పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమయందు ఐక్యమగుట
“ప్రేమయందు అతుకబడినవారై ఉండండి.”—కొలొస్సయులు 2:2 (NW).
1, 2. ప్రాముఖ్యంగా నేడు, ఏ విభాగింపబడే ప్రభావాన్ని కనుగొనవచ్చు?
వినండి! ఒక పెద్ద స్వరం పరలోకమంతటా యిలా ప్రతిధ్వనించింది: ‘భూమీ, సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.’ (ప్రకటన 12:12) ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ వుంటే, భూ నివాసులకు ఆ సమాచారం మరింత అశుభసూచకంగా అవుతున్నది.
2 యెహోవా యొక్క గొప్ప వ్యతిరేకి ఎప్పటి నుండో విరోధి (సాతాను) మరియు అబద్ధికుడు (అపవాది) అని పిలువబడ్డాడు. కాని యిప్పుడు ఈ వంచకుడు మరో మోసపూరితమైన పాత్రను చేపట్టాడు—అతడు ఆగ్రహం గల దేవుడయ్యాడు! ఎందుకు? పరలోకంలో 1914లో ప్రారంభమైన యుద్ధమందు మిఖాయేలు మరియు అతని దూతల చేత అతడు పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. (ప్రకటన 12:7-9) దేవున్ని ఆరాధించడం నుండి మనుష్యులందరిని తాను త్రిప్పివేయగలననే తన సవాలును నిరూపించుకోడానికి తనకు కేవలం కొద్ది సమయం మాత్రమే వుందని అపవాదికి తెలుసు. (యోబు 1:11; 2:4, 5) తప్పించుకునే మార్గం లేక అతడు అతని దయ్యాలు, అల్లకల్లోలమైయున్న మానవజాతిపై తమ ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కాలని ఉగ్రమైన తేనెటీగల గుంపు వలె వున్నారు.—యెషయా 57:20.
3. మన కాలంలో సాతాను నీచత్వం యొక్క ప్రభావం ఏమిటి?
3 మానవ కంటికి కనిపించని యీ సంఘటనలు, సాధారణ నైతికత విషయంలో మానవజాతి యిప్పుడు ఎందుకు అంతగా దిగజారిపోయిందో వివరిస్తాయి. సామరస్యంగా జీవించలేక విడిపోతున్న దేశాలను అస్తవ్యస్తంగా జతపర్చాలని మానవులు చేస్తున్న పిచ్చి ప్రయత్నాలను కూడా అవి వివరిస్తాయి. నిరాశ్రయులుగా, దిక్కులేనివారిగా లక్షలాదిమందిని తయారు చేస్తూ, తెగలు, జాతులు ఒకదానిపై ఒకటి క్రూరంగా దాడిచేసుకుంటున్నాయి. అవినీతి అత్యధికంగా పెరుగుతున్నదంటే దానికి ఆశ్చర్యపోనవసరం లేదు! యేసు ప్రవచించినట్లుగా, ‘అనేకమంది ప్రేమ చల్లారిపోతున్నది.’ ఎక్కడ చూస్తే అక్కడ, అనైక్యత మరియు ప్రేమరాహిత్యం నేటి అల్లకల్లోల మానవ జాతికి గుర్తుగా వున్నాయి.—మత్తయి 24:12.
4. దేవుని ప్రజలు ప్రత్యేకమైన ప్రమాదంలో ఎందుకున్నారు?
4 ప్రపంచ పరిస్థితి దృష్ట్యా, యేసు తన అనుచరుల కొరకు చేసిన ప్రార్థన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది: “నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:15, 16) నేడు, “దుష్టుడు” తన ఆగ్రహాన్ని ప్రాముఖ్యంగా “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న” వారిపై వెళ్లగ్రక్కుతాడు. (ప్రకటన 12:17) యెహోవా పర్యవేక్షణ, ప్రేమపూర్వకమైన శ్రద్ధ లేనట్లయితే ఆయన నమ్మకమైన సాక్షులు నిర్మూలించబడతారు. మన ఆత్మీయ భద్రత మరియు సంక్షేమం కొరకు దేవుడు చేసిన అన్ని ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడంపై మన జీవితాలు ఆధారపడి వుంటాయి. అపొస్తలుడైన పౌలు కొలొస్సయులు 1:29 నందు కోరినట్లుగా, క్రీస్తు ద్వారా పనిచేసే ఆయన శక్తికి అనుగుణంగా వుండడానికి మనం కష్టపడడం కూడా అందులో చేరివుంటుంది.
5, 6. కొలొస్సీలోని క్రైస్తవులను గూర్చి అపొస్తలుడైన పౌలు ఎలా భావించాడు, 1995వ సంవత్సరానికి మూలాంశ లేఖనము ఎందుకు తగినది?
5 కొలొస్సీలోని సహోదరులను పౌలు ఎన్నడూ ముఖాముఖిగా కలవకపోయినప్పటికీ, ఆయన వారిని ప్రేమించాడు. ఆయన వారికిలా చెప్పాడు: “మీ యెడల నేను ఎంత శ్రద్ధ కలిగివున్నానో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను.” (కొలొస్సయులు 2:1, జె. బి. ఫిలిప్స్ వ్రాసిన ది న్యూ టెస్ట్‌మెంట్ ఇన్ మోడ్రన్ యింగ్లీష్) యేసు అనుచరులు లోకసంబంధులు కారు గనుక, “దుష్టుడు” సహోదరుల మధ్య లోకాత్మను విత్తడం ద్వారా వారి ఐక్యతను చెడగొట్టటానికి ప్రయత్నిస్తుంటాడు. కొలొస్సీ నుండి ఎపఫ్రా తెచ్చిన సమాచారం, యిది కొంత మేరకు జరుగుతున్నట్లు సూచించింది.
6 తన క్రైస్తవ సహోదరుల యెడల పౌలు కలిగివున్న ప్రధానమైన శ్రద్ధ ఈ మాటలలో వ్యక్తపర్చబడుతుంది: “ప్రేమయందు అతుకబడినవారై ఉండండి.” అనైక్యత మరియు ప్రేమరాహిత్యంతో నిండివున్న లోకంలో, నేడు ఆయన మాటలకు ప్రత్యేకమైన భావం వుంది. పౌలు ఉపదేశాన్ని మనం పట్టుదలతో అనుసరిస్తే, మనం యెహోవా శ్రద్ధను అనుభవించ గలుగుతాము. లోక ఒత్తిడులను తట్టుకోడానికి సహాయం చేసే ఆయన ఆత్మ శక్తిని కూడా జీవితంలో మనం అనుభవించ గలుగుతాము. ఈ ఉపదేశం ఎంత జ్ఞానవంతమైనది! అందుకే, కొలొస్సయులు 2:2 మనకు 1995వ సంవత్సరానికి, మూలాంశ లేఖనము.
7. నిజ క్రైస్తవుల మధ్యన ఏ ఐక్యత కనుగొనబడాలి?
7 కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో, అపొస్తలుడు మానవ శరీరాన్ని ఒక ఉపమానంగా ఉపయోగించాడు. అభిషక్త క్రైస్తవుల సంఘములో “వివాదము” వుండకూడదు కాని ‘దాని అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించాలని’ ఆయన వ్రాశాడు. (1 కొరింథీయులు 12:12, 24, 25) ఎంత అద్భుతమైన ఉపమానం! మన అవయవములన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ మిగతా శరీరానికి జత చేయబడి వున్నాయి. అభిషక్తులు మరియు పరదైసు భూమిపై జీవించాలని నిరీక్షించే లక్షలాదిమందితో కూడిన మన ప్రపంచ వ్యాప్త సహోదర సహచర్యానికి కూడా అదే వర్తిస్తుంది. మన తోటి క్రైస్తవుల సహవాసం నుండి స్వతంత్రంగా వుండడానికి మనం ఎన్నడూ మనల్ని మనం దూరం చేసుకోకూడదు. మన సహోదరులతో మన సహవాసం వలన దేవుని ఆత్మ క్రీస్తు యేసు ద్వారా పనిచేస్తూ, మనలోకి అత్యధికంగా ప్రవహిస్తుంది.
జ్ఞానంతో సంబంధం కలిగివున్న ఐక్యత
8, 9. (ఎ) సంఘంలో ఐక్యత కొరకు మనం చేయగలిగినది చేయడానికి మూలం ఏమిటి? (బి) క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మీరు ఎలా పొందారు?
8 క్రైస్తవ ఐక్యత జ్ఞానంతో, ప్రాముఖ్యంగా క్రీస్తుకు సంబంధించిన జ్ఞానంతో సంబంధం కలిగివుందన్నది పౌలు యొక్క కీలక అంశాల్లో ఒకటి. క్రైస్తవులు “ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని” పౌలు వ్రాశాడు. (కొలొస్సయులు 2:2) మనము దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించినప్పటి నుండి—వాస్తవాలను—జ్ఞానాన్ని మనం పొందాము. దేవుని సంకల్పములో ఈ వాస్తవాలలోని అనేకం ఎలా యిమడగలవనే గ్రహింపు పొందడంలో భాగంగా, మనం యేసు యొక్క సంక్లిష్టమైన పాత్రను చూస్తాము. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.”—కొలొస్సయులు 2:3.
9 యేసును గూర్చి మరియు దేవుని సంకల్పములో ఆయన పాత్రను గూర్చి మీరు అలాగే భావిస్తారా? యేసును అంగీకరించామని, రక్షించబడ్డామని చెప్పుకుంటూ క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులు వెంటనే మాట్లాడతారు. కాని నిజంగా వారికి ఆయన తెలుసా? తెలియదు, ఎందుకంటే ఎక్కువమంది లేఖనరహితమైన త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ విషయంలో మీకు సత్యం తెలియడమే కాదు, యేసు చెప్పినదాన్ని గూర్చి, చేసినదాన్ని గూర్చి మీరు అధిక జ్ఞానాన్ని కలిగివుంటారు. జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ ఉపదేశాత్మకమైన పఠనం చేయడం ద్వారా లక్షలాదిమంది సహాయాన్ని పొందారు. అయినప్పటికీ, యేసు మరియు ఆయన విధానాలను గూర్చిన జ్ఞానాన్ని మనం అధికం చేసుకుంటూ వుండవలసిన అవసరత వుంది.
10. దాచబడిన జ్ఞానం మనకు ఏవిధంగా లభ్యమౌతుంది?
10 “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు” యేసు నందే “గుప్తములైయున్నవి” అనే వ్యాఖ్యాన భావం అలాంటి జ్ఞానం మన అవగాహనకు మించినదని కాదు. బదులుగా, అది ఒక విధమైన తెరిచివున్న గని వంటిది. ఎక్కడ తవ్వడం ప్రారంభించాలి అని ఆలోచిస్తూ మనం పెద్ద స్థలంలో అన్వేషించనవసరం లేదు. మనకు యిప్పటికే—యేసుక్రీస్తు గురించి బైబిలు తెలియజేసే దాన్ని బట్టి నిజమైన జ్ఞానం ప్రారంభమౌతుందని తెలుసు. యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసు పాత్రను గూర్చి మనం మరింత పూర్తిగా గుణగ్రహిస్తుండగా, మనం నిజమైన వివేచన మరియు కచ్చితమైన జ్ఞానం యొక్క సంపదలను పొందుతాము. కాబట్టి మనం యిప్పటికే తవ్విన మూలం నుండి లభ్యమయ్యే రత్నాలను లేక అమూల్యమైన వస్తువులను తీసుకుంటూ, యింకా లోతుగా తవ్వుతూ వుండవలసిన అవసరం వుంది.—సామెతలు 2:1-5.
11. యేసును గూర్చి ధ్యానించడం ద్వారా మనం ఎలా మన జ్ఞానాన్ని పెంపొందింప జేసుకోవచ్చు? (యేసు శిష్యుల పాదాలు కడగడాన్ని ఉదాహరించండి, లేదా యితర ఉదాహరణలను ఉపయోగించండి.)
11 ఉదాహరణకు, యేసు తన అపొస్తలుల పాదాలను కడిగాడని మనకు తెలిసివుండవచ్చు. (యోహాను 13:1-20) అయితే, ఆయన నేర్పుతున్న పాఠం మరియు ఆయన ప్రదర్శించిన దృక్పథాన్ని గూర్చి ధ్యానించామా? అలా చేయడం ద్వారా, ఎంతో కాలం నుండి మనకు చిరాకు కల్గించిన సహోదరుడు లేక సహోదరి యొక్క వ్యక్తిత్వంతో వ్యవహరించడాన్ని సరిచేసుకోడానికి మనకు సహాయం చేసే—అవును, పురికొల్పే—వివేచనా సంపదను మనం వెలికి తీసుకోగలము. లేక యోహాను 13:14, 15 యొక్క పూర్తి అర్ధాన్ని మనం గ్రహించినప్పుడు, మనకు అంతగా యిష్టంలేని పని మనకు అప్పగించబడితే మనం వేరుగా ప్రతిస్పందించవచ్చు. జ్ఞానం మరియు వివేచన మనల్ని అలా ప్రభావితం చేస్తాయి. క్రీస్తును గూర్చి పెంపొందింప చేసుకున్న జ్ఞానాన్ని మనం అతిసన్నిహితంగా అనుసరించినప్పుడు, యితరులపై అది ఏ ప్రభావాన్ని చూపగలదు? బహుశా మంద ‘ప్రేమ యందు మరింతగా అతుకబడవచ్చు.’a
అవరోధం ఐక్యతను పాడుచేయగలదు
12. ఏ జ్ఞానాన్ని గూర్చి మనం అప్రమత్తంగా వుండాలి?
12 మనం ‘ప్రేమ యందు అతుకబడి వుండడానికి’ మన కచ్చితమైన జ్ఞానం మనకు అవకాశం యిచ్చినట్లయితే, “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన” దాని నుండి ఏ ఫలితం రాగలదు? పూర్తి విరుద్ధమైనది—వివాదం, కలత, విశ్వాసం నుండి వైదొలగుట. గనుక పౌలు తిమోతిని హెచ్చరించినట్లుగా, మనం అలాంటి అబద్ధ జ్ఞానం గురించి జాగ్రత్త కలిగివుండాలి. (1 తిమోతి 6:20, 21) పౌలు యిలా కూడా వ్రాశాడు: “ఎవడైనను అనునయపూరిత తర్కాలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:4, 8 (NW).
13, 14. (ఎ) జ్ఞానానికి సంబంధించి కొలొస్సీలోని సహోదరులు ఎందుకు ప్రమాదంలో వున్నారు? (బి) ఈనాడు తాము అలాంటి ప్రమాదంలో లేమని కొందరు ఎందుకు భావించవచ్చు?
13 కొలొస్సీలోని క్రైస్తవులు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన దాని మోసపూరితమైన ప్రభావంచే చుట్టుముట్టబడి వున్నారు. కొలొస్సీ చుట్టుపట్లవున్న అనేకమంది ప్రజలు గ్రీకు వేదాంతాలను ఉన్నతంగా భావించేవారు. మోషే ధర్మశాస్త్రంలోని పండుగ దినాలు, ఆహార ఆవశ్యకతలు వంటివాటిని క్రైస్తవులు అనుసరించాలని చెప్పే జుడేజర్స్ (యూదుల ఆచారాలను అనుసరించే వారు) కూడా వుండేవారు. (కొలొస్సయులు 2:11, 16, 17) తన సహోదరులు నిజమైన జ్ఞానాన్ని పొందడాన్ని పౌలు వ్యతిరేకించడంలేదు కాని, జీవితం మరియు చర్యలపై కేవలమొక మానవ దృక్కోణాన్ని పొందడానికి వారిని ఒప్పింపజేసే అనునయపూరిత తర్కాలను ఉపయోగిస్తూ, ఎవరూ వారిని ఎరగా కొనిపోకుండా వారు జాగ్రత్తపడడం అవసరం. సంఘంలో ఎవరైనా జీవితాన్ని గూర్చిన అలాంటి లేఖనరహితమైన సిద్ధాంతాలు, బోధలచే తమ ఆలోచనా విధానాన్ని, నిర్ణయాలను నడిపించబడనిస్తే, అది సంఘంలోని సభ్యుల మధ్య ఐక్యత మరియు ప్రేమ దెబ్బతినేలా చేయగలదని మీరు గ్రహించుకోవచ్చు.
14 ‘అవును’ మీరిలా ఆలోచించవచ్చు, ‘కొలొస్సయులు ఎదుర్కొన్న ప్రమాదం నాకు తెలుసు, కాని అమర్త్యమైన ఆత్మ లేక త్రిత్వ దేవుడు వంటి గ్రీకు బోధలతో ప్రభావితం చెందే ప్రమాదంలో నేను పడను; నేను తప్పించుకుని వచ్చిన అబద్ధ మతం యొక్క అన్యమత సెలవుదినాలచే నేను మోసగించబడే ప్రమాదం వుందని కూడా నేను భావించడంలేదు.’ చాలా మంచిది. లేఖనాల ద్వారా లభ్యమయ్యే, యేసు ద్వారా వ్యక్తపర్చబడిన ప్రాథమిక సత్యం యొక్క ఉన్నతత్వాన్ని గూర్చి దృఢంగా తీర్మానించుకొని వుండడం మంచిదే. అయితే, నేడు వ్యాప్తిలోవున్న యితర వేదాంతాల ద్వారా లేక మానవ దృక్పథాల ద్వారా మనం ప్రమాదంలో పడే అవకాశం వుందా?
15, 16. జీవితాన్ని గూర్చిన ఏ దృక్పథం ఒక క్రైస్తవుని ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయగలదు?
15 ఎప్పటి నుండో అలాంటి ఒక దృక్పథం ఉనికిలో వుంది: “ఆయన వస్తానని చేసిన వాగ్దానం యిప్పుడు ఏమయ్యింది? మన పితరులు మరణించారు, కాని అంతా కచ్చితంగా మునుపున్నట్లుగానే కొనసాగుతున్నది.” (2 పేతురు 3:4, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) ఆ అభిప్రాయం వేరే మాటల్లో వ్యక్తపర్చబడవచ్చు, కాని దృక్పథం మాత్రం ఒకటే. ఉదాహరణకు, కొందరిలా తర్కించవచ్చు, ‘దశాబ్దాల క్రితం నేను మొదట సత్యం నేర్చుకున్నప్పుడు, అంతం “అతి సమీపంలో” ఉన్నది. కాని యిప్పటికి యింకా అది రాలేదు, అదెప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?’ నిజమే, అంతం ఎప్పుడొస్తుందో ఏ మానవునికి తెలియదు. అయినా, యేసు కలిగివుండమని కోరిన దృక్పథాన్ని గమనించండి: “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.”—మార్కు 13:32, 33.
16 అంతం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు గనుక మనం పూర్ణానుభవంతో నిండిన “సాధారణమైన” జీవితం గురించి పథకం వేసుకుని ఉండాలనే దృక్పథాన్ని కలిగివుండడం ఎంత ప్రమాదకరం కాగలదు! అలాంటి దృక్పథం యీ విధమైన తర్కంలో ప్రతిబింబించవచ్చు ‘నేను (లేక నా పిల్లలు) సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి సహాయపడే మంచి జీతం వచ్చే, గౌరవప్రదమైన వృత్తిని కలిగివుండడానికి నేను చర్యలు గైకొనడం తగినదే. అయినా, నేను క్రైస్తవ కూటాలకు హాజరౌతాను, ప్రకటన పనిలో భాగం వహిస్తాను, కాని నేను యింకా ఎక్కువ శ్రమపడడం లేక గొప్ప త్యాగాలు చేయడం అంత కారణసహితం కాదు.’—మత్తయి 24:38-42.
17, 18. మనం ఏ దృక్పథాన్ని కలిగివుండాలని యేసు మరియు అపొస్తలులు కోరారు?
17 అయితే, సువార్త ప్రకటించబడడానికి, మనం ఎక్కువగా కష్టపడడం, త్యాగాలు చేయడానికి సుముఖత కలిగివుండడం వంటివాటి గురించి అత్యవసర భావంలో జీవించమని యేసు మరియు అతని అపొస్తలులు చెప్పిన దాన్ని నిరాకరించలేము. పౌలు యిలా వ్రాశాడు: “సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును . . . కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.”—1 కొరింథీయులు 7:29-31; లూకా 13:23, 24; ఫిలిప్పీయులు 3:13-15; కొలొస్సయులు 1:29; 1 తిమోతి 4:10; 2 తిమోతి 2:4; ప్రకటన 22:20.
18 సౌకర్యవంతమైన జీవితాన్ని మన గమ్యంగా చేసుకోమని చెప్పడానికి బదులు, పౌలు ప్రేరేపింపబడినవాడై యిలా వ్రాశాడు: “మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. . . . విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.”—1 తిమోతి 6:7-12.
19. సంఘంలోని వారు జీవితాన్ని గూర్చి యేసు ప్రోత్సహించిన దృక్పథాన్ని అంగీకరించి నట్లయితే, సంఘం ఎలా ప్రభావితమౌతుంది?
19 ‘మంచి ఒప్పుకోలు ఒప్పుకొనుటకు’ తీవ్రంగా కష్టపడే ఆసక్తిగల క్రైస్తవులు సంఘంలో ఉన్నప్పుడు, సహజంగానే ఐక్యత వుంటుంది. ‘నీకు చాలా సంవత్సరాల కొరకు ఎన్నో మంచి సంపదలు వున్నాయి; సుఖంగా వుండి, తిని, త్రాగి, ఆనందంగా వుండు’ అనే దృక్పథానికి వారు తావివ్వరు. (లూకా 12:19) బదులుగా వారు, తిరిగి పునరావృతం గావించబడని పనిలో సాధ్యమైనంత పూర్తిగా భాగం వహించడానికి త్యాగాలు చేసే యిష్టత కలిగివుండి, ఒకే ప్రయత్నంలో ఐక్యమైవున్నారు.—ఫిలిప్పీయులు 1:27, 28 పోల్చండి.
అనునయపూరిత తర్కాల గురించి జాగ్రతగా వుండండి
20. క్రైస్తవులు తప్పుదోవపట్టగల మరో విషయం ఏమిటి?
20 అయితే, క్రైస్తవులు ‘అనునయపూరిత తర్కాలతో మోసగించబడే’ యితర మార్గాలు లేక ‘ప్రేమయందు అతుకబడి వుండడాన్ని’ అభ్యంతరపర్చే శూన్యమైన తలంపులు కూడా వున్నాయి. జర్మనీలోవున్న వాచ్‌టవర్ సంస్థ కార్యాలయం యిలా వ్రాసింది: “ఒక సంఘటన వివాదానికి కారణమైంది, ఒక సహోదరుడు తీసుకున్న వివిధ రకాల వైద్యాన్ని గూర్చి ప్రచారకులు, చివరికి పెద్దలు కూడా ఒక్కొక్కరు ఒక్కో పక్షం వహించారు.” వారు యిలా కొనసాగించారు: “అనేక రకాలైన పద్ధతులు ఉపయోగించబడినందున, పెద్ద సంఖ్యలో రోగులు యిమిడివున్నందున, అది ఒక వివాదాంశమైంది, అలాంటి వైద్య పద్ధతులకు అభిచార సంబంధమైన మూలం వున్నట్లయితే, అది ప్రమాదకరం కాగలదు.”—ఎఫెసీయులు 6:12.
21. ఒక క్రైస్తవుడు నేడు సరైన ముఖ్య కేంద్రాన్ని ఎలా పోగొట్టుకోగలడు?
21 క్రైస్తవులు తాము దేవున్ని ఆరాధించగలిగేలా సజీవంగా, ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటారు. అయినప్పటికీ, ఈ విధానంలో మనం అపరిపూర్ణత వల్ల వచ్చే వృద్ధాప్యానికి, అనారోగ్యానికి గురౌతాము. ఆరోగ్య సంబంధ వివాదాలను గూర్చి నొక్కి చెప్పడానికి బదులు, మనం మన కొరకు, యితరుల కొరకు నిజమైన పరిష్కారంపై శ్రద్ధ నిలపాలి. (1 తిమోతి 4:16) కొలొస్సయులకు పౌలు యిచ్చిన ఉపదేశానికి క్రీస్తు ముఖ్య కేంద్రమైనట్లుగానే ఆ పరిష్కారానికి కూడా ఆయనే ముఖ్య కేంద్రం. కాని, కొందరు “అనునయపూరిత తర్కాలతో” వచ్చి మన శ్రద్ధను క్రీస్తు వైపు నుండి బహుశా రోగనిర్థారణ పద్ధతులు మరియు చికిత్సలు లేక ఆహార నియమాలు వంటివాటి వైపుకు మళ్లిస్తారని పౌలు సూచించాడని గుర్తుంచుకోండి.—కొలొస్సయులు 2:2-4 (NW).
22. రోగనిర్థారణ మరియు చికిత్సా విధానాలకు సంబంధించిన అనేక ఆరోపణలను బట్టి మనం ఏ సమతూకమైన దృక్పథాన్ని కలిగివుండాలి?
22 భూవ్యాప్తంగా ప్రజలు అన్ని రకాలైన వైద్యాలు, ప్రామాణికాలు వంటివాటిని గూర్చిన వ్యాపార ప్రకటనలు మరియు వ్యాఖ్యలతో చుట్టుముట్ట బడుతున్నారు. వాటిలో కొన్ని విస్తృతంగా ఉపయోగించబడినవి, గుర్తించబడినవి; వేరేవి ఎక్కువగా విమర్శించబడ్డాయి లేక అనుమానానికి దారితీసాయి.b ప్రతి వ్యక్తికి తన ఆరోగ్యాన్ని గూర్చి తాను ఏం చేస్తాననేది తీర్మానించుకోవలసిన బాధ్యత వుంది. అయితే కొలొస్సయులు 2:4, 8 నందలి పౌలు ఉపదేశాన్ని అంగీకరించేవారికి, రాజ్య నిరీక్షణ లేని మరియు ఉపశమనం కొరకు ఆతురత గల అనేకులను తప్పుదోవపట్టించే “అనునయపూరిత తర్కాలతో” లేక “నిరర్థక తత్వ జ్ఞానముతో” మోసగించబడడం నుండి రక్షణ వుంటుంది. ఫలానా చికిత్స తనకు బాగా వున్నట్లు ఒక క్రైస్తవుడు ఒప్పించబడినట్లయితే, అతడు దీన్ని క్రైస్తవ సహోదరత్వంలో వ్యాప్తి చేయకూడదు, ఎందుకంటే అది ఒక విస్తృత చర్చకు, వివాదానికి కారణమౌతుంది. అలా చేయడం ద్వారా అతడు సంఘ ఐక్యత యొక్క ప్రాముఖ్యతను ఉన్నతంగా గౌరవిస్తున్నానని చూపించగలడు.
23. మనం ఆనందించడానికి విశేషంగా ఎందుకు కారణం కలిగివున్నాము?
23 నిజమైన ఆనందానికి క్రైస్తవ ఐక్యత మూలమని అపొస్తలుడైన పౌలు నొక్కి చెప్పాడు. ఆయన కాలంలో సంఘాల సంఖ్య నేడున్న దాని కంటే కచ్చితంగా తక్కువే. అయినా, ఆయన కొలొస్సయులకు యిలా వ్రాయగలిగాడు: “నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.” (కొలొస్సయులు 2:5; కొలొస్సయులు 3:14 కూడా చూడండి.) మనం ఆనందించడానికి అది ఎంతటి గొప్ప కారణం! భూవ్యాప్తంగావున్న దేవుని ప్రజల సాధారణ పరిస్థితిని ప్రతిబింబించే ఐక్యత, మంచి క్రమము, విశ్వాసమందు స్థిరత్వం వంటివాటి నిజమైన రుజువును మనం మన స్వంత సంఘంలోనే చూడగలము. ప్రస్తుత విధానంలో మిగిలివున్న కొద్ది సమయంలో, మనలో ప్రతి ఒక్కరము “ప్రేమయందు అతుకబడి వుండుటకు” నిశ్చయించుకుందాము.
[అధస్సూచీలు]
a సాధ్యతలు అనేకం వున్నప్పటికీ, ఈ క్రింది ఉదాహరణల నుండి, మీ సంఘంలో ఐక్యతకు దోహదపడేది, యేసు గురించి మీరు వ్యక్తిగతంగా ఏమి నేర్చుకోగలరో చూడండి: మత్తయి 12:1-8; లూకా 2:51, 52; 9:51-55; 10:20; హెబ్రీయులు 10:5-9.
b జూన్ 15, 1982 కావలికోట (ఆంగ్లం), 22-9 పేజీలను చూడండి.
మీరు గమనించారా?
◻ యెహోవాసాక్షులకు 1995వ సంవత్సరపు వార్షిక లేఖనం ఏమిటి?
◻ కొలొస్సీలోని క్రైస్తవులు ప్రేమయందు అతుకబడి వుండవలసిన అవసరం ఎందుకు ఉంది, నేడు మనం ఎందుకు అలా ఉండాలి?
◻ క్రైస్తవులు ప్రాముఖ్యంగా నేడు జీవితాన్ని గూర్చిన ఏ మోసపూరితమైన దృక్పథాన్ని గూర్చి జాగ్రత్త కలిగివుండాలి?
◻ ఆరోగ్యం మరియు రోగనిర్థారణ వంటివాటిని గూర్చిన అనునయపూరిత తర్కాలచే మోసగించబడకుండా క్రైస్తవులు ఎందుకు మెలకువ కలిగివుండాలి?
[17వ పేజీలోని చిత్రాలు]
భవిష్యత్తును గూర్చిన మీ పథకాలు యేసు ప్రత్యక్షత చుట్టూ వేయబడ్డాయా?