అపొల్లో—క్రైస్తవ సత్యాన్ని వాక్చాతుర్యంతో ప్రకటించినవాడు
క్రైస్తవ సంఘ సభ్యులుగా అనేక సంవత్సరాల నుండి ఉంటున్నా, లేక కొన్ని సంవత్సరాలే అయినా, రాజ్య ప్రచారకులందరూ సువార్త ప్రకటించేవారిగా తాము అభివృద్ధి చెందడంలో ఆసక్తి కలిగివుండాలి. దేవుని వాక్యాన్ని గూర్చిన మన జ్ఞానాన్ని, దాన్ని ఇతరులకు బోధించే మన సామర్థ్యాన్ని అధికం చేసుకోవడాన్ని అది సూచిస్తుంది. కొందరి విషయంలో అది సవాళ్లనెదుర్కోవడం, కష్టాలను తట్టుకోవడం, లేక అత్యధిక కార్యకలాపాల కొరకు తమను తాము అందుబాటులో ఉంచుకోవడం అయ్యుండవచ్చు.
వివిధ రీతుల్లో గొప్ప ఆత్మీయ అభివృద్ధిని సాధించడంలో సఫలులై తమ ప్రయాసలకు తగిన ప్రతిఫలాలను పొందిన, ప్రాచీన కాలంనాటి సమర్పిత స్త్రీ పురుషుల అనేక ఉదాహరణలు బైబిలునందున్నాయి. వారిలో అపొల్లో ఒకరు. లేఖనాలు ఆయనను మనకు పరిచయం చేసినప్పుడు ఆయనకు క్రైస్తవ బోధల గురించి సంపూర్ణ అవగాహన లేదు; అయితే కేవలం కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన మొదటి శతాబ్దపు సంఘానికి ప్రయాణ ప్రతినిధిగా పనిచేశాడు. అలాంటి అభివృద్ధిని సాధించడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? మనమందరం బహు చక్కగా అనుకరించదగిన లక్షణాలు ఆయనకున్నాయి.
“లేఖనములయందు ప్రవీణుడు”
బైబిలు రచయితయైన లూకా ప్రకారం, దాదాపు సా.శ. 52వ సంవత్సరంలో, “అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనినవాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.”—అపొస్తలుల కార్యములు 18:24-26.
రోము తర్వాత ఐగుప్తునందలి అలెక్సంద్రియ ప్రపంచంలోకెల్లా రెండవ పెద్ద నగరం మరియు యూదుల కాలానికి అలాగే గ్రీకుల కాలానికి అది అత్యంత ప్రాముఖ్యమైన సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటిగా ఉండేది. బహుశా, ఆ నగరంలోని యూదులకు చెందిన పెద్ద సమాజంలో విద్యనభ్యసించడం ద్వారా అపొల్లో లేఖనాలను గూర్చిన తన విలువైన జ్ఞానాన్ని మరియు కొంత వాక్చాతుర్యాన్ని సంపాదించుకొని ఉండవచ్చు. అపొల్లో యేసు గురించి ఎక్కడ తెలుసుకున్నాడన్నది ఊహించడం కష్టం. “ఆయన ఒక యాత్రికుడని స్పష్టమౌతుంది—బహుశా సంచార వ్యాపారి అయ్యుండవచ్చు. తాను సందర్శించిన అనేకానేక స్థలాల్లో ఏదొకచోట క్రైస్తవ ప్రచారకులను ఆయన కలిసి ఉండవచ్చు” అని పండితుడైన ఎఫ్. ఎఫ్. బ్రూస్ సూచిస్తున్నాడు. ఏదేమైనా, ఆయన యేసు గురించి సరియైన విధంగానే మాట్లాడి బోధించినప్పటికీ, సా.శ. 33 పెంతెకొస్తు నాటి కంటే ముందే ఆయనకు సాక్ష్యమివ్వబడినట్లు కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన “యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనినవాడై” యుండెను.
యేసుకు ముందు నడచినవానిగా, బాప్తిస్మమిచ్చే యోహాను ఇశ్రాయేలు జనాంగమంతటికీ శక్తివంతమైన సాక్ష్యమిచ్చాడు, పశ్చాత్తాపానికి గుర్తుగా అనేకులు ఆయన ద్వారా బాప్తిస్మం పొందారు. (మార్కు 1:5; లూకా 3:15, 16) అనేకమంది చరిత్రకారుల ప్రకారం, రోమా సామ్రాజ్యమందలి యూదా జనాంగంలోని అనేకులకు, యేసు గురించి యొర్దాను తీరం వెంబడి ప్రకటించబడినదే తెలుసు. “వారి క్రైస్తవత్వం మన ప్రభువు పరిచర్య ఎక్కడ ప్రారంభమైనప్పుడు ఎలా ఉండిందో అలాగే నిలిచిపోయింది. క్రీస్తు మరణం యొక్క పూర్తి భావం వారికి తెలియదు; బహుశా ఆయన పునరుత్థానాన్ని గూర్చిన వాస్తవం కూడా వారికి తెలిసి ఉండకపోవచ్చు” అని డబ్ల్యూ. జె. కానిబార్ మరియు జె. ఎస్. హూసన్ చెబుతున్నారు. సా.శ. 33 పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం గురించి అపొల్లోకు కూడా తెలియదన్నట్లు కనిపిస్తుంది. ఏమైనప్పటికీ, ఆయన యేసు గురించి కొంత సరైన సమాచారాన్నే సంపాదించాడు, ఆయన దాన్ని తన వరకే ఉంచుకోలేదు. వాస్తవానికి, ఆయన తనకు తెలిసినదాని గురించి మాట్లాడడానికి అవకాశాల కొరకు ధైర్యంగా వెదికాడు. అయితే, ఆయనకున్న ఆసక్తి, ఉత్సాహం ఇంకా కచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా మారలేదు.
ఆసక్తిగలవాడే కాని దీనుడు
లూకా వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.” (అపొస్తలుల కార్యములు 18:26) అపొల్లో విశ్వాసం చాల వరకు తమ విశ్వాసం వంటిదేనని అకుల ప్రిస్కిల్ల గుర్తించి ఉండవచ్చు, కాని వారు జ్ఞానయుక్తంగా, ఆయన అసంపూర్ణ అవగాహనను బహిరంగంగా సరిచేసేందుకు ప్రయత్నించలేదు. బహుశా వారు అపొల్లోకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనతో అనేకసార్లు వ్యక్తిగతంగా మాట్లాడి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. “లేఖనములయందు దిట్టయైన” అపొల్లో ఎలా ప్రతిస్పందించాడు? (అపొస్తలుల కార్యములు 18:24, కింగ్డమ్ ఇంటర్లీనియర్) అకుల ప్రిస్కిల్లలను కలవక ముందు కొంతకాలం నుండి అపొల్లో తన అసంపూర్ణ వర్తమానాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ఉండవచ్చుననడానికి పూర్తి సాధ్యత ఉంది. గర్విష్టియైన వ్యక్తి ఏ సవరింపునైనా ఎంతో సుళువుగా తిరస్కరించే అవకాశముంది, కాని అపొల్లో దీనుడైవుండి, తన జ్ఞానాన్ని సంపూర్ణం చేసుకోగలుగుతున్నందుకు కృతజ్ఞత కలిగివున్నాడు.
అపొల్లోకున్న అదే దీన దృక్పథం, కొరింథులోని సంఘానికి ఎఫెసునందలి సహోదరులు వ్రాసిన సిఫారసు పత్రాన్ని అంగీకరించడంలో ఆయన చూపిన సుముఖతయందు కూడా స్పష్టమౌతుంది. వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి.” (అపొస్తలుల కార్యములు 18:27; 19:1) తన స్వంత సద్గుణాలనుబట్టి అంగీకరింపబడాలని అపొల్లో కోరలేదు గాని వినయంగా క్రైస్తవ సంఘ ఏర్పాటును అనుసరించాడు.
కొరింథులో
కొరింథులో అపొల్లో పరిచర్య యొక్క తొలి ఫలితాలు అద్భుతంగా ఉండినవి. అపొస్తలుల కార్యముల పుస్తకం ఇలా నివేదిస్తుంది: “అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.”—అపొస్తలుల కార్యములు 18:27, 28.
తన సిద్ధపాటు, ఆసక్తి మూలంగా సహోదరులను ప్రోత్సహిస్తూ అపొల్లో సంఘ సేవ కొరకు తనను తాను అర్పించుకున్నాడు. ఆయన విజయానికి కీలకమేమిటి? అపొల్లోకు కచ్చితంగా సహజ సామర్థ్యం ఉంది మరియు యూదులతో బహిరంగంగా చర్చను కొనసాగించడంలో ధైర్యంగా ఉండేవాడు. కాని అంతకంటే ప్రాముఖ్యంగా, ఆయన లేఖనాలను ఉపయోగించి తర్కించాడు.
కొరింథీయుల మధ్య అపొల్లో శక్తివంతమైన ప్రభావం కలిగివున్నప్పటికీ, విచారకరంగా ఆయన ప్రకటనాపని అనుకోని ప్రతికూల ప్రభావాలను ఉత్పన్నం చేసింది. అదెలా? కొరింథులో రాజ్య సత్య విత్తనాన్ని నాటడంలోను నీరు పోయడంలోను పౌలు, అపొల్లో ఇద్దరూ ఎంతో పాటుపడ్డారు. పౌలు దాదాపు సా.శ. 50వ సంవత్సరం ఆ ప్రాంతంలో అంటే అపొల్లో రావడానికి దాదాపు రెండు సంవత్సరాల ముందు అక్కడ ప్రకటించాడు. పౌలు కొరింథీయులకు తన మొదటి పత్రికను వ్రాసే సమయానికి, అంటే దాదాపు సా.శ. 55వ సంవత్సరంలో విభేదాలు వృద్ధి చెందాయి. కొందరు అపొల్లోను తమ నాయకునిగా దృష్టిస్తున్నారు, అయితే ఇతరులు పౌలును లేక పేతురును లేదా కేవలం క్రీస్తును ఇష్టపడ్డారు. (1 కొరింథీయులు 1:10-12) కొందరు ‘నేను అపొల్లో వాడను’ అని చెప్పేవారు. ఎందుకు?
పౌలు మరియు అపొల్లో ఇద్దరు ప్రకటించిన వర్తమానమూ ఒకటే, కాని వారికి భిన్నమైన వ్యక్తిత్వాలుండేవి. పౌలు స్వయంగా అంగీకరించినట్లుగా, ఆయన ‘ప్రసంగము కొరగానిదిగా’ ఉండేది; మరోవైపున అపొల్లో ‘దిట్టయై’ ఉండేవాడు. (2 కొరింథీయులు 10:10; 11:6) కొరింథులోని యూదా సమాజానికి చెందిన కొందరు వినగలిగేలా చేసే సామర్థ్యాలు ఆయనకుండేవి. ‘యూదులది పూర్తిగా తప్పని నిరూపించడంలో’ ఆయన విజయం సాధించాడు, అయితే పౌలు కొంతకాలం ముందే సమాజమందిరాన్ని విడిచి వెళ్లాడు.—అపొస్తలుల కార్యములు 18:1, 4-6.
కొందరు అపొల్లోను అనుసరించాలనే దృక్పథం కల్గివుండడానికి ఇది కారణమై ఉండవచ్చా? ఆధ్యాత్మిక చర్చ ఎడల గ్రీకులకున్న అంతర్గత కోరిక, అపొల్లోకున్న చలింపజేసే ప్రసంగవిధానాన్ని కొందరు ఇష్టపడేలా చేసివుండవచ్చునని అనేకమంది వ్యాఖ్యాతలు ఊహిస్తున్నారు. “[అపొల్లో యొక్క] రసవత్తరమైన భాష, వాగ్దాటితో కూడిన భావసూచక వృత్తాంతాలు, నిరాడంబరమైన, నిపుణతలేని ప్రసంగికుడైన పౌలు కంటే ఈయనను ఎక్కువగా ఇష్టపడేలా చేశాయని” జూజెప్పే రిక్కోయట్ సూచిస్తున్నాడు. వాస్తవానికి, ఒకవేళ కొంతమంది అలాంటి వ్యక్తిగత అపేక్షలు సహోదరుల మధ్య విభేదాలను కలుగజేయడానికి తప్పుగా అనుమతించి ఉంటే, “జ్ఞానుల జ్ఞానమును” ఉన్నతపర్చడాన్ని పౌలు తీవ్రంగా ఎందుకు విమర్శించాడో అర్థం చేసుకోవడం సులభమే.—1 కొరింథీయులు 1:17-25.
అయితే, అలాంటి విమర్శ పౌలు అపొల్లోల మధ్య ఎలాంటి విభేదాన్ని కలిగించలేదు. ఈ ఇద్దరు ప్రచారకులు కొరింథీయుల ప్రేమలను పొందడానికి పోరాడుతున్న తీవ్ర వ్యతిరేకులని కొంతమంది ఊహించినప్పటికీ, లేఖనాలు అలాంటిదేది ఉన్నట్లుగా చెప్పడం లేదు. తనను తాను ఒక విభాగిత గుంపు నాయకునిగా చేసుకునేందుకు ప్రయత్నించే బదులు అపొల్లో కొరింథును విడిచి వెళ్లి, ఎఫెసుకు తిరిగి వచ్చి, విభాగింపబడిన సంఘానికి పౌలు తన మొదటి పత్రికను వ్రాసే సమయానికి ఆయన పౌలుతోనే ఉన్నాడు.
వారి మధ్య అనైక్యతగాని శత్రుత్వంగాని లేవు; బదులుగా, కొరింథులోని సమస్యలను పరస్పర నమ్మకంతో పరిష్కరించడంలో ఇద్దరూ సహకరించుకున్నారన్నది స్పష్టమౌతుంది. బహుశా పౌలుకు కొరింథులోని కొందరి గురించి అనుమానాలు ఉండివుండవచ్చు గాని అపొల్లో గురించి మాత్రం కాదు. ఈ ఇద్దరు వ్యక్తుల పని సంపూర్ణ పొందిక కలిగి ఉండేది; వారి బోధలు పరస్పరం ప్రశంసనీయంగా ఉండేవి. పౌలు స్వంత మాటలను ఉదహరించాలంటే: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను,” ఎందుకంటే ఇద్దరూ ‘దేవుని జతపనివారై యుండిరి.’—1 కొరింథీయులు 3:6, 9, 21-23.
పౌలు వలె, అపొల్లో కూడ మరల తమ్మును సందర్శించాలని కొరింథీయులు అపేక్షిస్తూ ఆయనను ఉన్నతంగా ఎంచారు. కాని కొరింథుకు తిరిగి రమ్మని పౌలు అపొల్లోను కోరినప్పుడు, అలెక్సంద్రియవాడు నిరాకరించాడు. పౌలు ఇలా చెబుతున్నాడు: “సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, . . . మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.” (1 కొరింథీయులు 16:12) మరిన్ని విభేదాలు ఏర్పడడానికి కారణమౌతానేమోనని గాని లేక కేవలం మరితర పనులలో పని తొందర కలిగివుండడం వలనగాని అపొల్లో తిరిగి వెళ్లడానికి నిరాకరించి ఉండవచ్చు.
లేఖనాల్లో అపొల్లో ప్రస్తావించబడిన చివరిసారి, ఆయన క్రేతుకు లేదా బహుశా దాన్ని దాటి ప్రయాణిస్తుండెను. అపొల్లోకు అతని ప్రయాణ సహచరుడైన జేనాకు తమ ప్రయాణంలో అవసరమైనదంతా ఇవ్వమని తీతును కోరుతూ, పౌలు తన స్నేహితుడు తోటి పనివాడు అయిన వాని ఎడల మళ్లీ ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తాడు. (తీతు 3:13) ఈ సమయానికల్లా, దాదాపు పది సంవత్సరాలు క్రైస్తవ తర్ఫీదు పొందిన తర్వాత, సంఘ ప్రయాణ ప్రతినిధిగా పనిచేసేందుకు అపొల్లో తగినంత అభివృద్ధిని సాధించాడు.
ఆత్మీయాభివృద్ధిని సాధ్యం చేసే దైవిక లక్షణాలు
ఆధునిక దిన సువార్త ప్రచారకులందరికీ, వాస్తవానికి ఆత్మీయాభివృద్ధి చేసుకోవాలని అభిలషించే వారందరికీ అలెక్సంద్రియ ప్రచారకుడు మంచి మాదిరినుంచాడు. మనం ఆయనంత వాగ్దాటి కలిగి ఉండకపోవచ్చు, కాని మనం ఆయన జ్ఞానాన్ని, లేఖనాలను ఉపయోగించడంలోని సామర్థ్యాన్ని అనుకరిస్తూ తద్వారా సత్యాన్ని యథార్థంగా వెదికే వారికి సహయం చేసేలా, కచ్చితంగా ప్రయాసపడవచ్చు. అపొల్లో ఆసక్తికరమైన పరిచర్యకు చూపిన తన మాదిరి ద్వారా “విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.” (అపొస్తలుల కార్యములు 18:27) అపొల్లో దీనత్వం, స్వయంత్యాగం మరియు ఇతరులకు సేవచేయాలనే అభిలాష కలిగివుండేవాడు. మనమందరం “దేవుని జతపనివారమై యున్నాము” గనుక క్రైస్తవ సంఘంలో విరోధానికి లేక ప్రసిద్ధి గాంచడానికి స్థానం లేదని ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు.—1 కొరింథీయులు 3:4-9; లూకా 17:10.
అపొల్లో వలె మనం ఆత్మీయ అభివృద్ధి సాధించవచ్చు. యెహోవా చేత ఆయన సంస్థ చేత మరింత ఎక్కువగా ఉపయోగించుకొనబడగల స్థానంలో మనల్ని మనం ఉంచుకోవడం ద్వారా మనం మన పరిశుద్ధ సేవను మెరుగుపర్చుకోవడానికి లేక విస్తృతపర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? అలాగైతే మనం ఆసక్తిగల విద్యార్థులముగా, క్రైస్తవ సత్య ప్రచారకులముగా ఉంటాము.