కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 10/1 పేజీలు 8-13
  • మీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ వ్యతిరేకత అనే ఉరి
  • సవాలును విజయవంతంగా ఎదుర్కొనుట
  • ఒక అనుకూలమైన గొప్ప బహుమానం
  • యేసు నుండి నేర్చుకోవడం
  • భర్తలారా, భార్యలారా—క్రీస్తును అనుకరించండి!
  • మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • భర్తలారా, క్రీస్తు శిరస్సత్వాన్ని గుర్తించి అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • భార్యలారా, మీ భర్తలను ప్రగాఢంగా గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 10/1 పేజీలు 8-13

మీ కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉందా?

“నీవు నీ పూర్ణహృదయముతో . . . నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.”—మార్కు 12:29, 30, NW.

1. మనం యెహోవాను ప్రేమించడం ఎంత ప్రాముఖ్యం?

“ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని” ఒక శాస్త్రి యేసును అడిగాడు. యేసు తన స్వంత అభిప్రాయాన్ని చెప్పే బదులు దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండము 6:4, 5ను ఉదాహరిస్తూ అతని ప్రశ్నకు జవాబునిచ్చాడు. ఆయనిలా సమాధానమిచ్చాడు: “ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణప్రాణముతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.”—మార్కు 12:28-30, NW.

2. (ఎ) యేసు ఏ వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది? (బి) యెహోవాకు ప్రీతికరమైనది చేయడాన్ని కొన్నిసార్లు ఏది కష్టతరం చేస్తుంది?

2 యేసు మొదటిదని పిలిచిన ఆజ్ఞను అంటే అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞను అనుసరించాలంటే, మనం ఎల్లప్పుడూ యెహోవాకు ప్రీతికరమైనది చేయాలి. ఒక సందర్భంలో అపొస్తలుడైన పేతురు, మరో సందర్భంలో ఆయన స్వంత సన్నిహిత బంధువులు కూడా యేసు చర్యను ఆటంకపర్చినప్పటికీ, యేసు అలా చేశాడు. (మత్తయి 16:21-23; మార్కు 3:21; యోహాను 8:29) మీరు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నట్లు కనుగొంటే అప్పుడేమిటి? ఒకవేళ మీరు మీ బైబిలు పఠనాన్ని, యెహోవాసాక్షులతో మీ సహవాసాన్ని నిలిపివేయాలని మీ కుటుంబ సభ్యులు కోరారనుకోండి. దేవునికి ప్రీతికరమైనది చేయడం ద్వారా మీరు ఆయనకు మొదటి స్థానం ఇస్తారా? దేవున్ని సేవించాలనే మీ ప్రయత్నాలను మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు కూడా ఆయనకే మొదటి స్థానం ఇస్తారా?

కుటుంబ వ్యతిరేకత అనే ఉరి

3. (ఎ) యేసు బోధల పర్యవసానాలు కుటుంబానికి ఏమైవుంటాయి? (బి) ఎవరి ఎడల తమకు ఎక్కువ అనురాగం ఉందో కుటుంబ సభ్యులు ఎలా చూపించగలరు?

3 తన బోధలను అంగీకరించే వ్యక్తిని కుటుంబంలోని ఇతర సభ్యులు వ్యతిరేకించడం వల్ల ఏర్పడగల కష్టాన్ని యేసు తక్కువ అంచనావేయలేదు. యేసు ఇలా చెప్పాడు: “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.” అయితే, “తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు” అని చెప్పడం ద్వారా యేసు, అలాంటి దుఃఖకరమైన పరిణామాలు ఉన్నప్పటికీ ఎవరు మొదటి స్థానం పొందాలనే దానిని సూచించాడు. (మత్తయి 10:34-37) ఆయన కుమారుడు, “ఆయన [దేవుని] తత్వముయొక్క మూర్తిమంతము” అయిన యేసుక్రీస్తు బోధలను అనుసరించడం ద్వారా మనం యెహోవా దేవునికి మొదటి స్థానం ఇస్తాము.—హెబ్రీయులు 1:3; యోహాను 14:9.

4. (ఎ) తన అనుచరుడు కావడంలో ఏమి ఇమిడి ఉందని యేసు చెప్పాడు? (బి) క్రైస్తవులు ఏ భావంలో తమ కుటుంబ సభ్యులను ద్వేషించాలి?

4 మరో సందర్భంలో యేసు, తన నిజ అనుచరులై ఉండడంలో వాస్తవంగా ఏమి ఇమిడి ఉందనేదాన్ని చర్చిస్తూ ఇలా చెప్పాడు: “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.” (లూకా 14:26) తన అనుచరులు అక్షరార్థంగా తమ కుటుంబ సభ్యులను ద్వేషించాలన్నది యేసు భావం కాదన్నది స్పష్టం ఎందుకంటే, ఆయన తమ శత్రువులను కూడా ప్రేమించమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 5:44) బదులుగా, తన అనుచరులు తమ కుటుంబ సభ్యులను దేవుని కంటే తక్కువ ప్రేమించాలన్నది ఇక్కడ యేసు భావం. (మత్తయి 6:24 పోల్చండి.) ఆ భావానికి అనుగుణంగానే, యాకోబు లేయాను ‘ద్వేషించి’ రాహేలును ప్రేమించాడని బైబిలు చెబుతుంది, అంటే ఆమె సహోదరియైన రాహేలును ప్రేమించినంతగా ఆయన లేయాను ప్రేమించలేదన్నది దాని భావం. (ఆదికాండము 29:30-32) చివరికి మన స్వంత “ప్రాణమును” లేక జీవమును కూడా ద్వేషించాలని లేక యెహోవా కంటె తక్కువగా ప్రేమించాలని యేసు చెప్పాడు!

5. కుటుంబ ఏర్పాటును సాతాను మోసకరంగా ఎలా దుర్వినియోగం చేస్తాడు?

5 సృష్టికర్తగా, జీవదాతగా యెహోవా తన సేవకులందరి నుండి సంపూర్ణ భక్తిని పొందడానికి అర్హుడు. (ప్రకటన 4:11) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూ”నుతాను. (ఎఫెసీయులు 3:14, 15) యెహోవా కుటుంబ ఏర్పాటును ఎంత అద్భుతంగా సృష్టించాడంటే కుటుంబ సభ్యులందరూ ఒకరి ఎడల ఒకరు సహజ అనురాగం కలిగివుంటారు. (1 రాజులు 3:25, 26; 1 థెస్సలొనీకయులు 2:7) అయితే అపవాదియగు సాతాను, ప్రియమైన వారిని ప్రీతిపర్చాలనే కోరిక ఇమిడివున్న ఈ సహజమైన కుటుంబ అనురాగాన్ని మోసకరంగా పాడుచేయాలని ప్రయత్నిస్తాడు. కుటుంబ వ్యతిరేకత అనే జ్వాలలను అతడు తీవ్రతరం చేస్తాడు దాన్ని బట్టి, బైబిలు సత్యం పక్షాన దృఢంగా నిలబడడం అనేకులకు ఒక సవాలుగా ఉంటుంది.—ప్రకటన 12:9, 12.

సవాలును విజయవంతంగా ఎదుర్కొనుట

6, 7. (ఎ) బైబిలు పఠనం మరియు క్రైస్తవ సహవాసం యొక్క ప్రాముఖ్యతను మెచ్చుకొనడానికి కుటుంబ సభ్యులకు ఎలా సహాయం చేయవచ్చు? (బి) మనం నిజంగా మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

6 దేవున్ని ప్రీతిపర్చడం లేక ఒక కుటుంబ సభ్యున్ని ప్రీతిపర్చడం మధ్య ఎంపిక చేసుకోమని మీరు బలవంతం చేయబడితే మీరేమి చేస్తారు? మనం దేవుని వాక్యాన్ని పఠించి దాని సూత్రాలను అన్వయించుకోవడం కుటుంబంలో కలహం రేపడానికి కారణమైతే మనం అలా చేయాలని దేవుడు కోరడని మీరు తర్కిస్తారా? కాని దీని గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు లొంగిపోయి మీ బైబిలు పఠనాన్ని లేక యెహోవాసాక్షులతో మీ సహవాసాన్ని నిలిపివేస్తారనుకోండి, అప్పుడు బైబిలు యొక్క కచ్చితమైన జ్ఞానం జీవన్మరణ విషయమని మీ ప్రియమైనవారు ఎన్నటికైనా ఎలా గ్రహిస్తారు?—యోహాను 17:3; 2 థెస్సలొనీకయులు 1:6-8.

7 మనం పరిస్థితిని ఈ విధంగా వివరించవచ్చు: ఒకవేళ కుటుంబ సభ్యులలో ఒకరికి విపరీతమైన మద్యపానాసక్తి ఉందనుకోండి. అతని మద్యపాన సమస్యను నిర్లక్ష్యం చేయడం లేక చూసిచూడనట్లు విడిచిపెట్టడం అతనికి నిజంగా ప్రయోజనకరం కాగలదా? లొంగిపోయి, అతని సమస్య గురించి ఏమి చేయకుండా ఉండడం ద్వారా శాంతిని కాపాడడం మంచిదా? కాదు, అతని కోపాన్ని బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొనైనా సరే అతని మద్యపాన సమస్యను అధిగమించడానికి అతనికి సహాయపడేందుకు ప్రయత్నించడం మంచిదని బహుశా మీరు అంగీకరించవచ్చు. (సామెతలు 29:25) అలాగే, మీరు మీ కుటుంబ సభ్యులను నిజంగా ప్రేమిస్తే, బైబిలు పఠనం చేయకుండా మిమ్మల్ని ఆపాలని వారు చేసే ప్రయత్నాలకు మీరు లొంగిపోరు. (అపొస్తలుల కార్యములు 5:29) దృఢంగా నిలబడడం ద్వారా మాత్రమే, క్రీస్తు బోధలకు అనుగుణంగా జీవించడం మన జీవానికి మూలమని గుణగ్రహించేందుకు మీరు వారికి సహాయపడగలరు.

8. యేసు నమ్మకంగా దేవుని చిత్తాన్ని చేశాడనే వాస్తవం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

8 దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కొన్నిసార్లు చాలా కష్టమనిపించవచ్చు. కాని దేవుని చిత్తం చేయడం యేసుకు కూడా కష్టమయ్యేలా సాతాను చేశాడని గుర్తుంచుకోండి. అయినా యేసు ఎన్నడూ విడిచిపెట్టలేదు; ఆయన మన కోసం హింసాకొయ్యపై వేదనను కూడా సహించాడు. ‘యేసుక్రీస్తు మన రక్షకుడు’ అని బైబిలు చెబుతుంది. “ఆయన మనకొరకు మృతిపొందెను.” (తీతు 3:6; 1 థెస్సలొనీకయులు 5:10) యేసు వ్యతిరేకతకు లొంగిపోలేదని మనం కృతజ్ఞత కలిగిలేమా? ఆయన బలి మరణాన్ని సహించాడు గనుక, ఆయన చిందించిన రక్తమందు విశ్వాసముంచడం ద్వారా నీతిగల సమాధానకరమైన నూతన లోకంలో నిత్యజీవ ఉత్తరాపేక్ష మనకుంది.—యోహాను 3:16, 36; ప్రకటన 21:3, 4.

ఒక అనుకూలమైన గొప్ప బహుమానం

9. (ఎ) ఇతరులను రక్షించడంలో క్రైస్తవులు ఎలా భాగం వహించగలరు? (బి) తిమోతి కుటుంబ పరిస్థితి ఏమైయుండెను?

9 ఎంతో ప్రియమైన బంధువులతో సహా ఇతరులను రక్షించడంలో మీరు కూడా భాగం కలిగివుండవచ్చని మీరు గ్రహించారా? అపొస్తలుడైన పౌలు తిమోతిని ఇలా కోరాడు: “వీటిలో [నీకు నేర్పబడిన వాటిలో] నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (ఐటాలిక్కులు మావి.) (1 తిమోతి 4:16) తిమోతి విభాగిత గృహంలో జీవించాడు, గ్రీకుదేశస్థుడైన ఆయన తండ్రి అవిశ్వాసి. (అపొస్తలుల కార్యములు 16:1; 2 తిమోతి 1:5; 3:14) ఆ తర్వాత తిమోతి తండ్రి విశ్వాసి అయ్యాడేమో మనకు తెలియకపోయినప్పటికీ, తన భార్య యునీకే మరియు తిమోతీల నమ్మకమైన ప్రవర్తన ఆయన మార్పుదలవైపు బహుగా అభివృద్ధి సాధించి ఉండవచ్చుననే సాధ్యతను ఎంతగానో నొక్కి తెలియజేస్తుంది.

10. అవిశ్వాసులైన తమ జతల ఎడల క్రైస్తవులు ఏమి చేయవచ్చు?

10 బైబిలు సత్యాన్ని దృఢంగా ఉన్నతపర్చే భర్తలు భార్యలు క్రైస్తవేతరులైన తమ జతలు, విశ్వాసులు కావడానికి సహాయం చేయడం ద్వారా వారిని రక్షించడానికి దోహదపడగలరని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” (1 కొరింథీయులు 7:12, 13, 16) అదే విధంగా అపొస్తలుడైన పేతురు ఇలా ఉద్బోధిస్తూ, భార్యలు తమ భర్తలను ఎలా కాపాడగలరో వివరించాడు: “మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”—1 పేతురు 3:1.

11, 12. (ఎ) వేలకొలదిమంది క్రైస్తవులు ఏ ప్రతిఫలాన్ని పొందారు, దాన్ని పొందడానికి వారు ఏమి చేశారు? (బి) విశ్వాసయుక్తమైన సహనాన్ని బట్టి ప్రతిఫలం పొందిన ఒక కుటుంబ సభ్యురాలి అనుభవం చెప్పండి.

11 సాక్షులైన తమ బంధువుల క్రైస్తవ పరిచర్యను నెలల పాటు కొన్నిసార్లు సంవత్సరాల పాటు వ్యతిరేకించిన అనేక వేలమంది ఇటీవలి సంవత్సరాలలో యెహోవాసాక్షులయ్యారు. స్థిరంగా ఉన్న క్రైస్తవులకు ఇదెంతటి ప్రతిఫలం, ఒకప్పటి వ్యతిరేకులకు ఎంతటి ఆశీర్వాదం! భావావేశపూరిత స్వరంతో, 74 సంవత్సరాల ఒక క్రైస్తవ పెద్ద ఇలా చెప్పాడు: “నేను వారిని వ్యతిరేకించిన సంవత్సరాలన్నిటిలోనూ నా భార్య పిల్లలు సత్యాన్ని హత్తుకొని ఉన్నందుకు నేను తరచూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.” తన భార్య బైబిలు గురించి తనతో మాట్లాడడాన్ని మూడు సంవత్సరాల వరకు మూర్ఖంగా నిరాకరించానని ఆయన చెప్పాడు. ఇంకా ఆయనిలా చెప్పాడు: “కాని నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆమె నా కాళ్లు నొక్కుతుండగా నాకు సాక్ష్యమివ్వడం మొదలుపెట్టేది. నా వ్యతిరేకతకు ఆమె లొంగిపోనందుకు నేనెంత కృతజ్ఞత కలిగివున్నానో!”

12 తన కుటుంబాన్ని వ్యతిరేకించిన మరో భర్త ఇలా వ్రాశాడు: ‘నా భార్యకు నేను బద్ధ శత్రువుగా ఉండేవాణ్ణి, ఎందుకంటే ఆమె సత్యం తెలుసుకున్న తర్వాత నేను ఆమెను భయపెట్టేవాణ్ణి, మేము ప్రతిరోజు పోట్లాడుకునేవాళ్లం; చెప్పాలంటే, నేను ఎప్పుడూ గొడవ మొదలు పెట్టేవాణ్ణి. కాని అదంతా వ్యర్థమైపోయింది; నా భార్య బైబిలును హత్తుకొని ఉండేది. సత్యానికి, నా భార్యకు పిల్లవానికి వ్యతిరేకంగా నేను చేసిన తీవ్రపోరాటంలో అలా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వారిద్దరికీ నేను అపవాది అవతారాన్ని.’ చివరికి ఆ వ్యక్తి తన ప్రవర్తనను పరిశీలించుకోవడం మొదలు పెట్టాడు. ‘నేనెంత వేధించేవానిగా ఉన్నానో నేను తెలుసుకున్నాను. నేను బైబిలు చదివి, దాని ఉపదేశం మూలంగా నేను ఇప్పుడు బాప్తిస్మం పొందిన సాక్షినని’ ఆయన వివరిస్తున్నాడు. ఆ భార్యకు లభించిన గొప్ప ప్రతిఫలం గురించి ఆలోచించండి, అవును, అతని వ్యతిరేకతను 12 సంవత్సరాలు విశ్వాసంగా సహించినందుకు ఆమె ‘తన భర్తను రక్షించడానికి సహాయం చేసింది!’

యేసు నుండి నేర్చుకోవడం

13. (ఎ) యేసు జీవిత విధానం నుండి భర్తలు, భార్యలు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటి? (బి) దేవుని చిత్తానికి లోబడడం కష్టమని భావించే ప్రజలు యేసు మాదిరి నుండి ఎలా ప్రయోజనం పొందగలరు?

13 యేసు జీవితం నుండి భర్తలు, భార్యలు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే దేవునికి విధేయత చూపించడం. “ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” మరియు “నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను” అని యేసు చెప్పాడు. (యోహాను 8:29; 5:30) దేవుని చిత్తం యొక్క ఒక ప్రాముఖ్యమైన అంశం తనకు ఇష్టంలేనిదని యేసు భావించినప్పటికీ, ఆయన విధేయత చూపించాడు. “యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము” అని ఆయన ప్రార్థించాడు. కాని ఆ వెంటనే “అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని ఆయన చెప్పాడు. (లూకా 22:42) దేవున్ని తన చిత్తాన్ని మార్చుకొమ్మని యేసు కోరలేదు; దేవుని చిత్తం తన ఎడల ఏమైయుందో అదంతా చేయడం ద్వారా ఆయన తాను నిజంగా దేవున్ని ప్రేమిస్తున్నానని చూపించాడు. (1 యోహాను 5:3) యేసు చేసినట్లుగా, ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వడమన్నది ఒంటరి జీవితంలోనే కాదు వివాహిత మరియు కుటుంబ జీవితంలో కూడా విజయం సాధించడానికి ఎంతో ప్రాముఖ్యము. ఇలా ఎందుకో పరిశీలించండి.

14. కొందరు క్రైస్తవులు అయుక్తంగా ఎలా తర్కిస్తారు?

14 ముందు గమనించినట్లుగా, విశ్వాసులు దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, వారు అవిశ్వాసులైన తమ జతలతో కలిసి జీవించడానికి ప్రయత్నిస్తారు మరియు రక్షణ కొరకు యోగ్యులయ్యేలా వారికి తరచూ సహాయం చేయగల్గుతారు. జతలు ఇద్దరూ విశ్వాసులైనప్పటికీ, వారి వివాహం ఆదర్శవంతమైనదై ఉండకపోవచ్చు. పాపయుక్తమైన కోరికల మూలంగా భర్తలు, భార్యలు ఎల్లప్పుడూ ఒకరి ఎడల ఒకరు ప్రేమపూర్వకమైన తలంపులు కలిగి ఉండరు. (రోమీయులు 7:19, 20; 1 కొరింథీయులు 7:28) విడాకులు తీసుకోవడానికి లేఖనాధారం లేకపోయినప్పటికీ, కొందరు వేరే జతను తెచ్చుకోవాలనేంత వరకు వెళతారు. (మత్తయి 19:9; హెబ్రీయులు 13:4) ఇది తమకు మంచిదని, భార్యలు భర్తలు కలిసి ఉండాలన్న దేవుని చిత్తం మరీ కష్టమైనదని వారు వాదిస్తారు. (మలాకీ 2:16; మత్తయి 19:5, 6) నిస్సందేహంగా, ఇది దేవుని తలంపుల కంటే మానవ తలంపులను గూర్చి ఆలోచించడమేనన్నది మరో విషయం.

15. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఎందుకు రక్షణకరము?

15 దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ఎంత రక్షణకరమైనది! అలా చేసే వివాహిత జతలు కలిసి జీవించడానికి ప్రయత్నించి, దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. తద్వారా వారు దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే అన్ని విధాలైన హృదయ వేదనలను తప్పించుకుంటారు. (కీర్తన 19:7-11) దాదాపు విడాకులు తీసుకొనేవరకు వచ్చాక బైబిలు ఉపదేశాన్ని అనుసరించాలని నిర్ణయించుకొన్న ఒక యౌవన దంపతులచే ఇది ఉదాహరించబడింది. తన వివాహమందు తాను పొందిన ఆనందాన్ని గూర్చి సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్న ఆ భార్య ఇలా చెబుతుంది: “ఈ సంవత్సరాలన్నీ నా భర్త నుండి వేరుగా జీవించాలని నేను అనుకున్న విషయాన్ని తలంచినప్పుడు నేను కూర్చుని ఏడవాల్సిందే. అప్పుడు నేను, మమ్మల్ని అంత ఆనందకరమైన సంబంధంలో దగ్గర చేర్చిన యెహోవా దేవుని ఉపదేశం మరియు నడిపింపు కొరకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థిస్తాను.”

భర్తలారా, భార్యలారా—క్రీస్తును అనుకరించండి!

16. భర్తలకు, భార్యలకు యేసు ఏ మాదిరినుంచాడు?

16 దేవునికి ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇచ్చిన యేసు భర్తలకు, భార్యలకు ఇరువురికి అద్భుతమైన మాదిరినుంచాడు, దానికి వారు జాగ్రత్తతో కూడిన శ్రద్ధ చూపించడం మంచిది. క్రైస్తవ సంఘ సభ్యులపై యేసు ప్రేమపూర్వకంగా నిర్వహించే శిరస్సత్వాన్ని అనుకరించమని భర్తలు కోరబడుతున్నారు. (ఎఫెసీయులు 5:23) దేవునికి విధేయత చూపించడంలోని యేసు యొక్క నిష్కళంకమైన ఉదాహరణ నుండి క్రైస్తవ భార్యలు నేర్చుకోవచ్చు.—1 కొరింథీయులు 11:3.

17, 18. యేసు భర్తలకు ఏయే విధాలుగా మంచి మాదిరినుంచాడు?

17 బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:25) తన అనుచరుల సంఘం ఎడల యేసు తన ప్రేమను కనపర్చిన ఒక ముఖ్యమైన మార్గం ఏమిటంటే వారి సన్నిహిత స్నేహితునిగా ఉండడమే. యేసు ఇలా చెప్పాడు: “మిమ్మును . . . స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.” (యోహాను 15:15) యేసు తన శిష్యులతో మాట్లాడుతూ గడిపిన సమయమంతటి గురించి, వారితో ఆయన చేసిన అనేకానేక చర్చల గురించి, వారియందు ఆయన ఉంచిన నమ్మకం గురించి ఆలోచించండి! భర్తలకు అది ఒక చక్కని ఉదాహరణ కాదంటారా?

18 యేసు తన శిష్యుల ఎడల నిజమైన శ్రద్ధను, వారి ఎడల వాస్తవమైన అభిమానాన్ని చూపించాడు. (యోహాను 13:1) ఆయన బోధలు వారికి అస్పష్టంగా ఉన్నప్పుడు, విషయాలను స్పష్టపర్చడానికి ఆయన వ్యక్తిగతంగా సహనంతో సమయం తీసుకున్నాడు. (మత్తయి 13:36-43) భర్తలారా, మీ భార్య ఆత్మీయ క్షేమం మీకు అంతే ప్రాముఖ్యమైనదా? బైబిలు సత్యాలు మీ ఇద్దరి మనస్సుల్లో, హృదయాల్లో స్పష్టంగా ఉండేలా మీరు ఆమెతో సమయం గడుపుతారా? బహుశా వారికి వ్యక్తిగతంగా బోధిస్తూ, యేసు పరిచర్యలో తన శిష్యులలో ఒక్కొక్కరి వెంట వెళ్లాడు. ఇంటింటి సందర్శనాల్లో, బైబిలు పఠనాలు నిర్వహించడంలో భాగం వహిస్తూ, పరిచర్యలో మీరు మీ భార్య వెంట వెళ్తారా?

19. అపొస్తలుల పునరావృత్తమయ్యే బలహీనతలతో యేసు వ్యవహరించిన విధానం భర్తలకు ఎలా మాదిరినుంచుతుంది?

19 ప్రాముఖ్యంగా తన అపొస్తలుల అపరిపూర్ణతలతో వ్యవహరించేటప్పుడు యేసు భర్తలకు శ్రేష్ఠమైన మాదిరిని అందజేశాడు. తన అపొస్తలులతో చివరి భోజనం చేసే సమయంలో, పునరావృత్తమైన పోటీతత్వాన్ని ఆయన కనుగొన్నాడు. ఆయన కఠినంగా వారిని విమర్శించాడా? లేదు, కాని ఆయన వినయంగా ప్రతి ఒక్కరి కాళ్లను కడిగాడు. (మార్కు 9:33-37; 10:35-45; యోహాను 13:2-17) మీరు మీ భార్య ఎడల అలాంటి సహనాన్ని చూపిస్తారా? పునరావృత్తమయ్యే బలహీనతను బట్టి ఫిర్యాదు చేసే బదులు, మీ మాదిరి ద్వారా ఆమెకు సహాయం చేసి, ఆమె హృదయాన్ని చేరడానికి మీరు సహనంతో ప్రయత్నిస్తారా? చివరికి అపొస్తలులు చేసినట్లుగానే, అలాంటి ప్రేమపూర్వకమైన కనికరాన్ని భార్యలు కూడా ప్రతిస్పందించే అవకాశముంది.

20. క్రైస్తవ భార్యలు దేన్ని ఎన్నడూ మరచిపోకూడదు, వారికి ఎవరు మాదిరినుంచారు?

20 “క్రీస్తునకు శిరస్సు దేవుడని” ఎన్నడూ మరచిపోని యేసును భార్యలు కూడా పరిశీలించాలి. ఆయన ఎల్లప్పుడూ తన పరలోక తండ్రికి విధేయత చూపించాడు. అలాగే “స్త్రీకి శిరస్సు పురుషుడని” అవును, తమ భర్త తమ శిరస్సని భార్యలు మరచిపోకూడదు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:23) పూర్వకాలాల నాటి “పరిశుద్ధ స్త్రీల” మాదిరిని, ప్రాముఖ్యంగా “అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి” ఉండిన శారా మాదిరిని పరిశీలించమని అపొస్తలుడైన పేతురు క్రైస్తవ భార్యలను కోరాడు.—1 పేతురు 3:5, 6.

21. అబ్రాహాము శారాల వివాహం ఎందుకు విజయవంతమయ్యింది కాని లోతు, అతని భార్య వివాహం ఎందుకు విఫలమయ్యింది?

21 పరదేశంలో గుడారాలలో నివసించడానికి శారా సంపన్నమైన నగరంలోని అనుకూలమైన గృహాన్ని కూడా విడిచిపెట్టింది. ఎందుకు? ఆమె ఆ జీవన విధానాన్ని కోరుకుందా? కాకపోవచ్చు. అలా అని ఆమె భర్త ఆమెను అడిగాడు గనుకనా? నిస్సందేహంగా అది ఒక కారణం కావచ్చు, ఎందుకంటే అబ్రాహాముకున్న దైవిక లక్షణాలను బట్టి శారా ఆయనను ప్రేమించి, గౌరవించింది. (ఆదికాండము 18:12) కాని ఆమె తన భర్తతోపాటు వెళ్లడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, యెహోవా ఎడల ఆమెకున్న ప్రేమ మరియు దేవుని నడిపింపును అనుసరించాలనే ఆమె హృదయపూర్వక కోరిక. (ఆదికాండము 12:1) దేవునికి విధేయత చూపించడంలో ఆమె ఆనందాన్ని పొందింది. మరోవైపున, లోతు భార్య దేవుని చిత్తాన్ని చేయడానికి వెనుకాడి, తన స్వంత పట్టణమైన సొదొమలో విడిచిపెట్టివస్తున్న వస్తువుల ఎడల ఆశతో వెనక్కి తిరిగి చూసింది. (ఆదికాండము 19:15, 25, 26; లూకా 17:32) ఆ వివాహానికి ఎంత దుఃఖకరమైన ముగింపు కలిగింది—అదంతా ఆమె దేవునికి అవిధేయత చూపించడం వల్లనే!

22. (ఎ) కుటుంబ సభ్యులు ఏ స్వయం పరీక్షను జ్ఞానయుక్తంగా చేసుకుంటారు? (బి) మనం మన తర్వాతి పఠనంలో ఏమి పరిశీలిస్తాము?

22 కాబట్టి ఒక భర్తగా లేక భార్యగా, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవడం ప్రాముఖ్యం, ‘మా కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఉందా? దేవుడు నాకిచ్చిన కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి నేను నిజంగా కృషిచేస్తున్నానా? నా జతను ప్రేమించి, ఆమె లేక ఆయన యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి లేక కాపాడుకోవడానికి నేను నిజమైన ప్రయత్నం చేస్తున్నానా?’ అనేక కుటుంబాల్లో పిల్లలు కూడా ఉంటారు. మనం తర్వాత తలిదండ్రుల పాత్ర, వారు మరియు వారి పిల్లలు ఇరువురూ దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన అవసరత గురించి పరిశీలిస్తాము.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ యేసు బోధల యొక్క పర్యవసానాలు అనేక కుటుంబాలకు ఏమి కావచ్చు?

◻ దృఢత్వంగల వేలకొలదిమంది క్రైస్తవులు ఏ ప్రతిఫలాన్ని పొందారు?

◻ దుర్నీతిని, విడాకులను విసర్జించడానికి వివాహజతలకు ఏది సహాయం చేస్తుంది?

◻ యేసు మాదిరి నుండి భర్తలు ఏమి నేర్చుకోవచ్చు?

◻ ఆనందభరితమైన వివాహానికి భార్యలు ఎలా దోహదపడగలరు?

[10వ పేజీలోని చిత్రం]

తన వివాహం విజయవంతం కావడానికి శారా ఎలా దోహదపడింది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి