తండ్రి మరియు పెద్ద—రెండు పాత్రలను నిర్వర్తించడం
“ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?”—1 తిమోతి 3:5.
1, 2. (ఎ) మొదటి శతాబ్దంలో, అవివాహిత అధ్యక్షులు మరియు పిల్లలు లేని వివాహిత అధ్యక్షులు తమ సహోదరులకు ఎలా సేవచేయగలిగేవారు? (బి) నేడు అనేకమంది వివాహిత దంపతులకు అకుల, ప్రిస్కిల్ల ఎలా మంచి మాదిరిగా ఉన్నారు?
తొలి క్రైస్తవ సంఘ అధ్యక్షులు అవివాహిత పురుషులై ఉండవచ్చు, లేక పిల్లలు లేని వివాహిత పురుషులై ఉండవచ్చు లేదా పిల్లలుగల కుటుంబీకులైయుండవచ్చు. నిస్సందేహంగా, అవివాహితులుగా ఉండిపోవడం గురించి అపొస్తలుడైన పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఇచ్చిన ఉపదేశాన్ని ఆ క్రైస్తవులలో కొందరు అనుసరించగలిగారు. యేసు ఇలా తెలియజేశాడు: “పరలోక రాజ్యమునిమిత్తము తమ్మునుతామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు.” (మత్తయి 19:12) పౌలు వలె మరియు బహుశా ఆయన ప్రయాణ సహచరులలో కొంతమంది వలె అలాంటి అవివాహిత పురుషులు తమ సహోదరులకు సహాయం చేసేందుకు ప్రయాణించడానికి స్వతంత్రులై ఉండవచ్చు.
2 బర్నబా, మార్కు, సీల, లూకా, తిమోతి మరియు తీతు అవివాహిత పురుషులో కాదో బైబిలు తెలియజేయడం లేదు. వివాహితులైతే, వివిధ పని నియామకాల్లో విస్తృతంగా ప్రయాణించడానికి వారు కుటుంబ బాధ్యతల నుండి తగినంతగా స్వతంత్రులై ఉండిరని స్పష్టమౌతుంది. (అపొస్తలుల కార్యములు 13:2; 15:39-41; 2 కొరింథీయులు 8:16, 17; 2 తిమోతి 4:9-11; తీతు 1:5) ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు తమతోపాటు తమ భార్యలను వెంటతీసుకు వెళ్లిన పేతురు మరియు “తక్కిన అపొస్తలుల” వలె వారును తమ భార్యలను తమ వెంట తీసుకువెళ్లి ఉండవచ్చు. (1 కొరింథీయులు 9:5) కొరింథు నుండి ఎఫెసుకు, ఆ తర్వాత రోముకు వెళ్లి, తిరిగి ఎఫెసుకు పౌలు వెంటవెళ్తూ క్రొత్త ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడిన వివాహిత దంపతులలో అకుల మరియు ప్రిస్కిల్ల మంచి ఉదాహరణలు. వారికి పిల్లలున్నట్లు బైబిలు చెప్పడం లేదు. వారు తమ సహోదరుల కొరకు చేసిన సమర్పిత సేవను బట్టి ‘అన్యజనులలోని సంఘములవారందరి’ కృతజ్ఞతను పొందారు. (రోమీయులు 16:3-5; అపొస్తలుల కార్యములు 18:2, 18; 2 తిమోతి 4:19) అకుల ప్రిస్కిల్లల వలె అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బహుశా తరలి వెళ్లడం ద్వారా ఇతర సంఘాల్లో సేవ చేయగల వివాహిత దంపతులు నేడు నిస్సందేహంగా అనేకమంది ఉన్నారు.
తండ్రి మరియు పెద్ద
3. మొదటి శతాబ్దపు పెద్దలలో అనేకులు కుటుంబాలుగల వివాహిత పురుషులని ఏది సూచిస్తుంది?
3 సా.శ. మొదటి శతాబ్దంలో క్రైస్తవ పెద్దలలో అనేకులు పిల్లలుగల వివాహిత పురుషులై ఉన్నట్లు స్పష్టమౌతుంది. పౌలు ‘అధ్యక్ష్యపదవిని ఆశించే’ పురుషునికి అవసరమైన అర్హతల గురించి తెలియజేస్తూ అలాంటి క్రైస్తవుడు “సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను” అని ఆయన చెప్పాడు.—1 తిమోతి 3:1, 4.
4. పిల్లలుగల వివాహిత పెద్దలనుండి ఏమి కోరబడుతుంది?
4 మనం చూసినట్లుగా, అధ్యక్షుడు పిల్లలను కలిగివుండడం లేక చివరికి వివాహితుడై ఉండడం ఒక అవసరత కాదు. కాని ఒక క్రైస్తవుడు వివాహితుడైతే, పెద్దగా లేక పరిచర్య సేవకునిగా అర్హుడయ్యేందుకు అతడు తన భార్య ఎడల సరైన, ప్రేమపూర్వకమైన శిరస్సత్వాన్ని నిర్వహించాలి, తన పిల్లలను సరైన విధంగా స్వాధీనంలో ఉంచుకోగల సామర్థ్యమున్నట్లు చూపించాలి. (1 కొరింథీయులు 11:3; 1 తిమోతి 3:12, 13) తన కుటుంబాన్ని అదుపు చేయడంలో ఏదైనా గంభీరమైన బలహీనత ఉంటే అది ఆ సహోదరున్ని సంఘంలో ప్రత్యేకమైన ఆధిక్యతల కొరకు అనర్హున్ని చేస్తుంది. ఎందుకు? పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?” (1 తిమోతి 3:5) తన స్వంత కుటుంబ సభ్యులే తన పర్యవేక్షణకు లోబడడానికి ఇష్టపడకుంటే, ఇతరులు ఎలా ప్రతిస్పందిస్తారు?
‘విశ్వాసులైన పిల్లలుగలవాడై ఉండడం’
5, 6. (ఎ) పిల్లలకు సంబంధించి ఏ అవసరత గురించి పౌలు తీతుకు తెలియజేశాడు? (బి) పిల్లలున్న పెద్దల నుండి ఏమి అపేక్షించబడుతుంది?
5 క్రేతు సంఘాల్లో అధ్యక్షులను నియమించమని తీతుకు ఉపదేశించేటప్పుడు పౌలు ఖండితంగా ఇలా చెప్పాడు: “ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను.” ‘విశ్వాసులైన పిల్లలుగలవాడై’ ఉండడమనే అవసరత యొక్క భావమేమిటి?—తీతు 1:6, 7.
6 “విశ్వాసులైన పిల్లలు” అనే పదం ఇప్పటికే తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందిన యౌవనస్థులను లేక సమర్పణ బాప్తిస్మముల కొరకు పురోభివృద్ధి చెందుతున్న పిల్లలను సూచిస్తుంది. పెద్దల పిల్లలు సాధారణంగా మంచి ప్రవర్తన గలవారై, విధేయులై ఉండాలని సంఘ సభ్యులు అపేక్షిస్తారు. తన పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి ఒక పెద్ద తాను చేయగలిగినదంతా చేస్తున్నాడని స్పష్టమవ్వాలి. రాజైన సొలొమోను ఇలా వ్రాశాడు: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామెతలు 22:6) అయితే అలాంటి శిక్షణ పొందిన యౌవనుడు యెహోవా సేవ చేయడానికి నిరాకరిస్తే లేక చివరికి ఘోరమైన తప్పు చేస్తే అప్పుడేమిటి?
7. (ఎ) సామెతలు 22:6 మార్చలేని నియమాన్ని తెలియజేయడం లేదని ఎందుకు స్పష్టమౌతుంది? (బి) ఒక పెద్ద యొక్క పిల్లవాడు యెహోవా సేవ చేసేందుకు ఎంపిక చేసుకోకపోతే, ఆ పెద్ద తన ఆధిక్యతలను యాదృచ్ఛికంగా ఎందుకు కోల్పోడు?
7 పైన చెప్పబడిన సామెత ఖండితమైన నియమం గురించి చెప్పడం లేదని స్పష్టమౌతుంది. అది స్వేచ్ఛా చిత్తం యొక్క సూత్రాన్ని కొట్టివేయడం లేదు. (ద్వితీయోపదేశకాండము 30:15, 16, 19) ఒక కుమారుడు లేక కుమార్తె యుక్త వయస్సుకు చేరుకుంటే, సమర్పణ మరియు బాప్తిస్మానికి సంబంధించి అతడు లేక ఆమె వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి. ఒక పెద్ద అవసరమైన ఆత్మీయ సహాయాన్ని, నడిపింపును క్రమశిక్షణను స్పష్టంగా ఇచ్చినప్పటికీ ఆ యౌవనుడు యెహోవా సేవ చేసేందుకు ఎంపిక చేసుకోకపోతే, ఆ తండ్రి అధ్యక్షుని సేవకు వెంటనే అనర్హుడైపోడు. అలా కాకుండా ఒక పెద్దకు గృహంలో అనేకమంది యౌవనస్థులైన పిల్లలు ఉండి, ఒకరి తర్వాత ఒకరు వారు ఆత్మీయంగా రోగగ్రస్థమై సమస్యల్లో పడిపోతుంటే, అతడు “తన యింటివారిని బాగుగా ఏలువాడునై” యున్నట్లు ఇక ఎంతమాత్రం పరిగణింపబడడు. (1 తిమోతి 3:4) విషయమేమిటంటే, ఒక అధ్యక్షుడు తాను ‘దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడై’ ఉండేందుకు తాను చేయగలిగినదంతా చేస్తున్నాడని స్పష్టమవ్వాలి.a
“అవిశ్వాసురాలైన భార్య”ను కలిగివుండడం
8. అవిశ్వాసురాలైన తన భార్యతో ఒక పెద్ద ఎలా ప్రవర్తించాలి?
8 అవిశ్వాసురాండ్రైన భార్యలను కలిగివున్న క్రైస్తవ పురుషుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. . . . అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. . . . ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” (1 కొరింథీయులు 7:12-14, 16) ఇక్కడ “అవిశ్వాసురాలైన” అనే పదం మతసంబంధమైన నమ్మకాలు లేని భార్యను సూచించడం లేదుగాని యెహోవాకు సమర్పించుకోని స్త్రీని సూచిస్తుంది. ఆమె యూదురాలై ఉండవచ్చు, లేక అన్యదేవుళ్లను విశ్వసిస్తుండవచ్చు. నేడు, ఒక పెద్ద వేరే మతాన్ని అవలంబించే స్త్రీని, అజ్ఞేయతావాదిని లేక ఒక నాస్తికురాలిని వివాహం చేసుకుని ఉండవచ్చు. ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడుతుంటే, కేవలం విభిన్న నమ్మకాలున్నందున అతడు ఆమెను పరిత్యజించకూడదు. అయినప్పటికీ అతడు ఆమెను రక్షించాలనే ఉద్దేశంతో జీవిస్తూ, ‘ఎక్కువ బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించి, జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయాలి.’—1 పేతురు 3:7; కొలొస్సయులు 3:19.
9. తమ తమ మతసంబంధమైన నమ్మకాలను తమ పిల్లలకు నేర్పుకోవడానికి చట్టం భార్యాభర్తలిద్దరికీ హక్కునిచ్చే దేశాల్లో, ఒక పెద్ద ఎలా ప్రవర్తించాలి, ఇది అతని ఆధిక్యతలను ఎలా ప్రభావితం చేస్తుంది?
9 ఒక అధ్యక్షునికి పిల్లలుంటే, వారిని “ప్రభువు “[యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను” పెంచడంలో అతడు భర్తగా మరియు తండ్రిగా సరైన శిరస్సత్వాన్ని నిర్వహిస్తాడు. (ఎఫెసీయులు 6:4) అనేక దేశాల్లో చట్టం తమ పిల్లలకు మత సంబంధమైన ఉపదేశాన్ని ఇచ్చే హక్కును వివాహిత దంపతులలో ఇద్దరికీ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, తన పిల్లలకు తన మతసంబంధమైన నమ్మకాలను ఆచారాలను బోధించేందుకు తనకున్న హక్కును ఉపయోగించుకుంటానని భార్య పట్టుబట్టవచ్చు, దానిలో వారిని తన చర్చికి తీసుకు వెళ్లడం ఇమిడి ఉండవచ్చు.b అయితే, అబద్ధమత సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉండడం విషయంలో పిల్లలు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని అనుసరించాలి. కుటుంబ శిరస్సుగా, తండ్రి తన పిల్లలతో పఠించేందుకు తనకు గల హక్కును సద్వినియోగం చేసుకుంటూ, వీలైనప్పుడు వారిని రాజ్యమందిరంలో జరిగే కూటాలకు తీసుకువెళ్తాడు. తమ సొంతగా నిర్ణయాలు తీసుకోగల వయస్సు వచ్చేసరికి, వారు తాము ఏ మార్గాన్ని అనుసరిస్తామన్నది తమకు తాము నిర్ణయించుకుంటారు. (యెహోషువ 24:15) సత్యమార్గంలో తన పిల్లలకు సరైన విధంగా ఉపదేశించేందుకు చట్టం తనను అనుమతించినంత మేరకు అతడు చేస్తున్నాడని అతని తోటి పెద్దలు, సంఘ సభ్యులు గమనిస్తే అతడు అధ్యక్షునిగా అనర్హుడవ్వడు.
‘తన ఇంటివారిని బాగుగా ఏలడం’
10. ఒక కుటుంబీకుడు పెద్ద అయితే, అతని ప్రాథమిక కర్తవ్యం ఏమిటి?
10 తాను తండ్రియై ఉండి, తన భార్య తోటి క్రైస్తవురాలై ఉన్న పెద్దకు కూడా, తన భార్యకు, పిల్లలకు, సంఘ బాధ్యతలకు తన సమయాన్ని అవధానాన్ని సరైన విధంగా పంచి ఇవ్వడం సులభమైన పనేమి కాదు. ఒక క్రైస్తవ తండ్రికి తన భార్యా పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడమనే కర్తవ్యం ఉందని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) ఇది వరకే తమను తాము మంచి భర్తలుగా, తండ్రులుగా చూపించుకున్న వివాహిత పురుషులను మాత్రమే అధ్యక్షులుగా సేవ చేయడానికి సిఫారసు చేయాలని పౌలు అదే పత్రికలో తెలియజేశాడు.—1 తిమోతి 3:1-5.
11. (ఎ) ‘తన స్వంత ఇంటివారిని’ పెద్ద ఏ యే విధాలుగా సంరక్షించాలి? (బి) తన సంఘ బాధ్యతలను నిర్వర్తించడానికి ఇది పెద్దకు ఎలా సహాయం చేస్తుంది?
11 ఒక పెద్ద తన స్వకీయులను వస్తుపరంగానే కాకుండా ఆత్మీయంగా మరియు మానసికంగా ‘సంరక్షించాలి.’ జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “బయట నీ పని చక్క పెట్టుకో ముందు పొలంలో దాని సిద్ధపరచు తరువాత నీ కుటుంబాన్ని కూడా నిర్మించుకోవాలి.” (సామెతలు 24:27, NW) కాబట్టి ఒక అధ్యక్షుడు తన భార్యా పిల్లల వస్తుపరమైన, మానసికమైన మరియు వినోద సంబంధిత అవసరాలను తీర్చడమే కాక వారిని ఆత్మీయంగా కూడా పెంపొందింపజేయాలి. దీనికి సమయం అవసరం, అంటే అతడు ఆ సమయాన్ని సంఘ విషయాల కొరకు వెచ్చించలేడు. అయితే ఆ సమయమే కుటుంబ సంతోషం మరియు ఆత్మీయత అనే సుసంపన్నమైన ప్రతిఫలాలను తేగలదు. కాలక్రమేణ, పెద్ద యొక్క కుటుంబం ఆత్మీయంగా బలపడితే, అతడు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఏమంత సమయాన్ని వెచ్చించ వలసిన పని ఉండదు. సంఘ విషయాల గురించి శ్రద్ధ వహించడానికి ఇది అతనికి ఎక్కువ అవకాశాన్నిస్తుంది. మంచి భర్తగా మరియు మంచి తండ్రిగా అతని మాదిరి సంఘానికి ఆత్మీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది.—1 పేతురు 5:1-3.
12. పెద్దలుగా ఉన్న తండ్రులు కుటుంబానికి సంబంధించిన ఏ విషయంలో మంచి మాదిరినుంచాలి?
12 ఒక కుటుంబాన్ని బాగుగా ఏలడంలో కుటుంబ పఠనానికి అధ్యక్షత వహించేందుకు సమయాన్ని పట్టిక వేసుకోవడం ఇమిడి ఉంటుంది. ఈ విషయంలో పెద్దలు మంచి మాదిరిని ఉంచడం ప్రాముఖ్యంగా ఆవశ్యకం, ఎందుకంటే పటిష్ఠమైన కుటుంబాలతో పటిష్ఠమైన సంఘాలు ఏర్పడతాయి. ఒక అధ్యక్షుడు, తన భార్యా పిల్లలతో పఠనం చేసేందుకు తనకు సమయం లేనంతగా ఎప్పుడూ ఇతర సేవాధిక్యతలతో నిండిపోకూడదు. ఒకవేళ అలా ఉంటే అతడు తన పట్టికను పునఃపరిశీలించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఆధిక్యతలను సహితం నిరాకరిస్తూ అతడు ఇతర విషయాల కొరకు వెచ్చించే సమయాన్ని మళ్లీ పట్టిక వేసుకోవలసి ఉంటుంది లేక తగ్గించవలసి ఉంటుంది.
సమతూకంగల పర్యవేక్షణ
13, 14. కుటుంబీకులైవున్న పెద్దలకు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఏ ఉపదేశాన్నిచ్చాడు?
13 కుటుంబ మరియు సంఘ బాధ్యతలను సమతూకం చేయడాన్ని గూర్చిన ఉపదేశం క్రొత్తదేమి కాదు. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ సంవత్సరాలుగా పెద్దలకు ఈ విషయాల్లో ఉపదేశం ఇస్తున్నాడు. (మత్తయి 24:45) 37 సంవత్సరాల కంటే పూర్వం, సెప్టెంబరు 15, 1959 కావలికోట (ఆంగ్లం) 553 మరియు 554 పేజీలందు ఇలా ఉపదేశించింది: “మన సమయాన్ని కోరే విషయాలన్నిటిని సమతూకం చేయడం నిజంగా ప్రాముఖ్యమైన విషయం కాదా? ఇలా సమతూకం చేయడంలో మీ స్వంత కుటుంబ అవసరతలకు సరైన ప్రాముఖ్యతనివ్వాలి. ఒక వ్యక్తి తన సమయాన్నంతా సంఘ కార్యకలాపాల కొరకు, తన సహోదరులు మరియు పొరుగువారు రక్షణ పొందేందుకు సహాయం చేయడం కొరకు వెచ్చించాలని, తన స్వంత కుటుంబ రక్షణను చూడకుండా ఉండాలని యెహోవా దేవుడు ఎంత మాత్రం అపేక్షించడం లేదు. ఒక వ్యక్తికి అతని భార్యా పిల్లలే ప్రాథమిక బాధ్యత.”
14 కావలికోట (ఆంగ్లం) నవంబరు 1, 1986 సంచికలో 22వ పేజీనందు ఇలా ఉపదేశించింది: “కుటుంబంగా కలిసి ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనడం మిమ్మల్ని సన్నిహితం చేస్తుంది, అంతేగాక పిల్లల విశేషమైన అవసరతలకు మీ వ్యక్తిగత సమయాన్ని, మానసిక శక్తిని వెచ్చించడం అవసరం. కాబట్టి, మీరు ‘మీ స్వంత ఇంటి వారి’ గురించి ఆత్మీయంగా, మానసికంగా మరియు వస్తుదాయకంగా శ్రద్ధ వహిస్తూ, సంఘ బాధ్యతల కొరకు ఎంత సమయాన్ని ఉపయోగించుకుంటాననే దాన్ని తీర్మానించుకోవడానికి సమతూకం అవసరం. [ఒక క్రైస్తవుడు] ‘మొదట [తన] స్వంత యింటిలో దైవ భక్తిని కలిగి ఉండడాన్ని నేర్చుకోవాలి.’ (1 తిమోతి 5:4, 8)”
15. భార్యాపిల్లలున్న పెద్దకు వివేకం మరియు వివేచన ఎందుకు అవసరం?
15 ఒక లేఖనాధార సామెత ఇలా తెలియజేస్తుంది: “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును, వివేచనవలన అది స్థిరపరచబడును.” (సామెతలు 24:3) అవును, ఒక అధ్యక్షుడు తన దైవపరిపాలనా బాధ్యతలను నెరవేరుస్తూ అదే సమయంలో తన కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే అతనికి తప్పనిసరిగా వివేకం మరియు వివేచన అవసరం. లేఖనానుసారంగా, అతడు పర్యవేక్షించడానికి ఒకటి కంటే ఎక్కువ రంగాలు ఉంటాయి. అతని కుటుంబం, అతని సంఘ బాధ్యతలు ఇమిడి ఉంటాయి. వీటి మధ్య సమతూకాన్ని కలిగివుండడానికి అతనికి వివేచన అవసరం. (ఫిలిప్పీయులు 1:9, 10) తనకు ప్రాముఖ్యమైన వాటిని ఎంపిక చేసుకోవడానికి అతనికి వివేకం అవసరం. (సామెతలు 2:10, 11) తన సంఘ ఆధిక్యతల గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత తనకుందని అతడు ఎంతగా భావించినా, ఒక భర్తగా మరియు తండ్రిగా తనకు దేవుడిచ్చిన ప్రాథమిక బాధ్యత తన కుటుంబ సంరక్షణ, వారి రక్షణ అని అతడు గుర్తించాలి.
మంచి తండ్రులు అలాగే మంచి పెద్దలు
16. ఒక పెద్ద తండ్రి కూడా అయివుంటే అతనికి ఏ ప్రయోజనముంటుంది?
16 మంచి ప్రవర్తన గల పిల్లలున్న పెద్ద నిజంగా ఒక సంపద వంటివాడే. అతడు తన కుటుంబం గురించి మంచిగా శ్రద్ధ వహించడం నేర్చుకున్నాడంటే, అతడు సంఘంలోని ఇతర కుటుంబాలకు సహాయం చేసే స్థితిలో ఉంటాడు. అతడు వారి సమస్యలను బాగా అర్థం చేసుకుని, తన స్వంత అనుభవాన్ని ప్రతిబింబించే సలహాను ఇవ్వగలుగుతాడు. సంతోషకరంగా, ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది పెద్దలు భర్తలుగా, తండ్రులుగా, అధ్యక్షులుగా తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు.
17. (ఎ) తండ్రి మరియు పెద్ద అయ్యున్న వ్యక్తి దేన్ని ఎన్నడూ మరచిపోకూడదు? (బి) సంఘంలోని ఇతర సభ్యులు సహానుభూతిని ఎలా చూపించాలి?
17 ఒక కుటుంబీకుడు పెద్దయై ఉండాలంటే, అతడు తన భార్యా పిల్లల గురించి శ్రద్ధ వహిస్తూ సంఘంలోని ఇతరుల కొరకు సమయాన్ని అవధానాన్ని ఇవ్వగలిగేలా తన వ్యవహారాలను చక్కబెట్టుకొనగల పరిణతి చెందిన క్రైస్తవుడై ఉండాలి. తన కాపరి పని గృహంలోనే ప్రారంభమౌతుందని అతడు ఎన్నడూ మరచిపోకూడదు. భార్యాపిల్లలున్న పెద్దలకు తమ కుటుంబ మరియు సంఘ పనులను నిర్వర్తించవలసిన రెండింటి బాధ్యత ఉంటుందని తెలుసుకుని సంఘ సభ్యులు వారి సమయాన్ని అనుచితంగా కోరకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, మరునాడు ఉదయం పాఠశాలకు వెళ్లవలసిన పిల్లలున్న పెద్ద సాయంకాల కూటాల తర్వాత అన్ని సమయాల్లోనూ ఎక్కువసేపు ఉండలేక పోవచ్చు. సంఘంలోని ఇతర సభ్యులు దీన్ని అర్థం చేసుకుని, సహానుభూతి చూపించాలి.—ఫిలిప్పీయులు 4:5.
మన పెద్దలు మనకు ప్రియమైనవారై ఉండాలి
18, 19. (ఎ) మనం మొదటి కొరింథీయులు ఏడవ అధ్యాయాన్ని పరిశీలించడం ఏమి గుర్తించడానికి మనకు సహాయం చేసింది? (బి) అలాంటి క్రైస్తవ పురుషులను మనం ఎలా పరిగణించాలి?
18 పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయాన్ని మనం పరిశీలించడం, పౌలు ఉపదేశాన్ని అనుసరించి రాజ్యాసక్తుల కొరకు సేవ చేయడానికి తమ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్న అవివాహిత పురుషులు అనేకమంది ఉన్నారని మనం తెలుసుకునేందుకు సహాయం చేసింది. తమ భార్యల ఎడల తగినంత శ్రద్ధను కనబరుస్తూ తమ భార్యల నుండి మెచ్చుకొనదగినంత సహకారాన్ని పొందుతూ జిల్లాల్లోను సర్క్యూట్లలోను సంఘాల్లోను వాచ్ టవర్ బ్రాంచి కార్యాలయాల్లోను చక్కని అధ్యక్షులుగా సేవ చేస్తున్న, పిల్లలులేని వివాహిత సహోదరులు కూడా వేలాదిమంది ఉన్నారు. చివరిగా, తమ భార్యా పిల్లల గురించి ప్రేమపూర్వక శ్రద్ధ తీసుకోవడమేగాక యెహోవా ప్రజలకు చెందిన దాదాపు 80,000 సంఘాల్లో శ్రద్ధగల కాపరులుగా తమ సహోదరులకు సేవ చేయడానికి కూడా సమయాన్ని వెచ్చిస్తున్న అనేకమంది తండ్రులూ ఉన్నారు.—అపొస్తలుల కార్యములు 20:28.
19 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.” (1 తిమోతి 5:17) అవును, తమ గృహాల్లోను సంఘంలోను చక్కగా పాలన చేసే పెద్దలు మన ప్రేమను, గౌరవాన్ని పొందడానికి అర్హులు. నిజంగా మనం ‘అట్టివారిని ఘనపర్చాలి.’—ఫిలిప్పీయులు 2:29.
[అధస్సూచీలు]
a కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 1, 1978, 31-2 పేజీలు చూడండి.
b కావలికోట (ఆంగ్లం) డిశంబరు 1, 1960, 735-6 పేజీలు చూడండి.
పునఃపరిశీలనగా
◻ సా.శ. మొదటి శతాబ్దంలో అనేకమంది పెద్దలు కుటుంబీకులని మనకెలా తెలుసు?
◻ పిల్లలుగల వివాహిత పెద్దల నుండి ఏమి కోరబడుతుంది మరియు ఎందుకు?
◻ “విశ్వాసులైన పిల్లలు” ఉండడం అంటే దాని భావమేమిటి, కాని ఒక పెద్ద యొక్క పిల్లవాడు యెహోవా సేవ చేయడానికి ఎంపిక చేసుకోకపోతే అప్పుడు సంగతేమిటి?
◻ ఒక పెద్ద ఏ యే విధాలుగా ‘తన స్వంత ఇంటివారిని సంరక్షించాలి’?
[23వ పేజీలోని చిత్రం]
పటిష్ఠమైన కుటుంబాలతో పటిష్ఠమైన సంఘాలు ఏర్పడతాయి