దేవుని వాక్యాన్ని చదివి, సత్యమందు ఆయన సేవ చేయండి
“యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము.”—కీర్తన 86:11.
1. ముఖ్యంగా, సత్యము గురించి ఈ పత్రిక మొదటి సంచిక ఏమి తెలియజేసింది?
యెహోవా వెలుగును, సత్యమును బయలుదేరజేస్తాడు. (కీర్తన 43:3) తన వాక్యమైన బైబిలును చదివి, సత్యాన్ని నేర్చుకొనే సామర్థ్యాన్ని కూడా ఆయన మనకు ఇస్తాడు. ఈ పత్రిక మొదటి సంచిక—జూలై 1879—ఇలా తెలియజేసింది: “సత్యం, జీవితారణ్యంలో ఒక లేత పుష్పంలా, తప్పులనే అనేక కలుపు మొక్కల మధ్య చిక్కుకుపోయి, దాదాపు అణిచి వేయబడినట్లే ఉంది. మీరు దాన్ని కనుగొనాలంటే ఎల్లప్పడూ మీరు మెలకువగా ఉండాలి. మీరు దాని సౌందర్యాన్ని చూడాలంటే, తప్పుల కలుపు మొక్కలను, మూఢత్వపు ముండ్ల చెట్లను ప్రక్కకు నెట్టివేయాలి. మీరు దాన్ని పొందాలంటే, దాన్ని అందుకోవడానికి మీరు క్రిందికి వంగాలి. కేవలం ఒకే సత్య పుష్పంతో తృప్తిపడకండి. అది ఒక్కటే సరిపోయేలాగైతే ఇన్ని సృష్టించబడి ఉండేవి కావు. సమకూర్చుకుంటూనే ఉండండి, వెదుకుతూనే ఉండండి.” దేవుని వాక్యాన్ని చదవడం, పఠించడం కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆయన సత్యములో నడవడానికి మనకు సహాయం చేస్తాయి.—కీర్తన 86:11.
2. ఎజ్రా మరియు ఇతరులు, ప్రాచీన యెరూషలేములో యూదులకు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు ఏమి జరిగింది?
2 సా.శ.పూ. 455లో యెరూషలేము గోడలు పునర్నిర్మించబడిన తర్వాత, యాజకుడైన ఎజ్రా, మరితరులు యూదులకు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించారు. దాని తర్వాత వారు ఆనందంగా పర్ణశాలల పండుగ చేసుకొని, పాపాలను ఒప్పుకొని చివరకు ఒక “స్థిరమైన నిబంధన” చేసుకున్నారు. (నెహెమ్యా 8:1–9:38) మనమిలా చదువుతాము: “వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.” (నెహెమ్యా 8:8) యూదులకు హెబ్రీ అంతగా అర్థమయ్యేది కాదు గనుక అరామిక్ భావానువాదం చేయబడిందని కొందరు పండితులు సూచిస్తారు. కాని ఆ భాషలోని పదాల సరైన వివరణను లేఖనం సూచించేదికాదు. ప్రజలు ధర్మశాస్త్రంలోని సూత్రాలను గ్రహించి వాటిని అన్వయించుకొనగలిగేలా ఎజ్రా మరితరులు దాన్ని వివరించేవారు. క్రైస్తవ ప్రచురణలు మరియు కూటాలు కూడా దేవుని వాక్యానికి ‘అర్థము చెప్పడానికి’ దోహదపడతాయి. ‘బోధింప సమర్థులైన’ నియమిత పెద్దలు కూడా అదే పని చేస్తారు.—1 తిమోతి 3:1, 2; 2 తిమోతి 2:24.
శాశ్వత ప్రయోజనాలు
3. బైబిలు చదవడం ద్వారా వచ్చే కొన్ని ప్రయెజనాలు ఏవి?
3 క్రైస్తవ కుటుంబాలు బైబిలును కలిసి చదివినప్పుడు, శాశ్వత ప్రయోజనాలను పొందగలవు. వారు దేవుని కట్టడలతో సుపరిచితులై, సిద్ధాంతాలు, ప్రవచనాలు మరియు ఇతర అంశాలను గూర్చిన సత్యాన్ని నేర్చుకుంటారు. బైబిలులోని ఒక భాగం చదువబడిన తర్వాత, కుటుంబ శిరస్సు ఇలా అడుగవచ్చు: ఇది మనల్ని ఎలా ప్రభావితం చేయాలి? ఇది బైబిల్లోని ఇతర బోధలతో ఏవిధంగా సంబంధం కల్గివుంది? సువార్తను ప్రకటించడంలో మనం ఈ అంశాలను ఎలా ఉపయోగించగలము? ఒక కుటుంబం బైబిలు చదివేటప్పుడు, కావలికోట ప్రచురణల అనుక్రమణిక (ఆంగ్లం) లేక మరితర అనుక్రమణికలను ఉపయోగించి పరిశోధన చేయడం ద్వారా ఎక్కువ అంతర్దృష్టిని పొందవచ్చు. లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) యొక్క రెండు సంపుటిలను ప్రయోజనకరంగా సంప్రదించవచ్చు.
4. యెహోషువ 1:8 నందు వ్రాయబడివున్న ఉపదేశాన్ని యెహోషువ ఎలా అన్వయించుకొనవలసి ఉండెను?
4 లేఖనాల నుండి తీసుకొనబడిన సూత్రాలు జీవితంలో మనకు నడిపింపునివ్వగలవు. అంతేగాక, ‘పరిశుద్ధ లేఖనములను’ చదవడం, పఠించడం ‘మనల్ని రక్షణ కొరకు యోగ్యులను’ చేయగలవు. (2 తిమోతి 3:15) దేవుని వాక్యం మనకు నడిపింపునిచ్చేందుకు మనం అనుమతిస్తే, మనం ఆయన సత్యంలో నడుస్తూనే ఉంటాం, మన నీతియుక్తమైన కోరికలు నెరవేర్చబడతాయి. (కీర్తన 26:3; 119:130) మోషే తర్వాత వచ్చిన యెహోషువ చేసినట్లు మనం అవగాహన కొరకు వెదకాలి. “ధర్మశాస్త్రగ్రంథమును” బోధించడంలో ఆయన తప్పిపోకూడదు, దాన్ని ఆయన దివారాత్రములు చదువవలసి ఉండెను. (యెహోషువ 1:8) యెహోషువ “ధర్మశాస్త్రగ్రంథమును” బోధించడంలో తప్పిపోకూడదు అంటే దాని భావం, అది చెప్పే జ్ఞానయుక్తమైన విషయాలను ఇతరులకు చెప్పడాన్ని ఆయన మానకూడదు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదవడం అంటే దాని భావం, యెహోషువ దాన్ని ధ్యానించాలి, దాన్ని పఠించాలి. అలాగే తిమోతిని తన ప్రవర్తన గురించి, పరిచర్య గురించి, బోధ గురించి ‘మనస్కరించమని’ అంటే ధ్యానించమని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. ఒక క్రైస్తవ పెద్దగా తిమోతి, తన జీవితాన్ని మాదిరికరంగా ఉంచుకుంటూ, లేఖన సత్యాన్ని తాను బోధించేలా ప్రత్యేక జాగ్రత్త వహించడం అవసరమైయుండెను.—1 తిమోతి 4:15.
5. మనం దేవుని సత్యాన్ని కనుగొనాలంటే ఏమి అవసరం?
5 దేవుని సత్యం అమూల్యమైన సంపద. దాన్ని కనుగొనడానికి లోతుగా అన్వేషించడం, లేఖనాల్లో ఎడతెగక వెదకడం అవసరం. మహాగొప్ప బోధకుని పిల్లలవంటి విద్యార్థులుగా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందుతాము, యెహోవా ఎడల భక్తితోకూడిన భయం కలిగివుండడమంటే ఏమిటో గ్రహిస్తాము. (సామెతలు 1:7; యెషయా 30:20, 21) అయితే, మనం విషయాలను లేఖనాధారంగా నిరూపించాలి. (1 పేతురు 2:1, 2) బెరయలోని యూదులు “థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలు . . . చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” అలా చేసినందుకు బెరయ సంఘస్థులు నిందింపబడే బదులు మెచ్చుకోబడ్డారు.—అపొస్తలుల కార్యములు 17:10, 11.
6. లేఖనాలను వెదకడం వల్ల కొంతమంది యూదులకు ఏ ప్రయోజనమూ చేకూరలేదని యేసు ఎందుకు సూచించగలిగాడు?
6 కొంతమంది యూదులతో యేసు ఇలా చెప్పాడు: “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.” (యోహాను 5:39, 40) వారు మంచి ఉద్దేశంతోనే అంటే తమను జీవానికి నడిపించగలవనే ఉద్దేశంతోనే లేఖనాలను వెదికారు. వాస్తవానికి, యేసు జీవానికి నడిపే మూలమని సూచించే మెస్సీయ ప్రవచనాలు లేఖనాల్లో ఉన్నాయి. కాని యూదులు ఆయనను నిరాకరించారు. అందువలన లేఖనాలను వెదకడం వారికి ప్రయోజనకరం కాలేదు.
7. బైబిలును అర్థం చేసుకునే విషయంలో అభివృద్ధి సాధించడానికి ఏమి అవసరం మరియు ఎందుకు?
7 మనకున్న బైబిలు అవగాహనను వృద్ధిచేసుకోవడానికి, మనకు దేవుని ఆత్మ లేక చురుకైన శక్తి యొక్క నడిపింపు అవసరం. భావాన్ని వెలికి తీయడానికి ‘దేవుని మర్మములతో సహా ఆత్మ అన్నింటిని పరిశోధిస్తుంది.’ (1 కొరింథీయులు 2:10) థెస్సలొనీకలోని క్రైస్తవులు తాము విన్న ఏ ప్రవచనంలోనైనా ‘సమస్తమును పరీక్షించవలసి’ యుండిరి. (1 థెస్సలొనీకయులు 5:20, 21) కాబట్టి థెస్సలొనీకయులు మరియు బెరయ సంఘస్థులు హెబ్రీ లేఖనాల గ్రీకు భాషా సెప్టాజింట్ వర్షన్‌ను పరిశీలించడం ద్వారా సమస్తమును పరీక్షించగలిగారు. వారు లేఖనాలను చదవడం, పఠించడం అవసరమయ్యింది, మనం కూడా అలాగే చేయాలి.
అందరికీ ప్రాముఖ్యం
8. నియమిత పెద్దలు ఎందుకు మంచి బైబిలు పరిజ్ఞానాన్ని కల్గివుండాలి?
8 నియమిత పెద్దలు అపారమైన బైబిలు జ్ఞానాన్ని కలిగివుండాలి. వారు ‘బోధింపతగినవారై’ ఉండాలి మరియు ‘నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువారై యుండాలి.’ అధ్యక్షుడైన తిమోతి “సత్యవాక్యమును సరిగా ఉపదేశించ” వలసి ఉండెను. (1 తిమోతి 3:2; తీతు 1:9; 2 తిమోతి 2:15) ఆయన తండ్రి అవిశ్వాసి అయినప్పటికీ, ఆయన తల్లి యునీకే మరియు అమ్మమ్మ లోయి పసితనం నుండి పరిశుద్ధ లేఖనాలను బోధించి, ఆయనలో ‘నిష్కపటమైన విశ్వాసాన్ని’ నాటారు. (2 తిమోతి 1:5; 3:15) విశ్వాసులైన తండ్రులు తమ పిల్లలను ‘యెహోవా యొక్క శిక్షలోను బోధలోను’ పెంచాలి, ప్రాముఖ్యంగా “దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగల” తండ్రులైయున్న పెద్దలు అలా చేయాలి. (ఎఫెసీయులు 6:4; తీతు 1:6) కాబట్టి, మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మనం దేవుని వాక్యాన్ని చదివి, పఠించి మరియు అన్వయించుకొనే అవసరతను ఎంతో గంభీరంగా ఎంచాలి.
9. తోటి క్రైస్తవులతో కలిసి ఎందుకు బైబిలును పఠించాలి?
9 తోటి విశ్వాసుల సహవాసంలో కూడా మనం బైబిలును పఠించాలి. థెస్సలొనీకలోని క్రైస్తవులు తన ఉపదేశాన్ని ఒకరితో ఒకరు చర్చించుకోవాలని పౌలు ఇష్టపడ్డాడు. (1 థెస్సలొనీకయులు 4:18) సత్యాన్ని గూర్చిన మన అవగాహనను వృద్ధి చేసుకోవడానికి, లేఖనాలను పరీక్షించడంలో ఇతర సమర్పిత విద్యార్థులను కలవడంకంటే మరో శ్రేష్ఠమైన మార్గం లేదు. “ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును” అనే సామెత వాస్తవమే. (సామెతలు 27:17) ఇనుప ఉపకరణాన్ని ఉపయోగించకపోతే, పదునుపెట్టకపోతే అది తుప్పు పట్టగలదు. అలాగే, మనం ఒకరినొకరం క్రమంగా కలుస్తూ, దేవుని వాక్య సత్యాన్ని చదివి, పఠించి, ధ్యానించి మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఒకరికొకరం పదునుపెట్టుకోవచ్చు. (హెబ్రీయులు 10:24, 25) అంతేగాక, ఆత్మీయ వెలుగు కిరణాల నుండి మనం తప్పకుండా ప్రయోజనం పొందడానికి ఇది ఒక మార్గం.—కీర్తన 97:11; సామెతలు 4:18.
10. సత్యమందు నడవడమంటే భావమేమిటి?
10 లేఖనాలను మనం పఠించేటప్పుడు, కీర్తనల గ్రంథకర్తలా మనం తగినట్లుగానే ఇలా ప్రార్థించవచ్చు: “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును.” (కీర్తన 43:3) మనం దేవుని అంగీకారం పొందాలనుకుంటే, మనమాయన సత్యమందు నడవాలి. (3 యోహాను 3, 4) ఇందులో ఆయన కట్టడలకు తగినట్లు నడుచుకోవడం, విశ్వాస యథార్థతలతో ఆయన సేవ చేయడం చేరివున్నాయి. (కీర్తన 25:4, 5; యోహాను 4:23, 24) యెహోవా వాక్యంలో బయల్పర్చబడినట్లుగా మరియు ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ప్రచురణలలో స్పష్టపర్చబడినట్లుగా మనం సత్యంతో ఆయన సేవచేయాలి. (మత్తయి 24:45-47) దీని కొరకు లేఖనాలను గూర్చిన కచ్చితమైన జ్ఞానం అవసరం. మరైతే మనం దేవుని వాక్యాన్ని ఎలా చదివి, పఠించాలి? ఆదికాండము మొదటి అధ్యాయం, మొదటి వచనంతో ప్రారంభించి మనం మొత్తం 66 పుస్తకాలు చదవాలా? అవును, తన స్వంత భాషలో మొత్తం బైబిలును కలిగివున్న ప్రతి క్రైస్తవుడు దాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు చదవాలి. బైబిలును, క్రైస్తవ ప్రచురణలను చదవడంలో మన ఉద్దేశం, ‘నమ్మకమైన దాసుని’ ద్వారా దేవుడు అందజేసిన లేఖనాధార సత్య సముదాయం యొక్క గ్రహింపును వృద్ధి చేసుకోవడమై ఉండాలి.
దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదవండి
11, 12. కూటాలలో బైబిలును బిగ్గరగా చదవడం ఎందుకు ప్రయోజనకరం?
11 మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా చదువుకోవచ్చు. అయితే, ప్రాచీన కాలాల్లో వ్యక్తిగతంగా చదువుకొనేటప్పుడు బిగ్గరగా చదువుకునే వారు. ఐతియొపీయుడైన నపుంసకుడు తన రథంలో వెళుతూ, యెషయా ప్రవచనంలో నుండి చదవడం సువార్తికుడైన ఫిలిప్పు విన్నాడు. (అపొస్తలుల కార్యములు 8:27-30) ‘చదవడం’ అని అనువదించబడిన హెబ్రీ పదానికి ప్రాథమికంగా “పిలవడం” అని భావం. కాబట్టి, మొదట్లో నిశ్శబ్దంగా చదివి, చదువుతున్న దాని భావాన్ని గ్రహించలేని వారు, ప్రతి పదాన్ని బిగ్గరగా పలికే విషయంలో నిరుత్సాహపడకూడదు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని లిఖిత వాక్యాన్ని చదవడం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడమే.
12 క్రైస్తవ కూటాల్లో బైబిలును బిగ్గరగా చదవడం ప్రయోజనకరం. అపొస్తలుడైన పౌలు తన జత పనివాడైన తిమోతిని ఇలా కోరాడు: “బహిరంగముగా చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.” (ఇటాలిక్కులు మావి.) (1 తిమోతి 4:13, NW) పౌలు కొలొస్సయులకు ఇలా చెప్పాడు: “ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.” (కొలొస్సయులు 4:16) మరియు ప్రకటన 1:3 ఇలా చెబుతుంది: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు బిగ్గరగా చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” కాబట్టి, బహిరంగ ప్రసంగికుడు తాను సంఘానికి చెప్పేదానికి మద్దతుగా బైబిలులో నుండి లేఖనాలను చదవాలి.
అంశానుక్రమమైన పఠన విధానం
13. బైబిలు సత్యాలను నేర్చుకోవడంలో అత్యంత పురోభివృద్ధికరమైన పద్ధతి ఏది, లేఖనాలను కనుగొనడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
13 లేఖనాధార సత్యాలను నేర్చుకోవడానికి అంశానుక్రమమైన పఠన విధానం అత్యంత పురోభివృద్ధికరమైన పద్ధతి. పుస్తకం, అధ్యాయం, వచనం ప్రకారం వాటి సందర్భాన్ని బట్టి అక్షరక్రమంలో పొందుపర్చబడిన బైబిలు పదాలుగల అకారాది సూచికలు, ఒక అంశానికి సంబంధించిన లేఖనాలను కనుగొనడాన్ని సులభతరం చేస్తాయి. బైబిలు గ్రంథకర్త తనకు తాను పరస్పర విరుద్ధంగా చెప్పడు గనుక అలాంటి లేఖనాలు ఒకదానితో మరోదాన్ని సమన్వయపర్చవచ్చు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా, 16 శతాబ్దాల కాలంలో దాదాపు 40 మంది పురుషులను బైబిలును వ్రాసేలా ప్రేరేపించాడు, కాబట్టి, దాన్ని అంశానుక్రమమైన పద్ధతి ప్రకారం పఠించడం సత్యాన్ని నేర్చుకునేందుకుగల ఒక మార్గంగా కాలపరీక్షలో తేలింది.
14. హెబ్రీ మరియు క్రైస్తవ గ్రీకు లేఖనాలను కలిపి ఎందుకు పఠించాలి?
14 బైబిలు సత్యం ఎడల మనకుగల మెప్పుదల మనం హెబ్రీ లేఖనాలతోపాటు క్రైస్తవ గ్రీకు లేఖనాలను కూడా చదివి పఠించేందుకు మనల్ని పురికొల్పాలి. గ్రీకు లేఖనాలు దేవుని సంకల్పంతో ఎలా ముడిపడి ఉన్నాయో ఇది మనకు చూపిస్తుంది, హెబ్రీ లేఖనముల్లోని ప్రవచనాలపై వెలుగును ప్రసరింపజేస్తుంది. (రోమీయులు 16:25-27; ఎఫెసీయులు 3:4-6; కొలొస్సయులు 1:26) ఈ విషయంలో పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము (ఆంగ్లం) ఎంతో సహాయకంగా ఉంటుంది. అది మూల బైబిలు లేఖనాలు, దాని పూర్వాపరాలు మరియు భాషాసాంప్రదాయ పదాలకు సంబంధించి అందుబాటులో ఉన్న విస్తృత జ్ఞానాన్ని సముపార్జించిన సమర్పిత దేవుని సేవకుల ద్వారా సిద్ధం చేయబడింది. ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా అందజేసిన బైబిలు పఠన సహాయకాలు కూడా ప్రాముఖ్యమైనవి.
15. బైబిలులో వేరు వేరు స్థలాల్లో నుండి ఎత్తిచెప్పడం తగినదేనని మీరు ఎలా నిరూపిస్తారు?
15 కొందరిలా అనవచ్చు, ‘మీ ప్రచురణలలో బైబిలులో నుండి వేలాది సార్లు ఎత్తివ్రాయబడిన లేఖనాలు ఉంటాయి, కాని మీరు వాటిని వేరు వేరు స్థలాల్లో నుండి ఎందుకు తీసుకుంటారు?’ బైబిలు యొక్క 66 పుస్తకాల్లోని వేరు వేరు స్థలాల్లో నుండి ఎత్తివ్రాయడం ద్వారా ప్రచురణలు ఒక బోధ యొక్క సత్యసంధతను నిరూపించడానికి అనేక ప్రేరేపిత రుజువులను అందజేస్తాయి. యేసు తానే ఈ రకమైన బోధనా పద్ధతిని ఉపయోగించాడు. ఆయన కొండమీది ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు, హెబ్రీ లేఖనాల్లో నుండి 21 సార్లు ఎత్తి తెల్పాడు. ఆ ప్రసంగంలో నిర్గమకాండము నుండి మూడు, లేవీయకాండము నుండి రెండు, సంఖ్యాకాండము నుండి ఒకటి, ద్వితీయోపదేశకాండము నుండి ఆరు, రెండవ రాజుల నుండి ఒకటి, కీర్తనల నుండి నాలుగు, యెషయా నుండి మూడు, యిర్మీయా నుండి ఒకటి, ఇలా లేఖనాలను ఎత్తిచూపించాడు. ఇలా చేయడం ద్వారా, యేసు ‘దేన్నైనా కేవలం నిరూపించాలని ప్రయత్నించాడా?’ లేదు, ఎందుకంటే ‘ఆయన శాస్త్రులవలె కాదుగాని, అధికారం గల వ్యక్తిలా బోధించేవాడు.’ అలా ఎందుకంటే యేసు తన బోధకు మద్దతుగా దేవుని లిఖిత వాక్యాన్ని తీసుకున్నాడు. (మత్తయి 7:29) అపొస్తలుడైన పౌలు కూడా అలాగే చేశాడు.
16. రోమీయులు 15:7-13 నందు పౌలు ఏ లేఖనాలను ఎత్తివ్రాశాడు?
16 రోమీయులు 15:7-13 నందున్న లేఖన వృత్తాంతంలో పౌలు మూడు హెబ్రీ లేఖన భాగాలలో నుండి అంటే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తల వచనాలలో నుండి, కీర్తనలలో నుండి ఎత్తివ్రాశాడు. యూదులు, అన్యులు దేవుని సేవచేస్తారని, గనుక క్రైస్తవులు అన్ని జనాంగాల ప్రజలను ఆహ్వానించాలని ఆయన చూపించాడు. పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై—ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని [కీర్తన 18:49 నందు] వ్రాయబడియున్నది. మరియు [ద్వితీయోపదేశకాండము 32:43 నందు] అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు [కీర్తన 117:1 నందు] సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా [11:1,10 నందు] ఈలాగు చెప్పుచున్నాడు—యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.” ఈ అంశానుక్రమమైన పద్ధతి ద్వారా పౌలు బైబిలు సత్యాలను స్థాపించేందుకు లేఖనాలను ఎలా ఎత్తి వ్రాయాలో చూపించాడు.
17. గతంలోని ఏ మాదిరికి అనుగుణంగా క్రైస్తవులు మొత్తం బైబిలులోని వేరు వేరు స్థలాల్లో నుండి ఎత్తిచెబుతారు?
17 అపొస్తలుడైన పేతురు యొక్క మొదటి ప్రేరేపిత లేఖలో, ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తలలో నుండి, కీర్తనలలో నుండి మొత్తం పది పుస్తకాలలో నుండి 34 సార్లు ఎత్తివ్రాయబడ్డాయి. పేతురు తన రెండవ ఉత్తరంలో, మూడు పుస్తకాల్లో నుండి ఆరు సార్లు ఎత్తివ్రాశాడు. మత్తయి సువార్తలో ఆదికాండము మొదలుకొని మలాకీ వరకున్న వాటిలో నుండి 122 సార్లు ఎత్తివ్రాయబడ్డాయి. గ్రీకు లేఖనాల 27 పుస్తకాలలో, ఆదికాండము మొదలుకొని మలాకీ వరకున్న వాటిలో నుండి 320 సార్లు నేరుగా ఎత్తివ్రాయబడ్డాయి, అలాగే హెబ్రీ లేఖనాల్లో నుండి ఇతర వందలాది సార్లు సూచించబడ్డాయి. యేసు స్థాపించిన, ఆయన అపొస్తలులు అనుసరించిన ఆ దృష్టాంతానికి అనుగుణంగా, ఆధునిక-దిన క్రైస్తవులు లేఖన అంశాన్ని క్రమమైన పద్ధతిలో పఠించేటప్పుడు, వారు మొత్తం బైబిలులోని వేరు వేరు స్థలాల్లో నుండి ఎత్తిచెప్తారు. అనేక హెబ్రీ మరియు గ్రీకు లేఖనాలు నెరవేరుతున్న ఈ “అంత్య దినములలో” ఈ పద్ధతి నిశ్చయంగా తగినదే. (2 తిమోతి 3:1) ‘నమ్మకమైన దాసుడు’ బైబిలును తన ప్రచురణలలో అంత బాగా ఉపయోగిస్తాడు, కాని దేవుని వాక్యానికి ఏదైనా చేర్చడంగాని, దానిలో నుండి తీసివేయడంగాని జరుగదు.—సామెతలు 30:5, 6; ప్రకటన 22:18, 19.
ఎల్లప్పుడు సత్యములో నడవండి
18. ఎందుకు ‘సత్యమందు నడవాలి’?
18 మనం బైబిలు నుండి ఏమీ తీసివేయకూడదు, ఎందుకంటే దేవుని వాక్యంలోని క్రైస్తవ బోధయంతయు “సత్యము” లేక “సువార్త సత్యము.” ఈ సత్యాన్ని హత్తుకోవడం—దానిలో “నడుచుచుండుట”—రక్షణ పొందడానికి అవశ్యం. (గలతీయులు 2:5; 2 యోహాను 4; 1 తిమోతి 2:3, 4) క్రైస్తవత్వం “సత్యమార్గము” గనుక, దాన్ని వ్యాపింపజేయడంలో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం “సత్యమునకు సహాయకుల”మౌతాము.—2 పేతురు 2:2; 3 యోహాను 8.
19. మనమెలా “సత్యమును అనుసరించి నడుచుచు” ఉండగలం?
19 మనం “సత్యమును అనుసరించి నడుచుచు” ఉండాలంటే, బైబిలును చదివి, ‘నమ్మకమైన దాసుని’ ద్వారా దేవుడు అందజేస్తున్న ఆత్మీయ సహాయం నుండి మనం ప్రయోజనం పొందాలి. (23 యోహాను 4) దీన్ని మనం మన మంచి కొరకే అంటే యెహోవా దేవుని గురించి, యేసు క్రీస్తు గురించి, దైవిక సంకల్పం గురించి ఇతరులకు బోధించే స్థానంలో ఉండడానికే చేద్దాము. యెహోవా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, సత్యమందు ఆయన సేవ చేయడంలో విజయవంతం కావడానికి ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తున్నందున మనం కృతజ్ఞత కలిగివుందాము.
మీ సమాధానాలు ఏమిటి?
◻ బైబిలు చదవడం ద్వారా వచ్చే కొన్ని శాశ్వత ప్రయోజనాలేమిటి?
◻ తోటి విశ్వాసులతో కలిసి బైబిలును ఎందుకు పఠించాలి?
◻ బైబిలంతటిలో వివిధ స్థలాల్లో నుండి ఎత్తిచెప్పడం ఎందుకు తగినది?
◻ ‘సత్యమందు నడవడం’ అంటే భావమేమిటి మరియు మనం అలా ఎలా చేయగలము?
[17వ పేజీలోని చిత్రం]
తలిదండ్రులారా, మీ పిల్లలకు లేఖనాలను బోధించండి
[18వ పేజీలోని చిత్రం]
కొండమీది ప్రసంగంలో యేసు హెబ్రీ లేఖనాలలోని వివిధ స్థలాల్లో నుండి ఎత్తిచూపించాడు