ ఘోరమైన పాపం విషయంలో సాకులను చెబుతూ వారు ఆయనతో మాట్లాడారు. వారు అలా ఆయనతో మాట్లాడడం ప్రార్థించడం కాదు. (ఆదికాండము 3:8-19) కాబట్టి, స్తెఫను లేక యెహాను యేసుతో మాట్లాడడం, మనం నిజంగా ఆయనకు ప్రార్థించాలనేందుకు రుజువుగా సూచించడం తప్పవుతుంది.
యేసు నామములో ఎలా ‘విన్నవించబడుతుంది?’
యేసుకు ప్రార్థించడం సముచితమని పరిగణించే సందేహాలు యింకా మీ మనస్సులో ఉన్నాయా? ఒక స్త్రీ, వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి యిలా రాసింది: “విషాదకరంగా తొలి క్రైస్తవులు యేసుకు ప్రార్థించలేదని నేనింకా నమ్మలేకుండా ఉన్నాను.” ఆమె మనస్సులో 1 కొరింథీయులు 1:2, నందున్న పౌలు మాటలున్నాయి, ‘మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో విన్నవించువారందరికీ” అని ఆయన అక్కడ ప్రస్తావించాడు. అయితే, అసలు భాషలో “విన్నవించు” అంటే, ప్రార్థనకాని వేరే విషయాలు కూడా అయ్యుండవచ్చునని మనం గమనించాలి.
క్రీస్తు నామమున ప్రతిచోటా ఎలా ‘విన్నవించబడేది?’ నజరేతులోని యేసు అనుచరులు మెస్సీయా అని, ఆయన నామములో అనేకమైన అద్భుతకార్యాలను చేసిన ‘లోక రక్షకుడని’ బహిరంగంగా ఒప్పుకున్నారు. (1 యోహాను 4:14; అపొస్తలుల కార్యములు 3:6; 19:5) కనుక, ఇంటర్‌ప్రిటర్స్ బైబిల్, “మన ప్రభువు నామమున విన్నవించుట అనే పదబంధం . . . ఆయనను ఆరాధించడం కాదుగానీ ఆయన ప్రభువు అన్న విషయాన్ని అంగీకరించడమే” అని పేర్కొంది.
“మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున విన్నవించడం” అంటే క్రీస్తును అంగీకరించడం పాపక్షమాపణను సాధ్యపర్చేందుకు ఆయన చిందించిన రక్తమందు విశ్వసించడం. (అపొస్తలుల కార్యములు 10:43ను 22:16తో NW పోల్చండి.) అంతేకాకుండ మనం ఆయన ద్వారా దేవునికి ప్రార్థించేటప్పుడెల్లా యేసు నామాన్ని అక్షరార్థంగా పలుకుతాము. కనుక, యేసు నామమందు విన్నవిస్తున్నామని చూపించడంలో, మనం ఆయనకు ప్రార్థించాలని బైబిలు సూచించడంలేదు.—ఎఫెసీయులు 5:20; కొలొస్సయులు 3:17.
యేసు మనకొరకు ఏమి చేయగలడు
యేసు తన శిష్యులకు స్పష్టంగా యిలా వాగ్దానం చేశాడు: “మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును.” అంటే మనం ఆయనకు ప్రార్థించాల్సిన అవసరముందా? లేదు. ఆ విన్నపం యేసు నామములో యెహోవా దేవునికే చేయాలి. (యోహాను 14:13, 14; 15:16) ఆయన కుమారుడైన యేసు తన గొప్ప శక్తిని అధికారాన్ని మన కొరకు ఉపయోగించమని మనం దేవున్ని వేడుకుంటాము.
యేసు నేడు తన నిజమైన అనుచరులతో ఎలా మాట్లాడుతాడు? అభిషక్త క్రైస్తవుల సంఘాన్ని పౌలు వర్ణించిన విధం ఒక ఉపమానంగా పనిచేయగలదు. ఆయన దాన్ని ఒక శరీరంతో మరియు యేసును శిరస్సుతో పోల్చాడు. ఆ “శిరస్సు” ఆత్మీయ శరీరపు సభ్యుల అవసరతలకు “కీళ్లచేతను నరములచేతను” ఆహారమును అందిస్తుంది, అంటే ఆత్మీయ పోషణ మరియు నడిపింపును తన క్రైస్తవ సంఘానికి అందించే మార్గాన్ని ఏర్పాట్లనూ అందిస్తుంది. (కొలొస్సయులు 2:19) అదే విధంగా, నేడు యేసు “మనుష్యుల్లో ఈవులను” లేక ఆత్మీయంగా అర్హతలు గల పురుషులను సంఘంలో నాయకత్వం వహించేందుకు, అవసరమైతే దిద్దుబాటును చేస్తూ ఉపయోగించుకుంటాడు. యేసుతో నేరుగా మాట్లాడే అవకాశంగానీ లేక ప్రార్థించే అవకాశంగాని సంఘంలోని సభ్యులకు లేదు అయితే, వారు నిశ్చయంగా యేసు తండ్రియైన యెహోవా దేవునికి ప్రార్థన చేస్తారు.—ఎఫెసీయులు 4:8-12.
మీరు యేసును ఎలా గౌరవిస్తారు?
మానవుల రక్షణ విషయంలో, యేసు ఎంతటి ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తాడు! అపొస్తలుడైన పేతురు యిలా వాపోయాడు: “ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) యేసు నామానికున్న ప్రాముఖ్యత మీకు తెలుసా?
యేసుకు ప్రార్థించకపోవడం వల్ల మనం ఆయన స్థానాన్ని తగ్గించడంలేదు. బదులుగా, మనం ఆయన నామమందు ప్రార్థించినప్పుడు యేసు గౌరవించబడతాడు. ఎలాగైతే పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి వారిని గౌరవిస్తారో అదే విధంగా యేసు యిచ్చిన ఆజ్ఞలకు విధేయులుగా ఉండడం వల్ల మనం ఆయనను గౌరవిస్తాము, ప్రత్యేకంగా ఒకరినొకరు ప్రేమించమన్న కొత్త ఆజ్ఞకు విధేయులవ్వడం వల్ల మనం అలా చేస్తాము.—యోహాను 5:23; 13:34.
అంగీకృతమైన ప్రార్థనలు
అంగీకృతమైన ప్రార్థనలను చేసేందుకు మీరు యిష్టపడతారా? అప్పుడు వాటిని యెహోవాకు చేయండి, మరి దాన్ని తన కుమారుడైన యేసు నామంలో చేయండి. దేవుని చిత్తమేమిటో తెలుసుకుని, ఆ గ్రహింపును మీ ప్రార్థనలు వ్యక్తపర్చనివ్వండి. (1 యోహాను 3:21, 22; 5:14) కీర్తన 66:20 నందలి మాటల నుండి బలాన్ని పొందండి: “దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.”
మనం ముందు చూసినట్లుగా, ప్రార్థనలనేవి ప్రత్యేకంగా సర్వోన్నతుడైన దేవునికి మాత్రమే చెందిన ఒక ఆరాధనా విధానం. మన ప్రార్థనలను యెహోవాకు చేయడం ద్వారా, “పరలోకమందున్న మా తండ్రీ” అని ప్రార్థించమని యేసు నేర్పిన ప్రార్థనను మనం మన హృదయంలోకి తీసుకున్నామని సూచిస్తాము.—మత్తయి 6:9.
[అధస్సూచీలు]
a యేసు దేవుడని కొందరు నమ్ముతుంటారు గనుక వారు ఆయనకు ప్రార్థిస్తారు. అయితే యేసు దేవుని కుమారుడు, అంతేకాకుండ ఆయన తానే తన తండ్రియైన యెహోవాను ఆరాధించాడు. (యోహాను 20:17) ఈ విషయంపై విస్తృతమైన చర్చ కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషూర్‌ను చూడండి.