మీకు మద్యపానీయాలను గూర్చి దైవిక దృక్కోణముందా?
దాదాపు 20 సంవత్సరాల క్రితం పురవస్తుశాస్త్రజ్ఞులు ఇరాన్‌లోని ఊర్మియా పట్టణానికి సమీపాన మట్టి ఇటుకల పాత కట్టడాన్ని కనుగొన్నారు. వారు అందులో పింగాణీ జాడిని కనుగొన్నారు. అది వేల సంవత్సరాల కాలం నాటిది, మానవుల తొలి నివాసస్థలాలు కొన్ని రూపొందిన కాలం నాటిది అన్నది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇటీవల ఆ జాడిని విశ్లేషించేందుకు క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది. వైన్ తయారు చేసే ప్రక్రియకు సంబంధించిన అతి పురాతన రసాయనిక రుజువును అందులో చూసి శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు.
పురాతన కాలం నుండి వైన్, బీర్, మరితర మద్యపానీయాలు ఉపయోగించబడేవని బైబిలు కూడా రుజువు చేస్తోంది. (ఆదికాండము 27:25; ప్రసంగి 9:7; నహూము 1:10) మిగతా ఆహార పదార్థాల విషయంలోలాగే, మద్యపానీయాలను సేవించాలా వద్దా అనే ఎంపికను వ్యక్తులుగా మనకే యెహోవా వదిలిపెట్టాడు. యేసు తరచూ భోజనంతోపాటు వైన్ త్రాగేవాడు. అయితే బాప్తిస్మమిచ్చే యోహాను మద్యపానీయాలను వర్జించి ఉండవచ్చు.—మత్తయి 11:18, 19.
అమితంగా త్రాగడాన్ని బైబిలు నిషేధిస్తుంది. త్రాగుబోతుతనమనేది దేవునికి వ్యతిరేకమైన పాపం. (1 కొరింథీయులు 6:9-11) దీనికి అనుగుణ్యంగా, పశ్చాత్తాపపడని త్రాగుబోతులైనవారు క్రైస్తవ సంఘంలో కొనసాగడానికి యెహోవాసాక్షులు అనుమతించరు. సంఘంలోనివారు మద్యపానీయాలను సేవించాలని కోరుకుంటే మితంగా సేవించాలి.—తీతు 2:2, 3.
దైవికం కాని దృక్కోణం
మద్యపానీయాలను గూర్చి నేడు అనేకులకు దైవిక దృక్కోణం లేదు. ఈ పురాతన ఉత్పత్తి యొక్క దుర్వినియోగాన్ని సాతాను వృద్ధిచేస్తున్నాడని గ్రహించడం చాలా సులభం. ఉదాహరణకు, కొన్ని దక్షిణ పసిఫిక్ దీవుల్లో ఇంట్లో తయారు చేసిన పులిసిన పానీయాన్ని ఎక్కవ మోతాదుల్లో సేవించడాని కోసం పురుషులు సమావేశమవ్వడం పరిపాటి. ఈ కార్యక్రమాలు అనేక గంటలు కొనసాగవచ్చు, ఇవి తరచూ జరుగుతూ ఉంటాయి—చాలా మంది పురుషులు ప్రతిరోజు ఇలా చేస్తారు. అది సంస్కృతిలో భాగమేనని కొందరు పరిగణిస్తారు. కొన్నిసార్లు, ఇంట్లో చేసిన స్థానిక పానీయాలతో పాటు లేదా వాటికి బదులుగా బీర్, సారాయి ఉపయోగించబడుతున్నాయి. తరచూ త్రాగి మత్తెక్కిపోవడం జరుగుతుంది.
పసిఫిక్‌లోని మరో దేశంలో, పురుషులు మితంగా మద్యాన్ని సేవించడం అనేది చాలా మట్టుకు వినని మాటే. సాధారణంగా వాళ్ళు త్రాగినప్పుడు మత్తులయ్యేందుకే త్రాగుతారు. క్రమంగా, జీతాలు వచ్చే రోజు పురుషులు కలుసుకుని ఒక్కో కార్టన్‌లో 24 సీసాల బీర్ చొప్పున అనేక కార్టన్లను కొంటారు. బీర్ అయిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు త్రాగడం ఆపుతారు. అలా, బహిరంగంగా మత్తులవ్వడం చాలా సాధారణం.
కల్లు, మరితర స్థానిక సారాయిలు వంటి పులియబెట్టిన పానీయాలు ఆఫ్రికా దేశాల్లో సాంప్రదాయకంగా ఉపయోగించబడుతున్నాయి. కొన్ని దేశాల్లోని సంప్రదాయం ప్రకారం, అతిథులను సత్కరించేటప్పుడు మద్యాన్ని తప్పక ఇవ్వాలన్నది నియమం. ఆచారం ప్రకారం, అతిథి సత్కారాలు చేసే ఆతిథేయుడు తన అతిథి సేవించగల దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. ఇంటికి వచ్చిన ఒక్కో వ్యక్తి ముందు 12 సీసాల బీర్‌ను పెట్టడమనేది ఒక ప్రాంతంలోని ఆచారం.
చాలా జపాన్ కంపెనీలు తమ ఉద్యోగస్థుల కొరకు బస్ ట్రిప్పులను ఏర్పాటు చేస్తాయి. పెద్ద మొత్తాల్లోని మద్యపానీయాలను తీసుకువెళ్ళడమూ, తప్పత్రాగడాన్ని చూసి చూడనట్లు వదిలేయడమూ జరుగుతుంది. కంపెనీలు ఏర్పాటుచేసే ఈ విహార యాత్రలు కొన్ని రెండు లేదా మూడు రోజులు కొనసాగుతాయి. ఏసియావీక్ అనే పత్రిక ప్రకారం, జపాన్‌లో “వరి పండించే రైతులు మొదలుకొని, ధనికులైన రాజకీయవేత్తల వరకూ వారి మగతనం అనేది ఎంత మేరకు వారు మద్యాన్ని సేవించగలరు అనే దానినిబట్టి నిర్ణయించబడేది.” ఇతర ఆసియా దేశాల్లోనూ ఇలాంటి పోకడలే గమనించడం జరిగింది. “ఒక్కో వ్యక్తి లెక్కన చూస్తే ఇప్పుడు దక్షిణ కొరియా దేశస్థులే లోకంలోని మరెక్కడి త్రాగుబోతులకన్నా ఎక్కువ సారాయిని త్రాగేస్తున్నారు” అని ఏసియావీక్ చెబుతుంది.
అమితంగా త్రాగడం అమెరికాలోని కాలెజ్ కాంపెస్లలో సర్వవ్యాప్త అభ్యాసంగా మారింది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం, “అమితంగా త్రాగే చాలా మంది తాము మద్యానికి దాసులైన త్రాగుబోతులని పరిగణించుకోరు.”a త్రాగడమనేది సాహసోపేతమైనదిగా, ఫ్యాషన్‌గా, తెలివైనవాళ్ళు చేసే పనిగా అనేక దేశాల్లోని ప్రచార సాధనాలు ప్రోత్సహిస్తున్నాయి గనుక ఇది మనలను ఆశ్చర్యపర్చనవసరం లేదు. తరచూ ఈ ప్రచారం ప్రత్యేకంగా యౌవనస్థులనుద్దేశించి చేసినదే.
బ్రిటన్‌లో 20 సంవత్సరాల వ్యవధిలో బీర్ త్రాగడం రెట్టింపైంది. ఘాటైన మద్యం తీసుకోవడం మూడింతలైంది. త్రాగేవారు చిన్నవయస్సులోనే త్రాగనారంభిస్తారు, ఇప్పుడు మునుపెన్నటికన్నా ఎక్కువ మంది స్త్రీలు త్రాగుతున్నారు. తూర్పు ఐరోపాలోను లాటిన్ అమెరికా దేశాల్లోను ఇలాంటి ధోరణులే కనిపించాయి. దానికి తగ్గట్లు, అమిత మద్యపాన పెరుగుదల, మద్యపాన సంబంధిత ట్రాఫిక్ విపత్తుల పెరుగుదల వల్ల ఆ ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మద్యపాన దుర్వినియోగం అధికమౌతుందన్నది స్పష్టం.
ఎంతైతే మరీ అమితమౌతుంది?
మద్యపానీయాలను గూర్చిన బైబిలు దృక్కోణం సమతుల్యమైనది. ఒకవైపు, వైన్ యెహోవా నుండి వచ్చిన కానుక అని, అది ‘నరుల హృదయమును సంతోషపెడుతుందని’ లేఖనాలు చెబుతున్నాయి. (కీర్తన 104:1, 15) మరొకవైపు, అమిత మద్యపానాన్ని ఖండించేందుకు ‘మత్తులవ్వడం’ “[అమిత] మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు [“త్రాగుడు పోటీలు,” NW],” “మిగుల మద్యపానాసక్తులు,” “మద్యపానాసక్తులు” వంటి పదాలను బైబిలు ఉపయోగిస్తుంది. (లూకా 21:34; 1 పేతురు 4:3; 1 తిమోతి 3:8; తీతు 2:3) అయితే ఎంతైతే, ‘మిగుల మద్యపానాసక్తి’ అవుతుంది? మద్యపానీయాలను గూర్చిన దైవిక దృక్కోణం ఏమిటో ఒక క్రైస్తవుడు ఎలా నిర్ణయించుకోగలడు?
మత్తెక్కితే గుర్తించడం అంత కష్టమేమీ కాదు. “ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో [“ద్రాక్షమద్యము,” NW] ప్రోద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము [“ద్రాక్షమద్యము,” NW] రుచిచూడ చేరువారికే గదా. . . . విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు” అనే మాటలతో దాని ఫలితాలను గూర్చి బైబిలులో చెప్పబడింది.—సామెతలు 23:29-33.
అమితమైన మద్యం తికమకను, భ్రాంతిని, అచేతనాన్ని, మేథస్సుకు శరీరానికి సంబంధించిన మరితర రుగ్మతలను కలిగిస్తుంది. మద్యం ప్రభావంలో ఒక వ్యక్తి తన ప్రవర్తనపై అదుపు తప్పి తనకు హాని కలిగించుకోవచ్చు లేదా ఇతరులకు హాని కలిగించవచ్చు. త్రాగుబోతులు హాస్యాస్పదమైన, అవమానకరమైన లేదా అనైతికమైన ప్రవర్తనకు పాల్పడుతారని పేరుగాంచారు.
మత్తులయ్యేంతగా, పైన పేర్కొనబడిన పర్యవసానాలు కలిగేంతగా త్రాగడమంటే కచ్చితంగా అది అమిత త్రాగుడే. అయినప్పటికీ, ఒక వ్యక్తి త్రాగుబోతుతనం యొక్క సాధారణ సూచనలన్నింటిని ప్రదర్శించకపోయినా కూడా త్రాగడంలో మితాన్ని కనబరచకపోవచ్చు. ఒకరు అమితంగా త్రాగారా అనే ప్రశ్న తరచూ వివాదాంశంగా ఉంటుంది. మితత్వానికి అమిత మద్యపానానికి తేడా ఏమిటి?
మీ ఆలోచనా సామర్థ్యాలను కాపాడుకోండి
బైబిలు రక్తం మరియు మద్యముల నిష్పత్తిని లేదా వేరే ఏదైనా కొలమానాన్ని తెలుపుతూ పరిమితులను పెట్టడం లేదు. మద్యం ప్రభావాన్ని భరించే శక్తి ఒక్కో వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ, బైబిలు సూత్రాలు క్రైస్తవులందరికీ వర్తిస్తాయి, మద్యపానాన్ని గూర్చిన దైవిక దృక్కోణాన్ని వృద్ధిచేసుకోవడానికి అవి మనకు సహాయపడగలవు.
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే” మొదటి ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (మత్తయి 22:37, 38) మద్యానికి నేరుగా మనస్సుపై ప్రభావముంటుంది, మరి అమితమద్యపానం అన్ని ఆజ్ఞల్లోను గొప్పదైన ఈ ఆజ్ఞకు మీరు విధేయత చూపకుండా చేస్తుంది. అది తప్పకుండా మంచి నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యానికి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికి, ఆత్మ నియంత్రణకు, మెదడు యొక్క ప్రాముఖ్యమైన మరితర ప్రక్రియలకు తీవ్రంగా ఆటంకం కలిగించగలదు. “లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము, . . . అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును” అని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి.—సామెతలు 3:21, 22.
“సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి అంగీకారమైన యాగంగా మీ శరీరాలను, మీ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవను సమర్పించుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను బతిమాలుకొనుచున్నాడు. (రోమీయులు 12:1, NW) ఒక క్రైస్తవుడు తన ‘తార్కికశక్తిని’ కోల్పోయేంత మేరకు త్రాగినట్లయితే అతడు ‘దేవునికి అనుకూలమైన’వానిగా ఉండగలడా? సాధారణంగా, మితం లేకుండా త్రాగే వ్యక్తి క్రమేణా మద్యాన్ని తట్టుకునే శక్తిని పొందుతాడు. తను ఎక్కువగా త్రాగినా, తనకు మత్తెక్కేదానికన్నా తక్కువే త్రాగుతున్నానని అనుకోవచ్చు. అయితే, అతడు మద్యంపై అనారోగ్యకరంగా ఆధారపడేవానిగా మారవచ్చు. అలాంటి వ్యక్తి తన శరీరాన్ని “పరిశుద్ధమును . . . సజీవ[మునైన] యాగముగా” సమర్పించుకోగలుగుతాడా?
“జ్ఞానమును వివేచనను” నిర్వీర్యం చేసే ఎంత మోతాదులోని మద్యమైనా క్రైస్తవునిగా మీకది అమితమే.
మద్యాన్ని గూర్చిన మీ దృక్కోణాన్ని ఏది రూపొందిస్తుంది?
త్రాగడాన్ని గూర్చిన తన దృక్పథం ప్రస్తుత పోకడలచేత లేదా పారంపర్యాలచేత ప్రభావితం చేయబడిందా అని ఒక క్రైస్తవుడు పరిశీలించుకోవాలి. మద్యపానీయాల విషయానికొస్తే, సంస్కృతి పోకడలు లేదా ప్రసార సాధనాల ప్రచారాల ఆధారంగా మీరు తీర్మానాలను తీసుకోవాలని కచ్చితంగా అనుకోరు. మీ సొంత దృక్పథాన్ని మదింపు చేసుకునేందుకు, ‘నా దృక్పథం సమాజంలో అంగీకరింపబడుతున్నదానిచేత ప్రభావితం చేయబడిందా? లేక నా త్రాగుడు బైబిలు సూత్రాలచేత నియంత్రించబడుతోందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
యెహోవాసాక్షులు సంస్కృతి వ్యతిరేకులు కానప్పటికీ, నేడు విస్తృతంగా అంగీకరించబడిన అనేక ఆచారాలను యెహోవా అసహ్యించుకుంటాడని వారు గ్రహిస్తారు. కొన్ని సమాజాలు గర్భస్రావాన్ని, రక్త మార్పిడులను, సలింగ లైంగికతను, బహు భార్య/భర్తృత్వాన్ని చూసి చూడనట్లు వదిలేస్తాయి. అయితే క్రైస్తవులు ఈ విషయాలను గూర్చిన దైవిక దృక్కోణానికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తారు. అవును, అలాంటి ఆచారాలు సంస్కృతిపరంగా అంగీకరించబడినవైనా కాకపోయినా వాటిని అసహ్యించుకునేందుకు దైవిక దృక్కోణం క్రైస్తవులను పురికొల్పుతుంది.—కీర్తన 97:10.
“అన్యజనుల ఇష్టము” అని బైబిలు చెబుతున్నదానిలో ‘అమిత మద్యపానము’ మరియు ‘త్రాగుడు పోటీలు’ కూడా ఇమిడివున్నాయి. ‘త్రాగుడు పోటీలు’ అనే పదం అధిక మోతాదులో మద్యాన్ని సేవించాలనే ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పార్టీలు అనే తలంపును తెలియజేస్తుంది. బైబిలు సమయాల్లో ఎక్కువ మద్యాన్ని తట్టుకోగల శక్తి తమకుందని భావించి గర్వించే కొందరు ఇతరులకన్నా అధికంగా త్రాగడానికి ప్రయత్నించేవారు లేదా ఎవరు ఎక్కువ త్రాగుతారు అని చూడడానికి ప్రయత్నించేవారని గోచరమౌతుంది. ‘అపరిమితమైన దుర్వ్యాపారం’ అని అపొస్తలుడైన పేతురు పిలిచిన ఆ రకమైన ప్రవర్తనలో మారుమనస్సు పొందిన క్రైస్తవులు ఇకెన్నడూ పాల్గొనరు.—1 పేతురు 4:3, 4.
తనకు మత్తు కలుగనంతమేరకు తను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత త్రాగినా నిజంగా ఫర్వాలేదనే దృక్పథాన్ని ఒక క్రైస్తవుడు కలిగివుండడం సహేతుకమౌతుందా? అది దైవిక దృక్కోణమేనా అని మనకై మనమే ప్రశ్నించుకోవచ్చు. “మీరు భోజనముచేసినను పానముచేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 10:31) కొంతమంది పురుషులు బహిరంగంగా అధిక మోతాదుల్లో మద్యాన్ని సేవించడానికి కలుసుకున్నప్పుడు వారెవరూ మత్తులవ్వకపోవచ్చు, కాని వారి ప్రవర్తన యెహోవాకు ఘనతను తెస్తుందా? “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని బైబిలు ఉద్బోధిస్తుంది.—రోమీయులు 12:2.
ఇతరులకు అభ్యంతరం కలగడాన్ని వారించండి
ఆసక్తికరంగా, అమిత మద్యపానాన్ని భరించే సంస్కృతులే అమితంగా త్రాగే ఒక వ్యక్తి తాను దైవజనుడని చెప్పుకున్నప్పుడు అమిత మద్యపానాన్ని అంగీకరించవు. దక్షిణ పసిఫిక్‌లోని ఒక చిన్న సమాజంలోని యెహోవాసాక్షి కాని ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు: “నేను మిమ్మల్ని ప్రశంసిస్తాను. మీరు సత్యాన్ని ప్రకటిస్తారు. కాని సమస్య ఏమిటంటే, మీ మగవాళ్ళు మరీ ఎక్కువగా మద్యపానం చేస్తారు.” ఆ వ్యక్తులు మత్తులు కాలేదని తెలియజేయబడింది. అయితే ఆ సమాజంలోని అనేకులకు ఆ వాస్తవం అంత స్పష్టంగా తెలియదు. త్రాగుడు కార్యక్రమాల్లో పాల్గొనే ఇతర అనేక పురుషుల్లాగే, సాక్షులు కూడా త్రాగి మైకంలో పడుతారనే నిర్ధారణకు చూసేవాళ్ళు సులభంగా రాగలరు. ఎక్కువ సమయం కొనసాగే త్రాగుడు కార్యక్రమాల్లో పాల్గొనే క్రైస్తవ పరిచారకుడు మంచి పేరును నిలుపుకుని నిరాటంకంగా మాట్లాడుతూ ప్రజా పరిచర్యను నెరవేర్చగలడా?—అపొస్తలుల కార్యములు 28:31.
కొన్నిసార్లు కొందరు సహోదర సహోదరీలు రాజ్య మందిరానికి వచ్చేటప్పుడు వారి శ్వాసలో మద్యం యొక్క ఘాటైన వాసన వస్తూ ఉంటుంది అని ఒక యూరోప్ దేశంలోని ఒక నివేదిక సూచిస్తుంది. ఇది మిగతావారి మనస్సాక్షికి అభ్యంతరం కలిగించింది. “మాంసము తినుట గాని, ద్రాక్షారసము [“ద్రాక్షమద్యము,” NW] త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియుగాని, మానివేయుట మంచిది” అని బైబిలు ఉద్బోధిస్తుంది. (రోమీయులు 14:21) మద్యపానీయాలను గూర్చిన దైవిక దృక్కోణం ఇతరుల మనస్సాక్షిని గూర్చి అప్రమత్తులై ఉండేందుకు పరిపక్వతగల క్రైస్తవున్ని ప్రేరేపిస్తుంది, కొన్ని సందర్భాల్లో మద్యాన్ని మానివేయడం అని కూడా దాని భావం.
క్రైస్తవులు భిన్నమైనవారన్నది స్పష్టం
విచారకరంగా, మద్యపానీయాలతో సహా యెహోవా మానవ జాతికిచ్చిన మంచి ఈవులను దుర్వినియోగం చేస్తూ లోకం ఆయనకు ఎంతో బాధ కలిగిస్తుంది. సమర్పించుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రబలివున్న దైవికం కాని దృక్కోణాలను విడనాడడానికి ప్రయత్నించాలి. అలా, “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” ప్రజలు ‘కనుగొన’ గలుగుతారు.—మలాకీ 3:18.
మద్యపానీయాల విషయానికొచ్చినప్పుడు, యెహోవాసాక్షులు ‘ఎవరో’ లోకస్థులు ‘ఎవరో’ స్పష్టంగా తెలియాలి. యథార్థ క్రైస్తవుల జీవితాల్లో మద్యపానీయాలను సేవించడం ముఖ్య విషయం కాదు. తాము ఎంత మటుకు మద్యాన్ని తట్టుకోగలరు అని వారు పరీక్షించుకుంటూ అపాయకరంగా మత్తులయ్యే స్థితికి రారు; లేదా పూర్ణ ప్రాణముతోను స్వచ్ఛమైన మనస్సుతోను దేవుని సేవించడంలో మాంద్యత కలిగించేందుకు, లేదా ఏదో ఒక రకంగా ఆటంకం కలిగించేందుకు మద్యపానీయాలను అనుమతించరు.
యెహోవాసాక్షులకు ఒక గుంపుకు చెందినవారిగా మద్యపానీయాలను గూర్చి దైవిక దృక్కోణముంది. మీ విషయమేమిటి? మనం “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలె”నన్న బైబిలు ఉపదేశాన్ని అనుసరిస్తూ యెహోవా ఆశీర్వాదాల కొరకు మనలో ప్రతి ఒక్కరం ఎదురు చూడగలం.—తీతు 2:12.
[అధస్సూచీలు]
a “అమితంగా త్రాగడమంటే పురుషులైతే ఒక దాని తరువాత ఒకటి వరుసగా ఐదో అంతకన్నా ఎక్కువ పెగ్గులు త్రాగడమని, స్త్రీలైతే ఒక దాని తరువాత ఒకటి వరుసగా నాలుగో అంతకన్నా ఎక్కువ పెగ్గులు త్రాగడమని నిర్వచించబడింది.”—ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీ ప్రియమైనవారు చెప్పేది ఆలకించండి
తాను అమితంగా త్రాగుతున్నాడన్న విషయం ఆలస్యంగా తెలిసేది ఆ త్రాగే వ్యక్తికే. బంధుమిత్రులు మరియు క్రైస్తవ పెద్దలు మితం లేని తమ ప్రియమైనవారికి సహాయాన్నందించడానికి వెనుకంజవేయకూడదు. మరొకవైపు, మీ మద్యపాన అలవాట్లపై మీ ప్రియమైనవారు ఏదేని ఇబ్బందిని తెలియజేస్తే వారికి మంచి కారణమే ఉండవచ్చు. వారు చెప్పేదానిని గురించి ఆలోచించండి.—సామెతలు 19:20; 27:6.