కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 7/1 పేజీలు 8-13
  • ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అతి పరిశుద్ధ స్థలము
  • పరిశుద్ధ స్థలము
  • ఆవరణం
  • ప్రాయశ్చిత్త దినం
  • మొదటి ఆలయం, రెండవ ఆలయం
  • దేవుడు తన భూ సంబంధ మందిరాన్ని నిరంతరం విడిచిపెట్టడం
  • యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • “యిష్టవస్తువులు” యెహోవా మందిరంలోనికి వస్తున్నాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 7/1 పేజీలు 8-13

‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం’

“నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా?”—మార్కు 11:17.

1. ఆదాముహవ్వలు దేవునితో ప్రాథమికంగా ఏ విధమైన సంబంధాన్ని కలిగివుండిరి?

ఆదాముహవ్వలు సృష్టించబడినప్పుడు, వారు తమ పరలోకపు తండ్రితో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేవారు. యెహోవా దేవుడు వారితో సంభాషించి, మానవజాతి ఎడల తనకుగల అద్భుతమైన సంకల్పాన్ని గురించి తెలియజేశాడు. నిజంగా, యెహోవా అద్భుతమైన సృష్టికార్యాలనుబట్టి వారు తరచూ ఆయనను బహుగా స్తుతించేలా పురికొల్పబడేవారు. ఆదాముహవ్వలు మానవ కుటుంబ భవిష్యత్‌ తలిదండ్రులుగా తమ పాత్ర గురించి ఆలోచించినప్పుడు వారికి నడిపింపు అవసరమైతే, వారు తమ పరదైసు గృహంలోని ఏ స్థలం నుండైనా దేవున్ని సమీపించవచ్చు. వారికి, ఆలయంలో యాజకుడు చేసేలాంటి సేవల అవసరం లేకుండెను.—ఆదికాండము 1:28.

2. ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు ఏ మార్పు సంభవించింది?

2 తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత, ‘దేవునివలె’ ఉంటావని హవ్వతో చెబుతూ, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరాకరిస్తే తన జీవిత పరిస్థితి మెరుగవుతుందని తలంచేలా ఆమెను మోసగించాడు. అలా, హవ్వ దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిన్నది. ఆ తర్వాత హవ్వ తన భర్తను శోధించేలా సాతాను ఆమెను ఉపయోగించుకున్నాడు. దేవునితో తనకుగల సంబంధంకంటే పాపియైన తన భార్యతో తన సంబంధమే ఎక్కువ విలువైనదని చూపిస్తూ, ఆదాము ఆమె మాటే వినడం విచారకరం. (ఆదికాండము 3:4-7) తద్వారా, ఆదాముహవ్వలు సాతానును తమ దేవునిగా ఎంపిక చేసుకున్నారు.—2 కొరింథీయులు 4:4 పోల్చండి.

3. ఆదాముహవ్వల తిరుగుబాటు యొక్క చెడు ఫలితాలు ఏమిటి?

3 అలా చేయడం ద్వారా, మొదటి మానవజత దేవునితో తమకుగల అమూల్యమైన సంబంధాన్నే కాదుగాని భూ పరదైసులో నిరంతరం జీవించే ఉత్తరాపేక్షను కూడా కోల్పోయారు. (ఆదికాండము 2:16, 17) వారు మరణించే వరకు వారి పాపభరిత శరీరాలు క్రమేణ క్షీణించిపోయాయి. వారి సంతానం ఈ పాపభరిత స్థితిని వారసత్వంగా పొందారు. అందుకే “మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని బైబిలు వివరిస్తుంది.—రోమీయులు 5:12.

4. పాపులైన మానవజాతి కొరకు దేవుడు ఏ నిరీక్షణనుంచాడు?

4 పాపభరిత మానవజాతిని వారి పరిశుద్ధ సృష్టికర్తతో సమన్వయపర్చడానికి ఒకటి అవసరమైంది. ఆదాముహవ్వలకు మరణశిక్ష విధించేటప్పడు, సాతాను తిరుగుబాటు ప్రభావాల నుండి మానవజాతిని కాపాడగల ఒక “సంతానము” గురించి వాగ్దానం చేయడం ద్వారా దేవుడు వారి భవిష్యత్‌ సంతానానికి ఒక నిరీక్షణనిచ్చాడు. (ఆదికాండము 3:15) ఆ తర్వాత, ఆశీర్వాదం తెచ్చే సంతానం అబ్రాహామునుండి వస్తుందని దేవుడు వెల్లడి చేశాడు. (ఆదికాండము 22:18) దేవుడు ఈ ప్రేమపూర్వక సంకల్పాన్ని మనస్సులో ఉంచుకొని అబ్రాహాము వంశీకులైన ఇశ్రాయేలీయులను తాను ఏర్పరచుకున్న జనాంగంగా ఎంపిక చేసుకున్నాడు.

5. ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన ధర్మశాస్త్ర నిబంధన వివరాల ఎడల మనం ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?

5 సా.శ.పూ. 1513లో, ఇశ్రాయేలీయులు దేవునితో ఒక నిబంధన సంబంధంలోకి ప్రవేశించి, ఆయన కట్టడలకు లోబడతామని వాగ్దానం చేశారు. నేడు దేవున్ని ఆరాధించాలని కోరుకునే వారందరికీ ఆ ధర్మశాస్త్ర నిబంధన ఎంతో ప్రాముఖ్యమైనదై ఉండాలి, ఎందుకంటే అది వాగ్దాన సంతానాన్ని సూచించింది. దానిలో “రాబోవుచున్న మేలుల ఛాయ” ఉందని పౌలు తెలియజేశాడు. (హెబ్రీయులు 10:1) పౌలు ఈ వ్యాఖ్యానం చేసినప్పుడు, ఆయన సంచార గుడారంలో లేక ఆరాధనా గుడారంలో ఇశ్రాయేలు యాజకుల సేవ గురించి చర్చిస్తుండెను. అది “యెహోవా ఆలయం” లేదా “యెహోవా మందిరం” అని పిలువబడింది. (1 సమూయేలు 1:9, 24, NW) యెహోవా భూ సంబంధ మందిరంలో జరిగే పరిశుద్ధ సేవను పరిశీలించడం ద్వారా, నేడు పాపులైన మానవులు దేవునితో సమాధానపరచబడడాన్ని సాధ్యపరిచే దయాపూర్వక ఏర్పాటును మనం మరింత సంపూర్ణంగా గుణగ్రహించగలుగుతాము.

అతి పరిశుద్ధ స్థలము

6. అతిపరిశుద్ధ స్థలంలో ఏమి ఉండేది, అక్కడ దేవుని సన్నిధి ఎలా ప్రాతినిధ్యం వహించింది?

6 “సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు” అని బైబిలు తెలియజేస్తుంది. (అపొస్తలుల కార్యములు 7:48) అయితే భూమిపైనున్న దేవుని మందిరంలో, అతి పరిశుద్ధ స్థలమని పిలువబడే అడ్డతెరలోపలి స్థలంలో ఒక మేఘం ద్వారా ఆయన సన్నిధి సూచించబడేది. (లేవీయకాండము 16:2) అతిపరిశుద్ధ స్థలంలో వెలుగు ఉండేలా ఈ మేఘం ప్రకాశమానంగా వెలిగేదని స్పష్టమౌతుంది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు చెక్కబడివున్న రాతి పలకలుగల “శాసనములుగల మందసము” అని పిలువబడే పరిశుద్ధమైన పెట్టె మీదుగా అది ఉండేది. కరుణాపీఠము మీద రెండు బంగారు కెరూబులు రెక్కలు చాచుకొని ఉండేవి, అవి దేవుని పరలోక సంస్థలో ఉన్నత స్థానంగల ఆత్మసంబంధమైన జీవులను సూచించేవి. అద్భుతమైన వెలుగుమేఘం కరుణాపీఠం మీద కెరూబుల నడుమ ఉండేది. (నిర్గమకాండము 25:22) సజీవమైన కెరూబులు మోసే పరలోక రథం మీద సర్వోన్నతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉండడాన్ని ఇది సూచించింది. (1 దినవృత్తాంతములు 28:18) ‘సైన్యముల కధిపతివగు యెహోవా, కెరూబుల మీద కూర్చున్న ఇశ్రాయేలీయుల దేవా’ అని రాజైన హిజ్కియా ఎందుకు ప్రార్థించాడో అది వివరిస్తుంది.—యెషయా 37:16.

పరిశుద్ధ స్థలము

7. పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉండేవి?

7 గుడారంలోని రెండవ గది పరిశుద్ధ స్థలమని పిలువబడేది. ఈ విభాగంలో, ప్రవేశ ద్వారానికి ఎడమవైపున అందమైన ఏడు కొమ్మలుగల ఒక దీపస్తంభము, కుడివైపున సన్నిధి రొట్టెల బల్ల ఉండేవి. ఎదురుగా ధూప సుగంధము పైకెగసే ఒక వేదిక ఉండేది. అది అతిపరిశుద్ధ స్థలం నుండి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర ఎదుట ఉండేది.

8. పరిశుద్ధ స్థలంలో యాజకులు క్రమంగా ఏ పనులు నిర్వహించేవారు?

8 ప్రతి ఉదయం, సాయంకాలం ఒక యాజకుడు గుడారంలోకి ప్రవేశించి ధూపవేదిక మీద ధూపద్రవ్యం వేయాలి. (నిర్గమకాండము 30:7, 8) ఉదయం ధూపం వేసేటప్పుడు, బంగారు దీప స్తంభంపై ఉండే ఏడు ప్రదీపములలో నూనె పోయాలి. సాయంకాలం పరిశుద్ధ స్థలంలో వెలుగు కొరకు ప్రదీపములు వెలిగింపబడేవి. ప్రతి విశ్రాంతి దినాన ఒక యాజకుడు 12 తాజా భక్ష్యములను సన్నిధి రొట్టెల బల్లమీద ఉంచాలి.—లేవీయకాండము 24:4-8.

ఆవరణం

9. నీటి గంగాళం యొక్క ఉపయోగం ఏమిటి, దీని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

9 గుడారంలో ఆవరణం కూడా ఉండేది, దాని చుట్టు గుడారపుబట్టతో చేసిన ప్రహరీ ఉండేది. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించకముందు యాజకులు తమ చేతులు కాళ్లు కడుక్కోవడానికి ఆవరణంలో ఒక పెద్ద గంగాళం ఉండేది. ఆవరణంలో ఉండే బలిపీఠం మీద బలి అర్పించడానికి ముందు కూడా వాళ్లు అలా కడుక్కోవలసి ఉండేది. (నిర్గమకాండము 30:18-21) శుభ్రతకు సంబంధించిన ఈ అవసరత నేడు దేవుని సేవకులు దేవునికి అంగీకారమైన విధంగా ఆయనను ఆరాధించాలంటే శారీరక, నైతిక, మానసిక, ఆత్మీయ స్వచ్ఛత కలిగివుండాలన్నదానికి బలమైన జ్ఞాపికగా ఉంది. (2 కొరింథీయులు 7:1) కొంత కాలం తర్వాత ఇశ్రాయేలీయులు కాని ఆలయ సేవకులు బలిపీఠం మీది అగ్ని కొరకు వంటచెరుకు, గంగాళంలోకి నీళ్లు తీసుకువచ్చేవారు.—యెహోషువ 9:27.

10. బలిపీఠం మీద అర్పించబడే కొన్ని అర్పణలు ఏవి?

10 ప్రతి ఉదయం, సాయంకాలం బలిపీఠం మీద అర్పణము, పానీయార్పణములతో పాటు ఒక గొఱ్ఱెపిల్ల దహనబలిగా అర్పించబడేది. (నిర్గమకాండము 29:38-41) ప్రత్యేక దినాల్లో ఇతర బలులు అర్పించబడేవి. కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత పాపాన్ని బట్టి బలి అర్పించవలసి ఉండేది. (లేవీయకాండము 5:5, 6) ఇతర సమయాల్లో, ఒక ఇశ్రాయేలీయుడు స్వేచ్ఛార్పణను అర్పించవచ్చు, దానిలో నుండి కొంతభాగాన్ని యాజకులు, బలి అర్పించిన వ్యక్తి తినవచ్చు. పాపులైన మానవులు దేవునితో సమాధానం కలిగివుండవచ్చునని, సూచనార్థక భావంలో చెప్పాలంటే ఆయనతోపాటు భోజనం చేయవచ్చునని ఇది సూచించింది. పరదేశి కూడా యెహోవా ఆరాధికుడై, ఆయన మందిరంలో స్వేచ్ఛార్పణలను అర్పించే ఆధిక్యతను కలిగివుండవచ్చు. కాని యెహోవా ఎడల తగిన గౌరవాన్ని చూపించడానికి, యాజకులు కేవలం మంచి రకమైన అర్పణలను మాత్రమే అంగీకరించగలరు. మెత్తని పిండిని నైవేద్యంగా అర్పించాలి, బలి అర్పించబడే జంతువులు ఏ లోపం లేకుండా ఉండాలి.—లేవీయకాండము 2:1; 22:18-20; మలాకీ 1:6-8.

11. (ఎ) జంతు బలుల రక్తంతో ఏమి చేసేవారు, ఇది దేన్ని సూచించింది? (బి) మానవుల, జంతువుల రక్తం విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి?

11 ఈ బలుల రక్తాన్ని బలిపీఠం వద్దకు తేవాలి. తమ పాపాలకు శాశ్వత ప్రాయశ్చిత్తం కలిగించి, తమను మరణం నుండి రక్షించగల రక్తాన్ని చిందించే విమోచకుడు అవసరమున్న పాపులమని ఆ జనాంగానికి అనుదినం జ్ఞాపకం చేసేదానిగా ఇది పనిచేసింది. (రోమీయులు 7:24, 25; గలతీయులు 3:24; హెబ్రీయులు 10:3 పోల్చండి.) రక్తాన్ని ఇలా పరిశుద్ధంగా ఉపయోగించడం, రక్తం జీవాన్ని సూచిస్తుందని, జీవం దేవునికి చెందినదని కూడా ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేసింది. మానవులు రక్తాన్ని మరే విధంగానైనా ఉపయోగించకుండా దేవుడు దాన్ని ఎల్లప్పుడూ నిషేధించాడు.—ఆదికాండము 9:4; లేవీయకాండము 17:10-12; అపొస్తలుల కార్యములు 15:28, 29.

ప్రాయశ్చిత్త దినం

12, 13. (ఎ) ప్రాయశ్చిత్త దినం అంటే ఏమిటి? (బి) ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకురాక ముందు ఆయన ఏమి చేయవలసి ఉండేది?

12 ప్రాయశ్చిత్త దినం అని పిలువబడే దినాన సంవత్సరానికి ఒకసారి, యెహోవాను ఆరాధించే పరదేశులతో సహా ఇశ్రాయేలు జనాంగమంతా ఏ పనీ చేయకుండా, ఉపవాసం ఉండాలి. (లేవీయకాండము 16:29, 30) ఈ ప్రాముఖ్యమైన దినాన, మరో సంవత్సరంపాటు దేవునితో సమాధానకరమైన సంబంధాలు కలిగివుండేలా సూచనార్థకమైన విధంగా ఆ జనాంగం పాపం నుండి పరిహరింపబడేది. మనం ఆ దృశ్యాన్ని ఊహించుకొని, కొన్ని ఉన్నతాంశాలను పరిశీలిద్దాము.

13 ప్రధాన యాజకుడు గుడారంలోని ఆవరణంలో ఉన్నాడు. నీళ్ల గంగాళం వద్ద తనను తాను కడుగుకొని, ఆయన ఒక కోడెదూడను బలి ఇస్తాడు. ఆ కోడెదూడ రక్తం ఒక పాత్రలో పోయబడుతుంది; లేవీ యాజక గోత్రానికి చెందిన వారి పాపాల ప్రాయశ్చిత్తార్థమై అది ఒక ప్రత్యేకమైన విధంగా ఉపయోగించబడుతుంది. (లేవీయకాండము 16:4, 6, 11) కాని బలి ఇవ్వడాన్ని కొనసాగించే ముందు ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఒకటి ఉంది. ఆయన పరిమళ ధూపచూర్ణమును (బహుశా దాన్ని గరిటలో వేసి), ధూపపీఠము మీదనుండి నిప్పులను ధూపార్తిలోకి తీసుకుంటాడు. ఆయన ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి, అతి పరిశుద్ధ స్థలం యొక్క తెరవైపుకు వెళుతున్నాడు. ఆయన మెల్లిగా తెర లోపలికి వెళ్లి, నిబంధన మందసం ఎదుట నిలుచుంటాడు. ఆ తర్వాత, ఏ ఇతర మానవునికి కనబడకుండా ఆయన ధూపచూర్ణాన్ని కాలుతున్న నిప్పులపై పోస్తాడు, అతిపరిశుద్ధ స్థలమంతా పరిమళ మేఘంతో నిండిపోతుంది.—లేవీయకాండము 16:12, 13.

14. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి రెండు వేర్వేరు జంతువుల రక్తంతో ఎందుకు ప్రవేశించాలి?

14 ఇప్పుడు దేవుడు సూచనార్థకమైన విధంగా దయచూపించి, ప్రాయశ్చిత్తం చేయడానికి సుముఖంగా ఉన్నాడు. ఈ కారణం చేతనే మందసంపైనున్న మూత “కరుణాపీఠము” అని పిలువబడింది. (హెబ్రీయులు 9:5) ప్రధానయాజకుడు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చి కోడెదూడ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడినట్లుగా, ఆయన తన వ్రేలును రక్తంలో ముంచి కరుణాపీఠం ఎదుట ఏడుసార్లు ప్రోక్షిస్తాడు. (లేవీయకాండము 16:14) ఆ తర్వాత ఆయన ఆవరణంలోకి తిరిగి వెళ్లి, ‘ప్రజలకొరకు’ పాపార్పణముగా మేకను వధిస్తాడు. ఆయన మేక రక్తంలో కొంచెం అతిపరిశుద్ధ స్థలంలోకి తీసుకునివచ్చి, కోడెదూడ రక్తంతో చేసినట్లే దానితో చేస్తాడు. (లేవీయకాండము 16:15) ప్రాయశ్చిత్త దినాన ఇతర ప్రాముఖ్యమైన సేవలు కూడా జరుగుతాయి. ఉదాహరణకు, ప్రధాన యాజకుడు రెండవ మేక తలమీద తన చేతులుంచి, “ఇశ్రాయేలీయుల పాపములన్నియు” దాని మీద ఒప్పుకుంటాడు. సూచనార్థక భావంలో ఆ జనాంగం యొక్క పాపాలను ఈ సజీవమైన మేక అరణ్యంలోకి తీసుకొని వెళుతుంది. ఈ విధంగా, ప్రతి సంవత్సరం “యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము” చేయబడేది.—లేవీయకాండము 16:16, 21, 22, 33.

15. (ఎ) సొలొమోను ఆలయం గుడారాన్ని ఎలా పోలి ఉండేది? (బి) గుడారంలోను ఆలయంలోను జరిగే పరిశుద్ధ సేవ గురించి హెబ్రీయుల పుస్తకం ఏమి తెలియజేస్తుంది?

15 దేవుని నిబంధన ప్రజలుగా ఇశ్రాయేలీయుల చరిత్రలోని మొదటి 486 సంవత్సరాలపాటు, ఈ సంచార గుడారం వారు తమ దేవుడైన యెహోవాను ఆరాధించే స్థలంగా ఉపయోగపడింది. ఆ తర్వాత, ఇశ్రాయేలీయుడైన సొలొమోనుకు ఒక శాశ్వతమైన కట్టడమును నిర్మించే ఆధిక్యత ఇవ్వబడింది. ఈ ఆలయం మరింత పెద్దది, విశాలమైనదైనప్పటికీ, దైవికంగా అందజేయబడిన నమూనా గుడారం వంటి నమూనానే అందజేసింది. గుడారం వలెనే అది, “మనుష్యుడుకాక ప్రభువే (“యెహోవాయే,” NW) స్థాపించిన” మరింత గొప్ప, మరింత ప్రయోజనకరమైన ఆరాధనా ఏర్పాటుకు ముంగుర్తుగా ఉండింది.—హెబ్రీయులు 8:2, 5; 9:9, 11.

మొదటి ఆలయం, రెండవ ఆలయం

16. (ఎ) ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు సొలొమోను ఏ ప్రేమపూర్వక విన్నపం చేశాడు? (బి) సొలొమోను ప్రార్థన ఎడల తన అంగీకారాన్ని యెహోవా ఎలా చూపించాడు?

16 ఆ మహిమకరమైన ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, సొలొమోను ఈ ప్రేరేపిత విన్నపం చేశాడు: “నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి . . . వినినవారై, దూరదేశము నుండివచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.” (2 దినవృత్తాంతములు 6:32, 33) ప్రతిష్టిత సమయంలో సొలొమోను చేసిన ప్రార్థనను తాను అంగీకరించినట్లు దేవుడు స్పష్టంగా చూపించాడు. అగ్ని ఆకాశమునుండి దిగి బలిపీఠము మీదనున్న జంతుబలులను దహించివేసింది, ఆలయమంతా యెహోవా తేజస్సుతో నిండిపోయింది.—2 దినవృత్తాంతములు 7:1-3.

17. సొలొమోను నిర్మించిన ఆలయానికి చివరికి ఏమి జరిగింది, ఎందుకు?

17 ఇశ్రాయేలీయులు యెహోవా ఎడల తమకుగల ఆరోగ్యదాయకమైన భయాన్ని కోల్పోవడం దుఃఖకరం. కొంతకాలానికి రక్తం చిందించడం, విగ్రహారాధన, జారత్వం, రక్తసంబంధులతో లైంగిక సంబంధాలు, అనాధలను విధవరాండ్రను పరదేశులను సరిగా చూడకపోవడం వంటివి చేయడం ద్వారా వారు ఆయన ఘనమైన నామాన్ని నిర్లక్ష్యం చేశారు. (యెహెజ్కేలు 22:2, 3, 7, 11, 12, 26, 29) ఫలితంగా, సా.శ.పూ. 607వ సంవత్సరంలో బబులోను సైన్యాలు ఆలయాన్ని నాశనం చేసేందుకు అనుమతించడం ద్వారా దేవుడు తీర్పు తీర్చాడు. తప్పించుకుని జీవించిన ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు.

18. రెండవ ఆలయం వద్ద, యెహోవా ఆరాధనకు హృదయపూర్వక మద్దతునిచ్చిన ఇశ్రాయేలీయులుకాని కొంతమందికి ఏ ఆధిక్యతలు లభించాయి?

18 డెబ్బై సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపపడిన యూదుల శేషం యెరూషలేముకు తిరిగి వచ్చారు, యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించే ఆధిక్యత వారికనుగ్రహింపబడింది. ఆసక్తికరంగా, ఈ రెండవ ఆలయంలో సేవచేయడానికి యాజకులు, లేవీయులు తక్కువమంది ఉన్నారు. ఫలితంగా, ఇశ్రాయేలీయులు కాని ఆలయ సేవకుల సంతానం వారైన నెతీనీయులకు దేవుని మందిరంలో సేవకులుగా గొప్ప ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. అయితే, వారు ఎన్నడూ యాజకులతో, లేవీయులతో సమానులు కాలేదు.—ఎజ్రా 7:24; 8:17, 20.

19. రెండవ ఆలయానికి సంబంధించి దేవుడు ఏ వాగ్దానం చేశాడు, ఈ మాటలు ఎలా నిజమయ్యాయి?

19 ప్రారంభంలో, మొదటి ఆలయంతో పోల్చినప్పుడు రెండవది అసలేమి ఉండదని అనిపించింది. (హగ్గయి 2:3) కాని “నేను అన్యజనులందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; . . . ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని” యెహోవా వాగ్దానం చేశాడు. (హగ్గయి 2:7, 9) ముందు చెప్పబడినట్లుగానే, రెండవ ఆలయం మరెక్కువ మహిమను పొందింది. అది మొదటిదాని కంటే 164 సంవత్సరాలు ఎక్కువ కాలం ఉంది, దాని ఆవరణల్లోకి ఎంతో ఎక్కువమంది ఆరాధికులు, ఎన్నో ఎక్కువ దేశాల నుండి వచ్చారు. (అపొస్తలుల కార్యములు 2:5-11 పోల్చండి.) రెండవ ఆలయాన్ని నవీకరించడం రాజైన హేరోదు కాలంలో ప్రారంభమైంది, దాని ఆవరణాలు విశాలం చేయబడ్డాయి. పెద్ద రాతి వేదిక మీద ఉన్నతంగా నిర్మింపబడి, చుట్టు అందమైన స్తంభాల వరుసలలో ఉన్న అది, వైభవం విషయంలో సొలొమోను నిర్మించిన అసలు ఆలయంతో సమానంగా ఉండింది. దానిలో, యెహోవాను ఆరాధించాలని కోరుకునే వారికొరకైన పెద్ద బహిరంగ ఆవరణం కూడా ఉంది. ఒక రాతి అడ్డంకు, కేవలం ఇశ్రాయేలీయుల కొరకే కేటాయింపబడిన లోపలి ఆవరణలను అన్యుల ఆవరణాన్ని వేరుచేసింది.

20. (ఎ) పునర్నిర్మింపబడిన ఆలయంలో ఏ విశేషమైన తేడా ఉంది? (బి) యూదులు ఆలయాన్ని తప్పుగా దృష్టించారని ఏది చూపింది, దీనికి ప్రత్యుత్తరంగా యేసు ఏమి చేశాడు?

20 రెండవ ఆలయం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దాని ఆవరణల్లో బోధించే గొప్ప ఆధిక్యతను అనుభవించింది. కాని మొదటి ఆలయానికి సంబంధించి, దేవుని గృహాన్ని సంరక్షించే ఆధిక్యతతో కూడిన తమ బాధ్యతను యూదులు సరైన విధంగా దృష్టించలేదు. అన్యుల ఆవరణల్లో వ్యాపారులు వ్యాపారం చేయడానికి కూడా వాళ్లు అనుమతించారు. అంతేగాక, యెరూషలేము చుట్టుప్రక్కలో ఏవైనా వస్తువులను మోసుకువెళ్లేటప్పుడు ఆలయాన్ని ఒక దగ్గరి మార్గంగా ఉపయోగించుకొని వెళ్లడానికి కూడా ప్రజలు అనుమతించబడ్డారు. యేసు తన మరణానికి నాలుగు రోజులు ముందు అలాంటి లౌకిక ఆచారాల నుండి ఆలయాన్ని శుభ్రపరుస్తూ, “నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగుహగా చేసితిరనెను.”—మార్కు 11:15-17.

దేవుడు తన భూ సంబంధ మందిరాన్ని నిరంతరం విడిచిపెట్టడం

21. యెరూషలేము ఆలయానికి సంబంధించి యేసు ఏమి సూచించాడు?

21 దేవుని స్వచ్ఛారాధనను ఉన్నతపర్చడంలో యేసు తీసుకున్న ధీరోదాత్తమైన చర్య మూలంగా, యూదా మత నాయకులు ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. (మార్కు 11:18) యేసు తాను త్వరలోనే హత్య గావింపబడతానని ఎరిగి యూదా మత నాయకులతో ఇలా అన్నాడు: “మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:37, 38) యెరూషలేములోని భౌతిక ఆలయంలో జరిగే ఏ విధమైన ఆరాధనను దేవుడు ఇక ఎంతమాత్రం అంగీకరించడని తద్వారా ఆయన సూచించాడు. అది ఇక ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరంగా’ ఉండదు. యేసు శిష్యులు ఆయనకు మహిమాన్విత ఆలయ నిర్మాణాల గురించి చెప్పినప్పుడు ఆయన, “మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; . . . రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని” అన్నాడు.—మత్తయి 24:1, 2.

22. (ఎ) ఆలయాన్ని గూర్చి యేసు పలికిన మాటలు ఎలా నెరవేరాయి? (బి) తొలి క్రైస్తవులు భూ పట్టణంపై తమ నిరీక్షణలను కేంద్రీకరించే బదులు దేని కొరకు వెదికారు?

22 ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత, సా.శ. 70వ సంవత్సరంలో రోమా సైన్యాలు యోరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేసినప్పుడు యేసు ప్రవచనం నెరవేరింది. దేవుడు తన భూ సంబంధ మందిరాన్ని విడిచిపెట్టాడనటానికి అది విశేషమైన నిదర్శనాన్నిచ్చింది. యెరూషలేములో మరో ఆలయం నిర్మింపబడడం గురించి యేసు ఎన్నడూ ప్రవచింపలేదు. ఆ భూ సంబంధ పట్టణానికి సంబంధించి, అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచుచున్నాము.” (హెబ్రీయులు 13:14) తొలి క్రైస్తవులు “పరలోకపు యెరూషలేము”లో అంటే దేవుని పట్టణం వంటి రాజ్యంలో ఒక భాగమవ్వాలని ఎదురుచూశారు. (హెబ్రీయులు 12:22) అలా, యెహోవా యొక్క ఆరాధన భూమి మీద భూ సంబంధ ఆలయంలో ఇక ఎంతమాత్రం కేంద్రీకరింపబడి ఉండదు. మా తదుపరి శీర్షికలో, ఆయనను “ఆత్మతోను, సత్యముతోను” ఆరాధించాలని కోరుకునే వారందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైన ఏర్పాటును మనం పరిశీలిస్తాము.—యోహాను 4:21, 24.

పునఃపరిశీలన ప్రశ్నలు

◻ ఆదాముహవ్వలు దేవునితో ఉన్న ఏ సంబంధాన్ని కోల్పోయారు?

◻ గుడారం యొక్క రూపురేఖల గురించి మనం ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?

◻ గుడారంలోని ఆవరణలో జరిగే కార్యాల నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

◻ తన ఆలయం నాశనం గావింపబడేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు?

[10, 11వ పేజీలోని చిత్రం]

హేరోదు పునర్నిర్మించిన ఆలయం

1. అతిపరిశుద్ధ స్థలం

2. పరిశుద్ధ స్థలం

3. దహనబలి అర్పించే బలిపీఠం

4. పోతపోసిన సముద్రపు తొట్టి

5. యాజకుల ఆవరణ

6. ఇశ్రాయేలీయుల ఆవరణ

7. స్త్రీల ఆవరణ

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి