కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/15 పేజీలు 8-13
  • మీ జీవితం—దాని సంకల్పమేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితం—దాని సంకల్పమేమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంతర్దృష్టికి ఓ ప్రాముఖ్యమైన మూలం
  • ఈ జీవితచక్రాల పరిశీలనదృష్ట్యా జీవిత సంకల్పం
  • మంచిపేరును సంపాదించుకోవడానికి ఇదే సమయం
  • “మానవకోటికి ఇదియే విధి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • సొలొమోను జ్ఞానంగల రాజు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • ప్రసంగి 3:11—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/15 పేజీలు 8-13

మీ జీవితం—దాని సంకల్పమేమిటి?

“నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశముక్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని” తలంచితిని.—ప్రసంగి 2:3.

1, 2. ఒకరు తమ ఎడల తాము సహేతుకమైన ఆసక్తిని కల్గివుండడం ఎందుకు తప్పుకాదు?

మీకు మీపై శ్రద్ధవుంది. లేదంటారా? అలావుండడం సహజమే. కాబట్టే మనం అనుదినం తింటాం, అలసిపోయినప్పుడు నిద్రపోతాం అలాగే స్నేహితులతోనూ, మనం ప్రేమించేవారితోనూ ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు మనం ఆడతాం, ఈదుతాం లేక మనం ఆనందించే ఇతర విషయాల్ని చేస్తాం, ఇవి మనపై మనం సమతుల్యమైన శ్రద్ధను కల్గివున్నామని చూపిస్తూ ఉంటాయి.

2 అలాంటి వ్యక్తిగత శ్రద్ధ, దేవుడు సొలొమోనును ఈ క్రింది విధంగా వ్రాయడానికి ప్రేరేపించిన దానికి అనుగుణంగా ఉంది: “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” అనుభవం ఆధారంగా సొలొమోను ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు: “ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసికొంటిని. ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము?”—ప్రసంగి 2:24, 25.

3. ఏ క్లిష్టమైన ప్రశ్నల్ని, జవాబులు లభ్యంకాని ప్రశ్నలుగా అనేకమంది కనుగొన్నారు?

3 అయినా తినడం, త్రాగడం, నిద్రపోవడం, ఏదొక మంచిపనిని చేయడంకన్నా జీవితానికి ఇంకా ఎంతోవుందని మీరు ఎరుగుదురు. మనం భౌతిక బాధల్నీ నిరాశా నిస్పృహల్నీ చింతల్నీ కల్గివున్నాం. మన జీవితార్థాన్ని గురించి ఆలోచించలేనంత బిజీగా మనం ఉన్నట్టు కనబడుతుంది. మీ విషయంలోనూ ఇది వాస్తవమేనంటారా? ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ మునుపటి సంపాదకుడైన వర్మాన్ట్‌ రోయ్‌స్టర్‌ మానవుని విస్తారమైన జ్ఞాన నైపుణ్యాల్ని గురించి వ్రాసిన తర్వాత ఇలా వ్రాశాడు: “ఉత్కంఠభరితమైన విషయం ఒకటి ఇక్కడవుంది. మానవుని గురించీ, అతని సందిగ్ధావస్థలను గురించీ, ఈ విశ్వంలో అతని స్థానాన్ని గురించీ తర్జన భర్జనచేస్తే, జీవారంభాన్ని గూర్చి తప్ప మనకు పెద్దగా తెలియదు. మనం ఎవరం, మనం ఎందుకున్నాం, మనం ఎక్కడికి పోతున్నాం వంటి ప్రశ్నలు ఇంకా మనల్ని పట్టి పీడిస్తున్నాయి.”

4. మనం ఇమిడివున్న ప్రశ్నలకు జవాబుల్ని ఇవ్వగల్గేలా ఉండాలని మనలో ప్రతిఒక్కరం ఎందుకు కోరుకోవాలి?

4 మనం ఎవరం, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, మనం ఎక్కడికి పోతున్నాం వంటి ప్రశ్నలకు మీరెలా జవాబిస్తారు? గత జూలైలో రోస్టర్‌గారు మరణించారు. అప్పటికి ఆయన సంతృప్తికరమైన జవాబుల్ని పొందివుంటారని మీరు అనుకుంటున్నారా? మరింత సూటిగా చెప్పాలంటే, మీరు జవాబుల్ని పొందే మార్గమేదైనా ఉందా? సంతోషకరమైన, మరింత అర్థవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఇవి మీకెలా సహాయపడగలవు? మనం పరిశీలిద్దాం.

అంతర్దృష్టికి ఓ ప్రాముఖ్యమైన మూలం

5. జీవితార్థాన్ని గూర్చిన ప్రశ్నల విషయంలో మనం అంతర్దృష్టిని అన్వేషిస్తున్నప్పుడు మనం ఎందుకు దేవునివైపు చూడాలి?

5 జీవిత సంకల్పం కొరకు మనలో ప్రతిఒక్కరమూ మనకుగా మనమే అన్వేషిస్తున్నట్లైతే మనం సఫలులం కాకపోవచ్చు, ఇది అనేకమంది స్త్రీ పురుషుల విషయంలోనూ ఎంతో పాండిత్యాన్నీ అనుభవాన్నీ గడించిన వాళ్ల విషయంలోనూ నిజమైంది. కాని మనం ఒంటరిగా విడువబడలేదు. మన సృష్టికర్త సహాయాన్ని దయచేశాడు. మీరు దీనిని గురించి ఆలోచించినప్పుడు, “యుగయుగముల” నుండి ఉన్నవానిగా, విశ్వాన్ని గూర్చీ చరిత్రను గూర్చీ సంపూర్ణమైన జ్ఞానాన్ని కల్గివున్నవానిగా ఆయనే జ్ఞానాంతర్దృష్టులకు పరమమూలం కాదా? (కీర్తన 90:1, 2) ఆయన మానవుల్ని సృజించాడు, మానవజాతి అనుభవించిన వాటినన్నిటినీ గమనించాడు గనుక మనం అంతర్దృష్టి కోసం ఆయనవైపు మాత్రమే చూడాలిగానీ పరిమితమైన జ్ఞానాన్ని, ఆలోచనల్ని కల్గివున్న అపరిపూర్ణ మానవులవైపుకాదు.—కీర్తన 14:1-3; రోమీయులు 3:10-12.

6. (ఎ) అవసరమైన అంతర్దృష్టిని సృష్టికర్త ఎలా దయచేశాడు? (బి) ఇందులో సొలొమోను ఏ విధంగా చేరివున్నాడు?

6 జీవితార్థాన్ని గూర్చి సృష్టికర్త చెవినిల్లు కట్టుకొని తెలియజేయాలని మనం అపేక్షించలేం, అయినా ఆయన అంతర్దృష్టికి ఒక మూలాన్ని అంటే తన ప్రేరేపిత వాక్యాన్ని దయచేశాడు. (కీర్తన 32:8; 111:10) ఈ విషయంలో ప్రసంగి పుస్తకం ప్రత్యేకంగా విలువైంది. దాని గ్రంథకర్తను దేవుడు ప్రేరేపించాడు ఎందుకంటే “సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటె . . . అధికమై యుండెను.” (1 రాజులు 3:6-12; 4:30-34) సందర్శనార్థమై వచ్చిన ఓ సామ్రాజ్ఞి ‘సొలొమోను జ్ఞానాన్ని’బట్టి ఎంతగానో ముగ్ధురాలై, ఉన్నదానిలో సగమైనా తనతో చెప్పబడలేదని ఆయన జ్ఞానవచనాల్ని వినువారు నిశ్చయంగా ధన్యులని ఆమె తెలియజేసింది.a (1 రాజులు 10:4-8) సొలొమోను ద్వారా మన సృష్టికర్త దయచేసిన దైవిక జ్ఞానాన్నుండి మనం అంతర్దృష్టినీ సంతోషాన్నీ పొందగలం.

7. (ఎ) ఆకాశం క్రింద జరిగే అనేక కార్యకలాపాల్ని గురించి సొలొమోను ఏ నిర్ధారణకు వచ్చాడు? (బి) సొలొమోను వాస్తవిక మూల్య నిర్ధారణల్ని ఏది తెలియజేస్తుంది?

7 ప్రసంగి పుస్తకం దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తోంది, అది సొలొమోను హృదయాన్నీ మనస్సునూ ప్రభావితం చేసింది. పరిశీలించడానికి కావల్సిన సమయాన్నీ, వనరుల్నీ, అంతర్దృష్టినీ కల్గినవానిగా ఆయన “ఆకాశముక్రింద జరుగునది అంతటిని” పరిశీలించాడు. వీటిలో అనేకం ‘వ్యర్థమనీ అవి యొకడు గాలికై ప్రయాసపడినట్లుగా’ ఉన్నాయనీ ఆయన గ్రహించాడు. ఇది జీవితంలో మన సంకల్పాన్ని గురించి ఆలోచించినప్పుడు మనమందరమూ గుర్తుంచుకోవాల్సిన ప్రేరేపిత మూల్య నిర్ధారణయైవుంది. (ప్రసంగి 1:13, 14, 16) సొలొమోను నిర్మొహమాటి, వాస్తవికవాది. ఉదాహరణకు, ప్రసంగి 1:15, 18లో ఉన్న ఆయన మాటల్ని మననం చేసుకోండి. శతాబ్దాల తరబడి మానవులు రకరకాల ప్రభుత్వాల్ని ప్రయత్నించారని మీకు తెలుసు. అవి సమస్యల్ని పరిష్కరించేందుకూ ప్రజల జీవనగతిని మెరుగుపర్చేందుకూ కొన్నిసార్లు యథార్థంగా కృషిచేశాయి. అయితే, ఈ అపరిపూర్ణ విధానంలో “వంకరగానున్న” వాటినన్నిటినీ ఏ ప్రభుత్వమైనా నిజంగా చక్కపర్చగలిగిందా? ఒకని జ్ఞానము పెరుగుతున్నకొద్దీ, అతడు తన అల్పాయుష్కాలంలో వాటిని పూర్తిగా చక్కపర్చడం అసాధ్యమని మరింత స్పష్టంగా గుర్తిస్తాడు. అలా గుర్తించడం అనేకమందికి నిరాశను కల్గించినా మనం నిరాశ చెందనక్కర్లేదు.

8. ఏ చక్రాలు దీర్ఘకాలం నుండీ ఉన్నాయి?

8 పరిశీలించాల్సిన మరో విషయమేంటంటే మనల్ని ప్రభావితంచేస్తున్న పునరావృత చక్రాలైన సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక గాలి నీటి కదలికలు వంటి వాటినే. అవి మోషే, సొలొమోను, నెపోలియన్‌ అలాగే మన ముత్తాతల కాలంనుండీ ఉన్నాయి. ఆ పునరావృత చక్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా, “తరము వెంబడి తరము గతించి పోవుచున్నది.” (ప్రసంగి 1:4-7) మానవ దృక్కోణంనుండి చూస్తే పెద్ద మార్పేమీలేదు. ప్రజలు ప్రాచీనకాలంలోని వారైనా, ఆధునిక కాలానికి చెందిన వారైనా సారూప్యమున్న కార్యకలాపాల్నీ, నిరీక్షణల్నీ, ఆశల్నీ అలాగే పురోభివృద్ధుల్నీ కల్గివున్నారు. మానవులలో ఒకడు, ప్రముఖమైన వ్యక్తిగా పేరు సంపాదించినప్పటికీ లేక అందాన్నిబట్టో సామర్థ్యాన్నిబట్టో విశిష్టమైనవానిగా పేరుగాంచినప్పటికీ అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? గతించిపోయాడు, బహుశా మరువబడి ఉంటాడు. అలాంటి అభిప్రాయం హానికరమైనదేమీ కాదు. అనేకమందికి తమ ముత్తాతల పేర్లు కూడా తెలియవు లేక వాళ్లెక్కడ పుట్టారో ఎక్కడ చనిపోయారో అనే విషయాన్ని కూడా వాళ్లు చెప్పలేరు. మానవ వ్యవహారాలూ, ప్రయత్నాలూ వ్యర్థమైనవని సొలొమోను ఎందుకు వాస్తవిక దృష్టితో చూశాడో మీరు గ్రహించవచ్చు.—ప్రసంగి 1:9-11.

9. మానవజాతి పరిస్థితి విషయంలో వాస్తవిక అంతర్దృష్టిని సంపాదించుకోవడం ద్వారా మనమెలా సహాయాన్ని పొందవచ్చు?

9 మనల్ని నిరాశకు గురిచేయడానికి బదులు, మానవజాతి ప్రాథమిక పరిస్థితిని గూర్చిన ఈ దైవిక అంతర్దృష్టి, అనుకూలమైన ప్రభావాన్ని చూపించగలదు. అది త్వరలోనే గతించిపోయి మరువబడే గమ్యాలకో లక్ష్యసాధనలకో అనవసరమైన విలువల్ని ఇవ్వకుండా మనల్ని ప్రేరేపిస్తుంది. జీవితాన్నుండి మనం పొందుతున్న దానిని గురించీ, మనం సాధించేందుకు ప్రయత్నిస్తున్న దానిని గురించీ మూల్య నిర్ధారణ చేసుకునేందుకు మనకీ దైవిక అంతర్దృష్టి సహాయపడాలి. ఉదాహరణకు, సన్యాసులుగా ఉండడంద్వారా గాక, మనం సమతూకమైన రీతిలో తిని, త్రాగడంవల్ల ఆనందాన్ని పొందవచ్చు. (ప్రసంగి 2:24) మనం పరిశీలించబోతున్నట్లుగానే సొలొమోను ఎంతో అనుకూలమైన, ఆశావాదపూరితమైన నిర్ధారణకు చేరుకుంటున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే, నిరంతర సంతోషాన్నీ, సంకల్పవంతమైన భవిష్యత్తునూ కల్గివుండేందుకు మనకు సహాయపడగలిగే మన సృష్టికర్తతోగల మన సంబంధాన్ని మనం ఎంతో గాఢంగా ప్రశంసించడమే ఆ నిర్ధారణయైవుంది. సొలొమోను ఇలా నొక్కి చెప్పాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; [సత్య] దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.

ఈ జీవితచక్రాల పరిశీలనదృష్ట్యా జీవిత సంకల్పం

10. సొలొమోను జంతువుల్నీ మానవుల్నీ ఏ విధంగా పోల్చాడు?

10 ప్రసంగి పుస్తకంలో ప్రతిబింబించబడిన ఈ దైవిక జ్ఞానం జీవితంలో మన సంకల్పాన్ని పరిశీలించడంలో మనకు మరింతగా సహాయపడగలదు. అదెలా? మనం అంతగా ఆలోచించని ఇతర సత్యాల్ని గూర్చి సొలొమోను వాస్తవికంగా ఆ పుస్తకంలో పరిశీలించాడు. అందులో ఒకటి, మానవులకు జంతువులకు మధ్యవున్న సారూప్యాలతో వ్యవహరిస్తోంది. ప్రజలు, జంతువులతో పోల్చబడడానికి సాధారణంగా ఇష్టపడకపోయినా యేసు తన అనుచరుల్ని గొఱ్ఱెలకు పోల్చాడు. (యోహాను 10:11-16) అయినా సొలొమోను తిరస్కరించలేని కొన్ని వాస్తవాల్ని వెలుగులోనికి తెచ్చాడు: “తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, [సత్య] దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించునది యేదో అదే, మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; . . . మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. . . . సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.”—ప్రసంగి 3:18-20.

11. (ఎ) విలక్షణమైన జంతు జీవిత చక్రాన్ని ఏ విధంగా వర్ణించవచ్చు? (బి) అలాంటి విశ్లేషణను గురించి మీరెలా భావిస్తారు?

11 మీరు చూసి ఆనందించే ఓ జంతువును గురించి, బహుశా ఓ కోతిని గురించో లేక ఓ కుందేలును గురించో ఆలోచించండి. (ద్వితీయోపదేశకాండము 14:7; సామెతలు 30:26) లేదా మీరు ఒక ఉడతను ఊహించుకోవచ్చు; ఇవి ప్రపంచవ్యాప్తంగా 300 రకాలకుపైగానే ఉన్నాయి. వాటి జీవితచక్రం ఏమైవుంది? అది జన్మించిన తర్వాత, కొన్నివారాలు దానితల్లి దానికి పాలిస్తుంది. త్వరలోనే దానికి ఒంటిమీద బొచ్చు పెరిగి, గూటి బయటికి వెళ్లగల్గుతుంది. ఆహారాన్ని సంపాదించ నేర్చుకొనడంలో అది హడావిడిగా పరుగుపెట్టడం మీరు చూసే ఉంటారు. కాని అది తరచూ తన యౌవనదశలో ఆడుకుంటూ ఆనందిస్తూన్నట్టుగానే కనబడుతుంది. ఒక సంవత్సరం లేక అంతకన్నా ఎక్కువ వయస్సు వచ్చిన తర్వాత, అది ఒకజతను కనుగొంటుంది. తర్వాత అది తన పిల్లల్ని సంరక్షించుకోవడానికి ఓ గూటిని లేక నివాసయోగ్యమైన స్థలాన్ని నిర్మిస్తుంది. ఆ ఉడత సరిపడినన్ని బెర్రీపళ్లను, కాయలను, విత్తనాలను కనుగొంటే అవి బలపడవచ్చు, తమ గూటిని పెద్దది చేసుకోవాల్సి వస్తుంది. కాని కేవలం కొన్ని సంవత్సరాల్లోనే, అది ముసలిదైపోయి ప్రమాదాలకూ రోగాలకూ గురవ్వగలదు. దాదాపు పదేళ్ల వయస్సు వచ్చేటప్పటికి అది మరణిస్తుంది. వివిధరకాల ఉడతల మధ్య ఎంతో కొంత తేడావున్నా అదే వాటి జీవితచక్రం.

12. (ఎ) వాస్తవికంగా చెప్పాలంటే అనేకమంది మానవుల జీవితచక్రం సగటు జంతు జీవితచక్రాన్ని ఎందుకు పోలివుంది? (బి) మన మనస్సులోవున్న జంతువును మనమీసారి చూసినప్పుడు, దాన్ని గూర్చి మనం ఏమని ఆలోచించవచ్చు?

12 ఒక జంతువు ఆ జీవితచక్రాన్ని కల్గివుండడాన్ని అనేకమంది ప్రజలు కాదనలేకపోవచ్చు, జీవితంలో ఓ సహేతుకమైన సంకల్పాన్ని ఉడత కల్గివుండాలని వాళ్లు అనుకోకపోవచ్చు. అయితే, అనేకమంది మానవుల జీవితం దానికి పెద్ద భిన్నంగాలేదు. ఉందంటారా? వాళ్లు జన్మించి, పసివాళ్లగా సంరక్షించబడతారు. పిల్లలుగా వాళ్లు తింటారు, పెరుగుతారు, ఆడతారు. వాళ్లు త్వరలోనే యుక్తవయస్కులై తమ జతను కనుగొని, జీవించడానికి ఓ స్థలాన్నీ, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఓ ఆధారాన్నీ అన్వేషిస్తారు. వాళ్లు సఫలులైతే, బాగా బలపడి, తమ పిల్లల్ని పెంచేందుకు గృహాన్ని (గూటిని) విశాలపర్చుకోవచ్చు. కాని దశాబ్దాలు తొందరగా గతించిపోయి, వాళ్లు వృద్ధులౌతారు. ఒకవేళ ముందే గనుక మరణించకపోతే, ‘ఆయాసంతోను, దుఃఖంతోను’ నిండిన 70 లేక 80 ఏళ్ల తర్వాత వారు మరణించవచ్చు. (కీర్తన 90:9, 10, 12) ఈ సారి మీరు ఉడతను (లేక మీ మనస్సులోవున్న ఏ ఇతర జంతువునో) చూసినప్పుడు ఈ వాస్తవాల్ని గురించి మీరు ఆలోచించవచ్చు.

13. జంతువుల విషయంలోనూ మానవుల విషయంలోనూ ఏ ప్రతిఫలం నిజమైనదని రుజువౌతోంది?

13 సొలొమోను మానవ జీవితాల్ని జంతువులకు ఎందుకు పోల్చాడో మీరు గ్రహించవచ్చు. ఆయన ఇలా వ్రాశాడు: “ప్రతిదానికి సమయము కలదు. . . . పుట్టుటకు చచ్చుటకు . . . సమయము కలదు.” “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును” గనుక చిట్టచివరకు వారికి వాటికి సంభవించే మరణం ఒక్కటే. ఆయన ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు: “సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.”—ప్రసంగి 3:1, 2, 19, 20.

14. సాధారణ జీవితచక్రాన్ని మార్చడానికి కొందరు మానవులు ఏ విధంగా ప్రయత్నిస్తారు, కాని ఏ ప్రభావంతో?

14 ఈ వాస్తవిక మూల్య నిర్ధారణను, మనం ప్రతికూలమైన నిర్ధారణగా పరిగణించకూడదు. నిజమే, తమ తల్లిదండ్రుల కన్నా మరింత వస్తుసంపదను కల్గివుండేందుకు విపరీతంగా కష్టపడి పనిచేయడం వంటివాటిని చేయడంద్వారా తమ పరిస్థితిని మార్చుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. తమ జీవితావగాహనను విస్తృతపర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఉన్నత జీవన ప్రమాణాన్ని అనుగ్రహించే విద్యను అభ్యసించడానికి వాళ్లు అనేక సంవత్సరాలు వెచ్చించవచ్చు. లేక మంచి ఆరోగ్యాన్ని పొందడానికి, కొంత కాలం ఎక్కువ జీవించడానికి వాళ్లు వ్యాయామము లేక ఆహార నియమాలపై కేంద్రీకరించవచ్చు. మరి ఈ ప్రయత్నాలు కొన్ని ప్రయోజనాల్ని తేవచ్చు. కాని అలాంటి ప్రయత్నాలు సఫలంకాగలవని నిశ్చింతగా ఎవరు ఉండగలరు? అవి సఫలమైనవని రుజువైనా, ఎంతకాలం నిలుస్తాయి?

15. అనేకమంది ప్రజల జీవితాల్ని గూర్చిన నిర్మొహమాటపూరితమైన ఏ మూల్య నిర్ధారణ విలువైంది?

15 సొలొమోను ఇలా అడిగాడు: “పలుకబడిన మాటలలో [“ఉనికియందున్న అనేకమైన వాటిలో,” NW] నిరర్థకమైన మాటలు చాల ఉండును [“నిరర్థకమైనవి అనేకం ఉన్నాయి.” NW]; వాటివలన నరులకేమి లాభము? నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదో యెవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?” (ప్రసంగి 6:11, 12) మరణం ఓ వ్యక్తి ప్రయత్నాల్ని ఆకస్మికంగా అంతమొందిస్తుంది గనుక మరింత వస్తు సంపదను సమకూర్చుకోవడానికి కష్టపడ్డంలోనూ లేక ప్రధానంగా మరిన్ని ఆస్తుల్ని సంపాదించాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలు విద్య కోసం వెచ్చించడంలోనూ నిజంగా ప్రయోజనమేమైనా ఉందా? జీవితం ఎంతో పరిమితమైనది, గతించిపోయే నీడలాంటిది గనుక అనేకులు తమ వైఫల్యాన్ని గ్రహించినప్పుడు మరో మానవ గమ్యంవైపు తమ ప్రయత్నాల్ని మళ్లించేందుకు సమయం లేదని గుర్తిస్తారు; లేక ‘తన తర్వాత’ తన పిల్లలకు జరుగబోవు దానిని గురించి నిశ్చయతను కల్గివుండలేడు.

మంచిపేరును సంపాదించుకోవడానికి ఇదే సమయం

16. (ఎ) జంతువులు చేయలేని దేనిని మనం చెయ్యాలి? (బి) మన ఆలోచనా సరళిపై ఏ ఇతర సత్యం, ప్రభావాన్ని చూపించాలి?

16 జంతువులవలెగాక, మానవులమైన మనం, ‘నా ఉనికిని గూర్చిన భావమేమిటి?’ ఇది పుట్టుటకు చచ్చుటకు సమయాన్ని కల్గివున్న ఓ స్థిరమైన చక్రమా? అని తలంచే సామర్థ్యాన్ని కల్గివున్నాం. దీనికి సంబంధించి, మానవులను గూర్చీ, జంతువులను గూర్చీ సొలొమోను చెప్పిన ఈ మాటల్లోని సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి: “సమస్తము మంటికే తిరిగిపోవును.” మరణం ఒకని ఉనికిని పూర్తిగా అంతమొందిస్తుందని దీని భావమా? శరీరమునుండి తప్పించబడిన అమర్త్యమైన ప్రాణమును మానవులు కల్గిలేరని బైబిలు చూపిస్తోంది. మానవులు ప్రాణములైవున్నారు, పాపంచేయు ప్రాణము మరణిస్తుంది. (యెహెజ్కేలు 18:4, 20, NW) సొలొమోను ఇలా విపులీకరించాడు: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు (“షియోల్‌,” NW) పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:5, 10.

17. ప్రసంగి 7:1, 2 వచనాలు మనం దేనిని ధ్యానించేందుకు కారణమవ్వాలి?

17 ఆ అనివార్యమైన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యానాన్ని పరిశీలించండి: “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.” (ప్రసంగి 7:1, 2) “మరణము అందరికిని వచ్చును” అని మనం ఒప్పుకోవాలి. ఏ మానవుడూ నిరంతర జీవితాన్నిచ్చే సర్వరోగ నివారణా ఔషధాన్ని దేన్నీ త్రాగలేకపోయాడు, ఏ విటమిన్ల సమ్మేళనాన్నీ తినలేకపోయాడు, ఏ ఆహార నియమాల్నీ పాటించలేకపోయాడు లేక ఏ వ్యాయామంలోనూ పాల్గొనలేకపోయాడు. వారి మరణానంతరం, సాధారణంగా వాళ్లు ఎంతోకాలం ‘గుర్తుండరు.’ కాబట్టి ఎందుకు ‘సుగంధతైలముకంటె మంచి పేరు, ఒకని జన్మ దినముకంటె మరణదినం’ మేలు?

18. సొలొమోను పునరుత్థానమందు నమ్మకముంచాడని మనమెందుకు నిశ్చయత కల్గివుండగలం?

18 పైన తెలియజేసినట్లుగానే, సొలొమోను వాస్తవికవాది. మన సృష్టికర్త దగ్గర నిశ్చయంగా ఓ మంచిపేరును సంపాదించుకున్న అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులైన తన పితరులను గురించి ఆయనకు తెలుసు. అబ్రాహామును బాగా ఎరిగినవానిగా యెహోవా దేవుడు ఆయనను ఆయన సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 18:18, 19; 22:17) అవును, అబ్రాహాము దేవుని దగ్గర ఓ మంచిపేరును కల్గివుండి, ఆయన స్నేహితుడయ్యాడు. (2 దినవృత్తాంతములు 20:7; యెషయా 41:8; యాకోబు 2:23) తన జీవితమూ, తన కుమారుని జీవితమూ ఎన్నటికీ అంతంకాని జనన మరణాల చక్రంలోని కేవలం ఒక భాగంకాదని అబ్రాహాముకు తెలుసు. కచ్చితంగా దాన్ని మించిన ఓ గొప్ప సంకల్పంవుంది. వాళ్లు అమర్త్యమైన ప్రాణమును కల్గివుండడంవల్ల కాదుగాని పునరుత్థానం చేయబడతారు గనుకనే మరలా జీవించే నిశ్చయమైన ఉత్తరాపేక్షను వాళ్లు కల్గివున్నారు. ‘మృతులలో నుండి కూడా [ఇస్సాకును] లేపుటకు దేవుడు శక్తిమంతుడని’ అబ్రాహాము ఒప్పించబడ్డాడు.—హెబ్రీయులు 11:17-19.

19. ప్రసంగి 7:1 వచన భావానికి సంబంధించి యోబునుండి మనమే అంతర్దృష్టిని పొందగలం?

19 ఏ విధంగా ‘సుగంధతైలముకంటె మంచి పేరు మేలైనదో; ఒకని జన్మ దినముకంటె మరణదినం మేలైనదో’ అర్థం చేసుకోవడానికి అదే కీలకం. మానవ జీవాన్ని సృష్టించినవాడు అతని జీవాన్ని పునరుద్ధరించగలడని తనకు పూర్వమున్న యోబు ఒప్పించబడినట్లుగానే సొలొమోను కూడా ఒప్పించబడ్డాడు. మరణించిన మానవుల్ని ఆయన తిరిగి జీవింపచేయగలడు. (యోబు 14:7-14) నమ్మకస్థుడైన యోబు ఇలా తెలియజేశాడు: “నీవు [యెహోవా] పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:15) ఆ విషయాన్ని గురించి ఆలోచించండి! ఎందుకంటే మరణించిన తన నమ్మకమైన సేవకుల ఎడల మన సృష్టికర్త ‘ఇష్టాన్ని’ (“నీ హస్తకృత్యాన్ని మరోసారి నీవు చూడాలని అనుకుంటున్నావు.”—ది జెరూషలేమ్‌ బైబిల్‌) కల్గివున్నాడు. యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనాన్ని అన్వయించడం ద్వారా సృష్టికర్త మానవుల్ని పునరుత్థానం చేయగలడు. (యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 24:15) మరణించే జంతువుల నుండి మానవులు భిన్నంగా ఉండగలరనే విషయం సుస్పష్టం.

20. (ఎ) ఎప్పుడు ఒకని జన్మదినంకంటె మరణదినం మేలైనదౌతుంది? (బి) లాజరు పునరుత్థానం అనేకులపై ఏ విధంగా ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు?

20 మరణించే నమ్మకమైన వారిని పునరుత్థానం చేయగల యెహోవా దగ్గర ఒకడు మంచిపేరును తాను మరణించే నాటికి సంపాదించుకుంటే అతని జన్మదినంకంటే మరణ దినం మేలని దీని భావం. సొలొమోనుకంటె గొప్పవాడైన యేసుక్రీస్తు దానిని రుజువు చేశాడు. ఉదాహరణకు, ఆయన విశ్వాసియైన లాజరును మరలా సజీవున్ని చేశాడు. (లూకా 11:31; యోహాను 11:1-44) మీరు ఊహించగల్గేలా, లాజరు తిరిగి సజీవుడవ్వడాన్ని చూసిన అనేకులు దేవుని కుమారునియందు విశ్వాసాన్ని ఉంచి, ఎంతగానో ప్రభావితులయ్యారు. (యోహాను 11:45) తామెవ్వరమో ఎక్కడికి పోతున్నామో అనే విషయంలో ఏ అభిప్రాయాన్నీ లేకుండా వాళ్లు జీవితంలో సంకల్పంలేని వారమని భావించారని మీరు అనుకుంటున్నారా? దానికి భిన్నంగా, వాళ్లు తాము జన్మించి కొంతకాలం జీవించి అటుతర్వాత చనిపోయే జంతువులవంటివారముకామని గ్రహించారు. యేసు తండ్రిని గూర్చి తెల్సుకోవడానికీ, ఆయన చిత్తాన్ని చేయడానికీ వారి జీవిత సంకల్పం సూటిగానూ సన్నిహితంగానూ ముడిపెట్టబడివుంది. మీ విషయమేంటి? మీ జీవితం ఎలా ఓ నిజమైన సంకల్పాన్ని కల్గివుండగలదో లేక కల్గివుండాలో మీరు చూడడానికీ లేక మరింత స్పష్టంగా గ్రహించడానికీ ఈ చర్చ సహాయపడిందా?

21. మన జీవితార్థాన్ని కనుగొనే ఏ లక్షణాన్ని మనమింకా పరిశీలించాల్సి ఉంది?

21 అయినప్పటికీ, జీవించడంలో యథార్థమైన అర్థవంతమైన సంకల్పాన్ని కల్గివుండడం అంటే మరణించడం అటుతర్వాత మరలా జీవించడం గురించి ఆలోచించడంకన్నా ఇంకా ఎంతో ఎక్కువే ఇమిడివుంది. ఇందులో రోజువారీ ప్రాతిపదికన మనం మన జీవితాలతో ఏమి చేస్తున్నామో చేరివుంది. దానిని ప్రసంగి పుస్తకంలో సొలొమోను కూడా స్పష్టపర్చాడు, మనం దీనిని గురించి దీని తర్వాత శీర్షికలో చూస్తాం.

[అధస్సూచీలు]

a “షేబదేశపు రాణిని గూర్చిన వివరణ, సొలొమోను జ్ఞానాన్ని గూర్చి నొక్కిఒక్కాణిస్తుంది. ఈ కథ తరచూ ఓ కట్టుకథగా పిలువబడుతోంది. (1 రాజు. 10:1-13) కాని ఆమె సొలొమోనును సందర్శించడం వాస్తవానికి వాణిజ్య వ్యవహారాలకు ముడిపెట్టబడిందని సందర్భం సూచిస్తోంది, మరి అది అవగాహితమైన విషయమే; దాని చారిత్రకతను సందేహించాల్సిన అవసరం లేదు.”—ది  ఇంటర్నేషనల్‌ స్టాండార్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా (1988), సంపుటి IV, పేజీ 567.

మీరు జ్ఞాపకానికి తెచ్చుకోగలరా?

◻ ఏయే రీతుల్లో మానవులకూ జంతువులకూ సారూప్యంవుంది?

◻ మానవ ప్రయత్నాల్లోనూ కార్యకలాపాల్లోనూ అనేకం వ్యర్థమని మరణం ఎందుకు నొక్కిచూపిస్తోంది?

◻ ఏ విధంగా మరణ దినం, జన్మదినానికన్నా మేలైనది కాగలదు?

◻ మన జీవితంలో అర్థవంతమైన సంకల్పాన్ని కల్గివుండడం, ఏ సంబంధంపై ఆధారపడి ఉంటుంది?

[10వ పేజీలోని చిత్రం]

జంతువుల జీవితం నుండి మీ జీవితం ఏ విధంగా భిన్నంగా ఉంది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి