ఎపఫ్రొదితు ఫిలిప్పీయుల దూత
“పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి” అని పౌలు ఫిలిప్పీయులకు వ్రాశాడు. ఒకవేళ ఒక క్రైస్తవ అధ్యక్షుడు మన గురించి అటువంటి ప్రశంసాపూర్వక మాటలు మాట్లాడితే మనం నిస్సందేహంగా సంతోషిస్తాము. (ఫిలిప్పీయులు 2:29) కానీ పౌలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? అటువంటి ఉత్సాహపూరితమైన సిఫారసుకు పాత్రుడయ్యేందుకు ఆ వ్యక్తి ఏమి చేశాడు?
మొదటి ప్రశ్నకు జవాబు ఎపఫ్రొదితు. రెండవ దానికి జవాబిచ్చేందుకు, ఈ మాటలు వ్రాసేందుకు పౌలును పురికొల్పిన పరిస్థితులను మనం పరిశీలిద్దాము.
దాదాపు సా.శ. 58లో, యెరూషలేములోని ఒక దుష్ట మూక పౌలును దేవాలయంలో నుండి వెలుపలికి ఈడ్చి ఆయనను కొట్టిందనీ, అధికారులు బంధించి, అనిశ్చిత నిర్బంధం తరువాత సంకెళ్లువేసి రోమ్‌కు బదిలీ చేశారనీ ఫిలిప్పీయులు విన్నారు. (అపొస్తలుల కార్యములు 21:27-33; 24:27; 27:1) ఆయన సంక్షేమం నిమిత్తమై కలత చెంది, ఆయన కొరకు ఏమి చేయగలమా అని తమను తాము ప్రశ్నించుకొని ఉండవచ్చు. వస్తుదాయకంగా వారు బీదవారు, పౌలు నుండి చాలా దూరంలో ఉన్నారు, అందువలన వారు అందించగలిగే సహాయం పరిమితమైనది. అయినా, గతంలో ఆయన పరిచర్యకు మద్దతు ఇవ్వడానికి ఫిలిప్పీయులను కదిలించిన ఉత్తేజకరమైన భావానుబంధం వారిని ఇంకా పురికొల్పుతోంది; ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు గనుక ఇంకా ఎక్కువగా పురికొల్పుతోంది.—2 కొరింథీయులు 8:1-4; ఫిలిప్పీయులు 4:16.
తమలో ఒకరు ఒక బహుమానం తీసుకుని వెళ్లి, పౌలును సందర్శించి, ఆయనకేమైనా అవసరం అయితే సహాయం చేయడం గురించి ఫిలిప్పీయులు తలంచి ఉండవచ్చు. కానీ అది సుదీర్ఘమైన, అలసట కలిగించే ప్రయాణం, మరి ఆయనకు సహాయం చేయడం ప్రమాదకరం అయ్యుండవచ్చు! యోయాకీమ్ నిల్క ఇలా అంటున్నాడు: “ఒక ఖైదీని సందర్శించడానికి ధైర్యం అవసరం, అంతకంటే ప్రాముఖ్యంగా, అత్యంత అస్పష్టంగా నిర్వచించబడినట్లుగా కనిపించిన ‘నేరం’ చేసిన వ్యక్తిని సందర్శించడానికి ధైర్యం అవసరం.” రచయిత బ్రైయన్ రప్‌స్కీ ఇలా అంటున్నాడు: “ఖైదీతో మరీ సన్నిహితంగా సహవసించే ప్రమాదం లేక ఆయన ఎడల లేక ఆయన దృక్కోణాల ఎడల సానుభూతిపూర్వకంగా ఉండే అదనపు ప్రమాదం ఉంది. . . . యాదృచ్ఛికంగా వచ్చే మాట లేక చర్య ఖైదీకే గాక సహాయకునికి కూడా వినాశకరం కాగలదు.” ఫిలిప్పీయులు ఎవరిని పంపించగలరు?
ఈ రకమైన ప్రయాణం కలతను, అనిశ్చితిని రేకెత్తించి ఉండవచ్చు అని మనం చక్కగా ఊహించవచ్చు, కానీ ఎపఫ్రొదితు (కొలొస్సయిలోని ఎపఫ్రా అని పొరపాటు పడకూడదు) ఆ కష్టతరమైన కార్యాన్ని చేపట్టడానికి ఇష్టపడుతున్నాడు. అఫ్రొడైట్ అనే పేరు కలిసి ఉన్న ఆయన పేరునుబట్టి, ఆయన క్రైస్తవునిగా మారిన అన్యుడై ఉండవచ్చని—ప్రేమ, ఫలదీకరణల గ్రీకు దేవత యొక్క భక్తులైన తలిదండ్రుల కుమారుడై ఉండవచ్చని తార్కికంగా చెప్పవచ్చు. ఫిలిప్పీయుల ఉదారతకు కృతజ్ఞతలు తెల్పుతూ వారికి వ్రాసినప్పుడు, ఆయన ఎపఫ్రొదితును, “మీ దూత, నా అవసరం నిమిత్తం వ్యక్తిగత సేవకుడు” అని సరైన విధంగానే వర్ణించగలిగాడు.—ఫిలిప్పీయులు 2:25, NW.
ఎపఫ్రొదితును గురించి బైబిలు చెప్పేదానినిబట్టి, ఆయన పౌలు కొరకైన మరియు తన స్వంత సంఘం కొరకైన సేవలో తనను తాను ఉపయోగించుకోవడానికి ప్రశంనీయమైన సంసిద్ధతను కలిగి ఉన్నప్పటికీ, మనం కలిగి ఉండగలిగే అదే రకమైన సమస్యలు ఎపఫ్రొదితుకి కూడా ఉన్నాయన్నది మనం అర్థం చేసుకోగలము. మనం ఆయన ఉదాహరణను పరిశీలిద్దాము.
“నా అవసరం నిమిత్తం వ్యక్తిగత సేవకుడు”
మనకు వివరాలు తెలియవు, కానీ ఎపఫ్రొదితు తన ప్రయాణం వలన అలసిపోయి రోమ్‌కు చేరుకున్నాడని మనం ఊహించవచ్చు. ఆయన బహుశ మాసిదోనియ మీదుగా వెళ్లే రోమన్ల రోడ్డు అయిన వీయా ఎగ్నాటీయా ద్వారా ప్రయాణించి ఉంటాడు. ఆయన ఇటలీ ద్వీపకల్పం “మడిమె” వద్దకు ఎడ్రియాటిక్‌ను దాటి వెళ్లి, తరువాత రోమ్‌కు అప్పీయా మార్గంలో వెళ్లి ఉంటాడు. అది బహుశ ఒక నెల కంటే ఎక్కువ సమయం (ఒకవైపు ప్రయాణం 1,200 కిలోమీటర్లు) తీసుకునే అలసటను కలిగించే ప్రయాణం.—29వ పేజీలోని బాక్సును చూడండి.
ఏ మానసిక దృక్పథంతో ఎపఫ్రొదితు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు? పౌలుకు “వ్యక్తిగత సేవ”ను, లేక లై·టోర్·గీʹయను అందించడానికి ఆయన పంపబడ్డాడు. (ఫిలిప్పీయులు 2:30) ఈ గ్రీకు పదం ప్రాథమికంగా ఒక పౌరుడు ప్రభుత్వం కొరకై స్వచ్ఛందంగా చేపట్టిన పనిని సూచించింది. తరువాత, దానిని నిర్వహించడానికి ప్రత్యేకంగా అర్హులైన తన పౌరులు తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం కోరేటువంటి సేవ అనే అర్థాన్ని అది సంతరించుకుంది. గ్రీకు లేఖనాలలో ఈ పద ఉపయోగాన్ని గురించి ఒక పండితుడు ఇలా అంటున్నాడు: “క్రైస్తవుడంటే దేవుని కొరకు, మానవుల కొరకు పనిచేసే వ్యక్తి. మొట్టమొదటిగా, తన పూర్ణహృదయముతో ఆయనలా కోరుకుంటాడు కాబట్టి, రెండవదిగా, క్రీస్తు ప్రేమ ఆయనను బద్ధుడిని చేస్తుంది గనుక ఆయన అలా చేయడానికి బలవంతపెట్టబడ్డాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.” అవును, ఎపఫ్రొదితు ఎంతటి ఉత్కృష్టమైన మానసిక దృక్పథాన్ని కనపర్చాడు!
‘అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టలేదు’
జూదం సంబంధిత భాష నుండి అరువు తెచ్చుకున్న ఒక పదాన్ని ఉపయోగిస్తూ, ఎపఫ్రొదితు ‘తన ప్రాణమునైనను లక్ష్యపెట్టలేదు [పా·రా·బొ·ల్యూ·సేʹమె·నోస్],’ లేక అక్షరార్థంగా చెప్పాలంటే, క్రీస్తు సేవ నిమిత్తమై తన జీవితంతో “జూదమాడాడు” అని పౌలు అంటున్నాడు. (ఫిలిప్పీయులు 2:30, NW) ఎపఫ్రొదితు ఏదో మూర్ఖపు పని చేశాడని మనం అనుకోనవసరం లేదు; బదులుగా, ఆయన పవిత్రమైన సేవలో కొంత ప్రమాదం ఉంది. బహుశ సంవత్సరంలోని అననుకూల వాతావరణంలో సహాయక చర్యను ఆయన చేపట్టాడా? మార్గమధ్యంలో ఎక్కడో రోగగ్రస్థుడైన తరువాత ఆయన దానిని పూర్తి చేయడానికి కృషి చేశాడా? ఏదేమైనా, ఎపఫ్రొదితు “రోగియై చావునకు సిద్ధమైయుండెను.” బహుశ పౌలుకు సేవ చేయడానికి ఆయనతో ఎక్కువ కాలం ఉండాలని ఆయన ఉద్దేశించి ఉండవచ్చు, అందువలన ఆశించిన దానికన్నా ముందే ఆయన ఎందుకు తిరిగి వెళ్లవలసి వస్తుందో అపొస్తలుడు వివరించాలని అనుకున్నాడని స్పష్టమౌతుంది.—ఫిలిప్పీయులు 2:27.
అయినప్పటికీ, ఎపఫ్రొదితు అవసరంలో ఉన్నవారికి సహాయం అందించడానికి పరహితాత్మకంగా తనను తాను బహిర్గతపరచుకోవడానికి ఇష్టపడే ధైర్యంగల వ్యక్తి.
మనలను మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘కష్టతర పరిస్థితులలో ఉన్న నా ఆత్మీయ సహోదరులకు సహాయం చేయడానికి నేను ఎంతమేరకు కృషి చేస్తాను?’ అటువంటి సిద్ధపాటుతో కూడిన స్ఫూర్తి క్రైస్తవులకు ఐచ్ఛికం కాదు. యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” (యోహాను 13:34, ఇటాలిక్కులు మావి.) ఎపఫ్రొదితు తన పరిచర్యను “చావునకు సిద్ధ”మయ్యేంత వరకు నెరవేర్చాడు. అందుకని, ఫిలిప్పీయులు కలిగి ఉండాలని పౌలు ప్రోత్సహించిన “మానసిక దృక్పథం” కలిగివుండడంలో ఎపఫ్రొదితు ఒక ఉదాహరణ. (ఫిలిప్పీయులు 2:5, 8, 30, కింగ్‌డమ్ ఇంటర్లీనియర్) మనం అంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా ఉంటామా?
అయినప్పటికీ, ఎపఫ్రొదితు క్రుంగుదలను అనుభవించాడు. ఎందుకు?
ఆయన క్రుంగుదల
మిమ్మల్ని మీరు ఎపఫ్రొదితు స్థానంలో ఉంచుకోండి. పౌలు ఇలా నివేదించాడు: “అతడు రోగి అయ్యాడని మీరు విన్నారు గనుక అతడు మిమ్మల్నందరినీ చూడడానికి ఎంతో అపేక్షగలవాడై కృంగుదల అనుభవిస్తున్నాడు.” (ఫిలిప్పీయులు 2:26, NW) తాను రోగిగా ఉన్నానని, వారు నిరీక్షించినంతగా తాను పౌలుకు సహాయం చేయలేకపోతున్నానని తన సంఘంలోని సహోదరులు ఎరుగుదురని ఎపఫ్రొదితుకు తెలుసు. నిజానికి, ఎపఫ్రొదితు పౌలుకు మరిన్ని కలతలను సృష్టించినట్లు అనిపించవచ్చు. పౌలు సహచరుడును, వైద్యుడును అయిన లూకా, ఎపఫ్రొదితు ఎడల శ్రద్ధ వహించడానికి ఇతర విషయాలను ఉపేక్షించవలసి వచ్చిందా?—ఫిలిప్పీయులు 2:27, 28; కొలొస్సయులు 4:14.
బహుశ దీని పర్యవసానంగా, ఎపఫ్రొదితు కృంగిపోయి ఉండవచ్చు. తన సంఘంలోని సహోదరులు తనను అసమర్థునిగా పరిగణిస్తున్నారని బహుశ ఆయన ఊహించివుండవచ్చు. ఆయన తాను దోషినన్నట్లు భావిస్తుండవచ్చు, తన విశ్వాస్యత విషయమై వారికి హామీ ఇవ్వడానికి వారిని చూడాలని “మిగుల అపేక్షగలవాడై” ఉండవచ్చు. ఎపఫ్రొదితు పరిస్థితిని వర్ణించడానికి పౌలు చాలా శక్తిమంతమైన అ·డె·మొ·నీʹయొ అనే గ్రీకు పదాన్ని, “కృంగుదల అనుభవించు” అనే మాటలను ఉపయోగించాడు. పండితుడైన జె. బి. లైట్‌ఫుట్ ప్రకారం, ఈ పదం “భౌతిక అవ్యవస్థిత స్థితి, లేక దుఃఖం, లజ్జ, నిస్పృహ మొదలగు మానసిక దురవస్థల ద్వారా ఉత్పన్నమైన గందరగోళ, అవిశ్రాంత, అర్ధ-పరధ్యాన స్థితులను” సూచించవచ్చు. ఈ పదం గ్రీకు లేఖనాలలో మరో చోట మాత్రమే, అంటే గెత్సేమనే తోటలో యేసు వేదనకు సంబంధించి ఉపయోగించబడింది.—మత్తయి 26:37.
వారి దూత అనూహ్యంగా తిరిగి రావడానికి గల కారణాన్ని వివరిస్తున్న ఉత్తరంతో ఎపఫ్రొదితును ఫిలిప్పీయుల దగ్గరికి తిరిగి పంపివేయడమే శ్రేష్ఠమైన పని అని పౌలు నిర్ధారించాడు. “ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని” అని చెప్పడంలో, ఎపఫ్రొదితు విఫలమయ్యాడనే సంభవనీయ సందేహాలను చెదరగొడుతూ, ఆయన తిరిగి రావడం విషయమైన బాధ్యతను పౌలు తీసుకుంటున్నాడు. (ఫిలిప్పీయులు 2:25) దానికి విరుద్ధంగా, ఎపఫ్రొదితు తన పనిని పూర్తిచేయడానికి దాదాపు తన జీవాన్ని కోల్పోయాడు! “నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పనినిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి” అని పౌలు ఉత్సాహపూరితంగా సిఫారసు చేశాడు.—ఫిలిప్పీయులు 2:29, 30.
“అట్టివారిని ఘనపరచుడి”
ఎపఫ్రొదితు వంటి మానసిక దృక్పథాన్ని కలిగి ఉన్న స్త్రీపురుషులు నిజంగా ప్రశంసించదగ్గవారు. సేవ చేయడానికిగాను వారు తమను తాము త్యాగం చేసుకుంటారు. మిషనరీలుగా, ప్రయాణ అధ్యక్షులుగా, లేక వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానిలో ఇంటి నుండి దూరంగా సేవ చేయడానికి తమను తాము అర్పించుకున్నవారి గురించి ఆలోచించండి. కొందరు, వృద్ధాప్యం లేక క్షీణిస్తున్న ఆరోగ్యం మూలంగా మునుపు చేసినంతగా ఇప్పుడు చేయలేకపోతుంటే, వారు సంవత్సరాలుగా చేసిన నమ్మకమైన సేవనుబట్టి గౌరవాన్ని, ఆదరణను పొందనర్హులు.
అయినప్పటికీ, దుర్బలమైన అస్వస్థత క్రుంగుదలకు, అపరాధ భావాలకు ఒక మూలం కాగలదు. ఒకరు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకోవచ్చు. ఎంతటి నిరుత్సాహం! అటువంటి పరిస్థితిలో ఉన్న వారెవరైనా ఎపఫ్రొదితు నుండి నేర్చుకోవచ్చు. ఎంతైనా, ఆయన రోగగ్రస్థుడవ్వడంలో ఆయన పొరపాటేమైనా ఉందా? నిశ్చయంగా లేదు! (ఆదికాండము 3:17-19; రోమీయులు 5:12) ఎపఫ్రొదితు దేవునికి, తన సహోదరులకు సేవ చేయాలని కోరుకున్నాడు, కానీ అస్వస్థత ఆయనకు పరిమితులను ఏర్పరచింది.
పౌలు ఎపఫ్రొదితును ఆయన అస్వస్థత నిమిత్తం మందలించలేదు కానీ ఆయనను అంటిపెట్టుకుని ఉండమని ఫిలిప్పీయులకు చెప్పాడు. అదే విధంగా, మన సహోదరులు దిగాలుపడి ఉన్నప్పుడు మనం వారిని ఓదార్చాలి. సాధారణంగా సేవ విషయంలో వారి విశ్వసనీయమైన ఉదాహరణ నిమిత్తం మనం వారిని ప్రశంసించవచ్చు. ఆయన గురించి ఎంతో చక్కగా మాట్లాడుతూ, పౌలు ఎపఫ్రొదితును ప్రశంసించడం, ఆయన క్రుంగుదలను తీసివేస్తూ, ఆయనను ఊరడించి ఉండవచ్చు. ‘మనము చేసిన కార్యమును, మనము పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు’ అని మనం కూడా నిశ్చయతను కలిగి ఉండగలము.—హెబ్రీయులు 6:10.
[29వ పేజీలోని బాక్సు]
ప్రయాణంలోని అసౌకర్యాలు
ఈ రోజుల్లో, ఎపఫ్రొదితు చేసినటువంటి విధంగా, రెండు ప్రాముఖ్యమైన యూరప్ నగరాల మధ్య ప్రయాణం చేయడం ఎక్కువ కష్టం కాకపోవచ్చు. ఆ ప్రయాణాన్ని ఒక జెట్ విమానంలో ఒకటి లేక రెండు గంటల్లో హాయిగా ముగించవచ్చు. మొదటి శతాబ్దంలో అటువంటి ప్రయాణం చేయడం అనేది పూర్తిగా వేరే కథ. అప్పట్లో, ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్లడం అంటే అసౌకర్యం అని అర్థం. వాతావరణ మార్పులకు గురౌతూ, “దొంగలవలననైన” ఆపదలతో సహా వివిధ ప్రమాదాలకు లోనౌతూ ఒక ప్రయాణికుడు కాలినడకన ఒక్క రోజుకి 30 నుండి 35 కిలోమీటర్లు పూర్తి చేయగలడు.—2 కొరింథీయులు 11:26.
రాత్రంతా ఎక్కడైనా గడపడానికి ఆగే విషయం, ఆహార పానీయాల విషయం ఏమిటి?
చరిత్రకారుడైన మైకేలాంజిలో కాజానో డె ఆసెవేడో, రోమన్ల రోడ్ల ప్రక్కన “మాన్‌స్యోన్స్, అనే పూర్తి హంగులతో ఉన్న హోటళ్లు ఉండేవి. వాటిలో ఆహార నిల్వలు, అశ్వశాలలు, సిబ్బందికి నివాస వసతులు ఉండేవి; వరసగా ఉన్న ప్రతి రెండు మాన్‌స్యోన్స్ మధ్యన, అనేకమైన మ్యూటాట్యోన్స్, లేక బస చేసే స్థలాలు ఉండేవి. అక్కడ ఒకరు గుర్రాలను లేక వాహనాలను మార్చుకోవచ్చు, ఆహార పానీయాలు పొందవచ్చు” అని చెబుతున్నాడు. ఈ వసతిగృహాలకు ఘోరమైన పేరు ఉండేది ఎందుకంటే వాటిలో సాంఘికంగా అధమ తరగతుల నుండి వచ్చే వారు తరచుగా బస చేసేవారు. ప్రయాణికులను దోచుకోవడమే గాక, పూటకూళ్లవాళ్లు తరచూ వేశ్యల నుండి వారు ఆర్జించేదానిని వారి ఆదాయాలకు అదనంగా చేర్చుకునేవారు. లాటిన్ వ్యంగ్య కవి జువెనల్, అటువంటి వసతిగృహంలో ఉండేలా నిర్బంధించబడే వారెవరైనా బహుశ తమను తాము “క్రూర వ్యక్తుల ప్రక్కన పడుకుని ఉన్నట్లు, నావికులు, దొంగలు, పారిపోయిన బానిసలతో ఉన్నట్లు, తలారులు, శవపేటికలు తయారు చేసే వారి ప్రక్కన ఉన్నట్లు . . .” కనుగొనవచ్చు. “అందరూ ఒకే కప్పుని ఉపయోగిస్తారు; మిగతా వారి నుండి వేరుగా, ఏ ఒక్కరికీ తమ స్వంత పడక లేదు, బల్లా లేదు” అని వ్యాఖ్యానించాడు. ఇతర ప్రాచీన రచయితలు అపరిశుభ్రమైన నీరు, ఎక్కువమందితో కిక్కిరిసి ఉండి, చెత్తతో, తేమతో, ఈగలతో నిండి ఉన్న గదుల విషయమై విలపించారు.
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
రోమ్
[చిత్రం]
రోమన్ల కాలం నాటి ఒక ప్రయాణికుడు
[క్రెడిట్ లైను]
Map: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.; Traveler: Da originale del Museo della Civiltà Romana, Roma