క్రీస్తు ధర్మశాస్త్రము
“క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను.”—1 కొరింథీయులు 9:21.
1, 2. (ఎ) మానవజాతి తప్పిదాల్లోని అనేకమైన వాటిని ఎలా నివారించడం సాధ్యమయ్యేది? (బి) యూదా మతం యొక్క చరిత్రనుండి ఏ విషయాన్ని నేర్చుకోవడంలో క్రైస్తవమత సామ్రాజ్యం విఫలమయ్యింది?
“ప్రజలు మరియు ప్రభుత్వాలు చరిత్రనుండి ఎన్నడూ ఏమీ నేర్చుకోలేదు, లేక దానినుండి పొందిన సూత్రాలకు అనుగుణంగా ఎన్నడూ ప్రవర్తించలేదు.” 19వ శతాబ్దానికి చెందిన జర్మను తాత్వికుడు అలా అన్నాడు. వాస్తవానికి, మానవ చరిత్ర యొక్క గమనం, “అవివేకపు పయనం,” విపత్కర తప్పిదాలు మరియు సంక్షోభాల పరంపర అని వర్ణింపబడింది, అయితే మానవజాతి గనుక తన పూర్వపు పొరపాట్ల నుండి నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండివుంటే, అందులోని చాలా వాటిని నివారించడం సాధ్యమయ్యేది.
2 గత పొరపాట్లనుండి నేర్చుకునేందుకు నిరాకరించడమే, దైవిక ధర్మశాస్త్రాన్ని గురించిన ఈ చర్చలో ముఖ్యాంశం. మోషే ధర్మశాస్త్రం స్థానంలో యెహోవా దేవుడు ఒక శ్రేష్ఠమైన దాన్ని పెట్టాడు, అదే క్రీస్తు ధర్మశాస్త్రం. అయినప్పటికీ, ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామనీ దాని ప్రకారం జీవిస్తున్నామనీ చెప్పుకునే క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు, పరిసయ్యుల విపరీతమైన అవివేకం నుండి నేర్చుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టి యూదా మతం మోషే ధర్మశాస్త్రంతో ఎలా చేసిందో, అలాగే క్రైస్తవమత సామ్రాజ్యం కూడా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి, దుర్వినియోగం చేసింది. అది ఎలా జరిగింది? మొదట మనం, ఆ ధర్మశాస్త్రాన్ని గురించే చర్చిద్దాం, అంటే అదేంటి, అది ఎవర్ని నియంత్రిస్తుంది, ఎలా నియంత్రిస్తుంది మరియు మోషే ధర్మశాస్త్రం నుండి అది ఏ విషయాల్లో వేరుగా ఉంది ఇత్యాది అంశాలు. దాని తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్యం దాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో మనం పరిశీలిద్దాము. అలా మనం చరిత్రనుండి నేర్చుకుని దాని నుండి ప్రయోజనం పొందుదాం!
క్రొత్త నిబంధన
3. ఓ క్రొత్త నిబంధనకు సంబంధించి యెహోవా ఏ వాగ్దానం చేశాడు?
3 యెహోవా తప్ప మరింకెవరు పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని సరి చేయగలరు? మోషే ధర్మశాస్త్రం పరిపూర్ణంగా ఉండినది. (కీర్తన 19:7, NW) అయినప్పటికీ, యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి . . . అది . . . వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు.” మోషే ధర్మశాస్త్రానికి కేంద్ర బిందువైన పది ఆజ్ఞలు రాతి పలకలపై వ్రాయబడ్డాయి. కానీ క్రొత్త నిబంధన గురించి, యెహోవా ఇలా చెప్పాడు: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను.”—యిర్మీయా 31:31-34.
4. (ఎ) క్రొత్త నిబంధనలో ఏ ఇశ్రాయేలు ఇమిడివుంది? (బి) క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద, ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు?
4 ఈ క్రొత్త నిబంధనలోకి ఎవరు తీసుకోబడతారు? ఈ నిబంధనకు మధ్యవర్తియైన వాన్ని నిరాకరించిన అక్షరార్థ ‘ఇశ్రాయేలువారు’ ఎంతమాత్రం కాదు. (హెబ్రీయులు 9:15) లేదు, ఈ క్రొత్త “ఇశ్రాయేలు” “దేవుని ఇశ్రాయేలు” అయ్యుంటుంది అంటే, ఆత్మీయ ఇశ్రాయేలీయుల జనాంగం. (గలతీయులు 6:16; రోమీయులు 2:28, 29) ఆత్మతో అభిషేకింపబడిన క్రైస్తవుల ఈ చిన్న గుంపులో, తాము కూడా యెహోవాను ఆరాధించాలని అన్ని జనాంగాల్లోనుండి వచ్చే “గొప్ప సమూహము” తర్వాత కలుస్తుంది. (ప్రకటన 7:9, 10; జెకర్యా 8:23) క్రొత్త నిబంధనలో భాగం వహించకపోయినప్పటికీ, ఈ గొప్ప సమూహంవారు కూడా ధర్మశాస్త్రం చేత నడిపింపబడతారు. (లేవీయకాండము 24:22; సంఖ్యాకాండము 15:15 పోల్చండి.) అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లు వారందరూ ‘ఒక గొఱ్ఱెల కాపరి’ క్రింద ‘ఒక మందగా’ “క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడి” ఉంటారు. (యోహాను 10:16; 1 కొరింథీయులు 9:21) ఈ క్రొత్త నిబంధనను పౌలు “మరి యెక్కువైన నిబంధన” అని పిలిచాడు. ఎందుకు? ఒక విషయం ఏమంటే, రాబోయే విషయాల ఛాయలపై కాక అది నెరవేర్చబడిన వాగ్దానాలపై ఆధారపడివుంది.—హెబ్రీయులు 8:6; 9:11-14.
5. క్రొత్త నిబంధన యొక్క సంకల్పం ఏమిటి, మరి అది ఎందుకు విజయవంతం అవుతుంది?
5 ఈ నిబంధన యొక్క సంకల్పం ఏమిటి? మానవజాతినంతటినీ దీవించేందుకు రాజుల మరియు యాజకుల జనాంగాన్ని అది ఉత్పన్నం చేయాల్సివుంది. (నిర్గమకాండము 19:6; 1 పేతురు 2:9; ప్రకటన 5:10) మోషే ధర్మశాస్త్ర నిబంధన ఈ జనాంగాన్ని పూర్ణ భావంలో ఎన్నడూ ఉత్పన్నం చేయలేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు మొత్తంగా తిరుగుబాటు చేసి తమ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. (రోమీయులు 11:17-21 పోల్చండి.) అయితే, క్రొత్త నిబంధన తప్పక విజయవంతం అవుతుంది, ఎందుకంటే అది ఎంతో వేరైన ధర్మశాస్త్ర విధానంతో సంబంధాన్ని కలిగివుంది. ఏ మార్గాల్లో వేరైనది?
స్వతంత్ర ప్రజల నియమము
6, 7. క్రీస్తు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం కంటే మరి ఎక్కువ స్వాతంత్ర్యాన్ని ఎలా ఇస్తుంది?
6 క్రీస్తు ధర్మశాస్త్రం పదే పదే స్వాతంత్ర్యంతో ముడిపెట్టబడింది. (యోహాను 8:31, 32) అది “స్వతంత్ర ప్రజల నియమము” మరియు “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము” అని సూచింపబడింది. (యాకోబు 1:25; 2:12, NW) అయితే, మానవులకు ఉండే స్వాతంత్ర్యం అంతా పాక్షికమైనదే. అయినప్పటికీ, ఈ ధర్మశాస్త్రం దానికి ముందున్న మోషే ధర్మశాస్త్రం కంటే ఎంతో ఎక్కువ స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. అదెలా?
7 ఒక విషయమేమంటే, ఎవరూ క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద జన్మించలేదు. జాతి మరియు జన్మస్థలం వంటి అంశాలు ప్రాముఖ్యమైనవి కావు. నిజ క్రైస్తవులు ఈ ధర్మశాస్త్రానికి విధేయతను చూపాలనే కాడిని అంగీకరించాలని తమ హృదయాల్లో స్వచ్ఛందంగా ఎంపిక చేసుకుంటారు. అలా చేయడంలో, ఆ కాడి సుళువైనదని, ఆ భారము తేలికైనదని వారు కనుగొంటారు. (మత్తయి 11:28-30) ఎంతైనా, మోషే ధర్మశాస్త్రం కూడా, మానవుడు పాపభరితుడని మరియు అతడిని విమోచించేందుకు క్రయధన బలి అతనికి ఎంతో అవసరమని బోధించేందుకే రూపొందింపబడింది. (గలతీయులు 3:19) మెస్సీయ వచ్చాడనీ, తన జీవంతో విమోచన క్రయధన విలువను చెల్లించాడని, పాపం మరియు మరణం యొక్క తీవ్ర అణచివేత నుండి స్వాతంత్య్రం పొందడానికి మనకు మార్గం తెరిచాడని క్రీస్తు ధర్మశాస్త్రం బోధిస్తుంది! (రోమీయులు 5:20, 21) ప్రయోజనం పొందేందుకు, మనం ఆ బలియందు ‘విశ్వాసముంచాల్సిన’ అవసరముంది.—యోహాను 3:16.
8. క్రీస్తు ధర్మశాస్త్రంలో ఇంకా ఏమి ఇమిడివుంది, అయితే దాని ప్రకారం జీవించడమంటే వందలాది న్యాయపరమైన కట్టడలను బట్టీపట్టాల్సిన అవసరం ఎందుకులేదు?
8 “విశ్వాసముంచ”డంలో క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ఇమిడివుంది. క్రీస్తు ఆజ్ఞలన్నింటికీ విధేయత చూపడం కూడా అందులో ఇమిడివుంది. వందలాది నియమాలను, కట్టడలను బట్టీపట్టాలని దీని అర్థమా? లేదు. పాత నిబంధనకు మధ్యవర్తియైన మోషే, మోషే ధర్మశాస్త్రాన్ని వ్రాస్తే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు కనీసం ఒక్క నియమాన్ని కూడా వ్రాయలేదు. బదులుగా, ఆయన ఈ ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు. తన పరిపూర్ణ జీవిత విధానం ద్వారా, మనందరం అనుసరించేందుకు ఆయన ఒక మాదిరినుంచాడు. (1 పేతురు 2:21) బహుశా అందుకే తొలి క్రైస్తవుల ఆరాధన ‘మార్గము’ అని పిలువబడిందేమో. (అపొస్తలుల కార్యములు 9:2; 19:9, 23; 22:4; 24:22) వారికి, క్రీస్తు ధర్మశాస్త్రం క్రీస్తు జీవితంలో సోదాహరణగా నిరూపించబడింది. యేసును అనుకరించడం అంటే, ఈ ధర్మశాస్త్రానికి విధేయత చూపడమే. ఆయన ఎడల వారికిగల మిక్కుటమైన ప్రేమ అంటే, ప్రవచింపబడిన విధంగా, ఈ ధర్మశాస్త్రం వాస్తవంగా వారి హృదయాలపై వ్రాయబడిందని అర్థం. (యిర్మీయా 31:33; 1 పేతురు 4:8) ప్రేమ మూలంగా విధేయత చూపే వాడు ఎప్పుడూ అణచివేయబడినట్లు భావించడు, క్రీస్తు ధర్మశాస్త్రం “స్వతంత్ర ప్రజల నియమము” అని పిలువబడేందుకుగల మరొక కారణం ఇది.
9. క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతస్తత్వం ఏమిటి, మరి ఈ ధర్మశాస్త్రంలో ఓ క్రొత్త ఆజ్ఞ ఎలా ఇమిడివుంది?
9 మోషే ధర్మశాస్త్రంలో ప్రేమ ప్రాముఖ్యమైనదైతే, క్రైస్తవ ధర్మశాస్త్రం యొక్క అంతస్తత్వమే ప్రేమ. అలా క్రీస్తు ధర్మశాస్త్రం ఓ క్రొత్త ఆజ్ఞను జత చేస్తుంది, అదేమంటే క్రైస్తవులు ఒకరి ఎడల మరొకరు స్వయం త్యాగపూరిత ప్రేమను కలిగివుండాలి. యేసు ప్రేమించినట్లు వారు ప్రేమించాలి; ఆయన తన స్నేహితుల కొరకు తన జీవాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. (యోహాను 13:34, 35; 15:13) మోషే ధర్మశాస్త్రం కంటే కూడా, క్రీస్తు ధర్మశాస్త్రం దైవపరిపాలన యొక్క ఎంతో ఉన్నతమైన వ్యక్తీకరణయై ఉందని చెప్పవచ్చు. ఈ పత్రిక పూర్వం పేర్కొన్న విధంగా: “దైవపరిపాలన అంటే దేవుని పరిపాలన; దేవుడు ప్రేమాస్వరూపి; కాబట్టి దైవపరిపాలన అంటే ప్రేమపరిపాలన.”
యేసు మరియు పరిసయ్యులు
10. యేసు బోధకు మరియు పరిసయ్యుల బోధకు ఎలా వ్యత్యాసముంది?
10 యేసు తన కాలంలోని యూదా మత నాయకులను వ్యతిరేకించాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము,” శాస్త్రులు మరియు పరిసయ్యుల మెదళ్లలోకి ఎప్పుడూ ఎక్కలేదు. మనుష్యులు చేసిన కట్టడల ద్వారా ప్రజలను అదుపు చేయాలని వారు ప్రయత్నించారు. వారి బోధ అణచి వేసేది, ఖండించేది మరియు ప్రతికూలమైనదిగా మారింది. దానికి పూర్తి విరుద్ధంగా, యేసు బోధ అత్యంత నిర్మాణాత్మకంగా మరియు అనుకూలంగా ఉండేది! ఆయన ఆచరణాత్మకమైన విషయాలు మాట్లాడాడు మరియు ప్రజల వాస్తవమైన అవసరాలు మరియు చింతల గురించి మాట్లాడాడు. ఆయన అనుదిన జీవితంలోని ఉదాహరణలను ఉపయోగిస్తూ, దేవుని వాక్యం నుండి అధికారాన్ని తీసుకుని, ఎంతో క్లుప్తంగా, వాస్తవమైన భావాలతో బోధించాడు. అలా, “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) అవును, యేసు బోధ వారి హృదయాలను చేరుకుంది!
11. మోషే ధర్మశాస్త్రాన్ని సహేతుకతతో మరియు దయతో అన్వయించాల్సి ఉండినదని యేసు ఎలా చూపించాడు?
11 మోషే ధర్మశాస్త్రానికి ఎక్కువ కట్టడలను జత చేసే బదులు, యూదులు ఆ ధర్మశాస్త్రం మొత్తాన్ని సహేతుకత మరియు దయతో ఎలా అన్వయించవలసి ఉండిందో యేసు చూపించాడు. ఉదాహరణకు, రక్తస్రావం చేత బాధింపబడుతున్న స్త్రీ ఆయనను సమీపించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఆమె ఎవరిని తగిలినా వారు అశుద్ధులౌతారు, కాబట్టి ఆమె అలా ప్రజల గుంపులోకి ఎంతమాత్రం రాకూడదు! (లేవీయకాండము 15:25-27) కానీ ఆమె స్వస్థతనొందాలని ఎంతగా కోరుకుందంటే, ఆమె ప్రజల గుంపులోకి వచ్చేసి యేసు పైవస్త్రాన్ని ముట్టింది. స్రావం వెంటనే ఆగిపోయింది. నియమాన్ని ఉల్లంఘించినందుకు ఆయన ఆమెను గద్దించాడా? లేదు; బదులుగా, ఆయన ఆమెకున్న కష్ట పరిస్థితిని అర్థం చేసుకుని, ధర్మశాస్త్రం యొక్క అతి గొప్ప సూత్రమైన ప్రేమను ప్రదర్శించాడు. సానుభూతితో ఆయన ఆమెతో ఇలా అన్నాడు: “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముగలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థతకలుగుగాక.”—మార్కు 5:25-34.
క్రీస్తు ధర్మశాస్త్రం అధిక స్వేచ్ఛనిచ్చిందా?
12. (ఎ) క్రీస్తు అధిక స్వేచ్ఛనిచ్చాడని మనం ఎందుకు అనుకోకూడదు? (బి) అనేక నియమాలను చేయడం, అనేక లొసుగులు ఏర్పడేందుకు దారి తీస్తుందని ఏది చూపుతుంది?
12 క్రీస్తు ధర్మశాస్త్రం “స్వాతంత్ర్యము” నిస్తుంది గనుక అది అధిక స్వేచ్ఛనిచ్చిందని, అయితే పరిసయ్యులు తమ మౌఖిక పారంపర్యాచారాలతో కనీసం ప్రజల ప్రవర్తనను కట్టుదిట్టమైన హద్దుల్లో ఉంచారని మనం చెప్పగలమా? చెప్పలేము. తరచూ ఎన్ని ఎక్కువ నియమాలు ఉంటే ప్రజలు వాటిలో అన్ని లొసుగులను కనుగొనగలరని నేడు న్యాయ వ్యవస్థలు ఉదహరిస్తున్నాయి.a యేసు కాలంలో, పరిసయ్యుల సూత్రాలు ఎక్కువ కావడం, ప్రజలు అందులో లొసుగులను వెదకడాన్ని మరియు ప్రేమ ఎంతమాత్రం లేకుండా పనులు చేయడాన్ని మరియు లోనున్న కల్మషాన్ని కప్పిపుచ్చేందుకు బాహ్యంగా స్వనీతి కలిగివుండటాన్ని ప్రోత్సహించింది.—మత్తయి 23:23, 24.
13. వ్రాయబడిన ఏ ఇతర న్యాయ సూత్రాలకంటే కూడా క్రీస్తు ధర్మశాస్త్రమే ఉన్నతమైన ప్రవర్తనా ప్రమాణానికి ఎందుకు దారితీస్తుంది?
13 దానికి విరుద్ధంగా క్రీస్తు ధర్మశాస్త్రం అలాంటి దృక్పథాలను పెంపొందించడంలేదు. వాస్తవానికి, యెహోవా ఎడలగల ప్రేమపై ఆధారపడిన నియమానికి విధేయత చూపడం మరియు ఇతరుల ఎడల క్రీస్తు కలిగివుండిన స్వయంత్యాగ ప్రేమను అనుకరించడం ద్వారా విధేయత చూపడం, ఒక నియత న్యాయపర నియమాన్ని అనుసరించడం ద్వారా ఉండే ప్రవర్తనకంటే అత్యంత ఉన్నత ప్రవర్తనకు దారి తీస్తుంది. ప్రేమ లొసుగులను వెదకదు; ఓ న్యాయ విధి విశదంగా నిషేధించని హానికర విషయాలను చేయకుండా కూడా అది మనల్ని కాపాడుతుంది. (మత్తయి 5:27, 28, చూడండి.) అలా, క్రీస్తు ధర్మశాస్త్రం మనం ఇతరుల కొరకు పనులు చేసేందుకు మనల్ని పురికొల్పుతుంది, ఏ నియత నియమం మనం చేయాలని పురికొల్పలేని విషయాల్లో అంటే ఉదారత, ఆతిథ్యం మరియు ప్రేమ చూపడం వంటి విషయాల్లో అది మనల్ని పురికొల్పుతుంది.—అపొస్తలుల కార్యములు 20:35; 2 కొరింథీయులు 9:7; హెబ్రీయులు 13:16.
14. క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంపై ఏ ప్రభావాన్ని కలిగివుండినది?
14 తొలి క్రైస్తవ సంఘ సభ్యులు క్రీస్తు ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా జీవించినంత మేరకు, ఆ సంఘం ప్రోత్సాహపరిచే, ప్రేమపూర్వక వాతావరణాన్ని అనుభవించింది, అలా ఆ కాలంలోని సమాజ మందిరాల్లో ఎంతగానో వ్యాపించి ఉన్న కఠినమైన, తీర్పులు తీర్చే మరియు వేషధారణపూరితమైన దృక్పథాలనుండి దూరంగా ఉంది. తాము “స్వతంత్ర ప్రజల నియమము” ప్రకారం జీవిస్తున్నామని ఈ క్రొత్త సంఘాల సభ్యులు వాస్తవంగా గ్రహించి ఉంటారు!
15. క్రైస్తవ సంఘాన్ని కలుషితం చేయాలన్న సాతాను తొలి ప్రయత్నాలలో కొన్ని ఏవి?
15 అయితే, తాను ఇశ్రాయేలు జనాంగాన్ని కలుషితం చేసిన విధంగానే క్రైస్తవ సంఘాన్ని కలుషితం చేయాలని సాతాను ఎంతో ఉత్సుకతతో ఉన్నాడు. “వంకర మాటలు” పలికి దేవుని మందను అణచి వేసే తోడేళ్ల వంటి మనుష్యుల గురించి అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 30) క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క పాక్షిక స్వాతంత్ర్యానికి బదులు, క్రీస్తు నందు నెరవేర్చబడిన మోషే ధర్మశాస్త్రానికి బానిసత్వాన్ని వినిమయం చేయాలని చూసిన యూదుల ఆచారవ్యవహారాలను అనుష్ఠించే వారితో ఆయన పోరాడాల్సి వచ్చింది. (మత్తయి 5:17; అపొస్తలుల కార్యములు 15:1; రోమీయులు 10:4) అపొస్తలులలో చివరి వ్యక్తి మరణించిన తర్వాత, అలాంటి మతభ్రష్టత్వానికి విరుద్ధంగా ఎలాంటి అడ్డూ లేకుండా పోయింది. కాబట్టి అవినీతి పెచ్చుపెరిగి పోయింది.—2 థెస్సలొనీకయులు 2:6, 7.
క్రైస్తవమత సామ్రాజ్యం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కలుషితం చేస్తుంది
16, 17. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యంలో అవినీతి ఎలాంటి రూపాలను దాల్చింది? (బి) కాథోలిక్ చర్చి యొక్క నియమాలు, లైంగికతను గూర్చిన వక్రీకరింపబడిన అభిప్రాయాన్ని ఎలా పెంపొందించాయి?
16 యూదా మతంలో వలెనే క్రైస్తవమత సామ్రాజ్యంలో కూడా అవినీతి ఎన్నో రూపాలుదాల్చింది. అది కూడా అబద్ధ సిద్ధాంతాలకు మరియు అనైతికతలకు బలైపోయింది. బయటి ప్రభావాలకు విరుద్ధంగా తన మందను కాపాడాలన్న దాని ప్రయత్నాలే పవిత్ర ఆరాధన అవశేషాలేమైనా మిగిలివుంటే తరచూ వాటికి ముప్పు వాటిల్లజేశాయి. కఠిన, లేఖనరహిత నియమాలు కోకొల్లలయ్యాయి.
17 చర్చి నియమాల పెద్ద సముదాయాన్ని సృష్టించడంలో కాథోలిక్ చర్చి ముందుంది. లైంగికతకు సంబంధించిన విషయంలో ఈ నియమాలు ప్రాముఖ్యంగా గలిబిలిని కలిగించాయి. లైంగితక మరియు కాథోలిక్ మతం (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, అన్ని విధాలైన ఆనందాలను అనుమానించేదైన స్టాయిక్‌ల గ్రీకు తత్వాన్ని చర్చి స్వీకరించింది. సాధారణ వైవాహిక సంబంధాలతో సహా అన్ని విధాలైన లైంగిక ఆనందం కూడా పాపకరమైనదని చర్చి బోధించడం ప్రారంభించింది. (సామెతలు 5:18, 19 వ్యత్యాసం చూడండి.) లైంగికత పునఃసృష్టి కొరకే గానీ మరింక దేని కొరకూ కాదని చెప్పబడింది. కాబట్టి ఏ విధమైన గర్భనిరోధకాన్ని కూడా చర్చి నియమం ఎంతో గంభీరమైన పాపంగా ఖండించింది, కొన్నిసార్లు అనేక సంవత్సరాల ప్రాయశ్చిత్తాన్ని కోరేది. అంతే కాకుండా, ప్రీస్టులు వివాహం చేసుకోకూడదని ఆదేశించబడ్డారు, పిల్లలపై దురాచారంతో సహా విపరీతమైన అనైతిక లైంగికతకు దారితీసిన నియమమిది.—1 తిమోతి 4:1-3.
18. చర్చి నియమాలను ఎక్కువగా సృష్టించడం యొక్క ఫలితమేమిటి?
18 చర్చి నియమాలు ఎక్కువయ్యే కొలది అవి పుస్తకాలుగా సంస్థీకరింపబడ్డాయి. ఇవి బైబిలును అస్పష్టం చేయడం, దాన్ని అధిగమించడం ప్రారంభించాయి. (మత్తయి 15:3, 9 పోల్చండి.) యూదా మతం వలెనే కాథోలిక్ మతం లౌకిక గ్రంథాలను నమ్మలేదు, అందులో అధికభాగాన్ని ఒక ముప్పుగా భావించింది. ఆ విషయాన్ని గురించిన బైబిలు యొక్క జ్ఞానవంతమైన హెచ్చరికను దాటి ఈ దృక్పథం ఎంతో దూరం వెళ్లింది. (ప్రసంగి 12:12; కొలొస్సయులు 2:8) సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన చర్చి రచయితైన జెరోమ్, ఇలా అన్నాడు: “ఓ ప్రభువా, మళ్లీ ఎప్పటికైనా ప్రాపంచిక పుస్తకాలను నేను కలిగివున్నా లేక వాటిని చదివినా, నేను నిన్ను త్యజించినట్లే.” కొంత కాలానికి, పుస్తకాలను అంటే లౌకిక అంశాలపై ఉన్నవాటిని కూడా చర్చి సెన్సార్ చేయడం ప్రారంభించింది. అలా 17వ శతాబ్దానికి చెందిన ఖగోళశాస్త్రజ్ఞుడైన గాలిలియో, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని వ్రాసినందుకు విమర్శింపబడ్డాడు. అన్నింటికీ, అంటే ఖగోళశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నల విషయంలో కూడా తనదే అంతిమ అధికారమన్న చర్చి పట్టుదల తుదకు బైబిలునందు విశ్వాసాన్ని బలహీనపరిచేందుకు దోహదపడుతుంది.
19. క్రైస్తవ సన్యాసుల మఠాలు కఠిన అధికార దురహంకారాన్ని ఎలా పెంపొందించాయి?
19 తమను తాము త్యజించుకుని ఈ లోకంనుండి వేరుగా ఉండేందుకు క్రైస్తవ సన్యాసులు జీవించే మఠాల్లో, సూత్రాలు స్థాపించే పద్ధతి వెల్లివిరిసింది. అనేక కాథోలిక్ మఠాలు “సెయింట్ బెనెడిక్ట్ సూత్రాన్ని” హత్తుకున్నాయి. అబ్బోట్, (“తండ్రి” అనే పదానికిగల అరామిక్ పదంనుండి ఆ పదం తీసుకోబడింది) తిరుగులేని అధికారంతో పరిపాలించాడు. (మత్తయి 23:9 పోల్చండి.) ఒక సన్యాసి తన తలిదండ్రులనుండి ఒక బహుమతిని అందుకుంటే, దాన్ని ఆ సన్యాసి తీసుకోవాలా వేరే ఎవరైనా తీసుకోవాలా అనేది కూడా అబ్బోటే నిర్ణయిస్తాడు. ఒక సూత్రం, నీచమైన వాటిని ఖండించడమే కాకుండా, అన్ని విధాలైన ఛలోక్తులను మరియు జోకులను నిషేధించి, “ఏ శిష్యుడూ అలాంటి విషయాలు మాట్లాడకూడదు” అని చెప్పింది.
20. ప్రొటెస్టెంటు మతం కూడా లేఖన విరుద్ధమైన అధికార దురహంకారాన్ని చూపడంలో నిపుణత సంపాదించిందని ఏది చూపుతుంది?
20 కాథోలిక్ మతంలోని లేఖనరహితమైన అదనపు వివరాలను సంస్కరించేందుకు ప్రయత్నించిన ప్రొటెస్టెంటు మతం, క్రీస్తు ధర్మశాస్త్రంలో ఎలాంటి ఆధారమూ కలిగిలేని అధికారపూర్వక సూత్రాలను చేయడంలో త్వరలో సమానమైన నిపుణత సంపాదించింది. ఉదాహరణకు, ప్రముఖ సంస్కర్త అయిన జాన్ కాల్విన్‌ను “పునరుద్ధరింపబడిన చర్చి యొక్క లెజిస్లేటర్” అని పిలువడం ప్రారంభమైంది. అతను జనీవాపై అనేకానేక కట్టుదిట్టమైన సూత్రాలను ఉంచి దానిపై ఆధిపత్యం చేశాడు. ఆ సూత్రాలను “ప్రతి ఒక్కరి జీవితంపై పర్యవేక్షణ చేయడమే వారి పని” అని కాల్విన్ పేర్కొన్న “పెద్దలు” అమలుపరిచేవారు. (2 కొరింథీయులు 1:24, వ్యత్యాసం చూడండి.) చర్చి పూటకూళ్ల ఇళ్లను అదుపు చేసింది, ఏ చర్చనీయాంశాలు అనుమతింపబడ్డాయి అనే విషయాన్ని నియంత్రించింది. మర్యాద లేని గీతాలు పాడటం లేక నాట్యమాడటం వంటి తప్పిదాలకు తీవ్రమైన జరిమానాలు విధింపబడేవి.b
క్రైస్తవమత సామ్రాజ్యపు తప్పులనుండి నేర్చుకోవడం
21. ‘వ్రాసియున్న సంగతులను అతిక్రమించాలన్న’ క్రైస్తవమత సామ్రాజ్యపు దృక్పథం యొక్క ప్రభావాలు మొత్తం మీద ఏమైవున్నాయి?
21 ఈ సూత్రాలు మరియు నియమాలన్నీ, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని అవినీతినుండి కాపాడేందుకు పని చేశాయా? దానికి విరుద్ధమైన దాన్నే చేశాయి! నేడు క్రైస్తవమత సామ్రాజ్యం, అతి కట్టుదిట్టమైన దాని నుండి విపరీతమైన విచ్చలవిడియైన దాని వరకూ, అంటే వందలాది తెగలుగా తునకలైపోయింది. దైవిక నియమంలో జోక్యం చేసుకోడానికి మరియు మందను మానవ ఆలోచనావిధానంతో నడపడానికి అనుమతిస్తూ, అవన్నీ కూడా ఏదో ఒక విధంగా, ‘వ్రాసియున్న సంగతులను అతిక్రమించాయి.’—1 కొరింథీయులు 4:6.
22. క్రైస్తవమత సామ్రాజ్యపు లోపం యొక్క భావం, క్రీస్తు ధర్మశాస్త్రం అంతమయ్యిందని ఎందుకు కాదు?
22 అయితే, క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క చరిత్ర ఒక విషాదమేమీ కాదు. దైవిక నియమాన్ని తుడిచిపెట్టేందుకు యెహోవా దేవుడు మానవమాత్రులను ఎన్నటికీ అనుమతించడు. క్రైస్తవ ధర్మశాస్త్రం నేడు నిజ క్రైస్తవుల మధ్య ఎంతగానో అమలుపరచబడుతోంది, దాని ప్రకారం జీవించే గొప్ప ఆధిక్యత వీరికుంది. అయితే దైవిక ధర్మశాస్త్రానికి యూదా మతం మరియు క్రైస్తవమత సామ్రాజ్యం చేసిన దాన్ని పరిశీలించిన తర్వాత, మనమిలా తప్పక ఆలోచించవచ్చు, ‘మానవ తర్కంతో మరియు దైవిక నియమం యొక్క అసలు భావాన్నే తలక్రిందులు చేసే సూత్రాలతో దేవుని వాక్యాన్ని కలుషితం చేయడమనే ఉరిని తప్పించుకుంటూ, క్రీస్తు ధర్మశాస్త్రానికి అనుగుణంగా మనమెలా జీవించగలం? క్రీస్తు ధర్మశాస్త్రం నేడు మనలో ఏ సమతుల్య దృష్టిని నెలకొల్పాలి?’ తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
[అధస్సూచీలు]
a నేడు ఏ విధమైన యూదా మతం ఉనికిలో ఉందో దానికి ఎక్కువగా పరిసయ్యులే బాధ్యులు, కాబట్టి విశ్రాంతి దినాన్ని గూర్చి దానికి జతచేయబడిన అనేక కట్టడల్లో యూదా మతం ఇంకా లొసుగులను వెదకడంలో ఆశ్చర్యంలేదు. ఉదాహరణకు, విశ్రాంతి దినాన ఒక ఆర్థడాక్స్ యూదా ఆసుపత్రికి వచ్చే సందర్శకుడు, ప్రయాణికులు లిఫ్టు బటన్‌ను నొక్కే పాపకర “పనిని” చేయకుండా నివారించేందుకు ప్రతి అంతస్తులో లిఫ్టు దానికదే ఆగిపోవడాన్ని కనుగొంటాడు. కొందరు ఆర్థడాక్స్ వైద్యులు, తమ ప్రిష్‌క్రిప్షన్‌ను కొద్ది రోజుల్లో చెరిగిపోయే సిరాతో వ్రాస్తారు. ఎందుకు? వ్రాయడాన్ని, మిష్నా ఓ పని అని సూచిస్తుంది, అయితే “వ్రాయడాన్ని” అది నిరంతరం నిలిచే గుర్తు అని నిర్వచిస్తుంది.
b కాల్విన్ యొక్క కొన్ని వేదాంతిక దృక్కోణాలను తిరస్కరించినందుకు సర్వీటస్స్ ఒక ధర్మవిరోధిగా కొయ్యకు కట్టి కాల్చబడ్డాడు.
మీరు ఎలా సమాధానమిస్తారు?
◻ క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతస్తత్వం ఏమిటి?
◻ యేసు బోధనా పద్ధతి పరిసయ్యుల బోధనా పద్ధతి నుండి ఎలా వేరుగా ఉండినది?
◻ క్రైస్తవమత సామ్రాజ్యాన్ని కలుషితం చేసేందుకు కఠిన, సూత్రాలు చేసే దృక్పథాన్ని సాతాను ఎలా ఉపయోగించుకున్నాడు?
◻ క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం వలన కలిగే కొన్ని అనుకూల ప్రభావాలు ఏవి?
[16వ పేజీలోని చిత్రం]
యేసు మోషే ధర్మశాస్త్రాన్ని సహేతుకంగా మరియు దయాపూర్వకంగా అన్వయించాడు