యెహోవా శాంతి సత్యాలను అధికంగా దయచేస్తున్నాడు
“నేను వారిని స్వస్థపరుస్తాను, వారికి అధికంగా శాంతి సత్యాలను బయల్పరుస్తాను.”—యిర్మీయా 33:6, NW.
1, 2. (ఎ) శాంతికి సంబంధించినంతవరకు, దేశాల యొక్క నివేదికాంశాలు ఏమిటి? (బి) సా.శ.పూ. 607లో యెహోవా ఇశ్రాయేలీయులకు శాంతిని గూర్చిన ఏ పాఠాన్ని బోధించాడు?
శాంతి! అది ఎంత కోరదగినదో, అయినా మానవ చరిత్రలో అదెంత అరుదో కదా! విశేషంగా ఈ 20వ శతాబ్దం, ఓ శాంతి శతాబ్దం కాలేదు. బదులుగా, ఇది మానవ చరిత్రలో రెండు వినాశకరమైన యుద్ధాల్ని చూసింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం, ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి నానాజాతి సమితి ఏర్పాటు చేయబడింది. ఆ సంస్థ విఫలమైంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి అదే లక్ష్యంతో స్థాపించబడింది. అది కూడా ఎంత చిత్తుగా విఫలమైపోతున్నదో చూడ్డానికి మనం ప్రతిరోజూ వార్తా పత్రికల్ని మాత్రం చదివితే సరిపోతుంది.
2 మానవ సంస్థలు శాంతిని తీసుకురాలేవని మనం ఆశ్చర్యపోవాల్సిందేనా? కానేకాదు. 2,500 సంవత్సరాల కంటే పూర్వం దేవుడు ఏర్పాటు చేసుకొన్న ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఈ విషయంలో ఓ గుణపాఠం నేర్పించబడింది. సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో, ప్రబలమవుతున్న ప్రపంచ శక్తియైన బబులోను మూలంగా ఇశ్రాయేలీయుల శాంతికి ముప్పు వాటిల్లింది. ఇశ్రాయేలీయులు శాంతి కొరకు ఐగుప్తువైపు చూశారు. ఐగుప్తు శాంతిని ఇవ్వలేకపోయింది. (యిర్మీయా 37:5-8; యెహెజ్కేలు 17:11-15) సా.శ.పూ. 607లో బబులోను సైన్యాలు యెరూషలేము గోడల్ని కూల్చివేసి యెహోవా ఆలయాన్ని తగలబెట్టాయి. ఆవిధంగా మానవ సంస్థలపై ఆధారపడడం ఎంత నిరర్థకమో ఇశ్రాయేలీయులు వేదనకరమైన రీతిలో నేర్చుకున్నారు. శాంతిని అనుభవించడానికి బదులు, ఆ జనాంగం బబులోనులోనికి చెరగా కొనిపోబడింది.—2 దినవృత్తాంతములు 36:17-21.
3. యిర్మీయా ద్వారా చెప్పబడిన యెహోవా మాటల నెరవేర్పునందు, ఏ చరిత్రాత్మకమైన సంఘటనలు ఇశ్రాయేలీయులకు శాంతిని గూర్చిన ప్రాముఖ్యమైన రెండవ పాఠాన్ని బోధించాయి?
3 అయినా, యెరూషలేము కూలిపోవడానికి మునుపు, ఐగుప్తు కాదుగాని తానే ఇశ్రాయేలీయులకు నిజమైన శాంతిని తెస్తానని యెహోవా బయల్పర్చాడు. యిర్మీయా ద్వారా ఆయనిలా వాగ్దానం చేశాడు: “నేను వారిని స్వస్థపరుస్తాను, వారికి అధికంగా శాంతి సత్యాలను బయల్పరుస్తాను. చెరపట్టబడిన యూదులను, ఇశ్రాయేలీయులను నేను వెనుకకు తీసుకొస్తాను, మొదట ఉండినట్లు వారిని స్థాపిస్తాను.” (యిర్మీయా 33:6, 7, NW) బబులోను జయించబడి, చెరపట్టబడిన ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యం ఇవ్వబడినప్పుడు అంటే సా.శ.పూ. 539లో యెహోవా వాగ్దానం నెరవేరడం ఆరంభించింది. (2 దినవృత్తాంతములు 36:22, 23) సా.శ.పూ. 537 తరువాయి భాగంలో, ఇశ్రాయేలీయుల గుంపొకటి, 70 ఏండ్లలో మొదటిసారిగా ఇశ్రాయేలు నేలపై పర్ణశాలల పండుగను ఆచరించింది! ఆ పండుగ అయిపోయిన తరువాత, యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించడానికి వారు ఏర్పాట్లు చేశారు. దీన్ని గురించి వారెలా భావించారు? ఆ వృత్తాంతం ఇలా చెబుతుంది: “యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.”—ఎజ్రా 3:11.
4. ఆలయ నిర్మాణ పనిని చేయడానికి యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఎలా ప్రేరేపించాడు, శాంతిని గూర్చిన ఏ వాగ్దానాన్ని ఆయన చేశాడు?
4 అయితే, ఆ సంతోషకరమైన ఆరంభం తర్వాత, ఇశ్రాయేలీయులు వ్యతిరేకులచే నిరుత్సాహపర్చబడి, ఆలయ నిర్మాణ పనిని నిలిపివేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ నిర్మాణపు పనిని పూర్తిచేయడానికి ఇశ్రాయేలీయులను ప్రేరేపించడానికి ప్రవక్తలైన హగ్గయి, జెకర్యాలను యెహోవా ఉద్భవింపజేశాడు. నిర్మింపబడబోయే ఆలయాన్ని గూర్చి హగ్గయి ఇలా చెబుతుండగా వినడం వారికి ఎంత ఆశ్చర్యదాయకంగా ఉండవచ్చు: “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము [“శాంతిని,” NW] నిలుప ననుగ్రహించెదను”!—హగ్గయి 2:9.
యెహోవా తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు
5. జెకర్యా ఎనిమిదవ అధ్యాయం యొక్క విశిష్ఠత ఏమిటి?
5 బైబిలు పుస్తకమైన జెకర్యాలో, సా.శ.పూ. ఆరవ శతాబ్దమందున్న దేవుని ప్రజల్ని బలపర్చిన అనేక ప్రేరేపిత దర్శనాలు, ప్రవచనాల గురించి మనం చదువుతాం. ఈ ప్రవచనాలే యెహోవా మద్దతు గురించి మనకు అభయాన్నిస్తున్నాయి. అవి, మన కాలంలో కూడా యెహోవా తన ప్రజలకు శాంతిని ఇస్తాడని విశ్వసించడానికిగల ప్రతి కారణాన్ని మనకు ఇస్తున్నాయి. ఉదాహరణకు, ప్రవక్తయైన జెకర్యా పేరుమీద వ్రాయబడిన పుస్తకంలో ఎనిమిదవ అధ్యాయమందు ఈ మాటలను ఆయన పదిసార్లు చెబుతాడు: ‘యెహోవా సెలవిచ్చిన వాక్కు.’ ప్రతీసారి, ఈ పదబందం, దేవుని ప్రజల యొక్క శాంతికి సంబంధించి చేయబోయే దానిని గూర్చిన దైవిక ప్రకటనను పరిచయం చేస్తోంది. ఈ వాగ్దానాల్లో కొన్ని జెకర్యా కాలంలో నెరవేరాయి. అన్నీ నెరవేరాయి లేదా ఈనాడు నెరవేరుతున్నాయి.
‘నేను సీయోను విషయమై అసూయపడుదును’
6, 7. యెహోవా ఏయే రీతుల్లో ‘బహు రౌద్రము గలవాడై సీయోను విషయమందు’ అసూయను కల్గివున్నాడు?
6 ఈ పదబందం జెకర్యా 8:2లో మొదటిసారి కన్పిస్తుంది, అక్కడ మనమిలా చదువుతాం: “సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా—మిగుల ఆసక్తితో [“గొప్ప అసూయతో,” NW] నేను సీయోను విషయమందు రోషము [“అసూయ,” NW] వహించియున్నాను. బహు రౌద్రముగలవాడనై దాని విషయమందు నేను రోషము [“అసూయ,” NW] వహించియున్నాను.” అసూయపడతానని, మిగుల ఆసక్తిని కల్గివుంటానని యెహోవా చేసిన వాగ్దానం ఆయన ప్రజలకు, వారి శాంతిని పునఃస్థాపించడంలో ఆయన జాగరూకుడై ఉంటాడనే భావాన్ని ఇస్తుంది. ఇశ్రాయేలీయులు తమ దేశంలో పునరుద్ధరింపబడడం, ఆలయాన్ని పునర్నిర్మించడం, ఆ ఆసక్తికి నిదర్శనాలు.
7 అయినా, యెహోవా ప్రజల్ని వ్యతిరేకించినవారి విషయమేంటి? తన ప్రజల ఎడల ఆయనకుగల ఆసక్తి, ఈ శత్రువులపై ఆయనకుగల మహా “రౌద్రము”చే సమం చేయబడుతుంది. విశ్వాసులైన యూదులు పునర్నిర్మించబడిన ఆలయంలో ఆరాధించినప్పుడు, ఇప్పుడు కూలిపోయిన బలమైన బబులోను గతిని వారు గ్రహించగలుగుతారు. ఆలయ పునర్నిర్మాణాన్ని ఆటంకపర్చడానికి ప్రయత్నించిన శత్రువుల ఘోర వైఫల్యాన్ని కూడా వారు తలపోసుకొనగలుగుతారు. (ఎజ్రా 4:1-6; 6:3) తన వాగ్దానాన్ని నెరవేర్చినందున యెహోవాకు వారు కృతజ్ఞతలు చెల్లించగలరు. ఆయన ఆసక్తి వారికి విజయాన్ని తెచ్చింది!
“సత్యమును అనుసరించు పుర”ము
8. జెకర్యా కాలంలో, మునుపటి కాలానికి భిన్నంగా యెరూషలేము సత్యమును అనుసరించు పురమెలా అయ్యింది?
8 రెండవసారి జెకర్యా ఇలా వ్రాస్తున్నాడు: ‘యెహోవా సెలవిచ్చునది.’ ఈ సందర్భంలో యెహోవా మాటలు ఏమైవున్నాయి? “నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.” (జెకర్యా 8:3) సా.శ.పూ. 607కు మునుపు, యెరూషలేము సత్యమును అనుసరించు పురముగా లేదు. దాని యాజకులూ ప్రవక్తలూ భ్రష్టులు, మరి దాని ప్రజలు అవిశ్వాసులు. (యిర్మీయా 6:13; 7:29-34; 13:23-27) ఇప్పుడు తాము పరిశుద్ధ ఆరాధనకు కట్టుబడి ఉన్నామని చూపిస్తూ దేవుని ప్రజలు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆత్మీయ భావంలో యెహోవా మరోసారి యెరూషలేములో నివసించాడు. యెరూషలేమునకు పరిశుద్ధ ఆరాధనా సత్యాలు మరోసారి చెప్పబడినందున, అది ‘సత్యమును అనుసరించు పురము’ అని పిలువబడగలదు. దాని ఉన్నతమైన స్థానం “యెహోవా పర్వతము”గా పిలువబడగలదు.
9. 1919లో “దేవుని ఇశ్రాయేలు” తమ స్థితిలో ఏ విశిష్ఠమైన మార్పుని అనుభవించారు?
9 ఈ రెండు ప్రకటనలు ప్రాచీనకాల ఇశ్రాయేలీయులకు అర్థవంతమైనవి, ఈ 20వ శతాబ్దం ముగింపుకొస్తుండగా అవి, మనకు కూడా మరింత భావాన్ని కల్గివున్నాయి. ఇంచుమించు 80 సంవత్సరాల క్రిందట, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో, అటుతరువాత “దేవుని ఇశ్రాయేలు”నకు ప్రాతినిధ్యం వహించిన కొన్ని వేలమంది అభిషిక్తులు, ప్రాచీనకాల ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి కొనిపోబడినట్లుగానే, ఆత్మీయ చెరలోనికి కొనిపోబడ్డారు. (గలతీయులు 6:16) ప్రవచనార్థకంగా, వారు వీధిలో పడివున్న శవాలుగా వర్ణించబడ్డారు. అయినప్పటికీ, వారికి యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలనే యథార్థమైన కోరిక ఉంది. (యోహాను 4:24) అందుకే, వారి ఆత్మీయ మృతకరమైన స్థితి నుండి వారిని లేపుతూ 1919లో యెహోవా వారిని చెరనుండి విడిపించాడు. (ప్రకటన 11:7-13) ఆవిధంగా యెహోవా, యెషయా యొక్క ఈ ప్రవచనాత్మక ప్రశ్నకు ప్రతిధ్వనించేలా అవును అని జవాబిచ్చాడు: “ఒక జనమును [“దేశమును,” NW] కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా?” (యెషయా 66:8) 1919లో, యెహోవా ప్రజలు మరోసారి ఆత్మీయ జనాంగంగా తమ స్వంత “దేశము”లో లేదా భూమిపైనున్న ఆత్మీయ స్థితినందు ఉన్నారు.
10. 1919 నుండి తమ “దేశము”లో అభిషిక్త క్రైస్తవులు ఏ ఆశీర్వాదాల్ని అనుభవిస్తున్నారు?
10 ఆ దేశంలో సురక్షితంగా ఉండి, అభిషిక్త క్రైస్తవులు యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయంలో సేవించారు. ఈ 20వ శతాబ్దం దాని అంతానికి సమీపిస్తుండగా ఇప్పటికీ తాము అనుభవిస్తున్న ఆధిక్యతయైన యేసు యొక్క భూ సంబంధమైన ఆస్తిని పరిరక్షించే బాధ్యతను అంగీకరించడం ద్వారా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”నిగా వారు ఏర్పర్చుకొనబడ్డారు. (మత్తయి 24:45-47) యెహోవాయే ‘శాంతికర్తయగు దేవుడు’ అనే గుణపాఠాన్ని వారు నేర్చుకున్నారు.—1 థెస్సలొనీకయులు 5:23.
11. క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు దేవుని ప్రజల శత్రువులుగా తమ్మును తాము ఎలా చూపించుకున్నారు?
11 అయితే, దేవుని ఇశ్రాయేలు యొక్క శత్రువుల విషయమేంటి? తన ప్రజల ఎడల యెహోవాకుగల ఆసక్తి, వ్యతిరేకులపై ఆయనకుగల రౌద్రంచే సమం చేయబడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో క్రైస్తవ మతసామ్రాజ్య మత నాయకులు సత్యాన్ని గూర్చి మాట్లాడుతున్న క్రైస్తవుల యొక్క ఈ చిన్న గుంపుపైకి గొప్ప ఒత్తిళ్లను తీసుకొచ్చి వారిని లేకుండా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఒకే ఒక విషయంలో క్రైస్తవమత సామ్రాజ్య పరిచారకులు ఏకమయ్యారు: ఆ పోరాటమందలి ఇరు పక్షాల్లో, యెహోవాసాక్షుల్ని అణచివేయడానికి వారు ప్రభుత్వాల్ని రెచ్చగొట్టారు. ఈనాడు కూడా, అనేక దేశాల్లో మత నాయకులు, యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రచార పనిని నిలిపివేయడానికి లేక నిషేధించడానికి ప్రభుత్వాల్ని రెచ్చగొడ్తున్నారు.
12, 13. క్రైస్తవమత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యెహోవా రౌద్రము ఎలా వ్యక్తపర్చబడింది?
12 దీన్ని యెహోవా గుర్తించకపోలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, మిగిలిన మహాబబులోనుతోపాటు క్రైస్తవమత సామ్రాజ్యం కూలిపోయింది. (ప్రకటన 14:8) క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క మృతకరమైన ఆత్మీయ స్థితిని బహిరంగంగా బయల్పరుస్తూ, దానిపైకి రానైవున్న నాశనాన్ని గూర్చి హెచ్చరిస్తూ 1922 మొదలుకొని, సూచనార్థక తెగుళ్లు పరంపరగా క్రుమ్మరింపబడినప్పుడు, దాని పతనాన్ని గూర్చిన వాస్తవం అందరికీ తెలిసిపోయింది. (ప్రకటన 8:7–9:21) ఈ తెగుళ్లు క్రుమ్మరింపబడ్తూనే ఉన్నాయనడానికి రుజువుగా, “అబద్ధ మతాంతం సమీపించింది” అనే ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23, 1995న ఇవ్వబడింది, అటుతరువాత ఓ ప్రత్యేక సంచికయైన రాజ్య వార్త యొక్క కోట్లాది ప్రతులు పంచిపెట్టబడ్డాయి.
13 నేడు, క్రైస్తవమత సామ్రాజ్యం దయనీయమైన స్థితిలో ఉంది. ఈ 20వ శతాబ్దమంతటిలో, దాని ప్రీస్టులు మత పరిచారకులచే ఆశీర్వదించబడిన భయంకరమైన యుద్ధాల్లో దాని సభ్యులు ఒకరినొకరు చంపుకున్నారు. కొన్ని దేశాల్లో దాని ప్రాబల్యం అస్సలు లేకుండా పోయింది. మిగిలిన మహాబబులోనుతోపాటు అది నాశనానికి నియమించబడింది.—ప్రకటన 18:21.
యెహోవా ప్రజల కొరకు శాంతి
14. శాంతిగల ప్రజల్ని గూర్చిన ఏ ప్రవచనాత్మకమైన పద చిత్రీకరణ తెలియజేయబడింది?
14 మరోవైపున, ఈ 1996వ సంవత్సరంలో, యెహోవా మూడవ ప్రకటనలో ఇలా వర్ణించబడినట్లుగా, తమ పునఃస్థాపిత దేశంలో యెహోవా ప్రజలు అధిక శాంతిని అనుభవిస్తారు: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.”—జెకర్యా 8:4, 5.
15. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా, యెహోవా సేవకులు ఏ శాంతిని అనుభవిస్తున్నారు?
15 ఈ ఆహ్లాదకరమైన పద చిత్రీకరణ ఈ యుద్ధ పీడిత ప్రపంచంలో విశిష్ఠమైన దాని గురించి తెలియజేస్తుంది అంటే శాంతి గల ప్రజలు ఉన్నారని తెలియజేస్తుంది. 1919 నుండి, యెషయా యొక్క ఈ ప్రవచనార్థకమైన మాటలు నెరవేరుతున్నాయి: “వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని [“శాంతి,” NW] చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . . దుష్టులకు నెమ్మదియుండదని [“శాంతి ఉండదని,” NW] నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 57:19-21) యెహోవా ప్రజలు లోకసంబంధులు కాకపోయినా, జనాంగాల కోలాహలానికి గురికాకుండా తప్పించుకోలేక పోవచ్చు. (యోహాను 17:15, 16) కొన్ని దేశాల్లో వారు తీవ్రమైన కష్టాల్ని సహించారు, కొంతమంది చంపబడ్డారు కూడా. అయినా, నిజ క్రైస్తవులు రెండు ప్రాముఖ్యమైన రీతుల్లో శాంతిని కల్గివున్నారు. మొదటిది, తమ ‘ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో శాంతిని వారు కల్గివున్నారు.’ (రోమీయులు 5:1) రెండవది, తమలో తామే శాంతిని కల్గివున్నారు. వారు ‘మొట్టమొదట పవిత్రమైనది, తరువాత శాంతికరమైనది’ అయిన “పైనుండివచ్చు జ్ఞా”నాన్ని పెంపొందింపజేసుకున్నారు. (యాకోబు 3:17; గలతీయులు 5:22-24) అంతేకాకుండా, “దీనులు భూమిని స్వతంత్రించుకొ[ని,] . . . బహు క్షేమము [“అధిక శాంతిని,” NW] కలిగి సుఖిం”చినప్పుడు పూర్తి భావంలో శాంతిని అనుభవించేందుకు వారు ఎదురు చూస్తున్నారు.—కీర్తన 37:11.
16, 17. (ఎ) ‘వృద్ధులు, వృద్ధురాండ్రు’ అలాగే ‘మగపిల్లలు, ఆడుపిల్లలు’ యెహోవా సంస్థను ఎలా పటిష్టం చేశారు? (బి) యెహోవా ప్రజల శాంతిని ఏది చూపిస్తోంది?
16 యెహోవా సంస్థ యొక్క తొలి విజయాలు జ్ఞాపకమున్న యెహోవా ప్రజలైన అభిషేకింపబడిన వారిలో ‘వృద్ధులు వృద్ధురాండ్రు’ ఇప్పటికీ ఉన్నారు. వారి విశ్వాసం, సహనం ఎంతో ప్రశంసించదగినవి. 1930వ దశాబ్దంనాటి ప్రచండమైన కాలంలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలోనూ అలాగే తరువాతి ఉత్తేజపర్చే అభివృద్ధిగల సంవత్సరాల్లోనూ యౌవన అభిషిక్తులు నాయకత్వం వహించారు. అంతేకాకుండా, విశేషంగా 1935 నుండి, “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్ప సమూహము” ప్రత్యక్షపర్చబడింది. (ప్రకటన 7:9; యోహాను 10:16) అభిషిక్త క్రైస్తవులు వృద్ధులవుతుండగానూ, వారి సంఖ్య తగ్గిపోతుండగానూ, వేరే గొఱ్ఱెలు ప్రకటన పనిని చేపట్టి, దానిని భూమియందంతటా వ్యాపింప చేశాయి. ఇటీవలి సంవత్సరాల్లో దేవుని ప్రజల దేశంలోనికి వేరే గొఱ్ఱెలు వెల్లువలా వస్తున్నారు. అంతెందుకు, గతసంవత్సరంలోనే, 3,38,491 మంది యెహోవాకు తాము చేసుకొన్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు! ఆత్మీయ భావంలో చెప్పాలంటే అలాంటి క్రొత్తవారు నిజానికి చిన్న పిల్లలు. “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును” గొప్ప స్తుతులను పాడ్తున్న వారి శ్రేణుల్ని తాము పెంచుతుండగా తమ క్రొత్తదనం, ఉత్సాహం అధికమౌతాయి.—ప్రకటన 7:10.
17 నేడు, ‘పట్టణపు వీధులు’ యౌవన బలంవంటి బలంగల సాక్షులైన ‘ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండి ఉన్నాయి.’ 1995వ సేవా సంవత్సరంలో, 232 దేశాలు, సముద్ర ద్వీపాల నుండి రిపోర్టులు వచ్చాయి. అయినా, అభిషిక్తులకు వేరే గొఱ్ఱెలకు మధ్య ఏ అంతర్జాతీయ విరోధంగాని, అంతర్గత వర్గ ద్వేషంగాని, అయుక్తమైన అసూయగాని లేవు. అందరూ ప్రేమయందు ఐక్యపర్చబడి, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సహోదరత్వం ప్రపంచపు తెరపై నిజంగా అసమానమైనది.—కొలొస్సయులు 3:14; 1 పేతురు 2:17.
యెహోవాకు మరీ కష్టమా?
18, 19. 1919 నుండి మానవ దృష్టికి మరీ కష్టమైనదిగా కన్పించగల దానిని యెహోవా ఎలా నెరవేర్చాడు?
18 వెనుకటికి 1918లో అభిషిక్త శేషం, ఆత్మీయ చెరలోవున్న కేవలం కొన్నివేలమంది నిరుత్సాహపర్చబడిన వారితో కూర్చబడినప్పుడు జరగబోయే సంఘటనల్ని ఎవ్వరూ ముందుగా గ్రహించి ఉండరు. అయినా, తన నాల్గవ ప్రవచనాత్మక ప్రకటనచే ఇలా ధ్రువపర్చబడినట్లుగా, యెహోవా ఎరుగును: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘ఆ దినములందు ప్రజలలో శేషించినవారి దృష్టికి కూడా అది మరీ కష్టమైనదిగా కన్పించినా, నా దృష్టికి అది మరీ కష్టమైనదిగా కన్పించునా?’ ఇదే యెహోవా వాక్కు.”—జెకర్యా 8:6, NW.
19 1919లో, జరగనైవున్న పని నిమిత్తం యెహోవా ఆత్మ తన ప్రజల్ని పునరుజ్జీవింప చేసింది. అప్పటికీ, యెహోవా ఆరాధికుల యొక్క చిన్న సంస్థను అంటిపెట్టుకోవడానికి విశ్వాసం కావాల్సి వచ్చింది. వారు చాలా తక్కువమంది, అనేక విషయాలు ఇంకా స్పష్టపర్చబడలేదు. అయినా, యెహోవా వారిని సంస్థాపరంగా కొద్ది కొద్దిగా బలపర్చి, సువార్త ప్రకటించి, శిష్యుల్ని తయారు చేసే క్రైస్తవ పనిని చేయడానికి వారిని సంసిద్ధుల్ని చేశాడు. (యెషయా 60:17, 19; మత్తయి 24:14; 28:19, 20) క్రమేణా, తటస్థవైఖరి, విశ్వ సర్వాధిపత్యం వంటి ప్రాముఖ్యమైన వివాదాంశాల్ని వివేచించడానికి ఆయన వారికి సహాయపడ్డాడు. సాక్షుల యొక్క ఆ చిన్న గుంపు ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం యెహోవాకు మరీ కష్టమైనదవుతుందా? కచ్చితంగా కష్టం కాదనేదే జవాబు! అది ఈ పత్రికలోని 12 నుండి 15 పేజీల్లో, 1995వ సేవా సంవత్సరం కొరకైన యెహోవాసాక్షుల పనిని గూర్చిన పట్టికనందు ధ్రువపర్చబడింది.
“నేను వారికి దేవుడనై యుందును”
20. దేవుని ప్రజల సమీకరణ ఎంత విస్తృతంగా ఉంటుందని ప్రవచింపబడింది?
20 యెహోవాసాక్షుల యొక్క నేటి సంతోషదాయకమైన పరిస్థితిని ఐదవ ప్రకటన ఇలా చూపిస్తున్నది: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—తూర్పు దేశములోనుండియు పడమటి దేశములోనుండియు నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.”—జెకర్యా 8:7, 8.
21. యెహోవా ప్రజల అధిక శాంతి ఏ విధంగా కాపాడబడుతుంది, విస్తృతపర్చబడుతుంది?
21 1996లో మనం ‘తూర్పు దేశము నుండి పడమటి దేశము వరకు’ అంటే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడిందని నిస్సంకోచంగా చెప్పగలం. అన్ని జనాంగాల నుండి శిష్యులు తయారు చేయబడ్తున్నారు, వారు యెహోవా యొక్క ఈ వాగ్దాన నెరవేర్పును చూశారు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి [“శాంతి,” NW] కలుగును.” (యెషయా 54:13) మనం యెహోవాచే బోధింపబడినందున మనం శాంతిని కల్గివున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సాహిత్యాలు 300 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురించబడ్డాయి. గత సంవత్సరంలోనే 21 భాషలు అదనంగా చేర్చబడ్డాయి. కావలికోట పత్రిక ఇప్పుడు ఏకకాలంలో 111 భాషల్లోనూ తేజరిల్లు! పత్రిక 54 భాషల్లోనూ ప్రచురించబడ్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ సమావేశాలు దేవుని ప్రజల శాంతిని బహిరంగంగా ప్రదర్శిస్తున్నాయి. ప్రతి వారం జరిగే కూటాలు మనల్ని ఐక్యపరుస్తూ, మనం స్థిరంగా ఉండడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. (హెబ్రీయులు 10:23-25) అవును, యెహోవా తన ప్రజలకు “నీతి సత్యములనుబట్టి” బోధిస్తున్నాడు. ఆయన తన ప్రజలకు శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఆ అధిక శాంతిని పంచుకోవడానికి మనమెంత ఆశీర్వదింపబడ్డామో కదా!
మీరు వివరించగలరా?
◻ ఆధునిక కాలమందు తన ప్రజల విషయంలో ‘బహురౌద్రముగా అసూయను’ యెహోవా ఎలా కల్గివున్నాడు?
◻ యుద్ధ పీడిత దేశాల్లో సహితం, యెహోవా ప్రజలు శాంతిని ఎలా అనుభవిస్తున్నారు?
◻ ‘మగపిల్లలతోను, ఆడపిల్లలతోను’ వీధులు ఏవిధంగా నిండిపోయాయి?
◻ యెహోవా ప్రజలు ఆయనచే బోధించబడగల్గే ఏ ఏర్పాట్లు చేయబడ్డాయి?
[12-15వ పేజీలోని చిత్రం]
ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 1995 సేవా సంవత్సరపు నివేదిక
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
[8, 9వ పేజీలోని చిత్రం]
సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో, ఆలయాన్ని పునర్నిర్మించిన విశ్వాసులైన యూదులు, యెహోవా మాత్రమే శాంతికి నమ్మకమైన మూలమని తెల్సుకున్నారు